తెలుగు కథపై ఛాయాదేవి వెలుగు జాడలు

ఎనభై ఆరేళ్ళ క్రితం రాజమండ్రిలో 13 అక్టోబర్ 1933న సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు మద్దాలి ఛాయాదేవి. పితృస్వామ్య బ్రాహ్మనిజం ఆధిపత్యపు నీడకింద పెరిగినా ఆమె సమాజం పట్ల తన ఆసక్తులనూ, జీవితం పట్ల స్పష్టతనూ, వ్యక్తిగా వికాసం పట్ల నిబద్ధతనూ కోల్పోకుండా ఉన్నారు.

అబ్బూరి వారింటి కోడలుగా అడుగుపెట్టిన ఆమె జీవన ప్రయాణం అన్ని రకాల నిస్తేజాలనూ నిర్లిప్తతలనూ జయించుకుంటూ బహుముఖీన ప్రజ్ఞాశాలిగా ఆమెను నిలబెట్టింది. భారతదేశపు రాజకీయ స్వాతంత్ర్యపు పూర్వ సమాజం నుండీ నేటి ప్రపంచీకరణ పతన విలువల సమాజం వరకూ ఆమె ప్రపంచ పరిణామాలకు సాక్షిగా ఉన్నారు. చిక్కనైన ఆమె స్త్రీత్వపు వ్యక్తిత్వ ఛాయను తెలుగు కథపై ప్రభావాత్మకంగా ప్రయోజనాత్మకంగా ముద్రించారు.

వయసు మీద పడుతున్నా ఎక్కడా నీరసం అంటకుండా చలాకీగా జీవనోత్సాహంతో కనిపించిన ఛాయాదేవి తన కథల ఛాయల్ని స్త్రీల బతుకు నేపథ్యంలో అన్ని రంగులలో చిత్రించి తెలుగు సాహిత్యంలో తన మార్గాన్ని ప్రతిష్టించిపోయారు.

పితృస్వామ్యంలో ఆడపిల్లకు మొదట తండ్రి పెత్తనం పట్లా, తండ్రి పట్లా భయం ఏర్పడుతుంది. ఘనత వహించిన మన ‘కుటుంబం’ ఆ వాతావరణం ఏర్పర్చి దానికి తిరుగులేని అధికారం ధారాదత్తం చేస్తుంది. ఆడపిల్లలకు తండ్రి ప్రేమా ఆప్యాయతలు తెలియవు. భయభ్రాంతులు తప్ప. అది ఆ పసి హృదయాలను బాధిస్తుందన్న విషయాన్ని ఈ ఆధిపత్యాల బంధాలు పట్టించుకోవు.

తండ్రి నిరంకుశ మనస్తత్వాన్ని ప్రశ్నిస్తూ ఆమె రాసిన తొలి కథ ‘అనుభూతి’ నిజాం కళాశాల పత్రికలో ముద్రించబడింది. తల్లి కొంగుచాటున చేరి తండ్రి పెత్తనాన్ని భయం భయంగా చూసిన ఆడపిల్ల ఆ తండ్రి నియంతృత్వాన్ని ప్రశ్నించే అంశంతో ఆమె రాసిన మొదటి నాటకం ‘పెంపకం’.

ఆంగ్ల నాటకమైన ‘బేరేట్స్ ఆఫ్ విమ్ఫోల్ స్ట్రీట్’కు అనుసరణ ఆ రచన. బాల్యం, కౌమార్యంలో ఆమెను ఆక్రమించిన భావజాలం పితృస్వామ్యం. వివాహం అనంతరపు ప్రపంచంలో కూడా పితృస్వామ్యపు అనేక రూపాల అమలూ అణిచివేతనూ ఆమె నిశితంగా గ్రహించారు. గ్రంథాలయ శాస్త్రం చదివి గ్రంథాలయంలో పనిచేసిన ఆమె ఆంగ్ల సాహిత్యాన్ని బాగా చదివారు. తాత్వికుడైన జిడ్డు కృష్ణమూర్తి ప్రభావాలను ఇష్టపడ్డారు. ఆ ఇష్టంతో ‘జి.కె. జీవిత చరిత్ర, బోధనలూ’, ‘మన సమస్యలు – జిడ్డు కృష్ణమూర్తి సమాధానాలు’ గ్రంథాలను సరళ భాషలో పాఠకులకు అందించారు. జి.కె. పుస్తకాలను తెలుగులోకి అనువదించారు.

జి.కె. బోధనలకూ స్త్రీవాదానికీ సామీప్యత ఉన్నదని చెప్తూ ఇద్దరి ఆలోచనా గమ్యం ఒక్కటే ‘స్వేచ్ఛ ఉండాలి’ అని చెప్పిన ఛాయాదేవి ‘స్త్రీల జీవితం – జిడ్డు కృష్ణమూర్తి’ అన్న పుస్తకం రాసారు.

‘రాజమండ్రి నుండి రాజమండ్రి దాకా’ అంటూ ఆమె జీవిత మజిలీలను ఛాయాచిత్ర కథనంగా సంకలనం చేసారు. ఆమె నవలా రచన, యాత్రా రచన, సమీక్షలు, వ్యాసాలు, అనువాదాలు, విమర్శలూ చేసారు. పత్రికా సంపాదకురాలిగా, కాలమిస్టుగా, చిత్రకారిణిగా, బొమ్మల సృష్టికర్తగా తనను తాను సృజనశీలిగా ఆవిష్కరించుకున్నారు. ఆరు దశాబ్దాల సాహితీయానంలో ‘అబ్బూరి ఛాయాదేవి కథలు’, ‘తన మార్గం’ కథా సంపుటాలను ప్రచురించారు. అనగనగా జానపద కథలు, జిడ్డు కృష్ణమూర్తి తాత్వికత అనే రచనలు చేసారు.

పితృస్వామ్యంలో ఎన్నో కోణాలున్నా కుటుంబ పితృస్వామ్యం ప్రధానమైనది. కుల పితృస్వామ్యం, మత పితృస్వామ్యం, వర్గ పితృస్వామ్యం అన్నీ సామాజిక ప్రధాన స్రవంతిలో కలిసిపోయి ఉంటాయి.

ఏ ఇంట్లోనైనా ఏ వ్యవస్థలోనైనా నిరంతర శ్రమలో అవిసిపోయి అలిసిపోయే స్త్రీకి నిద్ర అనేది కరువు. ఇదొక దైన్య స్థితి. కంటినిండా నిద్రకోసం తపిస్తుంటారు స్త్రీలు. నిద్రచాలని, నిద్ర దొరకని స్త్రీలు ‘ఈ జన్మకి ఇంక ఒకటే నిద్ర’ అనీ, ‘ఏటి నిండాపోయి పడుకున్నప్పుడే నాకు నిద్ర’ అని తమలోని వేదనను వెళ్ళగక్కుతూ ఉంటారు. తన తల్లి స్థితిని చూసిన ఛాయాదేవి రాసిన ‘సుఖాంతం’ కథ స్త్రీల విషాద గతిని చిత్రించింది.

ఇంటి పెద్దగడప లోపల చీకటి గదుల్లో, ఇంటి వెనక పెరటి జాగాల్లో తమ కదలికల్ని బందీ చేయబడిన స్త్రీలకు ఇంటి చాకిరీ ఊపిరాడనివ్వదు. కిటికీలోంచైనా బయిటికి తొంగిచూసే తీరిక దొరకదు. మరణమొక్కటే వారికి విశ్రాంతినీ, నిద్రనూ ఇస్తుందని అనుకోవడంలో సమాజం స్త్రీ పురుషుల పట్ల వివక్షతలు, విభజనలు, పనుల కేటాయింపులూ, ఆచార వ్యవహారాల్లో చేసిన నియమ శాసనాల అసమానత్వాన్ని గుర్తించాలి.

ఆరుబయట తోటల్లో పెరగాల్సిన మొక్కల్ని కురుచగా చేసి ఇంట్లో పూలకుండీల్లో పెంచే కళను బోన్సాయ్ కళ అంటారు. ఎంతో ఎత్తు ఎదిగి విస్తరించడానికి అవకాశమున్న చెట్లను నిరంతరం కత్తిరిస్తూ ఎదగకుండా గిడ్సబారిస్తూ మురిసిపోవడం మన లక్షణం. స్త్రీలవి కూడా బోన్సాయ్ బ్రతుకులే. ఇద్దరు అక్కాచెల్లెళ్ల ఆలోచనల్లో, గ్రహింపుల్లో ఈ బొన్సాయ్ బతుకుల బండారం బయిట పడుతుంది ‘బోన్సాయ్ బతుకు’ కథలో.

కార్పోరేట్ హోటళ్ళ వలెనే కార్పోరేట్ హాస్పిటల్లను చూస్తున్నాము. ప్రపంచీకరణ విధానం ప్రభుత్వ సంక్షేమ సేవలను కార్పోరేటీకరణంలో ప్రైవేట్ సంస్థల పరం చేసి సమాజంలోని అంతరాలను అగాథంగా మారుస్తున్నది. జబ్బుల నిర్ధారణకూ, చికిత్సలకూ అందరూ నక్షత్రాల హాస్పిటల్లకే వెళ్ళాలనుకుంటారు. మెరుగైన వైద్య సేవలను అక్కడే పొందాలనుకుంటారు. అయిదు నక్షత్రాల హాస్పిటల్లలో ఆఖరికి మనకు మనిషిని శవంగా అప్పగించే తీరు కూడా ఖరీదుగానే ఉంటుంది. ఈ వ్యవహారాన్నంతా యదార్థంగా చిత్రించిన కథ ‘ఆఖరికి అయిదు నక్షత్రాలు’.

ఆమె ‘తన మార్గం’ సంపుటిలోని కథల్లో ఉపగ్రహం, మొగ్గు, శ్రీమతి -ఉద్యోగిని, ఆయన కీర్తి వెనక, ఉడ్ రోజ్, తన మార్గం, పరిధి దాటిన వేళలో స్త్రీ అస్తిత్వంలోని విభిన్న అంశాలను ప్రస్తావించారు.

రోజులు మారినవంటారు, మారుతూనే ఉంటాయంటారు. గతంలోకన్నా స్త్రీల జీవితాలు చాలా మారాయని అంటారు. స్త్రీలకు ఎన్నో హక్కులు వచ్చాయనో ఇచ్చామనో గొప్పగా చెప్తుంటారు. ‘మహిళల హక్కులు మానవ హక్కులే’ అని ప్రపంచం గుర్తించిందని ప్రకటిస్తున్నారు. కానీ ఏ తరమైనా తెలుసుకోవాల్సిన అంశాలు స్త్రీలు పితృస్వామ్య సంకెళ్ళలో అస్వేచ్ఛా జీవులుగా అసంపూర్ణ బతుకులు గుడుపుతున్నారనే.

ఈ సమాజం నాగరికంగా, సభ్యంగా, మానవ సంస్కారపరంగా ఇంకా ఎంతో ఎదగాల్సి ఉందని తెలుసుకోవాలి. స్త్రీవాదం మాట కూడా వినబడని, స్త్రీవాదం అంటే కూడా తెలియని రోజుల్లోనే ఛాయాదేవి స్త్రీల వెతలను స్త్రీల పక్షాన నిలబడి రాసారు. ఏ వాదమైనా సమాజానికి ఏర్పడిన అవసరం నుండి పుడ్తుంది. సమాజంలోని లోపాలను, వెలితులను పూడ్చడానికి ఉద్యమంగా వాదాలు అనేవి అనివార్యంగా వస్తాయి. అవి శాశ్వత ముద్రలు కాదు.

తనకు ఊహ తెలిసి రచనలు ప్రారంభించిన నాటినుండీ సామాజిక రచనలు చేస్తూ, సాహసోపేతమైన అంశాలతో తన కథల ద్వారా సవాల్ చేస్తూ నిర్బంధాలనూ, కుటుంబ చెరసాలల గోడలనూ కూల్చేందుకు అక్షర యుద్ధం చేసిన సాహితీయోధ ఛాయాదేవి . ఆమె జీవనమార్గం, పోరాట స్ఫూర్తీ నేటి వర్తమాన రచయితలకు పాఠ్యగ్రంథం.

తన కళ్ళనూ, శరీరాన్నీ వైద్యశాస్త్ర ప్రయోజనానికీ, ప్రయోగానికీ ఇచ్చేసి ఆమె 28 జూలై 2019న తన జీవిత మజిలీలకు స్వస్తి చెప్పి శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. తన జ్ఞాపకాలను సజీవంగా మనకిచ్చి సెలవ్ తీసుకున్నారు. ఆ మహామనిషికి నీరాజనాలు!

పుట్టింది వ‌రంగ‌ల్ జిల్లా హ‌న్మ‌కొండ‌. క‌వి, ర‌చ‌యిత‌. విద్యాభ్యాసం వ‌రంగ‌ల్‌లో. బాల్యం నుంచే సాహిత్య‌- ఉద్య‌మాల ఆస‌క్తితో నాటి 'జై తెలంగాణ' ఉద్య‌మం మొద‌లు, మొన్న‌టి ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం వ‌ర‌కు వివిధ సాహిత్య, ప్ర‌జా సంఘాలు, ప్ర‌జాస్వామిక‌ ఉద్య‌మాల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. 12 స్వీయ ర‌చ‌న‌ల గ్రంథాలు, 18 కు పైగా వివిధ సంక‌ల‌నాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు. 'రుద్రమ ప్రచురణలు' 2012 నుండి నిర్వహిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా 'ప్ర‌జాస్వామిక ర‌చ‌యిత్రుల వేదిక' లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

One thought on “తెలుగు కథపై ఛాయాదేవి వెలుగు జాడలు

Leave a Reply