ప్రపంచీకరణను ఎదుర్కొనేది మార్క్సిజమే…

రాచ‌పాళెం చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి. ప్ర‌ముఖ‌ మార్క్సిస్టు సాహిత్య విమ‌ర్శ‌కుడు. శ్రీకృష్ణ‌దేవ‌రాయ యూనివ‌ర్సిటీలోనే కాకుండా తెలుగు నేల‌పై ఎంద‌రో సాహిత్య విద్యార్థుల‌కు మార్గ‌ద‌ర్శిగా నిలిచారు. మూడు ద‌శాబ్దాలుగా గ‌తితార్కిక భౌతిక వాద వెలుగులో ర‌చ‌న‌లు చేస్తున్నారు. శ్ర‌మ‌జీవుల చెమ‌ట చుక్క‌లతోనే స‌మ‌స్త ప్ర‌పంచ‌మూ మ‌నుగ‌డ సాగిస్తున్న‌ద‌ని న‌మ్మే రాచ‌పాళెం ఈ త‌రానికి మార్గ‌ద‌ర్శి. వరంగల్ సీకేఎం కాలేజీలో తెలుగు సాహిత్య సదస్సులో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా ‘కొలిమి’తో ఆయన సంభాష‌ణ‌.

కొలిమి : హ‌లో సర్, కొలిమి ప్రతినిధిగా, తెలుగు సాహిత్య విమర్శ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను.
రాచపాళెం : నమస్కారమండీ. మంచి పేరు పెట్టారు. కొలిమి బాగుంది. అభినందనలు.

కొలిమి : మీ విద్యాభ్యాసం గురించి వివరించండి.
రాచపాళెం : మా ఊరు తిరుపతికి ఆరు కిలోమీటర్ల దూరంలో దక్షిణంగా ఉన్న గుండ్రపాడు. మాది కింది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. అమ్మనాన్నలకు ఎనిమిది మంది పిల్లలం. నాన్న, అమ్మకు చదువులేదు. ఎనిమిది మందిలో నేను మాత్రమే చదువుకోగలిగాను. ప్రాథమిక విద్య మా వూరు పాఠశాలలోనే చదువుకున్నాను. మా ఊరికి ఆరు కిలోమీటర్ల దూరంలోని వెంకటాపురంలో ఆరో తరగతి చదువుకున్నాను. ఏడు నుంచి పది వరకు తిరుపతి మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను. పీయూసీ, బీఏ, ఎంఏ, పీహెచ్‌డీ తిరుపతిలోనే చదువుకున్నాను. ప‌రిశోధ‌న పూర్తికాగానే అనంతపురంలోనే అధ్యాపకుడిగా ఉద్యోగంలో చేరాను. ఇపుడు అన్నిరకాలుగా అనంతపురం పౌరుడుగానే భావిస్తాను.

కొలిమి : మీ పరిశోధన గురించి చెప్పండి?
రాచపాళెం : నేను పింగళి సూరన రచించిన ప్రభావతి ప్రద్యుమ్నంలోని కవిత్వ శిల్పం మీద పరిశోధన చేశాను. సిద్ధాంత గ్రంథం పేరు ‘శిల్ప ప్రభావతి’. నా పర్యవేక్షకుడు ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు. ఆయన నాకు ప్రాచీన కావ్యాలు లోతుగా అధ్యయనం చేయడమెలాగో నాకు నేర్పించారు. ఆ పద్దతిని నేను ఆధునిక సాహిత్యానికి అన్వయించుకుంటున్నాను.

కొలిమి : మీరు తెలుగు సాహిత్యంలోకి రావడానికి నేపథ్యం?
రాచపాళెం : నేను ప్రధానంగా సాహిత్య విమర్శకుడిని. కొంచెం కవిత్వం రాశాను. పూర్వం రాయలసీమ సాహిత్య విమర్శకు పుట్టినిల్లని అనుకునేవారు. అయితే నేడు అన్ని ప్రాంతాల నుంచి విమర్శకులు వస్తున్నారు. కట్టమంచి రామలింగారెడ్డి, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, ఆర్.ఎస్. సుదర్శనంలాంటి వాళ్లు. ఎమ్మే తెలుగు చదివే రోజుల్లోనే మా అధ్యాపకులు సదస్సులు నిర్వహించేవారు. వ్యాసం ఎలా రాయాలని నేర్పి, చదివించి జీఎన్ రెడ్డి చర్చించేవారు. మద్దూరి సుబ్బారెడ్డి గారు సాహిత్య విమర్శ బోధించేవారు. అనంతపురం వచ్చాక సర్దేశాయి తిరుమలరావుగారితో రోజు సాయంత్రం సంభాషించడంతో సాహిత్య విమర్శకుడిగా ఎదిగాను. విద్యార్థులుగా ఉన్నపుడే మాతోని పాఠాలు చెప్పించేవారు.

కొలిమి : మీ రచన వ్యాసంగం గురించి చెప్పండి?
రాచపాళెం : 1972 అక్టోబర్లో స్రవంతి మాసపత్రికలో ‘సినిమా కవిత్వంలో సాహిత్య విలువలు’ మొట్టమొదటి వ్యాసం రాశాను. శిల్ప ప్రభావతి ప్రచురించాను. తెలుగు విశ్వవిద్యాలయం వారు పుస్తక రచన పోటీలకు విషయసేకరణ చేసినా పంపలేదు. కానీ తర్వాత ‘తెలుగు కవిత్వంలో నన్నయ ఒరవడి’ ముద్రించాను. మరోసారి ప్రాచీన కవుల సాహిత్య అభిప్రాయాలు – అభిరుచులు అనే అంశంపై పోటీల్లో నాకు పురస్కారం లభించింది. ఆధునిక కవిత్వం మీద ‘ఆధునికాంధ్ర కవిత్వం ఉద్యమాలు, సందర్భాలు ప్రతిఫలనం, కొన్ని కావ్యాలు: కొందరు కవులు, 600 పేజీల వరకు ఆధునిక కవిత్వం మీద విమర్శ రాశాను. సినారె కవిత్వానుశీలనం, గోపి సాహిత్యానుశీలనం, గుర్రం జాషువా స్వప్నం-సందేశం, విశ్వనరుడు గుర్రం జాషువా, నవలలు, కథల మీద నా కృషి పరిమితంగా జరిగింది. కథాంశం, మన నవలులు, మన కథలు పుస్తకానికి 2014లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. రాచపాళెం పీఠికలు, రాచపాళెం ముందు మాటలు ప్రచురించాను. మరో రెండు సంపుటాలు రావాల్సి వుంది.

కొలిమి : విమర్శకునికి అన్ని సాహిత్య ప్రక్రియల మీద సమగ్ర అవగాహన అవసరమంటారా?
రాచపాళెం : తప్పకుండా అవగాహన ఉండాలి. నేను కవిత్వం మీద విమర్శ రాసేవాణ్ని కథ, నవల, నాటకంతో నాకేం పని అనుకోవద్దు. కానీ అన్ని ప్రక్రియల చరిత్ర విమర్శకుడికి తెలిసినపుడే సమగ్ర జ్ఞానంతో విమర్శ రాయగలవు.

కొలిమి : తెలుగు సాహిత్యం మీద మార్క్సిస్టు సాహిత్య విమర్శ ప్రభావం ఏ విధంగా ఉంది?
రాచపాళెం : ఇపుడు తెలుగు సాహిత్య విమర్శ అంటేనే మార్క్సిస్టు సాహిత్య విమర్శయింది. ప్రాచీన సాహిత్యం, ఆధునిక కవిత్వం, దేనీమీద రాసినా ఇప్పట్లో ప్రధానమైన సాహిత్య విమర్శ స్రవంతి, మార్క్సిస్టు సాహిత్య విమర్శ మాత్రమే. కొత్తగా వస్తున్న అంబేద్కరిస్టు, ఫెమినిస్టు దృక్పథాల్లో విమర్శ వస్తుంది. వీటి మధ్య ఉన్న వైరుధ్యమంతా మిత్ర వైరుధ్యమే. సంప్రదాయ దృక్పథంతో విమర్శ రాసి, ఇపుడు ఈ సమాజాన్ని సంప్రదాయవాదులు మెప్పించడం సాధ్యం కాదు.

కొలిమి : సంప్రదాయ విమర్శకు, మార్క్సిస్టు విమర్శకు ప్రధానమైన తేడాను ఎట్లా అర్ధం చేసుకోవాలి?
రాచపాళెం : సంప్రదాయ విమర్శ భారతీయ అలంకార శాస్త్రం ఆధారంగా నడుస్తుంది. లేదా భారతీయ అలంకార శాస్త్రాలకు సమానంగా ఉండే పాశ్చాత్య అలంకారికుల గ్రంథాల భూమికగా నడుస్తుంది. సంప్రదాయ సాహిత్య విమర్శలో ఎంతసేపు కావ్య స్వరూపం మీదనే విమర్శ వుంటుంది. కావ్య వస్తువు జోలికి వెళ్లదు. కావ్య వస్తువంటే కావ్యంలో ప్రతిబింబించే జీవితం. ఆ జీవితాన్ని విమర్శించాలంటే సామాజిక శాస్త్రాలు కావాలి. మార్క్సిస్టు తత్వశాస్త్రం కావాలి. అంబేద్కర్ తత్వశాస్త్రం కావాలి. కాబట్టి సంప్రదాయ విమర్శంటే రూప విమర్శవుతుంది, కానీ వస్తు విమర్శ కాదు. వస్తు విమర్శ చేయకుండా కేవలం రూప విమర్శతో ఏమీ ప్రయోజనం లేదు. సాహిత్యంలో ప్రతిబింబించే జీవితం చూడాలంటే మనకు చక్కటి ఆధారం మార్క్సిస్టు సౌందర్యశాస్త్రమే.

కొలిమి : సాహిత్య విమర్శలో మీకు మార్గదర్శకులు ఎవరు?
రాచపాళెం : మొదట కట్టమంచి రామలింగారెడ్డి కవిత్వ తత్వ విచారం చదివాను. మొదట చదివినపుడు ఆయనతో ఏకీభవించలేదు. నా శిల్ప ప్రభావతి గ్రంథంలో ఆయన్ను వ్యతిరేకించాను. అధ్యాపకుడినయ్యాక నాకు మార్క్సిజం పట్టుబడిన తర్వాత కట్టమంచి రామలింగారెడ్డి నాకు చాలా ఇష్టమయ్యారు. రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, రాచమల్లు రామచంద్రారెడ్డి, త్రిపురనేని మధుసూద‌న‌రావు, సర్దేశాయి తిరుమలరావు నలుగురిని బాగా చదివాను. కొడవటిగంటి కుటుంబరావును కూడా చదివాను. ఐదుగురు నాకు సాహిత్య విమర్శలో ఆదర్శంగా భావిస్తున్నాను.

కొలిమి : మార్కిస్టు విమర్శ, అభ్యుదయ సాహిత్యం మీకు ఎలా పరిచయమైంది?
రాచపాళెం : నేను విద్యార్థిగా ఉన్నపుడే త్రిపురనేని మధుసూద‌నరావు తిరుపతిలో మాకు అపుడపుడు ఉపన్యాసాలు ఇస్తుండేవారు. తిరుపతిలో గోవిందరాజస్వామి గుడిముందు కోనేటికట్ట ఒకటుంది. అక్కడ తరచుగా విరసం సమావేశాలు జరిగేవి. కె.వి.రమణారెడ్డి, శ్రీశ్రీ, త్రిపురనేని మధుసూద‌న‌రావు ఉపన్యాసాలిచ్చేవారు. ఆ రకంగా మార్క్సిజం పరిచయమయ్యింది. అప్పటికి నేను మార్క్సిస్టును కాదు. చాలా సంప్రదాయవాదిని. అనంతపురం కాలేజీలో తొలి సంవత్సరం గురజాడ కన్యాశుల్కం పాఠం చెప్పాల్సి వచ్చింది. ఆ నాటకం అప్పటి వరకు చదవలేదు. నా భాష, నా జీవితం దాంట్లో లేదు. అపుడు నాకు కె.వి.రమణారెడ్డి ‘మహెూదయం’ కనిపించింది. ఆ మహెూదయం ప్రభావంతో గురజాడ నాకు ఆరాధ్యుడయ్యారు. ఆ రకంగా మెల్లగా సాహిత్య విమర్శలోంచి మార్క్సిస్టుగా మారాను.

కొలిమి : సాహిత్య విమర్శలో ప్రస్తుత సమాజానికి ఏ రకమైన విమర్శ శాశ్వతమైన విమర్శ?
రాచపాళెం : నన్నయ భారతం మీద విమర్శ రాయాలనుకుంటే ఆయన దృక్పథం ఏమిటి? ఆయన సామాజిక స్వప్నం ఏమిటి? ఏ మానవ సంబంధాలు కోరుకున్నాడు? ఇవి చెప్పాలంటే మార్క్సిస్టు తత్వశాస్త్రం, సామాజిక శాస్త్రాలు తప్పకుండా ఉపయోగం. ప్రాచీన కవైన నన్నయ, తిక్కన, ఎర్రన ఎవరినీ గురించి మాట్లాడాలన్నా ఆధునిక సామాజిక శాస్త్రాలు బాగా ఉపయోగపడుతాయి. ఆధునిక శాస్త్రాల ఆధారంగానే జీవితాన్ని వ్యాఖ్యానించగలం. సంప్రదాయ సిద్దాంతాలతో చాలా తక్కువ ప్రయోజనం మాత్రమే ఉంది. రస సిద్ధాంతం, ధ్వని సిద్ధాంతాన్ని ఆధునిక సాహిత్యానికి ఉపయోగించుకోవచ్చని కొందరు మార్క్సిస్టులు చెప్పారు. ఉదాహరణకు ముదిగంటి సుజాతరెడ్డి రససిద్ధాంతాన్ని నవలకు అన్వయిండానికి విఫలయత్నం చేశారు. వల్లంపాటి వెంకటసుబ్బయ్య రస సిద్ధాంతం వస్తువుకు, ధ్వని సిద్దాంతం రూపానికి సంబంధించినదని, మార్పులు చేర్పులతో ఆధునిక సాహిత్యానికి అన్వయించవచ్చన్నారు. అది చేయకుండానే చనిపోయారు. ఆయనుంటే రాసేవారేమో? ఇవేవి పనికొచ్చేవి కాదని నా అభిప్రాయం. సామాజిక శాస్త్రాల విజ్ఞానం బాగా వుండి, మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తే తప్ప‌ ప్రాచీన, ఆధునిక సాహిత్యాల మీద విమర్శ రాయడం సాధ్యం కాదు. ప్రాచీన సాహిత్యమంతా పాలకవర్గాల జీవితాన్ని చిత్రించింది. కానీ పాలితవర్గం జీవితం చిత్రంచలేదు. ప్రాచీన సాహిత్యంలో కనిపించే ప్రజలంతా పాలకులకు అనుబంధంగా బతుకుతున్నట్లే చిత్రించారు. స్వయంగా బతుకుతున్నట్లు చిత్రించలేదని మార్క్సిజం చెబుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ కొంత సాహిత్యం వచ్చింది. ఉదాహరణకు పాల్కుర్తి సోమనాథుడు. తాళ్లపాక అన్నమాచార్యుడు. వీరబ్రహ్మం. నన్నయ్య మొదలుకొని గోపినాథ క‌వి వరకు రెండు రకాలున్నారు. ఎక్కువశాతం రాజస్థానాల పోషకత్వంలో బ‌తుకుతూ వారికి అనుగుణంగా వర్ణవ్యవస్థను స్థిరపరిచారు. అనేక అసమానతలను దైవ ప్రేరితాలుగా కవిత్వం సృష్టించారు. వర్ణవ్యవస్థలో మార్పు కోరినవారు పాల్కుర్తి సోమనాథుడు, అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మంలను ఆస్థానేతర కవులంటారు. రాజులను వీళ్లు భయంకరంగా తిట్టారు. నన్నయ ఏ వ్యవస్థను ప్ర‌తిపాదించారో ఆస్థానేతర కవులు దాన్ని వ్యతిరేకించారు. ప్రబంధకవులు ఏ వ్యవస్థను ప్రతిపాదించారో వేమన, వీరబ్రహ్మం దాన్ని వ్యతిరేకించారు. ఈ చరిత్ర అవగాహనకు ఆధునిక స్పృహ‌ ఉంటే తప్ప సాధ్యం కాదు. వేమన పద్యం అందంగా రాశాడు అని చెబితే ఏ ప్రయోజనం లేదు. వీరబ్రహ్మం మధురమైన భాషవాడినారు. అంటే లాభం శూన్యం. నన్నయ్యకు వర్తించే చట్రం వేమనకు, వీరబ్రహ్మంల‌కు వర్తించదు. నేను పియుసి చదువుకునే రోజుల్లో తొలి విప్లవకవి పాల్కురికి సోమనాథుడని త్రిపురనేని మధుసూద‌నరావు చెబితే బిత్తరపోయేవాడిని. “మాదిగయే మహి తొల్లి యెల్ల అని, మూలవాసి సిద్ధాంతం పాల్కురికి ప్రతిపాదించారు. నన్నయది మూలవాసి సిద్ధాంతం కాదు. అన్నమయ్య బ్రహ్మమొక్కటే అన్నాడు. భక్తునికి కులం అడ్డుకాదన్నాడు. నిద్ర, ఎండ,గాలి, ఆకలి అందరికీ ఒక్కటేనన్నాడు. కాబట్టి కులం అవసరం లేదన్నాడు. 15వ శతాబ్దంలో అన్నమయ్య భావ విప్లవకారుడిగా గుర్తించాలి. ప్రతి మనిషికి పనుండాలని, సమాజం గురించి మాట్లాడారు. ఇప్పటికీ పాలకులు అందరికీ పని కల్పించడంలేదు. ఆ రకంగా అన్నమయ్య నూతనంగా కనిపిస్తారు. త్రిపురనేని గారు మధ్యయుగాల్లో సాహిత్య పై రాశారు. ప్రబంధాల్లో విపరీత శృంగారం, భక్తి ఎందుకుందంటే? అలంకారాలు, వర్ణనలు, పద్యాలు బాగా రాశారంటే సాహిత్య ప్రయోజనం శూన్యం. 16వ శతాబ్దంలో విశిష్టాద్వైత సిద్ధాంత ప్రభావంతో ప్రబంధాల్లో శృంగారం, భక్తి ఉందని త్రిపురనేని చెప్పారు. తరగతి పాఠాల్లో దాని చారిత్రక నేపథ్యం గురువులు మనకు బోధిండం లేదు. భౌతిక జీవితాన్ని మోక్షం కోసం మనం చంపుకోవాల్సిన అవసరం దేని చెబుతుంది. విశిష్టాద్వైతం. మార్క్సిస్టు సాహిత్య విమర్శ ఆధారంగా ఏ దేశ సాహిత్య విమర్శనా చదవచ్చు.

కొలిమి : పార్లమెంటరీ భావజాల అభ్యుదయ సాహిత్యం ప్రజల బతుకుల్లో ఏమైనా మార్పు తెచ్చిందా?
రాచపాళెం : స‌్వాతంత్య్రం అనంత‌రం ఎన్నికలను ప్రజాస్వామ్య ప్రక్రియకు ఒక రూపంగా తీసుకున్నారు. ప్రజలు ఇష్టమైన పార్టీకి ఓటేసి ప్రభుత్వం ఏర్పాటు చేసి రాజ్యాంగ బద్దంగా పాలించుకోవడం. ఇప్పటికీ అనేక కారణాల వల్ల రాజ్యాంగ స్ఫూర్తి అందరికీ జీర్ణం కావడంలేదు. మన దేశంలో భూస్వామ్య వ్యవస్థ అతి ప్రాచీన కాలం నుంచి ఉండి, వలస పాలనలో అలాగే సాగింది. దాన్ని డిస్టర్బ్ చేయలేదు. మన కులం, మతం జోలికి రాలేదు. కాకపోతే వాళ్ల అవసరాలకు కొన్నిచోట్ల మత మార్పిడులు చేసి, చదువు చెప్పించి ఉద్యోగాలిచ్చారు. అంతేకానీ ఆంగ్లేయులు భారతీయ కులవ్యవస్థ నిర్మూలనకు ఆలోచన చేయలేదు. 1965 నుంచి ఎన్నికల్లో ధన ప్రవాహం పెరిగింది. ఎంపీలుగా గెలుపు కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గొప్పదే.కానీ అమలు చేయాల్సిన వాళ్లు కావాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తరిమిల నాగిరెడ్డి వ్యతిరేకించి విప్లవోద్యమంలో నడిచారు. అదొకబాటగా సాగుతూనే వుంది. నిజమైన ప్రజాస్వామ్యం అయితే ప్రస్తుతం లేదు. డా. అంబేడ్కర్ ఏమన్నారంటే డెమెక్రసి ఈజ్ నాట్ పొలిటికల్ మిషన్, ఇట్ ఈజ్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అన్నారు. స్వేచ్ఛ‌ కొందరికి మాత్రమే విచ్చలవిడిగా ఉంది, కొందరికి స్వేచ్ఛ‌ లేదు. పేరుకే ప్రజాస్వామ్యం, ఎవరైనా ప్రశ్నిస్తే గొంతులు నొక్కెస్తున్నారు. కాబట్టి నిజమైన ప్రజాస్వామ్యం రావాల్సి ఉంది.

కొలిమి: అస్తిత్వ ఉద్యమాలు ప్రధాన స్రవంతి పోరాటాలను చీలుస్తున్నాయనే భావనపై మీ అభిప్రాయం?
రాచపాళెం : స‌్వాతంత్య్రానంత‌రం బూర్జువా పార్టీలు, వామపక్ష పార్టీ వేర్వేరుగా నడుస్తున్నాయి. అనేక కారణాల వల్ల వామపక్ష రాజకీయాలు బలహీనపడ్డాయి. 1952 నాటి రాజకీయ స్ఫూర్తి లేదు. దళితుల మీద, మహిళల మీద లైంగిక దాడులు జరగుతున్నాయి. అనేక ఉద్యమాల్లో కుల సమస్య చర్యకు వచ్చింది. కాన్షీరామ్ బహుజన రాజకీయ భావజాల ప్రభావంతో జనాభా దామాషా ప్రకారం అధికారం నినాదం సమాజాన్ని కొంతవరకు ఆకర్షించింది. భార‌త్‌లో కార్మికులకు అదనంగా కుల సమస్య ఉందని గుర్తించారు. సాంఘిక విప్లవం రావాల్సిందని డిమాండ్ చేశారు. కుల నిర్మూలనకు కుల, మతాంతర వివాహాలు జరగాలన్నారు. దానికి అంబేడ్కర్ వారసులుగా చెప్పుకునేవారు ఎవరూ సిద్ధంగా లేరు. అంబేడ్కర్ చెప్పింది మంచి సూత్రమే. కుల, వర్గ నిర్మూలన ఉద్యమాలు జమిలిగా జరగాలి. చాలామంది మార్క్సిస్టులు ప్రకటించుకోవడంలేదు కానీ కులాన్ని తృణీకరిస్తున్నారు. ఉద్యమాల్లో నిమ్న కులాల పిల్లలు చనిపోతున్నారని, అగ్రకులాల నాయకత్వంలో వుంటున్నారని ఆరోపణలున్నాయి. భారతదేశంలో అంబేడ్కరిజం, మార్క్సిజం కలిసి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. కొందరు అస్తిత్వవాసులు మార్క్సిజాన్ని ప్రధాన శత్రువుగా మాట్లాడటం తగదు. దీనివల్ల బహుజనులకే నష్టం. తప్పదు.

కొలిమి: సాహిత్యంలో వర్గచైతన్యం కలిగించడం అవసరమేనా?
రాచపాళెం : ఏ చైతన్యం కలిగించని సాహిత్యం దండగ. వడ్డించిన విస్తరి జీవితం అన్నడు. నా వంటనేను వండుకోవాలని వ్యత్యాలులో చెప్పారు. సి.వి. రాసిన మీరునేను కవితలో పేదలు, ధనికుల మధ్య తేడా అద్భుతంగా చెప్పారు. సి.వి రచనలు అద్భుతం. పేదలకు, ధనికులకు మధ్య తేడాలను చక్కగా చెప్పారు. ఆయన పుస్తకాలతో చాలా చైతన్యం పొందాను. మార్క్సిజం భారతీయం కావాలంటే అంబేడ్కరిజం ఆలింగనం చేసుకోవాల్సిందే.

కొలిమి : ప్రపంచీకరణను ఎదుర్కొనేందుకు ఏ రాజకీయ దృక్పథం అవసరం?
రాచపాళెం : ప్రపంచీకరణను ఎదుర్కొనేది మార్క్సిజమే. ప్రపంచీకరణతో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యల సంక్షోభానికి గురయ్యారు. తొలుత అందరూ ప్రపంచీరణను వ్యతిరేకించారు. క్రమానుగతంగా సర్దుకుపోతున్నట్లు అనుమానం కలుగుతోంది. ఎన్ని రకాలుగా ధ్వంసం చేయాలో చేస్తుంది. మరోవైపు పాలకులు హాయిగా ప్రొత్సహిస్తున్నారు. పార్టీలు మారినా ప్రపంచీకరణ మారడంలేదు. ఇది భవిష్యత్తులో భార‌త్‌లో మరింత పెరిగే ప్రమాదముంది. ఇప్పటికైనా వామపక్షాలు కూడా అడ్డుకోవాలి. ప్రపంచీకరణకు విరుగుడు మారిజమే.

కొలిమి: వర్గ పోరాట సాహిత్యం, సాయుధ పోరాట సాహిత్యం జమిలిగా ఉండటం సాధ్యమేనా?
రాచపాళెం: 1946-51 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ప్రస్తుతం నడుస్తున్న విప్లవోద్యమానికి పూర్వ రూపమే అది. వీటిలో ఒకటి పార్లమెంటరీ బాటలో, మరోటి విప్లవోద్యమంగా నడుస్తున్నాయి. రెండు మార్క్సిస్టు అవగాహన ఉద్యమాలే. గమనంలో వైరుధ్యాలున్నాయి. పరస్పరం అవగాహన చేసుకుంటున్నారు. భిన్నమార్గాల్లో నడుస్తున్నాయి.

కొలిమి: సాహిత్యంలో విమర్శ అవసరం లేదంటున్నారు. మీరేమంటారు?
రాచపాళెం : తిక్కన వంటి ఫ్యూడ‌ల్‌ కవి ఏమన్నాడంటే…ఎట్టి కవికైనా తన కృతి ఇంపు పెంపజాలు, పరిణతి కలిగిన కవీశ్వరుండు ఆరితేరిన కవ మెచ్చకుంటే తప్ప సంతోషపడడని చెప్పాడు. విమర్శ వద్దనడం ఇటీవల అరాజకవాదం. విమర్శకుడి పాత్ర క్రియాశీలమైంది.

కొలిమి: విమర్శ అనేది రచయితను సంస్కరించడానికా? పాఠకుణ్ని సంస్కరించడానికా?
రాచపాళెం: రెంటినీ మార్చడానికి అవసరమే. పాశ్చాత్యులు రచనమీద జడ్జిమెంట్ ఇవ్వడమన్నారు. రచయితను విమర్శించే క్రమంలో రచయిత ఎలాంటి వాడని తెలుస్తుంది. పురోగామా? తిరోగామా? తెలుస్తుంది.

కొలిమి : ఇటీవల సాహిత్యంలో పెడధోరణులు ఎందుకు వస్తున్నాయి?
రాచపాళెం : సాహిత్యంలో పెడధోరణులు ఎపుడూ ఉన్నవే. ఆధునిక సాహిత్యంలో అపరాధ‌ పరిశోధక నవలలు, దెయ్యాలు- బూతాలు అనేవి, సూడో సైంటిఫిక్ కథలు, బూతు కథలు ఎపుడు వుంటూనే ఉంటవి. అవి ఎపుడు కాలంలో నిలవవు.

కొలిమి : ఆంధ్రప్రదేశ్‌ అరసం అధ్యక్షుగా ఇపుడు మీరున్నారు. 48 ఏళ్ల క్రితం అరసం చచ్చిపోయిందని విశాఖ విద్యార్థులు సవాల్‌ విసిరారు. ప్రస్తుత అరసం అధ్యక్షుడిగా మీరేమంటారు ?
రాచపాళెం : వరవరరావు గారి మాట ‘ఉన్నదేదో ఉన్నట్లు’గా అరసం చచ్చిపోయిందనే మాటకు యాభై ఏళ్ల చరిత్ర వుంది. 1955 ఎన్నికల్లో వామపక్ష ఓటమి తర్వాత బలహీనపడ్డారు. వామపక్ష రచయితలు సినిమా, వ్యాపారం రంగం వైపు పోయారని, న‌క్స‌ల్బ‌రీ మొదల‌య్యేదాక క్రియాశీకంగా లేదని వాదన నిజమే. 1955- 65 తెలుగు సాహిత్యంలో స్తబ్దత ఉంది. అభ్యుదయ సాహిత్యం కూడా ఒడిదుడుకుకు గురయింది. ప్రశ్నించే సాహిత్యానికి ఒకే రకమైన ప్రయాణం వుండదు. వేగం పెరుగుతుంది, తగ్గుతుంది, స్తబ్దతగా వుంటుంది. అరసంకు అదీ వుంది. నన్నయ్య చచ్చిపోయాడా ? తిక్కన, శ్రీనాథుడు చచ్చిపోయారా? అరసం కూడా చనిపోలేదు. వర్గ సమాజం ఉన్నంతవరకు అరసం వుంటుంది. ముందున్న ఒరవడి లేకపోవచ్చు.

కొలిమి : నవతరం సాహితీ విమర్శకుల‌కు మీరిచ్చే సందేశం.
రాచపాళెం : చాలా మంది విమర్శకులున్నారు. చాలా సంతోషం. రచయితలు పెరుగతున్నకొద్దీ విమర్శకులు పెరుగుతున్నారు. సాహిత్యం చదువుకుని రండి. సాహిత్య విమర్శ, సాహిత్య శాస్త్రం, సామాజిక శాస్త్రాలు బాగా అధ్యయనం చేయాలి. కొడవంటిగంటి కుటుంబారావు ‘రచయిత కన్న విమర్శకుడు రెండాకులు ఎక్కువ‌గా చ‌ద‌వాల‌న్నారు. వ‌ల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు విమర్శకుడు గొప్ప పాఠకుడు కావాల‌న్నారు. ఇవి ఆదేశ సూత్రాల్లాంటివి. పెద్ద కథను చిన్న కథగా, నవల‌ను చిన్న కథగా చెప్పడం విమర్శ కానే కాదు. విమర్శంటే.. ఆ నవల‌ కథలో ఏ జీవితం వుంది, నేపథ్యం ఏమిటో తెలియాలి. సాహిత్యంలో వస్తుతత్త్వం తెలియకుండా సాహిత్యాన్ని విమర్శించ‌లేవు. ఇది ఇవ్వాళ కనిపిస్తున్న లోపం. ఎక్కువ చ‌ద‌వండి, ప‌రిమితంగా రాయండి. ఎద‌గండ‌ని నా స‌ల‌హా.

కొలిమి : యువ సాహితీ విమర్శకుల‌కు ఏ పుస్తకాలు అధ్యయనం చేయాలో సూచిస్తారా ?
రాచపాళెం : రాచ‌మ‌ల్లు రామచంద్రారెడ్డి ‘సారస్వత వివేచన’, వ‌ల్లంపాటి వెంకటసుబ్బయ్య ‘కథా శిల్పం’, ‘నవలా శిల్పం’, ‘విమర్శ శిల్పం’, విరసం ప్రచురించిన త్రిపురనేని మధుసూద‌నరావు మూడు విమర్శ సంపుటాలు చదవాలి. కె.వి.ఆర్‌ గారి ‘కవికోకిల‌’, ఆర్‌ఎస్‌. సుదర్శనం విమర్శ, సర్దేశాయి తిరుమరావు విమర్శ, వరవరరావు విమర్శ, వీళ్లంతా మార్క్సిస్టులు. వీళ్లందరి రచను చదివితే మంచి మార్క్సిస్టు విమర్శకుడిగా ఎదుగుతారు. బహుజన దృక్పథంతో బి.ఎస్‌.రాములు, సంప్రదాయ సాహిత్యం మీద ఆధునిక దృక్పథంతో కె.కె. రంగనాథాచార్యులు, కాత్యాయని విద్మహే గారి ‘పునర్మూల్యాంకన విమర్శ’ను చదివితే ప్రాచీన సాహిత్యం మీద ఆధునిక దృక్పథం అల‌వడుతుంది.

పుట్టింది వడ్డిచర్ల, జనగామ జిల్లా. నెల్లుట్లలో పెరిగాడు. జనగామలో సదివిన మట్టి పెడ్డ. వరంగల్లు నగరంలో వలస బతుకు మనుగడ. ఉపాధ్యాయ బోధన విద్యలో నల్లబల్ల మీద అక్షరాలకు అభద్ర కూలీ గొంతుకవుతాడు. చాయ్ నీళ్లు లేకున్నా సాహిత్య సాన్నిహిత్యాన్ని కోరుకుంటాడు. కవి, రచయిత, జర్నలిస్ట్, పరిశోధకుడు, అధ్యాపకుడు. ప్రముఖ తెలుగు పత్రికల్లో పాత్రికేయుడిగా పని చేశాడు. ప్రస్తుతం ఉస్మానియా యునివర్సిటీలో 'తెలుగు సాహిత్యంలో చేనేత వృత్తి జీవనచిత్రణ'పై పరిశోధన చేస్తున్నాడు.

5 thoughts on “ప్రపంచీకరణను ఎదుర్కొనేది మార్క్సిజమే…

 1. రాచపాళెం గారి ఇంటర్వ్యూ బాగుంది.

 2. Arasam chachhi poyindhi ?????

  Reddy garu —your. Answer. Is super. Sir —- i agree with u 100% sir

  Very good interview
  ===========================
  Buchireddy gangula

 3. ఇంటర్వ్యూ బాగుంది అన్నగారు.

 4. ఇంటర్వ్యూ అనటం కంటే విమర్శ రాసేవాళ్ళకో కరదీపిక గా
  చెప్పుకోవచ్చు..
  చాలా విషయాలు నేర్చుకున్నాను..

Leave a Reply