మంచి – చెడు – మనిషి

“ఈ ముసిలోడు తొందరగా చచ్చిపోతే బాగుండు”, అనుకున్నాడు రాంరెడ్డి. ఆ ముసలాయన వారం రోజుల నుండి ఆస్పత్రిలో “శవం” మాదిరి పడున్నాడు. మూడు రోజుల నుండి స్పృహ కూడా పోయింది. అతణ్ణి కనిపెట్టుకుని కూర్చునే దుర్భరమైన పని రాంరెడ్డిది.
అలాగని అతడి మీద రాంరెడ్డికి ద్వేషం ఏమీ లేదు.
కడప జిల్లాలోని ఓ పల్లెనుంచి తిరుపతిలోని ఈ ఖరీదైన ఆస్పత్రికి తనే తెచ్చి చేర్పించాడు. రెండు రూపాయలు పెట్టి హోటల్లో కాఫీ తాగటానికి సంకోచించించే ఆర్థిక స్థితిలో ఉండి కూడా ముసలాయన వైద్యానికి ఈ వారం రోజుల్లో నాలుగు వేలు ఖర్చు పెట్టాడు. అది తన బాధ్యత అని తెలుసు. ఆయన రాంరెడ్డికి కన్నతండ్రి!

నెల కిందట కూడా ఆరోగ్యంగా, కొడుకుకన్నా బాగా పనులన్నీ చేస్తుండిన పెద్దాయన ఇంత జబ్బున పడ్డాడు.
మామూలు జ్వరంగా మొదలైనదల్లా, మూత్రం ఆగిపోవటంతో ఆస్పత్రికి పోవాల్సి వచ్చింది. నాలుగైదు జబ్బులు ఉన్నాయన్నారు. ముందు అవన్నీతగ్గితే ఆ తర్వాత ఆపరేషన్ చేయాలన్నారు. అవి తగ్గకపోగా మనిషి అపస్మారకంలోకి వెళ్ళిపోయాడు.
నల్లరేగట్లో కాయకష్టం చేసుకునే పల్లెటూరి రాంరెడ్డి, తండ్రి వైద్యం కోసం తిరుపతి చేరాక, భయపెట్టే జీవిత పార్శ్వాలు కళ్లముందు నిలిచాయి. మనుషులను పీల్చిపిప్పిచేసే ఆస్పత్రులు, పల్లెటూరి వాళ్లకు జవాబు చెప్పటమే నామర్దా అనుకునే వైద్య సిబ్బంది, ఖర్చు భరించలేక వైద్యం మధ్యలోనే వెళ్ళిపోతున్న పేదరోగుల కుటుంబాలు, బతుకుదెరువు కోసం ఒళ్ళమ్ముకునే ఆడవాళ్ళు, వాళ్ళను కూడా దోచుకునే మోసగాళ్లు –
జీవన బీభత్సాన్ని ఎన్ని దృశ్యాలుగా చూపింది ఈ పట్నం! రాంరెడ్డి బెదిరిపోయాడు.

పెళ్లికెదిగిన ఇద్దరు కూతుళ్లు, సరైన చదువూ లేక, చిన్న ఉద్యోగమైనా తెచ్చుకునేందుకు లంచాలూ పొయ్యలేక నిస్పృహలో పడిపోయిన కొడుకు, వర్షాలు లేక ఎండిపోతున్న పొలం, వీటన్నిటికీ తోడు తండ్రికి పట్టుకున్న రోగం. ఇన్ని అవసరాలకుగానూ తన దగ్గరున్న మొత్తం డబ్బు, ఇరవై వేలు. ఇంటిల్లిపాదీ చాకిరీ చేసి దాచుకున్న శ్రమఫలితం. దానిలో ఈ ఆస్పత్రి ఎంత మింగుతుందో, అసలు చాలుతుందోలేదో తెలీదు.
అప్పుడు అనిపించింది రాంరెడ్డికి “ఈ ముసిలోడు తొందరగా చచ్చిపోతే బాగుండు” నని.

“పాపిష్టి ఆలోచన” వచ్చినందుకు తనను తానే తిట్టుకున్నాడు. కానీ తండ్రి పరిస్థితి నిజంగానే విషమించింది. పొట్ట ఉబ్బిపోయి విలవిల్లాడుతున్నాడు.
మూత్రం బయటికి పోవటానికి పెట్టిన పైప్ ఒకచోట నొక్కుకుపోయి, మూత్రంతో కడుపు ఉబ్బిపోతోంది.
డాక్టర్ వచ్చి సరిచేశాక ప్రమాదం తప్పింది. రాంరెడ్డికి అర్థమయింది – ఆ పైపు సాఫీగా లేకపోతే మూత్రంతో కడుపు ఉబ్బి ముసలాయన చచ్చి పోతాడు. నర్సు అజాగ్రత్త వల్ల ఒకసారి జరిగిన ఆ పనిని ఇప్పుడు తను ఉద్దేశ్యపూర్వకంగానే చేస్తేనో ? ఈ సమస్య ఇక్కడితో ఆగుతుంది. మిగిలిన డబ్బులతో కొన్ని బాధ్యతలన్నాతీరుతాయి.
ఆ రాత్రి తన ఆలోచనను అమలు చేశాడు. నిశ్చలంగా పడున్నతండ్రికి అమర్చివున్న పైపును ఒకచోట నొక్కి, అక్కడ క్లిప్పు బిగించాడు. భయం వేస్తోంది. భరించలేక బయటికి వెళ్లి కూర్చున్నాడు. ఉన్న బాధ్యతల బరువుకు తోడు పాపభీతి వణికిస్తోంది.
“ఇన్ని రకాల బరువులు తను మోయలేడు. ఏదో ఒక బరువు దించుకోవాల… మనిషిని చంపే పని తను చేయలేడు… లేచి తండ్రి మంచం దిక్కు అడుగులేసినాడు”. ముసలాయన బతుకు ఇలాగే కొనసాగితే కుటుంబం మరింత దరిద్రంలోకి కూరుకు పోతుందనే భయం కూడా మరోదిక్కున కుంగదీస్తూనే ఉంది.
అందుకే, “ఒకవేళ ఈపాటికే నాయన సచ్చిపోయుంటే”, అనే “ఆశముల్లు అతడి మనసులో గుచ్చుకుంటూనే ఉంది”.
ఇది, పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి రాసిన “మనిషి” అనే కథ. 1995లో ఆంధ్రజ్యోతి వారపత్రిక లోనూ, 2006 లో రచయిత ప్రచురించిన “చుక్క పొడిచింది” కథా సంపుటిలోనూ వచ్చింది.
*
మామూలు మనుషులు నేరస్తులుగా మారే క్రమాన్ని అత్యంత వాస్తవికంగా, బాలన్స్డ్ గా చిత్రించిన కథ, “మనిషి”.
భయస్తుడు, పేదవాడు, కుటుంబాన్ని ప్రేమించే వాడు, ఇతరుల కష్టానికి చలించేవాడూ అయిన రాంరెడ్డి తండ్రిని తన చేతులతో చంపటానికి ఎలా సిద్ధపడ్డాడు? ఎంత దుర్భరమైన పరిస్థితులైనా ఎదురు కావచ్చు– ఇంత జీవితం పొడవునా పెంచుకున్న మానవీయతను ఒక్కసారిగా వదులుకోగలడా? పరిస్థితుల ప్రభావానికీ మానవ విలువలకూ నడుమ సంఘర్షణ ఎలా ఉంటుంది ? ఈ క్రమాన్ని చాలా జాగ్రత్తగా అల్లుకుంటూ వచ్చారు రచయిత.

తండ్రిని కాపాడుకోడానికి శక్తికి మించిన ప్రయత్నానికి పూనుకున్న కొడుకు రాంరెడ్డి. వైద్య వ్యవస్థలోని నిర్లక్ష్యం, దోపిడీ- బిడ్డల భవిష్యత్తుపై ఆందోళన, ఫలితంలేని వ్యవసాయం… తండ్రి చావుతో వీటన్నిటికి కొంత విరామం దొరుకుతుందని తోచింది. ఐతే, ఈ ఆలోచనను అతడి మనసు అంత సులభంగా స్వీకరించలేదు. మొదటిసారి తీవ్రమైన భయం వేసింది. తన ఆలోచనను ఎవరైనా పసిగట్టి హత్యానేరం కింద ఉరిశిక్ష వేస్తారేమోనని వణికిపోయాడు. మూత్రం ఆగిపోయి బాధ పడుతున్న తండ్రిని కాపాడుకోవాలని ఆందోళన పడ్డాడు.
కొంతసేపటి తర్వాత మరొక ఆలోచన – తను డాక్టర్ ను పిలవకపోవాల్సిందేమో… తండ్రి చచ్చిపోతే బాగుండేది –
ఉలిక్కి పడ్డాడు, కానీ మొదటిసారి వేసినంత భయం వెయ్యలేదు. ఇక మూడో సారి తనే స్వయంగా పైప్ ను నొక్కివేసి తండ్రిని చంపటానికి పూనుకున్నాడు. ఈ మూడు దశల నడుమ రాంరెడ్డిలో జరిగిన భావ పరిణామాన్ని కొన్ని వర్ణనలతో, ప్రతీకలతో బలంగా నిర్మించుకుంటూ వచ్చారు రచయిత. కథ ప్రారంభమే ఆస్పత్రి దుర్వాసనతో మొదలై ముసురు పట్టిన వాతావరణం, బురద రొచ్చు బాటలగుండా సాగుతూ దట్టమైన విషాదాన్ని ఆవరింపజేస్తుంది. శరీరాన్ని అమ్ముకుని బతుకుతున్న యువతి దైన్యాన్ని చూడగానే తన కూతుళ్ళ భవిష్యత్తు భయపెట్టింది రాంరెడ్డిని. ఇక్కడ కురుస్తున్న వర్షం, నీళ్ళు లేక ఎండుతున్న తన పొలాన్ని గుర్తుకు తెచ్చింది. జీవితం చుట్టూ ఆవరించిన అన్ని అన్యాయాలనూ, అసమానతలనూ , రాయలసీమలోని సామాన్య రైతుల ప్రత్యేక సమస్యలనూ సూచిస్తూ రాంరెడ్డి మానసిక స్థితిపై పాఠకుల్లో సానుభూతిని కలిగిస్తుంది కథ. ఐతే, మానవత్వాన్ని చంపేసే పరిస్థితులపై అవగాహనను, నిరసనను కలిగించటం తప్ప అమానవీయతను ఆమోదింపచేయడం రచయిత ఉద్దేశ్యం కాదు. అందుకే రాంరెడ్డి తనకు తానే సమాధానం చెప్పుకోలేక పోయాడు. పైపును సరిచేసి తండ్రిని బతికించుకోవాలని లేచాడు. ఆయనను చంపటానికి పూర్తి సంసిద్ధత లేనట్టే, బతికించాలన్న కోరిక కూడా బలంగా లేదు అతడిలో. “ఈపాటికే నాయన సచ్చిపోయుంటే…” అనే ఆలోచన మెదిలింది. సగం ఆశ, మరోసగం పశ్చాత్తాపం కలగలిసిన ఆ భావనను “ఆశముల్లు” అన్నారు రచయిత. రాంరెడ్డి ఆశ నెరవేరితే అతడి సమస్యలు కొన్ని తీరుతాయి _ కానీ అపరాధ భావన జీవితం పొడవునా ముల్లులా పొడుస్తూనే ఉంటుంది. ఈ సందిగ్ధాన్ని దాటగల పరిష్కారాలు అతడికి కనబడవు. కనబడినా వాటిని వైయక్తిక స్థాయిలో సాధించుకోటం సాధ్యమూ కాదు.
ఇంతకూ ఈ రాంరెడ్డిని ఎలా చూడాలి ?
మంచివాడని ఒప్పుకోవాలా? చెడ్డవాడని తప్పు పట్టాలా?
రెండూ సగం నిజాలే !
అతడు పరిస్థితుల సుడిగాలుల్లో మంచికి, చెడుకూ నడుమ ఊగిసలాడే మామూలు మనిషి!

(ఇటీవల చూసిన ‘తలైక్కూతల్’ అనే తమిళ సినిమా, తమిళనాడు లోని విల్లివాక్కం వద్ద ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో గత పదేళ్లుగా పేద కుటుంబాలకు చెందిన మూడువందల మంది వృద్ధ రోగులను వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు విషాన్ని ఇంజెక్ట్ చేసి హత్యచేశానని చెప్పిన ఒక వ్యక్తిని గురించి పత్రికల్లో వచ్చిన వార్త “మనిషి” అనే ఈ కథను బాగా గుర్తుచేశాయి)

నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో పిఎచ్.డి చేశారు. సాహిత్యం, సామాజిక శాస్త్రాల అధ్యయనంలో, ముఖ్యంగా సాహిత్య విమర్శలో ఆసక్తి. మిత్రులతో కలిసి "చూపు" పత్రికను కొంతకాలం నిర్వహించారు. సాహిత్య, సాహిత్యేతర గ్రంథాల అనువాదం, రచన వంటి అంశాల్లో కృషి చేస్తున్నారు.

4 thoughts on “మంచి – చెడు – మనిషి

  1. విశ్లేషణ వాస్తవికంగా ఉంది. పరిస్థితుల ప్రభావం మనిషిలోని క్రూరత్వాన్ని తట్టి లేపుతుంది అయితే మానవ విలువల ప్రభావం క్రూరత్వానికీ, మంచితనానికీ మధ్య ఊగిసలాడేలా చేసి – మనిషిని కుతకుతలాడిస్తుంది.

  2. ధన్యవాదాలు కాత్యాయని గారూ!
    ఈ కథను చాలా మంది సమీక్షించారు. మీ సమీక్ష సమగ్రంగా వుంది. ఆర్ధికపరిస్థితి కుంగదీసి మనిషిని నిర్దయగా మారుస్తుంటే, మనిషిలోని మనిషితనం పడే సంఘర్షణను అరటిపండు వలిచినట్లు విశ్లేషించారు.
    మీకు మరోసారి ధన్యవాదాలు.

Leave a Reply