‘మో షా’ వాషింగ్ మెషిన్- రాజకీయాలు

‘నేను అవినీతికి పాల్పడను.. అవినీతిని ప్రోత్సహించను’ (నా ఖావుంగా, నా ఖానే దూంగా) అనే నరేంద్ర మోదీ నినాదం ఒట్టి బూట‌క‌మ‌ని తేలిపోయింది. ఒకప్పడు అవినీతిపరులుగా బీజేపీ స్వయంగా మద్ర వేసిన నేతలే ఇప్పడు ఆ పార్టీకి సారథులయ్యారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీల నుండి బిజెపిలోకి పిరాయించే ఎంపి, ఎమ్మెల్యేలను అక్కున చేర్చుకోవ‌డానికి ‘వాషింగ్ మెషిన్‌’ రాజకీయాలను బిజెపి చేస్తుంది. “వాషింగ్ మెషీన్” అనేది ఒక తీవ్రమైన రాజకీయ రూపం. తీవ్రమైన అవినీతి లేదా నేరారోపణ లను ఎదుర్కొంటున్న ప్రతిపక్ష రాజకీయ నాయకులు అధికార పార్టీలోకి ఫిరాయించిన తర్వాత వారి అవినీతి మ‌టుమాయ‌మై పోతున్న‌ది. చ‌ట్ట‌వ్య‌తిరేక చ‌ర్య‌లు సమస్యలు “పరిష్కరించబడతాయి” లేదా తొలగించబడతాయి అనే దృగ్విషయాన్ని వివరించడానికి దీనిని ఉపయోగిస్తున్నారు.

‘బిజెపి వాషింగ్ మెషీన్’ అనేది ఒక అధికారిక ప్రభుత్వ విధానంగా మారిపోయింది. ఇతర పార్టీల నుండి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు బిజెపిలో చేరిన వెంటనే, వారిపై ఉన్న కేసులు మాఫీ అయిపోవడం లేదా దర్యాప్తు సంస్థలు వారికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని విపక్షాలు వ్యంగ్యంగా ఈ పేరుతో పిలుస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు బిజెపిలో చేరగానే లేదా ఆ పార్టీతో పొత్తు పెట్టుకోగానే, ఆటోమెటిక్ వాషింగ్ మెషిన్‌లో బట్టలు ఉతికినట్లుగా వారిపై ఉన్న కేసులు రద్దు అవుతున్నాయి. రూ. 35,000 కోట్ల కుంభకోణంలో గాలి జనార్థన్‌రెడ్డి ప్రమేయం, ఆయనపై ఉన్న పలు కేసులు ఉండ‌గానే, ఆయనను తిరిగి పార్టీలోకి స్వాగతించడాన్ని బిజెపిని ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించిన తర్వాత, బిజెపి వాషింగ్ మిషన్ వ్యాఖ్య వైరల్ అయింది. 2014 నుండి జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించి పోటీ చేసిన వారు 1,133 మంది అభ్యర్థులున్నారు.

రాజకీయ నేతల అవినీతి-ఫిరాయింపులు :
లూయిస్ బెర్గర్ కుంభకోణంలో కేవలం భారీ మొత్తంలో డబ్బు మాత్రమే కాకుండా, పలుకుబడి ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. పలు నీటి అభివృద్ధి ప్రాజెక్టుల కాంట్రాక్టులను దక్కించుకోవడానికి 2010లో భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. ఆ మొత్తం దిగ్భ్రాంతికరమైన రీతిలో సుమారు రూ. 6.5 కోట్లు 2010లో ఆ పదవిలో ఉన్న, పేరు వెల్లడి కాని ఒక మంత్రికి ఈ లంచం చెల్లించారు. పలు దేశాల్లోని ఉన్నతాధికారులకు లంచాలు ఇచ్చినట్లు 2015 జూలైలో లూయిస్ బెర్గర్ అధికారులు అమెరికా కోర్టులో అంగీకరించారు. 2014లో దేశంలోని పశ్చిమబెంగాల్‌లో నారద న్యూస్ జర్నలిస్ట్ మాథ్యూ శామ్యూల్ నిర్వహించిన ఒక రాజకీయ స్టింగ్ ఆపరేషన్‌ను నిర్వ‌హించారు. ఈ రహస్య ఆపరేషన్‌లో, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టియంసి)కు చెందిన పలువురు ఉన్నత స్థాయి నాయకులు, ఒక సీనియ ర్ ఐపిఎస్ అధికారి, ఒక కల్పిత కంపెనీకి అనధికారిక సహాయాలు చేసినందుకు ప్రతిఫలంగా నగదు లంచాలు తీసుకుంటుండగా కెమెరాలో చిక్కారు. ప్రతిపక్ష పార్టీలు విస్తృతంగా ఉపయోగించే ‘ఆపరేషన్ లోటస్’ అనే పదం కర్ణాటక(2019), గోవా (2022) వంటి కేసులలో భారత మీడియా చూసినట్లుగా, రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి, కూల్చివేయడానికి ప్రతిపక్ష శాసనసభ సభ్యులను (ఎమ్మెల్యేలను) క్రమపద్ధతిలో ప్రలోభ పెట్టడాన్ని సూచిస్తుంది.

2019లో కర్ణాటక కాంగ్రెస్, జెడిఎస్ పార్టీలకు చెందిన 17 మంది ఎమ్మేల్యేలు రాజీనామా చేసి బిజెపిలో చేరారు. దీనివల్ల అక్కడ బిజెపి ప్రభుత్వం ఏర్పడింది. 2020లో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మేల్యేలు మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వంలో రాజీనామా చేసి, బిజెపిలో చేరడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. 2019, 2022 ఎన్నికల సమయంలో గోవా కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. 2022 మహారాష్ట్ర శివసేనలో చీలిక ఏర్పడిన ఏక్‌నాథ్ షిండే వర్గం బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తదనంతరం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)లో కూడా చీలిక వచ్చి అజిత్ పవార్ వర్గం బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ కూటమిలో చేరింది. ఈశాన్య రాష్ట్రాల్లో వివిధ ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో బిజెపిలో విలీనమయ్యారు.

నారదా టేప్స్ మొదలు లూయిస్ బెర్గర్ కుంభకోణం వరకు ఆరోపణలు ఎదుర్కొన్న నాటి ప్రతిపక్ష నాయకులు నేడు బీజేపీ తరపున ముఖ్యమంత్రులుగా అధికార పీఠాలపై కూర్చున్నారు. ‘బిజెపి వాషింగ్ మెషీన్ మోడీ వాషింగ్ పౌడర్‌తో మళ్లీ వచ్చేసింది. సద్గుణం, నిజాయితీ, సిద్ధాంతాలకు ప్రతీకలమని తమను తాము ప్రదర్శించుకున్న వారు దారుణంగా బట్టబయలయ్యారు’. 2014 నుంచి బిజెపి ప్రభుత్వం మోడీ నాయకత్వం తన ఉనికిని విస్తరించుకోవడానికి ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయడానికి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో బలం పెంచుకోవాల్సిన అవసరం కీలకంగా మారిన దశలో అధికార బిజెపి… ఆప్‌కు చెందిన ఏడుగురు ఎంపీలను తమ పార్టీలోకి లాక్కున్న వైఖరి క‌నిపిస్తూనే ఉన్న‌ది. వారి గత సిద్ధాంత‌ వైఖరులకు, ప్రస్తుత రాజకీయాల‌కు మధ్య వైరుధ్యం కనిపిస్తోం దని, అవినీతిని అంతం చేయడం కాకుండా దానిని సొంతం చేసుకోపడమే మోదీ విధానంగా కనిపిస్తోంది. దీంతో మోదీ రాజ్యంలో అవినీతిపరులకే పట్టమన్న తీరు క‌నిపిస్తోంది.

2024లో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మోడీ నేతృత్వంలో మూడవసారి ఏర్పడినప్పటి నుండి, ఇతర రాజకీయ పార్టీలను చీల్చ‌డానికి, ఆ తరువాత వాటి అస్తిత్వాన్నే ప్రశ్నార్థకంగా మార్చ‌టానికి ఎన్ని విన్యాసాలు చేయాలో బిజెపి అన్ని విన్యాసాలూ చేస్తోంది. రాజకీయ పార్టీలను చీల్చడానికి మోడీ ప్రభుత్వం తన ఆధీనంలోని సిబిఐ, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి), ఆదాయపు పన్ను శాఖను ఆయుధంగా ప్రయోగించడం సర్వసాధారణమై పోయింది. ఎన్నికల్లో విజయం సాధించడానికి ఎన్ని అడ్డదారులు తొక్కాలో బిజెపి అన్ని అడ్డదారులూ తొక్కుతోంది. బిజెపికి సాధించదలచుకున్న లక్ష్యం మీద ఉన్న దృష్టి అనుసరించే మార్గం మీద ఎప్పుడూ లేదు. సైద్ధాంతిక అంశాలను వల్లిస్తూ స్వార్థ ప్రయోజనాల కోసం నాయకులు ఎలా పార్టీలు మారతారో అందరికీ తెలుసు. విద్రోహం లాంటి మాటలు, విమర్శలు ఇలాంటి పరిస్థితిలో వ్యర్థ పదాలుగానే మిగిలిపోయాయి. ఇవ్వాళ్టీ నేతలకు నైతిక విలువల కంటే పదవులు ప్రధానమైనాయి. ఒక సిద్ధాంతం అంటూ ఉంటే, దాన్ని నమ్మితే, తరువాత దాన్ని ఉల్లంఘిస్తే అది విద్రోహం అవుతుంది. ఆ బాదర బంధీ లేనప్పుడు విద్రోహం అన్న మాటకు అర్థమే లేదు. అస్తవ్యస్త నడవడికకు సిద్ధాంతం ఒక సాకు మాత్రమే.

ప్రత్యర్థి నేతలపై బిజెపి ఆరోపణలు :
దేశవ్యాప్తంగా ఏటా పలు రాష్ట్రాల్లో వివిధ విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మేల్యేలు బిజెపి పార్టీలోకి ఫిరాయిస్తున్నారు. కొన్నిచోట్ల అధికార పార్టీలను సైతం వీడి విపక్షాల్లోకి ఫిరాయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఫిరాయింపుల బెడద ఎక్కువగానే ఉంది. ఈశాన్య రాష్ట్రం అసోంలో హిమంత విశ్వశర్మ దీనికి మొదటి ఉదాహరణగా చెప్పొచ్చు. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు లూయిస్ బెర్గర్ లంచం కేసులో బిజెపి తీవ్ర ఆరోపణలు చేసింది. అప్పట్లో విడుదల చేసిన పుస్తకాల్లో ఆయనను అవినీతి ముఖచిత్రంగా చూపించింది. కానీ 2015లో ఆయన బిజెపిలో చేరాక ఆ ఆరోపణలన్నీ కనుమరుగయ్యాయి. ఇక బీహార్‌లో సామ్రాట్ చౌదరీపై హత్య కేసు, వయస్సు తారుమారు ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఇప్పుడు బిజెపి నాయక త్వం వాటిని పూర్తిగా విస్మరించింది. ఆయన కోసం నితీశ్ కుమార్‌ను తప్పించి మరీ బిజెపి అధినాయక త్వం సామ్రాట్ చౌదరీని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది. అలాగే మరో ఈశాన్య రాష్ట్రం అరుణాచ ల్ ప్రదేశ్‌లో పెమా ఖండూ పలు పార్టీలు మారుతూ ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

2014 నుంచి కాంగ్రెస్ అత్యధిక సంఖ్యలో ఫిరాయింపులను చవిచూడగా, మోడీ దేశ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి బిజెపి అతిపెద్ద లబ్ధిదారుగా నిలిచిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ (ఎడిఆర్) నివేదిక పేర్కొంది. మొత్తం ఫిరాయింపులలో, 2014- 2021 మధ్యకాలంలో దాదాపు 35 శాతం మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ నుంచి ఫిరాయించగా, బిజెపి నుంచి కేవలం ఏడు శాతం మంది మాత్రమే ఫిరాయించారని ఆ విశ్లేషణ తెలిపింది. ఫిరాయించిన చట్టసభ సభ్యులలో సుమారు 35శాతం మంది బిజెపిలో చేరారని ఆ నివేదిక వివ‌రాల‌ను జోడించింది. కాంగ్రెస్ ఎన్నికల అభ్యర్థులలో 20 శాతం మంది పార్టీని వీడగా, ఆ తర్వాత మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) 14 శాతం మంది అభ్యర్థులను ఇతర పార్టీలకు కోల్పోయింది. ఊహించినట్లుగానే, ఫిరాయించిన ఎన్నికల అభ్యర్థుల లో అత్యధికులు బిజెపిలో చేరారు.

పశ్చిమ బెంగాల్‌లో మొదలై ఇరుగుపొరుగు రాష్ట్రాలకు పాకిన శారద చిట్‌ఫండ్ కుంభకోణంలో హిమంత, సువేందులు ఇద్దరూ అవినీతికి పాల్పడినట్లు వార్తలు వ‌చ్చాయి. సువేందు ఏకంగా నారదా స్టింగ్ ఆపరేషన్‌లో రూ.5 లక్షలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దీనిపై బిజెపి అవినీతిపరులని ఆందోళనలు చేయడమే కాక, శారద చిట్‌ఫండ్ కుంభకోణంపై కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం సిబిఐ దర్యాప్తును చేపట్టింది. ఈ విషయంలో వారిద్దరూ విచారణను ఎదుర్కొన్నారు. ఇటు హిమంత, సువేందులపై స్వయంగా నరేంద్ర మోడీ గతంలో ఎన్నికల ప్రచారాలలో అవినీతి ఆరోపణా స్థ్రాలను సంధించారు. వీరిద్దరికీ తీవ్రమైన రాజకీయ కాంక్షలు, ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనే లక్ష్యం ఉండేది. కానీ, అవినీతి కేసులు, వేధింపులు ఆటంకాలుగా మారాయి. అదే సమయంలో బిజెపి ఎంతో కాలంగా అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతూ నే ఉన్నాయి. ఇదే అదునుగా భావించి ఆగష్టు 2015లో హిమంత, డిసెంబర్ 2020లో సువేందు బిజెపిలో చేరిపోయారు.

ఒకప్పుడు ‘దేశాన్ని దోచుకున్నవారు’ అని బిజెపి ఆరోపించిన నేతలే ఇప్పుడు ఆ పార్టీకి ముఖ్య మంత్రులు, ప్రాంతీయ శక్తులుగా మారారు. విమర్శలు ఎదుర్కొన్న విపక్ష నేతలు బిజెపిలో చేరిన వెంటనే పరిశుద్ధులుగా మారిపోవడాన్ని కాంగ్రెస్ విమర్శిస్తూ దానిని ‘వాషింగ్‌మిషన్ రాజకీయంగా’ అభివర్ణిస్తున్న ది. వారి మీద ఉన్న కేసులు, దర్యాప్తులు అదృపులు అదృశ్యమవడమో, నత్తనడకన సాగడమో జరుగుతు న్నా యి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు బిజెపిలోకి రాగానే వాషింగ్‌మిషన్‌లో శుభ్రపర్చి నట్టుగా ‘క్లీన్’ అవుతారని ప్రతిపక్షాలు సంధించి వ్యంగ్య్రాస్త్రాలు నిజమేనని తాజా రాజకీయ పరిణామాలు నిరూపిస్తున్నాయి. అసోంను హిమంత బిశ్వ శర్మకు కట్టబెట్టిన తర్వాత ఇప్పుడు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం ఈ చర్చకు తావిస్తోంది. మోడీ అవినీతి వ్యతిరేక పోరాటం ఏనాడు చేయలేదు. ఆయన నాయకత్వంతో బిజెపి నడిపినది అత్యున్నత స్థాయి మనీ లాండరింగ్ ఆపరేషన్ అన్న విమర్శలు ఉన్నాయి. హైప్రో ఫైల్ అవినీతి కేసులే మోడీ పాలనలో సిఎం పదవికి అర్హులన్న తీనే క‌నిపిస్తున్న‌ది.

అవినీతి నేతలకే ముఖ్యంత్రి పీఠాలు :
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ 2001 నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ, తరుణ్ గోగోయ్ ప్రభుత్వంలో విద్య, ఆరోగ్యం, ఆర్థికం వంటి ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. 2015 ఆగస్టులో, ఆయన కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరారు. 2016లో కీలక మంత్రిగా, 2021 మే లో అసోం ముఖ్యమంత్రిగా ఆయనను బిజెపి నియమించింది. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు లూయిస్ బెర్గర్ లంచం కేసులో బిజెపి తీవ్ర ఆరోపణలు చేసింది. అప్పట్లో విడుదల చేసిన పుస్తకాల్లో ఆయనను అవినీతి ముఖచిత్రంగా చూపించింది. అవన్నీ మరిచిపోయి, మరోసారి సిఎం పదవి కట్టబెడుతోంది.

సువేందు అధికారి ప్రస్తుత పశ్చిమ బెంగాల్ సిఎం. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాలలో మమతా బెనర్జీకి అత్యంత విశ్వసనీయ నాయకులలో ఒకడు. ఆయన రాజకియ జీవితం కాంగ్రెస్‌తో ప్రారంభమైనప్పటికీ, 1998లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. నందిగ్రామ్‌లో మమతా బెనర్జీతో కలిసి నానా యాగీ చేశాడు. 2020లో ఆయన తృణమూల్ కాంగ్రెస్‌ని వీడారు. 2020 డిసెంబర్ 19న అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరారు. 2026లో పశ్చిమ‌బెంగాల్‌ సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అప్పట్లో బిజెపికి అవినీతి అనకొండగా కనబడ్డవాడు, ఇప్పుడు అదే నేతను బిజెపి ‘బెంగాల్ రక్షకుడు’గా కీర్తించడం కాషాయ పార్టీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం.

బీహార్ నూతన ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కూడూ ఈ జాబితాలో ఉన్నారు. ఆయన మొదట ఆర్‌జెడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత జెడియులో మంత్రిగా పనిచేశారు. 2018లో, బిజెపిలో చేరి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఉప ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1995 నాటి హత్య కేసు, వయస్సు తారుమారు ఆరోపణలు ఉన్నప్పటికీ.. బిజెపిలో చేరాక ఆ పార్టీ నాయకత్వం వాటిని పూర్తగా విస్మరించింది. నితీశ్ కుమార్‌ను తప్పించి మరీ సామ్రాట్ చౌదరీని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది.

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండా 2016లో, కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా అయ్యారు. అదే సంవత్సరం ఆయన మొదట పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పిపిఎ)లో చేరి, ఆ తర్వాత మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో కలిసి బిజెపిలో చేరారు. అనంతరం బిజెపి ఆయనను ముఖ్యమంత్రిగా కొనసాగించింది.

ఇతర పార్టీల నుంచి వచ్చిన కీలక నేతలలో అసోం గణపరిషత్‌కు చెందిన సర్బానంద సోనోవాల్ బిజెపిలో చేరడంతో అసోం సిఎంగా అవకాశం కల్పించింది. కారగ్రెస్ నుంచి వచ్చిన ఎన్. బీరెన్ సింగ్ మణిపూర్ అల్లర్లకు కాకుడిగా ఉన్న ముండా బిజెపిలో చేరి, సిఎంగా పనిచేశారు. ఈ జాబితాలో ముఖ్యమంత్రులే కాదు, కేంద్ర క్యాబినెట్లో ఉన్న మంత్రులు జ్యోతిరాదిత్య సింధియాతో పాటు పలువురు ఎంపీలు తమ పదవులను కాపాడుకోవడం కోసం బిజెపిలో చేరడం దేశ ప్రజలకు తెలియనిదేమి కాదు.

బిజెపి నాలుగు ‘ఐ’ల ఫార్ములా :
మోడీ పాలనలో బిజెపి నాలుగు ఐ ల ఫార్ములాను అమలు చేస్తోందని చెప్తున్నారు. అవి.. ఐడెంటిపై (గుర్తించు), ఇన్వెస్టిగేట్ (దర్యాప్తు), ఇండక్ట్(చేర్చుకోవడం), ఇనాగురేట్ (పదవి ఇవ్వడం). ప్రతిపక్ష నేతను భారీ అవినీతి కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా చూపించడం ‘ఐడెంటిపై’లో భాగం. ఇన్వెస్టిగేట్‌లో సదరు నేతపై కేంద్ర దర్యాప్తులను ఎదుర్కొన్నవారి 90 శాతం మంది ప్రతిపక్ష పార్టీల నేతలేనని వివిధ మీడియా సంస్థల విశ్లేషణలు సైతం వెల్లడించాయి. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు బిజెపి రాజకీయ ఆయుధాలుగా మారిపోయాయన్న ఆరోపణలు మరింత బలపడ్డాయి.

ఇటీవల మోడీ చేసిన ‘జో లూటా వో లౌటానా హోగా’ (దోచుకున్నది తిరిగి ఇవ్వాల్సిందే) వ్యాఖ్యలపై కూడా ప్రతిపక్షాలు వ్యంగ్య్రాస్త్రాలు సంధిస్తున్నాయి. ‘దోచుకున్న డబ్బు ప్రజలకు తిరిగి రావడం లేదు, బిజెపి రాజకీయ ఖజానాకే చేరుతోంది’ అని విమర్శిస్తున్నాయి. జిజెపికి అవినీతి మచ్చలతో సంబంధం లేదనీ, అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే ఎవరినైనా అంగీకరిస్తోందని పలపవురు వ్యాఖ్యానిస్తున్నారు.

గత పదేళ్లలో రాజకీయ నాయకులపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పెట్టిన 190కు పైగా కేసుల్లో రెండింటిలోనే అరెస్టులు జరిగాయి. ఈ మేరకు 2025 మార్చిలో పార్లమెంటుకు కేంద్రమే స్వయంగా తెలిపింది. ది ఇండియన్ ఎక్ర్ ప్రెస్, స్క్రోల్ వంటి వారా సంస్థలు ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేసి, ఈడీ విచారించింది 90 శాతం మంది ప్రత్యర్థి పార్టీల పై కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యలలో వేగం పెరగడాన్ని ‘ది వ్తెర్’ నివేదించింది.

ముగింపు :
కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని ప్రచారంలో పెట్టిన నరేంద్ర మోడీ అసలు లక్ష్యం ఏకంగా ప్రతిపక్ష రహిత వ్యవస్థే. ఇప్పటిదాకా ఏదో ఒక రూపంలో 41 మంది ఎమ్మెల్యేలను బెదిరించో, బుజ్జగించో బిజెపిలో చేర్చుకున్నారు. క్రమంగా మనం ఒకేదేశం ఒకేపార్టీ వ్యవస్థ వైపు వెళ్తున్నామేమో అనిపిస్తోంది. మోడీ హయాంలో ప్రతిపక్షాల రాజకీయాలు అసంభవం అవుతున్నాయి. తన అధికారాన్ని న్యాయబద్ధం చేయడానికి మాత్రమే మోడీకి ఎన్నికలు కావాలి. ఎదిరించే వారెవరూ లేకుండా ఎన్నికలు ఉండాలన్నది మోడీ అంతరార్థం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడితేనే నేరమన్న సంకేతాలసు బీజేపీ ఇస్తున్నది. ఏదిఏమైనా మోదీ హయాంలో ముఖ్యమంత్రి బంగాళాకు వెళ్లేందుకు సైద్ధాంతిక నిబద్ధతతో ఏ మాత్రం పనిలేదని, అవినీతి ఆరోపణలు వచ్చిన వెంటనే సరైన సందర్భంలో పార్టీ మారితే సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ ఏడుగురు ఎంపీల పార్టీ ఫిరాయింపును రాజ్యసభ అధ్యక్షులు శంఖంలో పోసేశారు. సంజయ్ సింగ్‌ పెట్టుకున్న అభ్యర్థనపై విచారణ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. జరగకనూ పోవచ్చు. జరిగినా ఈలోగా ఫిరాయించిన ఎంపీల పదవీ కాలం ముగియనూవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు బిజెపిలో చేరిపోవడంలో ఆశ్చర్యం లేదు. ఈ ఏడుగురు ఎంపీలను పార్లమెంటు సభ్యులుగా అనర్హులుగా ప్రకటించకుండా రాజ్యసభ అధ్యక్షులు సి.పి. రాధాకృష్ణన్ వారిని బిజెపి సభ్యులుగా గుర్తించడంలోనూ విస్తుపోవాల్సింది ఏమీలేదు. పార్టీ ఫిరాయింపుల విషయంలో చట్టసభ అధిపతులదే నిర్ణయాధికారం అయినప్పుడు, సభాపతులు సహజంగా అధికార పార్టీకి చెందిన వారైనప్పుడు, పార్టీ ఫిరాయింపును నిషేధించే సదుద్దేశంతో రూపొందించిన రాజ్యాంగంలోని పదవ షెడ్యూలులోనే పూడ్చలేనన్ని లొసుగులు ఉన్నప్పుడు ఫిరాయింపుదార్లకు అగ్రాసనం లభించడం సహజమే. ఇక అవినీతి అంత‌మెక్క‌డ‌?

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

Leave a Reply