1
మన వాడల చనుబాల నిండా
నీ పరిమళమే…
నరాలు పాడే గీతానికి
డప్పులో పొదిగిన కంఠానికి
నెర్రల నేల ఊపిరికి నీ రూపమే..
నిషిద్ధ చరిత పుటల మీద
నెత్తుటి అడుగులుగా నీవే…
పల్లవించిన మన పోరులో అంతఃసూత్రమయ్యీ నీవే…
2
“కరువు నేల కలగన్న”
జీవనదివి నీవే..
నడిగడ్డ గుండెన కలాష్నికోవ్
మొలకవి నీవే..
నల్లమల ప్రాణ చలన శీలతవి
నీవే…
నీ పేరే పోరు “సత్యం”
3
విశ్వాసాలు చీకటైనప్పుడు
తోవ శిశిరమై తెగినప్పుడు
నువ్వొస్తావు…
కాంతిలా కెరలుతూ…
పూసే వసంతమై గుబాళిస్తూ
నువ్వొస్తావు.
నీ పేరే అమరవీర “సత్యం”
(కర్రెం నర్సప్ప (సత్యం) స్మృతిలో)