జూలై 4 చరిత్రాత్మక విస్ఫోటనం – 1

చరిత్ర పరిణామ క్రమం చిత్రమైనది. చరిత్ర పరిణామ క్రమాన్ని, ఆ చరిత్ర పరిణామానికి నిజమైన చోదకశక్తులను అది గతంగా మారిన తర్వాత వివరంగా గుర్తించి, సమీక్షించవలసిందే గాని అప్పటికప్పుడు కనబడే దృశ్యాలు, సన్నివేశాలు, పాత్రధారులు అసంపూర్ణంగానే అర్థమవుతాయి. ఎందుకంటే చరిత్ర ఎవరో ఒకరు కోరుకున్నట్టు, ఒక ప్రణాళిక రచించి అమలు చేసినట్టు జరిగేది కాదు. ఒకానొక వర్తమానంలో చరిత్ర నిర్మాణంలో పాల్గొంటున్నవారందరికీ చైతన్యపూర్వకంగా తెలిసి ఉద్దేశపూర్వకంగా చేసేది కూడ కాదు. అనేకానేక ప్రత్యక్ష పరోక్ష దీర్ఘకాలిక తక్షణ చారిత్రక సద్యో కారణాలు కలగలిసి చరిత్ర పరిణామాలు సంభవిస్తాయి. అవి సంభవించడానికి కొందరు వ్యక్తులనూ, కొన్ని స్థలాలనూ, కొన్ని సన్నివేశాలనూ ఎంచుకుంటాయి. ఆ కారణాలలో కొన్ని మాత్రమే తత్కాలానికి దృశ్యమానమవుతాయి. మరెన్నో అజ్ఞాతంగా ఉండిపోతాయి. కాలం గడిచిన కొద్దీ వాటిలో కొన్ని బైటపడవచ్చు. చరిత్ర చాల ముందుకు గడిచిపోయిన తర్వాత ఎవరో పరిశోధకులు తవ్వితీస్తే వాటిలో మరికొన్ని వెలికిరావచ్చు. మరి కొన్ని ఎప్పటికీ బైటపడకుండానే ఉండిపోవచ్చు.

అరుణాక్షర అద్భుతమైన విప్లవ రచయితల సంఘం ఆవిర్భవించిన 1970 జూలై 4కు దారితీసిన పరిణామాలేమిటి, ఎందుకు ఆ చారిత్రక ఘటన ఆ తేదీనే సంభవించింది, ఆ నాటి పాత్రధారులను నడిపించిన దృశ్యాదృశ్య శక్తులేమిటి అనే ప్రశ్నకు యాబై సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు వీలైనంత వివరంగానే జవాబులు చెప్పుకోవచ్చు.

విశాఖ విద్యార్థులు విసిరిన ‘రచయితలారా మీరెటువైపు?’ అనే సవాల్ తో తెలుగు రచయితల మధ్య విభజన స్పష్టమైంది. ఆ విభజనలో సాహిత్యపు సామాజిక ప్రయోజనాన్ని సమర్థించేవారు, సమాజసాహిత్య సంబంధాల అన్యోన్యతను సమర్థించేవారు, ప్రత్యేకంగా శ్రీకాకుళ విప్లవోద్యమాన్ని సమర్థించేవారు ఒకవైపు, సమాజ సాహిత్య సంబంధాలను గుర్తించని వారు, ఏదో ఒక రూపంలో యథాస్థితిని బలపరిచేవారు మరొకవైపు నిలిచారు. ఈ విభజనలో శ్రీకాకుళ విప్లవోద్యమాన్ని సమర్థించే శిబిరం, లేదా దానికి అనుబంధంగా ఉన్న శిబిరం బలంగా ఉన్నదని, 1960ల నాటి కోపోద్రిక్త యువతరం ఈ శిబిరంలో అంతకంతకూ ఎక్కువగా చేరుతున్నదని బైటపడిన తర్వాత ఆ బలాన్ని తగ్గించడానికి పాలకవర్గాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. నిజానికి విశాఖపట్నంలో శ్రీశ్రీ షష్టిపూర్తి సన్మానం జరగడానికి రెండురోజుల ముందు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన హోంమంత్రి జలగం వెంగళరావు నక్సలైట్ ఉద్యమం అంతమైపోయిందని ప్రకటించాడు. శ్రీశ్రీ సన్మాన సభలో విశాఖ విద్యార్థులు, శ్రీశ్రీ, దిగంబర కవులు, తిరుగబడు కవులు స్పష్టంగా బహిరంగంగా శ్రీకాకుళ విప్లవోద్యమానికి మద్దతు ప్రకటించడంతో, రాష్ట్రవ్యాప్తంగా వారికి స్నేహ హస్తాలు అందడంతో పాలకవర్గాలకు వెన్నులో చలిపుట్టింది. ఎట్లాగైనా ఈ సంఘీభావాన్ని దెబ్బతీయదలిచారు.

విశాఖ విద్యార్థుల సవాల్ ఒక రకంగా ప్రజల వైపు ఉండే రచయితలెవరు, పాలకుల వైపు ఉండే రచయితలెవరు అని గీత గీసింది. అలా రెండు పక్షాలలో ఏ ఒక్కదానికో చెందడానికి తాము సిద్ధంగా లేమనుకున్న వాళ్లు కూడ అంతిమ పరిశీలనలో తమకు తెలిసో తెలియకో ఏదో ఒక పక్షపు ప్రయోజనాలకు అనుకూలంగా ఆ శిబిరానికి దగ్గరగా ఉన్నారు. మొత్తం మీద చూస్తే తెలుగు సాహిత్య లోకంలో ప్రధానభాగం ప్రజల వైపు, ప్రజా పోరాటాల వైపు నిలబడడానికే మొగ్గు చూపుతున్నదని తేలింది. ఈ మొగ్గును మార్చడానికి, ప్రజల వైపు నుంచి, ప్రజా పోరాటాల వైపు నుంచి రచయితలను తప్పించడానికి పాలకవర్గాలు ఒక భారీ ప్రయత్నాన్ని ప్రారంభించాయి. మరొకవైపు ప్రజల వైపు, ప్రజా పోరాటాల వైపు ఉన్నామని ప్రకటించిన రచయితలు తమ వంటి అభిప్రాయాలే ఉన్న ఇతర రచయితలందరినీ సమీకరించాలని, ఒక నిర్మాణ రూపం ధరించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. అలా రెండు వైపుల నుంచీ కూడ ఫిబ్రవరి విశాఖ సభ ముగిసిన నాటి నుంచి మొదలైన ప్రయత్నాలు ఆ తర్వాత ఐదు నెలలు ముమ్మరంగా సాగాయి. శ్రీశ్రీ సన్మాన సభలో తమకు అవమానం జరిగిందని అనుకున్న ఆరుద్ర, సోమసుందర్ వంటి వారు శ్రీశ్రీనీ, శ్రీశ్రీ సమర్థకులనూ ఖండించడానికి, వారి మీద దుమ్మెత్తి పోయడానికి స్వయంగానూ, తమ సమర్థకుల ద్వారానూ ప్రయత్నాలు ప్రారంభించారు. విశాఖ సభలు శ్రీశ్రీని నక్సలైటు ఉద్యమం వైపు లాగడానికి చేసిన ప్రయత్నమని రామలక్ష్మీ ఆరుద్ర ది హిందూ పత్రికలో ఉత్తరం రాశారు. మరొకవైపు సోమసుందర్ విశాలాంధ్రలో, ప్రగతి లో ‘ఆధునికాంధ్ర సాహిత్యంలో అతివాద బాలారిష్టం’ పేరుతో శ్రీశ్రీ మీద, విప్లవోద్యమం మీద నిందాపూర్వకమైన వ్యాసాలు రాశారు. ఈ విమర్శలకు శ్రీశ్రీ అవే పత్రికలోనూ, బైటా ఘాటైన జవాబులిచ్చారు. అప్పటికప్పుడు ఎన్నో పత్రికలు పుట్టుకొచ్చి ఇటువంటు నిందా రచనలు అచ్చువేశాయి. ఇలా శ్రీశ్రీ మీద, శ్రీశ్రీ మార్గం మీద పెద్దఎత్తున జరిగిన దాడి శ్రీశ్రీ సమర్థకులను, శ్రీకాకుళ విప్లవోద్యమ సమర్థకులను మరింత ఏకం చేసింది.

హైదరాబాదులో 1970 జూలై 4-5 తేదీల్లో జరపతలపెట్టిన అభ్యుదయ సాహితీ సదస్సు నేపథ్యం ఇది.

శ్రీశ్రీని శ్రీకాకుళ విప్లవోద్యమ సమర్థన నుంచి దూరం చేయాలనే పాలకవర్గ ప్రయత్నాలు నేరుగా అధికారంలో ఉన్నవారి నుంచి మాత్రమే కాక అప్పటికే వర్గపోరాటాన్ని వదిలివేసి వర్గ సామరస్య రాజకీయాలు ప్రారంభించిన అభ్యుదయ రచయితల సంఘం నాయకుల నుంచి, చౌకబారుతనాన్నే సాహిత్యంగా చలామణీ చేస్తున్న సినిమా సాహిత్యకారుల నుంచి, ప్రజలన్నా, ప్రజా పోరాటాలన్నా గిట్టని సంప్రదాయ సాహిత్య కారుల నుంచి కూడ మద్దతు సంపాదించుకున్నాయి. ఈ శిబిరం అంతా కలిసి శ్రీశ్రీ షష్టిపూర్తి సందర్భంగా శ్రీశ్రీకి సన్మానం జరపాలని, ఆయనకు ముఖ్యమంత్రి చేతుల మీదిగా మనీపర్స్ బహూకరించాలని, ఆ సందర్భంగా అభ్యుదయ సాహితీ సదస్సు నిర్వహించాలని తలపెట్టింది. ఒకరకంగా శ్రీశ్రీని ప్రలోభపెట్టి ప్రజా ఉద్యమానుకూల సాహిత్య శిబిరం నుంచి ఆయనను తప్పించి, ఆ శిబిరం బలం తగ్గించే వ్యూహంతో చేసిన ప్రయత్నమిది.

ఈ శ్రీశ్రీ సన్మానం, అభ్యుదయ సాహిత్య సదస్సు కార్యక్రమానికి నిర్వాహకురాలిగా బైటికి చూపిన పేరు సెవెన్ స్టార్స్ సిండికేట్ (నక్షత్ర సప్తకం) అనే సంస్థది. బి ఎ వి శాండిల్య అనే సినిమా జర్నలిస్టు అధ్యక్షుడుగా 1959లో పుట్టిన ఈ సంస్థ ఒక సాధారణ కళా సాహిత్య సంస్థ. చిత్రకళా ప్రదర్శనలు, నాటికల పోటీలు, సినిమావారిచే రవీంద్రభారతిలో కార్యక్రమాలు నిర్వహించడం ఈ సంస్థ పని. ఈ సంస్థ తరఫున 1965లో నవత అనే కవితా మాసపత్రిక స్థాపించాలని ఒక ప్రయత్నం కూడ జరిగింది. ఆ పత్రికకు ప్రధాన సంపాదకుడుగా ఉండాలని శ్రీశ్రీని అడిగి ఒప్పించిన వరవరరావు ఆ పత్రిక ప్రగతిశీల కవిత్వానికి వేదికగా ఉండాలనే లక్ష్యాన్ని వదులుకోవడంతో దానికి దూరమై, ఒక రకంగా ఆ ప్రేరణతోనే ఏడాది తర్వాత సృజన ప్రారంభించారు. నవత పత్రిక కూడ ఏడాది కన్న ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు.

నక్షత్ర సప్తకం ప్రారంభమై దశాబ్ది గడిచినందువల్ల దాని పదవ వార్షికోత్సవాలు, అభ్యుదయ సాహిత్య సదస్సు కలిసి వస్తాయని ఆ సంస్థ పేరును ముందు పెట్టారు. కాని వాస్తవానికి ఆ ప్రయత్నం వెనుక ప్రభుత్వం, సినిమా ప్రముఖులు, సంపన్నవర్గాలు, అభ్యుదయ రచయితల సంఘం నాయకులు ఉన్నారు. ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, విద్యాశాఖ మంత్రి పి వి నరసింహారావు, సమాచార శాఖ మంత్రి ఎ వాసుదేవరావు, సినిమానటులు అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, సినిమా నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యదర్శి దేవులపల్లి రామానుజరావు, అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి తుమ్మల వెంకట్రామయ్య, రచయితలు కుందుర్తి, దాశరథి, కెవి రమణారెడ్డి, విద్వాన్ విశ్వం, నార్ల చిరంజీవి, సి నారాయణరెడ్డి, ఆరుద్ర, సోమసుందర్ లు నిర్వాహకులుగా వేరువేరు కమిటీలు ఏర్పాటు చేశారు. సదస్సు నిర్వాహక కమిటీకి కార్యదర్శి అరసం నాయకులు రాంభట్ల కృష్ణమూర్తి. సదస్సు నిర్వహించాలనీ, సదస్సు పత్రాలతో నవత ప్రత్యేక సంచిక తేవాలనీ, ఇంగ్లిష్ లో సావనీర్ అచ్చువేయాలనీ, శ్రీశ్రీని వెయ్యినూటపదహార్లతో, కశ్మీర్ శాలువాతో సత్కరించాలనీ, దేశంలోని 116 సాహిత్య సంస్థలను ఆహ్వానించి వారి చేత శ్రీశ్రీకి 116 పూలమాలలు వేయించాలనీ, మహాప్రస్థాన గీతాల చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేయాలనీ మే 17 తేదీన జరిగిన సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు.

ఇక్కడ విచిత్రమైన విషయమేమంటే అప్పటికే విశాలాంధ్రలో, ప్రగతిలో, అనేక ఇతర పత్రికలలో శ్రీశ్రీ మీద వ్యక్తిగతంగానూ, శ్రీశ్రీ ప్రస్తుత ఆలోచనల మీదా దుమ్మెత్తిపోస్తూ వ్యాసాలు రాస్తున్న తుమ్మల వెంకటరామయ్య, ఆరుద్ర, సోమసుందర్ లు ఈ సన్మాన కమిటీలలో నాయకత్వ స్థానాలలో ఉండడం. శ్రీశ్రీ మీద ప్రత్యక్ష విమర్శలకు, నిందలకు, తద్వారా శ్రీకాకుళ విప్లవోద్యమం మీద విమర్శలకు పెద్ద ఎత్తున చోటు కల్పిస్తున్న సిపిఐ, సిపిఎం సాహిత్య నాయకులు ఈ సన్మాన కార్యక్రమంలో అగ్రభాగాన ఉండడం. అప్పటికే జ్వాల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను శ్రీకాకుళ ఉద్యమాన్ని సమర్థిస్తున్నానని, ఆరోగ్యం సహకరిస్తే శ్రీకాకుళం వెళ్తానని ప్రకటించిన శ్రీశ్రీని ఆ ఉద్యమాన్ని నెత్తురుటేర్లలో ముంచుతున్న బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా సన్మానించాలని అరసం నాయకులు తలపెట్టడం.

అభ్యుదయ సాహిత్య సదస్సు నిర్ణయాలు వెలువడగానే ఆ సదస్సును బహిష్కరిస్తున్నామని మొట్టమొదట దిగంబర కవులు ప్రకటించారు. “జూలై 4,5 తేదీలలో భారీ ఎత్తున ప్రభుత్వ పరమైన అభ్యుదయవాదుల ఆధ్వర్యంలో జరగబోతున్న అభ్యుదయ సాహిత్య సదస్సు ప్రజాపరమైన అభ్యుదయ వేదికగా దిగంబర కవులు గుర్తించడం లేదు. దిగంబర కవులు ఈ కుహనా అభ్యుదయ వాదుల సాహిత్య సదస్సును బహిష్కరిస్తున్నారు. నిజమైన ప్రజాకవిగా కొంతకాలం బతికిన శ్రీశ్రీని కూడా ఈ సదస్సు బహిష్కరించి ప్రజల పక్షాన నిలవవలసిందిగా దిగంబర కవులు కోరుతున్నారు” అని దిగంబర కవులు ప్రకటించారు. ఈ దిగంబర కవుల ప్రకటన బహుశా జూన్ చివరి వారంలో వెలువడి ఉంటుంది.

జూన్ 30న వరంగల్ నుంచి వరవరరావు కూడ ఈ సదస్సును బహిష్కరిస్తున్నానని ప్రకటించారు. “అభ్యుదయ సాహిత్య సదస్సు పేరుతో నక్షత్ర సప్తకం (సెవెన్ స్టార్స్ సిండికేట్) తలపెట్టిన సభలూ, శ్రీశ్రీ సన్మానం పెద్ద ఫార్స్. ఎస్టాబిష్ మెంటు స్తోత్రం చేయడానికి, శ్రీశ్రీని, ఆయనను అనుసరిస్తున్న విప్లవ రచయితలను వాడుకోవడమే తప్ప మరొకటి కాదు. కాబట్టి ఈ విప్లవ ప్రతీఘాతుక కార్యక్రమాల్లో పాల్గొనడం అమ్ముడుపోవడంగా భావించి నేనీ సభలను బహిష్కరిస్తున్నాను” అని వరవరరావు ప్రకటించారు.

అభ్యుదయ సాహిత్య సదస్సును “సర్కారీ అభ్యుదయ రచయితల సర్కస్” గా అభివర్ణిస్తూ దానికి స్వస్తి పలుకుతున్నానని కెవి రమణారెడ్డి ప్రభంజనం జూలై 1, 1970 సంచికలో రాశారు.

“…కసాయివాడు జీవకారుణ్యం మీద సెమినార్ పెడితే భూతదయ కలవాళ్లు ఉరకటమేనా?” అని కొడవటిగంటి కుటుంబరావు భావగర్భితమైన వ్యాఖ్య చేశారు.

ఈ సన్మాన కార్యక్రమంలో శ్రీశ్రీకి నల్లజెండాలు చూపి నిరసన తెలుపుతామని కొంతమంది విద్యార్థులు ప్రకటించారు. శ్రీశ్రీని సన్మానానికి వెళ్లవద్దంటూ నేరుగా కొందరు ఉత్తరాలు రాశారు. పత్రికల్లో ఈ ప్రకటనలూ, ఖండనలూ, సంపాదకీయాలూ కూడ వెలువడ్డాయి. ఈ రభసనంతా దృష్టిలో పెట్టుకుని శ్రీశ్రీ రాసిన చరిత్రాత్మకమైన ఉత్తరం ఒకటి ఆంధ్రప్రభ 1970 జూలై 4 సంచికలో వెలువడింది. ఆయన జూలై 3 ఉదయానికే హైదరాబాద్ చేరారు గనుక, ఈ ఉత్తరం మీద రాసిన స్థలం మద్రాస్ అని రాశారు గనుక కచ్చితంగా అది జూలై 3కు ముందే రాసినదై ఉండడానికి అవకాశం ఉంది.

“జూలై 4వ తేదీన హైదరాబాదులో అభ్యుదయ రచయితల సదస్సూ, ఆ మర్నాడు అదే గ్రామంలో నా పేరిట సన్మానమూ జరగబోవడాన్ని పురస్కరించుకొని నాకు కుప్పలు తెప్పలుగా ఉత్తరాలు, టెలిగ్రాంలు వచ్చి పడుతున్నాయి. కొన్ని వెళ్లమని, మరికొన్ని వెళ్లవద్దనీ, ఈ సందర్భంలో నేను ఏం చెయ్యడమా అని తీవ్రంగా ఆలోచించుకున్నాను. నా ఎదుట నాలుగు మార్గాలున్నాయి:

  1. గైరు హాజరు కావడం.
  2. అభ్యుదయ సదస్సులో పాల్గొని సన్మానాన్ని నిరాకరించడం.
  3. సన్మానాన్ని మాత్రమే స్వీకరించడం.
  4. అన్ని సభలకు హాజరు కావడం.

ఈనాడు నేనో వ్యక్తిమాత్రుణ్ని కాదు. ఒక మహోద్యమానికి ప్రతినిధిని. కాబట్టి నేను గైరుహాజరు కావడమంటే ఉద్యమానికి ద్రోహం చెయ్యడమవుతుంది. అంతేకాక ఉద్యమ విరోధులంతా నాకు పిరికితనాన్ని అంటకట్టవచ్చు.

సన్మానాన్ని మాత్రమే స్వీకరిస్తే అది స్వార్థపరత్వమవుతుంది. (ప్రధానాతిథి అయిన బ్రహ్మానందరెడ్డి గారికిది అవమానం కాదా అని కొందరడగవచ్చు. దానికి నా ఎదురుప్రశ్న: స్వార్థాన్నే ఆరాధించమంటారా? అని.)

అన్నిటికీ హాజరు కావడమంటే ఎవరినీ సంతోషపెట్టలేకపోవడం, సంతృప్తి పరచలేకపోవడం.

కాబట్టి నాకు మిగిలింది రెండో మార్గం. అభ్యుదయ సదస్సు లోను, ఆ సందర్భంలో జరిగే కవిసమ్మేళనం లోను పాల్గొంటాను. నా ఇటీవలి రచనలు కొన్ని చదువుతాను.

ఉదా:
‘తెల్ల కమ్యూనిష్టులు
రక్తపాతానికనిష్టులు
విప్లవానికి బహిష్టులు
ఇందిరారారాధనలో శ్రేష్టులు
నవభారత ధార్తరాష్ట్రులీ
రివిజనిష్టులు’
దీని శీర్షిక – ‘శ్వేత కుంజరాలు’

ఇంకోటి –
‘ఆరుద్ర చేస్తున్న విమర్శనాలు
అసాహిత్యానికి నిదర్శనాలు
అబద్ధాల ప్రదర్శనాలు
అతగాడి ఇటీవలి పురోచనాలు
అజీర్తి సుఖ విరోచనాలు’
దీని పేరు మిల్క్ ఆఫ్ మెగ్నీషియా.

దిగంబర కవుల మీద –
‘దిగంబర కవులు
ముళ్ల గులాబీ పువ్వులు
ఆగ్రహ భార్గవులు
ప్రభువుల శిరసులపై పరశువులు
పగబట్టిన చక్షుశ్శ్రవులు.’

సాహిత్యంలో నేనెక్కడున్నానో చెప్పడానికి పై లిమరిక్కులు చాలు.

జీవితం ఈనాడొక జూదంగా పరిణమించింది. ఇష్టమున్నా లేకున్నా అందరం ఇందులో పాల్గొనవలసిందే. మా నాన్న గొప్ప గణిత శాస్త్రజ్ఞుడైన జూదగాడు. నా దగ్గర బోలెడు తురుఫు ముక్కలున్నాయి. అన్నిటినీ బైటపెట్టడం జూదరి లక్షణం కాదు.

తెలుగు సాహిత్యం అభ్యుదయ రచనల దశ దాటిపోయింది. ఏ గుజరాత్ లోనో, ఒరిస్సా లోనో, మైసూరు రాష్ట్రం లోనో ఈ సాహిత్యం ఇంకా ఇంకా ప్రవర్ధమానం అయితే బాగుంటుంది. మనకు కావలసింది అరసం కాదు, విరసం (విప్లవ రచయితల సంఘం) అంటారు కొందరు. అవి రెండూ కాదు, కావాలి లావారసం అంటాను నేను. అనగా లాక్షణికవాద రచయితల సంఘం. లక్ష్యం సామ్యవాదం. దానికి దారితీసే లక్షణాలను ప్రవర్తించేవాళ్లే లాక్షణికవాదులు. ఇది క్షణికవాదం కాదు. కారాదు.”

(మిగతా వచ్చే సంచికలో)

పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు.
ర‌చ‌న‌లు: 'స‌మాచార సామ్రాజ్య‌వాదం', 'క‌ల్లోల కాలంలో మేధావులు - బాల‌గోపాల్ ఉదాహ‌ర‌ణ‌', 'అమ్మ‌కానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌', 'క‌థా సంద‌ర్భం', 'క‌డ‌లి త‌ర‌గ‌', 'పావురం', తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛిన‌మ‌వుతున్న వ్య‌క్తిత్వం, 'పోస్ట్‌మాడ‌ర్నిజం', 'న‌వ‌లా స‌మ‌యం', 'రాబందు నీడ‌', 'క‌ళ్ల‌ముంద‌టి చ‌రిత్ర‌', 'ప‌రిచ‌యాలు', 'తెలంగాణ‌ - స‌మైక్యాంధ్ర భ్ర‌మ‌లు, అబ‌ద్ధాలు, వాస్త‌వాలు', 'శ్రీశ్రీ అన్వేష‌ణ‌', 'లేచి నిలిచిన తెలంగాణ‌', 'ప్ర‌తి అక్ష‌రం ప్ర‌జాద్రోహం - శ్రీకృష్ణ క‌మిటీ నివేదిక‌', 'రాబందు వాలిన నేల‌', 'ఊరి దారి- గ్రామ అధ్య‌య‌న ప‌రిచ‌యం', 'విద్వేష‌మే ధ్యేయంగా విశాలాంధ్ర మ‌హార‌భ‌స‌', 'క‌విత్వంతో ములాఖాత్‌', 'సమాజ చలనపు సవ్వడి', 'కాషాయ సారం', 'విద్వేషాపు విశ్వగురు', 20కి పైగా అనువాదాలు.
సంపాద‌క‌త్వం: 'Fifty Years of Andhrapradesh 1956-2006', 'Telangana, The State of Affairs', '24గంట‌లు', 'హైద‌రాబాద్ స్వాతంత్య్ర సంరంభం', 'జ‌న హృద‌యం జ‌నార్ద‌న్‌', 'స‌మ‌గ్ర తెలంగాణ' పుస్త‌కాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

One thought on “జూలై 4 చరిత్రాత్మక విస్ఫోటనం – 1

  1. విరసం 50 ఏళ్ల కితమ్ పుట్టిన వరుసక్రమం వివరంగా బావుంది

Leave a Reply