విస్మయానికి గురిచేసే ‘బ్లాక్ గర్ల్’

“ఏ మనిషినైనా హీనమైన సామాజిక స్థాయిలో ఉంచడం వల్ల, అది తీవ్రమైన మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. ఆ పరిస్థితి మనస్సు, శరీరం రెండింటినీ న్యూనతా భావానికి గురిచేస్తుంది. జాత్యహంకారులు, వలస పాలనలో ఉన్న ప్రజలను, వారు మనుషులలోని అధమస్థాయికి చెందినవారుగా తమను తాము భావించుకునేలా చేస్తుంది” – ఫ్రాంజ్ ఫానన్

‘బ్లాక్ గర్ల్’ అనే ఆఫ్రికన్ సినిమా సెనెగల్ నుండి 1966లో సెనెగల్ – ఫ్రాన్స్ సంయుక్త నిర్మాణంలో వచ్చింది. ఈ చిత్రానికి ఆఫ్రికన్ సినిమా రంగంలో అత్యంత గౌరవనీయమైన, ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరైన ఉస్మాన్ సెంబెన్ రచించి, దర్శకత్వం వహించారు. దీని అసలు శీర్షిక ఫ్రెంచ్ భాషలో “లా నోయిర్ డి.” నలుపు తెలుపులలో వచ్చిన ఈ సినిమా నిడివి 65 నిమిషాలు.

ఇతివృత్తం : వలస పాలన అనంతర కాలంలో జరిగిన ఈ చిత్ర కథలో, ఒక శ్వేతజాతి దంపతులు తమ పిల్లలకు ఆయాగా పని చేయడానికి కావాలని చెప్పి డియోవానా (Diouana)అనే నల్లజాతి యువతిని సెనెగల్ లోని డాకర్ నగరం నుండి ఫ్రాన్స్ లోని యాంటిబ్స్(Antibes)నగరానికి తీసుకు వస్తారు. పిల్లల పని చేసుకుంటూ ఫ్రాన్స్ నగరాన్ని చూడవచ్చని, నాగరికమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని ఎన్నో కలలతో వచ్చిన డియోవానా ప్రపంచం తలకిందులవుతుంది. ఈ కథానాయికకు ఎదురయ్యే కఠినమైన సవాళ్ళను దృశ్యీకరించడం ద్వారా వలసవాదపు అమానవీయతను అద్భుతంగా ఆవిష్కరిస్తుందీ చిత్రం.

కథ గురించి చెప్పాలంటే, రోజు కూలి కోసం మన అడ్డాల దగ్గర వేచి ఉన్నట్లే ఆఫ్రికన్ స్త్రీలు ఒకచోట చేరి ఎవరు పనికి పిలుస్తారా అని నిరీక్షిస్తుంటారు. ఇంతలో ఒక శ్వేత జాతి మహిళ వస్తుంది. మహిళలందరూ “మేడం, నేను పనికి వస్తానంటే నేను వస్తానం”టూ ఆమె చుట్టూ గుమి గూడతారు. డియోవానా మాత్రం దూరంగా ఉండి వాళ్ళని గమనిస్తూ ఉంటుంది. డియోవానా లోని ‘స్వతంత్ర భావన’, ‘అవసరానికి తలొగ్గని’ తత్వం, ఆత్మవిశ్వాసం ఆమెను ఆకర్షిస్తాయి. ఆ ఫ్రెంచ్ మహిళ, డియోవానా దగ్గరకు వచ్చి పిల్లలకు నర్సుగా పనిచేయాలని చెప్పి ఆమెని ఎంచుకుంటుంది. డియోవానా వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి, ఎంతో సంతోషంగా గంతులు వేస్తూ, నాకు పని దొరికిందని చెప్తుంది. అలా ఆమె డాకర్ నుంచి యాంటిబ్స్ నగరానికి ఒక నౌకలో ప్రయాణించి రావడం, యజమాని వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్ళడం చూస్తాం. మొదట్లో అంతా ఆశాజనకం గానే ఉంటుంది. ఆ ఇంటి యజమానురాలు ముందు చాలా దయగానే ఉంటుంది. ఆమె డియోవానాకి పాత బట్టలు, షూస్ కూడా ఇస్తుంది. అంతేగాక ఫ్రాన్స్ విహారానికి కూడా తీసుకెళ్తానని వాగ్ధానం చేస్తుంది. ఫ్రాన్స్ ను చూడాలనే తపనతో ఉన్న డియోవానా వెంటనే నమ్మేస్తుంది. ఆమె దృష్టిలో ఫ్రాన్స్ నగరం మెరుగైన జీవితానికీ, నాగరిక జీవన విధానానికీ ఒక ప్రతీక!

దయ క్రమంగా క్రూరత్వంగా మారిపోతుంది. డియోవానాను ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్న ఆ యజమానురాలు క్రమంగా నిర్దయగా, కఠినంగా, పెత్తనం చెలాయించడం మొదలుపెడుతుంది. ఆ దంపతులు నెమ్మదిగా డియోవానాని నానీగా కాకుండా, పూర్తికాలపు పనిమనిషిగా ఉపయోగించుకోవడం ప్రారంభిస్తారు. “మేడమ్” ఆమెను పని ముగిసిన తర్వాత కూడా, తిరిగి పనికి వెళ్ళమని అరుస్తూ ఆజ్ఞాపిస్తుంది. వాళ్ళు మేల్కొని ఉన్నప్పుడు ఆమెను నిద్రపోనివ్వదు. వారి సంబంధం పూర్తిగా మారిపోతుంది. మేడమ్ నిరంతరం నిందిస్తున్నాసరే, ఇంతకుముందు పని కోసం డాకర్ లో ఒకచోట ఎదురు చూడడం, మాతృభూమిని వదిలి, ఫ్రాన్స్ కి వెళ్ళాలనే సాహసోపేతమైన నిర్ణయం తానే తీసుకోవడం, తన యాజమానిపై ఆధారపడి ఉండడం మొదలైన పరిస్థితులు ఆమెను బంధించి, తప్పించుకోలేని ఒక ఉచ్చును సృష్టించడం వల్ల ఏమీ చేయలేక నిస్సహాయంగా భరిస్తుంది! పాశ్చాత్య జీవన విధానం ఆకర్షణకు భ్రమలకు లోనైన డియోవానాకు, త్వరలోనే ఆ వాగ్దానాలు డొల్ల అని తెలిసొస్తుంది.

ఈ పరిస్థితుల్లో డియోవానా తల్లి నుంచి ఒక ఉత్తరం వస్తుంది. అందులో తాను అనారోగ్యంతో ఉన్నాననీ, అతి కష్టం మీద ఆమె చిరునామా కనుక్కున్నాననీ, డియోవానా నుండి ఎటువంటి సమాచారమైనా ఎందుకు లేదని, ఇంటికి డబ్బు ఎందుకు పంపడం లేదని కూడా అడుగుతుంది. డియోవానాకు చదవడం రాదు కాబట్టి, యాజమానే దాన్ని చదివి ఆమెకు వినిపిస్తాడు. ఆ తర్వాత తన భార్య కఠిన ప్రవర్తన గురించి ఏమీ తెలియనట్లే, ఇంటికి ఏమి రాయాలనుకుంటున్నావని అడుగుతాడు. ఏమి చెప్తుంది? నిజానికి పాపం డియోవానా తన మనసులో సుళ్ళు తిరిగే వాస్తవ భావాలను ఆ యజమానికి ఎలా చెప్పగలుగుతుంది? డియోవానా ఆ ఉత్తరాన్ని చించేస్తుంది. ఈ సన్నివేశం డియోవానా పరిస్థితిలోని పూర్తి నిస్సహాయతను ప్రేక్షకులకు చూపిస్తుంది.

ఆమె ఎంత కష్టపడినా, పని చేయకపోతే ఆహారం కూడా ఉండదని మేడమ్ చెప్పడంతో, మాన్సియర్ ఆమె జీతం చెల్లించడానికి ప్రయత్నించినప్పుడు డయోవానా బాధతో ఆ డబ్బు తీసుకోవడానికి నిరాకరిస్తుంది. ఆమె తన సొంత కుటుంబంతో సంబంధాలు కూడా కోల్పోతుంది. తన బాధను చెప్పుకోవడానికి దేశం కాని దేశంలో ఎవరూ ఉండరు. డియోవానా తన స్వస్థలం డాకర్ నుండి వచ్చాక అంతులేని ఒంటరితనానికి తోడు లెక్కలేనన్ని క్రూరత్వాలు ఎదుర్కోవలసి రావడంతో ఆమె మానసికంగా కుంగిపోతుంది. చివరికి డియోవానా ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలనే ఉద్దేశ్యంతో తన బట్టలు కూడా సర్దుకుంటుంది. ఆరాత్రి తన గత జీవితాన్నీ, అందమైన దుస్తుల్లో స్నేహితురాలితోనూ, తన ప్రియుడితోనూ నడవడం, స్వేఛ్చగా జీవించడం మొదలైన విషయాల్ని గుర్తు చేసుకుంటుంది. చివరికి అంతులేని విరక్తితో తన గది లోని బాత్ టబ్ లో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది.

మాన్సియర్ తన మనస్సాక్షిని చంపుకోలేక సూట్‌కేస్, మాస్క్, జీతం డబ్బును డియోవానా కుటుంబానికి తిరిగి ఇవ్వడానికి డాకర్ నగరానికి వస్తాడు. డయోవానా తల్లికి సూట్ కేస్ తో పాటు డబ్బు అందివ్వబోతాడు. కానీ ఆమె నిరాకరిస్తుంది. చేసేదిలేక మాన్సియర్ గ్రామం విడిచి వెళుతుండగా, మాస్క్ ధరించిన బాలుడు అతన్ని వెంబడిస్తుండడంతో సినిమా భారంగా ముగుస్తుంది.

ఉస్మాన్ సెంబెన్ భావయుక్తమైన ఆఫ్రికన్ కథన శైలి
ఈ సినిమా కథను ఉస్మాన్ సెంబెన్ 1962 లో రచించిన “వోల్టైక్” సంకలనంలోని ఒక చిన్న కథ ఆధారంగా, నిజ జీవిత సంఘటన నుండి ప్రేరణ పొంది, రూపొందించాడు. రాజకీయ ఇతివృత్తాలతో కూడిన ఆయన సమగ్ర రచనలను గమనిస్తే, చలనచిత్ర రంగంలోకి రాకముందే ఆయన నవలా రచయితగానూ, కార్మిక సంఘ నాయకుడిగానూ మార్క్సిస్టు అవగాహనతో పనిచేశారని తెలుస్తుంది.

ఆఫ్రికా ఖండం బానిసత్వం – వలసవాద అనంతర పరిస్థితుల మధ్య సమ తుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆఫ్రికన్ కథలను చెప్పడంలో ఉస్మాన్ సెంబెన్ ఒక ప్రత్యేకమైన కథనాన్ని అనుసరించాడు. మేము కూడా గొప్ప కలలు కనగలమని, మమ్మల్ని ప్రేమించే కుటుంబాలు మాకు ఉన్నాయని, అలాగే మమ్మల్ని ఎప్పటికీ డబ్బుతో కొనలేరని చాటి చెప్పడానికి ఈ సినిమాని సరళంగా, శక్తిమంతంగా నిర్మించాడు. డియోవానా అనుభవం ద్వారా వలసవాద అధికార సంబంధాలు, ఆఫ్రికన్ శ్రామికుల దోపిడీ, అస్తిత్వం, స్థానచలనం, అలాగే విదేశాలలో “అద్భుతమైన జీవితం” అనే భ్రమలో ఉన్న తన సొంత ఆఫ్రికన్ ప్రజల బాలహీనతల్ని కూడా పరిశీలించి, చర్చకు పెడతాడు ఉస్మాన్ సెంబెన్.

యజమాని డబ్బు నోట్లను ఇచ్చినప్పుడు, వాటిని స్వీకరించకుండా, ఆయన కాళ్ళపై పడి వంచిన తల ఎత్తకుండా డియోవానా మౌనంగా రోదిస్తుంది. ఆ మౌనమే ప్రేక్షకులకు అన్నీ చెప్పేస్తుంది. అది అర్ధమై మన కళ్ళు పూడుకుపోతాయి! ఇది మాట్లాడలేని చోట వంద మాటల సందేశాన్ని ఉస్మాన్ సెంబేన అందించిన అద్భుతమైన విజువల్ సన్నివేశం.

ఆఫ్రికన్ ప్రజలపై, ఐరోపా శ్వేతాధిపత్య శక్తులు చేస్తున్న శ్రమ దోపిడీ ప్రభావాలను ఈ సినిమా చర్చిస్తుంది. డాకర్‌లోని ఒక ఇంట్లో పనిలో చేరిన మొదటి రోజున డియోవానా తన కమ్యూనిటీలోని బాలుడి నుండి ఒక మాస్క్‌ ని 50 గినియాలకు కొనుగోలు చేసి, తన ఫ్రెంచ్ యజమానులకు బహుకరించిన ఆఫ్రికన్ మాస్క్ పదేపదే చూపించడం ద్వారా ఈ ఇతివృత్తాలను హైలైట్ చేశాడు.

ఆఫ్రికన్లకు మాస్క్ తో ఒక ముఖ్యమైన సంబంధం ఉంటుంది. మరణించిన తమ పూర్వీకుల ఆత్మలు మాస్క్ ల ద్వారా తమను చూసుకుంటాయని, వాళ్ళ వారసులుగా తాము జీవిస్తున్నాం అని నమ్ముతారు. ఆ మాస్క్ కు వివిధ సందర్భాలలో అనేక అర్ధాలను స్ఫురింపజేసేలా చిత్రీకరించాడు ఉస్మాన్ సెంబెన్.
మొదట్లో డియోవానా యజమానులు డాకర్లో ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ఇతర కళాఖండాల మధ్య ఉంచుతారు. ఫ్రెంచ్ దంపతులు అపార్ట్‌ మెంట్‌లోకి మారినప్పుడు తెల్లని గోడపై దానిని ఒంటరిగా వేలాడదీశారు. ఇది డియోవానా పరిస్థితిని కూడా సూచిస్తుంది. వాళ్ళు డాకర్ లో ఇతర వస్తువులతో పాటు ఉంచినప్పుడు ఆమె తన స్వదేశంలో, తనకు తెలిసిన వ్యక్తులు, సుపరిచితమైన వాతావరణంలో ఉంటుంది. కానీ వారు ఫ్రాన్స్‌ కు వెళ్ళినప్పుడు, అక్కడ ఆమె శ్వేతజాతి ప్రజల మధ్య నల్లజాతి యువతి ఒంటరిగా చిక్కుబడి ఉన్నట్లే, ఆ మాస్క్ ఒక తెల్లని గోడపై నల్లగా ఉంటుంది. మాస్క్ – డియోవానా సమాంతరంగా ఉంటాయి.

మాస్క్ తో పాటు ఫ్రెంచ్ కుటుంబానికి డియోవానా కూడా అలాంటి ఒక అలంకరణ వస్తువు. వాళ్ళు “ప్రపంచం నలుమూలలా సందర్శించామ” నీ, “సంస్కారవంతులమ”నీ, చెప్పుకుంటూ తమ స్నేహితులను ఆకట్టుకోవడానికి ఆమె ఒక సాధనం! ఆమెను ఒక ఆహ్లాదకరమైన వస్తువుగా చూస్తూ ఎగతాళిగా నవ్వుతారు. ఇది చూసి కోపం రాకుండా ఉండాలంటే ఒకరాతి హృదయం కావాలి! ఆమెకు సహజమైన గౌరవం, ప్రేమ, శ్రద్ధకు అర్హురాలైన మనిషిగా చూడలేని సంకుచిత స్వభావాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు.

చివరి దృశ్యంలో, ఆఫ్రికన్ మాస్క్ ధరించిన ఒక బాలుడు యజమాని మాన్సియర్ ని ప్రతి చోటా వెంబడిస్తాడు. ఆఫ్రికా ఆత్మ అతన్ని సుఖంగా నిద్రపోనివ్వదని ప్రతీకాత్మకంగా సూచిస్తాడు దర్శకుడు. ఈ సన్నివేశం చాలా శక్తిమంతమైనది. అది పాశ్చాత్యుల పాశ్చాత్యుల అపరాధ భావనలా, చరిత్రలా, అణచి పెట్టినా అణగారనిదానిలా, పాతిపెట్టడానికి నిరాకరించే ఒక చిహ్నంగా, నిగూఢమైన ఆగ్రహానికి చోదకశక్తిగా మార్గనిర్దేశం చేయడం వల్ల ఉస్మాన్ సెంబెన్ “ఆఫ్రికన్ సినిమా పితామహుడు”గా చరిత్రలో ప్రసిద్ధి గాంచాడు.

ఆఫ్రికన్లు, జీవనోపాధి కోసం స్వదేశాన్ని వదిలి ఐరోపాకు వలస వెళ్ళడాన్ని ఆ మాస్క్ సూచిస్తుంది, కానీ పాశ్చాత్యులు వాగ్దానం చేసే చలనశీలతను ప్రశ్నిస్తాడు ఉస్మాన్ సెంబెన్. మాస్క్-ఆఫ్రికాల మధ్య మరొక సారూప్యత ఉంది. ఉదాహరణకు చివరి సన్నివేశంలో, మాస్క్ ధరించిన బాలుడు శ్వేతజాతి వ్యక్తిని అనుసరించినప్పుడు, అది దాని వలసవాదులను ఎల్లప్పుడూ వెంటాడే ఆఫ్రికా గతాన్ని సూచిస్తుంది, అంతే గాకుండా ఆఫ్రికా అనిశ్చిత భవిష్యత్తును కూడా సూచిస్తుంది! నిజానికి తమ స్వస్థలంలోనే ఆఫ్రికన్లు సంతోషంగా ఉండగలరు. కానీ వలసవాదులు వదిలి వెళ్ళాక వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వాళ్ళు తమ స్వేఛ్చను గుర్తించలేరు.

డియోవానా యజమానురాలికి ఇచ్చిన ముసుగును తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించగా, ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతుంది. ఫ్రాన్స్ తరపున మేడమ్, ఆఫ్రికా తరపున డియోవానా ఆ మాస్క్ కోసం పోటీ పడి, ఇద్దరూ చెరొకవైపున గుంజుకుంటారు. సాధారణంగా చెప్పాలంటే, ఐరోపా ఆఫ్రికా భూభాగాల మీద తన ఆధిపత్యం కోసం పోరాడింది. అయితే చివరికి 20వ శతాబ్దంలో ఆఫ్రికా భూభాగాలు స్వాతంత్ర్యం పొందాయి. ఆ పోరాటం ముగింపులో డియోవానా ఆ మాస్క్ ను దక్కించుకుంటుంది! డియోవానా ధిక్కార చర్యతో దక్కించుకున్న ఆ మాస్క్ ఆఫ్రికన్ హోదాకు చాలా ముఖ్యమైనదని కూడా ఈ సన్నివేశం సూచిస్తుంది.
మాస్క్ డియోవానా ఉనికిని కూడా సూచిస్తుంది. చనిపోయినవారి ఆత్మలు మాస్క్‌ ల రూపంలో నివసిస్తాయనీ, అవి జీవించి ఉన్నవారిలో భాగంగా ఉంటాయనీ ఆఫ్రికన్లు నమ్ముతారు. చివరిలో బాలుడితో కలిపి దృశ్యీకరించిన సన్నివేశం ఆఫ్రికన్ సినిమాలో క్లాసిక్‌గా, శక్తిమంతంగా గొప్ప సాక్ష్యంగా నిలిచిపోతుంది. డియోవానా చనిపోలేదు. ఆమె భవిష్యత్తులో ఒక భాగంగా పిల్లలద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ దృశ్యం “భవిష్యత్తు మిమ్మల్ని చూస్తోంది” జాగ్రత్త అనే సందేశమిస్తుంది!
మాస్క్ ఆఫ్రికన్లకు ఐక్యత, గుర్తింపు చిహ్నంగా ఉంటే, ఆఫ్రికన్లు కానివారికి అది ఇప్పుడు ఒక ‘సావనీర్’ మాత్రమే.

తాము ఈ సామ్రాజ్యంలో భాగమని చెబుతూ పెరిగినప్పటికీ, విచిత్రంగా వారిని ఆక్రమణదారులుగా చూసే అణచివేతదారులను అనుకరించాలనే అతని దేశస్థుల కోరికపై సూటిగా విమర్శలు సంధిస్తూ తన జీవితమంతా గడిపాడు ఉస్మాన్ సెంబెన్.

“నా సామాజిక కార్యకలాపాలకు చేసే కృషికి ఒక సమర్థవంతమైన సాధనంగా ఉంటుందని భావించి నేను సినిమా రంగాన్ని ఎంచుకున్నాను. కానీ నా వ్యక్తిగత అభిరుచి విషయానికొస్తే, సినిమా కంటే సాహిత్యానికే నేను ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను. నేటి ప్రస్తుత కాలంలో సాహిత్యం ఒక విలాసంగా మారింది. మన మౌఖిక సంప్రదాయం ద్వారా చరిత్రను సంక్షిప్తీకరించడానికి సినిమా ఒక ముఖ్యమైన సాధనం” అని చెప్పిన ఉస్మాన్ సెంబేన్ మంచి సినిమాలను నిర్మించి గొప్ప ప్రతిష్ఠాత్మక అవార్డులను సాధించాడు.


“బ్లాక్ గర్ల్” చిరస్థాయి సౌందర్యం :
ఆఫ్రికన్ సినిమా రంగంలో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన మొట్ట మొదటి ఉపసహారా ఆఫ్రికన్ ఫీచర్ చిత్రంగా ‘బ్లాక్ గర్ల్’ గొప్ప విజయం సాధించింది. వలసవాదాన్ని, నల్లజాతి ప్రజలను “ఇతరులుగా” పరిగణించే వలసవాదుల శక్తిని తీవ్రంగా ఖండిస్తుంది.

ఈ కథ ఒక సరళరేఖలో సాగదు. ఫ్రాన్స్ లో పనిచేస్తున్నప్పుడు, డియోవానా గత జీవితంలోని స్వేఛ్చాయుత సంఘటనలను గుర్తు చేసుకోవడాన్ని మనం చూస్తాం. డియోవానా డాకర్ నుండి ఫ్రెంచ్ నగరం యాంటిబ్స్ కు వచ్చి పని కొనసాగిస్తున్నప్పుడు, ఆమె ఊహించలేని ఒక నాగరిక జీవితాన్ని ఇస్తామని ఆమె యజమానులు చేసిన వాగ్దానాలన్నీ వట్టి డొల్ల అని తెలుసుకుంటుంది.

డబ్బుతో గౌరవాన్ని కొనలేరు :
సినిమా ముగింపులో ఆ ఫ్రెంచ్ యజమాని, అహంకారంతో డియోవానా అనుభవించిన బాధలన్నింటినీ డబ్బుతో సరిచేయ వచ్చన్నట్టు, అదేదో పరిహారం అన్నట్లుగా డబ్బును ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ క్షణం అంతకంటే మరింత లోతైన విషయాన్ని బయటపెడుతుంది. డియోవానా డబ్బు కోసం, ఒక మంచి భవిష్యత్తు కోసం వచ్చినప్పటికీ, ఆమె ఆత్మగౌరవం మాత్రం ఎప్పటికీ డబ్బుతో కొనగలిగేది కాదు. మన సంస్కృతులు ఎప్పుడూ కేవలం డబ్బు చుట్టూ నిర్మించబడలేదు. వాటిలో గర్వం, ఆత్మగౌరవం, మానవ హుందాతనం, మానవత్వం ఉంటాయి. బాధలో ఉన్నవారిపై కేవలం డబ్బు విసిరికొట్టి, చేతులు దులుపుకుని వెళ్లిపోవచ్చని అనుకోవడం నిజంగా అజ్ఞానమే. ఆ వ్యక్తి దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించే తీరు..అన్నీ చెప్పేస్తుంది!

విస్మయానికి గురిచేసే అద్భుతమైన సినిమా :
‘బ్లాక్ గర్ల్’ అనేది ఒక ఉద్వేగభరితమైన శీర్షిక. ఇది డియోవానా వ్యక్తిత్వాన్ని రద్దు చేసి, ఆమె యజమానులు చూసే ఒక సాధారణ వస్తువుగా కుదించి వేస్తుంది. ఈ చిత్రం కథనంలోనూ, ఛాయాగ్రహణంలోనూ చాలా సరళంగా ఉండి, డియోవానా పరిసరాలలోని సంకుచితత్వం, ఆమె జీవితంలోని సంకుచితత్వంగా ఎలా మారుతుందో సమర్థవంతంగా చిత్రీకరిస్తుంది. గతం ఒక సుదూర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. వర్తమానం అనేది నిస్సారమైన పనుల పరంపరగా, భగ్నమైన కలలుగా, నిరంకుశ యజమానురాలి చేదు నిందలుగా మారుతుంది. తన చుట్టూ ఉన్న తెల్లని గోడలు, తనను తిడుతూ, తన బాధను పట్టించుకోని యజమానులు, తన జీవితంలోనే అత్యంత నిరాశాజనకమైన ఘట్టంగా మారబోయే భవిష్యత్తును ఊహించి డియోవానా మానసికంగా కుంగి పోతుంది.

సినిమా సాగేకొద్దీ, డియోవానా కుంగుబాటుకు, ఒంటరితనానికి లోనవుతున్నట్లు కనిపిస్తుంది. ఆమెను మేడమ్‌ కేవలం ఒక సేవకురాలిగా చూడటంతో, రోజురోజుకీ ఆమె కూడా ఒక మనిషి అనే గుర్తింపు క్షీణిస్తుంది. డియోవానా ఎదుర్కొనే అనుభవం ఇదే. వలసవాదం ఒక వ్యక్తి మనస్తత్వాన్ని సంపూర్ణంగా ఎలా ఎలా విచ్ఛిన్నం చేయగలదో, వలసవాదం ద్వారా ఇప్పటికే జరుగుతున్న విధ్వంసానికి తోడుగా వారు వ్యక్తిగత నష్టాన్ని ఎలా చవిచూస్తారో అనేదాన్ని డియోవానా ఆత్మహత్య ద్వారా ఈ చిత్రం చిత్రీకరిస్తుంది.

ఆమె గతంలో సెనెగల్‌లో పిల్లలకు ఆయాగా పనిచేసినప్పుడు, పిల్లల్ని ఆడిస్తూ ఎక్కువ సమయం బయట గడిపేది. ఇంట్లో అన్ని
పనులూ చేస్తూ డియోవానా ఫ్యాన్సీ డ్రెస్ హీల్స్ ధరించినప్పుడు, “నువ్వు పనిమనిషివి అని మరచిపోవద్దు” అంటూ మార్చుకోమని కఠినంగా చెప్తుంది. ఫ్రెంచ్ జంటల డిన్నర్ పార్టీలో ఒకాయన విలక్షణమైన యూరోపియన్ ఫ్యాషన్‌లో డియోవానా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, ఆమె బుగ్గలపై ముద్దులు పెడుతూ, “నేను ఇంతకు ముందు ఎన్నడూ నల్లజాతి అమ్మాయిని ముద్దుపెట్టుకోలేదు!” అంటాడు. ఆమె చాలా అహం దెబ్బతిన్నట్లు ముడుచుకుపోతుంది.
ఇటలీ ‘నియో-రియలిజం’ కళాఖండంగానూ, అదే స్థాయిలో “ఫ్రెంచ్ న్యూ వేవ్” చిత్ర నిర్మాతల శైలీ ప్రభావం కూడా స్పష్టంగా చూడవచ్చు.

వలసవాద చిత్రణలో అక్షరాస్యత కూడా ఒక చాలా విలువైన అంశం అని రచయిత్రి రాచెల్ లాంగ్‌ఫోర్డ్ అంటూ డియోవానా గుర్తింపు, ఆమె నుండి ఎలా లాగేయబడిందో వివరిస్తుంది. ఆమె నిరక్షరాస్యత కారణంగా, ఆమె తల్లి డియోవానాకు ఒక లేఖ పంపినప్పుడు, ఫ్రెంచ్ జంట ఆమె తరపున డయోవానా జవాబును స్వయంగా రాస్తారు. తాము ఏమైనా తప్పులు చేస్తే సరిదిద్దమని ఆమెను కోరతారు. డియోవానా బాధపడుతుండగా, వాళ్ళు ఆమె తల్లికి ఫ్రాన్స్ లో ఆమె చాలా ఆనందంగా, సంతృప్తికరంగా గడుపుతోందని చెప్పడం ప్రారంభిస్తారు. ఆగ్రహానికి గురైన డియోవానా, ఆ దంపతులను సరిదిద్దలేదు గానీ అది తన లేఖ కాదని చెబుతుంది. నిరక్షరాస్యత వల్ల డియోవానా తన సొంత జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోలేదు. అది ఆమె కోసం వలసవాదులచే సృష్టించబడింది. వలసవాదం ఒక వ్యక్తికి ఎంతటి నష్టాన్ని కలిగిస్తుందో ఈ దృశ్యం ప్రేక్షకుల కళ్ళకు బొమ్మ కట్టి చూపుతుంది.

ఈ చిత్రంలో జాత్యహంకార అంశం డియువానా-మేడమ్ మధ్య ఉన్న సంబంధం ద్వారా వ్యక్తమవుతుంది. ఈ పాత్రలు ఆఫ్రికా – ఐరోపా దేశాల మధ్య ఉండే అధికార సంబంధాల సమస్యను ప్రతిబింబిస్తాయి. పని దొరుకుతుందనే ఆశతో ప్రతి ఉదయం వీధి పక్కన వేచి ఉండే మహిళల సమూహాన్ని సినిమా ప్రారంభంలోనే చూపిస్తారు. ఈ సాధారణ సన్నివేశం ఆ రెండు ప్రాంతాల మధ్య ఉన్న అధికార వ్యత్యాసాన్ని వెంటనే స్పష్టం చేస్తుంది. ఐరోపాకు వెళ్తే అద్భుతమైన జీవితాన్ని గడపవచ్చని డియోవానా కలలు కంటుంది కానీ ఆమెకు చేదు అనుభవాలు ఎదురవుతాయి. ప్రతిరోజూ జాత్యహంకారాన్ని ఎదుర్కొంటుంది. ఆమె చర్మం రంగు, స్వదేశం కారణంగా, అతిథులు ఒక వింతైన వస్తువుగా చూస్తారు.

సామాజిక అధికార క్రమాన్ని, విభజనను సృష్టించడానికి జాతిని ఎలా ఉపయోగిస్తారో ఈ చిత్రం హైలైట్ చేస్తుంది. అనాది కాలం నుంచి వలసవాదులు వాడిన పద్ధతిని ఈ చిత్రం తెలియజేస్తుంది.

ఈ సినిమాలో నలుపు-తెలుపు వినియోగం భావస్ఫోరకంగా ఉంటుది. దీనివల్ల ఇది చూసేవారికి తీవ్రమైన వేదనను కలిగించేదిగానూ, అదే సమయంలో వారిని పదే పదే తనవైపు ఆకర్షించేదిగానూ నిలుస్తుంది.
ఆఫ్రికన్ సినిమా వారసత్వం గురించి తెలుసుకోవాలనుకునే ఆఫ్రికన్లు, ఆఫ్రికన్ సినిమా ఎక్కడ మొదలైందో చూడాలనే ఆసక్తి ఉన్నవారు, వలసానంతర సిద్ధాంతం, నూతన వలసవాద విమర్శ, నెమ్మదిగా సాగే, పాత్రల ఆధారిత స్వభావం ప్రధానంగా ఉండే డ్రామాను ఇష్టపడే క్లాసిక్ సినిమా ప్రేమికులు, మరీ ముఖ్యంగా ప్రపంచ సినిమా చరిత్రను అభ్యసిస్తున్న ఫిల్మ్ విద్యార్థులు, ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న ఆఫ్రికన్ చిత్ర పరిశ్రమ రూపుదిద్దుకోవడానికి దోహదపడిన ఒక చారిత్రక ఘట్టంగా ఈ చిత్రాన్ని అధ్యయనం చేయడం కోసం చూడాలి.

నటీనటులు
ఈ చిత్రంలో, కథానాయిక ‘డియోవానా’ గా నటించిన ఎంబిస్సిన్ థెరీస్ డియోప్ (Mbissine Thérèse Diop), ఒక అద్భుతమైన నటనతో ప్రత్యేకంగా నిలుస్తుంది! కెమెరా పనితనం వల్ల ఎంబిస్సిన్ థెరీస్ డియోప్ నటన మొదటి నుంచీ తన ఉనికిని చాటుకుంటుంది. దృఢమైన వ్యక్తిత్వంతో పాటు, ఎంతో లోతైన దుఃఖం, హోమ్‌సిక్‌నెస్ బాధను కూడా ఆమోఘంగా పలికించింది. అందమైన దుస్తుల్లో అనిశ్చితితో పాటు అంటే బలంగా గాలిలో తేలిపోతున్నట్లుగా ఫ్రెంచ్ భవనాల వైపు చూస్తూ అబ్బుర పరిచే సీన్ ప్రేక్షకుల మదిలో మరపురానిదిగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఆ తర్వాత ఆమె జీవితానందమే ముగుస్తుంది!
‘మేడమ్’గా ఆనీ-మేరీ జెలినిక్ (Anne-Marie Jelinek), ‘యాజమాని’గా Monsieur (Robert Fontaine) సహజంగా నటించారు.

విమర్శకుల స్పందన
అప్పటి సహకార ఫ్రెంచ్ మంత్రిత్వ శాఖ సినిమా బ్యూరో అధికారి ఈ సినిమా స్క్రీన్ ప్లే ని తిరస్కరించాడు. ఇటీవలి కాలంలో ‘బ్లాక్ గర్ల్’ చిత్రానికి విమర్శకులు, సినీ అభిమానుల నుండి చాలా మంచి ఆదరణ లభించింది. 2010 నాటికి దీనిని “ప్రపంచ క్లాసిక్‌ సినిమా” గా పరిగణించారు. సినీ ప్రియులు “బ్లాక్ గర్ల్” 65 నిమిషాల నిడివిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు.

జోనాథన్ రోసెన్‌బామ్ (Jonathan Rosenbaum) తన 1997 పుస్తకం “Movies as Politics) లో, ‘బ్లాక్ గర్ల్’ చిత్ర దర్శకుడు ఆఫ్రికాలో పుట్టి పెరిగిన వ్యక్తి గనుక, సహారా ఉప-ప్రాంత ఆఫ్రికన్ చలనచిత్ర నిర్మాణానికి ఒక ప్రతీకాత్మక మూలమన్నారు.
1981లో, ఏంజెలా డేవిస్ (Angela Davis) “గృహ కార్మికుల గురించిన విషాదకరమైన పరిస్థితిని ‘లా నోయిరే డి…’ అనే పేరుతో ఉస్మాన్ సెంబెన్ తన చిత్రంలో అద్భుతంగా పట్టుకున్నాడని పేర్కొన్నారు.

2016లో ‘బ్లాక్ గర్ల్’ యాభైవ వార్షికోత్సవం సందర్భంగా పునరుద్ధరించారు. ది న్యూయార్క్ టైమ్స్ కి చెందిన ఏ. ఓ. స్కాట్ (A.O. Scott) ఈ చిత్రాన్ని “ఒకేసారి శక్తిమంతంగా, శాశ్వతంగా సమకాలీనమైనది” అంటూ అని వర్ణించారు, “మిస్టర్ సెంబెన్ కళాత్మక శక్తి, అతని తొలి చిత్రాల అత్యంత ఆకర్షణీయమైన, స్వచ్ఛమైన అందం అతని మానవతావాదంలో ఉంది” అని వర్ణించారు.

2017లో, ది క్రైటీరియన్ కలెక్షన్ (The Criterian Collection)కోసం ఆష్లే క్లార్క్ (Ashley Clark) ఈ చిత్రాన్ని“వలసానంతర బాధల సొగసైన, నిష్ఠురమైన నాటకీకరణ”గా, అభివర్ణించారు. డియోవానాని “తాజాదనాన్నిచ్చే బహుముఖ పాత్ర”గా అభివర్ణించారు.
ది గార్డియన్ కోసం రాస్తూ, జోర్డాన్ హాఫ్‌మన్ (Jordan Hoffman ‘బ్లాక్ గర్ల్’ను “దిగ్భ్రాంతి గోలిపేది”, “అన్ని విషయాల గురించి ఆలోచించ గలిగిన పరిపూర్ణమైన చలనచిత్ర ప్రేమికులు తప్పకుండా చూడాల్సిన చిత్రం” అని అన్నారు.

విషాదకరమైన మార్పు నెమ్మదిగా జరగాలని ఏ మంచి రెచ్చగొట్టే దర్శకుడికైనా తెలుసు. కానీ ఉస్మాన్ సెంబెన్ ఈ పరివర్తనను పూర్తిగా విస్మరించాడు. నటీనటుల ప్రతిభను, ముఖ్యంగా ఎంబిస్సిన్ థెరీస్ డియోప్ నటనను చూస్తే ఇది చాలా విచారకరంగా ఉంటుంది. ఆమె నిశ్శబ్దమైన ఆగ్రహాన్ని, అలసటతో కూడిన నిరాశను ఎంత అద్భుతంగా ప్రదర్శించిందంటే, ఆమె పెదవులపై చిరునవ్వుని, కూడా ఆమె నిజమైన భావాలను కూడా గుండెను పిండేసే రీతిలో చూపిస్తుంది. కేవలం కథనానికి (narration) పరిమితం కాకుండా, ఆ భావాలను వ్యక్తపరచడానికి మరికొంత సమయం కేటాయించి, ఆ అంశాన్ని సవ్యంగా మలచడంపై మరింత దృష్టి పెట్టి, సినిమా నిడివిని ఇంకాస్త పెంచి ఉంటే “బ్లాక్ గర్ల్” ఒక అద్భుతమైన చిత్రంగా నిలిచి ఉండేది అని ప్రపంచ సినీ ప్రియులు ఈ సినిమా లోపాన్ని సున్నితంగా చెప్పారు.

సాధించిన అవార్డులు
1966, ఉత్తమ చలన చిత్రంగా ప్రిక్స్ జీన్ వీగో (Prix Jean Vigo) అవార్డు
1966, తానిట్ డి’ఓర్, కార్తేజ్ ఫిల్మ్ ఫెస్టివల్ (Tanit d’Or Carthage Film Festival) అవార్డు

జననం: గుంటూరు జిల్లా భట్టిప్రోలు. రేపల్లె, తెనాలి, హైదరాబాద్ లో విద్యాభ్యాసం. హైదరాబాద్ టెలికాం (ఇప్పటి బీఎస్ఎన్ఎల్)లో ఉద్యోగం చేశారు. మహిళల సమస్యలపై పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ(ఇంగ్లిష్ లిటరేచర్), ఎం.ఏ(తెలుగు సాహిత్యం), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శ్రీ శ్రీ రేడియో నాటికల మీద ఎం.ఫిల్ చేశారు. S.M Synge(Ireland writer ) రాసిన “Riders to the Sea” ఏకాంకికకి తెలుగు అనువాదం. శాస్త్రీయ దృక్పథం, ప్రత్యామ్నాయ సినిమా, సినిమా అక్షరాస్యతను పెంపొందించుకోవడం ఇష్టమైన విషయాలు.

Leave a Reply