పాదముద్రల్లో అడుగేసి నడుస్తోన్న కవి …

“అవ్వజెప్పిన తొవ్వ’ – దీర్ఘ కవిత తర్వాత యాభై నాలుగు పేజీలూ ముప్పై ఒక కవితలతో ‘పాదముద్రలు’ అనే పేరుతో తన రెండో కవితా సంకలనం తీసుకొచ్చాడు కవి మిత్రుడు శాఖమూరి రవి. ఈ సంకలనంలో తన దీర్ఘకవిత ‘అవ్వజెప్పిన తొవ్వ’ను కూడా ఒక కవితగా చేర్చాడు. ఇందులో శ్యాం, కిషన్ పై, చంద్రశేఖర్‌కు సంబంధించి మూడు పాటలతో పాటుగా మిగతావి కవితలున్నాయి.

మొత్తంగా ఈ సంకలనంలో అమరుల గురించి రాసినవే ఎక్కువగా ఉన్నాయి. రెండో స్థానం తెలంగాణది. మిగతావి పాలకుల ప్రకృతి విద్వంసం గురించి, ఉపాధ్యాయ ఉద్యమం గురించి, విద్యార్థుల గురించి సస్పెండ్ అయిన పోలీసుల గురించి, రాజశేఖర్ రెడ్డి మరణం గురించి తనపై పెట్టిన అక్రమ కేసు పోటా గురించి ఇంకా అనేక అంశాల గురించి కవితలున్నాయి.

రవి విప్లవ రచయిత విప్లవాన్ని కలగంటున్నవాడు. అందుకు సాహిత్యం తన కార్యరంగంగా ఎంచుకున్నాడు. కనుక, తన దృష్టికొచ్చిన ప్రతీ విషయాన్ని విప్లవీకరించడంలో భాగంగా కవిత్వీకరించడానికి ప్రయత్నించాడు. ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తన మాట తీరుతో ప్రజల్లోకి చొచ్చుకుపోతూ ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వొదులుకోకుండ ఏ మేరకు ఉపయోగపడితే ఆ మేరకు తన పరిచయాలను విప్లవం వైపు అలోచించేలా చేస్తున్నట్లుగానే, కవిత్వం విషయంలో కూడా ఏ చిన్న విషయాన్ని ‘చిన్నది’గా చూస్తూ ఊరుకోలేదు. అందుకే, 2004లో వరంగల్ లో జరిగిన విరసం సభలకు పరోక్షంగా చేయూతనిచ్చిన

చెమట చేతులను ‘పునాది’ అనే కవితలో పలకరించాడు.
అతడు విరసం సభలకు రాలేకపోవచ్చు
రెండు రోజుల సమయం వెచ్చించక పోవచ్చు
రెక్కాడితే గానీ డొక్కాడని వాడు
ఇదిగో నా రెక్కల కష్టం రెండొందల విరాళమని ఇచ్చాడు.

అతడు విరసం జెండా ఎత్తిపట్టి
రాస్తామీద ర్యాలీగా నడవకపోవచ్చు
నిర్జీవమైన కొన్ని కట్టెలు, కొన్ని బట్టలు అతని చేతిలో పెట్టాం
పొద్దస్తమానం వాటిలో ఏం మాట్లాడిండో ఏమో

ఆ సంధ్యా సమయాన
కాగడాగా వెలిగిన క్షణం అమరుల తొవ్వ జూపిండు
వాడే, ఖచ్చితంగా వాడు వాడే
ప్రజాయుద్ధ పునాది వాడే – అని ప్రకటించాడు కవి.

మూసాయిపేట రైలు దుర్ఘటనలో చనిపోయిన పిల్లలను తలుచుకుంటూ ‘ఆఖరి సిరా సంతకం’ అనే పేరుతో కవిత రాశాడు రవి. చూడానికి మామూలు ప్రమాదంలాగే కనిపిపంచే ఈ దుర్ఘటన వెనుక బహుళజాతి కంపెనీల మార్కెట్ దాహం దాగుంది. ఆ దాహాన్ని తీర్చడానికి ఉపయోగపడే ఇంగ్లీషు మీడియం చదువుల మోజులో ఉంది. ఆ మోజుల్లోంచి పుట్టగొడుగుల్లా మొలిసిన కార్పోరేట్ విద్యా సంస్థల వ్యాపార లావాదేవీల్లో ఉంది. అందుకే,

నేను బాల్యాన్ని
తొలకరి చినుకల మట్టి వాసనలో
వానా వానా వల్లప్పంటూ – తిరగాల్సిన అల్లిబిల్లిని
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ – పరుగు పందెంలో
తెగిపడ్డ రాలిన చుక్కను – అని మాతృభాషలోని సహజత్వపు మాధుర్యానికి దూరంగా
ఆంగ్ల మాధ్యపు మాయాజాలపు కృత్రిమ చదువుల్లో రాలిపోతున్న బాల్యాన్ని గురించి చాలా అర్ధంగా రాశాడు.

కవిత్వమంటే ఏమిటి? అనే ప్రశ్న వేసుకున్నప్పుడు, ఆ కవిత్వం ఎవరి కోసం అనే ప్రశ్న కూడా వేసుకోవాలి. అది ప్రజల కోసం అనుకున్నప్పుడు, ఆ కవిత్వం ప్రజల భాషలో రాయాలి. ప్రజలకు అర్థమయ్యే రీతిలో రాయాలి. ప్రజల నుడికారాలను, సామెతలను, పలుకుబడులను ఉపయోగించాలి.
ఛందోబద్ధ పురోహిత వర్గ పద్యాల పేజీల జంద్యం పోగులను తెంపివేయాలి. “కష్టజీవికి ఇరువైపులా కావలి కాసేవాడే కవి” అని శ్రీ శ్రీ అన్నట్లుగా కష్టజీవికి అర్థమయ్యే రీతిలో సరళంగా సూటిగా డొంకతిరుగుడు వ్యవహారం లేకుండా చెప్పగలగాలి. “మనమే అడుకోవాలి” అనే కవితలో కవి ఆ ప్రయత్నం చేశాడు. దండకారణ్యంలో మొన్నటి వరకు గ్రీన్ హంట్ ఇవ్వాల సమాదాన్ పేరుతో అదివాసుల హననం కొనసాగుతోంది. లక్షల సంఖ్యలో పోలీసు బలగాలను దింపి ఆదివాసుల గూడాలలో రక్తం పారిస్తోంది రాజ్యం. అదివాసులను జంతువులకన్నా హీనంగా వేటాడుతోంది రాజ్యం. అలాంటి వాతావరణంలో కొంత మంది పోలీసులు వాస్తవాలను గమనించి, మానవత్వమున్న మనుషులుగా “మట్టి మనుషులను మాంసం ముద్దలుగా చేసే” వేటకు మేం వెళ్ళలేమని ప్రకటించారు. రాజ్యం కన్నెర్రకు కారణమయ్యారు. ఫలితంగా ఉద్యోగాల నుండి సస్పెండ్ కు గురయ్యారు. ఆ సందర్భంలో –

వాళ్ళిప్పుడు
చెట్టుపై నుండి
చెఱువులో పడ్డ చీమలు
పాపం
మట్టి మనుషులమనుకుంటున్న మనమే
ఆకులను రాల్చి ఆదుకోవాలి.

పై కవితలో అడంబరాలు లేవు. అర్థంకాని మాటలు లేవు. ప్రజలవి కాని పదాలు లేవు. చాలా సరళంగా ఏ మాత్రం అక్షర జ్ఞానం కూడా లేనటువంటి వాళ్ళు సైతం సునాయాసంగా అర్థం చేసుకునే కవిత ఇది. ఇదొక్కటే కాదు పుస్తకం మొత్తంగా ఏ కవితలో కూడా అర్థంకాని మాటలూ, భావాలూ లేవు. సరిగ్గా ప్రజాకవిత్వమంటే ఇదే. అట్లాగే విప్లవ కవిత్వంలో శిల్పంలేదు అనే వాళ్ళుకు ఇదొక సమాదానం. ఆ శిల్పం కూడా ప్రజలకు అందనంత దూరంలో లేదు. ఇట్లాంటి కవితలు, శిల్పాలు సంకలనం నిండుగా మెండుగా ఉన్నాయి. కవితా వస్తువు విషయానికి వస్తే “కాదేది కవిత కనర్హం” అని శ్రీశ్రీ అన్నట్లుగానే రెండు వందల రూపాయల విరాళమిచ్చిన రెక్కల కష్టం చెమట చేతుల నుండి లాల్ గఢ్ లో లాల్ జెండా ఎగురేసిన విప్లవోద్యమం దాకా విస్తరించింది. విప్లవోద్యమానికి అవసరమయ్యే ముడి సరుకు ఏదో, దాన్ని కవిత్వీకరించడానికి ప్రయత్నించాడు కవి రవి.

తెలంగాణలో విప్లవోద్యమం లేదు. కనుమరుగయి పోయింది. విప్లవకారులందరూ “ఎన్ కౌంటర్” అనే పట్టుకుని చంపేసే పద్ధతిలో చనిపోయారు లేదా “జనజీవన స్రవంతి” అనే పేరుతో జనానికి దూరమయ్యారు అనగా లొంగిపోయారు అని ప్రకటిస్తూనే, మరోవైపు ప్రజల మీద నిర్భందం వేసవి సండ్రనిప్పులు కురిపిస్తోంది ప్రభుత్వమనే రాజ్యం. శత్రువు ఎత్తిపొడుపు ప్రశ్నలకు “గుర్తు” అనే కవితలో సమాదానాన్ని వెతుక్కున్నాడు కవి.

రాలిపోతున్న పత్రాల గురించి అడిగితే
త్యాగం కోల్పోయి ఉద్యమం విడిచివెళ్ళిన
వాళ్ళ గురించి చెప్పిన గుర్తు
పత్రాలన్నీ రాలిపోతే? అని ప్రశ్నిస్తే
మొలిచే కొత్త చిగురు గురించి చెప్పిన గుర్తు

అట్లాగే మరో చోట …

రాలిన పూలను
రాశులుగా లెక్కించే వాడికి
పరిమళం ప్రవహించే దూరమేం తెలుసు? ప్రకటిస్తాడు.

విప్లవోద్యమాన్ని నిత్యం అద్యయనం చేస్తున్న వాడిగా, విప్లవోద్యమ ఎత్తుపల్లాలు ఎరిగిన వాడిగా …. విప్లవోద్యమ భవిష్యత్ పట్ల ఆశావహ దృక్పథం కలిగిన వాడిగా ….. విప్లవం పట్ల పై కవితలో అంతటి ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించాడు అంతే విశ్వాసంలో తను ఎంచుకున్న రంగంలో కవిత్వాన్ని అల్లుకుంటూ ప్రజా ఉద్యమాల్లో చురుకైన కార్యకర్తగా పని చేస్తున్నాడు.

రవిది ప్రాంతం రీత్యా ఆంధ్ర ప్రాంతం. తాత ముత్తాతల నాడే వలసొచ్చి గుంటూరుపల్లెలో పుట్టిబుద్దెరిగి …. తెలంగాణ కట్టుబొట్టునూ బోనాన్ని ఎత్తుకొని … బతుకమ్మ పూలేరిన చేతుల మనిషి. కనుక, కవిగా, కార్యకర్తగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఒక వైపు తెలంగాణ ఉద్యమం. మరోవైపు విప్లవోద్యమంతో కలిసి నడిచాడు – ఫాం హౌజ్ రహస్య ఒప్పందాల్లో ఓట్లు సీట్లు భౌగోళిక తెలంగాణతో తెలంగాణ బతుకు మారుతుందా అని ప్రశ్నించాడు. విప్లవ పురిటిశాల వెలిశాల లచ్చవ్వ గొంతుతో…

దొరల తెలంగాణ
దోచుకునే తెలంగాణని
వత్తదా
వచ్చే తెలంగాణలో
చిత్ర హింసలుండవా
లైంగిక హింసోన్మాద దొరలుండరా
ఉండరా
ఊరి మధ్యలో నా ఇల్లు
వత్తదా! వచ్చే తెలంగాణలో
ఈ బూటకపు ఎన్‌కౌంటర్లుండవా
ఓపెన్ కాస్ట్ బొందలగడ్డలుండవా – అని ప్రశ్నించాడు.

కవి ప్రశ్నించినట్లుగానే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆంధ్ర పెట్టుబడి దొరలు పోయి తెలంగాణ దొరలు అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఇప్పటికీ ఏడు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ “తెలంగాణ బతుకు చిత్రం”లో పెద్ద మార్పేమీ జరుగలేదు. పెట్టుబడి దొరలు మంత్రులయ్యిండ్రు. మహిళలపై లైంగిక హింసకు అంతులేకుండా పోయింది. ఓపెన్ కా బొందలగడ్డల లోతెక్కువయ్యింది. ఊరి చివరి పూరి గుడిసె వాసాలు బొక్కలెల్లిన దేహమోలె అట్లాగే ఉన్నయి. మూడెకరాలు, డబుల్ బెడ్ రూములు వారిని పలకిరించలేదు. ఎన్ కౌంటర్ హత్యలు జరుగక మానలేదు. అక్రమ
అరెస్టు, కుట్ర కేసుల, చిత్రహింసలు తెలంగాణలో ఎమర్జెన్సీని మించి పోయాయి. అందుకే, భౌగోళిక దొరల తెలంగాణ కాదు ప్రజాస్వామిక తెలంగాణ కావాలని కవి ఆశించిండు. “అవ్వజెప్పిన తొవ్వ” దీర్ఘ కవితలో తెలంగాణ ముఖచిత్రాన్ని మన ముందుంచిండు.

చివరగా, విరసం ప్రచురించిన ఈ పుస్తకం పేరు – పాదముద్రలు. “పాదముద్రలు” పేరుతో ఉన్న కవితను గత దశాబ్ద కాలంలో ఉపాధ్యాయ ఉద్యమంలో ముఖ్యంగా వరంగల్ లో మొదలైన చీలికల నేపధ్యంలో రాసింది. “ప్రజాస్వామ్య ఉపాధ్యాయ మిత్రులారా” అని మొదలు పెట్టి

మీరు సత్యం సారు వారసత్వాన్ని ఎత్తిపట్టారని
జనార్ధన్ జాడ వెతికారని
చంద్రశేఖర్ చైతన్యాన్ని కలిగినారని
బడే మురళి సురేష్ బాట తెలిసినవాళ్ళని – అందుకే మీ

“పాదముద్రల్లో అడుగేసి నడవాలనుకున్న వాళ్ళం” అని రాశాడు. ఉపాధ్యాయులై ఉండి, విప్లవోద్యమంలోకి వెళ్ళి అమరులైన వాళ్ళ అడుగుజాడల్లో మీరు నడుస్తున్నారు. కాబట్టి, మీ పాదముద్రల్లో అంటే ఉపాధ్యాయులైన మీ పాదముద్రల్లో మేం నడవాలనుకున్నాం అని పై కవిత మనకు తెలియజేస్తుంది. కానీ, నిజానికి అవి అమరుల పాదముద్రలు. విప్లవోద్యమ అడుగుజాడలు. ఇదే విషయాన్ని కవి చాలా స్పష్టంగా అమరుడు శాఖమూరి అప్పారావు గురించి “పక్షిబంధం” అనే కవితలో

“ఇప్పుడు
నా అడుగులది
పక్షి పాదముద్రల వెతుకులాట”…. అని ప్రకటించాడు. నిజమే అవి…
శాఖమూరి అప్పారావు పాదముద్రలు
భారత విప్లవోద్యమ కొండగుర్తులు

కవి,
శాఖమూరి రవి కవితలు.

-నాగేశ్వర్

వరంగల్ జిల్లా నెల్లికుదురు నివాసం. కవి, గాయకుడు. ఎం. కామ్, బీఎడ్ చదివారు. రచనలు:  'అలలు', 'పూలు రాలిన చోట', 'గెద్దొచ్చే కోడిపిల్ల' అనే పేర్లతో మూడు కవితా సంకలనాలు ప్రచురించారు. 1996 నుండి విరసం సభ్యుడిగా ఉన్నారు. ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. అప్పుడప్పుడూ సమీక్షలూ, పాటలు రాస్తున్నప్పటికీ ప్రధానంగా కవిత్వమే ప్రధాన వ్యాపకం.

Leave a Reply