కొ.కు – ‘సైరంధ్రి’

కథ విన్నారు కదా, ఈనాటి సినిమాల పరిభాషలో చెప్పాలంటే – boy meets girl తరహా కథ. అబ్బాయి అమ్మాయిని చూశాడు, ఆమెకి అప్పటికే పెళ్లయింది, భర్త నుంచి విడిపోయింది, వారిద్దరి మధ్యా ప్రేమ కలిగింది. వాళ్లిద్దరూ సహజీవనం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఇదే కథ! మరి వాళ్లిద్దరి కథనీ మనం ఎందుకు వినాలి, ఏమిటి వాళ్ల ప్రత్యేకత, ప్రాసంగికత?  ఈ ప్రశ్న ముందు వేసుకోవాలి, దాని మీద మరి కొన్ని ప్రశ్నలు వచ్చాయి, వాటిని ఒక సంభాషణ రూపంలో ఇక్కడ చదవండి.

ప్ర: వాళ్లిద్దరూ అసలు ఎలా కలిశారు?

జ: సినిమా హాలు దగ్గర, love at first sight అనుకోవచ్చు, తొలిచూపులోనే ఆమె అతన్ని ఆకర్షించింది. అతనంటాడు: “జానకిని చూడగానే మాడుమీద ఎవరో బలంగా కొట్టినట్లు తల తిరిగిపోయింది. ఆమెలో అంత ఆకర్షణ ఉన్నది. ముఖ్యంగా ముఖంలో, కాకపోతే చూపులో. ఆ ఆకర్షణ ఎక్కడ ఉన్నదీ నాకే స్పష్టంగా తెలీదు.” 

ఆ తర్వాత పరిచయం పెరిగింది, కలిసేవారు, అలా దగ్గరయ్యారు.  

ప్ర:  ఆకర్షణ కలగడంలో వింతేం లేదు కానీ, అలా ఇద్దరు అపరిచితులు రొడ్డు మీద కలుసుకుని, నచ్చి మాట్లాడుకుని, ప్రేమించుకున్నారా, అలా జరగడం ఈ 2020లోనే అరుదు కదా, ఇక 1969లో అది ఎలా కుదిరింది?

జ: అంటే వాళ్లు బొత్తిగా అపరిచితులు కాదు, వాళ్లిద్దరికీ దూరపు బంధుత్వం ఉంది. ఏదో ఒక పెళ్లిలో 10 ఏళ్ల క్రితం కలిసారు. అతనికి గుర్తు లేదు కానీ, ఆమెకి గుర్తుంది. అందుకే ముందుగా ఆమే పలకరించింది.   

ప్ర: సరే కానీ, అంత ఆకర్షణ కలిగిన ముఖాన్ని, 10 సంవత్సరాల క్రితమే చూస్తే, అప్పుడు ఎందుకు పట్టించుకోలేదు, పోనీ అంటే గుర్తు కూడా ఉండదా, అలా ఎలా మర్చిపోయాడు? 

జ: ఆకర్షణ అన్న మాటని, కేవలం అందం అన్న అర్ధంలోనే అతను వాడినట్టు అనిపించదు. నిర్మలంగా ఉన్న వాళ్ల ముఖాలు వికసించి ఉంటాయని అతని నమ్మకం. అతని మాటల్లో చెప్పాలంటే – సినిమా హాలు దగ్గర జానకి ముఖం “అప్పుడే వికసించిన డాలియా లాగుంద”ని అంటాడు.

ప్ర: ఇది మరీ బాగుంది, 10 ఏళ్ల క్రితం జానకి నిర్మలంగా లేదటనా అయితే?

జ: అహహ, నిర్మలం అంటే స్వచ్ఛమని కాదు అతని ఉద్దేశం. అతను ఒక మాట అంటాడు: “ఆమె మాట్లాడే పద్దతిలో ఎలాంటి మానసిక రుగ్మతలూ కనిపించలేదు.” అని – దాని అర్ధం – ఏ నిర్బంధమూ లేకుండా ఉందని, ఆంక్షలలోనూ, కట్టుళ్లలోనూ నలిగిపోతున్నట్టు కనిపించలేదని. ఏదో గుట్టు దాచుకున్నట్టు కాక – పారదర్శకంగా ఉన్న ముఖంలా తోచిందతనికి. ఒక్క మాటలో చెప్పాలంటే ‘స్వేచ్ఛ’ కనిపించి ఉంటుంది.

ప్ర: సరే, ఒప్పుకున్నాను – కాగితం పూలు, ప్లాస్టిక్ పూల గుట్టల మధ్యగా ఒక చిన్ని తాజా పువ్వులా అతనికి కనిపించి ఉంటుంది. అతనికి సహజత్వం గురించిన అవగాహన ఉంది కనక వెంటనే గుర్తించాడు, ఆకర్షితుడయ్యాడు. కానీ నా ప్రశ్న ఇంకా అదే – 10 ఏళ్ల క్రితం ఆమె అలా కనిపించ లేదా, నువ్వు చెప్పిన ఆ పసి పిల్లల ఉదాహరణ ప్రకారం చూసినా – ఆమె అప్పటికి ఇంకా చిన్నపిల్ల కదా? అప్పుడు ఆమె స్వేచ్ఛగా లేదంటావా?  

జ: ఉండి ఉంటుంది, లేకపోతే లేదు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం – కథకుడు ఆమెను చూసే సమయానికి ఆమె అలా ఉందన్నది. రెక్కలు ప్రతీ పక్షికీ పుట్టుకతో ఉంటాయి, కానీ ఎగరడానికి ప్రయత్నించినపుడే కదా, అవి గట్టి పడేది, శరీరంలో భాగంగా మారేది.

ప్ర: అలా ఆమె ఎగిరిందా?

జ:  అలా తెలియాలంటే, దానికి మనం ఆమె జీవితంలో గడిచిన ఘట్టాలను గురించి తెలుసుకోవాలి.

ప్ర: చెప్పు, ఏమిటవి?

జ: కథ పేరు చూడు – సైరంధ్రి. దానికి నిఘంటువులో అర్ధం – భర్త ను వదిలేసిన/భర్త చేత వదిలివేయబడిన స్త్రీ అని. జానకి గురించి కథకుడు అంటాడు: జానకి భర్త ఆమె తనను వదిలేటందుకు చెయ్యదగిన పనులన్నీ చేశాడు, మాటలన్నీ అన్నాడు;  ఆమె తనను వదిలేశాక, చేసినట్టు లబ్బున మొత్తుకుని, తనకు ఘోరమైన అన్యాయం జరిగిందనుకున్నాడు. 

ప్ర: ఇష్టంలేని పెళ్లి అయిందా ఆమెకు?

జ: అలా అనలేం, తిరుమలరావును చూసి, ఇష్టపడే చేసుకున్నది. అయితే ఆమె చూసింది అతని ముఖం మాత్రమే, నిజంగా ఇష్టపడింది అతని తండ్రి సంభాషణ విని. అతని తండ్రి పెద్ద రేషనలిస్టు. పనికిమాలిన పాత ఆచారం మీద తిరగబడినవాడు. కానీ పెళ్లయ్యాక తెలిసింది తిరుమలరావుకి తన తండ్రి అంటే పరమ అసహ్యం. అతని భావాలంటే తగని మంట. ఆ తండ్రికి ఎడంగా ఉండడానికి అతను పట్నంలో మకాం పెట్టాడు.

తిరుపతిరావు “ఒక బాలకవి, తాను కూడా ఒక సాహితీపరుడుగానే మాట్లాడేవాడు. సాటి కవులందరిలోనూ ఏదో ఒక దోషం ఎంచేవాడు. అసూయ అనుకున్నది జానకి. శ్రీశ్రీకి తనకూ మాత్రమే కవిత్వ రహస్యం అర్ధమయిందని చెప్పాలన్నాడు ఒకసారి ఎవరితోనో. అహంకారం అనుకున్నది జానకి. తరవాత సన్నసన్నగా శ్రీశ్రీ కవిత్వానికి కూడా ఏదో వంకలు పెట్టి తాను ఒక్కడేనని నిర్ధారణ చెయ్యడానికి పిరికిప్రయత్నం చేశాడు.”

అతను నిజంగానే అంత మేధావేమోనని మనం ఎక్కడ అపోహ పడతామో అని తర్వాత ఇలా ఉంటుంది. శ్రీశ్రీ దాకా ఎందుకు, విశ్వనాధ వారి పద్యాలు అతనికి అర్ధం కావని రూఢిగా తెలుసు అంటుంది.

ప్ర: అంతేలే, పెళ్లయేదాకా నిజ స్వరూపాలు బయటకు రావడం కష్టమే, అయితే భర్తను వదిలి పెట్టడమే -రెక్కలు విచ్చుకోడానికి గుర్తంటావా, ఆ పని చాలా మంది చేస్తారే – తప్పనిసరి అయినప్పుడు?

జ: ఆమె ప్రత్యేకత తెలియాలంటే – ముందు ఆమె తన భర్త గురించి ఏమందో విను:

“అతను పెద్ద కూబి. మనసులో ఏముందో చచ్చినా తెలిసేదికాదు. నోటంట వచ్చిన ఏమాట నమ్మడానికుండేది కాదు.

అదేం మనిషో, ఏ పని చేసినా దొంగతనమో, రంకుతనమో అన్నట్టుగా చేసేవాడు”

ఇక్కడ ఒక విషయం గమనించావా? ఏ విషయమైతే కథకుడు ఆమె ఆత్మను నిర్వచించదగ్గ అంశమని పరిగణించాడో – దానికి పూర్తిగా విరుద్ధమైన మనిషి ఆ తిరుపతిరావు అని మనకు జానకి చెప్తోంది.

ప్ర: ఔను సుమా, అది నిజమే. మరి ఒక్కొక్కరి తత్వం ఒకోలా ఉంటుంది, దానికేం చెప్తాం?

జ: ఇక్కడ తత్వం ప్రశ్న ఒక్కటే కాదు, వారి మధ్య ఆత్మీయత ఉండే అవకాశం కూడా లేదని తేలుతుంది.

ప్ర: అదెలా?

జ: “భార్య తన జీవితంలో ఏ మాత్రమూ పాలుపంచుకోకపోవడం అతనికి పట్టిచ్చినట్టు లేదు. అసలు ఆమె కావాలనే తన విషయాలకు ఎడంగా ఉంటున్నదా అని కూడా అతను గమనించలేదేమో నన్నది జానకి.” చెప్పొచ్చేదేమిటంటే – ఆ తిరుపతిరావు తన మనసులో సంగతులు చెప్పడు, జానకి మనసులో ఏమనుకుంటోందో అతనికి అక్ఖరా లేదు. అందుకే కథకుడు – వారిద్దరి మధ్యా ఆత్మీయత లేదు అని ఖచ్చితంగా చెప్తాడు.

ఇప్పుడు కథకుడికీ ఆమెకీ ఉన్న సంబంధాన్ని చూస్తే, ఆ బంధానికి ఇరుసు మరి ఆత్మీయతే. చిన్న చిన్న విషయాలలో సైతం ఆమె యధాలాపంగా కూడా అనుమానం ఉన్నట్లు మాట్లాడదు. ఆ విషయాన్ని గమనించి,  “నా మాటలో ఆమెకు సంపూర్ణ విశ్వాసం ఉందనటానికి ఇది పెద్ద తార్కాణం.” – అనుకుంటాడు.

ఆమెతో యావజ్జీవ స్నేహం చేసుకోవాలని కోరుకుంటాడు. ఆమె కూడా అంగీకరిస్తుంది. “నీకు ఖైదులో ఉన్న భావం ఏనాడూ రానివ్వను” అని మాట ఇస్తాడు.

 : ఒప్పుకుంటావా వారిద్దరిదీ ఒక విశిష్టమైన ఆదర్శప్రాయమైన ప్రేమ కథ అని?

 : సరే వారిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఒప్పుకుంటున్నాలే!

                                              ***************                                

 పైన చెప్పినదంతా కేవలం కథా సంవిధానానికి సంబంధించిన చర్చ. చెప్పదలుచుకున్న అంశం – వివరంగా నిర్వచించబడిన పాత్రలతో, నమ్మడానికి వీలైన సంఘటనల మధ్య గుది గుచ్చి చెప్పడం వల్ల సూటిగా మనసుకు హత్తుకుంటుంది. కేవలం వారి ప్రేమను మాత్రమే చిత్రించి ఉంటే – ఈ కథ గురించి ఇంత కంటే చెప్పుకునే అవసరం లేదు. కానీ కథలో కొన్ని సీరియస్  ప్రతిపాదనలు చేస్తారు కొకు –వాటి సామంజస్యాన్ని ఇక్కడ చర్చించాలనుకుంటున్నాను. ఆనాడు ఆయన రాసినప్పటికీ, 2020లో ఈ మాటలకు ఏవన్నా అర్ధాలు మారాయా, కొత్త అర్ధాలు వచ్చి చేరాయా అని ఆలోచించాలి.

స్త్రీ పురుష సమానత్వం అనేది మనం చేరవలసిన గమ్యం  అని స్థూలంగా అనుకుంటే – దానిని సాధించే దశలు, రంగాలు, మార్గాలు అనేకంగా విస్తరించి ఉన్నాయి. ఆర్ధిక స్వావలంబనతో పాటు, రాజకీయ ప్రాతినిథ్యం, చట్ట పరంగా హక్కులు, విద్య, ఉద్యోగాలలో సమానావకాశాలు, కళా, సాంస్కృతిక రంగాలలో సమాన గౌరవం – ఇలాటి అనేకానేక అంశాలు సరేసరి, తన సంతానం మీదా, స్వంత శరీరం మీద హక్కును సాధించడానికి సైతం ఉద్యమాలూ, పోరాటాలూ అవసరమయ్యాయి, అవుతాయి కూడా. వాటిని ఇక్కడ చర్చించబోవడం లేదు.

అయితే ఇవన్నీ కాక, ఇప్పటికే లభించిన హక్కులను వినియోగించుకోడానికి కూడా, స్త్రీకి మానసిక స్వాతంత్ర్యం, భావ స్వేచ్ఛ కావలసి ఉంటుంది. ఎందుకంటే – చట్టం అనుమతించిన విషయాలలో సైతం సమాజం జోక్యం చేసుకుని, నియంత్రించడానికి అనునిత్యం ప్రయత్నిస్తుంది. ఇదిగో ఈయీ పనులు చేస్తే మీరు మంచివారని జమ కడతాం, అదుగో ఆరకంగా ఉంటే మాత్రం మిమ్మల్ని దూరం పెడతాం అని మనకి, సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా, ఆడవాళ్ల ప్రవర్తనకు గురించిన సూచనలు మరింత వివరంగా, స్పష్టంగా కనిపిస్తాయి. చాలా మంది ఒక ముసుగును వేసుకుంటారు. ఏ ముసుగు వేసుకుంటే ప్రపంచంలో కలిసి పోగలమో అలాటి ముసుగు కోసం మన వెతుకులాట. వాటిని తెచ్చి  పసివారి మీద కూడా కప్పుతాం. సమాజం ఆధునికం అయి, ‘వర్చ్యువల్ ప్రెసెన్స్’ (ఇంటర్నెట్ ఐడెంటిటీ) పెరిగాక ఆ ముసుగులలో మరిన్ని పొరలు కూడా వచ్చి చేరాయి, వాటితో మన ముఖం ఏమిటో తడుముకుని చూసుకోడానికి మనకి కూడా దొరక్కుండా పోతోంది.

అలిఖిత శాసనాలను పాలించేలా మనుషుల హృదయాలలో స్థిర పడిపోయే నిర్బంధాలను ఉద్దేశించి కొకు కథలో ఈ వాక్యాలు రాశారు అనిపిస్తుంది:

నూటికి తొంభై తొమ్మిది ముఖాలలో నాకు జైలునీడలు కనిపిస్తాయి. ముఖంలోనుంచి ఆత్మ తొంగి చూస్తుందంటారు! అది అక్షరాలా నిజం. పసిపిల్లల ఆత్మలు నిర్మలంగా ఉంటాయి గనకనే వాళ్ల ముఖాలు అందంగా ఉంటాయి. పూర్వం చైనా వాళ్లు ఆడవాళ్ల పాదాలను బంధించినట్లు కొందరు రాక్షసులు రెండేళ్లయినా నిండని తమ పిల్లల ఆత్మలను బంధించేస్తారు. అలాటి పిల్ల ముఖాలు చూసినప్పుడల్లా వాళ్ల తల్లిదండ్రులను కుంభీపాక నరకానికి పంపితే ఎంత బాగుండును అనిపిస్తుంది. పిల్లల ముఖాలు వికసించిన పువ్వుల్లా ఉండాలి. ఆ మాటకు వస్తే పెద్దవాళ్ల ముఖాలూ అలాగే ఉండాలి.

సమాజం అనేది ఒక అమూర్త భావన, అది ఒక్కొక్కరికీ ఒక్కో రూపంలో కనిపిస్తుంది – నా అనుభవం ఒకటి పంచుకుంటాను. మా అమ్మాయీ, నేనూ ఎనిమిది నెలల క్రితం ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాం. ఆరు నెలల అద్దె అడ్వాన్సుగా ఇచ్చాం. ఇంటి ఓనరు క్రిస్టియన్, కొడుకులిద్దరూ ఆర్మీలో పెద్ద పోస్టుల్లో ఉన్నారట. ఛారిటీ కోసం చర్చి కట్టించాడట. డబ్బు మనిషి కాడు, అడగ్గానే కొంత అద్దె తగ్గించాడు కూడా. వంటింటి సామాను, సోఫాలూ, టీవీతో సహా, మొత్తం ఫర్నిచర్‌తో ఇల్లు ఇచ్చాడు. మొత్తం బిల్డింగ్‌లోని 12 ఫ్లాట్‌లలోనూ ఫేనులు తుడిచేందుకు నెల నెలా వాచ్‌మేన్‌ని తీసుకువస్తాడు, వాటర్‌ టేంకులు విధిగా కడిగిస్తాడు. ఇలాటి బిల్డింగ్‌లే అతనికి ఇంకా చాలా ఉన్నాయట, ఇళ్లలో పని చెయ్యడానికొచ్చే మెయిడ్‌లు కూడా అతను చెప్పిన వాళ్లనే పెట్టుకోవాలి. భార్యతో కలిసి కూర్చుని, CCTV  కేమెరాల్లోంచి బిల్డింగ్‌లోకి వచ్చే పోయే వాళ్లందరినీ కనిపెడుతూ ఉంటాడు.

చేరిన రెండు రోజులకే మేమంటే అతనికి నప్పకుండా పోయింది. విసుక్కోవడం మొదలుపెట్టాడు. అతను క్రిస్టియన్ అయినా మా ఇంట్లో దేవుడి పటం లేదని తెలిసి నిరసన ప్రకటించాడు. ‘స్వచ్ఛమైన’ ఆవుపాలు పుచ్చుకోమని మనిషిని రికమెండ్ చేశాడు, మాకు వద్దంటే తెల్లబోయి ఆపై చిరాకు పడ్డాడు. నేను ఉద్యోగానికి, స్కూటర్ టేక్సీ పిలుచుకుని, తెలియని మగాళ్ల  వెనకాతల వెళ్లడం చూసి ఇక అతనికి సహనం నశించి పోయింది. కనిపిస్తే మొఖం తిప్పుకునే వాడు. సరే, ఒక సంవత్సరం ఎలాగూ గడపక తప్పదని నిర్ణయించుకున్నాక, మేం ఆ సంగతి ఆలోచించడం మానేశాం.

ఇల్లు ఖాళీ చేస్తామని నిన్న అతనికి ఫోన్ చేసి చెప్పేను, సరే, వచ్చి కలవమన్నాడు. మేం చేసుకున్న కాంట్రాక్టు ప్రకారం, సంవత్సరంలోగా ఖాళీ చేస్తే, 2 నెలల అద్దె పెనాల్టీగా ఇవ్వాలి. అది కట్టమంటాడేమో అనుకున్నాను, కానీ అది మాఫీ చేస్తానన్నాడు. ఇచ్చిన వస్తువులన్నీ, చెక్ చేసుకుని వాటిలో ఏవన్నా పాడైతే, అడ్వాన్సులో నుంచి విరగ్గోసుకుంటాను అన్నాడు. సరే అన్నాను. ఇక అప్పుడు మొదలుపెట్టాడు – లెక్చర్. అన్నన్ని వస్తువులను మాకిస్తే, వాటిని శుభ్రంగా ఉంచాలన్న దృష్టి మాలో లేదన్నాడు. అయ్యో, మేం అన్నీ శుభ్రంగానే ఉంచుతున్నామే, ఎందుకలా అంటున్నారు అని (వినయంగానే)  అడిగాను. అందరు ఇళ్ల కంటే మీ ఇంట్లో ఫేనులు ఎక్కువ మట్టిగా ఉన్నాయి అన్నాడు. దానికి మా పూచీ ఏమిటో తెలియలేదు. అవి మట్టి పడుతున్నాయని, గమనించి అతనికి కబురు పెట్టాలట. మా అమ్మాయికి మర్యాద తెలియదట. గేటు తలుపు విసురుగా మూస్తుందట.  ఇలాటివి ఒక వంద మా నేరాల దండకం చదివాడు, ఓపిగ్గా విన్నాక అవి అసలు విషయాలు కావని అర్ధమయ్యింది.

దారి మార్చి, నెల క్రితం జరిగిన అతని కొడుకు పెళ్లి సంగతి చెప్పాడు, వీధి వీధంతా వెళ్లారట, 12 కోట్లు ఖర్చు పెట్టాడట. అలాగే క్రిస్మస్ పార్టీకి అన్ని ఫ్లోరుల్లోకి వచ్చి ప్రార్దనలు పాడేరట. వాటన్నిటికీ మమ్మల్ని కావాలనే పిలవలేదట, దాన్ని బట్టీ మేం అతన్ని ఎంత నిరాశ పరిచామో ఆలోచించుకోమని చెప్పేడు. మా ఆరు నెలల అడ్వాన్సూ తిరిగి చేతిలో పడేదాకా అతనితో ఏ సంభాషణా పెంచదలుచుకోలేదు. అందుకని, “సరేనండీ, మీరు మాకు చాలా సౌకర్యాలు ఇచ్చారు, మీకు మేం ఇబ్బంది కలిగించడం దురదృష్టకరం, వెళ్లే నెలరోజులలోగా ఏమన్నా చేయాల్సినది ఉంటే చెప్పండి, చేస్తాం” అని  చెప్పి వచ్చేశాను.

అతని ధోరణి గురించి ఆలోచిస్తే – నాకొక విషయం తోచింది. నేను ఎదిరించి ఉంటే, డబ్బు వెనక్కి ఇవ్వకుండా గొడవకు దిగి ఉండే వాడేమో కానీ ప్రస్తుతం  అతను నాడబ్బును తొక్కి పట్టాలని అనుకోవడం లేదు. మరి అతనికి కావలసినది ఏమిటి? మా విధేయత కావాలి. అతను అందజేసిన సౌకర్యాల పట్ల కృతజ్ఞులమై ఉండాలి. అతనెంత గొప్పవాడో, మేం గ్రహించి అతని అప్రూవల్ కోసం ప్రయత్నిస్తూ కనపడాలి. సరే, దానికి మేం సిద్ధంగా లేం కనక ఖాళీ చేసేస్తున్నాం, అది వేరే సంగతి.

ఏ అంశాలైతే ఆడవారికి అతి ముఖ్యమని లోకం నమ్ముతుందో – ఇంటి శుభ్రం, పిల్లల పెంపకం – వాటిలో నేనెంత ఫెయిల్ అయ్యానో నాకు చెప్తున్నాడు. వాటికి నేను బాధ పడకపోడంతో, రెండో అస్త్రం – ఎంత పెద్ద అవకాశాల్ని మిస్ అయ్యానో చెప్తున్నాడన్న మాట. అతను మమ్మల్ని పెళ్లికి పిలవలేదనీ, క్రిస్మస్‌లో కూడా మమ్మల్ని దూరంగా ఉంచాడనీ – అతను చెప్పేదాకా మేం గుర్తించ లేదు. దాని ద్వారా మమ్మల్ని నియంత్రించాలన్న అతని సరదా తీరనే లేదు.  అదే కనక, మేం అతని మెప్పుదల కోసం ఈ ఎనిమిది నెలలలో ఏ కొంచెం ప్రయత్నించినా ఆ మేరకు అతను విజయం సాధించి ఉండేవాడే. ఇదే కదా కండీషనింగ్ అంటే, దీనినే పెద్ద స్థాయిలో, ఇంకా సటిల్‌గా సమాజం చేస్తుంది అనిపించింది నాకు.

                  ***************                         

పైన ఉదంతంలో, ఇంటి ఓనర్ ఇచ్చే అప్రూవల్‌ మాకు ముఖ్యం కాకపోవడంతో – మాకు పెద్ద ఇబ్బంది కలగలేదు. కానీ సమస్యకు రెండో కోణం కూడా ఉంది. అదే అతను ఉద్యోగంలో మన పై ఉద్యోగి అయితే, ఇంట్లో తల్లి దండ్రులో, అత్తమామలో అయితే? వాళ్లని పట్టించుకోకపోవడం అనే పని అంత సరళంగా ఉండదు కదా. అంతిమంగా చెయ్యాల్సినది, మనకు నచ్చినదే అయినా, దాని కోసం ఘర్షణ పడక తప్పదు చాలా సార్లు. మరో విషయంలో కూడా మనం జాగ్రత్త పడాలి – స్వేచ్ఛ అనేది two way road అంటారు, విధేయతను చూపించనవసరం లేదనే స్పృహ మాత్రమే కాదు, విధేయతను ఆశించకూడదన్న వివేకం కూడా కావాలి. అది లేనంత కాలం ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఇది వ్యక్తిగత స్థాయిలో కాక సమాజం స్థాయిలో ఆలోచించినప్పుడు, సమస్య ఇంకా సంక్లిష్టంగా మారుతుంది. అలాటి ఒక సమస్య – పెళ్లి.

కొకు “ఆడదానికి ప్రకృతి అన్యాయం చేసిందంటారు, అన్నిటికన్నా హెచ్చు అన్యాయం చేసింది వివాహవ్యవస్థ. వివాహవ్యవస్థే ననుసరించి వచ్చిన సామాజిక పరిణామాలన్నీ ఆడదానికి స్వేచ్ఛ లేకుండానే చేశాయి” అని రాస్తారు. 1960ల్లో ఏమో గానీ, ఈనాడు – ఆర్ధిక స్వాతంత్ర్యం ఉండి, చదువుకుని, తన జీవితానికి కావలసిన వనరులను సమకూర్చుకోగలిగిన స్త్రీ – భర్త లేకుండా ఉండలేదా అని ఎవరికైనా సందేహం రావచ్చు. సమూహంలో ఎవరికైనా ఎంత స్వేచ్ఛ ఉందనేది – దాని నియమాలని ఎదిరించిన వారికి బాగా తెలుస్తుంది. ఆవరణలో ఉన్న పశువుకు, తన మెడకు ఉన్న తాడు పొడుగు గానీ, అసలు తాను కట్టబడి ఉన్నానన్న సంగతి గానీ ఎప్పుడు తెలుస్తుంది? ఆ వాకిలికి బయట అడుగు వెయ్యాలని అనుకున్నప్పుడే కదా. అలాటి ఒక ఉదాహరణ  ‘నీనా గుప్తా’. 1980ల నుండీ హిందీ సినిమాల్లోనూ, టీవీలోనూ నటిస్తోంది. చాలా మందికి తెలిసే ఉండొచ్చు – ఆమె పెళ్లి చేసుకోకుండా ఒక కూతురుకు జన్మ నిచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనను  చాలా ధైర్యశాలి అని మెచ్చుకుంటుంటే – ఆమె అభ్యంతరం చెప్పింది. “నాకు అప్పట్లో తెలియలేదు కానీ, దీని వల్ల చాలా ఇబ్బందులున్నాయి. కనక నా కూతురికి గానీ, వేరెవ్వరికి గానీ – నేను ఆ సలహా ఇవ్వను అంది. పెళ్లి తప్పనిసరి, అందుకే, 50 ఏళ్ల వయసులో నేను పెళ్లి చేసుకున్నాను” అని కూడా చెప్పింది.  ఇవి తిరోగామి భావాలని మనమే కాదు, ఆమె కూడా ఒప్పుకుంటుంది. కానీ తనకు కనిపించే ప్రంపంచంలో, తాను చూస్తున్న వాస్తవం ఇలా ఉందని ఆమె నిజాయితీగా చెప్తోంది.

అది తప్పా, ఒప్పా అన్న చర్చ అనవసరం, ఆమె నిర్ణయానికి ఆమే బాధ పడినంత మాత్రాన, ఆ నిర్ణయం తప్పవదు. ఆ తర్వాత అలాటి నిర్ణయం తీసుకోవడం వల్ల మరింత అర్ధవంతమైన జీవితాలను గడుపుతున్నామని ఎందరో స్త్రీలు సంతృప్తి వ్యక్తం చేస్తుండడం కూడా ఒక వాస్తవం. అయితే ఆ అభిప్రాయానికి ఆమె రావడానికి, ఆమె ఎదుర్కొన్న సమస్యలేమిటి, ఆ సమస్యలు మిగిలిన స్త్రీలకు కూడా వర్తిస్తాయా అనేది ఆలోచించడం అవసరం. ఆమె ఒక నటి. కేవలం జీవిక కోసమే కాక, తన కళను అభివ్యక్తీకరించడానికి ఆమెకు ఒక మీడియం అవసరం. తన రెబెల్ ఇమెజ్  వల్ల వేంప్ రోల్(శృంగార/దుష్ట పాత్ర)లు మాత్రమే ఇచ్చే వారని చెప్తుంది. మనకి అదీ ఒక సమస్యా అనిపించవచ్చు, కానీ పబ్లిక్ పర్‌సెప్షన్ (మెజారిటీ ప్రజాభిప్రాయం) అనేక రంగాలలో స్త్రీల జీవితాలను ప్రభావితం చెయ్యగలదు. క్రియాశీలంగా ఉన్న ఒక సామాజిక కార్యకర్తకు, తాను సహాయపడాలనుకున్న ప్రజల విశ్వాసం పొందడంలో – ఆమె వ్యక్తిగత జీవితం పాత్ర ఎంతైనా ఉంటుంది.

నీనా మరొక మాట చెప్తోంది, ఏ పని చెయ్యదలుచుకున్నా నాలుగు గోడల మధ్యా చేస్తానని, పబ్లిక్‌గా చేయడం వల్ల వచ్చే నష్టాలేమిటో బాగా తెలిసి వచ్చిందనీ. కథలో ఒక వాక్యం గుర్తొచ్చింది: జానకిలాగా నిజం చెప్పెయ్యటం తన స్వేచ్ఛకు ప్రధానంగా అనుకునే మనిషి శరీరం అమ్ముకుని బ్రతకను కూడా లేదు.నిజమే, ఎక్కడైతే, సమాజంతో నేరుగా స్త్రీ ఇంటరేక్ట్ అవుతుందో – ఆ పరిధిలో ఆమెకు పబ్లిక్ స్క్రూటినీ అనుభవంలోకి వస్తూనే ఉంటుంది.

ఏ సమస్యను పరిష్కరించడానికైనా, ముందు అది ఉందని గుర్తించాలి కదా, ఆ పనే ఈ కథ చేస్తోంది. ప్రజల అబిప్రాయం ఎలా ఉన్నా తమకి కావలసిందేమిటో గుర్తించి, దానిని పొందడానికి – తమ జీవితం తమ విలువల ప్రకారం జీవించడానికీ పూనుకున్న జానకి లాంటి మహిళలు ఇప్పుడు ఇంకా ఎక్కువే ఉన్నారు. ఆ విషయంలో పురుషులే వెనక పడ్డారు. ఆడవారి మీద ఉన్న నిర్బంధాలు కనిపిస్తాయి, కానీ మగవారి మీద మరో రకమైన నిర్బంధం –  కనపడని నిర్బంధం అమలౌతోంది. స్త్రీల పట్ల చిన్నచూపును – ఇంటా బయటా చూస్తూ వింటూ వచ్చిన మగవారికి – దానిని ఎదుర్కోవడం ఒక సమస్యే. స్త్రీ పురుష సమానత్వం – ఆడవారికి అర్ధమౌతున్నంత స్పష్టంగా మగవారి గ్రహింపుకు ఇంకా రావడం లేదు. అందుకే సంబంధాలలో ఇన్ని ఒడిదుడుకులు. స్త్రీలకి కావలసిన అనేకానేక అంశాల్లో ప్రేమించే హక్కు, ప్రేమించబడే హక్కు అనేవి కూడా ఉన్నాయి. స్వేచ్ఛగా ఆలోచించే స్త్రీని కావాలనుకునే స్వేచ్ఛాప్రియుడైన పురుషుడు కూడా తయారుకావాలి కదా, స్త్రీకి అదీ ఆవశ్యకమే.  కథకి జానకి నిష్కపట వ్యక్తిత్వం ఎంత ముఖ్యమో, అలాటి లక్షణాన్ని గుర్తించి, ఆమె సహవాసం కావాలనుకునే – పరిణత మనస్కుడైన కథకుడు కూడా అంతే ముఖ్యం.

ఈ విషయంలో ఈ కథ ఒక ఉన్నతాదర్శాన్ని ప్రవేశపెడుతోంది. కొకు అతి ముఖ్యమైన, ప్రామాణీకరణ ఒకటి చేస్తున్నారు – స్వేచ్ఛకీ ప్రేమకీ ఉన్న సంబంధాన్ని చెప్తున్నారు : “నువు స్వేచ్ఛ అనేదానికి, నేను ప్రేమ అనే దానికీ చాలా దగ్గిర సంబంధం ఉన్నది. నాకు యుక్త వయసు వచ్చాక ఒకరు నాతో గానీ, నేను ఒకరితో గానీ స్వేచ్ఛగా మాట్లాడలేదు. అది ఒక అవసరం కాదా? నిజంగా స్వేచ్ఛగా మాట్లాడాలంటే ఒక మనిషి దొరికినాక మరొక మనిషికి ఆ స్థానం ఇవ్వగలమా? ఏదీ దాచుకోవటం చాతగాని మూఢుల మాట చెప్పటం లేదు. నువు నాతో చెప్పిన సంగతులన్నీ, ఇంకెంత మందితో చెప్పి ఉంటావు అని అడిగాను. అలా ఎవరిద్దరైనా ఒకరికొకరు ఎంత ప్రత్యేకమో తెలుసుకోవాలంటే,  ముందు వారేమిటో, వారి ప్రత్యేకత ఏమిటో వారికి స్వయంగా తెలియాలి, దానిని ఏ కపటమూ లేకుండా వ్యక్తీకరించుకోగలగాలి. అలా స్వేచ్ఛా, ప్రేమా – కలిసే ఉంటాయని, ఒకటి లేకుండా వేరొకటి నిలవలేదని కొకు చెప్తున్నారు.

అతను అంత కాలం పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం కథకుడు ఇలా చెప్తాడు -“మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకునే అవకాశం నాకు కనుచూపు మేరలో ఎక్కడా కనిపించక నేను పెళ్లి చేసుకోలేదు. అవి ఈనాటికైనా మనం సాధించుకున్నామా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. మనసులో ఒక మాటా, బయటకొక మాటా మాట్లాడే అవసరం లేని వాతావరణమూ, ఏ పొరలూ లేకుండా విచ్చుకున్న పువ్వుల్లా కళకళలాడే వ్యక్తులూ, ఒకరి మీద ఒకరికి అనుమానాలు లేని ఆరోగ్యకరమైన సంబంధాలూ – ఇవన్నీ ఆనందకరమైన సమాజానికి అవసరమని చెప్తోంది కథ.

పుట్టింది విశాఖపట్నం. చదువు ఎం. ఏ. ఇంగ్లిష్. విశ్లేషణాత్మక వ్యాసాలు, కథ, నవల, సినిమాలపై సమీక్షలు రాస్తున్నారు.

4 thoughts on “కొ.కు – ‘సైరంధ్రి’

 1. కొకు రాసిన మరో మంచి కథ. మీ చదవడం బాగుంది కళ్యాణి గారూ. విశ్లేషణ కూడా. అన్వయం బాగుంది. కొకు కథల్లోని ప్రాసంగిత రుజువయ్యింది.

 2. కొడుకు కథ ను కళ్యాణి గారు మీ నోటి వెంట వినడం బాగుంది 69 లోనే కోకు గారు ఇంత మంచి కథ రాశారు లోతైన విశ్లేషణాత్మక ఇప్పుడు మనం అనుకుంటున్నా ఇప్పుడు మనం చర్చించుకుంటున్నా విషయాల్ని ఎంత విడమరిచి గొప్పగా చెప్పారు

 3. మానసిక రుగ్మలు ఏమి లేకపోవడాన్ని నిర్మలత్వంగా చెప్పడం, ఆమె అప్పుడు చూసింది, కాకపోతే ముఖం మాత్రమే చూసింది అన్నడం మీ చక్కని చురకల రచన కు ఉదాహరణ సీతమ్మ. మీరు తీసుకునే మీ అనుభవం, దాని ద్వారా మీరు అందరి ముందు ఉంచాలి అనుకునే విషయం కూడా ఇప్పటి మనిషి సరిగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ఆడవాళ్లకి వివాహ వ్యవస్థ చేసిన కీడు అంతా ఇంతా కాదు అనుకోండి, దానిలో కుటంబ వ్యవస్థ పాత్రే ఎక్కువ ఉంది… వేల ఏళ్లుగా అక్కరలేని భారాన్ని మోస్తూన్న మనిషికి స్వేచ్ఛ వచ్చింది ఎప్పుడు? వేల ఏళ్లు కిందట తయారు చేసిన ప్రాసెసర్తో పని చేస్తున్న మనిషికి ఇవ్వని తెలిసేది ఎప్పుడు… DNA మార్చడం తప్ప వేరే దారి లేదు ఏమో… పుస్తకాలలో స్వేచ్ఛ నిర్వచనం మన సమాజంలో కనిపించాలంటే ఎన్ని దశాబ్ధాల కాలం పడుతుంది అనేది….. ఆ సంఖ్య చెప్పడానికే భయంగా ఉంది… 100, 200, 500….

 4. మేడమ్,

  సైరంధ్రి మూలకథను నేను ఎక్కడ చదవగలను ??

  చెప్పరూ… దయచేసి…

  కానాలబాలు
  Kanalabalu@gmail.com

Leave a Reply