ఆది జాంబవుడి అడుగులో పురుడు పోసుకున్నది చిందు. సృష్ట్యాదిలో వింతగా ఆది జాంబవుడు ఆడిన ఆట చిందు. చిత్తారి వానలను కురిపించిన చిందు. మల్లెల సువాసనలతో గుబాళించిన చిందు ఆది జాంబవుడి వీర మరణం తర్వాత ఆనాటి వీరుడి పోరాట గాథను తెలిపే ఆది జాంబవ మహాపురాణంగా అనంతర కాలంలో జైన, బౌద్ధాల విజృంభణతో దమ్మహితబోధ సూచిగా, హిందూ పురణాల ఔతిహ్యాల ప్రచార వాహికగా జనరంజకత్వంతో అలరించింది చిందు.
వేల ఏండ్ల చారిత్రక నేపథ్యం, సాంస్కృతిక ఔన్నత్యం కలిగిన కళ చిందు. సింధు లేదా చిందు తొలినాళ్లలో ఒక నృత్యం మాత్రమే. కాలక్రమంలోని అనేక రకాల ఆటుపోట్లను తట్టుకొని నిలబడగలిగే క్రమంలో చిందు కళ భిన్న రూపాలుగా వికసించింది. సిందాట, చిందాటగా, చిందు యక్షగానంగా, చిందు భాగవతంగా పరిణమించింది.
చిందు కళారూపం కమనీయ కళారూపంగా అజరామరంగా వెలుగొందడం వెనుక, జానపద కళారూపాలు, జానపద సాహిత్య వికాసం వెనుక అజ్ఞాతంగా తనువులు చాలించిన చిందు కళాకారులున్నారు. నూటికి పైగా బాగోతాలను చిందుకళాకారులు ప్రదర్శించేవారు. పెద్దగా అక్షర జ్ఞానం లేనివాళ్లు వేల పద్యాలను, వందల గేయాలను, సందర్భానుసారంగా పాటలను, సమయ స్ఫూర్తితో మాటలను అల్లుకుపోవడాన్ని చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చిందు బాగవతం ప్రదర్శన ద్వారా విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తూ పండిత పామరులకు సన్మార్గ నిర్ధేశనం చేస్తారు చిందు కళాకారులు. మౌఖిక సాహిత్యం ద్వారా నైతిక విలువ ప్రాధాన్యాన్ని వివరిస్తారు. నీతిని బోధిస్తారు. సమాజ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతారు. చిందు కళాకారులు ప్రదర్శించే బాగోతాలు తెలుగువారి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా భారతదేశ సంస్కృతిని పరిరక్షించే విధంగా ఉంటాయి. చిందు కళాకారులు ప్రదర్శించే జాంబ పురాణం లేదా గోసంగి వేషం, మాదిగ వేశంలో జాంబవ పాత్రధారి, బ్రాహ్మణ వేషధారి మధ్య జరిగే వాదోపవాదాలు గేయం పుట్టుకకు పునాదులు. ప్రదర్శన విధానం నాటక రంగానికి పూర్వ రంగం.
”ఓ… ఓయీ! జాంబవంతుడా నీతల్లివేరు నీ తండ్రి వేరు” అని బ్రాహ్మణ పాత్ర అడగగానే జాంబవుడు సమాధానమిస్తాడు.
– భూపాలమునాడు వేదమ స్వామి
భూమికారునెల్ల పెద్దాను
……..
”ముగ్గురుమూర్తులకు తాతాను స్వామి ముందొక్క జాంబవంతున్ని
శంఖు మా తల్లిదండ్రి జనులార వినుడీ”… అంటూ సాగే ఇటువంటి పదాలు, సంభాషణలే గేయ రూపానికి మాత్రుకలని ఆచార్య బిరుదురాజు రామరాజులాంటి వారు తీర్మానించారు. అట్లాగే చిందు కళాకారులు ప్రదర్శించే ఎల్లమ్మ వేషం జానపదుల నమ్మకాలకు ప్రతిఫలనం. ఈ సందర్భంలో ఎల్లమ్మ వేషధారిణితో ఊరంతా తిరుగుతూ, పొలి చల్లుతూ, కట్న కానుకలు స్వీకరిస్తూ, ఆశీర్వదించే సమయంలో పాడే పాటలు జానపద మూలాల మాటలు అమూల్య రత్నరాసులు.
”రామా రామా రామా రామా పరిశెరామ
వచ్చినాదె వరిగంటెల్లు రాజులతో వరమడగ
చిట్ట పురుగుల వట్టి ఎల్లమ్మ చిట్ట కోటలు గట్టి యెల్లు
నాగు పాములబట్టి ఎల్లమ్మ నడికట్లె సుట్టి
జేరుపోతుల బట్టి ఎల్లమ్మ జడలె కాయించు యెల్లు
పటపట పగిలేటి ఎల్లమ్మ పాలకాయలో యెల్లు….” అంటూ సాగే పాటలోనూ…
”ఎల్లు రావే ఎల్లమ్మ రావే అమ్మవారు దేవి
రాయిగొట్టి రతము నిలిపి పెద్ద పుల్ల బండ్లుగట్టి
గుండముల్ల తానమాడిస్తివా అమ్మవారు దేవీ”… అని గ్రామమంతా కలియదిరుగుతూ పాడే పాటలు మౌఖిక సాహిత్యం జానపద సాహిత్యానికి పుష్టిని చేకూర్చడమే కాదు… ఆధునిక కాలంలోని అనేకమంది జానపద గాయకులకు బాణీలను సమకూర్చిందనడంలో సందేహం లేదు.
ఇక చిందు కళాకారులు ఏ ఊరికి వెళ్లినా మొట్టమొదట ప్రదర్శించే పురాణేతిహాస సంబంధమైన ప్రదర్శన నాటక రంగానికి రంగస్థలాన్ని ఏర్పాటు చేసిందనడం అతిశయోక్తి కాదు. సినిమాలకు భిన్న చారిత్రక, సాంస్కృతిక పాత్రలకు ప్రాణం పోసింది చిందు కళాకారులే. చిందు కళాకారుల `పొనికె`కర్ర ఆభరణాలే యక్షగంధర్వాది దేవతా పాత్రలకు ఊపిరిలూదాయనేది సత్యం. అట్లాగే ఈ సందర్భంలో పాడే పాటలు, పద్యాలు, ఆలపించే రాగాలు దేశీయ కళారూపాలు, జానపద కళా సంపదకు ఆనవాళ్లు.
డాక్టర్ నందిని సిధారెడ్డి, చంద్రబోస్ లాంటివాళ్లు సైతం చిందు బాగవతాల నుంచే స్ఫూర్తి, ప్రేరణ పొందినట్టు వాళ్ల గీతాల రచనకు చిన్నప్పుడు చూసిన చిందు బాగోతం, విన్న చిందు కళాకారుల గొంతులే కారణమని చెప్పడాన్నిబట్టి చూస్తే చిందు కళారూపంలో జానపద మూలాలు ఎట్లా ప్రతిఫలిస్తాయో అర్థం చేసుకోవచ్చు.
మాకు వినోదాన్ని , విజ్ఞానాన్ని జానపద కలలే ప్రసాదించాయి