కన్నడ రచయిత వసుధేంద్ర రచించిన “తేజో తుంగభద్ర” అనేది రెండు ప్రముఖ నదుల సాంస్కృతిక, సామాజిక, రాజకీయ ప్రకృతి దృశ్యాలను కలిపి ఆవిష్కరించిన చారిత్రాత్మక నవల. నిజానికి చరిత్ర అనేది ఇసుకరేణువులతో కూడిన ఎడారి వంటిది. ఎదురయ్యే వ్యక్తులు, సామ్రాజ్యాలు, ఆవిష్కరణలు ఇవన్నీ చిన్న ఇసుక రేణువుల వంటివే.
దక్షిణ భారతదేశంలోని తుంగభద్ర నది, పోర్చుగల్‌లోని తేజో నది. తేజో నది లిస్బన్ గుండా ప్రవహిస్తుంది. తుంగభద్ర విజయనగరానికి జీవాన్నిస్తుంది. రెండు నదులు రెండు కథలు. ఈ కథనం విజయనగర సామ్రాజ్యం, పోర్చుగీస్ ప్రపంచాలను కళాత్మకంగా వివరిస్తుంది.
రచయిత వసుధేంద్ర విజయనగర సామ్రాజ్య వైభవాన్ని, గొప్ప సంప్రదాయాలను, ప్రజల దైనందిన జీవితాలను స్పష్టంగా చిత్రిస్తూనే, కొత్త వాణిజ్య మార్గాల కోసం యూరోపియన్ అన్వేషణలను, భారత ఉపఖండంతో వారి ఎన్కౌంటర్లకు జీవం పోశాడు. ఆకర్షణీయమైన కథాకథనంతో చారిత్రక వాస్తవాలను మిళితం చేసే రచయిత సామర్థ్యం పుస్తకాన్ని మరింత ఆసక్తిగా చదివిస్తుంది.
గొప్ప చారిత్రక సంఘటనలకు స్పృశిస్తూ, పాత్రలు కథను ముందుకు తీసుకుపోతాయి. వారి పోరాటాలు, ఆకాంక్షలు, పరస్పర చర్యలు వారి కాలంలోని విస్తృత సామాజిక – రాజకీయ గతిశీలతను ప్రతిబింబిస్తాయి. పాఠకులకు ఆ కాలం గురించి లోతైన అవగాహనను అందిస్తాయి. ద్వంద్వ కథన నిర్మాణం ఆసక్తిని కొనసాగించడమే కాకుండా రెండు నాగరికతల మధ్య వైరుధ్యాలు, సారూప్యతలను కూడా హైలైట్ చేస్తుంది.
నదికి పరిమళం ఉన్నప్పుడు మసాలా పదార్థాలకు ఉంటుంది కదా. పరిమాణం, శక్తి వల్ల నది గొప్పదైనప్పటికీ పరిమళం విషయంలో చిన్నసైజు మసాలా గింజల ముందు నది ఓడిపోతుంది. వాస్కోడిగామా భారతదేశం నుండి తిరిగి వచ్చి, పోర్చుగీస్‌కు మధ్యవర్తులు లేకుండా సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో పాల్గొనడానికి వీలు కల్పించే సముద్ర మార్గాన్ని కనుగొని భవిష్యత్తుకు కొత్త తలుపులు తెరిచాడు.
స్పెయిన్ రాణి ఇసాబెల్లా తమ మతానికి విరోధులుగా భావించి యూదులను బహిష్కరించడంతో పోర్చుగల్ ను పాలిస్తున్న జొహోవా వారిని తమ దేశంలోకి రావడానికి అనుమతి ఇచ్చాడు. యూదులు చాలా తెలివైన వారు. ధనవంతులు. అత్యంత వేగంగా వ్యాపారాన్ని కుదుర్చుకునే కళ వారికి కరతలామలకం. అందుకు ఒక్కో యూదుడు ఎనిమిది క్రసోడోలు సుంకం చెల్లించాలని ఉత్తర్వులు జారీచేసాడు. ఖజానాకు కుప్పలు తెప్పలుగా డబ్బు వచ్చింది.
మతానికి ప్రాధాన్యత ఇచ్చి ఇసాబెల్లా సొమ్ము పోగొట్టుకుంది. మతాన్ని వెనక్కు తోసి, జోహోవా సంపదను తన దగ్గరికి రప్పించుకున్నాడు. స్పెయిన్ లోనూ తేజో నది ఉంది. యూదుల కష్టాలు అన్నీ దానికి తెలుసు. ఇప్పుడు లిస్బన్ లోనూ ఉంది అదే తేజో నది. కానీ వారి కష్టాలు ఇక్కడి వారికి చెప్పడం ఆ నదికి సాధ్యం కాదు. సత్యం తెలిసినా అర్ధం చేసుకునే యోగ్యత మనుషులకు లేదనే నదులు కొండలు మూగబోయాయేమో. మతాల అనుసారం ధర్మాధర్మాల నిజమైన అర్ధం ఏమిటి.. ధర్మాల విషయంలో ప్రపంచం ఎప్పుడూ సంకీర్ణమే.
లిస్బన్ లో నివసించే పోర్చుగీసు క్రిస్టియన్ కుటుంబానికి చెందిన గాబ్రియేల్ , స్పెయిన్ నుండి లిస్బన్ కు వలస వచ్చిన సంపన్న యూదుల కుటుంబానికి చెందిన బెల్లా చిన్నతనంలోనే స్నేహితులై , పెరిగే కొద్దీ ప్రేమలో పడతారు. గాబ్రియేల్ తండ్రి శిల్పి , బెల్లా తండ్రి వ్యాపారి. లిస్బన్ లో మతపరమైన అల్లర్లు జరుగుతున్న కాలంలో తమ ప్రేమను బెల్లా తండ్రికి చెప్పినప్పుడు తన పేదరికం కారణంగా తిరస్కరణకు గురైన గాబ్రియేల్ తన దారిద్య్రాన్ని అధిగమించడానికి బెల్లా వద్దన్నా వినకుండా డబ్బుల సంపాదనకు భారతదేశం బయలుదేరుతాడు. బెల్లా ఇచ్చిన రెండు గోల్డెన్ ఫిష్ లను వెంట తీసుకుని నౌకాయానం ప్రారంభిస్తాడు.
దీనికి సమాంతరంగా విజయనగరం దగ్గర్లోని తెంబకపురంలో కథ నడుస్తూ ఉంటుంది. కేశవ అనే యువకుడు ఓజా కులస్తుడు. కుశలకళ ఓజా కులధర్మం. హంపమ్మ అనే యువతిని ప్రేమించి, మాపళ నాయకుడితో మల్లయుద్ధం చేసి అతన్ని చంపి ఆమెను దక్కించుకుంటాడు. కానీ ఆ గెలుపు తర్వాత అతను చెక్కిన శిల్పాలను ఎవరో ధ్వంసం చేయడంతో అతనిలో ఒక ఒణుకు పుట్టి శిల్పాన్ని చెక్కే ఏకాగ్రత కోల్పోతాడు. ఆ కాలంలో చిన్న వయసులోనే జరిగే పెళ్లిళ్లు ఆడపిల్లల ప్రాణాలు ఎలా తీసేవో చంపక్క అనే హిజ్రా పాత్ర ద్వారా రచయిత చక్కగా చెప్పిస్తాడు. తెంబక్క సహగమనం, ఆమె కూతురు ఈశ్వరి మానసిక స్థితి ఆనాటి పరిస్థితులను కళ్ళకు కడతాయి.
ప్రయాణం సుదీర్ఘమైనది మరియు శ్రమతో కూడుకున్నది, మరియు అవతలి వైపు ఉన్న ప్రపంచం ఎలా ఉంటుందో తెలియకుండా చేసే ప్రయాణం. తెలిసిన జీవితం నుండి దూరంగా ప్రయాణించడం. తీరం తెలియని సముద్రంలో తేలియాడే జైలు లాంటి పడవ మీద గాబ్రియేల్ అనుభవాలు మనసును కలిచి వేస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం కొత్త విషయాల్ని తెలిసేలా చేస్తుంది. కొందర్ని ఆప్తుల్ని చేస్తుంది. లిస్బన్ నుండి భారతదేశానికి వస్తున్న గాబ్రియేల్ కు భరతదేశం నుండి లిస్బన్ కు వచ్చిన జాకోమ్ కథ వింతగా తోస్తుంది. కులాల్లోను ఉన్నది సంకీర్ణతే. ఉన్నతం – అధమం.
తన కళను కాదనుకుని సైన్యంలో చేరేందుకు వెళ్లిన కేశవ ద్వారా ఆ కాలంలో ఉన్న లెంకతనం ను పాఠకులకు పరిచయం చేస్తాడు రచయిత . ఇదిలా ఉండగా ఊరి చివర నది దగ్గర చాపలు పడుతూ విచిత్రంగా కనిపించే అమ్మదకణ్ణతో హంపమ్మ కు పరిచయం పెరుగుతుంది. మహారాజుకు మగబిడ్డ కలగడంతో కేశవ లెంకగా తన ప్రాణాన్ని త్యాగం చేయడం ఆ సందర్భంలో తెంబక్క కూతురు ఈశ్వరి స్పందన మనసును కదిలిస్తాయి. హంపమ్మ గర్భంతో ఉండడం వలన సహగమనం తప్పించుకోవడం ఆమెకు అమ్మదకణ్ణ సహాయం చేయడం ఆ తరువాత కథంతా ఆసక్తికరంగా మలిచాడు రచయిత.
నౌకలో ప్రయాణం అయిన గాబ్రియేల్ భారతదేశం చేరుకున్నాడా? బెల్లా ఏమైంది? బెల్లా ఇచ్చిన గోల్డెన్ ఫిష్ లను గాబ్రియేల్ ఏం చేశాడు? అసలు అమ్మదకణ్ణ ఎవరు ? హంపమ్మ కథ చివరికి ఏమైంది తెలుసుకోవాలి అంటే ‘తేజో తుంగభద్ర’ చదవాల్సిందే. 435 పేజీల ఈ చారిత్రాత్మక నవల ఎక్కువ పాత్రలు ప్రదేశాలు పేర్లతో తికమక పెట్టకుండా హాయిగా చదువుకునే విధంగా ఉంది. కన్నడలో రాసిన ఈ నవల స్పానిష్ తో సహా ఆరు భాషల్లోకి అనువదించ బడింది. దీనిని తెలుగులోకి అనువదించడంలో రంగనాధ రామచంద్ర రావు సఫలీకృతులయ్యారు.
తేజో తుంగభద్ర కేవలం చారిత్రక నవల మాత్రమే కాదు, ఇది సాంస్కృతిక మార్పిడి, వలస రాజ్యాల ప్రభావాలు, మానవత్వం శాశ్వతమైన స్ఫూర్తికి ప్రతిబింబం. వసుధేంద్ర ఉద్వేగభరితమైన కథనం, స్పష్టమైన వర్ణనలు ఎక్కడా బోర్ కొట్టించకుండా పాఠకులను 15వ శతాబ్దానికి తీసుకుపోతాయి. చరితాత్మక నవలల్ని ఇష్టపడేవారు తప్పక చదవవలసిన పుస్తకం.
చాలా అద్భుతంగా ఉంది,మీ సమీక్ష, చదివాక పుస్తకాన్ని తప్పనిసరి చదవాలన్నానంత ఆసక్తి ఏర్పడింది. పుస్తకం యొక్క బ్యాక్ గ్రౌండ్ ను వివరించిన తీరు అద్భుతంగా ఉంది. అదేవిధంగా పాత్రల గురించి వివరించిన తీరు కూడా సముచితంగా ఉంది. చక్కటి పుస్తకాన్ని పరిచయం చేసిన మీకు అభినందనలు.
సమీక్ష చాలా బాగుంది.
చదవాలనిపించేంత బాగుంది.
పుస్తకం వివరాలు తెలుపండి…
-కోవెల గోపాలా చార్య