మరణాన్ని జయించిన వాడు

కొంతమంది ప్రత్యేక మానవులుంటారు. అంటే బయలాజికల్గా ప్రత్యేకం కాదు. వాళ్ల ఆలోచనలు, అవగాహనలు, విశ్లేషణలు, దృక్పథాలు, ప్రవర్తనల వలన వారు ప్రత్యేకంగా జీవించిన వారవుతారు. ప్రత్యేకమంటే స్టైల్ కాదు. వాళ్లు ప్రత్యేకంగా ఎందుకు కనబడతారు అంటే మనకు భిన్నంగా అసలైన మనుషుల్లా ప్రవర్తిస్తుంటారు కనుక. మనిషి మనిషిలా ప్రవర్తించటం ప్రత్యేకతే కదా! అంటే తన మానవ సంబంధాల్లో మానవీయతతో స్పందించటం, సాటి మనుషుల పట్ల బాధ్యతగా మెసలటం, సమాజం పట్ల ఒక సామూహిక ప్రయోజన దృక్పథం కలిగి వుండటం, ద్వంద్వ విలువలకు తావు లేకపోవటం, మరే ఇతర మనిషి పట్ల భయపడకుండా వుండటం, ఏ సందర్భంలో అయినా నిర్భీతిగా వ్యవహరించటం, ఏ విపత్కర పరిస్తితిలో అయినా గుండె జారనివ్వక పోవటం, ఒక మనిషి మీద మరొక మనిషి లేదా ఒక ప్రజా సమూహం మీద మరో ప్రజా సమూహం యొక్క ఆధిపత్యాన్ని తిరస్కరించటం, అన్యాయం వ్యక్తుల స్థాయిలో అయినా, విలువల రూపంలో అయినా, సామాజిక స్థాయిలో అయినా చెలరేగుతుంటే దాన్ని పిడికిళ్లతో ఎదుర్కోవటం, కంటికి కనిపించే దుర్మార్గాల మీద తిరుగులేని పోరాటం చేయటం, ఆ దుర్మార్గాల వెనుకనున్న శక్తులను మట్టి కరిపించాలని సంకల్పించటం, తిరగబడటం, చుట్టూ వున్నవారికి తనలోని చైతన్యాన్ని పంచటం …ఇవన్నీ నిజమైన మనుషుల లక్షణాలు. కానీ ఈ అసలు మనుషులు ఎక్కువమంది కనబడరు. అందుకే వారెక్కడ కనబడ్డా ప్రత్యేకంగా కనబడుతుంటారు. సామాన్యుల్లో లేని మానవీయ అంశాలెన్నెన్నో వారిలో కనబడుతుంటుంటాయి. వాళ్లు జీవితంలో రాజీ పడరు. వాళ్ల దగ్గర నసుగుళ్లుండవ్. వాళ్లతో బేరాలుండవ్. వాళ్లదంతా రెండ్రెళ్ల నాలుగు వ్యవహారమే. వాళ్ల కంటికి సమాజం ఏ దేవతా వస్త్రాలు లేకుండా కనిపిస్తుంటుంది. వాళ్ల దృష్టికోణాన్ని ఎవరూ, ఏదీ ప్రలోభ పెట్టడం జరిగే పని కాదు. ఆ రకంగా వారి వ్యక్తిత్వం ప్రత్యేకమైనది. ఆ వ్యక్తిత్వం కూడా సామాజికమైనది. అది కుటుంబ పరిధిని, వ్యక్తి పరిధిని దాటి వుంటుంది. అలాంటి వాళ్లను చేగువేరా అంటారు. జార్జిరెడ్డి అని కూడా అంటారు.

ఆ జార్జిరెడ్డి జీవిత చరిత్రనే కాత్యాయని గారు “జీనా హైతో మర్‌నా సీఖో” అన్న పేరుతో రాసారు. అయితే ఈ పుస్తక లక్ష్యం జార్జి కేవలం ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏం చదివాడు, అతని కుటుంబ సభ్యులెవరు వంటి వివరాలతో నిండి వున్నది కాదు. ఆ వివరాలు ఎలాగూ వుంటాయి కానీ జార్జి ఒక ప్రత్యేకమైన, విశిష్టమైన వ్యక్తిత్వం కలవాడిగా ఎలా రూపు దిద్దుకున్నాడు? అసలు అతని వ్యక్తిత్వ లక్షణాలేమిటి? అతను ఒక చురుకైన నాయకుడిగా, మంచి మెరిట్ విద్యార్ధిగా, అసాధారణ మానవీయతగల వాడిగా, ప్రాణమిచ్చే స్నేహితుడిగా, అన్యాయాన్ని ఎదిరించే తిరుగుబాటుదారుడిగా ఎలా ఎదిగాడు? అతన్ని ప్రభావితం చేసిన ఇంటా బైట పరిస్థితులేమిటి? అనే ప్రశ్నలకి అన్వేషణగా ఈ పుస్తకాన్ని చెప్పొచ్చు. ఏదో క్రానాలజీ ఆఫ్ ఈవెంట్స్ గా కాక అతని జీవితంలోని ముఖ్య సంఘటనల వెనుకనున్న సందర్భాలేమిటి అనేది ఈ పుస్తకంలో కనబడుతుంది.

ఈ పుస్తకానికి ఒక లక్ష్యం వున్నట్లు కనబడుతుంది. వర్తమాన సమాజంలో మనిషికి మానవ సంబంధాల కన్నా యంత్రాలతో అనుబంధమెక్కువ. ఏదో యంత్ర ప్రమేయం లేకుండా ఒక్క పది నిమిషాలు గడవని స్థితి మనిషిది. మనిషితో మనిషికి వుండాల్సిన అనుబంధం స్థానంలో వినిమయ ధోరణి కనబడుతున్నది. మనిషి పుడుతూనే ఏదో ఒక వ్యాపకానికి బానిసై పోయే పరిస్థితి వుంది. ఎవరికీ సమాజంలో జరిగే అన్యాయాల్ని, దుర్మార్గాల్ని, ఆధిపత్యపు విలువల భావజాలంతో చేసే అణచివేతల్ని పట్టించుకునే ఓపిక లేదు. ఇప్పుడు ఆదర్శాల్లేవ్. కేవలం వినోదాలే వున్నాయి. ఇప్పుడు సామాజిక స్పృహ అంటే ఏదో కాస్త “చారిటీ యాక్టివిటీ” మాత్రమే. చారిటీ తప్పు కాదు కానీ చారిటీ అవసరం వున్న వ్యవస్థలు అసమానతలకు చిహ్నం. చారిటీ అవసరం వున్న అసమానతల మూలాల్లోకి వెళ్లి ప్రశించే వాళ్లు కావాలి. అలాంటి వ్యక్తులకి వజ్ర ఖచ్చితమైన వ్యక్తిత్వముంటుంది. అది ఎలా వుంటుంది అనేదానికి సోదాహరణగా జార్జిరెడ్డి జీవితం చెప్పాల్సి వుంటుంది. “జీనా హైతో మర్నా సీఖో” పుస్తకం ఆ లక్ష్యంతో రాయబడిందనే అనుకుంటాను.

“జీనా హైతో మర్నా సీఖో” అనేది జార్జి ఇచ్చిన నినాదం. “బతకాలంటే మరణించటం నేర్చుకో” అని దానర్ధం. బతకటమంటే ఊపిరి తీయటమా? తల్లిదండ్రులు, చుట్టు పక్కల సమాజం ఇచ్చిన ఆర్ధిక, నైతిక మూసలో జీవితాన్ని లాగించటమేనా? కాదు అంటారు జార్జి, చే వంటి వారు. వాళ్లస్సలు భయపడుతూ బతికే భద్ర జీవితాన్ని ఒప్పుకోరు. తన జీవితంలో తనకి ఎంతటి ప్రాముఖ్యత ఇస్తారో ఇతరులకి కూడా అంతే సమ ప్రాముఖ్యత ఇచ్చే సంస్కారం గల ఇలాంటి వారు తమ మేథ, శక్తి సామర్ధ్యాలు, నిరంతరం ఒక వంద నక్షత్రాల జ్వలనాన్ని నింపుకునే ఉత్సాహం మొత్తం దోపిడీ పీడనలు, అసమానత్వాలు, ఆధిపత్యాలు లేని సామాజిక సమానత్వానికి అంకితం చేస్తారు. అలా అంకితం చేయాటాన్నే బతకటం అందాం. ఆ నిబద్ధతని జీవితంలో వంద శాతం ప్రదర్శించాలంటే మరణాన్ని కూడా తేలికగా ఆహ్వానించే తత్వం, ప్రవర్తన వుండాలి. అది జార్జి లాంటి వారిలో మాత్రమే దొరుకుతుంది.

జార్జి బతికుండగానే తనలాంటి వారిని జమ చేసాడు. కొన్ని సంవత్సరాల పాటు విద్యార్ధిలోకాన్ని స్వయంగా ప్రభావితం చేసాడు. నిజానికి జార్జి తాను చనిపోయాకే ఎక్కువగా జీవించాడు. జంపాల చంద్రశేఖర ప్రసాద్ వంటి అమరుల నుండి తదనంతర కాలంలో భారత విప్లవోద్యమంలో కీలక పాత్ర పోషించిన అగ్ర నాయకులు కూడా జార్జి సాహచర్యంలో ఎదిగారు. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజున జార్జి భావజాలానికి ప్రతినిధులున్నారేమో కానీ జార్జి వ్యక్తిత్వానికి ప్రతిబింబాలు లేరు. ఈ పుస్తకాన్ని లోతుగా అర్ధం చేసుకుంటే ఒక నాయకుడికి వుండాల్సిన ప్రాపంచిక దృక్పథం, డీక్లాసిఫైడ్ ప్రవర్తన, మానవసంబంధాల్లో నిజాయితీ, చెప్పిన దానికి చేసే దానికి మధ్య వ్యత్యాసం, వైరుధ్యం లేని నిబద్ధత, మానసిక స్వఛ్ఛత, వర్గ స్పృహ, స్నేహ పరిమళం, తిరుగుబాటు తత్వం… అన్నీ మనకి జార్జి ద్వారా పరిచయం అవుతాయి.

కేవలం 25 సంవత్సరాలు మాత్రమే బతికి 25వ ఏట ఉస్మానియా యూనివర్శిటీ ప్రాంగణంలోనే హత్యకి గురైన జార్జి రెడ్డి భారతీయ విప్లవోద్యమంలోనే ఒక ప్రత్యేక స్థానం కలిగి వున్నాడు. అతను ఒక విద్యార్ధి నాయకుడు. మంచి విద్యార్ధి. ఎంతో భవిష్యత్తు వున్న సైన్స్ పరిశోధకుడు. చదువులో గోల్డ్ మెడలిస్ట్. అన్నింటికీ మించి అతను మరణించిన సుమారు ఐదు దశాబ్దాలవుతున్నా తరిగిపోని స్ఫూర్తి ప్రదాత. 1947లో ఒక రాష్ట్రాంతర, కులాంతర, మతాంతర ప్రేమ జంట చల్లా రఘునాధ రెడ్డి, లీలా వర్గీస్ లు. ప్రేమించి పెళ్లి చేసుకున్నంత సులువు కాదు కదా ప్రేమైక జీవితాన్ని గడపటం. పడుతూ లేస్తూ సాగిన ఆ దాంపత్యం ఐదుగురు పిల్లలు పుట్టిన తరువాత తెగిపోయింది. పిల్లల్ని తన రెక్కల కింద దాచుకొని కాపాడుకున్నది తల్లి. ఎన్నెన్నో వూళ్లు తిరిగారు. ఎన్నో ఇళ్లు మారేవారు. కేరళ, తమిళనాడు, వరంగల్, హైదరాబాద్… ఇలా ఎన్నో ప్రదేశాలు తిరిగారు. ఆవిడ టీచర్ గా పనిచేసేది పెద్ద కూతురుతో పాటు. కానీ పిల్లల్ని మాత్రం బాగా చదివించేది. జార్జి ఆమె నుండే బహుశా తలవంచని తనం నేర్చుకొని వుంటాడు. జీవన పోరాటాన్ని అభ్యసించి వుంటాడు. కష్టం సుఖంకి సంబంధించిన వివేచనని పెంపొందించుకొని వుంటాడు. అతనికి బాల్యంలోనే స్వతహాగా ఆత్మవంచన చేసుకోకుండా తలెత్తి నిలబడే తత్వం అలవడింది. అది అతను కేరళలో ప్రాధమిక విద్యాభ్యాస సమయంలోనే బైటపడింది. అహం దెబ్బ తిన్న టీచర్ బాధపడాలే కానీ జార్జి భయపడేవాడు కాదు. అతన్ని క్లాస్ నుండి బైటకి పంపితేనో లేదా యూనివర్శిటీ నుండి రస్టికేట్ చేస్తేనో లైబ్రరీలోకి వెళ్లి చదువుకునే వాడు. నిర్భీతిగా వుండటం అతనికి సహజ కవచ కుండలాల వంటింది.

జార్జి మిత్రుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా కాత్యాయని సేకరించిన సమాచారం ఎంతో విలువైనది. ఆయన వ్యక్తిత్వాన్ని ఆమె నిశితంగా పరిచయం చేస్తారు. జార్జి ఒక పుస్తకాల పురుగు. జ్ఞానం అతనికొక దాహం. లోతైన అధ్యయనం అతని స్వంతం. స్నేహం అతని జీవన విధానం. ఏ స్కూల్లో, కాలేజీలో చదివినా అతనికొక మిత్ర బృందం. లంచ్ బాక్సుల్లో అన్నం పంచుకోవటం దగ్గర నుండి నీది నాది అనేదే లేదు. అతి నిరాడంబరత. ఎంతటి తెగింపో అంతటి సరళత్వం ప్రవర్తనలో. తన దగ్గరున్న ప్రతి పైసాని, వస్తువుని ఇతరులతో పంచుకోటానికి జార్జి ఎల్లప్పుడూ సిద్ధంగా వుండేవాడు. ఎవరికి ఏ ఆపద వచ్చినా తానుండేవాడు. నాయకుడనేవాడు తాను ముందుండాలనే దానికి జార్జి సరైన ఉదాహరణ. డాక్టర్ కావాలనుకొని కాలేక ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అయ్యాడు. అనంతరం పీహెచ్డిలో జాయిన్ అయ్యాడు. ఐతే సమాంతరంగా అతను వామపక్ష భావజాల విద్యార్ధి నాయకుడయ్యాడు.

ఆ సమయంలో ఉస్మానియాలో ఇప్పటి బీజేపికి పూర్వ రూపమైన జనసంఘ్ కి అనుబంధంగా వున్న ఏబీవీపి గూండాయిజానికి వ్యతిరేకంగా పీడిత వర్గాలకు చెందిన విద్యార్ధుల్ని కూడతీసి వారి దురాగతాల్ని, విద్యార్థినులపై అకృత్యాల్ని, కుల దాష్టీకాల్ని తిప్పిగొట్టాడు. ఆ రకంగా అతను సాంఘీకంగా అణచివేతకి గురయ్యే పేద విద్యార్ధులకి బాసటగా నిలిచాడు. జార్జి శారీరికంగా కూడా మంచి పోరాట యోధుడు. బాక్సింగ్ లో చాంపియన్ గా కూడా నిలిచాడు. అది అతని లక్ష్య శుద్ధి తెలియచేస్తుంది. ఆ బలంతోనే ధైర్యంగా గూండాయిజాన్ని ఎదుర్కొన్నాడు. తనకి ప్రతిష్టాత్మక సంస్థల్లో శాస్త్రవేత్తగా ఉద్యోగాలొచ్చినా వెళ్లలేదు. ఎందుకంటే ఒక మూసలో నిలిచే తత్వం అతనిలో లేదు. అతను ప్రజా శాస్త్రవేత్త కావాలనుకున్నాడేమో. కానీ రైట్ వింగ్ విద్యార్ధి వర్గం వారు ఎలక్షన్ టైంలో ఏప్రిల్ 14, 1972న బైట నుండి తెచ్చిన గూండాలతో జార్జిని దారుణంగా కత్తులతో పొడిచి పొడిచి చంపారు.

జార్జి హంతకులు, జార్జి భావజాల శతృవులు జార్జిని చంపారేమో కానీ అతని ఆశయాల్ని చంపలేక పోయారు. అతను స్థాపించిన పీడీఎస్ తదనంతర కాలంలో PDSU, RSU రూపాతరం చెంది అనేక వందల మంది సామాజిక విప్లవకారుల్ని అందించింది. జార్జి, చేగువేరా, అల్లూరి వంటి వారు తమ కాలానికి మాత్రమే చెందిన వారు కాదు. మరణించిన తరువాత కూడా బతికే అలాంటి విప్లవకారులు చేసిన కృషి, వాళ్ల జ్ఞాపకాలు కాలంతో పాటు ప్రయాణించి ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయ విలువల్ని ప్రతిపాదిస్తూనే వుంటాయి. జార్జి గురించి తెలియని వారికి జార్జి వ్యక్తిత్వాన్ని గొప్పగా పరిచయం చేసిన ఈ పుస్తకం ఎంతో విలువైనది. ఆ నాటి వాతావరణంలోకి మనల్ని ఎంతో తేలికగా తీసుకెళ్ల గలిగే ఆసక్తికరమైన రచనా శైలితో, పరిశీలనలతో, విశ్లేషణలతో, జార్జి సన్నిహితులతో చేసిన సంభాషణలతో గుక్క తిప్పుకోకుండా పుస్తకాన్ని చదివే విధంగా రాసిన కాత్యాయనిగారికి అభినందనలు.

(“జీనా హైతో మర్నా సీఖో” జార్జి రెడ్డి జీవన రేఖలు. రచయిత కాత్యాయని. ప్రచురణ హైదరాబాద్ బుక్ ట్రస్ట్, వెల 100 రూపాయిలు.)

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

4 thoughts on “మరణాన్ని జయించిన వాడు

  1. అరణ్య కృష్ణ గారూ ,పుస్తకం లక్ష్యాన్ని ఇంత నిశితంగా పరిశీలించినందుకు థాంక్యూ .

    1. కాత్యాయని గారు మీ పుస్తకం చదివాను.చాలా బావుంది.జార్జ్ రెడ్డి గారి గురించి ఇంగ్లీష్ లో వచ్చిన పుస్తకం లో అతడి స్నేహితులు అతడి గురించి చెప్పిన అనుభవాలు ఉన్నాయని విన్న .కానీ మీ పుస్తకం లో అవి లేవు.అవి కూడా జత చేసి ఉంటే ఇంకా బావుండేది అని నా అభిప్రాయం

  2. They may kill me,
    but they cannot kill my ideas.
    They can crush my body,
    but they will not be able to crush my
    Spirit.
    🙏

Leave a Reply