రసార్ద్రత రుచి మరిగిన మేక పిల్ల

గోపాల్ రాసినవి చదివితే ఇంకా బతకాలనిపిస్తుంది. ఏం? బతకడానికీ; ఇంకా బతకడానికీ తేడా ఏముంటుందనా? బోళ్డంత ఉంది. తెలివిగా బతికి బతికీ మనిషికెప్పటికన్నా తన జీవితమ్మీద తనకే చెప్పలేనంత విసుగూ, కోపమూ రాకపోతుందా? అప్పుడన్నా గోపాల్ రాసిన వాక్యాలు చదివి వెర్రి ఆనందంలోకి పీకల్లోతుగా మునిగిపోడా అనిపిస్తుంది. లేకపోతే వేగవంతమైపోయిన పరుగు పందెం లాంటి జీవితాన్నెలా ముందుకు నడవాలి? టైం కి లేచి, తిని, పడుకుని ‘పద్ధతిగా’ బతికి బతికి మా చెడ్డ ఇబ్బందిగా ఉంటుంది. పారమార్ధికతే దివ్యౌషధం కాదు కదా కొంత కొదవలో మునిగి తేలాలి. అది ఖాళీ గుండెల్ని నింపి పోవాలి. బువ్వ చేతి కొంగు, నాన్న గొడ్డలి, గుంత గిన్నె, ఎర్ర మన్ను తట్ట, ఈత చాప, గంజి — ఇలా ఉంటాయి గోపాల్ కవితా శీర్షికలు. వీటి వెనుక ఏముంటుందో ప్రత్యేకంగా చెప్పే పనిలేదు. కన్నీళ్ళతో శుభ్రపరుచుకుంటున్న చూపుంటుంది. మొద్దుబారిపోయినా సరే జీవితంలోని సున్నితత్వాన్ని తాకి తన్మయమయ్యే చేతులుంటాయి. అతిశయం కాదు. గోపాల్ కవిత్వ సారాంశమంతా తనలో తాను తిరుగుతూ సహజమైన అతి సామాన్య జీవితం చుట్టూ గిరికీలు కొడుతుంది.

ఈ కవితలన్నీ ఉద్వేగ భరితంగా ఉంటాయి. ఉద్వేగానికి మించిన కవిత్వ ప్రకటన లేదు కనుక ప్రతీ వాక్యంలోనూ మనల్ని మనం తడుముకుంటాం. ఎప్పుడో మర్చిపోయిన పల్లె దారిని, ఇంటి ఛాయని, గల్ల గురిగెల్ని, అరికాల్లో గుచ్చుకున్న ముళ్ళనీ ఈ పుస్తకం గుర్తు చేస్తుంది. కవిత్వానికిటువంటి వస్తువులు కొత్త కాదు. మెలిపెట్టి నొప్పించడమెలాగో పూర్వానుభవమే. శివారెడ్డి గారు వాడే పచ్చి పల్లెటూరి భాష, ఆశారాజు గారు తట్టే గుండె తలుపు తెలుగు కవిత్వానికి చిర పరచితమైనవే. అయినా మళ్ళీ మళ్ళీ మనకివి ఎందుకు నచ్చుతాయంటే, వాటిల్లో కాలానికంటుకుపోయిన వాస్తవిక జీవనానుభూతి ఉంది. అమ్మనాన్నల గురించి ఎన్ని కవితలు చదివి ఉంటాం? అయినా ఆమెను ‘నూనె కారి పోతున్న చట్నీ డబ్బాతో మా హాస్టల్ ముందు నిలబడ్డ దేవ గన్నేరు’ (బువ్వ చేతి కొంగు) అని చదువుతోంటే ఎక్కడో గుండె పట్లు కదిలిపోతాయ్. ‘నిజమైన నమ్మకాలు కనుకనే సత్ఫలితాలనిస్తున్నాయి అనుకోకుండా; సత్ఫలితాలనిచ్చిన నమ్మకాలు కనుక నిజమైనవి’ (విలియం జేమ్స్ – తత్వవేత్తలు – గోపీచంద్) అనుకునేట్టు గోపాల్ పునర్నిర్వచించుకోవల్సిన వాటినంత తేలిగ్గా మర్చిపోనివ్వడు. లేకపోతే ‘ఎమోషనల్’ గా ఉండటమే అర్హతనుకునే జీవన ప్రమాణాల మధ్య మనం బ్రతకడం లేదని తెలిసీ కవి ఇంత ధైర్యం చేస్తాడంటే అది ఏమీ తెలియకుండా చేసిన పని కాదు. సద్చైతన్యమే. మానవ సంబంధాల్ని ఉన్నతీకరించిన దృఢ వ్యక్తిత్వముందీ కవిత్వంలో. ‘మొప్పలు తెగిన చేప లాగ బతుకుతున్న ఆ జాలరి పగిలిన గుండెను ఏ వాక్యాల్లో చెప్పాలి’ (కనికరం లేని సముద్రమా) అనడుగుతాడే కానీ ఈతడే ఇజాల ప్రలోభాలకీ తలొగ్గలేదు. మానవుడే నా సంగీతం, మనుష్యుడే నా సందేశం అని మహాకవి అన్నట్టు, గోపాల్ కూడా తన కవిత్వాన్ని మనిషనే గుంజక్కట్టేసుకున్నాడు. కనుక ఆ నిలువెడు గుంజ పాతిన పునాదులు కవికెంత మాత్రం తెలిసి ఉంటాయన్న అనుమానం అక్కరలేదు.

దండకడియంలో నోస్టాల్జియా ఉంది. వగపోత. గొల్లపెద్దయ్యని (దండకడియం),చెల్లెలు విజయలక్ష్మిని (దుక్ఖమాగుతలేదు); వాన వెలసిన తరువాత తడిసిన తంగేడు మొక్క (నాన్న గుర్తొచ్చినప్పుడల్లా); నాయనమ్మ లేని చోటు గురించి; జొన్నరొట్టె కమ్మదనం గురించి; గోపాల్ తన స్మృతిపధంలోంచి నడచి వొచ్చిన వాళ్ళందర్నీ కవిత్వం చేశాడు. మార్క్స్ ఎంగెల్స్ జర్మన్ ఐడియాలజీ గురించి “భౌతిక అన్యోన్య సంసర్గమే జీవిత వాస్తవ భాష. చైతన్యం చైతన్యవంతమైన అస్తిత్వం కంటే భిన్నమైనది కాదు. మనుషుల అస్తిత్వం వాళ్ళ వాస్తవజీవిత గతి క్రమమే” అని టీఎమ్మెస్ (సాహిత్య సర్వస్వం-3) రాయడాన్నిక్కడ గుర్తుచేసుకోవాలి. గోపాల్ కవిత్వ వగపోతలోని చైతన్యం, జీవనాస్థిత్వంలోనిది. ఇందులో కల్పన కన్నా ఒక గతిలో ఉన్న పరస్పరానుబంధం ‘ముల్లు పాఠంలా’ ఉంటుంది.

అందుకే ‘గోపాల్ నీ భావజాలమేమిటీ’ అన్న పిచ్చి ప్రశ్న వేసినందుకు నాలోనేను చాలాసార్లు నవ్వుకున్నాను. అతని కవిత్వమేమీ తాళ్ళు తెంపుకున్న భావవాద స్వేచ్చాజీవి కాదు. పిల్లలముందు మనమెప్పుడూ పిల్లలమే (పిల్లల ముందు) అంటాడు గానీ చాలా మంది పెద్దవాళ్ళ గందరగోళం కన్నా పసితనంలో ఉన్న జీవన సౌందర్యమెంత అద్వితీయమైనదో చెబుతాడు. లేకపోతే ‘బేటీ ఎక్కడున్నా సరే రెండు ముద్దలు తినిపోదువు రా’ (అడవిలో పొద్దూకినట్లు) అని ఆసిఫా గురించి రాసినా; ‘రోజుకు ఒక్కసారైనా మాటల్ని కలుపుకుని తిందాం. రేపు మీ పక్కన కూర్చుని, ఇలా భోంచెయ్యకపోవచ్చు, ఇలా నవ్వక పోవచ్చు, అలగక పోవచ్చు; కానీ ఇలానే ఇలానే ఏడిపిస్తానేమో’ (నాలుగు గిన్నెల కూడలి) అనడంలో ఒక హెచ్చరిస్తున్న పసివాడున్నాడు.

గోపాల్ వస్తువులు బాగుంటాయా? శిల్పం బాగుంటుందా? ఎలా తెలుస్తుంది. రెండింటినీ వేరువేరుగా చూడ్డం కష్టమైన పని. రసం పట్ల తూగు ఉన్నట్టు కనిపించినప్పటికీ గోపాల్ కవితల్లో కళాత్మకత పైచేయి సాధిస్తుంది. అన్నీ అర్ధస్పోరకమైన వాక్యాలే గానీ అలంకారికత ఉన్న వాచ్య భాష స్పష్టంగా తెలుస్తుంది. వక్రత అరుదు. వ్యంగ్యమూ ఎక్కువ వాడడు. సూటిదనమే సౌందర్యము. నడచిన దారిలానే తోస్తుంది కనుక కొత్తదనం తక్కువ. ఊహత్మక ప్రతీకలకన్నా వాస్తవికతావాద సృజన ఉంటుంది. మేక పెంట పొగనే ఇంట్లో అగరు దూపం, కాలాన్ని రబ్బరులా సాగదీయడం, మడికట్లలో మొలిసిన వరికర్ర, కంట నీరు తీసుకునే ఆరివారం, లాంటి ప్రయోగాలన్నీ ఫక్తు గ్రామీణ నేపధ్యంలోంచి వొచ్చి చాలా బాగుంటాయి. శివారెడ్డి గారన్నట్టు అతనిలో నేటివ్ ఎక్స్ప్రెషన్, వస్తువులో dissolve అయ్యేట్టు చేస్తుంది. తన చుట్టూ ఉన్న మనుషుల సాంఘిక, సాంస్కృతిక జీవన స్తితిగతులు గోపాల్ కవితా వస్తువులయినా కూడా ప్రాంతీయత ఆధిక్యాన్ని చూపెట్టదు. పదాలు తెలంగాణ భాషా వాద దృక్పధాన్ని సమతుల్యంగా సూచిస్తాయి. నారాయణస్వామి గారన్నట్టు ‘సజీవ సబాల్టర్న్’ అస్తిత్వాల చైతన్యం ఉంటుంది. ఆ ఎరుకతోనే కవిత్వ శిల్పాన్ని ఆకట్టుకునేట్టు ప్రయోగించడం గోపాల్ లోని సహజ లక్షణం. పుస్తకం విడువకుండా ఏక బిగిన చాలా కవితలు చదివినప్పుడు కొద్దిగా ఏకరీతిని (Monotony) అనుభవిస్తున్న అభిప్రాయం కలుగుతుంది. మళ్ళీ నేను స్పాంటేనియస్ అవుట్ ఫ్లో — లాంటి మాటల్ని ఉటంకించను గానీ, గోపాల్ కవిత్వం లోని అభివ్యక్తి కి సహజ మానవోద్వేగమే కారణమనుకోవాలి గానీ, ఉద్వేగీకరణ కోసం కవి ఉద్దేశ్య పూర్వక ప్రయత్నం చేసినట్టు నిర్ధారించుకోవడం తప్పు. అతను దాచిపెట్టి, మాగబెట్టి అద్భుత వాక్యాల్ని రాయాలనుకోడు. ధారాపాతంగా, అత్యంత సాధారణంగా, సులువుగా రాసిన వాక్యాలే కళాత్మక రూపాన్ని తీసుకుంటాయి. గోపాల్ని చదివితే ఇలియట్ లాంటివాళ్ళ ఇంపెర్సొనల్ సిద్దాంతాలు ఏమేరకు నిజమవుతాయో తెలియని ఆలోచనలో పడటం అతిశయోక్తి కాదు.

నేటి కాలపు కవిత్వానుభూతిని పరిశీలిస్తే రసాభివ్యక్తిలో గానీ, శిల్ప నిర్వహణలో గాని ఒక్కో కవిదీ ఒక్కో కొత్త పుంత. రాజకీయాలు, సామాజిక స్థితిగతుల్తో ఘర్షణ, మారుతున్న జీవన తాత్వికతలు, ఇలా రక రకాల విన్యాసాలు నేటి కవిత్వం లో కనిపిస్తాయి. Do not worry about the incarnation of ideas అంటాడు రష్యన్ సాహిత్యకారుడు. ఆ విధంగా, కొత్త తరం కవిత్వంలో వెతుక్కుంటే భావ వైరుధ్యాల కన్నా, వాటి అవగాహనలో ఉన్న నిర్దిష్టత పరిశీలనార్హమైనది. అది ప్రయోగాత్మక స్వభావి. అదే కవిత్వ చైతన్యాన్నీ నిర్దేశిస్తున్నది కనుక తప్పక మంచికే దారి తీస్తుంది కూడా. తగుళ్ళ గోపాల్ కీ తన వంతు అవకాశం చాలా ఎదురుచూస్తూ ఉంది.

(ప్రతులకు నవ తెలంగాణ, నవ చేతన, నవోదయ, బోధి, అనేకల్ను సంప్రదించవచ్చు. ధర 150/-. కవి మొబైల్ నంబరు 9505056316)

పుట్టింది తెనాలిలో, పెరిగింది విజయవాడలో. వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో బ్యాంకుజ్జోగం చేసుకుంటున్నారు. కవిత్వమూ, కవిత్వ విశ్లేషణ, సమీక్షా వ్యాసాలు రాస్తున్నారు. కవిసంగమం లో 'కవితా ఓ కవితా' శీర్షిక నిర్వహిస్తున్నారు. 'అద్వంద్వం' తనకి గుర్తింపు తెచ్చిపెట్టిన తొలి కవితా సంపుటి. +91 9963482597 మొబైల్ నంబర్లో అతన్ని పలకరించవచ్చు.

2 thoughts on “రసార్ద్రత రుచి మరిగిన మేక పిల్ల

  1. వగపోత, ఆర్థత, కష్టాలు, కన్నీళ్లు!…కవిత్వం చదువుతూ ఉంటే , చిరంజీవులు, రక్తసంబంధం లాంటి కన్నీళ్లు పెట్టించే పాత సినిమాలు గుర్తొస్తాయి.పల్లె సౌందర్యం, కోలాహలం లాంటి విషయాలకన్నా.. విషాదాల వర్ణన చాలా ఆర్థత తో పండిస్తాడు. మీదైన సమీక్ష. ఇరువురికీ అభినందనలు💐💐💐💐

  2. తన జీవన నేపధ్యంలోని తడిని అత్యంతసహజంగా కవిత్వంలోకి ఒంపి బీడుబారిన పాఠక హృదయల దాహం తీర్చగల తత్వం గోపాల్ సొంతం..మీదైన లోచూపు ‌సమీక్షకు మరింత వన్నె తెచ్చింది.అభినందనలు

Leave a Reply