Delete

ఈ పాదాలు నావే
అడుగులు మాత్రం
రాజ్యం వేయమంటోంది
ఈ కళ్ళు నావే
చూపూలు మాత్రం
రాజ్యమే నిర్దేశిస్తుంది
నాలుగు అంగుళాల నాలుక మీద
రాజ్యమే రుచి ముద్రలు వేస్తోంది

గుండ్రంగా ఉన్న భూమిని
బల్ల పరుపుగా వాక్యం చేయమంటోంది
చేతులకు పసుపు, కుంకాలు పూసుకుని
దేశపు పటం మీద
పది వేళ్లను ముద్రించమంటోంది

రెండూ గడ్డే తింటున్నప్పుడు
రెండూ తెల్లని పాలే ఇస్తున్నప్పుడు
పిడకల్ని మండించే నిప్పు,
తోడు నిలబడే గాలికి లేని
ఈ రాతియుగపు ఆలోచన
హృదయం లేని మనిషిగా ,
ఒకే ఒక జంతువును
కీర్తించడానికి , మొక్కడానికి మీకేందుకు ప్రభువా!

నేనేం పాఠం చదవాలో, ఏ బొమ్మ గీయాలో
నిర్ణయించడానికి
సిలబస్
మీ మేనిఫెస్టో కాదు,
పార్టీ ముసాయిదా పత్రం కాదు
అసలు ముందు
తొలగించాల్సిన
మొట్ట మొదటి అధ్యాయం నువ్వే

పుట్టింది నెల్లూరు జిల్లా, ఓజిలి, రాచపాలెం. కాకినాడలోని పిఠాపురం రాజా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధిపతి. 'నీటిపూలవాన', 'గోరువంకల గానం' అనే రెండు పిల్లల కవితా సంకలనాలు వేశారు. ఎక్సరే, తానా, రంజని, కుందుర్తి వంటి పురస్కారాలు పొంది ఉన్నారు. రాధేయ కవితా పురస్కార నిర్వాహకులలో ఒకరు.

3 thoughts on “Delete

Leave a Reply