మాకేం భయంలేదు

అసలు మాకు ఎందుకిన్ని చట్టాలు
మీరెవరు మా గురించి నిర్ణయించడానికి

మా చర్మాలు మొద్దుబారి పోయాయి
మీకళ్ళ కెమేరాలలో అరిగిపోయిన శరీరాలు
మీ నోళ్ళల్లో జీడిపప్పులా నానుతూనే ఉన్నాయి

కొత్తగా వచ్చే నష్టాలు ఏమున్నాయి
జీన్స్ లెగిన్స్ ఉద్రేక పరిచాయి అన్నావు
ఆగి పోయామా?
నీకళ్ళకి చీరైనా లెగిన్ అయినా ఒకటే
నీ ముందునుంచే నడిచాము

చేతులు తడిమే అత్యాచారం
చర్మానికి చర్మం ఆనించే అధికార అంధకారంలో
నువ్వే ఇంకా మగ్గి పోతున్నావు
కుళ్ళిపోయి కంపు కొట్టే ఆలోచనలోనే రమిస్తున్నావు

పోరా!
మాకేం భయంలేదు
బట్టలే కాపాడలేని చట్టాలు చూస్తే నువ్వు వస్తోంది
దూడ గడ్డి కోసం తాటిచెట్టు ఎక్కే సర్కస్ చూస్తే
అసహ్యం వేస్తోంది!

ఈ నాలుగు మాటలు చాలవా
మాకు స్వాతంత్ర్యం వచ్చిందని…

రేణుక అయ్యలసోమయాజుల. కటక్ (ఒరిస్సాలో) జన్మంచారు. హైదరాబాదులో నివసిస్తున్నారు. రేణుక అయోల అన్న కలంపేరుతో ఇప్పటివరకు ప్రచురించిన పుస్తకాలు, 'పడవలో చిన్ని దీపం' (2006), 'రెండు చందమామలు' (2008, కధాసంపుటి), 'లోపలి స్వరం' (2012), 'మూడవ మనిషి' (2015, దీర్ఘ కావ్యం (హిజ్రాల వ్యధ)), అంతః తీరాల అన్వేషణ (2018), సౌభాగ్య (రేణుక అయోల కవిత్వ విశ్లేషణ), ఎర్ర మట్టి గాజులు (2019).

2 thoughts on “మాకేం భయంలేదు

Leave a Reply