కన్నీటి సరుల దొంతరలపై రెప్పవాల్చని కాపలా

(త్వరలో రాబోతున్న ఎన్. వేణుగోపాల్ రెండవ కవిత్వ సంపుటం ‘రెప్పవాల్చని కాపలా’ కు తన ముందుమాట)

ఇరవై సంవత్సరాలయింది మొదటి కవితా సంపుటం ‘పా(వురం’ వెలువడి. మొదటి కవిత 1974లో అచ్చయినా, 1980ల్లో విరివిగా రాసినా, ఇరవై ఏళ్ల తర్వాత 2002 లో గాని ‘పా(వురం’ బైటికి తీసుకురాలేదు. తర్వాత గడిచిన ఈ ఇరవై ఏళ్లలో కూడ ఎక్కువగానే కవిత్వం రాసినా, ఎంపిక చేసిన కొన్ని కవితలతో ఇప్పుడు ఈ ‘రెప్పవాల్చని కాపలా’ తెస్తున్నాను. ‘పా(వురం’కూ ‘రెప్పవాల్చని కాపలా’కూ ఒక తేడా ఉంది.

ఆ సంపుటంలో పా(వురం పేరుతో కవిత ఏమీ లేదు, అప్పటి నా కవితలన్నిటి సారాంశంగా ఆ శీర్షిక పెట్టాను. “పా(వురం మా ఇంట్లో మాట. మా వరంగల్ మాట. అచ్చమైన తెలంగాణ మాట. ఏ ‘ప్రామాణిక తెలుగు’ నిఘంటువులోకీ ఎక్కని పా(వురం అంటే ప్రేమ, అభిమానం, ఆప్యాయత, వాత్సల్యం. ఒక ఉన్నత, ఉదాత్త, మానవసంబంధం పా(వురం. ఇది మానవ సంబంధాల కవిత్వం. ఇది పా(వురం కవిత్వం. కవిత్వం మీద, తెలంగాణ మీద, తెలంగాణ ప్రజల జీవన్మరణ పోరాటాల మీద, పోరాటశాస్త్రం మీద నా పా(వురానికి వ్యక్తీకరణ ఈ కవిత్వం” అని అప్పుడు ముందుమాటలో రాశాను.

ఇప్పుడు మాత్రం ఈ సంపుటంలోని ఏదైనా ఒక కవిత శీర్షికనే సంపుటానికి శీర్షిక చేద్దామనుకున్నాను. రెండు మూడు కవితల శీర్షికలు మొత్తంగా నేను చెప్పదలచినదానికి దగ్గరగా ఉన్నాయని వాటిలో ఒకటి ఎంచుకుందామని అనుకున్నాను. కాని ఈ సంపుటాన్ని ముందుగా చదివిన మిత్రులు ఆ పేర్లేవీ కుదరవన్నారు. చివరికి తమిళ ఈలం జాతి ఉద్యమ నాయకుడు ప్రభాకరన్ మీద రాసిన స్మృతి కవితలోంచి ఒక పదబంధం – రెప్పవాల్చని కాపలా – సంపుటానికి పేరుగా బాగుంటుందని మిత్రుడు అఫ్సర్ చేసిన సూచన పాటించాను.

నిజంగానే సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత, ముఖ్యంగా బుద్ధిజీవుల, కవుల బాధ్యత రెప్పవాల్చని కాపలా. ప్రభాకరన్ విషయంలో, శత్రువు కూడ ఇచ్చిన ఆ విశేషణం చివరికి మరణంలోనూ నిజమైందని, ఆయన చివరి ఫొటోలో తెరుచుకుని ఉన్న కళ్లు చెప్పాయి. జీవితమంతా కూడ కళ్లు తెరుచుకునే ఉండాలి. చూపు నిశితంగా ఉండాలి. సంక్షోభమయమైన జనజీవితాన్ని సునిశితంగా పరిశీలిస్తూ ఉండాలి. ఆ సంక్షోభం నుంచి బైటపడడానికి ప్రజలు సాగిస్తున్న అన్ని రకాల ప్రయత్నాలనూ పోరాటాలనూ సమర్థించాలి. ఆ ప్రయత్నాలనూ పోరాటాలను అణచివేయడానికి వ్యవస్థా, వ్యవస్థ పరిరక్షకులూ, యథాస్థితివాదులూ చేసే దుర్మార్గాలకు వ్యతిరేకంగా రెప్పవాల్చని కాపలా కాయాలి. ఇది ప్రతి మానవ మేధ బాధ్యత, ప్రతి మానవాచరణ బాధ్యత. సృజనకారులకు అది మరింత ఎక్కువ బాధ్యత.

మానవ అస్తిత్వంలోని, ఆలోచనలోని, ఆచరణలోని వైవిధ్యమే నా కవితలన్నిటి, ఆ మాటకొస్తే ఏ కవికైనా, అనివార్య, నిరంతర వస్తువు అనుకుంటాను. పారిస్ లో ఐఫెల్ టవర్ దగ్గరి నానాజన సందోహం మధ్య కలిగిన ఆ భావననే ‘మనిషిరూపాలు’ అని రాశాను. ఎప్పుడో ముప్పై నలబై ఏళ్ల కింద చదివి మనసుకు హత్తుకున్న యశ్ పాల్ నవల పేరు కూడ అదే. ‘మనిషిరూపాలు’ ఒకానొక కవిత మాత్రమే కాదు, ఒకానొక స్థలపు, ఒకానొక కాలపు అనుభూతి మాత్రమే కాదు. మనిషి పట్ల నా అవగాహనకు వ్యక్తీకరణ. విస్తారమైన వైశాల్యమూ లోతూ ఉన్న మనిషి బాహుళ్యం పట్ల, అందువల్ల మానవ సంబంధాల వైవిధ్యం పట్ల నా గౌరవానికీ ఆశ్చర్యానికీ అది ఒక వ్యక్తీకరణ.

మనిషికి అసంఖ్యాక రూపాలున్నాయి. కనిపించే రూపాల వెనుక కనిపెట్టలేని అంతస్సారాలున్నాయి. ఆ సారాంశాల బహుళత్వాన్ని ఒక నిర్దిష్ట రూపంలోకో, పొరలుపొరలుగా అనేక రూపాల్లోకో, వ్యక్తీకరణల్లోకో అనువదించడమే కవిత్వం చేసే పని అనుకుంటాను. ఎన్ని వందల తరాలుగా ఎన్ని లక్షల మంది కవులు ఆ అనువాదం చేస్తున్నా ఇంకా చెయ్యవలసిందీ చెప్పవలసిందీ తెలుసుకోవలసినదీ మిగిలి ఉంటున్నది గనుకనే కవిత్వమొక తీరని దాహం. నా శక్తి సామర్థ్యాల మేరకు చేసిన ఆ అనువాదంలో సఫలమయ్యానో లేదో అంతిమంగా చెప్పవలసింది పాఠకులే గాని, నావరకు నేను నా అనువాదం కొన్నిసార్లు భావస్ఫోరకంగానే ఉందనుకుంటాను.

ఈ కవిత్వంలో ఎక్కువగా వయ్యక్తిక, సామాజిక దుఃఖ ఛాయలుండడం కూడ మనిషి రూపాల్లో భాగమే. భూగోళంలోనూ మానవదేహంలోనూ మూడింట రెండు వంతులు నీరు ఉన్నట్టు, మానవ జీవితంలో, మానవ సంబంధాలలో కూడ ప్రతి కంట్లో, ఆలోచనలో, ఆచరణలో, కలయికలో, ఎడబాటులో అపార జలనిధులున్నాయి. కాకపోతే ఇవి కన్నీటి సరుల దొంతరలు. దుఃఖానికి వేల ముఖాలు, మనిషి రూపాల లాగే. ‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి’ అని కవి అన్న మాట నిజం. ఇక్కడి కవితల్లో ప్రత్యక్షంగా దుఃఖాన్నో, వేదననో, విచారాన్నో, కన్నీటినో ప్రకటించని కవితల్లో కూడ అంతర్లీనమైన కన్నీటి ధార ఉండనే ఉంటుంది.

కవిత దానికదిగా వ్యక్తం కావాలనీ, అత్యవసరమైతే తప్ప దాని నేపథ్య ప్రస్తావన ఉండనక్కరలేదని భావిస్తాను గనుక ఈ కవితల నేపథ్యం ప్రత్యేకంగా చెప్పడం లేదు. ఈ కవితల్లో అత్యధికం మానసిక, శారీరక, సామాజిక రాజకీయ గాయాల గురుతులూ ప్రతిస్పందనలూ అని మాత్రం చెపితే చాలు. కొన్ని సంతోషాల, గాఢమైన అనుభూతుల వ్యక్తీకరణలు, చారిత్రక జ్ఞాపకాలు కూడ ఉన్నాయి.

ఈ రెండో కవితా సంపుటం ప్రచురించడానికి ఇరవై ఏళ్లు తీసుకోవడానికి మరొక కారణం నేను అభిమానించే కవుల కవిత్వంతో పోల్చుకుని, నన్ను నేను కవిని కాదనుకోవడం. అసలు తెలుగు సమాజ సాహిత్యాలలో ఈ కవి గుర్తింపు అనేదే ఒక సమస్యాత్మక అంశం. ఇతరేతర రంగాలలో పనిచేస్తున్నా, కవిత్వ రచనలో అంతగా లేకపోయినా, కవి అనిపించుకోవాలనే కోరిక బహుశా తెలుగు సాహిత్యకారుల్లో ఎక్కువ. కవిత్వంతోనే ప్రారంభించినప్పటికీ కవిత్వం కన్నా చాలా ఎక్కువగా సాహిత్య విమర్శ, సాహిత్య చరిత్ర, సామాజిక – రాజకీయ విమర్శ రాసిన కెవిఆర్ గారు అన్నిటికన్నా ఎక్కువగా కవిగా గుర్తింపునే కోరుకున్నారు. నాలుగు దశాబ్దాల పైబడిన నా సాహిత్య జీవితంలో మొత్తం రచనల్లో కవిత్వం రాశి రీత్యా చూస్తే పది శాతం కూడా కాదు. జర్నలిస్టుగా, వ్యాస రచయితగా, రాజకీయార్థిక శాస్త్ర విశ్లేషకుడిగా, వక్తగా ఎంతో కొంత గుర్తింపు ఉన్నప్పటికీ కవిగా గుర్తింపు లేకపోవడం సహజమే. ఆ ఉన్న గుర్తింపులు కూడ నిజం కాకపోవచ్చు గాని ఆ గుర్తింపుల కింద కవి అసలే లెక్కకు రాలేదు.

అయినా మరొక సామాజిక, తాత్విక స్థాయిలో అసలు మనుషులందరూ కవులే అని నా నమ్మకం. చూసిన, విన్న, అనుభవించిన, ఊహించిన దాన్ని పదచిత్రాల్లో, పోలికల్లో చెప్పడం, ఇతరుల కన్నా విభిన్నమైన, వినూత్నమైన ఊహలు చేయడం, కనబడుతున్న దానికి మించినదేదో ఉందని అన్వేషించడం, దాన్ని అక్షరాల్లోకి అనువదించాలని ప్రయత్నించడం, సృజనాత్మకత, నవ్యత, భావనా శబలత, అలంకారం, ధ్వని వంటి అనేక కవిత్వ దినుసులు నిజానికి ప్రతి మానవ మేధకూ సహజమైనవే, సాధ్యమైనవే. అంటే ప్రతి మానవ మేధా కవిత్వం రాయగలిగినదే, కవి కాగలిగినదే. అక్షరాల్లోకీ, అచ్చులోకీ రాకపోయినా మనసులో కవిత్వం రాసుకోనివాళ్లు ఎవరూ ఉండరని నా విశ్వాసం. మరీ ముఖ్యంగా ప్రేమ, ఎడబాటు, దుఃఖం, గాయం, కరుణ వంటి తీవ్రమైన అనుభవాల అగ్నిలో దగ్ధమయ్యే మనిషిలో తప్పనిసరిగా కవిత్వం పెల్లుబుకుతుంది. అయితే అన్ని రంగాల్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా పరిశీలన, అధ్యయనం, సాధన, శ్రమ, సమయం కేటాయింపు వంటి అదనపు కృషి కొందరిని కవులుగా మారుస్తుంది. మిగిలిన వారికి వాటి మీద శ్రద్ధ లేకపోయినా, ఇవ్వవలసినంత సమయం ఇవ్వలేకపోయినా వాళ్లు కవులు కాలేరు, అరకొర కవులుగా మిగులుతారు. ఏదో ఒక కవితలో, ఒక కవితా సంపుటంలో ఒక వెలుగు వెలిగి ఆరిపోతారు. కొందరికి అదీ ఉండదు.

నేను అటువంటి కవిత్వం రాయగలిగానో లేదో తెలియదు. అనేకానేక కారణాల వల్ల బాల్యంలోనే కవిత్వంతో ఎలా ప్రేమలో పడ్డానో నా ‘కవిత్వంతో ములాఖాత్’లో ఇదివరకే చెప్పి ఉన్నాను. అలా ఏడెనిమిదేళ్ల వయసుకే కవిత్వం మీద అభిమానం, ఎక్కడ కవిత్వం దొరికినా చదవడం మొదలయ్యాయి. పదమూడో ఏట మొదటి కవిత అచ్చయింది. నలబయ్యో ఏట పా(వురం కవితా సంపుటం అచ్చువేశాను. నలబై ఏళ్లుగా దేశాదేశాల అనేక భాషల కవిత్వాన్ని ఇంగ్లిష్ నుంచీ హిందీ నుంచీ తెలుగు పాఠకులకు పరిచయం చేశాను. కనీసం ఇరవై మంది కవుల సంపుటాలకు ముందుమాటలు రాశాను. మొదటి సంపుటం తర్వాత రెండు సంపుటాలకు సరిపోయేంత కవిత్వం రాశాను. అయినా మరొక సంపుటం వేయడానికి సంకోచంతోనే ఉన్నాను.

ఈ సంపుటంలో ‘వెనుకవరుస మేలు’ అనే కవితలో వ్యక్తమైనది ఆ సంకోచ స్వభావమే. స్థలకాల పరిస్థితులూ సమాజమూ ఒక వ్యక్తిని ముందుకు తోసినప్పటికీ, ఆ వ్యక్తి ఆ బాధ్యతను ఆ క్షణానికి నిర్వర్తించక తప్పనప్పటికీ, ప్రతి మనిషీ వెనుకవరుస మేలు అనుకోవాలని నేననుకుంటాను. కొందరికి అపరిమిత అవకాశాలూ, కొందరికి అపారమైన నిరాకరణలూ ఉన్న మన సమాజం వంటి అంతరాల సమాజంలో, ఇప్పటికే అవకాశాలు దక్కిన వర్గాలవారు ఉద్దేశపూర్వకంగా వెనుక వరుస ఎంచుకోవడం చాల అవసరమని అనుకుంటాను. అది ఇతరుల అవకాశాలు గుంజుకోకుండా ఉండడానికి, ఇతరులకు అవకాశం ఇవ్వడానికి, అతిశయం నుంచీ అహంకారం నుంచీ సంకల్పపూర్వకంగా దూరం జరుగుతూ వినయాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుందని అనుకుంటాను.

నాకు ఈ అవగాహన కలగడానికి కొంత చరిత్ర ఉంది. బాస్టన్ విమెన్స్ కలెక్టివ్ ప్రచురించిన ‘అవర్ బాడీస్ అవర్ సెల్వ్స్’ పుస్తకం మొదటిసారి 1982-83ల్లో చదివాను. ఆ పుస్తకం అప్పటి కూర్పు ముందుమాటలో ఒక మాట రాశారు: “స్త్రీల స్వభావం అని మన మీద రుద్దిన ముద్రలను వదిలించుకోవడం అవసరం. అలాగే కొన్ని ముద్రలను పునర్వ్యాఖ్యానించడం, కొత్త అర్థాలు ఇవ్వడం కూడ అవసరం. ఉదాహరణకు అణచివేస్తూ, అందరినీ వెనక్కి తోసేస్తూ ముందువరుసలోకి దూసుకుపోయే పురుషుడి ప్రతీకకు భిన్నంగా స్త్రీ అంటే బిడియంగా, వెనక్కి తగ్గి, అంచులలో ఉంటుందనే ముద్ర ఉంది. ఈ ముద్రను తీసేసుకోవడానికి మనమేమీ ఎవరినీ అణచివేసే స్థానంలోకి, అందరినీ వెనక్కి తోసేసి ముందుకు దూసుకుపోయే వైఖరికి వెళ్లనక్కరలేదు. వెనుక వరుసలోనూ ఉండవచ్చు. అప్పుడే జరిగేదంతా చూసే అవకాశమూ ఉంటుంది. అవసరమైనప్పుడు, మనం కావాలనుకున్నప్పుడు ముందుకు వెళ్లి జోక్యం చేసుకోగలిగిన అవకాశమూ స్థిమితమూ ఉంటాయి. ముందు వరుసలోనే ఉంటే మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా జోక్యం చేసుకోవలసిందే. వెనుక ఏం జరుగుతుందో కూడ తెలియదు. కనుక వెనుక ఉండడాన్ని ప్రతికూల విలువగా ఏమీ తీసుకోనక్కరలేదు.”

సరిగ్గా ఇవే మాటలు కాకపోవచ్చు. తర్వాతి కూర్పులలో ఈ మాటలు లేవు గనుక వాళ్లే అభిప్రాయం మార్చుకుని కూడ ఉండవచ్చు. కాని నా మనసులో నిలిచిపోయిన చిత్రం అది. నాకు ఆ మాటలు చాల ఉపయోగపడ్డాయి. విద్యార్థి జీవితంలో తరగతి గదుల్లో మాత్రమే కాదు, సభలూ సమావేశాల్లో కూడా వెనుక వరుసలో కూచోవడానికి, అవసరమైతేనే, కోరితేనే మాట్లాడడానికి నేను ఇష్టపడతాను. వక్తగా గుర్తింపు నా ఆ కోరికను చాలాసార్లు వమ్ము చేస్తుంది గాని వీలయినంత వరకు అలా ఉండడానికే ప్రయత్నిస్తాను.

దాదాపు పదేళ్ల కింద హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ హాలులో ఒకసారి నేను వెనుక వరుసలో కూచుని ఉండగా కేతు విశ్వనాథ రెడ్డి గారు వచ్చి నా పక్కన కూచోబోయారు. ‘అయ్యో సార్ మీరు ముందుకు వెళ్లాలి’ అన్నాను. ‘ఇదే సేఫ్. ఇంక ఇక్కడి నుంచి వెనక్కి ఎవరూ పంపించలేరు గదా’ అన్నారాయన. అప్పుడు మదిలో మెదిలిన వాక్యం ఆ తర్వాత రెండు మూడేళ్లు మనసులో నాని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతి పరిణామాల్లో ఆ కవితగా రూపు దిద్దుకుంది.

అలా వెనుకవరుసలో ఉండాలనే కోరికలో భాగమే ఈ పుస్తకం వేయడంలో చూపిన సంకోచం. కాని అయిదారేళ్లుగా మా తమ్ముడు వెంకన్న (వెంకట్ నాగిళ్ల) నా కవిత్వ పుస్తకం వేయమని వెంటపడుతున్నాడు. నన్ను ఎన్నోసార్లు అడిగి, నేను చూద్దాంలే అని తాత్సారం చేస్తుండడంతో ఈ పుస్తక ప్రచురణకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసి, నాకు మరొక అవకాశం లేకుండా చేశాడు. తను ఇష్టపడడు గనుక కృతజ్ఞతలు చెప్పలేను గాని బోలెడంత ప్రేమ ప్రకటిస్తున్నాను.

ఈ సంపుటం లోని యాబై ఏడు కవితల్లో పది పదిహేను మాత్రమే ఇంతకు ముందు పత్రికల్లో అచ్చయ్యాయి. మిగిలినవి ఎవరికీ పంపకుండా ఉండిపోయినవో, లేదా సోషల్ మీడియాలో మాత్రం పంచుకున్నవో. అచ్చువేసిన పత్రికా సంపాదకులకు, సోషల్ మీడియాలో పంచుకునే అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు.

ఈ సంపుటం ముద్రణకు ముందరి ప్రతి పంపగానే స్పందించి, నాలుగు మాటలు రాసిన గౌరవనీయ కవి మిత్రులు సృజన్, ఎండ్లూరి సుధాకర్, అఫ్సర్ గార్లకు, విలువైన సూచనలు చేసిన తమ్ముడు పలమనేరు బాలాజీకి, పెద్దలు నిజం శ్రీరామమూర్తి గారికి, ముద్రణకు ముందరి ప్రతి అందుకొని స్పందించని కవి, విమర్శక మిత్రులకు, నా గురించి గతంలో రాసిన కవితను ఇక్కడ పునర్ముద్రించడానికి అనుమతించిన కృష్ణుడికి ధన్యవాదాలు.

ఈ కవితా వస్తు శిల్పాల ప్రేరణలో, నా ఆలోచనాచరణలలో వీక్షణం కలెక్టివ్ మిత్రులతో సహా ఎందరెందరో ప్రత్యక్ష, పరోక్ష, జ్ఞాత, అజ్ఞాత మిత్రులున్నారు. అందరికీ కృతజ్ఞతలు.

ఈ సంపుటాన్ని రూపుదిద్దిన భావన గ్రాఫిక్స్ బంగారు బ్రహ్మం గారికి, అచ్చువేసిన బెజవాడ నాగేంద్ర ప్రెస్ బాబూరావు గారికీ, పద్మకూ, బాబికీ, కార్మికులకూ కృతజ్ఞతలు.

వివి, ఇతర కుటుంబ సభ్యులు, వనజ, విభాత నా జీవితంలోనూ కవిత్వంలోనూ అనుక్షణ అవిభాజ్య భాగాలు గనుక వాళ్లూ ఈ కవిత్వంలో ఉన్నారు.

ఒక వ్యక్తి అభివ్యక్తిగా వెలువడి, గుర్తింపు పొందినప్పటికీ సమాజం లేకుండా, మానవసంబంధాలు లేకుండా, తరతరాల మానవ సంపద అయిన భాష లేకుండా, ఆ భాషలో ఒక కవిత్వ సంప్రదాయం లేకుండా, జీవితానుభవం లేకుండా కవిత్వం లేదు. ఈ కవిత్వం నా వ్యక్తీకరణ అయినప్పటికీ, ఈ కవిత్వంలో ప్రతిఫలించిన సమాజం ఉంది, ఎందరెందరో దృశ్యాదృశ్య మనుషులున్నారు, మానవసంబంధాలున్నాయి, చారిత్రక వారసత్వంగా వచ్చిన భాష ఉంది, ఐదు దశాబ్దాల కవిత్వ పఠన, మనన అనుభవం ఉంది. ఒక్కమాటలో మనిషి రూపాలున్నాయి, మనిషి పట్ల విశ్వాసం ఉంది. రెప్పవాల్చని కాపలా ఉంది. ఆ అపార, అనంత, అద్భుత మానవ సారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు.
ర‌చ‌న‌లు: 'స‌మాచార సామ్రాజ్య‌వాదం', 'క‌ల్లోల కాలంలో మేధావులు - బాల‌గోపాల్ ఉదాహ‌ర‌ణ‌', 'అమ్మ‌కానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌', 'క‌థా సంద‌ర్భం', 'క‌డ‌లి త‌ర‌గ‌', 'పావురం', తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛిన‌మ‌వుతున్న వ్య‌క్తిత్వం, 'పోస్ట్‌మాడ‌ర్నిజం', 'న‌వ‌లా స‌మ‌యం', 'రాబందు నీడ‌', 'క‌ళ్ల‌ముంద‌టి చ‌రిత్ర‌', 'ప‌రిచ‌యాలు', 'తెలంగాణ‌ - స‌మైక్యాంధ్ర భ్ర‌మ‌లు, అబ‌ద్ధాలు, వాస్త‌వాలు', 'శ్రీశ్రీ అన్వేష‌ణ‌', 'లేచి నిలిచిన తెలంగాణ‌', 'ప్ర‌తి అక్ష‌రం ప్ర‌జాద్రోహం - శ్రీకృష్ణ క‌మిటీ నివేదిక‌', 'రాబందు వాలిన నేల‌', 'ఊరి దారి- గ్రామ అధ్య‌య‌న ప‌రిచ‌యం', 'విద్వేష‌మే ధ్యేయంగా విశాలాంధ్ర మ‌హార‌భ‌స‌', 'క‌విత్వంతో ములాఖాత్‌', 'సమాజ చలనపు సవ్వడి', 'కాషాయ సారం', 'విద్వేషాపు విశ్వగురు', 20కి పైగా అనువాదాలు.
సంపాద‌క‌త్వం: 'Fifty Years of Andhrapradesh 1956-2006', 'Telangana, The State of Affairs', '24గంట‌లు', 'హైద‌రాబాద్ స్వాతంత్య్ర సంరంభం', 'జ‌న హృద‌యం జ‌నార్ద‌న్‌', 'స‌మ‌గ్ర తెలంగాణ' పుస్త‌కాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

3 thoughts on “కన్నీటి సరుల దొంతరలపై రెప్పవాల్చని కాపలా

  1. పావురం గానే ” రెప్పవాల్చని కాపలా” కై ఎదురు చూపు – అభినందనలు.

  2. మీ రెండవ కవితకు చక్కటి పరిచయ ముందు మాట. మీ రచనలే క్రమం తప్పకుండా చదివే అబిమానుల్లో (కొండొకచో చిన్నగా అసూయ పడతాను మీ రాతల్లో ఉండే క్రమ బద్ధం చూసి) ఒకడిగా మీ రెండవ కవితా సంపుటనికై ఎదురు చూస్తుంటాను

  3. వెల్కమ్ అండ్ కంగ్రాట్స్ వేణు గారూ!

Leave a Reply