ఒకటిగావాలో అరుణోదయాలు

పల్లవి :

ఉదయించె వెలుగులా సూర్యుడు ఒక్కడే
రవికాంతులందించె చంద్రుడు ఒక్కడే
కోట్లాది తారల ఆకాశమొక్కటే
సకల జీవులగన్న నేలతల్లొక్కటే
ఒకటి గావాలో అరుణోదయాలు
కలిసి సాగాలో జన విప్లవాలు
ఏకమవ్వాలో ఉద్యమ శక్తులు
చీకట్లు తరిమేసి ఉదయించె వెలుగులు

చరణం 1 :

శ్రమలో పుట్టిన పాట శ్రామికుల నోటా
ఉద్యమాలలో పుట్టి గళమెనెత్తెనంటా
ప్రకృతి ధర్మంగా ఒకటి రెండయినా
రేయి పగలు కలిసి దినము గాలేదా
ఒకటిగావాలో అరుణోదయాలు
కలిసి సాగాలో జన విప్లవాలు
ఏకమవ్వాలో ఉద్యమ శక్తులు
చీకట్లు తరిమేసి ఉదయించె వెలుగులు

॥ఒకటి గావాలో॥ ఉదయించే॥

చరణం 2 :

సుద్దాల యాదగిరి సుద్దులైన పాట
గరికపాటి నుండి వెల్లివిరిసిన పాట
పాణిగ్రాహి కలము జమకుయే గళమూ
రాలి పడిన వేల గొంతుల వేణువై
ఒకటి కావాలో అరుణోదయాలు
కలిసి సాగాలో జన విప్లవాలు
ఏకమవ్వాలో ఉద్యమ శక్తులు
చీకట్లు తరిమేసి ఉదయించె వెలుగులు

చరణం 3 :

కానూరి కవనంలో కదనమైన శక్తి
రామన్న నాగన్న రాగతాళము యుక్తి
కాశీపతి నూతన్ కలగన్న యుగము
సహదేవ్ గోపాల్ ల త్యాగాల తరమూ
ఒకటిగావాలో అరుణోదయాలు
కలిసి సాగాలో జన విప్లవాలు
ఏకమవ్వాలో ఉద్యమ శక్తులు
చీకట్లు తరిమేసి ఉదయించే వెలుగులు

॥ఒకటిగావాలో॥ ఉదయించే ॥

చరణం 4 :

సలిపిన గాయాల బాధ మిగిలుంది
ఒడిపిన రక్తాల ఒరవడియె ఉంది
కత్తులై రాజ్యము వేటాడుతుంటె
మత్తులానెదిరించి చిత్తుచేయలేమా
ఒకటిగావాలో అరుణోదయాలు
కలిసిసాగాలో జన విప్లవాలు
ఏకమవ్వాలో ఉద్యమ శక్తులూ
చీకట్లు తరిమేసి ఉదయించే సూర్యులు

చరణం 5 :

ప్రజాసంస్కృతి అంటు లక్ష్యమే ఉంది
జనతంత్ర విప్లవ బాట మనకుంది
చీలితే ప్రజలు ఓడుతారంటూ
పాటలెన్నో పాడి చీలికై ఉందామా
ఒకటి గావాలో అరుణోదయాలు
కలిసి సాగాలో జన విప్లవాలు
ఏకమవ్వాలో విప్లవ శక్తులు
చీకట్లు తరిమేసి ఉదయించే వెలుగులు

చీకట్లు తరిమేసి ఉదయించే వెలుగులు

14/7/2026

(చీలికనే మన బలహీనత అన్న అరుణోదయ నాగన్నకు, ఐక్యతను ఆకాంక్షిస్తున్న ఈ పాటను అంకితమిస్తూ… )

పుట్టింది కరీంనగర్ జిల్లా వేములవాడ. కవి, రచయిత, గాయకుడు. విప్లవోద్యమ నాయకుడు. అసలు పేరు కూర దేవేందర్. కలం పేరు మిత్ర. అమర్ పేరుతో సీపీఐ(ఎం.ఎల్.) జనశక్తి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. రచనలు : 1. మిత్ర తెలంగాణ పాటలు, 2. పొదుగు, 3. వరుపు, 4. మిత్ర జనం పాటల సవ్వడి (పాటలు); 5. చితాభస్మంలోంచి...(కవిత్వం); 6. తెలంగాణ డప్పు దరువు, 7. తెలంగాణ ధూం ధాం, 8. తెలంగాణ కోలాటం పాట, 9. ముంబై తెలంగాణం, 10. బహుజన బతుకమ్మ, 11. వీరతెలంగాణ (నృత్యరూప గానాలు).

Leave a Reply