“Our lives are a battle field on which is being fought a continuous was between the forces that are played to make us walk backward into the future”(wizard of the crow) Ngugi wa Thinongo. (Kenya ).
“మన జీవితాలు నిరంతరం వెనకడుగు వేయించి శక్తులతో పోరాడే యుద్ధభూమి” గూగి. వా తియాంగో” ఏ సందర్భంలో ఈ వాక్యం రాసినప్పటికీ పలమనేరు బాలాజీ రాసిన ‘ఏకలవ్య కాలనీ- ఎరుకుల జీవన గాథలు’ మాత్రం యుద్ధభూమిలో విలుకాడు సంధించిన విల్లు. వ్యవస్థ పై పెనుకేక, బలమైన ధిక్కారస్వరం.
తెలుగు సాహిత్యంలో సంచార జాతుల జీవితాలను, సంస్కృతిని, సామాజిక అస్తత్వాన్ని, జీవిక పెనుగులాటకు వివిధ సాహితీ ప్రక్రియల్లో మొదటగా చింతా దీక్షితులు (చెంచురాణి కథ), గూడూరు రాజేంద్రరావు (చెంచు కథ) రాసినప్పటికీ వీరికి భిన్నంగా వర్గ దృక్పథంతో శ్రీకాకుళ సాయుధ పోరాట ఉద్యమాల రచనలు చేసిన భూషణం కొండగాలి, ఉద్ధరింపు, విత్తనం కథలు తెలుగు సాహిత్యంలో కొండ ప్రాంత గిరిజనుల దోపిడి, అస్తిత్వం కోసం పోరాటం, ధిక్కారం కనిపిస్తాయి. వీటిని కొనసాగింపుగా మల్లిపురం జగదీష్ సవర తెగకు చెందిన శిలకోల, గురి కథలు సవరుల అవస్తీకృత జీవితాల గురించి రాస్తే ప్రత్యేకించి చిత్తూరు జిల్లాకు చెందిన కె. సభా, మధురాంతకం రాజారాం యానాది తెగల జీవనశైలి, సాంప్రదాయ వైద్యం లాంటి ఉపరితల అంశాలను తడిమారు. వీరు వారి జీవిత మూలాల్లోకి వెళ్లలేకపోయారు. ప్రత్యేకించి ఎరుకుల జీవితాలను మలిచినవారు అరుణ, శిరంశెట్టి కాంతారావు, పలమనేరు బాలాజీ. ఎరుకుల జీవితాల సామాజిక, లైంగిక దోపిడీకి గురి కావడం, వ్యవస్థ దృష్టిలో నేరగాల్లుగా, దోపిడీదారులుగా వెలివేయబడ్డ వారి బ్రతుకులు ఎట్లా మార్కెటైజ్ అయ్యాయి. మానవ సంబంధాలు, నిరంతర అవమానాలు, కన్నీళ్లు వారి బ్రతుకు పోరాటాలు అత్యంత సజీవంగా పాఠకులను కదిలించాయి. వీరి రచనలలో అటవీ ఉత్పత్తుల సేకరణ, వేటాడడం, చేపలు పట్టడం, బుట్టలు తట్టలు అల్లడం, అమ్మకం, వ్యవసాయ కూలీలు ఇతివృత్తంగా వీరి రచనలు సాగాయి.
ఇందుకు భిన్నంగా బాలాజి కొద్దిగా ఆర్థిక వెసులుబాటు ఉన్న కుటుంబం కాబట్టి వాటి పరిష్కారం అతని శైలిలోనే చెప్పారు. ఇతని ‘ఏకలవ్య కాలనీ’ సగటు ఎరుకల జీవితాలను 18 భాగాలుగా విడగొట్టారు. వృత్తి పరాంతీకరణ, యాంత్రిక వస్తువులు మార్కెట్ ను ఆక్రమించడంతో చేతివృత్తుల ధ్వంసం, ఆర్థిక పతనంతో పాటు సామాజిక పతనం మరింత ఎక్కువైంది. నాగరికత అభివృద్ధి పేరుతో సాంస్కృతిక జీవితం విధ్వంసం అయింది.
‘మా తప్పు ఏంది సామి?’ కథలో ఆదివాసీలు సంచార జాతులైనప్పటికీ ప్రభుత్వం కల్పించే కాలనీ ఇల్లు కట్టుకోవడానికి లబ్ధిదారుల వాటా పేరుతో డబ్బు కట్టాలి అనేసరికి వెనక్కి వెళ్లిపోవడం, ఒకరి బాధలు మరొకరితో పంచుకోవడానికి, సంఘటితంగా ఉండడానికి పందులు మేపైనా, గాడిదలు మేపైనా, ఉప్పు అమ్మైనా ఇల్లు కట్టాలని తపనపడ్డారు. ఇల్లు వారి చిరునామా, సామాజిక భద్రత ఇస్తుందనే సందేశాన్ని ఇచ్చారు.
వేల సంవత్సరాలుగా బ్రతకడం కోసం, ఆత్మగౌరవం కోసం, జీవితకాలం వారిది నిరంతర పోరాటం. చరిత్రలో వారి పోరాటాలను ఆధిపత్యంపై ధిక్కారాన్ని స్లాగించడం, వారి పోరాటాలను గానం చేయడం మరిచి వారిని అటవీ సంపద, సామాజిక సంపదను దోపిడీ చేసేవారిగా, వేటగాళ్ళుగా, నేరగాళ్లుగా పరిగణించడం అత్యంత సాధారణమైంది. ‘ఆయమ్మ అంతే! ఆమె ఒక మదర్ తెరిసా!’ కథలో వ్యవస్థ చేసే ప్రతి తప్పిదాన్ని, నేరాన్ని, చిన్న చిన్న దొంగతనాలను తీవ్రమైన నేరంగా పరిగణించి ‘ఈ ఎరుకల వాళ్లను ఎత్తి లోపల ఎయ్యండి రా’ అనడం, బెయిల్ దొరకపోవడం, జైల్లో అత్యంత ఘోరంగా శిక్షించబడడం, చనిపోవడం చాలా సాధారణమైన అంశం. బ్యాంకుల్లో లక్షల కోట్లను లూటీ చేసి దేశాన్ని వదిలి విదేశాల్లో విలాస జీవితాన్ని, దర్జాను అనుభవించేవాళ్లు, ప్రజల సంపాదన కొల్లగొట్టే కాంట్రాక్టర్లను, జాతీయ వనరులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి పాలకులను, పరిశ్రమలను, తీర ప్రాంతాలను సహజ సంపదను దోచుకుని కోట్లాది ప్రజలను, మానవ వనరులైన యువతను బిచ్చుగాలుగా, సోమరిపోతులగా, రాజ్యాంగాన్ని న్యాయ వ్యవస్థను అవహేళన చేస్తూ, అవమానిస్తున్న వారిని వదిలి, వేల సంవత్సరాలుగా ప్రతిఫలం ఆశించకుండా ఖనిజాలు, అటవీ సంపద, పర్యావరణాన్ని కాపాడే కాపలాదారులు. అత్యంత దేశభక్తులు,త్యాగజీవులైన వీరిని అన్ని రకాలుగా ఆదుకోవడం వదిలి, వారి జీవ దాతువైన అటవీ చట్టాలను ఉల్లంఘించడం. అభివృద్ధి పేరుతో వారి సాంస్కృతిక జీవితాలను, కళలను, సంస్కృతిని చిన్నాభిన్నం చేయడంతో పాటు వేలాది ఎకరాల అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం కోసం, అమాయకులను, నిరాయధీయలను అడవుల నుండి వెళ్ళ కొట్టడం కోసం నక్సలైట్ల పేరుతో వారి సానుభూతిపరుల పేరుతో వివిధ పేర్లతో చట్టబద్ధంగా ఈ దేశ రక్షణ వ్యవస్థచే ఈ దేశ పౌరులను, మూలవాసులను మానవహననం చేయడం. తెగల మధ్య ద్వేషం సృష్టించి జాతుల మొత్తాన్ని వారికి వారే నిర్మూలించుకొనేలా చేయటం కుట్రలో భాగమే.
ఇటువంటి సంక్లిష్ట సందర్భంలో బాలాజీ ‘ఏకలవ్య కాలనీ- ఎరుకల జీవనగాథలు’ రాయడం సంచలనం ఏమీకాదు గాని, గొప్ప చారిత్రక సందర్భం. ‘మా తప్పు ఏంది సామి’ కథలో మనవాళ్లు అందరూ పేరు చివరన ఎరుకల అని పెట్టుకోవాలి అనడం అణగారిన జీవుల ఆత్మపోరాట చిహ్నమే. ‘ఆయమ్మ అంతే! ఆమె ఒక మదర్ థెరిసా’ కథలో జయమ్మ చిన్న చిన్న అవసరాలకు చిన్న చిన్న బంగారు వస్తువులను కుదవ పెట్టడం అతుకుల బ్రతుకుల మధ్య ఆప్యాయతలకు కొదవలేదని చెప్పడమే. ‘అమరజీవి మాకాంతమ్మత్త!’ కథలో మానవ మృగాలను ఎదుర్కోవడం మగవారి కంటే ఆడవారు మరింత ధైర్యంగా బ్రతకడం ఎలానో చెబుతారు. ‘ఎర్రమన్ను, ముగ్గు పిండి’ కథలో బ్రతుకు పోరులో శ్రమజీవన సౌందర్యాన్ని సారవంతం చేశారు.
బాలాజీ రాసిన 18 కథల్లో జీవనసారం ఒకటే. పాఠకుల సౌలభ్యం కోసం, కథలలో వైవిధ్యం వ్యక్తం చేయడం కోసం గాని అత్యంత జీవభాషలో రాయలసీమ మాండలికంలో రాయడం పాఠకులను ఆకట్టుకుంటుంది. బూర్జువా లేదా వ్యాపార రచయితలు కథలను సమస్య దగ్గరే నిలిపితే బాలాజీ కథలన్నీ పరిష్కారంతో మొదలవుతాయి. మొత్తం కథల సారాంశం ఒక చిన్న సమూహం అతి పెద్ద సమూహాన్ని అత్యంత క్రూరంగా, వారి అమాయకత్వాన్ని అత్యంత తెలివిగా దోపిడీ చేయడమే. అందుకేనేమో ఇలాంటి వ్యవస్థను గూర్చి Mark twain “Human beings can be awful cruel to one another” (Adventures of Huckleberry )” (మానవులు మాత్రమే మనుషుల పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తారు)అంటారు.
ఈ కథలలో ఈనాటి స్థితిని గూర్చే “ఈ దేశంలో దళితులకు, ఆదివాసీలకు, స్త్రీలకు పోరాటం ఆదర్శం కాదు, అవసరం” అంటారు ‘అంటరాని వసంతంలో’ కళ్యాణ్ రావు గారు