వియత్నాంలో తప్పిపోయిన అమెరికన్ సైనికులు

హనోయి నగరానికి 73 మైళ్లు దక్షిణాన
వాళ్లతణ్ణి గుర్తించారు
యుద్ధంలో తప్పిపోయిన వ్యక్తి ఆనవాళ్లు
ఆ ఉష్ణమండల వాతావరణంలో
యాబై ఏళ్ల తర్వాత
దొరుకుతాయనుకోవడమే అత్యాశ
కాని ఒకానొక చేపల చెరువు అట్టడుగున
వాళ్లతణ్ని వెతికిపట్టుకున్నారు
నిజం చెప్పాలంటే వాళ్లు
గుర్తించింది పెద్దగా ఏమీ లేదు
ఒక వివాహ ఉంగరం తప్ప.

ఐర్లాండ్ కవిమిత్రుడు గాబ్రియెల్ రోజెన్‌స్టాక్ కొన్నాళ్ల కింద నాకు తాను రాసిన ‘తప్పిపోయిన సైనికుడు’ అనే ఈ కవిత ఐరిష్ మూలమూ ఇంగ్లిష్ అనువాదమూ పంపాడు. అది అమెరికన్ వెబ్ పత్రిక కౌంటర్‌పంచ్ లో మార్క్ ఆష్విల్ రాసిన వ్యాసానికి స్పందనగా రాశానని చెప్పాడు. ఆ కవితా, ఆ వ్యాసమూ, అసలు వాటికి పునాది అయిన చారిత్రక సందర్భమూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవలసినవి.

పదిహేను సంవత్సరాలకు పైగా వియత్నాంలో పనిచేస్తున్న అంతర్జాతీయ ప్రచారకుడు, వెటరన్స్ ఫర్ పీస్ కార్యకర్త మార్క్ ఆష్విల్, మే 21న ప్రత్యామ్నాయ వెబ్ పత్రిక కౌంటర్‌పంచ్ లో రాసిన వ్యాసం అది. Of Class Rings, Bone Fragments and Fish Ponds: the Interminable Search for US MIAs in Vietnam (పట్టా సాధించిన రోజటి ఉంగరాలు, ఎముకల అవశేషాలు, చేపల చెరువులు: వియత్నాంలో తప్పిపోయిన అమెరికన్ సైనికుల కోసం ఎడతెగని వెతుకులాట) అనే ఆ వ్యాసం అంతర్జాతీయ రాజకీయాలలోని దుర్మార్గాలను బైటపెడుతుంది. అమెరికన్ పాలకుల యుద్ధోన్మాదం ఫలితంగా ధ్వంసమైపోయిన వేలాది సాధారణ అమెరికన్ యువకుల జీవితాలను గురించి చెపుతుంది. అమెరికన్ పాలకుల జోక్యంతో వియత్నాంలో జరిగిన యుద్ధ బీభత్సం గురించీ, అమెరికన్ సైన్యాలు పొట్టన పెట్టుకున్న లక్షలాది వియత్నామీయుల గురించీ చెపుతుంది. సామ్రాజ్యవాదం ఉద్దేశపూర్వకంగా కల్పించిన ఒక మహా మానవ విషాదాన్ని మన కళ్ల ముందుంచుతుంది.

ఆష్విల్ వ్యాసం నాటకీయంగా శాన్ డియాగో యూనియన్ ట్రిబ్యూన్ పత్రికలో 2017లో వచ్చిన ఒక కథనంతో ప్రారంభమైంది: “రెండు అమెరికన్ నౌకాదళ విమానాలు ఉత్తర వియత్నాం లోని డాంగ్ ఫోంగ్ తుఓంగ్ వంతెన మీదికి దూసుకు వచ్చాయి. అది జూన్ 1965. దట్టమైన మేఘాల వల్ల ఆ విమానాలు పూర్తిగా కిందికి, దాదాపు నేల దగ్గరికి దిగవలసి వచ్చింది. అందుకోసమే నేల మీద వేచి చూస్తున్న శత్రువుల నుంచి ఉధృతంగా కాల్పులు జరిగాయి. శాన్ డియాగో కు చెందిన లెఫ్టినెంట్ కమాండర్ క్రాస్బీ నడుపుతున్న విమానానికి నిప్పంటుకుంది. ఆ విమానం అక్కడి చేపల చెరువులో కూలిపోయింది. ఆ ఆర్ ఎఫ్ – 8ఎ నిఘా విమానం నీటినీ, బురదనూ ఎగజిమ్ముతూ మునిగిపోయింది” అని ఆ కథనం మొదలయింది.

అలా 1965లో చేపల చెరువులో కూలిపోయిన విమానంలో చనిపోయిన ఫ్రెడరిక్ క్రాస్బీ అవశేషాలను యాబై రెండు సంవత్సరాల తర్వాత గుర్తించారనే వార్తాకథనం అది. వియత్నాం ఉత్తర ప్రాంతంలోని హనోయికి దక్షిణంగా 73 మైళ్ల దూరంలోని ఒక చేపల చెరువులో ఆ అవశేషాలను వెతికి పట్టుకున్నారు. అయితే అవి మృతదేహపు పూర్తి అవశేషాలేమీ కావు. ఆ ఉష్ణమండల వాతావరణమూ, అక్కడి ఆమ్లాలు నిండిన నేలా కలిసి క్రాస్బీ మృతదేహాన్ని తినేశాయి. యాబై ఏళ్లు గడిచింది గనుక మిగిలినవీ దొరికినవీ క్రాస్బీ వేలికి ఉండిన వివాహ ఉంగరం, బహుశా జేబులో ఉండిన లైటర్, కొన్ని యూనిఫారం ముక్కలు, కొన్ని ఎముకల ముక్కలు మాత్రమే.

అయితే, ఆ పత్రిక కథనంలో రాసినట్టు క్రాస్బీని కూల్చిన “శత్రువులు” ఎవరు? ఎవరికి శత్రువులు? అసలు క్రాస్బీ తన స్వస్థలం శాన్ డియాగో నుంచి ఎనిమిది వేల మైళ్ల, ఇరవై గంటల విమానప్రయాణపు దూరంలోని వియత్నాంకు, హనోయికి ఎందుకు వెళ్లవలసి వచ్చింది? అలా 1965లో కూలిపోయిన విమానాన్నీ, అందులో మరణించిన వ్యక్తి మృతదేహపు ఆనవాళ్లనూ ఇప్పుడు గుర్తించే ప్రయత్నం ఏమిటి?

ఆ విమానాన్ని కూల్చేసింది “శత్రువులు” కాదు, కచ్చితంగా వాళ్లు ఫ్రెడరిక్ క్రాస్బీకి శత్రువులు కారు. వాళ్లు తమ నేల మీదినుంచి దురాక్రమణదారులను వెళ్లగొట్టడానికి పోరాడుతున్న వియత్నాం జాతి విముక్తిపోరాట యోధులు. క్రాస్బీ తన వంటి వేలాది సైనికుల లాగానే కేవలం ఉద్యోగధర్మంగా ఆ విమానంలో వెళ్లాడేమో గాని, పాలకుల దుర్మార్గ దురాక్రమణ వ్యూహంలో పావుగా, వియత్నాం ప్రజలకు నిజమైన శత్రువుగా ఆ విమానాన్ని నడిపాడు. అసలు అమెరికన్ పాలకవర్గాలు మొత్తం ప్రపంచానికే శత్రువులని నిరూపిస్తూ బ్రిటిష్ పత్రికా రచయిత ఫెలిక్స్ గ్రీన్ ది ఎనెమీ – శత్రువు – అని పుస్తకమే రాశాడు.

ఫ్రెంచ్, జపనీస్ వలసవాదుల మీద పోరాడి, స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసుకున్న వియత్నాంను దెబ్బతీయడానికి ఫ్రెంచ్ పాలకులు తమ కీలుబొమ్మలతో దక్షిణ వియత్నాం స్థాపించారు. ఉత్తర, దక్షిణ వియత్నాంల ఏకీకరణ కోసం ప్రయత్నిస్తున్న హోచిమిన్ నాయకత్వం విజయం సాధిస్తే ఏర్పడే ఐక్య వియత్నాం మొత్తం ఆగ్నేయాసియా లోనే కమ్యూనిజానికి పాదు అవుతుందని ఫ్రెంచ్ పాలకుల కన్నా ఎక్కువ అమెరికన్ పాలకులు భయపడ్డారు. ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగా 1953-54 నుంచే వియత్నాం లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. ఇటు సామ్రాజ్యవాదుల కీలుబొమ్మ ప్రభుత్వం ఉన్న దక్షిణ వియత్నాంలో నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ నాయకత్వాన జాతీయ విముక్తి పోరాటం, అటు ఉత్తర వియత్నాం ప్రజా ప్రభుత్వం వైపు నుంచి దక్షిణ వియత్నాం మీద యుద్ధం, క్రమక్రమంగా వియట్కాంగ్ ల విజయాలు, అతి త్వరలో ఐక్య వియత్నాం ఏర్పడుతుందనే అవకాశాలు – అమెరికా పాలకుల వెన్నులో చలిపుట్టించాయి.

చివరికి 1960ల తొలిరోజుల నుంచే, కెనెడీ అధ్యక్ష పాలనా కాలం నుంచే దక్షిణ వియత్నాంలో అమెరికా సైనిక బలగాలు తిష్ట వేయడం ప్రారంభించాయి. ఉత్తర వియత్నాం మీద సైనిక దాడులు, వ్యతిరేక కుట్రలు మొదలయ్యాయి. కెనెడీ హత్య తర్వాత అధ్యక్ష స్థానానికి వచ్చిన లిండన్ జాన్సన్, రక్షణ శాఖ మంత్రి రాబర్ట్ మెక్ నమారాలు 1964-65ల్లో ఉత్తర వియత్నాం మీద పూర్తి స్థాయి యుద్ధానికే దిగారు. లక్షలాది మంది యువకులను సైన్యంలో చేర్చుకుని వియత్నాం మీద యుద్ధానికి బలి పశువుల్లా పంపడం, వియత్నాం మీద విచ్చలవిడి బాంబుదాడులు, విమానాల నుంచి బాంబులు, విష రసాయనాలు వెదజల్లడం, నదుల్లో, చెరువుల్లో విష పదార్థాలు కలపడం, వియత్నాం సైనికులను, సాధారణ ప్రజలను ఊచకోత కోయడం – తనకు ఏ సంబంధమూ లేని భూభాగం మీద అమెరికా సైన్యాలు అత్యంత దుర్మార్గమైన బీభత్సకాండ కొనసాగించాయి. పారిస్ శాంతి ఒప్పందాల ఫలితంగా 1973 నుంచి తన సైన్యాలను వియత్నాం నుంచి ఉపసంహరించడానికి అమెరికా అంగీకరించింది. 1975 నాటికి ఆ ఉపసంహరణ పూర్తయింది.

ఆ ఎనిమిది సంవత్సరాల యుద్ధంలో అమెరికా ప్రభుత్వం వియత్నాం యుద్ధం మీద పెట్టిన ఖర్చు 12000 కోట్ల డాలర్లు. ఆ యుద్ధంలో అమెరికా ముప్పై ఎనిమిది లక్షల మంది వియత్నాం పౌరులను చంపివేసింది. అందులో నూటికి తొంబై మంది సాధారణ, అమాయక ప్రజలు. యుద్ధంతో ఏ సంబంధమూ లేనివారు. ఆ యుద్ధంలో ముప్పై లక్షల మంది వియత్నాం పౌరులు క్షతగాత్రులయ్యారు. ఒక కోటీ ఇరవై లక్షల మంది వియత్నమీయులు శరణార్థులయ్యారు. వియత్నాంలో రోడ్లు, భవనాలు, మౌలిక సాధన సంపత్తి ధ్వంసమైపోయాయి. లక్షల గాలన్ల ఏజెంట్ ఆరెంజ్ వంటి విషరసాయనాలు చల్లినందువల్ల పొలాలు, నదులు, జలాశయాలు విషపూరితమయ్యాయి. పర్యావరణం ధ్వంసమయింది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అప్పుడు పేలని బాంబులు, పేలుడు పదార్థాలు ఈ ఐదు దశాబ్దాలుగా, ఇప్పటికీ పేలుతూ, వియత్నాం పౌరులను చంపుతున్నాయి, గాయపరుస్తున్నాయి.

మరొక వైపు ఆ యుద్ధం అమెరికా ప్రభుత్వానికి మితిమీరిన యుద్ధ వ్యయాన్ని మాత్రమే గాక అనేక అవమానాలను కూడ ఇచ్చింది. అప్పటి దాకా అప్రతిహత శక్తిగా, విజేతగా, ప్రపంచ పోలీసుగా అన్ని దేశాల మీద ఆధిపత్యం చలాయిస్తున్న అమెరికా సైన్యం ఓటమికి గురై, చావుతప్పి కన్ను లొట్టపోయి వెనక్కి తిరిగి రావలసి వచ్చింది. వియత్నాంలో అమెరికన్ సైనికులు అరవై వేల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 1982లో వాషింగ్టన్ డిసి లో నిర్మించిన వియత్నాం వెటరన్స్ మెమోరియల్ 57,939 పేర్లు నమోదు చేసింది. తర్వాత జరిగిన మార్పు చేర్పుల్లో ఆ సంఖ్యను 58,200గా సవరించారు. అమెరికా చేస్తున్న అక్రమమైన వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచ ప్రజాభిప్రాయం వెల్లువెత్తింది. ‘తుమారా నామ్, హమారా నామ్, సబ్ కా నామ్ వియత్నాం’ అనే నినాదం చెలరేగింది. అమెరికా లోపల కూడా వియత్నాం యుద్ధ వ్యతిరేకత విస్తృతంగా అనేక వ్యక్తీకరణలు పొందింది. యుద్ధ వ్యతిరేక ఉద్యమంలో అమెరికాలోని అత్యంత గౌరవనీయ మేధావుల నుంచి సాధారణ ప్రజల దాకా లక్షలాది మంది పాల్గొన్నారు. తమ కుటుంబ సభ్యుల అనవసర మరణాలకు కారణమవుతున్న ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని అమెరికన్ ప్రజలు నిరసించారు. ఐదు లక్షల మంది యువకులు బలవంతపు సైనికీకరణను ప్రతిఘటించారు. యుద్ధాన్ని ఉపసంహరించిన తర్వాత కూడా తిరిగి వచ్చిన సైనికుల పట్ల అమెరికన్ సమాజంలో వ్యతిరేకతే వ్యక్తమయింది. యుద్ధ వ్యతిరేకులైతే అమాయకులను చంపినందుకు ఆ సైనికులను వ్యతిరేకించారు. యుద్ధ అనుకూలురైతే ఓడిపోయి వచ్చినందుకు ఆ సైనికులను అవమానించారు.

ఆ యుద్ధ బీభత్సం అంతా అలా ఉండగా వియత్నాంలో యుద్ధ సమయంలో తప్పిపోయిన అమెరికన్ సైనికుల విషాద గాథ మరొక ఎత్తు. వారిలో ఎక్కువమంది నవయువకులు. అతి కొద్ది మంది అమెరికన్ జాత్యహంకారంతో వియత్నాం యుద్ధంలో పాల్గొనవలసిందే అని అది పవిత్ర కర్తవ్యంగా భావించి వెళ్లారేమో గాని, అత్యధికులు నిర్బంధ సైనిక నియామకాల్లో చేరక తప్పలేదు. ఎంతమంది తప్పించుకున్నా, ఎన్ని నిరసన ప్రదర్శనలు చెలరేగినా ప్రభుత్వం ఆ ఎనిమిదేళ్లూ నిరంతరం కొత్త సైనికులను నియమిస్తూ, వియత్నాం పంపుతూ వచ్చింది. వాళ్లు మిగిలిన అందరు యువకుల లాగే ఏదో ఉద్యోగం వెతుకులాటలోనో, పెద్ద చదువుల కోసం అన్వేషణలోనో ఉండి ఉంటారు. కచ్చితంగా ప్రేమలో పడి ఉంటారు. రేపో ఎల్లుండో కుటుంబం ప్రారంభించాలని కలలు కంటూ ఉండి ఉంటారు. ప్రభుత్వం వాళ్లందరినీ తమది కాని యుద్ధం, తమకు ఎందుకూ పనికిరాని యుద్ధం చేయడానికి ఆయుధాలు ఇచ్చి వేలాది మైళ్ల అవతలికి పంపింది. అలా బలవంతాన పంపబడినవారిలో 58,200 మంది తిరిగిరాలేదు. కొందరు యుద్ధ సైనికులుగా ప్రత్యర్థులకు పట్టుబడి సజీవంగా ఉన్నారేమో గాని కొందరు మాత్రం కచ్చితంగా మరణించి ఉంటారు.

అయితే ఇటు అమెరికా వైపు యాబై ఎనిమిది వేల మంది ప్రాణాలు పోయాయేమో గాని అటువైపు ఆ యుద్ధం 38 లక్షల మంది వియత్నమీయులను బలి తీసుకుంది. అందులో తప్పిపోయిన వారి సంఖ్య మూడు లక్షలు. అంటే ఉత్తి లెక్కలే చెప్పాలంటే ఒక్కొక్క తప్పిపోయిన అమెరికన్ సైనికుడికి 776 మంది వియత్నాం సైనికులు కూడా కాదు, ప్రజలు ఉన్నారన్నమాట.

ఈ తప్పిపోయిన సైనికుల గురించి వెతుకుతారా, కనీసం వారి మృతదేహాలు ఎక్కడ పడిపోయాయో, వాటి ఆనవాళ్లైనా దొరుకుతాయో చెపుతారా, వారికి కుటుంబాలు గౌరవనీయమైన వీడ్కోలు చెప్పే అవకాశం కల్పిస్తారా అని అమెరికన్ సమాజంలో చర్చ జరిగింది. ఎన్నో పుస్తకాలు, సినిమాలు కూడ వచ్చాయి. ప్రభుత్వం అధికారికంగా యుద్ధఖైదీల, తప్పిపోయిన సైనికుల దినం అని ఒక రోజును కేటాయించవలసి వచ్చింది. సమయం గడుస్తుంటే ఆ ఆన్వేషణ కష్టతరమవుతుందనేది కూడా అందరికీ తెలిసిన విషయమే.

ఇక ఏటా 100 మిలియన్ డాలర్లకు మించిన బడ్జెట్ కేటాయింపులతో ఆ వెతుకులాట ప్రారంభమయింది. ఒక ప్రత్యేక ప్రభుత్వ విభాగమే ఏర్పడింది. ఒక్క వియత్నాంలో మాత్రమే కాదు, కంబోడియాలో, లావోస్ లో, మొత్తంగా ఆగ్నేయాసియా అంతటా తప్పిపోయిన అమెరికన్ యువ సైనికుల మృతదేహాల ఆనవాళ్లు ఉండే అవకాశం ఉంది. చివరికి మొత్తంగా మరణించారని భావిస్తున్న 58,200 ల మందిలో 470 మంది ఆచూకీ ఎప్పటికీ దొరకదు అని తేల్చివేశారు. మిగిలినవారి ఆనవాళ్ల కోసమైనా వెతకడం అనేది తీవ్రమైన రాజకీయ చర్చనీయాంశం అయింది. రెండు దేశాల మధ్య దౌత్య చర్చలలో అది ఒక ప్రధానాంశం అయింది. క్లింటన్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 1995లో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడినప్పుడు, అంటే తప్పిపోయిన రెండు, మూడు దశాబ్దాల తర్వాత అమెరికన్ సైనికుల వెతుకులాటకు అధికారిక ఆమోదం లభించింది. తమ దేశం విముక్తి కావాలనీ, పరాధీనంగా ఉండగూడదనీ దురాక్రమణదారుల మీద న్యాయమైన పోరాటానికి దిగి, ప్రాణాలు పోగొట్టుకున్న వియత్నాం మృతవీరుల కోసం వెతికే ఆర్థిక వనరులూ లేవు, అవకాశాలూ లేవు. కాని అమెరికా ప్రభుత్వం మాత్రం ఆంథ్రపాలజిస్టులు, వైద్యులు, తవ్వకాల నిపుణులు వంటి అనేక మందితో కూడిన అన్వేషణా బృందాలు ఏర్పాటు చేసింది. ఆ వెతుకులాటకు తప్పనిసరిగా స్థానికుల సహాయం అవసరం గనుక ఈ అన్వేషణా ప్రయత్నం వియత్నాంలో వేలాది ఉద్యోగాలు కూడ సృష్టించింది. తమను చంపడానికీ, తమ పొలాల్లో, జలాశయాల్లో, నదుల్లో విషం చల్లడానికీ, తమ దేశాన్ని పరాధీనం చేయడానికీ వచ్చిన శత్రువుల మృతదేహాల ఆచూకీ కనిపెట్టే మహా ప్రయత్నంలో ఇవాళ వియత్నమీయులు ఆ శత్రువుకే సహకరించవలసిన విచిత్రస్థితి తలెత్తింది.

ఈ తప్పిపోయిన సైనికుల మృతదేహాల అన్వేషణా కార్యక్రమానికి 2021 ఆర్థిక సంవత్సరంలో కేటాయించినది 13000 కోట్ల డాలర్లు. ఈ భారీ బడ్జెట్లు చాలవన్నట్టుగా ప్రభుత్వ-ప్రైవేట్ సహకార ప్రయత్నాలు, ప్రజల నుంచి విరాళాలు సేకరించడం కూడా జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ పనిలో 700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొన్ని వేల మంది స్థానికుల సహాయం తీసుకుంటున్నారు. 2016 నుంచి ఇప్పటి వరకే చూస్తే ప్రతి ఏటా దాదాపు రెండు వందల మృతదేహాల ఆనవాళ్లు వెతికి తీస్తున్నారు. ఈ ఆరు సంవత్సరాల్లో మొత్తం 1167 మంది తప్పిపోయిన సైనికుల మృతదేహాల ఆనవాళ్లు దొరికాయి. ఇంకా కనీసం 776 మృతదేహాల ఆచూకీ తెలియవలసి ఉందని అంటున్నారు.

అలా దొరికిన ఆనవాళ్లు తప్పిపోయిన అమెరికన్ సైనికులవే అని ప్రాథమిక నమ్మకం కలిగితే వాటిని ఈ తప్పిపోయిన సైనికుల అన్వేషణా శాఖకు హవాయిలో ఉన్న ప్రయోగశాలకు పంపుతారు. అక్కడ ఫోరెన్సిక్ నిపుణులు, ఇతర నిపుణులు ఆ ఆనవాళ్ల అంతిమ పరిశీలన చేస్తారు. డి ఎన్ ఎ విశ్లేషణ, ధ్రువీకరణల ద్వారా కచ్చితంగా ఆ మృతదేహపు అవశేషాల ఆనవాళ్లు ఫలానా సైనికుడివే అని తేలితే ఆ అవశేషాలను ఆ కుటుంబానికి అందజేస్తారు.

అసలు మొట్టమొదట ఆ యుద్ధంలోనూ, ప్రపంచవ్యాప్తంగా మరెన్నో యుద్ధాలలోనూ అనవసరంగా, అన్యాయంగా జోక్యం చేసుకోకపోయి ఉంటే ఈ వేలాది మంది అమెరికన్ సైనికుల మరణాలూ ఉండేవి కావు, వందలాది మంది పేర్లు “తప్పిపోయిన సైనికులు” జాబితాలోకీ ఎక్కేవీ కావు. ఇప్పుడు అమెరికన్ పౌరులు కట్టిన పన్నులలోంచి ఏటా పన్నెండు, పదమూడు వేల కోట్ల డాలర్లు వెతుకులాట కోసం ఖర్చు పెట్టవలసిన అవసరమూ ఏర్పడేది కాదు. ఇక ఆ అమెరికన్ యుద్ధోన్మాదానికి గురైన ఆయా బాధిత దేశాల ప్రభుత్వాలూ సమాజాలూ చెల్లించిన మూల్యానికైతే లెక్కే లేదు. వియత్నాం యుద్ధంలో అమెరికన్ సాధారణ ప్రజానీకం, వేలాది కుటుంబాలు ఎవరో ఒక కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న విషాదాన్ని అనుభవిస్తుండగానే, అమెరికన్ పాలకులు, వాళ్లు డెమొక్రట్లయినా, రిపబ్లికన్లయినా ఆ తర్వాతి నలబై ఐదు ఏళ్లలో కూడ అంతే ఉత్సాహంతో, ఉన్మాదంతో మళ్లీ మళ్లీ యువకులను ఎంపికచేసి, సైనికులుగా నియమించి, గ్రెనడా, పనామా, అప్ఘనిస్తాన్, ఇరాక్, బోస్నియా, సిరియా… ఎక్కడికి పడితే అక్కడికి పంపుతూనే ఉన్నారు. మళ్లీ మళ్లీ మరణాలూ, తప్పిపోవడాలూ సంభవిస్తూనే ఉన్నాయి.

ఎవరి యుద్ధమిది? ఎందుకోసమిది? మూల్యం చెల్లిస్తున్నదెవరు?

పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు.
ర‌చ‌న‌లు: 'స‌మాచార సామ్రాజ్య‌వాదం', 'క‌ల్లోల కాలంలో మేధావులు - బాల‌గోపాల్ ఉదాహ‌ర‌ణ‌', 'అమ్మ‌కానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌', 'క‌థా సంద‌ర్భం', 'క‌డ‌లి త‌ర‌గ‌', 'పావురం', తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛిన‌మ‌వుతున్న వ్య‌క్తిత్వం, 'పోస్ట్‌మాడ‌ర్నిజం', 'న‌వ‌లా స‌మ‌యం', 'రాబందు నీడ‌', 'క‌ళ్ల‌ముంద‌టి చ‌రిత్ర‌', 'ప‌రిచ‌యాలు', 'తెలంగాణ‌ - స‌మైక్యాంధ్ర భ్ర‌మ‌లు, అబ‌ద్ధాలు, వాస్త‌వాలు', 'శ్రీశ్రీ అన్వేష‌ణ‌', 'లేచి నిలిచిన తెలంగాణ‌', 'ప్ర‌తి అక్ష‌రం ప్ర‌జాద్రోహం - శ్రీకృష్ణ క‌మిటీ నివేదిక‌', 'రాబందు వాలిన నేల‌', 'ఊరి దారి- గ్రామ అధ్య‌య‌న ప‌రిచ‌యం', 'విద్వేష‌మే ధ్యేయంగా విశాలాంధ్ర మ‌హార‌భ‌స‌', 'క‌విత్వంతో ములాఖాత్‌', 'సమాజ చలనపు సవ్వడి', 'కాషాయ సారం', 'విద్వేషాపు విశ్వగురు', 20కి పైగా అనువాదాలు.
సంపాద‌క‌త్వం: 'Fifty Years of Andhrapradesh 1956-2006', 'Telangana, The State of Affairs', '24గంట‌లు', 'హైద‌రాబాద్ స్వాతంత్య్ర సంరంభం', 'జ‌న హృద‌యం జ‌నార్ద‌న్‌', 'స‌మ‌గ్ర తెలంగాణ' పుస్త‌కాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

One thought on “వియత్నాంలో తప్పిపోయిన అమెరికన్ సైనికులు

Leave a Reply