ఆరిపోని ఆశయ జ్వాల భగత్ సింగ్

“ఇంక్విలాబ్‌ జిందాబాద్‌!” – ఈ నినాదాన్ని దేశ రక్త నాళాల్లోకి ప్రవహింపచేసిన వాడు భగత్ సింగ్. ఆయన బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల గుండెల్లో విస్పోటనయ్యాడు. దేశ భవిత కొరకు తన నవ యవ్వనాన్ని ఫణంగా పెట్టాడు.

షహీద్‌ భగత్ సింగ్ పూర్వీకులది పంజాబ్‌ రాష్ట్రంలోని ఖట్కర్ కలాన్‌ గ్రామం. 1990ల ప్రారంభంలో ఆయన తాత ఇప్పుడు పాకిస్తాన్‌లో భాగంగా ఉన్న లియాల్‌పుర్ జిల్లా బంగా గ్రామానికి వలస వెళ్లారు. అక్కడే భగత్ సింగ్ పుట్టారు. అతని తల్లిదండ్రులు విద్యావతి, కిషన్ సింగ్‌లు. వారిది స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం. 1907 సెప్టెంబర్‌ 28న ఆయన జన్మించాడు. అప్పటికి ఆయన తండ్రీ, బాబాయిలూ జైల్లోనే ఉండినారు. అటువంటి కుటుంబంలో పుట్టిన కారణంగా సహజంగానే భగత్ సింగ్‌పై చిన్నతనంలోనే స్వాతంత్ర్య పోరాట ప్రభావం పడింది. ఆ ప్రభావం వల్లనే అతడిలో పసితనంలోనే బ్రిటిష్‌ వ్యతిరేకత, స్వాతంత్ర్య కాంక్ష మొలకెత్తింది. మొలకెత్తడమే కాదు, చిన్నతనంలోనే తనలో స్వాతంత్ర్య భావన స్పష్టమైన పరిణితిని పొందిందనడానికి ఎన్నో ఉదాహరణలను చరిత్రకారులు చెప్తారు.

జలియన్‌వాలాబాగ్‌ మారణకాండ జరిగినప్పుడు భగత్‌ పన్నెండేళ్ల వయసులో ఉన్నాడు. ఆ మారణకాండ గురించి విని అతడు ఎవరికీ చెప్పకుండా జలియన్‌వాలాబాగ్‌ వెళ్లి నెత్తుటితో తడిసిన అక్కడి మట్టిని తీసుకువచ్చి ఒక పాత్రలో వుంచి పూజ చేశాడట. నా సోదరుల మరణానికి బ్రిటిష్‌ వారిపై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడట. భగత్ సింగ్ తమ్ముడి కూతురు వీరేంద్ర సంధు భగత్ సింగ్ జీవిత చరిత్రను రాసింది. ఆమె రాసిన దాన్ని బట్టి కూడా ఉత్తేజపూరితమైన భగత్ సింగ్ బాల్య చరిత్ర కొంత తెలుస్తుంది. సాధారణంగా బడిలో చదువుకునేప్పుడు పెద్దయ్యాక ఏం చేస్తావు అనే చర్చలు వస్తుంటాయి. పిల్లలు తమకు గొప్పగా అనిపించిన దాన్ని ఆదర్శంగా తీసుకొని పెద్దయ్యాక అదవుతాం, ఇదవుతాం అని చెప్తుంటారు. అలాగే భగత్ సింగ్ నాలుగో తరగతిలో ఉన్నప్పుడు ఇలాంటి చర్చ వచ్చినప్పుడు, ఒకరు ఉద్యోగం చేస్తామనీ, ఒకరు వ్యాపారం చేస్తామనీ, ఒకరు పెళ్లి చేసుకుంటామనీ చెప్తుంటే భగత్‌ మాత్రం ‘పెళ్లి చేస్కోవడం కూడా ఒక పనేనా! నేను చచ్చినా పెళ్లి చేసుకోను. బ్రిటిష్‌ వారిని ఈ దేశం నుంచి వెళ్లగొడతాను’ అనేవాడట.

ఆంగ్లేయులతో పోరాడుతున్నందుకు గాను భగత్ సింగ్ బాబాయిల్లో ఒకరు ప్రవాసంలో ఉండేవారు. ఆ సమయంలో భర్త కోసం ఏడుస్తున్న తన చిన్నమ్మను నాలుగేళ్ల భగత్‌ “బాధపడకు, బ్రిటిష్‌ వాళ్లను పారదోలి నేను బాబాయిని తీసుకువస్తాను” అని ఓదార్చేవాడట. అతను ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక రోజు అతని చెల్లి ఒక మత గ్రంథంలోని పేజీని తెచ్చి అతనికి ఇచ్చిందట. దాన్ని పూర్తిగా చదివి ‘తెల్లవాళ్లతో పాటు మతం కూడా మన దేశంలో పెద్ద గందరగోళం సృష్టించింది. అందువల్ల తెల్లవాళ్లతో పాటు మతాన్ని కూడా దుంపనాశనం చేయాలి” అని అంటూ ఆ కాగితాన్ని నేలకేసి కొట్టి దాన్ని కాళ్లతో చిదిమేశాడంట. ఇవన్నీ చదువుతుంటే అంత చిన్న వయసులోనే అతనిలోని అంత బలీయమైన స్వాతంత్ర్య కాంక్ష పలు విషయాల్లో స్పష్టత అబ్బురంగా తోస్తుంది.

ఇంత చిన్న వయసులోనే స్పష్టమైన రాజకీయ వైఖరిని కలిగివున్న భగత్ సింగ్ పదిహేనేళ్ల వయసులోనే చురుకైన ఆచరణకు దిగాడు. 1920లో ప్రారంభమైన సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 1922లో చౌరీచౌరా ఘటన జరిగిన తర్వాత ఆ దాడిని తప్పుపడుతూ గాంధీ సహాయ నిరాకరణ వుద్యమాన్ని అపేశాడు. గాంధీ చర్య సరైంది కాదని భగత్ సింగ్ భావించాడు. అయినప్పటికీ విదేశీ వస్తు బహివ్మరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. అందులో భాగంగా అప్పటి దాకా తాను చదువుతున్న బ్రిటిష్‌ ప్రభుత్వ నిధులతో నడిచే పాఠశాలను బహిష్కరించి నేషనల్‌ స్కూల్లో చేరాడు.

ఆ తర్వాత కొద్ది కాలానికే అతనికి గాంధీ సిద్ధాంతాల పట్ల విశ్వాసం పోయింది. గాంధీ మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం రాదని గుర్తించాడు. అప్పుడప్పుడే దేశంలో మొలకెత్తుతున్న విప్లవ భావాల వట్ల ఆకర్షితుడయ్యాడు. ఆ మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నాడు. దాంతో బడిని వదిలేసి స్వాతంత్ర్య సమరంలోకి దూకాడు. కాన్పూరుకు వెళ్లి విప్లవకారులతో సంబంధాలు పెట్టుకున్నాడు. వివిధ ప్రాంతాలు తిరిగాడు. పదిహేడేళ్ల వయసులో లాహోర్‌ కేంద్రంగా పని చేస్తుండిన ‘నవజవాన్‌ భారత్‌ సభ’ అనే విప్లవ సంస్థకు కార్యదర్శి అయ్యాడు. ఈ సంస్థకు చెందిన పలువురు నేతలు అప్పటికే ఉరి తీయబడడం వల్ల భగత్ సింగ్ ఈ స్థానాన్ని చేపట్టవల్సి వచ్చింది. భగత్ సింగ్ ఆచరణ, అతని కుటుంబ నేపథ్యం సంస్థకు అతని పట్ల విశ్వాసాన్ని కలుగజేసింది.

కార్యదర్శి అయిన తర్వాత, ఇప్పుడు భారత్, పాకిస్తాన్‌లలో భాగంగా ఉన్న పంజాబ్‌ ప్రాంతమంతటా అతను విప్లవ జ్వాలల్ని వ్యాపింపజేశాడు. అలా బ్రిటిష్‌ గుండెల్లో ప్రకంపనలు సృష్టించాడు. దాంతో భగత్ సింగ్‌ను అరెస్ట్‌ చేయాలని బ్రిటిష్‌ వాళ్లు కుట్ర పన్నారు. తప్పుడు కేసు మోపి అతన్ని అరెస్ట్‌ చేశారు. కొద్ది కాలం తర్వాత అతడు జామీనుపై విడుదలయ్యాడు.

జైలు గోడలు అతనిలోని విప్లవదీక్షను ఏమాత్రం సడలించలేక పోయాయి. జైలు నుంచి వచ్చిన తర్వాత తన కార్యకలాపాలను మరింత ఉధృతం చేశాడు. దేశవ్యాప్త సంస్థ అయిన ‘హిందుస్తాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌’లో చురుకైన పాత్రను పోషించాడు. ఈ క్రమంలో అతనికి చంద్రశేఖర్‌ ఆజాద్‌, సుఖ్‌దేవ్‌ రాజగురు, భగవతీ చరణ్‌ వంటి విప్లవకారులు సన్నిహిత సహచరులయ్యారు.

ఈ క్రమంలో ‘హిందుస్తాన్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌’ 1928లో ‘హిందుస్థాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌’గా మారింది. ఈ పేరును మార్చడంలో భగత్ సింగ్ కీలక పాత్ర వహించారు. దీనికి కారణం ఆనాటికే అతను మార్క్సిజం వైపు ఆకర్షితుడు కావడమే. ఆనాటి నుంచి సోషలిజం స్థాపన ఈ సంస్థ లక్ష్యంగా మారింది. అంటే బ్రిటిష్‌ వాళ్లను తరిమేయడం ఒక్కటే వారి లక్ష్యం కాదు. బ్రిటిష్‌ వాళ్లను తరిమేసిన తర్వాత దేశంలో సోషలిజాన్ని స్థాపించాలన్నది వారి లక్ష్యం.

దేశంలోని రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమీషన్‌ను నియమించింది. ఈ కమీషన్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ‘సైమన్ గో బ్యాక్’ అనే నినాదంతో ఆందోళన చెలరేగింది. అందులో భాగంగా 1928 అక్టోబర్‌లో కాంగ్రెస్ పార్టీలో అతివాదిగా పేరున్న లాలా లాజ్పతిరాయ్ ఆధ్వర్యంలో సైమన్‌ను రైల్వే స్టేషన్ నుంచి బయటకు రానీయకుండా అక్కడ పెద్ద ఆందోళన జరిగింది. ఆ ఆందోళనను అణచివేసే ఉద్దేశంతో స్కాట్ అనే పోలీసు అధికారి ఆదేశాలపై, సాండర్స్ అనే పోలీస్ అధికారి, లాలా లాజ్పతిరాయ్‌ను లాఠీతో విచక్షణారహితంగా కొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడి, ఆ తర్వాత చనిపోయాడు. ఈ ఘటన దేశాన్ని మరింత ఉడుకెత్తించింది. యావత్ భారత ప్రజానీకం భగ్గున మండింది.

ఈ హత్యకు ప్రతీకారంగా భగత్ సింగ్, రాజగురు, జయగోపాల్‌ల త్రయం 1928 డిసెంబర్ 17న సాండర్‌ను చంపేసింది. అతన్ని చంపిన తర్వాత వారొక ప్రకటన విడుదల చేశారు. అందులో ‘ఒక మనిషి రక్తం చిందించినందుకు మా విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇది విప్లవ వేదికపై ఒక బలి. దేశానికి ముక్తి, విముక్తి తీసుకురావాలంటే, ఒక మనిషి మరొక మనిషిని కొల్లగొట్టడం అసాధ్యం చేయాలంటే, ఈ బలి, ఈ వైయక్తిక బలిదానం తప్పవు. విప్లవం వర్ధిల్లాలి’ అని తమ దృక్పథాన్ని వెల్లడించారు.

ఆ తర్వాత ఈ విప్లవవీరులు నేషనల్ అసెంబ్లీ (ఈనాటి పార్లమెంటు వంటిది)లో బాంబులు వేయడం ద్వారా తమ రాజకీయాలను దేశమంతటా వ్యాపింప చేయాలనుకున్నారు. అదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం రెండు ప్రజావ్యతిరేక బిల్లులను తయారు చేసింది. వాటికి తూతూమంత్రంగా ఆమోద ముద్రను పొందడం కోసం 1929 ఏప్రిల్ 8న ఆ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశ పెట్టదల్చుకుంది. దేశమంతా వ్యతిరేకిస్తున్న ఈ బిల్లులను ప్రవేశపెట్టే సందర్భాన్ని అసెంబ్లీలో బాంబులు వేయడం కోసం ఎన్నుకున్నారు. ఈ చర్యలో భగత్ సింగ్ ప్రత్యక్షంగా పాల్గొనాలని నిర్ణయమైంది. పథకం ప్రకారం భగత్‌ సింగ్, బటుకేశ్వర్ దత్ ప్రేక్షకుల స్థానాల్లో కూర్చొన్నారు. ఆ రోజున బిల్లులు ప్రవేశపెట్టగానే సభలోని భారతీయ ప్రతినిధులు వాటిని తోసిపుచ్చారు. అయినప్పటికీ ఆ బిల్లులు చట్టాలయిపోయినట్టుగా వైస్రాయ్ ప్రకటించాడు. వెంటనే భగత్ సింగ్, దత్‌లు బాంబులు విసిరి ‘ఇంక్విలాబ్ జిందాబాద్’, ‘సామ్రాజ్యవాద్ ముర్దాబాద్’ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత వారు తమ వద్దనున్న కరపత్రాలను అసెంబ్లీ నిండా వెదజల్లారు. ఆ కరపత్రం చివర్లో ఇలా వుంది – “ఈ దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని మేము భావిస్తున్నాం. అందరికీ సమానంగా సంపూర్ణమైన శాంతి, స్వాతంత్ర్యాలు లభించాలని ఆకాంక్షిస్తున్నాం. వాటిని సాధించడానికి ఇంతటి హింసాత్మకమైన చర్యలకు పూసుకోవలసి రావడం మమ్మల్నెంతగానో బాధిస్తోంది. ఒక మనిషిని మరో మనిషి పీడించే స్థితికి చరమగీతం పాడాలంటే అది విప్లవం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎంతో కొంత రక్తం చిందకుండా దాన్ని సాధించడం సాధ్యం కాదు.”

బాంబులు వేసిన తర్వాత తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ వాళ్లు తప్పించుకోలేదు. ఎందుకంటే తాము బాంబులు ఎందుకు వేశారో తామే బహిరంగంగా ప్రకటించుకోవాలనుకున్నారు కనుక. అరెస్ట్ అయితే తమను ఉరి తీస్తారేమోనని వాళ్లు ఊహించారు. అయినప్పటికీ తమ రాజకీయాలను వ్యాపింపజేయడం కోసం వారు ప్రాణాలను పణంగా పెట్టదల్చుకునే అరెస్ట్ అయ్యారు.

బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వంగా; బ్రిటిష్ ‘న్యాయస్థానాలను’ న్యాయస్థానాలుగా భగత్ సింగ్ తదితరులు ఏనాడూ గుర్తించలేదు. అందుకని బాంబులు వేసిన కేసులో వారు ఎటువంటి ప్రతివాదనలూ దాఖలు చేయలేదు. అయితే కోర్టులో కొన్ని ప్రకటనలు చేయడం ద్వారా వారు విప్లవ రాజకీయాలను విశేషంగా ప్రచారం చేశారు. వారిని కోర్టుకు తీసుకువచ్చినపుడు ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని నినాదాలు చేసేవారు. ఇంక్విలాబ్ అనే పదానికి అర్థం ఏంటని జడ్జి అడిగితే, దానికి భగత్ సింగ్ తన సుదీర్ఘ వాంగ్మూలంలో “విప్లవం అంటే బాంబులూ, పిస్తోళ్ల సంస్కృతి కానే కాదు, అన్యాయం మీద ఆధారపడి వున్న వర్తమాన సామాజిక వ్యవస్థ మార్పు చెందాలన్నదే విప్లవం వల్ల మేం ఆశిస్తున్నది” అన్నాడు. అలాగే “స్వాతంత్య్రానికి అర్థం తెల్లవారి చేతుల్లోని అధికారం నల్లవాళ్ల చేతుల్లోకి మారడం కాదు. అప్పుడది అధికార మార్పిడి అవుతుంది. తిండిగింజల్ని పండించే రైతు ఆకలితో అలమటించనప్పుడు, చేనేత కార్మికుడికి ఒంటి నిండా బట్టలేని స్థితి లేకుండా పోయినపుడు, తాపీ మేస్త్రీ కొంపాగోడు లేకుండా ఉండే పరిస్థితి పోయినప్పుడు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు” అని చెప్పాడు. స్వాతంత్ర్యం గురించి భగత్ సింగ్‌కున్న మర్క్సిస్టు అవగాహన తెలుస్తుందీ ప్రకటన ద్వారా.

ఈ కేసులో భగత్‌ సింగ్, దత్‌లకు యావజ్జీవ శిక్ష కారాగార శిక్ష వేసి అండమాన్‌కు పంపాలని కోర్టు నిర్ణయించింది. కానీ ఆ తర్వాత, గతంలో జరిగిన కాకోరీ దోపిడీ కేసుతో సుఖ్‌దేవ్‌తో పాటు వీరికి సంబంధం ఉందని నేరారోపణ చేశారు. భగత్‌ సింగ్ ఆ ఆరోపణ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించకుండా, తన సహజ ధోరణిలో విప్లవ జ్వాలలను రేకెత్తిస్తూ మాట్లాడారు. దాంతో వారిని సుఖ్‌దేవ్‌తో పాటు జైల్లో పెట్టారు. బ్రిటిష్ ప్రభుత్వం నామమాత్రపు విచారణ తంతు చేపట్టి భగత్‌ సింగ్, సుఖ్‌దేవ్, రాజగురులకు ఉరిశిక్ష విధించింది.

జైల్లో ఉన్న సమయంలో భగత్‌ సింగ్ విస్తృతమైన అధ్యయనం చేశాడు. మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, గోర్కీ తదితరుల రచనలను అధ్యయనం చేశాడు. అంతేకాదు, రచనా వ్యాసంగాన్ని కూడా కొనసాగించాడు. ఉరిశిక్షకు కొద్ది కాలం ముందే అతడు ఇంగ్లిష్‌లో రాసిన ‘నేనెందుకు నిరీశ్వరవాదిని’ అనే వ్యాసాన్ని ‘పీపుల్’ వారపత్రిక ప్రచురించింది. ఇదొక ఉత్తేజకరమైన రచన. తన అనుభవాలు, తను చదివిన పుస్తకాల మీద అభిప్రాయాలను డైరీల్లో పొందుపరిచాడు. ఇవి కాక, ఆయన నాలుగు పుస్తకాలు రాశాడని, అవి లభించడం లేదని చరిత్రకారులు చెబుతున్నారు.

జైల్లో ఉంటూ కూడా పోరాటాలకు నాయకత్వం వహించాడు. ఖైదీలందరికీ కనీస వసతులు కల్పించాలనే డిమాండ్‌తో భగత్‌ సింగ్ తదితరులు 63 రోజులు నిరాహారదీక్ష చేశారు.

‘మేరా రంగ్‌దే బసంతీ చోలా’ అనే పాట భగత్ సింగ్‌కు ఎంతో ఇష్టమైన పాట. జైల్లో వున్నప్పుడు తను తరచూ ఈ పాట పాడుతుంటే జైలు వార్డర్లు కూడా ముగ్ధులై వినేవారు.

భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజగురులకు విధించిన ఉరిశిక్షను దేశమంతా గర్తించింది. ఉరిని రద్దు చేయాలని కోరుతూ బ్రిటిష్ ప్రభుత్వానికి పది లక్షల టెలిగ్రాంలు వెళ్లాయి. ఈ టెలిగ్రాంలు పంపిన వారిలో కొందరు బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు.

ఇక్కడ గాంధీ దుర్మార్గం గురించి తప్పక చెప్పుకోవాలి. భగత్ సింగ్ తదితరులను 1931 మార్చి 24న ఉరితీయాలని కోరు నిర్ణయించింది. దానికంటే కొద్ది రోజుల ముందు, ఒక ఒప్పందం విషయమై గాంధీకీ, బ్రిటిష్ వైస్రాయ్ ఇర్విన్‌కు మధ్య చర్చలు ప్రారంభమైనాయి. ఆ చర్చల్లో భగత్ సింగ్ ఉరిశిక్షను జైలు శిక్షగా మార్చమనే డిమాండ్ చేయాలనీ, లేకుంటే ఒప్పందంపై సంతకం చేయవద్దని దేశ ప్రజలతో పాటు, కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కూడా గాంధీపై ఒత్తిడి చేసారు. సుభాష్ చంద్రబోస్ కూడా ఈ విషయంపై గాంధీపై ఒత్తిడి తెచ్చాడు. కానీ ప్రజల మనోభావాలను గాంధీ లెక్కచేయలేదు. ఇటువంటి డిమాండ్ ఏమీ లేకుండానే గాంధీ మార్చి 5న ఇర్విన్‌తో ఒప్పందంపై సంతకం పెట్టాడు.

భగత్ తదితరుల విప్లవ పంథాను గాంధీ తీవ్రంగా వ్యతిరేకించాడు. అందుకే ఆయన వారి ఉరిశిక్షను వ్యతిరేకించలేదు. అయితే ఉరిశిక్ష ప్రభావం దేశంలో ఎంత తిరుగుబాటును రేకెత్తిస్తుందోనని భయపడ్డాడు. ఇర్విన్ తన జ్ఞాపకాలను ‘ఫుల్నెస్ ఆఫ్ డేస్’ అనే పుస్తకంగా రాశాడు. అందులో గాంధీతో జరిగిన చర్చలను ప్రస్తావిస్తూ “ఆ మనిషిని (భగత్ సింగ్‌ని) ఉరితీస్తే, జాతీయ అమరవీరుడు అవుతాడని, వాతావరణం మొత్తం దెబ్బతింటుందని గాంధీ అన్నాడు. నేను ఏదో ఒకటి చేయకపోతే కష్టమని, దాని ప్రభావం ఒప్పందంపై పడుతుందని గాంధీ భయపడ్డాడు” అని రాశాడు.

అంతేకాదు మార్చి ఆఖరులో కరాచీలో కాంగ్రెస్ మహాసభలు జరగాల్సి ఉండింది. ఆ సభల వరకూ ఉరిశిక్షను వాయిదా వేస్తానని ఇర్విన్ అన్నాడు. కానీ ఆ సభలకు ముందే ఉరిశిక్ష అమలు కావాలని గాంధీ కోరుకున్నాడు. ఎందుకంటే ఆ సభల్లో కూడా ఉరికి వ్యతిరేకంగా ఒత్తిడి రావచ్చని గాంధీ భయపడ్డాడు.

నిజానికి మొదటి నుంచీ సామ్రాజ్యవాదులకు తొత్తుగానే వ్యవహరించిన గాంధీ నుంచి ఇంతకంటే భిన్నంగా ఆశించలేం. దేశవ్యాప్తంగా ఎంత నిరసన వచ్చినప్పటికీ ఈ విప్లవవీరులను ఉరి తియ్యాలనే బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ఉరితీసిన తర్వాత జరగబోయే పరిణామాల గురించి భయపడింది. ఉరి తీసే రోజున జైలుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తారనీ, వారి మృత దేహాలను చివరిసారి చూడ్డానికీ, అంతిమ యాత్రలో పాల్గొనడానికి ప్రజలు వెల్లువెత్తుతారని, ఆ సమయంలో ప్రజల్లో ఉప్పొంగే ఆగ్రహావేశాలను అదుపు చేయలేమనీ ప్రభుత్వం భయపడింది. అందుకే ఒక రోజు ముందునే, అంటే 1931 మార్చి 23న, రాత్రికి రాత్రే భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజగురులను రహస్యంగా ఉరితీసింది. శవాలను సత్లుజ్ సదీ తీరాన రహస్యంగా కాలబెట్టడానికి ప్రయత్నించింది. అయితే అప్పటికి విషయం తెల్సిన ప్రజలు వెల్లువలా సత్లుజ్ నదీ తీరానికి చేరుకున్నారు. వారు తమ ప్రియతమ అమరుల చితిమంటను మాత్రమే చూడగలిగారు.

ఉరి తీసేనాటికి భగత్ సింగ్ 23 ఏళ్ల నవ యువకుడు. అతను పూర్తికాలపు కార్యాచరణ ప్రారంభించింది పదహారేళ్ల వయసులో. కేవలం ఏడేళ్ల కాలంలో, అదీ ఇంత చిన్న వయసులో దేశవ్యాప్తంగా విప్లవోత్తేజాన్ని రగిలించి చరిత్రను ఓ మలుపు తిప్పి, చరిత్రపై ఎన్నటికీ చెరిగిపోని ముద్ర వేశాడు భగత్ సింగ్. భారతదేశం అమితంగా గర్వించదగిన ఈ విప్లవ యువ తేజాలను ఆర్పివేసి దేశ భవిష్యత్తును చీకటిమయం చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం కలలు కన్నది. కానీ ఈ విప్లవకారులు రగిలించిన జ్వాలను అది ఆర్పలేకపోయింది. ఆ తర్వాత నిరంతరం రగులుతూ వచ్చిన ప్రజా పోరాటాల జ్వాలలకు తట్టుకోలేక బ్రిటిష్ వాళ్లు దేశాన్ని వదిలిపోయారు.

బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయారు. కానీ దేశానికి భగత్ సింగ్ కోరుకున్న స్వాతంత్య్రం రాలేదు. తాను అనుమానించినట్టుగా కేవలం అధికారమార్పిడి మాత్రమే జరిగింది. ఈ అధికారమార్పిడి వల్ల ప్రయోజనం పొందినదీ, పొందుతున్నదీ కేవలం దోపిడీవర్గాలే.

పేద ప్రజల బతుకులు రోజురోజుకూ దుర్భరంగా మారుతున్నాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ప్రత్యక్ష పాలన లేనప్పటికీ, నేడు పలు సామ్రాజ్యవాద దేశాల పట్టు మనం దేశంపై పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాద పట్టు పెరిగిపోతున్నది. మన దేశంలో ఇంకా నయావలస తరహా పరోక్ష పాలన, దోపిడీ, నియంత్రణలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భగత్ సింగ్ కలలుగన్న స్వాతంత్ర్య సాధన కోసం పోరాడాల్సిన కర్తవ్యం మిగిలే ఉంది.

ఇవాళ కొన్ని మతతత్వ సంస్థలు మేం భగత్ సింగ్ వారసులం అని చెప్పుకుంటున్నాయి. మతాన్ని, మతతత్వాన్ని భగత్‌ సింగ్ చిన్నప్పటి నుంచీ చివరి దాకా అసహ్యించుకున్నాడు. కానీ నేడు మతోన్మాద సంస్థలు మేం భగత్‌ సింగ్ తమ్ములం అని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇటువంటి వారు భగత్‌ సింగ్ జయంతులూ, వర్ధంతులూ జరుపుతూ, బూటకపు నివాళులు అర్పిస్తున్నారు. ప్రజల మనసుల్లో ముద్రించుకుపోయిన భగత్‌ సింగ్ ప్రభావాన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే కుట్రలే ఇవన్నీ.

కానీ భగత్ సింగ్ కలలుగన్న సోషలిజం స్థాపన కొరకు విప్లవం ఇప్పటికీ కొనసాగుతున్నది. భగత్ సింగ్ ఆదర్శాన్నీ, సాహసాన్నీ, ఉత్తేజాన్నీ స్వీకరించిన ఎందరో విప్లవకారులు భగత్ సింగ్ బాటలో దేశ విముక్తి కోసం తమ ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పిస్తున్నారు. భగత్ సింగ్ వారసత్వాన్ని సగర్వంగా కొనసాగిస్తున్నారు. ఇదే భగత్ సింగ్కు నిజమైన నివాళి.

(2012 మార్చ్ 23 – భగత్ సింగ్, సుఖదేవ్‌, రాజ్‌గురుల 81వ వర్ధంతి సందర్భంగా రేణుక రాసిన సంస్మరణ వ్యాసం. 2026 మార్చ్ 31న రేణుక తొలి వర్ధంతి.)

Leave a Reply