తెలంగాణా భాషోద్యమ యోధ పాకాల యశోదారెడ్డి

తెలంగాణా తొలితరం రచయిత్రి అయిన యశోదారెడ్డి పాలమూరు మట్టి బిడ్డ. 8 ఆగస్టు 1929లో పాలమూరు జిల్లా బిజినేపల్లి గ్రామంలో జన్మించిన ఆమె తల్లిదండ్రులు కత్తి కాశిరెడ్డి-సరస్వతమ్మలు. తాను పుట్టిన కొద్ది రోజులకే తల్లిని కోల్పోయి తండ్రి విరక్తీ తిరస్కారాలతో బంధువు రుక్మిణమ్మ పెంపకంలో బాల్యం గడిపింది యశోదమ్మ. పల్లెలో ఆమెను అందరూ ఎచ్చమ్మా అని పిలిచేవాళ్ళు.

మనిషి జీవితంలోని ఖాళీలనూ, లోపాలనూ, విషాదాలనూ పూడ్చడానికి కాలం కొన్ని అవకాశాలు ఇస్తుంది. తల్లిదండ్రులు లేకుండా పెరిగి, ఆడపిల్లలకు చదువులు నిషేదం అయిన వ్యవస్థలో ఫ్యూడల్ కుటుంబాల స్త్రీలు ఘోషా పద్ధతిలో బతకాల్సిన రోజుల్లో ఎచ్చమ్మ చదువుపట్ల ఆసక్తిని చూసిన రాజా బహదూర్ వెంకట్రామ రెడ్డి గ్రహించి ఆమెను హైదరాబాద్ నారాయణాగూడాలోని బాలికల పాఠశాలలో చేర్పించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ గా ఉన్న ఆయన పల్లెల నుండి నగరానికి చదువుకునేందుకు వచ్చే బాలికల కోసం వసతి గృహాన్ని ఏర్పాటు చేసారు. ఆ రోజులలో తెలుగు మాధ్యమంలో ఉన్న ఒకే ఒక్క పాఠశాల అయిన మాడపాటి హనుమంతరావు పాఠశాలలో చదివి విజయవాడలో ఆంధ్రా మెట్రిక్ పరీక్షను ప్రత్యేక అనుమతితో రాసిన నలుగురు యువతుల్లో యశోదారెడ్డి ఒకరు.

ఆమె మెట్రిక్ తరవాత గుంటూరు ఏ.సి. కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం, హైద్రాబాద్ ఉమెన్స్ కాలేజీలో రెండో సంవత్సరం చదివారు. 1947లో ఆమెను ఆమెకు విశ్వవిఖ్యాత చిత్రకారుడు కరీంనగర్ జిల్లా మానకొండూరు సమీపంలోని అన్నారం గ్రామానికి చెందిన పాకాల తిరుమలరెడ్డి (పి.టి.రెడ్డి) తో వివాహం జరిగింది.

1948లో ఆమెకు పుత్రుడు జన్మించాడు. విధి వక్రత వల్ల ఆ బాలుడు 6 నెలలకే మరణించాడు. ఇది యశోదారెడ్డి జీవితంలో రెండో అతి పెద్ద విషాదం. పి.టి. రెడ్డిగారి ప్రోత్సాహంతో ప్రయివేట్ గా డిగ్రీ చదివి అనంతరం 1957లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. తెలుగులో పట్టా తీసుకున్నారు. ‘తెలుగులో హరివంశములు’ అంశంపై డాక్టరేటు చేసారు. ఇది కాకుండా డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు చదివిన యశోదమ్మ కోఠి మహిళా కళాశాలలో ఉపన్యాసకురాలిగా చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు భాషా విభాగం ఆచార్య పదవిలో ఉండి ఉద్యోగ విరమణ చేసారు. తరువాత 1990-93 కాలంలో తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షురాలిగా సేవలందించారు.

తన తలమీద తల్లిదండ్రుల నీడ లేకుండా స్వయంకృషితో ఉన్నత చదువులు చదివి మేధో సంపదను సొంతం చేసుకున్న సాహసి, జ్ఞాన పిపాసి యశోదారెడ్డి. స్త్రీలకు విద్య అవసరం అనీ, అది బాధితులూ వంచితులూ అయిన స్త్రీల సమస్యలను పరిష్కరిస్తుందని భావించేవారు.

1930 నుండి 2007 వరకూ మూడు తరాల సమాజాన్నీ, మార్పులనూ చూసిన ముత్తవ్వ యశోదమ్మ. పల్లెలో పుట్టి పెరిగిన ప్రభావంతో ఆమె తెలంగాణ భాషా వేషాలను ప్రేమించారు అనుసరించారు. తెలంగాణ భాషకు రానున్న పెను ప్రమాదాన్ని గ్రహించి 60-70 ఏళ్ళ నాడే ఆమె ఎచ్చమ్మగా తనను తాను ఆవిష్కరించుకున్నారు. ఆమె ఒన్ మ్యాన్ ఆర్మీలా భాషా పరిరక్షణకు సాహిత్య రంగంలోకి అడుగుపెట్టి, తన ఆయుధమైన కలం నిండా కమ్మని తెలుగు జాతీయాలు, పదబంధాలు, నుడికారాలు, సామెతలు, పలుకుబడులు నింపి కథారచన చేసారు.

“అసలైన తెలుగు భాషా రుచిని ఆస్వాదించాలంటే తెలంగాణపు తెలుగును చదవండి, వినండి, గ్రహించండి. ఆ భాషపై సరైన ఆవగాహన, పట్టులేనివారి మాట విని అది శిష్ట వ్యవహారయోగ్యం కాని అనాగరికుల భాషంటూ అవమానించడం, అవహేళన చేయడం గొప్పకాదు తప్పు” అంటారు ఆమె.

ఒకవైపు ఆంగ్ల భాషా ప్రభావం, రెండోది నిజాం పరిపాలనా భాషైన ఉర్దూ ప్రభావం, మూడోది విశాలాంధ్ర వలసభాష వరద తాకిడి వల్ల ముప్పేట ముంపులో తెలంగాణా భాష కొట్టుకుపోయే విపత్తును పసిగట్టి తన సహజత్వాన్ని కోల్పోయి నిర్జీవతవల్ల కొన ఊపిరితో ఉన్న పలుకుబడిని జీవద్భాషగా నిలబెట్టి భావితరాలకు అందించేందుకు ఆమె అక్షర యవుసం చేసారు.

1950-60ల్లో దక్కన్ రేడియో ద్వారా తన ఊరి ముచ్చట్లను కతల దండలుకట్టి ‘మహాలక్ష్మి ముచ్చట్లు’గా వడగళ్ళ వానలా కురిపించారు.

కథారచనలో ప్రఖ్యాతిగాంచిన యశోదమ్మ కవితలు కూడా రాసారు. విమర్శారంగంలో ఆమె లోతైన పరిశీలనా గ్రంధరచనలు చేసారు.

1951లో ‘విచ్చిన తామరలు’ అనే కథ ‘సుజాత’ పత్రికలో ముద్రించబడింది. సరళ గ్రాంధిక భాషలో రాసిన ఈ కథ ఆమె తొలి కథ. 1973లో 10 కథలతో ‘మా ఊరి ముచ్చట్లు’ కథా సంపుటిని, 1999లో ‘ధర్మశాల’ కధా సంపుటిని, 2000లో ‘ఎచ్చమ్మ కథలు’ సంపుటినీ సుధర్మ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించారు.

1973లో ‘పారిజాతాపహరణం పర్యావలోకనము’, నేమాని భైరవ కవి-హరివంశము ఉత్తర భాగం, 1990లో ‘భారతంలో స్త్రీ’, 1972లో ‘ఎర్రాప్రెగడ’, 1965లో ‘కావ్యానుశాలనము’, 1974లో ‘ఆంధ్ర సాహిత్య వికాసము’, 1976లో ‘ప్రబంధ వాజ్మయము’, 1980లో ‘శతక వాజ్మయము’, 1989లో ‘కథాచరిత్ర’, 1973లో ‘తెలుగులో హరివంశములు’ అనే విమర్శా గ్రంథ రచన ప్రచురణ చేసారు.

1976లో ‘ఉగాదికి ఉయ్యాల’, ‘భావిక’ కవితాసంపుటాలు ప్రచురించారు. ఇది కాకుండా రేడియో నాటికలు, గల్పికలూ, అనువాదాలు, బాల సాహిత్య రచనలూ చేసారు.

ఆమె వ్యక్తిత్వంలో ధర్మాగ్రహం ఉగ్ర స్వభావిగా ఆమెను నిలబెట్టింది. నిత్యం సామాజిక అవినీతీ అస్తవ్యస్తతలపై వ్యక్తుల అపసవ్యతలపై అసహనంతో ఉండే ఆమె ఆర్భాటాలూ ఆడంబరాలూ లేని ఎనిమిది దశాబ్దాల జీవన పయనంలో సాహిత్య కళాసేద్యం చేసారు. పాండిత్యం, వక్తృత్వం కలబోసిన వాక్ ధార ఆమె ప్రత్యేకత.

వొడువని ముచ్చట్ల పందిరి కింద పలుకుబడుల బడిజెప్పిన ఈ పంతులమ్మ తొలితరం రచయిత్రిగా తొవ్వ చూపిన దారి దీపం. యాంత్రికతకు విరుగుడుగా తన రచనల్లో జీవ పరిమళాలు పండిస్తూ తెలంగాణా జాతి పౌరుషానికి ఆత్మగౌరపు కిరీటం తొడిగిన పట్టుదల ఆమెది. పండితగణాల భాషా ఉచ్చరణలకూ, లిఖించే భేషజాలకూ భయపడుతూ, ముడుచుకుపోతూ భావ దారిద్ర్యంలో దిగబడిపోయిన తెలుగు జాతి వెన్ను చరిచి ఉన్నత స్థాయిలోకి సగర్వంగా చేర్చిన తెగువ ఈ తెలంగాణా కోయిలమ్మది. అపారమైన సాహిత్య భాషా సంపదను మనకు వారసత్వంగా ఇచ్చి అక్టోబర్ 2007లో కీర్తిశేషురాలైన ఈ విశిష్ట కళామతల్లి స్మృతికి నీరాజనాలు!

పుట్టింది వ‌రంగ‌ల్ జిల్లా హ‌న్మ‌కొండ‌. క‌వి, ర‌చ‌యిత‌. విద్యాభ్యాసం వ‌రంగ‌ల్‌లో. బాల్యం నుంచే సాహిత్య‌- ఉద్య‌మాల ఆస‌క్తితో నాటి 'జై తెలంగాణ' ఉద్య‌మం మొద‌లు, మొన్న‌టి ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం వ‌ర‌కు వివిధ సాహిత్య, ప్ర‌జా సంఘాలు, ప్ర‌జాస్వామిక‌ ఉద్య‌మాల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. 12 స్వీయ ర‌చ‌న‌ల గ్రంథాలు, 18 కు పైగా వివిధ సంక‌ల‌నాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు. 'రుద్రమ ప్రచురణలు' 2012 నుండి నిర్వహిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా 'ప్ర‌జాస్వామిక ర‌చ‌యిత్రుల వేదిక' లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply