ప్రజాసైన్యం: వాస్తవికత – సృజనాత్మక ఊహ

దేశంలో మొట్టమొదటిసారిగా ఇరవై ఐదు సంవత్సరాల కింద చరిత్రాత్మకంగా గణనీయమైన స్థాయిలో ఏర్పడిన ప్రజా సైన్యం, లెక్కలేనన్ని వరుస దెబ్బలు తిని, పెద్ద ఎత్తున నష్టపోయి ఉన్న ప్రస్తుత సందర్భంలో ఈ సైన్యం వాస్తవికతకూ, దాని గురించిన సృజనాత్మక ఊహకూ సంబంధం గురించి ఆలోచిస్తుంటే ఆశ్చర్యకరమైన అంశాలు కనబడుతున్నాయి.

వాస్తవికత భౌతికమైనది, తప్పించుకోలేనిది, కఠోరమైనది, కచ్చితంగా అంకెల్లోనో, స్థల కాల విశేషాల్లోనో చెప్పదగినది. దానికి భిన్నంగా సృజనాత్మక ఊహ మానసికమైనది, సృజనాత్మకమైనది, కాల్పనికమైనది. దాని మూలాలు భౌతిక వాస్తవికతలోనే ఉండక తప్పదు గాని, అదే సమయంలో అది పరిధులు దాటి, అపరిమితంగా కూడా వ్యాపించగలదు. వాస్తవికతకు చేర్పులూ మార్పులూ చేయగలదు. ఒకరకంగా చెప్పాలంటే వాస్తవికతకూ సృజనాత్మక ఊహకూ సంబంధాన్ని గాలిపటంతో పోల్చవచ్చు. గాలిపటం భౌతికంగా తయారయినదే. గాలిపటాన్ని అటూ ఇటూ తోసే గాలి భౌతికమే. దాని దారం భౌతికమే. ఆ దారం చివర ఉన్న చెయ్యీ, మనిషీ భౌతికమే, ఆ మనిషి నిలబడిన నేల భౌతికమే. కాని గాలిపటం ఆ మనిషి ఊహించలేని చోట్లకు ప్రయాణిస్తుంది. ఎక్కడెక్కడికో వెళుతుంది. భౌతికతను కోల్పోతే కనబడకుండా కొట్టుకుపోతుంది కూడా. భౌతికతతో సంబంధంలో ఉంటూనే ఎక్కడికైనా ప్రయాణించడానికి దానికి అవకాశం ఉంది.

ఆయుధాల గురించీ, సైన్యాల గురించీ, యుద్ధాల గురించీ మాట్లాడుకోవలసిన అవసరం రాకపోతే బాగుండునని సున్నిత మనస్కులు ఎంతగా అనుకుంటారో, అంత ఎక్కువగా అవే విషయాలు మాట్లాడుకునే సందర్భాలు వస్తున్నాయి. ఆయుధమూ సైన్యమూ యుద్ధమూ లేకుండా మానవ సమాజం ఉండాలనుకోవడం ఆదర్శమే గాని ఇన్ని వేల సంవత్సరాల మానవ పురోగమనంలో అది కనీసమాత్రంగానైనా సాధ్యం కాలేదు. ఆయుధం అంటే ఇప్పుడు చెప్పుకుంటున్న రకరకాల తుపాకులు, సూరేకారం, గంధకం, ఆర్ డి ఎక్స్, డైనమైట్, టి ఎన్ టి, వగైరా మారణాయుధాలు మాత్రమే కాదు, తొట్టతొలి రూపంలో అది చేతిలో ఒక సాధనం, చెయ్యి అనే మానవ దేహపు అవయవానికి కొనసాగింపు, విస్తరణ, అదనపు శక్తి. ఆ రూపంలో అది లేకుండా మనిషి మనగలగడం వేల ఏళ్ల కింద కూడా అసాధ్యంగానే ఉండి ఉంటుంది. అడ్డు వచ్చిన పొదలనూ తీగలనూ ముళ్లనూ తొలగించడానికైనా ఒక సాధనం కావాలి, ఎదురుగా వచ్చిన జంతువును బెదిరించడానికైనా ఒక సాధనం కావాలి. ఆహారం సంపాదించడానికైనా ఒక సాధనం కావాలి. ఆ సాధనం కాలక్రమంలో ఆయుధం అయింది. ఆయుధం ప్రకృతి శక్తుల నుంచి కాపాడుకోవడానికీ, ఆహారం సంపాదించుకోవడానికీ మాత్రమే కాదు, అవతలి మనిషి మీద ఆధిపత్యానికీ శతృత్వానికీ కూడా సాధనం అయింది. అవతలి మనిషికి చెందిన వనరుల మీద దురాక్రమణ జరిపి తమ అధీనంలోకి తీసుకోవడానికి కూడా ఆయుధమే సాధనమయింది.

ఆస్తితో పాటు, ఆ ఆస్తిని సంరక్షించే ఆయుధమే మనుషులను పాలకులుగా పాలితులుగా, పీడకులుగా పీడితులుగా విడదీసింది. ఇద్దరి దగ్గరా ఆయుధాలు ఉంటే ఎవరైనా గెలవవచ్చు గనుక, క్రమంగా పాలకులు ఆయుధాన్ని తమ గుత్తాధిపత్యంగా మార్చుకుని, తమ గెలుపును శాశ్వతం చేసుకున్నారు. ఆయుధాల మీద గుత్తాధిపత్యం, అవతలి పక్షం ఆయుధాల వాడకం మీద నిషేధం చరిత్రలో అనేక రూపాలు తీసుకుంది. క్షత్రియులకు మాత్రమే ఆయుధ ధారణ హక్కు ఉందని, ఇతరులెవరూ ఆయుధం పట్టుకోగూడదని పరిమితి విధించిన మనుధర్మం కావచ్చు, రాజ్యానికి మాత్రమే ఆయుధ ధారణ మీద సంపూర్ణ అధికారం ఇచ్చిన ఆధునిక రాజ్యాలు కావచ్చు, ప్రభుత్వ సైన్యం మినహా మరొక సైన్యం ఉండడానికి వీలు లేదన్నారు. పాలకవర్గ ముఠాలకు, పాలకవర్గంలోని కొందరు వ్యక్తులకు సొంత సైన్యాలను కూడా ఆమోదించారు గాని అసంఖ్యాక ప్రజలు మాత్రం తమ సైన్యం ఏర్పాటు చేసుకోగూడదన్నారు.

అక్కడితో కూడా ఆగకుండా పాలకుల చేతిలోని సైన్యాన్ని ప్రజలదే అని బురిడీ కొట్టించడం మొదలు పెట్టారు. ఏ దేశానికైనా స్థిరంగా ఉండే సైన్యం (స్టాండింగ్ ఆర్మీ), యుద్ధాలు వచ్చినప్పుడు పాల్గొనడం, కుహనా దేశభక్తిని రెచ్చగొట్టడం తప్ప మిగతా సమయాల్లో మరే పనీ చేయకుండా ప్రజాధనం మీదనే బతుకుతుంది గనుక దాన్ని ప్రజా సైన్యం అనవచ్చునా అనే చర్చ కూడా ఉంది.

ఆ చర్చ అలా ఉంచి, పాలకవర్గాలు ఎంతగా ఆయుధధారణ మీద, ప్రభుత్వానికి బైట ఆయుధాలతో జన సమీకరణ మీద, ప్రజలు తమకు తాము సైన్యం తయారు చేసుకోవడం మీద ఆంక్షలు విధించినప్పటికీ, వర్గ సమాజ చరిత్ర పొడవునా పాలితులు, పీడితులు వ్యక్తులుగా ఆయుధాలు చేపట్టడమూ, అవకాశం వచ్చిన చోట చిన్నవో, పెద్దవో సాయుధ బృందాలుగా ఏర్పడడమూ, పాలకవర్గాల మీద, పాలకవర్గాల సైన్యం మీద యుద్ధానికి దిగడమూ జరిగింది. జరుగుతూనే ఉంది. పాలకవర్గాల దోపిడీ పీడనల మీద ప్రజలు తిరగబడ్డప్పుడు సైన్యం తాను పాలకవర్గాల రక్షణ కోసమే ఉన్నానని నగ్నంగా చూపెట్టుకుంటుంది. అప్పుడు ప్రజలకు కూడా తమ సొంత సాయుధ బలగాలు ఉండవలసిన అవసరం ఉందనీ, పాలకుల ఆంక్షలను అధిగమించి ఆ ప్రయత్నాలు చేయాలనీ తెలిసి వస్తుంది. మన చరిత్రలో ఆధునిక కాలంలోనే చూస్తే అనుశీలన్, యుగాంతర్ వంటి సాయుధ బృందాల దగ్గరి నుంచి హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ, ఆజాద్ హింద్ ఫౌజ్ అని నేరుగా సైన్యం పేరు పెట్టుకున్నదాకా అనేక అనుభవాలున్నాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నాటికి అవి సాయుధ గెరిల్లా దళాలుగా మారాయి గాని, ఆ రోజుల్లో సైన్యం అనే మాట వచ్చినట్టు లేదు.

నక్సల్బరీ ప్రజ్వలన తర్వాత, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు-లెనినిస్టు) ఏర్పడిన తర్వాత, 1970 ఫిబ్రవరిలో ఒక విద్యార్థి, యువజనుల సమావేశంలో మాట్లాడుతూ, చారు మజుందార్ రెడ్ గార్డ్ సంస్థలను ఏర్పాటు చేయమని చెపుతూ, “ఈనాటి రెడ్ గార్డులు తర్వాత భారత ప్రజా విముక్తి సైన్యంలో వీరులవుతారు. ప్రజా విముక్తి సైన్యం యుద్ధరంగంలో శత్రువును నాశనం చేయడమేగాక రాజకీయ, సిద్ధాంత ప్రచారం చేస్తుంది. విప్లవ రాజకీయాధికారాన్ని స్థాపించడంలో ప్రజలకు సహకరిస్తుంది. వారిని సాయుధులను చేస్తుంది. ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొంటుంది” అని ప్రజా విముక్తి సైన్యం గురించి ప్రస్తావించారు. అలాగే 1971 ఫిబ్రవరి మొదటి వారంలో బిహార్ లోని మగుర్జన్ దగ్గర గెరిల్లాలు పోలీసు స్థావరం నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారనే వార్త విని, చారు మజుందార్ ఫిబ్రవరి 11న ‘ప్రజా విముక్తి సైన్యాన్ని నిర్మించి ముందుకు సాగిపోండి’ అని వ్యాసం రాశారు. వందల సంఖ్యలో ఎన్ కౌంటర్ హత్యలు, నాయకత్వ నష్టాలు, చీలికలు వంటి అనేక కారణాల వల్ల తర్వాత పది సంవత్సరాలలో అక్కడక్కడ చిన్న దళ చర్యలు జరిగాయి గాని సైన్యం, సైనిక సమీకరణ ఆలోచనలకు అవకాశం లేకపోయింది.

దండకారణ్య గెరిల్లా జోన్ పర్ స్పెక్టివ్ తర్వాత 1981లో కొన్ని గెరిల్లా దళాలు రాజకీయ, నిర్మాణ కృషి కోసం, సైనిక సన్నాహాల కోసం దండకారణ్యంలోకి వెళ్లాయి. దాదాపు రెండు దశాబ్దాల సన్నాహాల తర్వాత 2000 డిసెంబర్ 2న, అగ్రనాయకులు శ్యామ్, మహేష్, మురళిల మొదటి సంస్మరణ సందర్భంగా, పీపుల్స్ గెరిల్లా ఆర్మీ (పిజిఎ) అనే మొదటి సైనిక నిర్మాణం ఏర్పడింది. నాలుగు సంవత్సరాల తర్వాత మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా, సిపిఐ (ఎంఎల్)(పీపుల్స్ వార్) ఏకమై సిపిఐ (మావోయిస్టు) ఏర్పడడంతో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పి ఎల్ జి ఎ) ఏర్పడింది. ఆ తర్వాత ఇరవై సంవత్సరాలలో దేశ చరిత్రలోనే మొదటిసారిగా ప్రజల సైన్యం అంతకంతకూ రాజకీయంగానూ సైనికంగానూ విస్తరిస్తూ, ప్లాటూన్లుగా, కంపెనీలుగా, బటాలియన్ స్థాయికి ఎదిగింది.

ఆ చరిత్ర అలా ఉంచి, ఈ వాస్తవికత సృజనాత్మక ఊహలో ఎట్లా ప్రతిఫలించిందో చూడడం ఆసక్తికరంగా ఉంటుంది.

విప్లవ రచయితల సంఘం సభ్యుడు జనసేన అని కలం పేరు పెట్టుకునే నాటికి ఈ వాస్తవికత అప్పుడప్పుడే ప్రారంభమవుతున్నది. లేదా కచ్చితంగా చెప్పాలంటే ఇంకా ప్రారంభం కూడా కాలేదు. జె సీతారాం అనే వరంగల్ జిల్లా మహబూబాబాద్ దగ్గర నర్సింహులపేటకు చెందిన ఉపాధ్యాయుడు, సుప్రసిద్ధ గాయకుడు, కవి, చిత్రకారుడు జనసేన అనే కలం పేరుతో రాసిన ఎన్నో పాటలు 1970-72 కాలంలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. గద్దర్, జన నాట్య మండలి రాక ముందు విప్లవ పాట అంటే చెరబండరాజు, ఎన్ కె, జనసేన ముగ్గురి పేర్లు మాత్రమే వినబడేవి. సృజన డిసెంబర్ 1971 సంచికలో జనసేన ‘మనోళ్లే’ అని ప్రజా సైన్యం ఊరేగింపు గురించి పాట రాశాడు. గుంటూరు విరసం మహాసభల (1972 అక్టోబర్) నాటికి ఆయన పాటల పుస్తకం ‘జనసేన పాటలు’ విరసం ప్రచురణగా అచ్చయి వచ్చింది. ఇరవై రెండు పాటలతో వచ్చిన ఆ పుస్తకంలో ‘జనసేన కదిలింది’ అనే శీర్షికతోనే ఒక పాట ఉంది. ‘మనోళ్లే’ పాటతో పాటు, ‘రెండుసారుల సావబోమోరన్నయ్య’, ‘కొత్త సదువు’, ‘ఆదేశం’, ‘మాయాబజార్’, ‘ఆహా నిజంగా’ వంటి పాటలు కూడా 1970-72 సభల్లో ఆయన పాడేవారు. వీటిలో ‘మనోళ్లే’, ‘ఆదేశం’ (“ఇది సాయుధ విప్లవ సందేశం, ఇది సాగిన సైనిక ఆదేశం”) పాటలు విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి. (ఇది రాస్తుంటే ఈ రెండు పాటలూ జనసేన గొంతులోనూ, బోస్ అనే అప్పటి మెడికల్ విద్యార్థి గొంతులోనూ నాలో ప్రతిధ్వనిస్తున్నాయి). వ్యక్తిగత, నిర్మాణ కారణాలవల్ల ఆయన 1973 తర్వాత విరసంలో కొనసాగినట్టు లేరు గాని, 1979లో వరంగల్ జిల్లాలో పర్యటించినప్పుడు ఆయనను కలిశాననీ, ఆయన పాటలు విన్నాననీ, ఆయన నుంచి పాటల గురించీ, ఉద్యమం గురించీ తెలుసుకున్నాననీ యాన్ మిర్డాల్ ‘ఇండియా వెయిట్స్’ లో రాశారు. జనసేన పాటలు 1973 తర్వాత తక్కువగా వినిపించడానికి విప్లవ పాటల సంప్రదాయంలో జననాట్యమండలి యుగం ప్రారంభం కావడం కూడా కారణం కావచ్చు.

గద్దర్ కూడా తన తొలిపాటల్లో ఒకటి ‘పోదామురో జనసేనలో కలిసి’ అని రాశాడు. సృజన ఆగస్ట్ 1973 సంచికలో వచ్చిన ఆ పాట ఎమర్జెన్సీ వరకు రెండేళ్లు అన్ని సభల్లోనూ మార్మోగింది. అలాగే సృజన మే 1974 సంచికలో ‘కొత్తకలాలు’ శీర్షిక కింద అచ్చయిన డా. కాటా నారాయణ రావు పాట ‘జనసేన పిలిచిందిరా’ కూడా ఎమర్జెన్సీ వరకూ చాలా ప్రాచుర్యంలో ఉండింది. దానికి కొద్ది ముందు కర్నూలు విరసం సభల నాటికి (జనవరి 1974) శ్రామికవర్గ ప్రచురణలు ‘భారత ప్రజా విమోచన సైన్యం అవతరణను కీర్తించండి’ అనే చిన్న బుక్ లెట్ కూడా ప్రచురించింది.

సాహిత్యంలో ఈ ప్రజాసైన్యపు ప్రస్తావనలన్నీ ఇంకా పూర్తి స్థాయి ప్రజాసైన్యం ఏర్పడడానికి రెండున్నర దశాబ్దాల ముందే. ఎమర్జెన్సీ అనంతర విప్లవోద్యమ విస్తరణలో, విభిన్న రంగాల ప్రజా సంఘాలు ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా తమ కార్యాచరణ సాగిస్తుండడంలో వందలాది మంది కవులూ రచయితలూ వచ్చారు, వేలాది పాటలు వచ్చాయి. జన నాట్య మండలి వేలాది వేదికల మీద పదుల వేల ప్రదర్శనలు ఇచ్చింది (ఎవరైనా 1970-2025 యాబై ఐదేళ్లలో విప్లవోద్యమంలో భాగంగా ఎన్ని సభలు జరిగాయో జాబితా తయారు చేస్తే బాగుండును!). ఇప్పుడు జన నాట్య మండలి పాటల పుస్తకాలు చూస్తుంటే ‘జనసేన దళం పిలుస్తుందిరా’ అనే ఒకటి రెండు పాటల్లో మినహా ప్రజా సైన్యం ప్రస్తావన తక్కువగా కనబడుతున్నది. ఆ మాట వాడవలసివచ్చిన దగ్గర కూడా దండు, కూలి దండు, ఎర్రదండు, గెరిల్లా దళం, రైతాంగ దళం, జంగ్ వంటి మాటలున్నాయి గాని జనసేన, ప్రజాసైన్యం, ప్రజా విముక్తి సైన్యం వంటి మాటలు లేవు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, లేక 1970-75 నాటి సాయుధ దళచర్యల ఉరవడి నుంచి 1978 అనంతర ప్రజాపంథా, ప్రజా సంఘాల నిర్మాణం, ప్రజా సమస్యల మీద సమీకరణ, సంఘటిత పోరాటాల స్ఫూర్తితో అనుకోకుండానే జరిగిందా తెలియదు.

ఇక నిజంగా పిజిఎ, పిఎల్ జిఎ ఏర్పాటు తర్వాత ఆ ప్రజా సైనిక అవసరాలలో భాగంగా పాటలు రాసి పాడుకున్నట్టున్నారు గాని, బైటి నుంచి ఆ ఇతివృత్తం మీద వచ్చిన పాటలు చాలా తక్కువ. 2004 తర్వాత బైటి సమాజంలో చాలా ప్రచారంలోకి వచ్చిన పాట, డప్పు రమేష్ గొంతులో వేలాది మందికి తెలిసిన పాట జానే వాలే సాథియోంకో లాల్ సలాం ప్రజాసైన్యపు పాటల్లో ఒకటే గాని 1970-75 లాగా అది బైటి నుంచి రాసిన పాట కాదు. ఆ ఇతివృత్తం మీద బైటి నుంచి వచన కవిత్వం అయినా వచ్చిందా అనుమానమే.
**
మనోళ్లే!

ఎవరు వాళ్ళూ?
ఎవరు వాళ్ళూ?
ఎవరి వాళ్ళూ?
ఎవరు వాళ్ళూ?

ఎవరి కోవకు చెందినోళ్ళు
ఎవరి దోవలకందినోళ్ళు
ఎవరి కోసం వచ్చినారు
ఎవరి కోసం “పోయినారు”

కత్తి బల్లెం విల్లు అమ్ములు – గండ్రగొడ్డలి ఈటె రైఫిలు
చేత ఝండాల్ పట్టుకోని – డాళ్ళు వీలుగా కట్టుకోని
రొమ్ము చిహ్నాల్ పెట్టుకోని
సాళ్లు సాళ్లుగ నడిచినారు
సరాసరి “అటు” వెళ్ళినారు

ఉత్తమాటలు కట్టిపెట్టని
ఉమ్మడిగ గళమెత్తినారు
చేయెత్తి జై జై కొట్టినారు
కొత్త పాటలు పాడినారు

బాంబు సంచట సంకనుంది భుజం పైన తుపాకి వుంది
కాసులకు నక్లీసులకుగా తోట దండాలు వేసుకోని
అందచందాలన్ని మరిచి ఆడమగ తేడాలె విడిచి
నిర్మలమ్మా రామాబాయిల నిగ్గు తేలిన నీతి జూపి
అగ్గిపాటల పాడుకుంటూ ఆశలను రేకెత్తినారు
భగత్ సింగ్ చంద్రశేఖర్ భావముల మించినారు
గదర్ వీరుల టెర్రరిస్టుల గాథలను స్పృశియించినారు
ఎర్రసేనల, ముక్తిసేనల శక్తియుక్తుల కలిగినోళ్ళు
దద్దరిల్లు నినాదమిచ్చి ప్రజాయుద్ధం అభయమిచ్చి
అభయమిచ్చి హామీ ఇచ్చి
పుచ్చిపోయిన ఇంటిపాలన కుళ్ళిపోయిన ఒంటికెందుకు?
చీము పుళ్ళు మూల్గురోగికి పట్టుబట్టలు కప్పుటెందుకు
కుష్ఠు బొల్లి దగ్గు క్షయ రోగాల సంఘం మురుగు వృద్ధుల
పడచు రాజ్యం కట్టబెట్టే పౌరశాస్త్రపు చదువులెందుకు
మొద్దు ఖద్దరు ముసుగులెందుకు?
ప్రశ్న కొడవళ్లెత్తినారు ప్రగతి బాటల జూపినారు
ప్రజాసత్తువ సుత్తెలెత్తి సమత పాటలె పాడినారు
ఊళ్ళకూళ్ళనె వూపినారు పేదజనముల లేపినారు
ఒకరి చెంపకు కత్తిగాటు ఒకరి చెంపన కట్టె దెబ్బ
కణత పక్కనె కమిలిపోయీ కన్ను మూసుకు పోవు వాపు
నొష్ట బొట్టెం ఎండు పెదవులు నెత్రుమరకల బట్టలేసుక
ఇదే బాటల వెళ్ళినారు అదే మలుపుకు మళ్ళినారు
శాంతిసామ్యం ముక్తిదారుల క్షేమకరమౌ నీడనిచ్చే నిజం విత్తుచు
ఎర్రజెండాలెత్తినారు ప్రజల బాసల పాడినారు
తెలుగు వెలుగులు వాడినారు తేటతెల్లం జేసినారు
చెమటకారి నున్నబారి మెరిసి మురిసే దేహాకాంతుల
ధనం మూలం తెలిపినారు మనం మనమని మనినవారు
వల్లమాలిన బ్రతుకులొద్దని పల్లవిగా గొంతెత్తినారు
దిక్కులేని కుక్కచావులు నంగనాచి నక్కతావులు
వద్దువద్దని అసలు వద్దని ముష్టి మనిషై బతకవద్దని
మనిషి మనిషిగా బతకవలెనని
మనసు కోరిరి మమత కోరిరి
రా! మనోళ్లే!
లే! మనోళ్లే!
చావు బతుకుల కుములువాళ్ళకు
ఆకలని అల్లాడు జనులకు
ఆశ కొస పూపూచునట్లు
చచ్చుమోడు చిగురించునట్లు
జీవకళలను పంచినారు
చావు విలువల పెంచినారు
లే! మనోళ్లే!
రా! మనోళ్లే!

**
ఆదేశం
జనసేన

ఇది సాయుధ విప్లవ సందేశం
ఇది సాగిన సైనిక ఆదేశం
ఎరుపెక్కిన సైనిక సందేశం
ప్రజా సైనికుల ఆదేశం
ఇక ఆకలి మంటలు ఆరుననీ
ఈ ఆరని వేదన తీరుననీ
దారిద్ర్యాలకు దౌర్భాగ్యాలకు
బలియై నులియై పాడైపోయే
మొలకలు మొగ్గలు బతుకుననీ
చెలకలు చేనులు ఎదుగుననీ
చివురించే బాలల చిరుకళలూ
వికసించే యువజనముల కలలూ
నవయుగ ఆశాకుసుమములూ
వాడి వాడి పోగూడదనీ
పాడు బీడు కాగూడదనీ
ఈ గుళ్ళ కుళ్ళు తుడిచేసీ
మన బళ్ళ పుళ్ళు కడిగేసీ
కొత్త ప్రపంచం నెలకొల్పాలని
కొత్త వ్యవస్థను స్థాపించాలని
ఇది ఆశాజీవుల సందేశం
ఇది విప్లవ వీరుల ఆదేశం
అదిగో శ్రమజీవుల సంకేతం
అదిగో సమసమాజ సంగీతం
**

జనసేనలో కలిసి…
(డప్పు పాట)
వి బి గద్దర్

పోదామురో – జనసేనలో కలిసి
జనసేనలో కలిసి
ప్రజాసేనలో కలిసి
ఎర్రసేనలో కలిసి
పోదామురో – జనసేనలో కలిసి /పోదామురో/
ఓరన్న జీతగాడ
మాయన్న జీతగాడ
ఉన్నోని జీతగాడ
పొట్టగంజి జీతగాడ
కదిలి రారో – జనసేనలో కలువ /పోదామురో/
పొద్దున్నే నువ్వు లేచి
పొద్దంత పాని జేసి
ఎద్దోలె పాని జేసి
పొద్మీకి అల్సిసొల్సి
నువు నడవాలిరో – జనసేనలో కలువ /పోదామురో/
ఉపాసాలవాడ
పాటేలు జీతగాడ
బాకీలు పడ్డవాడ
దొరవారి జీతగాడ
బతుకులెల్లనోడ
భూస్వామి జీతగాడ
కదిలిరారో – జనసేనలో కలువ /పోదామురో/
నీ యెట్టి పోవాలంటే
నీ గోడు పోవాలంటే
నీ బతుకు మారాలంటే
నువు బాగుపడాలంటే
కలువాలిరో – ఎర్రసేనలో నేడే /పోదామురో/
నువు నాడువు నాడువన్న
ముందుకే నాడువన్న
కలత చెందకన్న
కన్నీరు బెట్టకన్న
ఆకలితో సచ్చెకన్న
అప్పులతో కుమిలేకన్న
బందూకు బట్టవన్న
బరిసెలు బట్టవన్న
సేనలో చేరవన్న
జయము మనదేరన్న
కదులాలిరో – ఎర్రసేన ఊరూరా /పోదామురో/

పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు.
ర‌చ‌న‌లు: 'స‌మాచార సామ్రాజ్య‌వాదం', 'క‌ల్లోల కాలంలో మేధావులు - బాల‌గోపాల్ ఉదాహ‌ర‌ణ‌', 'అమ్మ‌కానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌', 'క‌థా సంద‌ర్భం', 'క‌డ‌లి త‌ర‌గ‌', 'పావురం', తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛిన‌మ‌వుతున్న వ్య‌క్తిత్వం, 'పోస్ట్‌మాడ‌ర్నిజం', 'న‌వ‌లా స‌మ‌యం', 'రాబందు నీడ‌', 'క‌ళ్ల‌ముంద‌టి చ‌రిత్ర‌', 'ప‌రిచ‌యాలు', 'తెలంగాణ‌ - స‌మైక్యాంధ్ర భ్ర‌మ‌లు, అబ‌ద్ధాలు, వాస్త‌వాలు', 'శ్రీశ్రీ అన్వేష‌ణ‌', 'లేచి నిలిచిన తెలంగాణ‌', 'ప్ర‌తి అక్ష‌రం ప్ర‌జాద్రోహం - శ్రీకృష్ణ క‌మిటీ నివేదిక‌', 'రాబందు వాలిన నేల‌', 'ఊరి దారి- గ్రామ అధ్య‌య‌న ప‌రిచ‌యం', 'విద్వేష‌మే ధ్యేయంగా విశాలాంధ్ర మ‌హార‌భ‌స‌', 'క‌విత్వంతో ములాఖాత్‌', 'సమాజ చలనపు సవ్వడి', 'కాషాయ సారం', 'విద్వేషాపు విశ్వగురు', 20కి పైగా అనువాదాలు.
సంపాద‌క‌త్వం: 'Fifty Years of Andhrapradesh 1956-2006', 'Telangana, The State of Affairs', '24గంట‌లు', 'హైద‌రాబాద్ స్వాతంత్య్ర సంరంభం', 'జ‌న హృద‌యం జ‌నార్ద‌న్‌', 'స‌మ‌గ్ర తెలంగాణ' పుస్త‌కాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

Leave a Reply