పూలమృదువు మనుషులని ఎవరినంటారో

యాభయ్యేళ్ళు …
క‌థ‌ కదులుతూనే ఉన్నది కలల్ని మోసుకుంటూ –
యాభయ్యేళ్ళు ..
పాట సాగుతూనే ఉన్నది పేగుల్ని మీటుకుంటూ –
యాభయ్యేళ్ళు ..
నది పారుతూనే ఉన్నది కడగండ్లను దాటుకుంటూ –
దూరమిలా ఉన్నంత కాలమూ పయనమిలా సాగాల్సిందే గదా
అంతరాలు ఉన్నంత కాలమూ అడవి ఇలా రగలాల్సిందే గదా
**
గుండె రాయైనవాళ్ళా ..?
పసిహృదయం ఉన్నవాళ్ళు గదూ..
కరుణ కరువైన వాళ్ళా ..?
కన్నీటి ఊటలున్నవాళ్ళు గదూ..
ఆయుధాల్నా ప్రేమిస్తారు..?
మనిషి కోసం పడిచచ్చే వాళ్ళు గదూ..
**
ఎల్తురు గింజలు పండిద్దామని
ఏకుంజామునలేచి అరకలు కట్టినవాళ్ళు
జోరున కురుస్తున్న ఎండల్లో
ముద్ద ముద్దగా తడిసి మట్టై పోతున్నవాళ్ళు
మిట్టమజ్జానం పూట గట్టుమీద చెట్టుకింద అరిచేతుల్లో చేరిన ముద్ద గదా వాళ్ళు
పొద్దంతా నాట్లేసి పచ్చిపుండ్లైన అరికాళ్ళకు పసుపులేపనం గదా వాళ్ళు
ఉసురు నిలిపేందుకు ఉబుకుతున్న జీవజలం గదా వాళ్ళు
ప్రాణం పణం పెట్టి పంటకాలవలై పారుతున్న వాళ్ళు
ఉయ్యాల్లోని పసిపాపను ఊపిరి లాల తోడుగా ఊపుతున్నవాళ్ళు –
కఠినులా వాళ్ళు..?
కథ‌కు చెమ్మనద్దుతున్నవాళ్ళుగదూ..
**
పూలమృదువు మనుషులని ఎవరినంటారో
తేటతేట మనసులని వేటినంటారో
**

-రాఘవ రామిరెడ్డి

9 thoughts on “పూలమృదువు మనుషులని ఎవరినంటారో

  1. ఎంత మృదువుగా చెప్పారు ….వాళ్ళలాగే ఉంది మీ కవిత

    1. శ్రమైకజీవన సౌందర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన కవిత…

Leave a Reply