కవి

ఎందుకురా ఈ ఆరాటం
నీతో నీవు చేస్తూ పోరాటం

పొలిమేరలో దీపం
హృదయాల చీకటిని
తరుముతుందా

కంటిలోని చలమ
చేలపై పచ్చని పరికిణి
పరుస్తుందా

పిల్లాడి చేతిలో
ఆకలి రేఖలు
కేకల గీతలు
ఎంగిలాకుల మధ్య
తచ్చాడుతూ
కడుపు నింపుకుంటున్న
భరతమాతలు

స్వప్నాలను తరుముతూ
సత్యాలను తడుముతూ ఒకడు
సత్యాలను సమాధి చేస్తూ
జీవితాలను ఎడారి చేస్తూ ఇంకొకడు

పురిటి నెప్పులతో దేశం
ఉద్యమాలకు ఊపిరి పోస్తూ
నడక చూపాల్సిన యువత
నెట్టింట్లో తచ్చాడుతూ…

ఎందుకు ఏమిటి
అని అడగకు
ఆకలి,నిరుద్యోగం,పేదరికం
ఇక్కడ సమస్య కాదు
ఇక్కడంతా దేశభక్తి బంతాటే

ఆలోచనలను విత్తుతూ
గుండె కాడగాతో
విశ్వాన్ని వెలిగించ
పరుగులు పడుతున్న
అమాయక చక్రవర్తీ… కవీ
ఎందుకురా ఈ ఆరాటం
నీతో నువ్వు చేస్తూ పోరాటం

యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా. కవి. రచనలు :'మీనార్' (2011 2), 'దుఆ' (2013) , 'మూలవాసి' (2016 ) కవితా సంపుటాలు ప్రచురించారు. వివిధ డైలీ, వార, పక్ష, మాస పత్రికల్లో కవిత్వం ప్రచురితమైంది. 'అబాబీల్ సాహిత్య వేదిక' కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా  ఉన్నారు.

One thought on “కవి

Leave a Reply