గోడల్ని ఛేదిద్దాం – సమూహ యువ సాహిత్యోత్సవం 2026

తేదీ: 31 అక్టోబర్ 2026, శనివారం
వేదిక: వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, కోఠీ, హైదరాబాద్

కొత్త తరం ప్రశ్నల్ని సంధిస్తోంది – సమాజం ఇచ్చే సమాధానం ఏమిటి?

ఒక తరం తన భవిష్యత్తు గురించి ప్రశ్నిస్తున్నప్పుడు, ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన బాధ్యత ఆ తరానిదే కాదు, మొత్తం సమాజానిది. చదువుకున్నా ఉద్యోగం దొరుకుతుందనే భరోసా లేనప్పుడు, ప్రతిభ ఉన్నా అవకాశాలు సమానంగా అందనప్పుడు, అభిప్రాయాన్ని వ్యక్తం చేయడమే సమస్యగా మారినప్పుడు యువత అసంతృప్తికి లోను కాదా!? ఇలా ఎందుకు అవుతున్నది, దీనికి కారణాలు ఏమిటి అని ఆలోచించదా, బాధ్యత వహించవలసిన వ్యవస్థలను ప్రశ్నించదా? యువత ఆందోళనలను ఆవేశం అని కొట్టిపారేయాలా, లేక అవి బయటపెడుతున్న సామాజిక వాస్తవాలను పరిశీలించాలా? యువత భవిష్యత్తు గురించి మాట్లాడటం అంటే వారి ఆశలను ఎత్తిపట్టడమే మాత్రమే కాదు; ఆ ఆశలకు అడ్డుగా నిలుస్తున్న వ్యవస్థల జవాబుదారీతనం గురించి నిలదీయడం కూడా.

ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న జెన్‌-జీ (Gen Z) ఉద్యమాలు ముందుకు తెచ్చిన ప్రశ్నలు అనేకం. వ్యక్తిగత విజయమే జీవిత లక్ష్యమని బోధించే సమాజంలో, ఆ విజయానికి అవసరమైన అవకాశాలు అందరికీ సమానంగా ఉన్నాయా? కులం, వర్గం, లింగం, ప్రాంతం, ఆర్థిక స్థితి ఒక వ్యక్తి భవిష్యత్తును ఎంతవరకు నిర్ణయిస్తున్నాయి? కొద్దిమంది సాధించిన విజయాలను చూపించి మొత్తం యువతరం అవకాశాల ప్రపంచంలో జీవిస్తోందని చెప్పగలమా? యువత ప్రశ్నల వెనుక ఉన్న సామాజిక వైరుధ్యాలను గుర్తించకుండా వారి అసంతృప్తిని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అవినీతి, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, రాజకీయ జవాబుదారీతనం, పౌరహక్కులపై పరిమితులు వంటి అంశాలపై యువత వ్యక్తం చేస్తున్న అసంతృప్తిని కేవలం తాత్కాలిక ఆవేశంగా చూడలేం. అయితే అన్ని ఉద్యమాలకూ ఒకే స్వభావం, ఒకే లక్ష్యం ఉండవు. వాటి వెనుక ఉన్న నిర్దిష్ట సామాజిక, రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవాలి.

ఈ మొత్తం క్రమంలో సాహిత్యానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. సాహిత్యం సమాజాన్ని ప్రతిబింబించడమే కాదు, మనకు అలవాటైన సామాజిక వాస్తవాలను కొత్తగా చూడటానికి కూడా సహాయపడుతుంది. మనిషి ఆకలి, అవమానం, భయం, ప్రేమ, ఆశ, తిరుగుబాటు వ్యక్తిగత అనుభవాలే అయినప్పటికీ, వాటి వెనుక సామాజిక సంబంధాలు, అధికార వ్యవస్థలు, అసమానతలు పనిచేస్తుంటాయి. వాటిని గుర్తించి వాటి పనితీరును లోతుగా అర్థం చేసుకొనటానికి సాహిత్యం సమర్థవంతంగా ఉపకరిస్తుంది. అయితే సాహిత్యాన్ని ఏదో ఒక సిద్ధాంతానికి ప్రచార సాధనంగా పరిమితం చేయడం కూడా సరైంది కాదు. సాహిత్యం ప్రజాసమూహాలమధ్య జరిగే అనేక భావరీతుల సంఘర్షణను ప్రతిఫలించాలి. దాని పని సిద్ధంగా ఉన్న సమాధానాలను ప్రకటించడం కాదు; ప్రశ్నించడానికి, అనుభవాలను విశ్లేషించడానికి, మన నమ్మకాలను పునఃపరిశీలించడానికి అవసరమైన స్వేచ్ఛను కల్పించడం.

సమాజంలో అందరి అనుభవాలు సాహిత్యంలోకి రావాలి. సకల సమూహాల భాషకు గుర్తింపు సాహిత్య గౌరవం లభించాలి. కొన్ని సముదాయాల బాధను వ్యక్తిగత సమస్యగా పక్కన పెట్టడం గాక మొత్తం జాతి సమస్యగా చర్చించాలి. కులం, వర్గం, లింగం, మతం, ప్రాంతం ఆధారంగా ఏర్పడే అసమానతలు మనుషుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఆలోచించాలి. అంచులకు నెట్టబడిన ప్రజల అనుభవాలకు సాహిత్యంలో స్థానం కల్పించడం కేవలం కొత్త విషయాలను పరిచయం చేయడం కాదు; సమాజాన్ని అర్థం చేసుకునే మన దృష్టినే విస్తరించడం. భిన్నమైన గొంతుకలు వినిపించినప్పుడే సాహిత్యం ప్రజాస్వామిక సంభాషణకు నిజమైన వేదిక కాగలదు. ఆ సంభాషణలో భిన్న అభిప్రాయాలకు చోటుండాలి. మనకు నచ్చని అభిప్రాయాలను కూడా ఆధారాలతో, తర్కంతో ఎదుర్కొనే సంస్కృతి పెరగాలి.

డిజిటల్ మాధ్యమాలు యువతకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి, సమాచారాన్ని పంచుకోవడానికి, సమూహాలుగా ఏర్పడడానికి కొత్త అవకాశాలను కల్పించాయి. ఆధికారిక కథనాలను ప్రశ్నించడం, నిర్లక్ష్యానికి గురైన అనుభవాలను వెలుగులోకి తీసుకురావడం సాధ్యమైంది. కానీ సమాచార వేగం విమర్శనాత్మక ఆలోచనకు ప్రత్యామ్నాయం కాదు. తప్పుడు సమాచారం, ద్వేషపూరిత ప్రచారం, ఆన్‌లైన్ వేధింపులు, భిన్నాభిప్రాయాల పట్ల అసహనం డిజిటల్ ప్రపంచంలో స్వేచ్ఛకు కొత్త సవాళ్లుగా నిలుస్తున్నాయి. ఒక అసత్య కథనాన్ని అనేకమంది పంచుకున్నంత మాత్రాన అది నిజం కాదు. అందుకే భావప్రకటనా స్వేచ్ఛతో పాటు సమాచారాన్ని పరిశీలించే వివేచన, ఇతరుల హక్కులను గౌరవించే బాధ్యత కూడా అవసరం.

ఈ వివేచనను పెంపొందించడంలో విద్య పాత్ర కీలకం. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగం సంపాదించడమే విద్యకు అంతిమ లక్ష్యమైతే, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, అన్యాయాన్ని ప్రశ్నించడానికి, ప్రజాస్వామిక పౌరులుగా ఎదగడానికి అవసరమైన స్థలం సంకుచితమౌతుంది. అధిక ఫీజులు, విద్యాసంస్థల్లో వసతుల కొరత, బోధనలో నాణ్యత సమస్యలు, పరీక్షా వ్యవస్థలో అక్రమాలు, ఉపాధి అవకాశాల అనిశ్చితి విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయి. వీటిని వ్యక్తిగత సమస్యలుగా చూడటం వల్ల వాటి వెనుక ఉన్న విద్యా విధానాలు, వనరుల పంపిణీ, ప్రభుత్వ బాధ్యత వంటి అంశాలు మరుగునపడతాయి. విద్యార్థుల భవిష్యత్తు గురించి చర్చించాలంటే వారి కలలను వినడంతో పాటు, ఆ కలలు సాకారం కావడానికి అవసరమైన సామాజిక పరిస్థితులను కూడా పరిశీలించాలి.

సంస్కృతి విషయంలోనూ ఇలాంటి పరిశీలనలే అవసరం. సంస్కృతిని ఎవరు నిర్వచిస్తున్నారు? ఏ విలువలకు సమాజంలో గౌరవం లభిస్తోంది? భిన్నమైన భాషలు, సంప్రదాయాలు, జీవన అనుభవాలకు సమాన స్థానం ఉందా? సంస్కృతి పేరుతో ఆధిపత్య విలువలు ఇతరులపై రుద్దబడుతున్నాయా? ఈ ప్రశ్నలు సంస్కృతిని నిరాకరించడానికి కాదు; దానిలోని వైవిధ్యాన్ని, అధికార సంబంధాలను అర్థం చేసుకోవడానికి. వీధి నాటకం సామాజిక వైరుధ్యాన్ని ప్రజల ముందుంచగలదు. కవిత వ్యక్తిగత బాధలోని సామాజిక కోణాన్ని వ్యక్తీకరించగలదు. కథ మనకు పరిచయమైన జీవితాలను కొత్త దృష్టితో చూపగలదు. కళలు మార్పును ఒక్కసారిగా తీసుకురాకపోయినా, అన్యాయాన్ని గుర్తించే చూపును, ప్రత్యామ్నాయ సమాజాన్ని ఊహించే శక్తిని పెంపొందించగలవు.

ఈ నేపథ్యంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం తన రెండవ ఎడిషన్‌ సమూహ యువ సాహిత్యోత్సవం–2026ను నిర్వహిస్తోంది.

‘సంస్కృతి–ఆధిపత్య వ్యవస్థలు’, ‘డిజిటల్ మాధ్యమాలు–అసమ్మతి స్వరాలు’, ‘కొత్తతరం–సాహిత్య స్వరం’, ‘చదువుల మానిఫెస్టో–మేమెక్కడ?’, ‘ప్రదర్శన కళలు–సామాజిక మార్పు’ అనే అంశాలపై చర్చలు ఈ కార్యక్రమంలో ప్రధానంగా నిలవనున్నాయి. వీటితో పాటు వీధి నాటిక, జెన్‌-జీ కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆర్ట్‌ వర్క్‌షాప్‌ నిర్వహించనున్నారు. యువత తమ అనుభవాలను, ఆలోచనలను, ఆకాంక్షలను వ్యక్తీకరించడానికి, భిన్నమైన అభిప్రాయాలతో సంభాషించడానికి ఈ కార్యక్రమాలు వేదిక కల్పిస్తాయి.

యువత మారాలని చెప్పడం సులభం. కానీ యువతను ప్రభావితం చేస్తున్న పరిస్థితులను మార్చడానికి సమాజం ఎంతవరకు సిద్ధంగా ఉంది? వారి బాధ్యతలను గుర్తుచేసే ముందు హక్కులను గుర్తిస్తున్నామా? వారి కలలను ప్రోత్సహించే ముందు ఆ కలలకు అడ్డుగా ఉన్న అసమానతలను ప్రశ్నిస్తున్నామా? వారి గొంతును వినాలని చెప్పే ముందు ఆ గొంతు స్వేచ్ఛగా వినిపించే పరిస్థితులను కాపాడుతున్నామా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో భాగం. యువత ప్రశ్నించడం సమాజానికి ముప్పు కాదు. ఆ ప్రశ్నలను వినడానికి నిరాకరించడమే సమాజం తన భవిష్యత్తును సంకుచితం చేసుకోవడం.

సాహిత్యం ప్రశ్నలకు భాషను ఇవ్వాలి. కళలు కనిపించని వైరుధ్యాలను కనిపించేలా చేయాలి. ప్రజాస్వామ్యం భిన్నాభిప్రాయాలకు స్థలం కల్పించాలి. ఈ మూడింటి మధ్య సంబంధాన్ని బలోపేతం చేయాలన్న ఆకాంక్షతో సమూహ యువ సాహిత్యోత్సవం నిర్వహించబడుతోంది. ఇది యువతకు ఉపన్యాసాలు వినిపించే కార్యక్రమం కాదు; వారి ఆలోచనలకు, అనుభవాలకు, విమర్శలకు స్థానం కల్పించే ప్రజాస్వామిక వేదిక. విద్యార్థులు, యువ రచయితలు, కవులు, కళాకారులు, అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాస్వామిక విలువలను ఆకాంక్షించే పౌరులందరూ ఈ సంభాషణలో భాగస్వాములు కావాలని సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆహ్వానిస్తోంది.

ప్రవేశం: ఉచితం. అందరికీ ఆహ్వానం

సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం

Leave a Reply