పాసంగం

ఆచరించని ఐక్యత రాగం నీకో రోగమయింది
విభజించొద్దనే వితండవాదం నీకు విష జ్వరమై పట్టుకుంది
కలిసి ఉందామనే కపటం ఎత్తేసుకొస్తుంది
తవుడు తడిసిందనీ ఏడుస్తుంటే తమలపాకు తెలిసిందే మొత్తుకుంటావు
మాది తవుడు బతుకు మీది తమలపాకు విలాసం

బ్రతుక నేర్చిన రంగస్థలం మీది అబద్ధాలు
కొండంత రాగమెత్తి విడిపోవద్దనే బాంచ పాటలు పాడుతున్నాయి

మనమ్మనము ఒక్కటంటావా?
మనము కలిసున్నది ఎప్పుడు?
జూట మాటలొద్దు
చేతుల చెయ్యేసి జోటపాటలు పాడినమా ?
మరుగున పెట్టకు
మనసార అలై బలై తీసుకున్నామా?
నా నరాలు తెగేలా నిన్ను ఆలపించినా ప్రలాపించినా
వాకిట్లోకి రానివ్వనొనివి వంటింట్లో వడ్డిస్తావా?
వట్టి మాటలు వద్దు
కంచం నీది మట్టి చిప్ప నాది
కాగిన గంజి కలిసి తాగనివ్వనోడివి కడుపునిండా తిననిస్తావా?
నోటి బుక్క ఎత్తగొట్టి నొసిటితో ఎక్కిరిస్తూ
హక్కుల జోలె నింపుకొంటివి
కడుపు నిండి నీవు, ఆకలి మండే కడుపుతో నేనూ
కలిసుందాం అంటే ఎట్లా కలుస్తది
వీపును నిమిరినంత అలుకగా
ఏర్పడకుండా కడుపులో గుద్దుతున్నావ్

కులాలు, మూలాలు వేరువేరు
వృత్తులు, ప్రవృత్తులు వేరు వేరు
పొత్తుల ముల్లగట్టిన హక్కుల సద్ది మెక్కు కుంట
దళితులంతా ఒక్కటంటే దబాయింపులుగావా ?

కనీసం నీవు నేను ఏనాడైనా పొత్తులున్నమా?
నీ తండ్రి ఆస్తిని మీ అన్నదమ్ములతో కలిసి పంచుకోలేదా ?
ఇంట్లో వాటాల పంపకం సరే
మనమధ్యల వర్గీకరణ వద్దనే వాదనెందుకు ?
సామాజిక వికాసంలో ఇది తరాల తండ్లాట

నీ వాదానికి
మనువాదాన్ని పెన్నుపోటుతో మన్నుగప్పిన సామాజిక న్యాయం
చెరి సగం పంచలేక అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది
తీరని దుఃఖం న్యాయం దొరకని నడి సముద్రంలో
తీరం దొరక్క తీర్ తీరుగా వలపోస్తుంది
సభ్యసమాజంలో
ఉత్త చేతులతో ఉపకులాలున్నాయి చూడు
సంక లేపితే కార్జాలు కనబడుతున్నయి
ఉగ్గ పట్టిన ఊపిరి దినదిన ప్రాణగండంగా
మొండి ఆయుష్షుతో మొరాయిస్తున్నాయి
దగా పడిన గోసలు గొంతెత్తుతున్నాయి
న్యాయం కోసం మండుతున్నాయి

విడి కళ్ళ చూపు ఒకటే
పాసంగం తూచే కొసల ధర్మం
కావడిబద్దలా కలిసి ఉండడం ఉత్కృష్టం

పంచుకుందాం ముసుకుని తెంచుకుందాం
నీది నీకే నాది నాకే
మనది మనకే కాపాడదాం
ఉనికికి ఊచ కోత కోసే మనువాది మీద మన్ను పోద్దాం
కుట్రల కుంపట్లు రగిలించే అగ్ని జ్వాలల్ని ఆర్పేద్దాం
జోట బాటలు పట్టి అధికారాన్ని అందుకుందాం పద

జ‌న‌నం: గోనెపల్లి గ్రామం, చిన్నకోడూరు మండలం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ. కవి, రచ‌యిత, ఉపాధ్యాయుడు. జంబూ సాహితీ వ్యవస్థాపకులు. ఉస్మానియా విశ్వవిద్యాలయం (2009–2016) నుంచి “తెలంగాణ పాటల్లో సామాజిక చిత్రణ” అంశంపై పీఎచ్.డి. పరిశోధన చేశారు  (2017). రచనలు : కవిత్వం : 'మా తొవ్వ‌'(క‌విత్వం), 'బ‌తుకు పాఠం'(క‌విత్వం), కథలు :  'త‌ప్ష‌'(క‌థ‌); సాహిత్య విమర్శ : ముక్వారు (సాహిత్య వ్యాసాలు) - 2025, పాట ముచ్చట (పాటలపై విశ్లేషణ - 2026) ప్రచురించారు. జంబూ సాహితీ ఆధ్వర్యంలో గుడిపల్లి నిరంజన్, తప్పెట ఓదయ్య గారలతో కలిసి దళిత కథా సిరీస్ కు సంపాదకత్వం వహిస్తున్నారు. సంపాదకత్వం : 1. తొండం బొక్కెన - తొలి తెలుగు దళిత కథా వార్షిక (2020), 2. చిందూ నేల - దళిత కథ (2021), 3. సాక - దళిత కథ (2022), 4. కొమ్ము - దళిత కథ (2023), 5. గండదీపం - దళిత కథ (2024). డిజిటల్ రిసోర్స్ : siddenky.blogspot.com, యూట్యూబ్ ఛానల్ : “తెలుగు సిరి – డా. సిద్దెంకి”, ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇబ్రహీంనగర్, చిన్నకోడూరు మండలం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణలో స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) గా పనిచేస్తున్నారు.

 

 

One thought on “పాసంగం

Leave a Reply