మీ బాల్యం విద్యాభ్యాసం గురించి చెప్పండి.
మా ఊరు ఓజిలి రాచపాలెం. నెల్లూరు జిల్లా. పల్లె కావడం తో బాల్యం లో అద్భుత జ్ఞాపకాలు ఉన్నాయ్. దూరదర్శన్ కాలం. చదువులో ఎప్పుడూ ముందే. తెలుగులో పీజీ చేసాను. కొద్ది రోజుల్లో పి.హెచ్ డి పూర్తి అవుతుంది. ఇంటర్మీడియట్ వరకు రెగ్యులర్ విద్య. మిగతా అంతా దూర విద్య.
మీరు ఎందుకు రాస్తున్నారు? మీ రచనల లక్ష్యం ఏంటి?
2003 నుండి కవిత్వం రాస్తున్నప్పటికీ పుస్తకం తెచ్చే ధైర్యం చేయలేదు. అది చాలా తప్పు అని తెలుస్తూ ఉంది. త్వరలో పుస్తకం వస్తుంది. వాక్యం వచ్చినప్పుడే రాయడం అలవాటు. అప్పటి వరకు ఎదురు చూడటమే. నాలోకి నేను చూసుకుపోవడానికి కవిత్వం రాస్తూ ఉన్నాను. అది మరి కొందరిని కదిలిస్తే మరీ సంతోషం. నిర్మాణాత్మక సమాజం కోసం రాస్తున్నాను.
మీకు సాహిత్యం ఎట్లా పరిచయం అయ్యింది?
ఉపాధ్యాయ శిక్షణ కోసం అనంతపురం జిల్లా బుక్కపట్నం వెళ్లడం జీవితంలో మంచి మలుపు. ఆ పక్కనే ఉన్న కొత్తచెరువు జూనియర్ కళాశాల లో అధ్యాపకులు గా ఉన్న డాక్టర్. రాధేయ గారి పరిచయం సాహిత్యం వైపు తీసుకు వెళ్ళింది. ఆయన మాకు వందలాది కవితా సంపుటాలు ఇచ్చి చదివించారు. అట్లా ఏది కవిత్వం కాదో తెలుసుకున్నాము. నాతో పాటు నా మిత్రులు సునీల్, సిద్ధార్థ లు కూడా ఉన్నారు. ఉమ్మడిశెట్టి అవార్డు సభల్లో మేము పాల్గొనే వాళ్ళము. తర్వాత మేము ఆయన పేరు మీద ఓ కవితా పురస్కారం కూడా నడుపుతున్నాము. అలా సాహిత్యం వైపు కదలడం జరిగింది.
మిమల్ని బాగా ప్రభావితం చేసిన సాహిత్యం ఏది?
మొదటిలో కవిత్వం విపరీతంగా చదివాను. దొరికిన ప్రతి కవితా సంపుటి ఇష్టంగా చదివాను. ఆధునిక కవులను ఎవరిని వదిలి పెట్టలేదు. శివారెడ్డి అభిమాన కవి. ఆశారాజు కవిత్వం కూడా చాలా ఇష్టం. ఇప్పుడు ఎక్కువ గా కథలు చదువుతూ ఉన్నాను. కవిత్వం, కథ రెండు నన్ను బాగా ప్రభావితం చేశాయి.
మీ రచనల నేపధ్యం ఏంటి?
మా నాన్న వీధిభాగవతం ఆడేవారు. నాకు బాగా తెలిసే నాటికి వాటి ప్రభావం తగ్గింది. ఎప్పుడైన తాగి వచ్చినప్పుడు కొన్ని దరువులు పాడేవారు. ఆ ప్రభావం నా మీద ఉంది. సామాజిక చింతనే నా రచనలకు నేపధ్యం గా చెబుతాను.
మీ తొలి రచన ఏది? దాని నేపధ్యం ఏంటి?
మొదట ప్రాస పదాల తో ఏవో రాసే వాడిని. అనంతపురం వెళ్ళాక ప్రాస తో పాటు భావానికి ప్రాధాన్యం ఇవ్వడం తెలిసింది. కవి కాకి కోగిర జయ సీతారాం జయంతి సభ నవంబర్ 14, 2002 లో పెనుగొండ వినాయక మైదానం లో ఏర్పాటు చేశారు. దాదాపు 500 మంది సభకు హాజరయ్యారు. ఆ సభలో బాల్యం మీద రాసిన కవిత చదివాను. మంచి స్పందన వచ్చింది. అది నా మొదట రచన గా చెప్పుకుంటున్నాను.
మీ వృత్తికి, రచనకు సమన్వయం ఎలా చేసుకుంటున్నారు?
నేను మొదట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయడి గా ఉద్యోగం పొందాను. సాహిత్యం చదవడం బాగా అలవాటు. ఆ క్రమంలో తెలుగు లో పి.జి చేయాలని ఆలోచన వచ్చింది. అధ్యయనం విస్తృతం అయింది. ఏ రోజు చదవడం మానలేదు. ప్రాథమిక పాఠశాల పిల్లలకు బోధన చేసే సమయం లో అప్పటికప్పుడు గేయాలు అల్లేవాడిని. తర్వాత ఉన్నత పాఠశాలలోకి, తెలుగు అధ్యాపకుడిగా వెళ్ళాను. తెలుగు భాష బోధకుడిగా మంచి అవకాశం కనుక వృత్తి, ప్రవృత్తి జమిలి గా సాగిపోయాయి.
మీకు బాగా గుర్తింపు తెచ్చిన రచన ఏది? ఏ సందర్భం లో రాశారు?
సీసాకాలుష్యం అని మద్యపానం మీద రాసిన కవిత విశాలాక్షి పత్రికలో వచ్చింది. ఆ పత్రికలో యండమూరి గారి నవల కూడా వస్తుంది. ఆ పత్రిక వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిధి. ఆ పత్రిక సంపాదకులు ఈతకోట సుబ్బారావు గారు ఒక రోజు ఫోన్ చేసి, “పత్రిక వార్షికోత్సవానికి మీరు తప్పకుండా రావాలి. మీరు ఆశ్చర్యపోయే సంఘటన మీకు దొరుకుతుంది” అన్నారు. నెల్లూరు టౌన్ హాల్లో సభ. యండమూరి అతిధిగా రావడం తో సభ నిండిపోయింది. ఆయన ప్రసంగం ప్రారంభం లోనే విశాలాక్షి పత్రికలో పోయిన నెల నేను ఒక కవిత చదివాను. ఆ కవిత సీసాకాలుష్యం, కవి సుంకర గోపాల్ అని ప్రకటించి వారికి నేను గోల్డ్ మెడల్ బహుకరిస్తున్నా, వేదిక మీదకు స్వాగతం అని ప్రకటించారు. ఇది నేను మర్చిపోలేని సంఘటన. తర్వాత ఆంధ్రజ్యోతి వివిధ లో వచ్చిన ‘కురుస్తున్న దుఃఖం’, ‘ఖాళీ అయిన ఇల్లు’, ’24 గంటలు’ కవితలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రముఖ విమర్శకులు జి. లక్ష్మీ నరసయ్య గారు కవిసంగమం లో నా కవితల పై సమగ్ర వ్యాసం రాశారు. ఇది కూడా నేను ఊహించని సంఘటన.
మీ సాహిత్య దృక్పథం ఏంటి? దాన్ని ఎవరు ప్రభావితం చేశారు?
సామాజిక చింతన, మానవ సంబంధాలను నేను ఆవిష్కరించే ప్రయత్నం చేసాను. చేస్తున్నాను. ఏ ఒక్కరో ప్రభావితం చేశారు అని చెప్పలేము గానీ, చదివిన ప్రతీ కవి ప్రభావితం చేసిన వారే.
మీరు చూసిన జీవితం మీ రచనల్లో ఎలా ప్రతిబింబిస్తుంది?
తెలుగు వెలుగు పత్రికలో పచ్చి పాలకుండ అనే కవిత వచ్చింది. ఆ కవితలో
గతంలో మా ఊరు ఎలా ఉండేది, ప్రపంచీకరణ తర్వాత ఏమైంది అనే విషయాన్ని బలంగా చెప్పాను. ఇలా ప్రతీ కవితలోను చూసిన, చూస్తున్న జీవితం కచ్చితంగా కనిపిస్తుంది. కాకినాడ లో సహాయ ఆచార్యులు గా చేరడానికి వెళ్లినప్పుడు అద్దె ఇంటి కోసం తిరిగే సందర్భలో “ఖాళీ అయిన ఇల్లు” కవిత రూపుదిద్దుకుంది. ఒక వారం రోజులు అవే ఆలోచనలు . 8వ రోజు 3 నిమిషాల్లో ఆ కవిత రాశాను. ఆ కవిత మీద బండారు రాజ్ కుమార్ సారంగ లో మంచి వ్యాసం రాస్తే, నవ తెలంగాణ పత్రికలో డాక్టర్. చంద్రయ్య మంచి విశ్లేషణ రాశారు.
మీ రచన వస్తువులు ఏంటీ? అవి ఎట్లా ఎంచుకుంటారు?
చూసిన ,చూస్తున్న జీవితం నుండే నేను తీసుకుంటాను. మా నాన్న జీవిత చివరి దశలో మంచం లో పడినప్పుడు ఆయన పడిన వేదన చూసి” పరాయితనం” అనే కవిత రాశాను. అది సారంగ లో వచ్చింది. ‘ఏమి జన్మ తండ్రి ఏమి జన్మ ఆత్మ ఇమడ లేని పరాయితనం’ అని ముగుస్తుంది. అలాగే మా ఆవిడ “రోటి పచ్చడి” ఒక రోజు చేస్తుండగా ఆ నేపధ్యం నుండి కవిత రాశాను. ‘రోటి పచ్చడి వర వర రావు కవిత్వం లా ఉంది’ అని ముగించాను. ఆ మధ్య దేశంలో జరిగిన కొన్ని సంఘటనలు ను తీసుకుని “పక్షులసభ” అనే కవిత రాశాను. ప్రజాశక్తి లో వచ్చింది. ఇలా వస్తు వైవిధ్యాన్ని నా కవితల్లో గమనించవచ్చు.
మీ రచనలు తొలినాటి నుండి ఎట్లా పరిణామం చెందాయి?
బహుశా ఈ ప్రశ్నకు పై రెండు ప్రశ్న ల్లోనే జవాబు ఉంది. దాదాపు 17 సంవత్సరాల నుండి కవిత్వం రాస్తున్నాను. చాలా కవితలు రాసినప్పటికి తర్వాత అవి నచ్చక చించేసినవి ఉన్నాయ్. నాకు, బాగా నచ్చితే తప్ప ఆ కవితను నేను ఉంచుకోను. ఆ భయమో, పొగరో ఇప్పటికి కవిత్వ సంపుటి తీసుకురాలేదు. పరిణామం లో ఏది చెత్త కవిత్వమో బాగా తెలుసుకున్నాను.
తెలుగు సాహిత్య బోధకుడిగా విద్యార్థులకు సాహిత్యాన్ని ఎట్లా పరిచయం చేస్తున్నారు? విద్యార్థుల్లో సాహితి సృజనని ఎలా పెంపొందిస్తున్నారు?
చాలా మంచి ప్రశ్న. నేను డిగ్రీ, పీజీ విద్యార్థులకు బోధన చేస్తాను. ఏ రోజు కూడా ఏదో ఒక కథ చెప్పకుండా నా పాఠం సాగదు. అలాగే సందర్భానికి అనుకూలంగా శ్రీ శ్రీ, తిలక్, శివారెడ్డి, శిఖామణి, ప్రసాద మూర్తి, అఫ్సర్, శేషేంద్ర శర్మ, ఆశారాజు ఇలా పెద్ద లిస్ట్ చెప్పొచ్చు వీళ్లు కూడా వచ్చి పోతూ ఉంటారు. అలాగే కథలు అంటే జానపదం కావొచ్చు, లేదా సమకాలీన కథలు కావొచ్చు ఇలా అన్ని ఉండేలా బోధన సాగుతుంది. ఏ ఒక్కరు ఐనా ఇందులో నుండి స్ఫూర్తి పొందుతారు అనే చిన్న ఆశ. అలాగే తరగతి గదిలో ఓ చిన్న సందర్భం ఇచ్చి లఘు నాటికలు కూడా వేయిస్తూ ఉంటాను. తరగతి గదుల్లో ఇలాంటి ప్రయత్నం జరిగితే మంచిది అని నా భావన.
మీరు పిల్లల కవితా సంకలనాలు తేవడానికి నేపధ్యం ఏంటి?
నేను హైస్కూల్ లో ఉపాధ్యాయుడి గా ఉన్నప్పుడు కవిత్వం ఎలా రాయాలో పిల్లలకు కొన్ని ఉదాహరణ ల ద్వారా చెప్పేవాణ్ణి. అమ్మ, చెట్టు, స్నేహం, సముద్రం లాంటి అంశాల మీద రాయమని అడిగే వాడిని, అలా చూస్తూ వుండగానే 10 పిల్లలు బాగా రాయడం మొదలు పెట్టారు. ఆ ఉత్సాహం తో నీటిపూలవాన, గోరువంకల గానం సంకలనాలు తెచ్చాను. ఇప్పుడు కూడా మా కళాశాల విద్యార్థులు చక్రవర్తి, నవీన్, దుర్గా ప్రసాద్, శ్రీకాంత్, భువన సురేష్ ఇలా కొంతమంది బాగా రాస్తున్నారు. నవీన్ కవితలతో పుస్తకం తీసుకురావాలి.
వర్తమాన సామాజిక సందర్భం లో మీ స్పందన ఏంటి?
సాహిత్యానికి ఆదరణ తగ్గింది. ఒక తరం బాగా దూరం అయ్యింది. ప్రభుత్వం కూడా ఆదాయ మార్గాల కోసం చూసుకుంటూ ఉంది. ఉచిత పథకాలు ఎర వేసి, సోమరులను తయారు చేస్తున్నాయి. దళితులు, స్త్రీలు పై దాడులు ఆగడం లేదు. వ్యాపార వేత్తలకు అనుకూలంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. ప్రజల్లో ముఖ్యంగా యువకుల్లో మార్పు తెచ్చే ప్రయత్నం కవులు, కళాకారులు చేయాలి.
శుభాకాంక్షలు మిత్రమా
ఓ మంచి కవిని గూర్చి తెలుసుకుని ప్రేరణ పొందాం
నిజంగా మీ కవితా ప్రయాణం మీ జీవనయానం లాగా చక్కగా సాగుతున్నది , అలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
బాగుంది. కవిత్వం లోకి మీ ప్రయాణం చక్కగా విశ్లేషించారు. – ప్రభు
మీ సాహితీ నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంది గోపాల్ గారు.. మీ పరిచయం మా అదృష్టం.
అభినందనలు సర్.
– జానకిరామ్.
మంచి రచయితగా దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ ఉన్నాను
Bagundhi gopal అభినందనలు
mee jeevithamlo nannu bagaswamiga chesukoni Naku kavitwapu ruchini chupincharu. Meru inka Oka manchi kaviga Peru techukovalani korukuntunnanu💐💐💐💐
Congratulations sir
మాకు తెలుసు సర్ మీరు కవిత్వాల గ్రంధాలయం అని. మీరు ఇంకా గొప్ప స్థాయికి చేరుకుంటారు సర్ .
గోపాల్ గారు మీ సాహితీ ప్రయాణం పలువురికి స్పూర్తినిచ్చేలా ఉంది.మిమ్మల్ని ఇంకాస్త లోతైన ప్రశ్నలు అడిగితే బావుణ్ణనిపించింది.చివర్లో మీరు కవీ, కళాకారుల బాధ్యతను గుర్తుచేయడం చాలా నచ్చింది .అభినందనలు సర్
మీ కవిత్వ ప్రయాణం ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న సర్
అభినందనలు
ఒక మంచి మనిషి గురించి తెలుసుకున్న
school days lo nenu enthagano edhurichusedhi me period kosame sir..Meru prathi roju edho oka katha cheppanidhe class start chesevaru kadhu madyalo oka joke cheppevaru,natakalu veyinchevaru,Alane maku teliyakundane chadhivinchevaru..15 years tarvatha kuda meru students ki ilane kathalu chepthunnarani chala happy ga undhi sir
Tqq