కాలం అంచులమీద అలసిన వలస పక్షుల ‘వలస పాట’

సాహిత్యానికి మకుటం కవిత్వమే, వచనానికి క్రమశిక్షణ నేర్పే గురువు కవిత్వం అంటాడు ‘రష్యన్‌ కవి జోసెఫ్‌ బ్రాడ్‌స్కీ’. ఈ విషయాలు దాదాపు దశాబ్దంనర నుండి కవిత్వాన్ని వ్రాస్తున్నగవిడి శ్రీనివాస్ విషయంలో నిజం. రచయిత మొదటి కవితా సంకలనం ‘కన్నీళ్ళు సాక్ష్యం’ రెండవ కవితా సంకలనం ‘వలస పాట.’ తెలుగు సాహిత్య సంస్కృతీ వికాసంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక ప్రత్యేకస్థానం ఉంది, ఎందరో మహాకవులను, కథకులను అందించిన నేల ఉత్తరాంధ్ర. ఆ ఉత్తరాంధ్ర నుండి ‘వలస పాట’ వినిపిస్తున్న కవి గవిడి శ్రీనివాస్. ఆ పాటకు పల్లవి కలుపుదాం రండి.

ఉత్తరాంధ్ర రచయితలు ఎవరు కవిత్వం రాసినా వలస గురించి ప్రస్తావించని కవులు ఉండరంటే అతిశయం కాదు. గవిడి శ్రీనివాస్ ఈ అంశం గురించి బలమైన కవితలు రాయడంతో పాటుగా, తన కవితా సంకలనానికి “వలస పాట” అని పేరు పెట్టడం విశేషం.

“ఉత్తరాంధ్ర వలస పాట” అనే మొదటి కవితతో ఈ కవితా సంకలనం ప్రారంభిస్తాడు రచయిత. ఈ కవితలోని వ్యక్తీకరణలో ఉత్తరాంధ్ర పల్లె పల్లె ఒక్కో దిగులు తల్లి అంటూ…

గాల్లో తేలాడే బుట్టలు
బరువెక్కిన బతుకు మీద
గాలిపటాల్లా నలుదిశలను వెదుకుతున్నాయి
చరిత్ర గుండెల్ని పిండినప్పుడల్లా
రాలుతున్న వలస పాటలు

బస్ స్టేషన్ వెంటో, రైల్వే స్టేషన్ వెంటో
తగులుతున్న దృశ్యాలై జ్వలిస్తున్నాయి
కాలం నడుస్తున్నా పని చిక్కని చేతిలో
పొట్ట కూడదీకుని
ఆశల మూటల్ని బరువుగా మోస్తూ
వలస బండి గడగడా కదిలిపోతుంది

ఎప్పటికీ తెరవని ఉపాధి ద్వారాలు, సూర్యోదయాన్ని చీకట్లో బంధించాయి
చెదిరే కాలం వెంట వలస విమానం పరిగెడుతుంది ఇప్పుడు అంటాడు రచయిత ఆర్ద్రతతో.

మనిషి సృష్టి రహస్యాలు తెలుసుకొని, ప్రకృతిని సైతం తన గుప్పెట్లో బంధించాలన్న ప్రయత్నంలో ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాడు, ప్రకృతి ప్రేమికుడిగా కవి చేతి కలం నుంచి జాలువారిన ‘పర్యావరణ పరిరక్షణ’ దిశగా సాగే కవితలు ఎన్నో ప్రకృతిని ప్రేమింప చేస్తాయి, వర్షంతో తడిపేస్థాయి “నీరైపోనూ”…! కవితను చూస్తే అర్థమవుతుంది.

జొన్న సేను రేకుల్లో
మబ్బుకళ్ళు జార్చిన
పన్నీరే ఈ చిట్టి చినుకులు
పువ్వైపోదూ చిరునవ్వైపోదూ
చెరుకు గడల మధ్య
నిద్రను ఆరేసుకుంటే
తడిచినకు గుండెను హత్తుకుంది
ప్రియురాలిలా!

గాలి వీస్తే, వాన లేస్తే ప్రాణాలు
ముద్దవుతుంటాయి, ఆకాశానికి రెక్కలు చాచి, బొంగరంలా గిరికీలు కొడుతుంటే
సౌందర్యం శరీరమైనట్లు, మనసు
పల్లకిలో తేలియాడుతుంది అంటాడు రచయిత.

కవిత్వ నిర్మాణం బాగా తెలిసినవాడు రచయిత కనుకనే తనలోని భావోద్వేగాలకు ప్రతిబింబిస్తూ తనలోని ఊహాశక్తికి సృజనను జోడించి మంచి భావ చిత్ర నిర్మాణంతో కవితాత్మక నైపుణ్యంతో రచించిన కవితలు ఎన్నో తారసపడతాయి ఈ సంకలనంలో ‘అలా వెళ్ళి పోతావ్” కవిత వ్యక్తీకరణలో అర్థమవుతుంది.

ఋతువుల్ని గోరింటాకు పెట్టుకుని
ఇంద్రధనస్సుల్ని మెరిపించావ్
చిరునవ్వుల సాక్షిగా
హృదయాన్ని ఆకాశానికి
తారాజువ్వలా ఎగరించేశావ్
బతుకు గమనంలో
నడకల దిక్కుల్ని శాసించావ్
అంతరంగాన్ని ఆప్యాయత
దివిటీలతో వెలిగించావ్ అంటూ సాగుతుంది.

కవి కొన్ని ఆనందక్షణాలతో, మరికొన్ని ఉద్రిక్త క్షణాలతో, కొన్ని కన్నీళ్ళతో, రాలుతున్న జ్ఞాపకాలతో కొవ్వొత్తిలా కరుగుతూ జీవన రేఖలు సరిచేసేందుకై కాలం చేసిన గాయానికి ఏడవకురా కన్నా కాలాలు అన్నీ మనవి కావురా కన్నా అంటూ పట్నం బయలుదేరిన వలస పక్షి అనుభవాలలోకి జారి పోతుంటాడు, యాంత్రికాన్ని నెత్తిన ఎత్తుకొని ఉరుకుల పరుగులతో ఉలిక్కి పడుతుంటాడు, “వర్తమాన దృశ్యం”తో సామాజిక వైరుధ్యాలను అభివ్యక్తీకరిస్తారు రచయిత.

క్షణం తీరికలేని
పరుగుల ఒరవడిలో
యాంత్రికం ఒక నియంత్రిత చర్య
మెరుపు గమనంలా
మనిషి ప్రవహించాలి
పరిగెత్తే ప్రపంచంలో
ఒకరికి ఒకరు ఇక్కడ ఒంటరి
పరితపించే హృదయాలేవ్
జనం
సాంఘికంకాని వేళ
మనసుల్లో నెలవొంకలు పూస్తాయా!? మనుషుల కీకారణ్యాన్ని
ఒంటరిగా ఈదటం
ఎడారిని ఆరబోసినట్లు ఉంది ఉంటుంది.

ప్రపంచీకరణ నేపథ్యంలో కార్పొరేట్ దౌర్జన్యాలను చిత్రీకరిస్తూ ఉదయించే ప్రశ్నల రూపంలో ప్రశ్నల అస్త్రాలను సంధిస్తాడు “ప్రపంచీకరణ ఇంద్రజాలం భూములకు రెక్కలిచ్చి ఆశల్ని ఆకాశానికి వేలాడదీస్తున్నాయి నిట్టూర్పులో పరిశ్రమలు మట్టిని ఎంత వినయంగా మింగినా, హరిత స్వప్నం ప్రగతిని నిలదీస్తే మరో తరానికి ఆకలి ప్రశ్నలు ఎదురిస్తుంటాయి” అని వ్యక్తీకరిస్తారు రచయిత.

ఉత్తరాంధ్ర వలస పాటతో మొదలైన వలసలు ఒక్క వీడ్కోలు తో ఖండాంతరాల దాటి కరెన్సీ భాషలో కొలవలేని కాలం చూరులో నుంచి జారే రసామృతాన్ని ప్రశ్నార్ధకంగా వదిలి హృదయాన్ని ట్రాలీలో మూసుకుపోతూ రెక్కలు కట్టుకు ఎగిరిపోతాయ్ కొన్ని వలస పక్షులు, చాలా పక్షులు మాత్రం “కాలం అంచులమీద అలసిన వలస పక్షులై” ఆశల కువకువలతో ఇంకా కలల మొగ్గలు తొడుగుతూనే ఉన్నాయి.

‘వలస పాట’ కవితా సంకలనంలోని కవితలు అన్ని సామాజిక స్పృహతో, తనదైన శైలితో, మంచి శిల్పంతో, భావుకతతో, పదబంధాలతో, ప్రతీకలతో కవిత్వ ప్రయాణాన్ని సాగిస్తున్న యువ కవి, గీత రచయిత గవిడి శ్రీనివాస్ కి హృదయపూర్వక అభినందనలు.

ఒంగోలు, ప్రకాశం జిల్లా. కవయిత్రి, సోషలిస్ట్. వింగ్స్ ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ గా ఉన్నారు.

Leave a Reply