యుద్ధ బీభత్సాన్ని చిత్రించిన రష్యన్ సినిమా ‘Fate of a Man’

యుద్ధం నేపథ్యంలో ప్రపంచ భాషలలో చాలా సినిమాలు వచ్చాయి. రష్యన్ సినిమాలలో కూడా యుద్ధాన్ని మూల కథావస్తువుగా తీసుకుని చాలా అద్భుతమైన చిత్రాలు తీసారు. యుద్ధాన్ని హీరోయిక్ గా చూపడం కాకుండా, మానవ సంబంధాలు, మనిషి నైతికత, మానవ నైజం, వీటిని ప్రధాన అంశాలుగా తీసుకుని యుద్ధం నేపథ్యంలో వచ్చిన రష్యన్ సినిమాలు చాలా గొప్పగా చిత్రించబడ్డాయన్నది నా అభిప్రాయం. రష్యన్ భాషలో సాహిత్యం ఉత్తమ స్థాయిలో ఉంటుంది. ఆ భాషా సాహిత్యంలోని కథలు, నవలలు చక్కని సినిమాలుగా తీయబడ్డాయి. నోబుల్ బహుమతి పొందిన మైఖిల్ షోలకోవ్ అనే రష్యన్ రచయిత రాసిన ఒక చిన్న కథ ఆధారంగా తీసిన సినిమా “Fate of a Man” రష్యన్ భాషలో వచ్చిన ఒక మంచి సినిమా. ఇది 1959 లో విడుదలయ్యింది. దీనిలో ప్రధాన పాత్ర పోషించిన నటుడు సర్జీ బొండార్చుక్. ఈ సినిమాకు ఆయనే దర్శకులు కూడా. రష్యన్ నటులలో చాలా గౌరవమైన స్థానం పొందిన వ్యక్తి ఆయన. ఇది వీరు దర్శకత్వం వహించిన మొదటి సినిమా. ఆ తరువాత ఎన్నో సినిమాలకు వారు దర్శకత్వం వహించి ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు.

ఈ సినిమా కథ 1946 లో మొదలవుతుంది. అండ్రీ సొకొలోవ్ అనే ఒక ట్రక్ డ్రైవర్ తన చిన్న కొడుకు తో మరో ఊరికి వెళ్తూ ఉంటారు. దారిలో ఒక వ్యక్తి తారసపడతాడు. అతను కూడా తనలాగే ఆర్మీ లో పనిచేసిన ట్రక్ డ్రైవర్ అని గుర్తుపడతాడు సొకోలోవ్. అతనికి తన కథ వినిపిస్తాడు. సొకొలోవ్ ఒక వడ్రంగి. ఒక ఇంటికి పని చేస్తున్నప్పుడు అక్కడ అతనికి ఇరీనా అనే యువతి పరిచయం అవుతుంది. ఇరీనా తో పరిచయం ప్రేమగా మారి వారిద్దరూ వివాహం చేసుకుంటారు. వీరికి ముగ్గురు పిల్లలు. మొదట కొడుకు, తరువాత ఇద్దరు ఆడపిల్లలు. ఇరీనా చాలా ఒర్పు గల స్త్రీ. ఆమెతో ఉంటూ సొకోలోవ్ చాలా పద్ధతిగా జీవిస్తుంటాడు. కొడుకు మేథమాటిక్స్ లో గొప్ప ప్రతిభ కనపరుస్తూ ఉంటాడు. అతని ప్రతిభ కారణంగా అతని పేరు పేపర్ లో కూడా వస్తుంది. కొడుకుకి గొప్ప భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తాడు సొకోలోవ్. వివాహమయి పదిహేడేళ్ళ సుఖజీవనం తరువాత రెండవ ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. సొకొలోవ్ సైన్యంలో చేరతాడు. అతను యుద్ధానికి బయలుదేరేటప్పుడు భార్య తీవ్ర ఆవేదన చెందుతుంది. సొకొలొవ్ యుద్ధంలో విజేతగా తిరిగివస్తానని చెప్పి కుటుంబాన్ని వదిలి రైలు ఎక్కుతాడు.

యుద్ధంలో ట్రక్ డ్రైవర్గా పని చేస్తున్నప్పుడు ఒక ప్రమాదంలో అతను శత్రువుల చేతికి చిక్కుతాడు. యుద్ధ ఖైదీగా అతను జర్మనీలో అన్ని కాంపులకు తరలింపబడతాడు. అతని కళ్ళ ముందు ఎన్నో దారుణమైన మరణాలను జర్మనీ ఆగడాలను చూస్తాడు. ఆ క్రమంలోనే హిట్లర్ కాన్సెంట్రేషన్ కాంపులలో కూడా కొన్ని రోజులు పని చేస్తాడు. ఒక సారి తప్పించుకోవాలనుకున్నప్పుడు శత్రువులు అతన్ని పట్టుకుంటారు. తిరిగి కాంపునకు చేరి భయంకరమైన శిక్షలు అనుభవిస్తాడు. అతనికి అంతటి భయానక రోజులలో కూడా ధైర్యం ఇచ్చేది కుటుంబ ఆలోచనలు, జ్ఞాపకాలే. తన భార్యా పిల్లలతో రోజూ మాట్లాడుతున్నట్లు అనుకుంటూ ఉంటాడు. ఒక సారి జర్మన్ల ను విమర్శించాడని అతన్నికాంప్ జనరల్ చంపేద్దామనుకుంటాడు. కాని అతని ధైర్యం నచ్చి అతన్ని వదిలివేస్తారు. ఇలా చాలా సార్లు చావు అంచుల వరకు వెళ్ళి బ్రతికి బైటపడతాడు సొకొలోవ్.

ఒక సారి ట్రక్ లో మరో జర్మన్ జనరల్ ని తీసుకువెళుతున్నప్పుడు సోకొలొవ్ దారిలో తాగి పడి ఉన్న మరో జర్మన్ సైనికుడిని చూస్తాడు. అతని దుస్తులు తాను వేసుకుని జనరల్ తో పాటు రష్యన్ కాంప్ వైపుకు ప్రయాణిస్తాడు. రష్యన్లు అతని ట్రక్ ను ముట్టడించినప్పుడు తాను రష్యన్ సైనికుడినని తప్పించుకుని వచ్చానని చెప్పి రష్యన్ సైన్యానికి తాను తీసుకువచ్చిన జర్మన్ జనరల్ ను, అతని వద్ద ఉన్న రహస్య పత్రాలను అందిస్తాడు. ఆ పత్రాలలో చాలా విలువైన సమాచారం ఉన్నందువలన అతన్ని యుద్ధ హీరో గా ప్రకటించి, కొన్నాళ్ళూ ఆసుపత్రిలో చికిత్సకు పంపి తరువాత ఒక నెల సెలవుపై ఇంటికి వెళ్ళి భార్యా పిల్లలను కలిసి వచ్చే సౌకర్యం కల్పిస్తారు రష్యన్ అధికారులు. ఎంతో ఆశతో ఇంటికి వెళ్ళిన సొకొలొవ్ ఇల్లు ఉన్న ప్రదేశంలో ఒక మట్టి దిబ్బను చూస్తాడు. బాంబు దాడిలో ఆ వీధి మొత్తం నాశనమయ్యిందని. బాంబులు పడ్డ రోజు ఆ ఇంట్లో అతని భార్యా, ఆడపిల్లలు ఇద్దరూ ఉన్నారని, ఇంటితో పాటు వారు భూస్థాపితం అయ్యారని అతనికి ఒక పరిచయస్తుడు చెబుతాడు. అతని కొడుకు కూడా సైన్యంలోకి వెళ్ళిపోయాడని తెలుస్తుంది. భార్యా పిల్లలను పోగొట్టుకున్న అతనికి జీవితంలో దేని కోసం బ్రతకాలో తెలీయదు. తిరిగి యుద్ధానికి వెళ్ళిపోతాడు.

చాలా కష్టపడి తన కొడుకు ఆచూకీ తెలుసుకుంటాడు సోలకోవ్. కొడుకు కాప్టెన్ హోదాలో సైన్యంలో ఉన్నాడని కొడుకు స్వయంగా రాసిన ఉత్తరం అతన్ని చేరుతుంది. జీవితం పై మళ్ళి ఆశ పుడుతుంది. కాని యుద్ధంలో రష్యా విజయం సాధించిన వార్త తోనే కొడుకు మరణించాడన్న వార్త కూడా సొకొలోవ్ ని చేరుతుంది. కొడుకు ను జర్మనీ లో ఒక నగరంలోనే సమాధి చేయవలసి వస్తుంది. తిరిగి సొకొలోవ్ తన ఒంటరి జీవితంలోకి వస్తాడు. ట్రక్ డ్రైవర్ గా సైనిక శిబిరాలలో పని చేస్తున్నప్పుడే చెత్త లో తిండి ఏరుకుంటున్న ఒక చిన్న పిల్లాడు కనిపిస్తాడు. అతనితో స్నేహం పెంచుకుంటాడు సొకొలోవ్. అతని తండ్రి యుద్దంలో మరణించాడని, తల్లి కూడా మరణించిందని, ఆ అబ్బాయి ఎవరూ లేని అనాథ అని తెలిసిన్ సొకొలోవ్ కి ఆ చిన్న ప్రాణం పై ప్రేమ పుట్టుకొస్తుంది. తాను ఆ బిడ్డకు తండ్రినని చెప్పుకుంటాడు. ఆ బిడ్డ దాన్ని నమ్మి ఆనందపడి కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడూ సొకొలోవ్ తన భవిష్యత్తు నిర్ణయించుకుంటాడు. ఆ బిడ్డను తన బిడ్డగా అందరికీ పరిచయం చేసి మరో ఊరికి వెళ్ళి బతకాలని నిర్ణయించుకుంటాడు.

తన కథ అంతా చెబుతూ సొకొలోవ్ ఆ చిన్న బిడ్డను తాను ఎన్ని రోజులు కాపాడగలనో తెలీదని. తన ఆరోగ్యం పై కూడా తనకు నమ్మకం పోయిందని, ఎప్పుడు తన గుండె ఆగిపోతుందో తనకే తెలీదని, కాని అప్పటి దాకా ఆ బిడ్డకు తాను ప్రేమను పంచుతానని చెప్పి మిత్రుడి నుండి సెలవు తీసుకుంటాడు. ఆ తండ్రీ కొడుకులు తమ భవిష్యత్తు వైపు నడుచుకుంటూ వెళ్ళడంతో సినిమా ముగుస్తుంది.

సైనికుడిగా సొకొలోవ్ విజయం పొందుతాడు. కాని వ్యక్తిగా తన కుటుంబాన్ని పోగొట్టుకుని జీవితంలో ఓడిపోతాడు. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా యుద్ధం మనిషి నాశనానికే అని యుద్ధం వల్ల సుఖపడిన ప్రజలు ఉండరని చెప్పే చిత్రం ఇది. యుద్ధంలో గెలుపు ఓటములకు అతీతంగా యుద్ధాన్ని అనుభవించిన ప్రతి జీవితం కోల్పోయేదే ఎక్కువ. ఏ పక్షం గెలిచినా ఏ పక్షం ఓడిపోయినా వారు వ్యక్తులుగా పోగొట్టుకున్నదే ఎక్కువ. ఇది నిజం. కాని మనిషి హింసను ప్రేమిస్తాడు. యుద్ధాన్ని కాంక్షిస్తాడు. అదే జీవితాన్ని పునర్నిర్మించుకునే సాధనమని నమ్ముతాడు. యుద్ధాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన ఏ వ్యక్తి అయినా అటు విజేత పక్షంలో ఉన్నా, ఓడిన వారి స్థానంలో ఉన్నా, గెలుచుకున్న దానికన్నా పోగొట్టుకునేదే ఎక్కువ. ఈ ఒక్క సత్యాన్ని విస్మరించడం వల్ల ప్రపంచంలో శాశ్వతమైన అశాంతి రగులుకుని ఉంది. మానవ సమాజంలోని ఈ సత్యాన్నిచూపే చిత్రం ఇది. సైనికుడు దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చెస్తాడు. ఆ త్యాగం అతనికి ఒంటరితనాన్ని మిగిలిస్తుంది. అతను ప్రేమించిన వారికి దూరం అవుతాడు. దేశ రక్షణ అనే బృహత్తరమైన బాధ్యత అతనిదైనా యుద్ధంలో నష్టపోయే సామాన్య జనజీవితాలు చివరకు వేదనను తప్ప మరేమి అనుభవించవు. అందువలన అసలు యుద్ధం అనే స్థితి నుండే మానవ సమాజాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉంది. మనిషి తనలోని స్వార్ధాన్ని ప్రపంచాన్ని గెలవాలి అనే అహాన్ని ఒదిలి ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుని బ్రతకడానికి తనను తాను తయారు చేసుకోవాలి. యుద్ధ వాతావరణంలో చాలా సార్లు పరిస్థితులు మానవ నియంత్రణకు అందకుండా వెళ్ళిపోతాయి. అప్పుడు జరిగే నష్టాన్ని ఎన్నో తరాలు భరించవలసి ఉంటుంది. ఆ విపత్తు నుంచి మానవాళిని కాపాడుకోవాలి అంటే సమాజంలో జరిగిన తప్పిదాల నుండి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. ఈ సినిమా మనలో అటువంటి ఆలోచనను కలుగజేస్తుంది. ఏ సమయంలో నయినా, ఏ యుగంలో నయినా మనిషి మరో మనిషిని చంపుకునే సంస్కృతి మనిషికి ఎప్పుడూ మేలు చేయదు. మానవ సమాజ భవిష్యత్తు అతని నిస్వార్ధ ఆలోచనా సరళి పైనే ఆధారపడి ఉంటుంది.

రచయిత సొకొలోవ్ పాత్రలో మరో కోణం కూడా చూపిస్తారు. జీవితంలో ఎటువంటి సందర్భాలలో కూడ ధైర్యం కోల్పోకుండా అన్ని సమస్యలనుండి కూడా విజేతగా లేచి నిలబడే ఒక ఉక్కు మనిషి కథగా కూడా Fate of a Man ని చూడవచ్చు. అందరినీ కోల్పోయినా కూడా మరో చిన్న బిడ్డకి తండ్రి అయ్యి ముందుకు సాగిపోయే వ్యక్తిత్వం సోకోలొవ్ ది. ఆ ధైర్యాన్ని మరో తరానికిస్తే జీవితం పట్ల ఒక గొప్ప పోరాట పటిమను చూపి జీవించే శక్తివంతమైన తరం తయారు అవుతుంది. ప్రతికూల పరిస్థితులలో తాను చేయవలసింది చేసుకుంటూ భవిష్యత్తు వైపుకు సాగిపోయే ధైర్యవంతుడు సొకోలోవ్. ఎటువంటి పరిస్థితులలో కూడా జీవితంలో కుంగుబాటుకు చోటు ఇవ్వడు. అతను జీవితంలో విషాదాన్ని ఎదుర్కొనే విధానం చాలా గొప్పగా ఉంటుంది. జీవితంలో భవిష్యత్తు పై భయం కన్నా ప్రస్తుత పరిస్థితులలో తానేం చేయాలి, తన కర్తవ్యం ఏమిటి, అన్న ఆలోచనలే అతన్ని నడిపిస్తూ ఉంటాయి. భార్యా బిడ్డలు, కొడుకు అందరూ మరణించినా, జీవితంలో మరే ఆశ తోడు లేని సమయంలో కూడా మరో అనాథకు తండ్రి అయ్యి అతని బాధ్యతను తీసుకోవడానికి మనిషికి ఎంతో గుండె ధైర్యం కావాలి. అటువంటి ధైర్యం ఉన్న వ్యక్తులు బ్రతికినంతకాలం మరొకరికి ఆసరా అవగలరు, బ్రతుకు పట్ల ఆశను రగిలించగలరు.

పరిస్థితులు మన చేతుల్లో లేనప్పుడు మనిషి చేయవలసింది ముందుకు సాగుతూ వెళ్ళడమే, అన్న మరో కోణాన్ని కూడా చెప్పే కథ ఇది. ఒకే కథలో ఇలా రెండు భిన్నమైన కోణాలను పదర్శించే శైలి మైఖెల్ షోలకోవ్ ది. ఆ శైలిని యధావిధిగా చిత్రించగలిగిన చిత్రం ఇది. మనిషిలోని పోరాట పటిమ అవసరాన్ని చాటుతూనే, యుద్ధం ఎవరికి మంచి చేసింది అనే మరో ప్రశ్నను చొప్పించి అన్ని రకాల ఆలోచనలను రగిల్చగలిగే మంచి కథా సృష్టి ఈ సినిమా. చాలా సార్లు రచయిత చెప్పాలనుకుంటున్న విబ్భిన్నమైన కోణాలను తెర పై ఒకే సారి చూపడం కష్టం. కాని ఈ సినిమా మాత్రం ఈ గొప్ప కథకు పూర్తి న్యాయం చేయగలిగింది. అందుకే విమర్శకుల ప్రశంసలు పొందిగలిగింది. 1959 లో తీసిన సినిమా అయినా ఈ రోజు మనం అనుభవిస్తున్న చాలా సమస్యలను ఎదుర్కోవడానికి శక్తిని, ఆలోచనను ఇవ్వగల గొప్ప కళా సృష్టి ఇది. మంచి సినిమాను చూసి అభిమానించే సినీ అభిమానులు తప్పకుండా చూడవలసిన సినిమా Fate of a Man.

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

One thought on “యుద్ధ బీభత్సాన్ని చిత్రించిన రష్యన్ సినిమా ‘Fate of a Man’

Leave a Reply