గద్దర్ జ్ఞాపకాలు

గద్దర్ జ్ఞాపకాలు అంటే, గద్దర్ అనే ఒకానొక వ్యక్తితో జ్ఞాపకాలు కూడ కావచ్చు గాని, అవి మాత్రమే ఎప్పటికీ సంపూర్ణం కావు, అవి జననాట్యమండలి అనే ఒక మహాశక్తితో జ్ఞాపకాలు, ఆ మహాశక్తితో అవినాభావ సంబంధం నెరపిన గద్దర్ అనే వ్యక్తితో జ్ఞాపకాలు. నిజానికి గత ఐదు దశాబ్దాలలో గణనీయమైన భాగం గద్దర్ విడిగా లేడు. వందలాది కవులతో, గాయకులతో, కళాకారులతో, వేల, లక్షల మంది శ్రోతలతో కలగలిసిన ఒక మహత్తర విప్లవ సాంస్కృతికోద్యమంలో, విప్లవోద్యమంలో, సంరంభంలో భాగంగా ఉన్నాడు. విప్లవోద్యమం లేకుండా, లక్షలాది మంది ప్రజలు, వాళ్ల కోసం పోరాడి ఒరిగిపోయిన వేలాది మంది అమరులు, ఇప్పటికీ ఆ మార్గాన సాగుతున్న వేలాది మంది వీరయోధులు లేకుండా గద్దర్ మాత్రమే కాదు, జననాట్యమండలి కళాకారులెవ్వరూ లేరు. వారు లేకుండా గద్దర్ లేడు. గద్దర్ లేకుండా వారూ, జననాట్యమండలీ, విప్లవ సాంస్కృతికోద్యమమూ, విప్లవ సందేశపు రాష్ట్రవ్యాప్త, దేశవ్యాప్త విస్తరణా లేవు. ఒక సువిశాల, అవినాభావ, గతితార్కిక సంబంధం లోంచి గద్దర్ ను విడదీసి చూడడమే అసాధ్యం.

అయితే, ఇప్పుడు గద్దర్ అనే వ్యక్తి మరణించిన సందర్భంగా ఆ ఒక్క వ్యక్తి గురించే మాట్లాడుకోవాలి గనుక విప్లవోద్యమంలో, విప్లవ సాంస్కృతికోద్యమంలో, జననాట్యమండలిలో అవిభాజ్య భాగమైన గద్దర్ తో ఐదు దశాబ్దాలుగా నాకున్న స్వల్ప పరిచయాన్ని, జ్ఞాపకాలను పంచుకోవడానికే ఈ ప్రయత్నం.

గద్దర్ పాట వినడానికి దాదాపు ఏడాది ముందే అచ్చులో ఆయన పేరు మొదట ‘పిలుపు’లో చూశాను. ‘ఆపుర రిక్షోడో’ అనే పాట, బహుశా అచ్చయిన ఆయన తొలి రచన, వి.బి. గద్దర్ పేరుతో మొదటిసారి ‘పిలుపు’ పక్ష పత్రిక 1972 నవంబర్ 16 సంచికలో వెలువడింది. (ప్రభుత్వ నిషేధానికి గురైన ‘పిలుపు’ మూడు సంచికలలో ఈ సంచిక కూడా ఒకటి). తర్వాత ఐదారు నెలలు ఆయనను ఎక్కడైనా చూశానేమో, ఆయన పాట విన్నానేమో, ఆయన గురించి విన్నానేమో గాని, బలంగా ఆయన నా జీవితంలోకీ, చైతన్యంలోకీ ప్రవేశించినది మాత్రం 1973 జూలై తర్వాత.

సృజన 1973 జూలై సంచికలో “ఈ సంచికలోనూ, రాగల ఒకటి రెండు సంచికల్లోనూ ఎక్కువ సంఖ్యలో వేయనున్న వి.బి.గద్దర్ పాటలు త్వరలో పుస్తక రూపంలో కూడ వస్తయి. హైదరాబాదు జిల్లా మాండలికాలు, అక్కడి ప్రజాజీవితం మాత్రమే కాదు – ఈ పాటలన్నీ ఆ చుట్టుపట్ల పల్లెల్లో ప్రజలు పాడుకునే బాణీల్లో వచ్చినవే. కొన్ని పాటలు మకుటాలు, చరణాలు కూడా ప్రజలు పాడుకునే పాటల నుంచే తీసుకొని విప్లవ భావాలకు అనుగుణంగా మలచినవి. ఈనాడివి హైదరాబాదు చుట్టూ దాదాపు ఇరవై గ్రామాల్లో విరివిగా పాడుకోబడుతున్నయి. అందరికీ అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ఇప్పటికే ప్రచారంలో ఉన్న ఈ పాటలను అచ్చులోకి తెస్తున్నాం” అనే సంపాదకుడి నోట్ తో గద్దర్ పాటల అచ్చు మొదలయింది. తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్ సంచికలలో కూడా కలిపి దాదాపు ఇరవై గద్దర్ పాటలు అచ్చువేసి, అవన్నీ 1973 అక్టోబర్ లో వరంగల్ లో జరిగిన విరసం మొదటి సాహిత్య పాఠశాల నాటికి సృజన ప్రచురణగా ‘వి బి గద్దర్ పాటలు’ పుస్తకం తెచ్చాం. అప్పటికే నేను చదువుకు హనుమకొండకు వచ్చి, సృజన ప్రూఫులు దిద్దడానికి, ప్రెస్ పనులు చూడడానికి వెళ్తున్నాను. అలా ఆ మూడు సంచికల పాటలు కూడ ప్రూఫు చూశాను. ప్రెస్ నుంచి పుస్తకాల కట్టలు మోసుకురావడం, ప్యాక్ చేసి పోస్ట్ చేయడం, ఏవైనా సభలు జరిగితే పుస్తకాల దుకాణం పెట్టడం వంటి పనులు కూడ అన్నయ్యతో పాటు అప్పటికే చేస్తున్నాను.

సృజనలో గద్దర్ పాటలు అచ్చయిన మూడు సంచికల పేజీలు వెయ్యి కాపీల చొప్పున అదనంగా ప్రింట్ చేసి అవన్నీ కలిపితే అక్టోబర్ లో ‘వి బి గద్దర్ పాటలు’ పుస్తకం తయారయింది. హనుమకొండ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హాస్టల్ లో జరిగిన ఆ మూడు రోజుల సాహిత్య పాఠశాలలో రెండో రోజు సాయంత్రం హనుమకొండ జీవన్ లాల్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ, మూడో రోజు సాయంత్రం హనుమకొండ జూనియర్ కాలేజీ నుంచి వరంగల్ జగదీశ్ నగర్ వరకు ఊరేగింపు, ఆ తర్వాత బహిరంగ సభ. అలా 1973 అక్టోబర్ 6 సాయంత్రం హనుమకొండ జీవన్ లాల్ గ్రౌండ్స్ సభలో గద్దర్ పాట, జననాట్యమండలి పాట మొదటిసారి విన్నాను. ఆ మర్నాడు ఊరేగింపు పొడవునా, జగదీశ్ నగర్ బహిరంగ సభ వేదిక మీద గద్దర్, జననాట్యమండలి పాటలూ, ప్రదర్శనలూ విన్నాను, చూశాను, అనుభవించాను. అదంతా ఏ గాఢమైన ప్రభావమైనా లోతుగా మనసు లోకి ఇంకే పన్నెండేళ్ల కౌమార దశలో.

నిజానికి ఆ రెండు రోజులూ గద్దర్ ను ఎంతగా మైమరిచి ఒళ్లంతా కళ్లయి చూశానో, ఒళ్లంతా చెవులై విన్నానో గుర్తు చేసుకుంటుంటే, ఊరికే ‘విన్నాను, చూశాను, అనుభవించాను’ అనే మాటలు ఎంత నిస్సారమైనవో తెలుస్తున్నది. అది ఒక విద్యుత్తేజం. భూకంప సమానమైన లోలోతుల కదలిక. మాటల, పాటల జడివాన, జలపాతం. అప్పటికి సృజనలో అక్షరాల్లో చదివి, ఏదో ఒక బాణీలో గున్గునాయించుకుంటున్న పాటలు ఆయన గొంతులో, వాటి అసలైన బాణీల్లో, ఆయన హావభావాలతో వినడం ఒక అసాధారణమైన, అపూర్వమైన, ఉజ్వలమైన అనుభవం. గద్దర్ ఒక్కడే కాదు, ఆ నాటి జననాట్యమండలి బృందంలో నర్సింగ్, భూపాల్, బాలయ్య, నిర్మల, పద్మ, సుదర్శన్, కృష్ణ వంటి వారందరూ ఆ లేత వయసులోని నా హృదయం మీద ఎన్నటికీ చెరగని ముద్ర వేశారు. నర్సింగ్, గద్దర్, పద్మ తదితరులు నటించిన ‘వీరకుంకుమ’ నాటికలోని ఒకటి రెండు దృశ్యాలు ఇప్పటికీ నా కళ్ల ముందు ఆడుతాయి. చెరబండరాజు ‘కొండలు పగలేసినం’ పాట గద్దర్ వెనుకనుంచి పాడుతుండగా, భూపాల్, నిర్మల తదితరులు చేసిన నాట్యం, అందులో భూపాల్ యంత్రం లాగ తల గిరగిరా తిప్పడం యాబై ఏళ్ల తర్వాత కూడా ఎదురుగా కనబడుతున్నది. గద్దర్ పాట, అభినయం, బాలయ్య హార్మోనియంల కలయికతో ఖవ్వాలీ, ‘రిక్షాదొక్కే రహీమన్న, రాళ్లు గొట్టే రామన్న, డ్రైవరు మల్లన్న, హమాలీ కొంరన్న’, ‘కల్లుముంతో మాయమ్మా – తల్లీ…’, ‘వీడేనమ్మో డబ్బున్న బాడుకావు’, ‘రెక్కబొక్క నొయ్యకుండ, సుక్క చెమ్ట ఒడ్పకుండ, బొర్ర బాగ బెంచావ్ రో దొరోడో, నీ పెయ్యంత మంత్రిస్తం దొరోడో’, ‘నీవు నిజం తెలుసుకోవరో కూలన్నా’, ‘పోదామురో జనసేనలో కలిసి’ వంటి తొలి పాటలు యాబై సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ అక్షరం పొల్లు పోకుండా గుర్తున్నాయి, చెవుల్లో మార్మోగుతున్నాయి. ఆ దృశ్యాలు కళ్ల ముందు ఆడుతున్నాయి.

అప్పటి నుంచి 1975 జూన్ దాకా సృజనలో ‘వడ్డెరోళ్లమండి మేం బాబూ’, ‘సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో’ వంటి గద్దర్ పాటలు ఎన్నో అచ్చయ్యాయి. విప్లవ సాంస్కృతికోద్యమం మీద, జననాట్యమండలి అనుభవాల మీద వర్గీస్ (బి నరసింగరావు) రాసిన గొప్ప సైద్ధాంతిక విశ్లేషణలు, శ్యామ్ కుమార్ (ఉప్పల నరసింహం) రాసిన అనుభవాలు, విశ్లేషణలు అచ్చయ్యాయి. సృజన మే 1975 సంచికలో జననాట్యమండలి మొట్టమొదటి, సుదీర్ఘమైన ఇంటర్వ్యూ వచ్చింది. ఆ కాలంలో వరంగల్ లో జరిగిన రెండు మూడు సభల్లోనూ, 1975 ఫిబ్రవరిలో హైదరాబాద్ లో జరిగిన రాడికల్ విద్యార్థి సంఘం మహాసభల్లోనూ ఎన్నో చోట్ల గద్దర్ స్వయంగా పాడుతుండగానూ, ఆ పాటలనూ ఇతర పాటలనూ వంగపండు ప్రసాద్, సంధ్యక్క తదితరులెందరో పాడుతుండగానూ విన్నాను. తర్వాత ఎమర్జెన్సీ రెండు సంవత్సరాలూ సభలు లేవు, పాటలు లేవు.

ఎమర్జెన్సీ అనంతర ప్రజాస్వామిక వెల్లువలో, 1977 జూన్, జూలైల నుంచే రాష్ట్రంలో అనేక చోట్ల భూమయ్య కిష్టాగౌడ్ సంస్మరణ సభలు, తార్కుండే కమిటీ, భార్గవా కమిషన్ ల నేపథ్యంలో గిరాయిపల్లి అమరవీరుల సంస్మరణ సభలు మొదలయ్యాయి. 1978 ఫిబ్రవరిలో వరంగల్ లో జరిగిన రాడికల్ విద్యార్థి సంఘం సంఘం సభల దగ్గర ప్రారంభించి, 1985 ఫిబ్రవరిలో హైదరాబాద్ లో అఖిల భారత విప్లవ విద్యార్థి సంఘం (ఆల్ ఇండియా రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్) సభల దాకా, ఆ ఏడు సంవత్సరాలు ప్రజా ఉద్యమాలకు, ప్రజా సమీకరణకు, ప్రజా సృజనాత్మకత వ్యక్తీకరణకు ఉజ్వల కాలం. ఆ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నెన్నో చోట్ల స్థానిక సమస్యల మీద, జాతీయ అంతర్జాతీయ సమస్యల మీద వందలాది సభలు జరిగాయి. అటువంటి స్థానిక సభలూ సమావేశాలూ కాక రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున జరిగిన సభలున్నాయి. విప్లవ రచయితల సంఘం (1979 జనవరి వరంగల్, సెప్టెంబర్ తిరుపతి, 1980 అక్టోబర్ హైదరాబాద్, 1981 అక్టోబర్ గుడివాడ, 1982 మే మాచర్ల, 1983 జనవరి విజయవాడ, 1984 జనవరి మాకివలస, 1985 జనవరి గద్వాల), రాడికల్ విద్యార్థి సంఘం (1979 అనంతపురం, 1981 గుంటూరు, 1983 తిరుపతి), రాడికల్ యువజన సంఘం (1978 మే గుంటూరు, 1979 జూన్ ఖమ్మం, 1981 మే వరంగల్, 1982 మే ఏలూరు, 1984 జూన్ అనంతపురం), రైతు కూలీ సంఘం (1981 జూన్ నెల్లూరు, 1983 మే కరీంనగర్), సింగరేణి కార్మిక సమాఖ్య (1982 గోదావరి ఖని, 1983 కొత్తగూడెం) వంటి అనేక కార్యక్రమాల్లో దేనిలోనైనా గద్దర్ ఉండవలసిందే. మరొక పక్క ఇతర రాష్ట్రాలలో జరిగిన అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి (ఆల్ ఇండియా లీగ్ ఫర్ రెవల్యూషనరీ కల్చర్ – ఎ ఐ ఎల్ ఆర్ సి) ప్రారంభ మహాసభలు ఢిల్లీ (1983 అక్టోబర్), రెండో మహాసభలు సింద్రీ ( అక్టోబర్ 1985), మూడో మహాసభలు కలకత్తా (అక్టోబర్ 1988), నాలుగో మహాసభలు త్రిస్సూర్ (1990), ఇతర స్థానిక సంస్థల సభలు వంటి అన్ని చోట్లా గద్దర్, జననాట్యమండలి అవిభాజ్య ఆకర్షణలు.

ఈ వరుసలో 1978 వరంగల్ ఆర్ ఎస్ యు సభలు ఎమర్జెన్సీ చీకటిరోజుల తర్వాత మొట్టమొదటి సభలు. అక్కడికి ఆయన విద్యార్థి అమరవీరుల మీద అజరామర రోమాంచకారి గీతం ‘లాల్ సలాం లాల్ సలాం’, గిరాయిపల్లి అమరవీరుల మీద ‘వోలీ వోలీల రంగ వోలీ’ రాసి తీసుకొచ్చి అక్కడే మొదటిసారి పాడాడు. టటడడాం అని ఆయన ఆలాపన ఎత్తుకుంటే సభ మొత్తం కన్నీళ్లలో తడిసిపోయిన, కసితో రగిలిపోయిన జ్ఞాపకం ఇప్పటికీ తడి తడిగా ఉన్నది. అలాగే అప్పుడే గిరాయిపల్లి అమరవీరుల మీద ‘నక్సల్ బరి బిడ్డలు’ ఒగ్గుకథ రాసి ఆ తర్వాత ఏడు సంవత్సరాల్లో ఎన్నో డజన్ల చోట్ల ప్రదర్శించారు. ఇంద్రవెల్లి మారణకాండ నేపథ్యంలో 1981లో ఆయన తయారు చేసిన రగల్ జెండా బ్యాలే (బహుశా మద్రాసులో 1981 ఆగస్టులో రాడికల్ విద్యార్థి సంఘం నిర్వహించిన జాతుల సమస్య సదస్సు సందర్భంగా మొదటిసారి ప్రదర్శించారు) ఆ తర్వాత నాలుగేళ్లలో వందలాది చోట్ల ప్రదర్శన జరిగింది. ఈ కాలంలో సంజీవ్, రాజనర్సింహ, దివాకర్, సుబ్బారావు, శారద, రమేశ్, కుమారి, పద్మ, దయ, కెసి, ఇవి వంటి ఎందరెందరో కొత్త కొత్త గాయకులు, కళాకారులు ఆ మహా ప్రవాహంలో కలిశారు. అలా ఆ ఏడు సంవత్సరాల్లో గద్దర్ ను, జననాట్యమండలిని కనీసం వంద చోట్ల వేరు వేరు పాటల్లో, ప్రదర్శనల్లో, అభినయాల్లో చూసి ఉంటాను. ఆ క్రమంలో పాటలో, హావభావాలలో, అభినయంలో గద్దర్ ను అనుకరించేవాళ్లు కూడా ఎందరో ప్రతి జిల్లాలోనూ పుట్టుకొచ్చారు.

ఆ తొలిరోజుల్లోనే గద్దర్ మాటలను అక్షరీకరించే అరుదైన అవకాశం ఒకటి నాకు వచ్చింది. 1979 జనవరిలో వరంగల్ విరసం సాహిత్య పాఠశాలలో ఒక సెషన్ లో ‘ప్రజల పాటలు – అనుభవాలు’ అని గద్దర్, వంగపండు ప్రసాద్, అరుణోదయ రామారావు అద్భుతమైన ఉపన్యాసాలు చేశారు. గద్దర్ తన పాటల అభివృద్ధి క్రమాన్ని వివరించిన తొలి ఉపన్యాసాలలో అది ఒకటి. ఇసామియా కాలేజీలో చుట్టూ తరగతి గదుల మధ్య ఖాళీ మైదానంలో అది వింటున్నప్పుడే అక్కడ ఉన్న అందరూ మైమరిచిపోయారు. అంత గొప్ప ఉపన్యాసం అచ్చులో, పుస్తక రూపంలో వచ్చి, ఆ రోజు అక్కడ వినలేకపోయినవారికి కూడ అందుబాటులోకి రావాలని అందరూ అనుకున్నారు. అప్పటికి సృజన దగ్గర ఉండిన టేప్ రికార్డర్ లో ఆ మూడు ఉపన్యాసాలూ రికార్డ్ అయ్యాయి. ఆ కాసెట్లు వింటూ, రాస్తూ, మళ్లీ మళ్లీ రివైండ్ చేస్తూ మళ్లీ విని రాసినది దిద్దుతూ ఆ మూడు గంటల ఉపన్యాసాల్ని కొన్ని గంటల పాటు పదే పదే విన్నాను. అలా ఆ ముగ్గురి గొంతులూ నాలో మార్మోగాయి. అలా రాసిన కాపీ ఆ సెప్టెంబర్ లో తిరుపతి లో జరిగిన విరసం సభల నాటికి పుస్తకరూపంలో వచ్చింది.

ఈ అన్ని సభల సందర్భంగానో, ‘గ్రామాలకు తరలండి’ క్యాంపెయిన్ కోసమో క్రాంతి ప్రచురణలు తరఫున జననాట్యమండలి పాటల పుస్తకం ప్రచురణ జరిగేది. మొదటి సారి 1979 మార్చ్ లో వెలువడిన ఆ పుస్తకం 1985 జూన్ నాటికి పది ముద్రణలు పొందింది. మొదటి రెండు ముద్రణలూ (మార్చ్, జూన్ 1979) రెండు వేల కాపీల చొప్పున, మూడో ముద్రణ (ఏప్రిల్ 1980) పదివేల కాపీలు, నాలుగో ముద్రణ (మే 1981) ఆరు వేల కాపీలు ప్రచురణ జరిగాయంటే ఆ పాటలు ఎంత తక్షణ విశేష ఆదరణ పొందాయో అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ అచ్చయిన ప్రతుల వివరాలు వేయడం మానేశారు గాని, ఎనిమిదో ముద్రణ (మే 1984) అచ్చుపనిలో నాకూ కాస్త భాగం ఉంది గనుక అది పంచుకోవాలి. అప్పటిదాకా ఏడు ముద్రణల్లో మొత్తం ముప్పై, ముప్పై ఐదు వేల కాపీలు అచ్చు వేసి ఉంటారు. కాని వెంట వెంటనే ‘గ్రామాలకు తరలండి’ క్యాంపెయిన్లలో, మహాసభల్లో అమ్మకాలతో ఒక్క కాపీ కూడ మిగలకుండా పోయాయి. అందువల్ల ఎనిమిదో ముద్రణ ఆఫ్ సెట్ లో లక్ష కాపీలు వేయించాలని క్రాంతి ప్రచురణలు నిర్ణయించింది. ఆఫ్ సెట్ ముద్రణ సౌకర్యాలున్న ప్రెస్ లు అప్పటికి హైదరాబాద్, విజయవాడల్లో రెండు మూడే ఉండేవి. అక్కడ అచ్చు పని ఖరీదు ఎక్కువ కావడం, మద్రాసులో, శివకాశిలో ఆఫ్ సెట్ ముద్రణ చాల చౌక కావడం వల్ల, ఈ సారి అచ్చుకోసం మద్రాసు పంపాలని అనుకున్నారు.

ఈ ఎనిమిదో ముద్రణ గురించి 1984 ఏప్రిల్ లో తిరుపతిలో జరిగిన చర్చలలో నేనూ ఉన్నాను. క్రాంతి ప్రచురణల బాధ్యుడు, అప్పటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రహ్లాద్ (కోటేశ్వరరావు) ఎల్ ఎస్ ఎన్ మూర్తికీ, నాకూ ఆ బాధ్యత అప్పగించాడు. అప్పటికి జననాట్యమండలి పాటల పుస్తకానికి జూన్ 1979 లో రెండవ ముద్రణ సందర్భంగా రాసిన ముందుమాట, నాలుగో ముద్రణ సందర్భంగా రాసిన ముందుమాట ఉన్నాయి. ఇప్పుడు మొదటిసారి లక్ష కాపీల అచ్చుకు వెళ్తున్న సందర్భంగా కొత్త ముందుమాట ఒకటి ఉండాలని ప్రహ్లాద్ అన్నాడు. అందులో ఏముంటే బాగుంటుందో సూచిస్తూ నన్ను ఆ ముందుమాట రాయమన్నాడు. ఆ తర్వాత కూర్పులన్నిటికీ ఆ మూడు ముందుమాటలూ ఉన్నాయి. ఎల్ ఎస్ ఎన్ మూర్తి, నేను మద్రాసు వెళ్లి, సెంట్రల్ దగ్గర ఏదో ఒక చిన్న లాడ్జిలో ఉండి, ఆఫ్ సెట్ ప్రెస్సుల చుట్టూ తిరిగి, పుస్తకం అచ్చుకు ఇచ్చి వచ్చాం. అప్పటిదాకా కేవలం ఏదో ఒక రంగు టింట్ బ్లాక్, మరొక రంగులో జననాట్యమండలి పాటలు అనే అక్షరాలు ఉంటూ వచ్చిన ముఖచిత్రం మొదటిసారి రంగుల్లో జననాట్యమండలి దళాల వేరు వేరు ప్రదర్శనల ఫొటోలతో వచ్చింది. 1979 నుంచి 1985 వరకు పది ముద్రణలు జరిగిన ఆ పుస్తకం, 1985-89 నిర్బంధ కాలంలో ఒక్కసారి కూడ అచ్చు కాలేదు.

1985లో, ఎన్ టి రామారావు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రారంభించి రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలపై పెద్ద ఎత్తున నిర్బంధకాండ అమలు కావడం మొదలయింది. 1985 మేలో రాజమండ్రిలో జరగవలసి ఉండిన రైతుకూలీ సంఘం మహాసభలకు నెల ముందే వాలంటీర్ల శిబిరం మీద దాడి చేసి, అరెస్టు చేసి, అక్రమ కేసులతో జైలులో నిర్బంధించారు. ఆ సెప్టెంబర్ లో వరంగల్ లో డా. రామనాథం గారిని పట్టపగలు ఆయన క్లినిక్ లోకి జొరబడి కాల్చి చంపేశారు. 1986 జనవరిలో పలాసలో జరగవలసిన విరసం మహాసభలు జరగకుండా అడ్డుపడ్డారు. 1986 నవంబర్ లో కరీంనగర్ శివార్లలో పౌరహక్కుల సంఘం నాయకుడు జాపా లక్ష్మా రెడ్డి ఇంట్లోకి జొరబడిన పోలీసులు ఆయనను కాల్చి చంపారు. రాష్ట్రమంతటా ఎందరో విప్లవకారులను, సానుభూతిపరులను విచ్చలవిడి ఎన్ కౌంటర్ లలో హత్య చేశారు. 1987 మార్చ్ – మే లలో విశాఖపట్నం జిల్లా చింతపల్లి అడవుల్లో 46 ఆదివాసి గూడాల్లో 638 ఇళ్లను పోలీసులు తగులబెట్టారు. వందలాది మంది మీద అక్రమంగా టాడా కేసులు పెట్టారు. అలా మొదలైన ఆ దారుణ నిర్బంధ కాండను స్వయంగా ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు ‘ఆట పాట మాట బంద్’ అని నిర్వచించాడు. ఆ నిర్బంధకాండ గురించి దేశమంతా ప్రచారం చేసి, తెలుగు ప్రజలకు, పోరాటాలకు సంఘీభావం సాధించడం కోసం 1985 జూలై లో ఎ ఐ ఎల్ ఆర్ సి నాయకత్వంలో దేశవ్యాప్త పర్యటన కోసం వెళ్లిన బృందంలో గద్దర్ కూడా నాగపూర్, భిలాయి వెళ్లాడు. ఆ పర్యటన నుంచి కారంచేడు మారణకాండ సమయంలో వెనక్కి వచ్చి, ఆ తర్వాత రాష్ట్రంలో మరింత తీవ్రమైన దమనకాండ జరుగుతుండడంతో అజ్ఞాతవాసానికి వెళ్లాడు. ఎక్కువకాలం అహ్మదాబాద్, సూరత్ లలో, కొంతకాలం దండకారణ్యంలో ఉన్నాడని అటాటలుగా వార్తలు వస్తుండేవి.

అప్పుడు ఆంధ్ర పత్రికలో సబెడిటర్ గా ఉన్న నా దగ్గరికి బహుశా 1988 చివరిలో దాదాపు మూడు నాలుగు వందల పేజీల రాత ప్రతులు వచ్చాయి. చూస్తే గద్దర్ చేతి రాత. గద్దర్ అజ్ఞాతవాసం వీడి బహిరంగ జీవితంలోకి వస్తే బాగుంటుందని, కాని బైటికి రాగానే అరెస్టు చేసి జైలుకు పంపుతారా, ఎన్ కౌంటర్ పేరుతో కాల్చేస్తారా అనుమానాలు ఉన్నాయని, అందువల్ల గద్దర్ అజ్ఞాతవాసం నుంచి సురక్షితంగా బైటికి వస్తే బాగుండుననే ప్రజాభిప్రాయాన్ని నిర్మించడానికి ఏమి చేయాలో ఆలోచించాలని, ఈ రచనలు ఆ పనిలో ఉపయోగపడితే ఉపయోగించుకోవాలని కబురు. అప్పటికే హైదరాబాదులో కన్నబిరాన్ గారి నాయకత్వాన కొందరు మేధావులు, ప్రజాస్వామికవాదులు అజ్ఞాతవాసం వీడి రావాలని గద్దర్ కు, గద్దర్ అజ్ఞాతవాసం వీడి వస్తే ప్రాణహాని తలపెట్టవద్దని, తెలుగు జాతి గర్వించే ఆ వాగ్గేయకారుడి భద్రతకు హామీ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ పత్రికా సమావేశం నిర్వహించారు, సంతకాల ప్రకటన విడుదల చేశారు.

నాకు అందిన రాత ప్రతులన్నీ చదివితే అవి మూడు వేరు వేరు పుస్తకాలుగా ఉన్నాయి. ఒకటి, విప్లవ సాంస్కృతికోద్యమ నిర్మాణ సమస్యల మీద గద్దర్ రాసిన సిద్ధాంతపత్రం లాంటి సూచనలు, సలహాలు, అభిప్రాయాలూ. రెండోది, ప్రతి పాట వెనుక ఒక కథ ఉందా అని తనను తానే ప్రశ్నించుకుని, ఒక్కొక్క పాటకు ఒక కథ చెపుతూ దాదాపు ముప్పై పాటలకు రాసిన వివరణలు. మూడోది, పాట పుట్టుక, విప్లవ పాట పరిణామం వంటి అనేక అంశాల మీద తానే ప్రశ్నలు వేసుకుని జవాబులు చెపుతూ రాసిన సిద్ధాంత గ్రంథం.

అప్పటికి సికింద్రాబాద్ కుట్రకేసు కొట్టుడుపోయి, రాంనగర్ కుట్రకేసులో బెయిల్ తీసుకుని వివి విడుదలై హైదరాబాద్ లో ఉన్నారు. సృజన పునఃప్రారంభించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాం. 1989 ఎన్నికలలో ఎన్ టి రామారావు తెలుగు దేశం ఓడిపోయి, చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఉద్యమాల మీద నిర్బంధాన్ని సడలించక తప్పదనే సూచనలు మొదలయ్యాయి. ఆ దశలో 1990 జనవరిలో హైదరాబాదులో జరిగిన విరసం ఇరవై ఏళ్ల మహాసభల నాటికి సృజన ప్రారంభించాం. సృజన ప్రచురణగా గద్దర్ రాసిన ‘సాంస్కృతికోద్యమ నిర్మాణ సమస్యలు’ పుస్తకం ప్రచురించాం. సృజన ఫిబ్రవరి సంచిక గద్దర్ అజ్ఞాతవాసం నుంచి బైటికి వస్తున్న సందర్భంగా ‘జననాట్యమండలికి విప్లవాభినందనలు’ అని ప్రత్యేక సంచికగా వెలువరించాం. ఆ సంచికలో ‘ప్రభంజన నాట్యం’ అనే సంపాదకీయం, అప్పటికింకా అచ్చు కాని గద్దర్ ‘తరగని గని’ నుంచి ‘ప్రజా సంగీతం – పట్టించుకోవలసిన సంగతులు’ అనే అధ్యాయం, కొన్ని ఎంపిక చేసిన జననాట్యమండలి పాటలు, గుగి వా థియోంగో నవల ‘మట్టికాళ్ల మహారాక్షసి’ లో ప్రజా సంగీతం గురించి భాగాలు, విక్టర్ యారా గురించి మిగ్యూల్ కాబెజాస్ సంస్మరణ వ్యాసం వంటి రచనలున్నాయి.

గద్దర్ రాతప్రతుల్లో రెండో పుస్తకం, ‘ప్రతి పాట వెనుక ఒక కథ ఉందా’ ఏదైనా ప్రధాన స్రవంతి పత్రికలో ధారావాహికగా వస్తే గద్దర్ పేరు మళ్లీ ఒకసారి ప్రజల ముందుకు బలంగా వస్తుందనీ, అది ఆయన సురక్షితంగా బైటికి రావడానికి ఉపయోగపడుతుందనీ ఆలోచించాం. గద్దర్ రాసిన ముప్పైకి పైగా కథనాల్లోంచి ఇరవయో, ఇరవై రెండో ఎడిట్ చేసి, తిరగరాసి, అప్పటి ఆంధ్ర జ్యోతి వారపత్రిక ఎడిటర్ తోటకూర రఘు దగ్గరికి వెళ్లాను. ఆయన నా ప్రతిపాదన విని ఎగిరి గంతేశాడు. ‘తప్పకుండా వేద్దాం, ఆ ధారావాహికకు మీరే ఒక కర్టెన్ రేజర్ రాయండి, ఇరవై వారాలు గడిచాక ఒక ముగింపు రాయండి, విడిగా గద్దర్ మీద ఒక వ్యాసం రాయండి’ అని చాలా ఉత్సాహపడ్డాడు. అప్పటికి ఆంధ్ర పత్రిక ఉద్యోగిగా ఉన్న నేను మరొక పత్రికలో నా పేరుతో రాయడానికి వీలు లేదు. అందువల్ల పేరు లేకుండా ఒక కర్టెన్ రేజర్ (‘గళం విప్పనున్న గద్దర్’, నవంబర్ 17, 1989), ఒక ముగింపు (‘సాహిత్యంలో ప్రజాధికారానికి ప్రతీక గద్దర్’, ఏప్రిల్ 27, 1990), మారుపేరుతో ఒక వ్యాసం (‘ప్రవాసం నుంచీ ప్రజ్వలించే గద్దర్ గళం’, నవంబర్ 17, 1989) రాసి ఇచ్చాను.

గద్దర్ గురించి ఆంధ్ర జ్యోతికే అలా మూడు రచనలు చేసినప్పుడు, పనిచేస్తున్న ఆంధ్ర పత్రికకు రాయకపోతే ఎలా అని అజ్ఞాతవాసం నుంచి బైటికి వస్తున్నందుకు స్వాగతం చెపుతూ ఒక వ్యాసం (‘గాలిలో మళ్లీ గద్దర్ గళం’, ఫిబ్రవరి 18, 1990) ప్రచురించాను. అప్పటికి ఆదివారం అనుబంధం బాధ్యుడిగా, ఆ అనుబంధంలో నేను రాస్తుండిన ‘కడలితరగ’ శీర్షికలో గద్దర్ అజ్ఞాత వాసం నుంచి బైటి రావాలంటూ ఒక వారం (‘గద్దర్ దృశ్యాదృశ్యాలు’, డిసెంబర్ 3, 1989), ఆయన బైటికి వచ్చాక మరొక వారం (‘జనగానం జయజయధ్వానం’, మార్చ్ 4, 1990) రాశాను. అప్పుడే దక్కన్ క్రానికల్ విజయవాడ ఎడిషన్ ఇన్ చార్జిగా ఉండిన కె ఎన్ టి శాస్త్రి గారు గద్దర్ అజ్ఞాతవాసం వీడి రావడం మీద ఒక వ్యాసం రాసిపెట్టమన్నారు. ‘రెవల్యూషనరీ రాప్సొడీస్’ అనే ఆ వ్యాసం ఫిబ్రవరి 24, 1990న అచ్చయింది.

ఫిబ్రవరి 18న హైదరాబాదు రమ్మని నాకు కబురు పంపారు గాని, ఏవో పనుల ఒత్తిడి వల్ల రాలేక, ఆ చరిత్రాత్మక సందర్భంలో ఉండలేకపోయాను. ఆ రోజే గద్దర్ అజ్ఞాతవాసం నుంచి బైటికి వస్తున్నానని ప్రకటించడానికి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో పత్రికాసమావేశం జరిగింది. ఆ వార్త మర్నాడు పత్రికల్లో వచ్చాక, మరుసటి రోజు నిజాం కాలేజి గ్రౌండ్స్ సభ సమయానికి వచ్చాను. అప్పటి నుంచి ఆ సంవత్సరమంతా మళ్లీ రాష్ట్రమంతటా ఎన్నెన్నో సభలు జరిగాయి. మేలో వరంగల్ లో జరిగిన రైతుకూలీ సంఘం మహాసభలు ఆ కాలానికి మాత్రమే కాదు, ఎల్లకాలానికీ చిరస్మరణీయమైన, జాజ్వల్యమానమైన సభలు. పన్నెండు లక్షల మంది హాజరైన బహిరంగ సభ అనీ, అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అతి ఎక్కువమంది ప్రజలు పాల్గొన్న సభల్లో అది ఒకటనీ ప్రధాన స్రవంతి పత్రికలే రాశాయి. ఆ సభల్లో గద్దర్ తొలిసారి ‘జైబోలోరె జైబోలో’ అనే అద్భుతమైన, అనేక రకాలుగా విస్తరించడానికి అవకాశం ఉన్న అమర సంస్మరణ గీతం పాడాడు. అలా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సభల్లో భాగంగా విజయవాడలో కూడ గద్దర్ సభ ఏర్పాటు చేయాలని అప్పుడు కృష్ణాజిల్లా యూనిట్ విరసంలో అనుకున్నాం. విజయవాడ జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన పెద్ద బహిరంగ సభకు అప్పటికి ఆ యూనిట్ కన్వీనర్ బాధ్యతలు నిర్వహిస్తున్న నేనే అధ్యక్షత వహించాను.

తర్వాత కొన్నాళ్లకే ఆంధ్ర పత్రిక మూతబడే స్థితి రావడంతో నేను హైదరాబాదు వచ్చి సమయంలో చేరి అడిక్ మెట్ లో ఉంటున్నప్పుడు, గద్దర్ మూడో పుస్తకం పని మొదలుపెట్టాం. పాట గురించీ, విప్లవ పాట గురించీ, ప్రజా సంగీతం గురించీ ఎన్నెన్నో అద్భుతమైన వివరణలూ, విశ్లేషణలూ ఉన్న ఆ పుస్తకం మీద చర్చ కోసం రెండు మూడు రోజులు గద్దరూ నేనూ ఆ అడిక్ మెట్ గదిలో కింద నేల మీద కూచుని చేసిన సంభాషణలూ, ఆ రచనలో మార్పులూ చేర్పులూ ఇంకా గుర్తొస్తూనే ఉన్నాయి. ఆ పుస్తకానికి నేను సూచించిన ‘తరగని గని’ పేరే ఖరారు చేసి, 1992 లో జన నాట్య మండలి ప్రచురణగా తానే ప్రచురించాడు.

తర్వాత అప్పుడే ముప్పై సంవత్సరాలు గడిచిపోయాయి. అందులో కనీసం పదిహేను సంవత్సరాలు ఖైదీల ఆందోళన, మృతదేహాల స్వాధీన కమిటీ, ప్రభుత్వంతో తొలివిడత చర్చలు (2002), గుజరాత్ గాయం (2002), మలివిడత చర్చలు (2004), తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజా ఫ్రంట్ సందర్భాలలోనూ, సభల్లోనూ రెగ్యులర్ గా కలుసుకుంటూనే ఉన్నాం. కలిసినప్పుడు ప్రేమగానే ఉండే వాడు గాని ఏదో తెలియని దూరం ప్రవేశించినట్టు అనిపించేది. అంతకు ముందు లాగనే కలిసినప్పుడు ప్రేమగా దగ్గరికి తీసుకునేవాడు. జోకులు వేసేవాడు. బనాయించేవాడు. ఒక్కొక్కప్పుడు చనువుగా రారా పోరా అని కూడ అనేవాడు. కాని దూరం జరగడం మొదలయిందనుకుంటాను.

తన మీద 1997 ఏప్రిల్ 6న రాజ్య ప్రేరేపిత మాఫియా ముఠాలో, పోలీసులో చేసిన హత్యాప్రయత్నం మనసు మీద ఒక పెద్ద ఆఘాతం. ఆ హత్యా ప్రయత్నం మీద ఆందోళన క్రమంలో ఇంగ్లిష్ లో ఒక వ్యాసం రాసి ఇపిడబ్ల్యు కు పంపాను గాని వాళ్లు వెయ్యలేదు. తర్వాత 2012 లో నా పుస్తకం ‘అండర్ స్టాండింగ్ మావోయిస్ట్స్’ లో ఆ వ్యాసం చేర్చాను. 2001 లో పరిటాల రవి హత్య జరిగాక, ఆ అంత్యక్రియలకు వెళ్లి రవి మీద అమరవీరుడు అంటూ పాట పాడడం మీద అప్పుడు నేను ప్రజాతంత్ర వారపత్రికలో రాస్తుండిన కాలమ్ లో ఒక వాక్యమో, రెండు వాక్యాలో విమర్శ రాశాను. వెంటనే గద్దర్ ప్రజాతంత్ర వారపత్రికకు ఫోన్ చేసి, నన్నూ వాళ్లనూ తిట్టి, ‘ఇక నుంచి నాకు పత్రిక పంపకండి’ అన్నాడని వాళ్లు చెప్పారు. అలా దూరం ఇంకా పెరిగిందనిపించింది.

సరిగ్గా అప్పుడే పెద్ది రామారావు నడుపుతుండిన రంగస్థల పత్రిక యవనిక జననాట్యమండలి ముప్పై ఏళ్ల సందర్భంగా ప్రత్యేక సంచిక వేసి, నన్ను జనామం చరిత్ర రాయమంటే సుదీర్ఘ వ్యాసం రాశాను. దాని మీద తాను ఏమంటాడో విందామని చాల కోరికగా ఉండేది. కాని ఆ రోజుల కోపం వల్ల కావచ్చు, కలిసినప్పుడు కూడా ఎప్పుడూ ఆ వ్యాసం మాటే ఎత్తలేదు. తన దగ్గరికి వచ్చేవాళ్లతో నా మీద ఏదేదో అంటున్నాడని అటాటలుగా తెలిసేది. అవి ఎంత నిజమో ఎంత కల్పనో తెలియదు. కలిసినప్పుడు మాత్రం బాగుండేవాడు.

తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఒకరోజు లోయర్ టాంక్ బండ్ అంబేడ్కర్ భవన్ లో ఇద్దరమూ వక్తలుగా వేదిక మీద ఉన్నాం. నాకు ఆ రోజు మధ్యాహ్నమే కరీంనగర్ జిల్లాలో కూడా ఒక సభ ఉండింది. నేను త్వరగా మాట్లాడి, వేదిక దిగి వెళుతుండగా, ‘ఇటువంటోళ్లను పిలవవద్దు. తాము మాట్లాడేది మాట్లాడి వెళ్లిపోతారు’ అని దురుసుగా, వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. నాకంటె పన్నెండేళ్లు పెద్దవాడు, నన్ను కోప్పడడానికి అన్ని అర్హతలూ ఉన్నవాడు.

నా గురించి ఏమన్నా, నాతో ఎట్లా ఉన్నా, అపార ప్రతిభావంతుడు, తెలుగు జాతి గర్వించదగ్గ వాగ్గేయకారుడు, జీవితంలో అతి ఎక్కువ భాగం ప్రజల కోసం వెచ్చించినవాడు, రాజ్య హత్యా యత్నానికి గురైనవాడు, నా కౌమార దశ నుంచీ అభిమాన గాయకుడు, కవి, సాంస్కృతికోద్యమ నాయకుడు అనే గౌరవం, ప్రేమ ఎప్పుడూ నన్ను వదలలేదు.

కాని చరిత్ర చెప్పవలసి వచ్చినప్పుడు మన స్వీయ మానసిక అభిప్రాయాలో దురభిప్రాయాలో, మితిమీరిన ప్రశంసలో అపోహలో, అతిశయోక్తులో విస్మరణలో లెక్కకు రావు. చరిత్ర కచ్చితమైనది, కఠినమైనది, కఠోరమైనది. నిష్కర్షగా, నిర్మోహంగా అన్నిటినీ నమోదు చేస్తుంది. అలా చేయకపోవడం, మనకు ఇష్టమైనవాటినే నమోదు చేయడం, ఇష్టం లేని వాటిని విస్మరించడం, వాస్తవంగా జరిగిన వాటిని మన దృష్టికోణం నుంచి వ్యాఖ్యానించడం, జరిగినదాన్ని జరగనట్టుగా, జరగని దాన్ని జరిగినట్టుగా నమోదు చేయడం మనుషులుగా మనం చేయవచ్చు గాని చరిత్ర చేయదు, చేయజాలదు. వాటిని లోపాలు అని ఒకరనుకోవచ్చు, అవి లేనే లేవని మరొకరనుకోవచ్చు, ఉన్నా గణించదగినవి కావని మరొకరనుకోవచ్చు. వాటికి లోపాలనో సుగుణాలనో విలువ ఆపాదిత అంచనాలుగా కాక, చరిత్ర పరిణామంలో జరిగిన, నమోదు చేయక తప్పని ఘటనలు అని మరొకరనుకోవచ్చు. ఎవరేమనుకున్నా చరిత్ర కోసమైనా చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా నమోదు చేయవలసిందే. తమ తమ ప్రయోజనాల కొరకు ఆయన మరణానంతరం ఆయనలో లోపాలే లేవని అంటున్నవాళ్లు చరిత్రకు అన్యాయం చేస్తున్నట్టే.

గంభీరమైన రాజకీయ వ్యాఖ్యానం చేస్తూ అప్పుడప్పుడు మధ్యలో దాన్ని పలుచబరచి హాస్యంగా మార్చడం, ఒక విషాద గంభీరమైన వాతావరణాన్ని అనవసరంగా పలుచన చేయడం వంటివి వ్యక్తిగత స్వభావపు వ్యక్తీకరణలు అని పక్కన పెట్టవచ్చు. కాని రాజకీయ, తాత్విక, సామాజిక, సాంస్కృతిక స్థాయిలలో అంతకన్న అభ్యంతరకరమైన ప్రవర్తనలు ఆయన జీవితపు చివరి దశాబ్దంలో పొడసూపాయి. ఏ పార్లమెంటరీ రాజకీయాలకు వ్యతిరేకంగా నాలుగు దశాబ్దాలు తన కలాన్నీ, గళాన్నీ, యావత్ శక్తినీ వినియోగించాడో, ఆ పార్లమెంటరీ రాజకీయాలను సమర్థించే వ్యాఖ్యలు చేశాడు. వోటు విప్లవం తేవాలన్నాడు. అటువైపు నుంచి ఆహ్వానం ఉన్నదో లేదో తెలియదు గాని, తానే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల నాయకుల సభలకు, నాయకుల దగ్గరికి వెళ్లడం మాత్రమే కాదు, వారిని కౌగిలించుకోవడం, కడుపులో తల పెట్టడం, ముద్దు పెట్టుకోవడం వంటి తన స్థాయికి ఎంతమాత్రం తగని పనులు చేశాడు. పవన్ కళ్యాణ్, కె ఎ పాల్ వంటి వారి రాజకీయ ప్రయత్నాలలో కూడా పాల్గొన్నాడు. ఈ రాజకీయ వైఖరులు అలా ఉంచి, బౌద్ధాన్ని విశ్వసిస్తున్నట్టు ప్రకటిస్తూ, దళిత చైతన్యాన్ని ఎత్తిపట్టడమే తన ఆశయమని అంటూ, ఆ అవగాహనలకు పూర్తిగా వ్యతిరేకంగా హిందూ బ్రాహ్మణీయ గుళ్లూ గోపురాలూ తిరగడం మొదలుపెట్టాడు. అది కూడా ఊరికే చూడడానికి వెళ్లడమో, ప్రజలు నమ్మే ఒక సాంస్కృతిక ఆచారాన్ని గౌరవించడంలో భాగంగానో కూడ కాదు, అత్యంత దుర్మార్గమైన హైందవ బ్రాహ్మణీయ మనువాద సంప్రదాయాలను పాటిస్తున్న సూచనలు ఇచ్చాడు. పూజారుల ముందు వంగి శఠగోపం పెట్టించుకోవడం, బొట్లూ తిలకాలూ దిద్దించుకోవడం, శిరసు వంచి ఆశీర్వాదాలు వేడుకోవడం, ఒక భూకబ్జా కోరునూ, రాజకీయ దళారీనీ సమర్థిస్తూ ఆ దుర్మార్గ భావజాలాన్ని సమతా మూర్తి అంటూ పాటలు పాడడం వంటి పనులు చేశాడు. అటువంటివి చూసినప్పుడు, నలబై ఏళ్లుగా సన్నిహితంగా తెలిసిన ఎంత ఉజ్వలమైన, విప్లవకరమైన, అద్భుతమైన మనిషి ఎట్లా అయిపోతున్నాడు, సమాజ పురోగమనానికి ఎంతో ఇచ్చినవాడు, ఇవాళ ఎంతగా సమాజ తిరోగమనంలో భాగమవుతున్నాడు అని విచారం కలిగేది.

ఆ చివరి పది పదిహేను సంవత్సరాల వైరుధ్యాలో, భిన్నాభిప్రాయాలో, వైమనస్యాలో ఉన్నప్పటికీ, మరణం ఆ వైరుధ్యాలన్నిటికీ ముగింపు పలికింది. ఇప్పుడిక కొట్లాడడానికీ, విమర్శించడానికీ, కోపం తెచ్చుకోవడానికీ, విసుర్లు విసరడానికీ, తన విసుర్లు భరించడానికీ ఆ మనిషే లేడు. చరిత్ర మిగిలి ఉంది. తన ఉజ్వలమైన ప్రజానుకూల కార్యాచరణా, అంతే విచారకరమైన చివరి రోజుల ప్రవర్తనా మిగిలి ఉన్నాయి. ఒక గుమ్మడి విఠల్ బాబు గద్దర్ గా పరివర్తన చెంది నాలుగు దశాబ్దాలు తెలుగు సమాజాన్ని ప్రభావితం చేసి, చివరికి మళ్లీ వెనక్కి వెళ్ళి గుమ్మడి విఠల్ రావుగా మారడం జరగదు. కాని మరేదో కావాలనుకుని ప్రయత్నించాడు, కాలేకపోయాడు.

ఆ చివరి రోజుల ప్రవర్తన ఎలా ఉన్నా, అంతకు ముందు నలబై ఏళ్లు పాడి, ఆడి, మాట్లాడి, ఊగించి, ఉత్తేజపరిచి, నవ్వించి, ఏడిపించి, శాసించి ఎందరెందరి జీవితాలనో మార్చిన, తీర్చిదిద్దిన, ప్రజా ఉద్యమ మార్గంలోకి నడిపించిన గద్దర్ అజరామరం. గుమ్మడి విఠల్ బాబు అనే ఒక సామాన్యుడిని గద్దర్ అనే అసామాన్యుడిగా మలచినదీ, ఆ అపూర్వ రసాయనిక సమ్మేళన ప్రయోగం నిర్వహించినదీ విప్లవోద్యమం, ప్రజా ఉద్యమం, ప్రజా జీవితం. ఆ అద్భుత ప్రయోగాన్ని సన్నిహితంగా చూసే అవకాశం దొరకడం ఒక అరుదైన అసాధారణ అనుభవం.

పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు.
ర‌చ‌న‌లు: 'స‌మాచార సామ్రాజ్య‌వాదం', 'క‌ల్లోల కాలంలో మేధావులు - బాల‌గోపాల్ ఉదాహ‌ర‌ణ‌', 'అమ్మ‌కానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌', 'క‌థా సంద‌ర్భం', 'క‌డ‌లి త‌ర‌గ‌', 'పావురం', తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛిన‌మ‌వుతున్న వ్య‌క్తిత్వం, 'పోస్ట్‌మాడ‌ర్నిజం', 'న‌వ‌లా స‌మ‌యం', 'రాబందు నీడ‌', 'క‌ళ్ల‌ముంద‌టి చ‌రిత్ర‌', 'ప‌రిచ‌యాలు', 'తెలంగాణ‌ - స‌మైక్యాంధ్ర భ్ర‌మ‌లు, అబ‌ద్ధాలు, వాస్త‌వాలు', 'శ్రీశ్రీ అన్వేష‌ణ‌', 'లేచి నిలిచిన తెలంగాణ‌', 'ప్ర‌తి అక్ష‌రం ప్ర‌జాద్రోహం - శ్రీకృష్ణ క‌మిటీ నివేదిక‌', 'రాబందు వాలిన నేల‌', 'ఊరి దారి- గ్రామ అధ్య‌య‌న ప‌రిచ‌యం', 'విద్వేష‌మే ధ్యేయంగా విశాలాంధ్ర మ‌హార‌భ‌స‌', 'క‌విత్వంతో ములాఖాత్‌', 'సమాజ చలనపు సవ్వడి', 'కాషాయ సారం', 'విద్వేషాపు విశ్వగురు', 20కి పైగా అనువాదాలు.
సంపాద‌క‌త్వం: 'Fifty Years of Andhrapradesh 1956-2006', 'Telangana, The State of Affairs', '24గంట‌లు', 'హైద‌రాబాద్ స్వాతంత్య్ర సంరంభం', 'జ‌న హృద‌యం జ‌నార్ద‌న్‌', 'స‌మ‌గ్ర తెలంగాణ' పుస్త‌కాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

Leave a Reply