(అనువాదం: ఎన్. వేణుగోపాల్)
చీకటి లోతుల్లో
జైలు చీకటి లోతుల్లో
మనసు సమాధి చేయాలని శత్రువు కోరుకుంటాడు
మరి భూమి చీకటి లోతుల్లో నుంచే
మెరిసే బంగారాన్ని తవ్వి తీస్తారు
సముద్రపు చీకటి గర్భాల్లో నుంచే
మెరిసే ముత్యాల్ని పట్టుకొస్తారు
మనం బాధలనుభవిస్తాం
కానీ మనం అధిగమిస్తాం దీర్ఘకాల పోరాటంలో రూపొందిన
మన స్వభావపు లోలోల్నుంచి బంగారాన్నీ ముత్యాన్నీ
మనం వెలికి తీస్తాం
(ఏప్రిల్ 10, 1978)
*
వర్షాగమనం
చిటచిటలాడే వేడిమితో
కుప్పగూడిన పెద్ద పెద్ద మేఘాలు
నేలను చీకటిమయం చేస్తాయి కాని ఉరుములూ మెరుపులూ
వర్షంతో ఒక వినూత్న ప్రగతి రుతువును ప్రకటిస్తాయి.
వర్షం మైదానాల మీదికొచ్చే వార్తను
అతి సన్నిహితంగా వినిపించడానికి
విస్తారమైన గాలీ, లోతెక్కే ప్రవాహమూ
పర్వతాలనుంచి పరుగెత్తుకొస్తాయి
చెట్లు తను చేతుల్ని ఆకాశందాకా చాపి
ఆత్యుల్లాస అభినయాన్ని నర్తిస్తాయి
పొదలు మేల్కొని
పాటల్లో కేరింతల్లో
చెట్లతో తమ గొంతు మేళవిస్తాయి.
గాలి ఎండుటాకుల్ని ఊడ్చేసి
మోడైన చెలకల మీద నిప్పురవ్వును
రగిలిస్తుంది
మంటలు పై కెగిసి
నీటి వెల్లువల కోసం ఎదురు చూస్తున్న
నేలతల్లి దాహాన్ని మరింత పెంచుతాయి
(జూన్ 15, 1978)
*
పర్వతాలమీద వర్షమూ సూరీడు
ఉరుములూ మెరుపులూ ముగిసిపోయాక
చల్లని నల్లని మేఘాలు పర్వతాల్ని
వికారమైన బురదగా కరిగించినట్టు కన్పిస్తుంది
కాని ఈ విచారకర దృశ్యం వెనుక
వర్షం భూమిని తడుపుతుంది
చెత్తను తేలుస్తుంది
సెలయేళ్ళలో నదులలో జీవాన్ని నింపుతుంది
గాలి కేకల మధ్యనే
శిఖరాల మీదా చెట్లూ పొదలూ
లోలోతుల్నించి పోషణను పొందుతాయి
మైదానాల మీద పంటలూ అంతే
అప్పుడా చీకటిని చీల్చుకొని
పర్వతాలను వెచ్చజేయడానికి
చెట్లవేళ్ళకు భూమిమీద
మరింత పట్టు ఇవ్వడానికి
సూరీడు వెలువడుతాడు
వన్య జీవితపు
ఆకుపచ్చని దివ్యత్వమంతా మెరుస్తుంది
పక్షుల ఉన్మత్త గీతాలతో
మృగాల ఆనంద నాట్యాలతో
ఉత్సవాలు చేసుకుంటుంది
చల్లని పవనాలలో సూర్యా స్తమయం
దప్పిక తీర్చే స్వచ్చమైన నీళ్ళలోకి
కాంతి కిరణాలు గుచ్చుతుంది
వర్షమూ తుఫానూ మాత్రమే ఉండి ఉంటే
పర్వతాలు బురదమయమయిపోయేవి
సూరీడూ కరువూ మాత్రమే ఉండి ఉంటే
పర్వతాలు ధూళిగా మారిపోయేవి
వర్షం తర్వాత సూర్యుడు
దేదీప్యమానంగా ఉంటారు
సూర్యుని తర్వాత వర్షం
ఉల్లాసంగా ఉంటుంది
రుతుపులు ఈ దీర్ఘకాలిక అయను
పరిక్షించే వాటి స్వభావాన్ని
పోగుపడిన వాటి సొగసుని గ్రహిస్తూ
పర్వతాలు తమ గాంభీర్యాన్ని నిలుపుకుంటాయి
ప్రళయాలమీద తమ ఆధిక్యతను ప్రకటిస్తాయి
(జులై 5, 1978)