ఏప్రిల్ 13, 2026న ఉత్తర బస్తర్ ప్రాంతంలోని ఛోటెబెటియాx సమీపంలో, మాచ్‌పల్లి గ్రామం దగ్గర జరిగిందని చెబుతున్న ఎన్‌కౌంటర్‌లో కామ్రేడ్ రంగబోయిన భాగ్య (రూపి) అమరురాలైంది. ఆమె మరణంతో దండకారణ్యంలో ఇక తెలంగాణ ప్రాంతానికి చెందిన లేదా తెలుగు కేడర్లెవరూ మిగల్లేదని పోలీసులు ప్రకటించారు. అంటే 1980 నవంబర్ 2న, గడ్చిరోలి జిల్లా మోయిబీన్‌పేటలో రక్తం చిందించిన తొలి అమరుడు పెద్ది శంకర్‌తో మొదలైన ఒక త్యాగమయ అధ్యాయం… నిన్నటితో.. అంటే 2026 ఏప్రిల్ 13తో ఓ రకంగా ముగిసిందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు దండకారణ్య ఉద్యమంలో మిగిలిన వాళ్లంతా అక్కడి మట్టిబిడ్డలే. ఇప్పుడు మిగిలిన ఆ పిడికెడు మంది పెద్ది శంకర్ అందించిన వారసత్వాన్ని ఎలా, ఎంత వరకు, ఏ రూపంలో ముందుకు తీసుకువెళ్తారనేది భవిష్యత్తు మాత్రమే చెప్పగల విషయం.
భాగ్యది తెలంగాణలోని సిద్దిపేట జిల్లా, మిరిదొడ్డి మండలం, ధర్మారం గ్రామం. తరతరాలుగా అణచివేతకు, వివక్షకు గురైన కష్టజీవుల కులంలో, ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన భాగ్య…. భూస్వామ్య దోపిడీపీడనలతో పాటు, కుల అణచివేతను, పితృస్వామ్య పీడనను ప్రత్యక్షంగా చూసి, అనుభవించి వీటన్నింటికీ పరిష్కారం విప్లవమేనని నమ్మి, దాన్ని కడదాకా ఆచరించిన వీర వనిత. నిజానికి, ఆమె 2002 (లేదా 2004) లో పూర్తి కాలం కార్యకర్తగా వచ్చింది. మెదక్ ప్రాంతంలో అప్పటికే ఉద్యమం బలహీన పడింది. దాంతో ఆమెను నల్లమల ప్రాంతానికి పంపించారు. ఆ తర్వాత కొంత కాలానికి నల్లమల ప్రాంతాన్ని కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మిగిలి ఉన్న కేడర్లను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా 2007లో ఆమెను దండకారణ్యానికి పంపాలని పార్టీ నిర్ణయించింది.
2006 చివరలోనో, 2007 ప్రారంభంలోనో ఆమె సుగులూరి చిన్నన్న (విజయ్)ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత వీరిద్దరి జంట దండకారణ్యం చేరుకుంది. వీరిద్దరూ ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దులోని మాన్‌పుర్ ప్రాంతంలో పని చేశారు. అప్పటి నుంచి ఆమె ‘రూపి’గా ప్రజలకు పరిచయమైంది. అయితే ఆమెకు ఆరోగ్యం సహకరించకపోవడంతో పాటు, ఒక కాలికి కొంత వైకల్యం కూడా ఉండటంతో ఆమెను ఉత్తర బస్తర్‌లోని పర్తాపుర్ ప్రాంతానికి బదిలీ చేశారు. ఆనాటికి మాన్‌పుర్ ప్రాంతంతో పోలిస్తే, పర్తాపుర్ ప్రాంతం కొంత అనుకూలంగా ఉండేది. ఆనాటి నుంచి నిన్నటి వరకు ఆమె అదే ప్రాంతంలో… ప్రధానంగా మహిళా ఉద్యమాన్ని నడిపించింది. మరోవైపు.. మాన్‌పుర్ డివిజనల్ కమిటీ సభ్యుడిగా కార్యాచరణ మొదలుపెట్టిన సుగులూరి చిన్నన్న… ఆ తర్వాత డివిజన్ కార్యదర్శిగా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఎదిగి… అగస్ట్ 2025లో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. దళిత కుటుంబంలో పుట్టి పెరిగిన ఆయనది నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలంలోని వడ్లరామారం గ్రామం.
భాగ్యది చక్కని, నల్లని రూపు. మరీ పొడవు, లేదా పొట్టి కాదు అనిపించేంత ఎత్తు. జీరగొంతు. ఆమె గలగలా మాట్లాడేది. ఏ చిన్న విషయానికైనా చలించిపోయేది. ఎవరైనా అమరులైన విషయం తెలిసినా లేదా ఉద్యమానికి ఏదైనా నష్టకరమైన ఘటన జరిగిందని ఎవరైనా చెప్పినా బొటబొటా కన్నీరు కార్చడం అనేది ఆమెలో కనిపించే చాలా సహజ స్పందన. లేడిపిల్లలా ఉబ్బెత్తుగా అమాయకంగా ఉండే ఆమె కళ్లు ఏ కాస్త బాధనూ తట్టుకోలేనట్టుగా త్వరగా ఎర్రబడి కన్నీటితో నిండిపోయేవి. ఆమె పరిచయమైన కొత్తలో ఇంత సున్నితమైన మనిషి ఎలా తట్టుకుంటుందో అనిపించేది.
ఇంట్లో పెద్దగా చదువుకోలేదు. కానీ వర్గపోరాట చైతన్యం మాత్రం ఆమెలో పుష్కలంగా ఉందని ఆమె మాటల్లో స్పష్టమయ్యేది. ఎప్పుడైనా మనసు విప్పి మాట్లాడుకునే సందర్భం వస్తే.. ఊళ్లో తాను స్వయంగా చూసిన, ఎదుర్కొన్న అణచివేతలను, వివక్షను ఆమె చాలా వివరంగా చెబుతుండేది. ఆ తర్వాత, ఉత్తర బస్తర్‌లో.. తను స్వయంగా ఉద్యమాన్ని నడిపించే క్రమంలో.. ఆదివాసుల భూములను, అడవులను ఆక్రమించుకుంటూ కార్పొరేట్ మైనింగ్ కంపెనీలు సాగిస్తున్న దురాగతాలను కూడా ఆమె ప్రత్యక్షంగా చూడడమే కాకుండా, దానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడంలో కూడా చురుగ్గా పాల్గొంది.
ఈ ‘ఎన్‌కౌంటర్’ తర్వాత స్థానికులు ఒక లోకల్ పత్రికా విలేఖరికి అందించిన సమాచారం ప్రకారం, ఉత్తర్ బస్తర్ ప్రాంతంలో ఇప్పటికీ ఉద్యమాన్ని కొనసాగిస్తున్న 10-12 మంది కార్యకర్తల్లో భాగ్య ఒకరు. ఆమె నిరాయుధంగా, సాదా దుస్తుల్లో ఒక గ్రామంలో, ఓ ఇంట్లో ఉండగా పోలీసులు పట్టుకొన్నారు. ఆ తర్వాత దగ్గర్లోనే ఆమెను కొన్ని గంటల పాటు హింసించి ఆ తర్వాత కాల్చి చంపారు. చంపడానికి ముందు లొంగిపోవాలంటూ ఆమెను ఎంతో ఒత్తిడి చేశారట. ఉన్నతాధికారులతో ఫోన్‌లో కూడా మాట్లాడించారట. అయినా సరే, తాను ఎట్టి పరిస్థితిలోనూ లొంగిపోనని, కావాలంటే తనను చంపెయ్యండని, తనపై ఉన్న 5 లక్షల రివార్డును ప్రజలకు పంచండని ఆమె అన్నట్టుగా సమాచారం. అంతేకాదు, తన సహచరుడు విజయ్ (చిన్నన్న)ను ఎలా పట్టుకొని చంపారో, తనను కూడా అదే విధంగా చంపెయ్యమని కూడా ఆమె అన్నదట. పర్తాపుర్ ప్రాంతంలో ఏప్రిల్ 29, 2024లో ఆపటోల దగ్గర ‘ఎన్‌కౌంటర్’లో చనిపోయిన 29 మందిలో ఎక్కువ మంది నిరాయుధులైన యువతీయువకులే. ఆమె ఆ ఘటనను పేర్కొంటూ, వారిలో చాలా మందిని తానే స్వయంగా రిక్రూట్ చేశానని, ఇప్పుడు లొంగిపోయి తన ప్రాణాలు కాపాడుకొని, వారి ఆశయాలకు ద్రోహం చేయనని, తను చనిపోయినా పోరాటం ఆగదని ఆమె గట్టిగా అరుస్తూ చెప్పిందని కూడా స్థానికులు ఆ విలేఖరితో చెప్పారు. అంతేకాదు, మార్చ్ 31 లోపు మావోయిస్టు ఉద్యమాన్ని నామరూపాలు లేకుండా చేస్తామన్న రాజ్యాన్ని తాము ఓడించినట్టు రాసుకున్న ఒక పోస్టర్ కూడా ఆమె బ్యాగులో దొరికిందని సమాచారం. అన్నింటికన్నా ఆశ్చర్యకరంగా… చనిపోవడానికి ముందు పోలీసులు ఆమెను ఎంత హింసించినా, చంపేస్తామని బెదిరించినా ఆమె ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చలేదట! ఎంతటి దృఢచిత్తం!!
ఇప్పుడు ఆపరేషన్ కగార్‌లో భాగంగా లొంగిపోయిన వాళ్లందరి చేతిలో రాజ్యాంగం కాపీ పెట్టి, ఇకపై రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలని నీతులు బోధిస్తున్న రాజ్యానికి రాజ్యాంగం మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా… ప్రాణాలతో పట్టుబడ్డ భాగ్యను చట్టప్రకారం అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టాలి. కానీ అలా చేయకుండా, ఆమె ప్రాణాలు తీయడం ద్వారా… ఇటీవల ఆయుధాలతో లొంగిపోయిన వారికి కానుకగా ఇచ్చిన ఆ పుస్తకం తనకు చిత్తు కాగితాలతో సమానమని రాజ్యం మరోసారి రుజువు చేసుకుంది. ఉద్యమంలో ఇంకా మిగిలినవాళ్లంతా ‘లొంగిపోవాలి, ప్రాణాలు కాపాడుకోవాలి’ అని రకరకాల పద్ధతుల్లో ఒత్తిళ్లు చేస్తున్న కొందరు మాజీ విప్లవకారులు, బయటున్న వారి వంతగాళ్లు… వేళ్ల మీద లెక్కించగల సంఖ్యలోనే మిగిలిన వాళ్లలో, కనీసం ప్రాణాలతో పట్టుబడ్డ వాళ్లనైనా చంపకుండా వదిలెయ్యాలని మాత్రం మాట్లాడటం లేదు. చట్టవిరుద్ధ హత్యలను అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు.
ఉద్యమం ఊపులో ఉన్నప్పుడు, ఉద్యమానిది పై చేయిగా ఉన్న కాలంలో అందులో పని చేయడం, బయటుండి దాన్ని కీర్తించడం, లేదా దాని కోసం త్యాగాలు చేయడం పెద్ద విషయం కాదు. కానీ రేపో, మాపో చావు తప్పదని తెలిసినా… పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేవని తెలిసినా, నిన్నటి వరకు తనకు నాయకులుగా ఉన్న వాళ్లే ఈరోజు విప్లవ పంథానే కాకుండా.. మొత్తంగా విప్లవ లక్ష్యంతో పాటు వర్గపోరాట ప్రాథమిక సూత్రాలనే అపహాస్యం చేస్తున్నా కూడా… కేవలం విప్లవాశయంపైన, వర్గ పోరాట గతితర్కంపైన నిలుపుకున్న నమ్మకం, ఆచంచల విశ్వాసం వల్ల మాత్రమే భాగ్య లాంటి చివరి యోధులు (పాక్షిక అర్థంలోనే ‘చివరి’) చేసిన, చేస్తున్న త్యాగాలు మామూలివి కాదు. మావో చెప్పినట్టు అక్షరాలా హిమాలయాలకన్నా ఉన్నతమైనవి. ఎప్పుడో బయటకు వచ్చేసి, ఇప్పుడు యూట్యూబ్ చానెల్స్‌లో ఆనాడు మేమది చేశాం, ఇది చేశాం అని గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లంతా భాగ్యలాంటి వాళ్ల త్యాగధనుల ముందు ఎంత అత్యల్పమైన మరుగుజ్జులో!
అయితే, విప్లవ ప్రతీఘాతుకత్వం రొమ్ము విరుచుకొని చెలరేగిన నేటి కాలంలో, లొంగుబాటు ఒక పంథాగా మారిపోయిన విచిత్ర సన్నివేశంలో, మార్చ్ 31 మావోయిస్టు రహిత భారత విజయోత్సవాలకు అమిత్ షాకన్నా ఆత్రుతగా ఎదురు చూసిన బహురూపుల మారువేషగాళ్లు కొందరు.. ఇవన్నీ అనవసర త్యాగాలని, ఆత్మహత్యా సదృశమైనవని, మూర్ఖత్వం అని రకరకాలుగా వ్యాఖ్యానించవచ్చు. మేం ఆనాడే చెప్పాం, ఏనాడో చెప్పాం అని మాయ మాటలు చెప్పొచ్చు. కానీ చరిత్ర ఎవరో స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోయినట్టుగా, 2026 మార్చ్ 31 డెడ్‌లైన్‌తోనో, లేదా ఏప్రిల్ 13 భాగ్య హత్యతోనో ముగిసేది కాదు కదా! అది తేలుస్తుంది కదా – ఇవ్వాళ కాకున్నా మరో రోజైనా.. ఏనాటికైనా… కారుచీకట్లు కమ్మేసిన ఈ ద్రోహకాలంలో ఎవరు ఎటువైపు నిలబడ్డారో! అది రికార్డు చేసి పెట్టుకుంటుంది కదా… ఎవరెవరు ఏమేం తప్పుడు వ్యాఖ్యానాలు చేశారో, ఎలాంటి వక్రభాష్యాలు చెప్పారో! తొందరేముంది?