ఖాళీ షాహీన్ బాగ్

లేకుండా ఉండటం, వీరులకే చేతనవును
— కె. శివారెడ్డి

మనల్ని చూడ్డానికి ఇప్పుడెవరొచ్చినా
యమునా నది జండాగా ఎగురుతున్న వొడ్డు దగ్గరకి తీసుకురండి

ఒప్పుకుంటూనో, తప్పుబడుతూనో
సమస్యగా చూసే స్వదేశీయుల్తోనో; సంధి చేస్తామనే విదేశీయుల్తోనో
ఎవర్తో వచ్చినా సరే, భయం రక్త నాడులు చిట్లి
గాయపడ్డ నది మహోగ్ర ప్రవాహ దిశలోకి మళ్ళుతున్న వైపుకి రండి

పుట్టిన ఇన్నేళ్ళ తర్వాత, మట్టిలో ఎరువైన పురాగాయాల్ని ఆరా తీసి
‘మీరేదేశ మతనిషేధ’ గర్భకోశంలోంచి పేగుతెంచుకున్న నేరగాళ్ళని
అడిగిన దేవుళ్ళందర్నీ, ఒకే గుర్తింపు కార్డు కోసం
దిసమొలతో నిలబెట్టిన క్యూ దగ్గరకి రండి

అప్పటి దాకా కూర్చున్నవాళ్ళు,
నిల్చున్నవాళ్ళు, ఆకుమడిలా పచ్చగా నవ్వుతున్నవాళ్ళు
రోజుల్ని బంతులు చేసి దోగాడిన పసిపిల్లలకక్కడ పాలు తాపిస్తున్నప్పుడు
వాళ్ళ చున్నీల్లోంచో బురఖాల వెనగ్గానో సూర్యచంద్రులు తప్పించుకు తిరగలేదా?

నిరసన కొమ్మలమీంచి పక్షులెగిరిపోయిన దృశ్యాన్నే చూస్తున్నారా?
వాళ్ళు రెక్కలు నిమురుకుంటూ పాడిన విప్లవగీతాల్ని
తలమీది నీడగా కప్పారు
దాన్నే తుఫాను గాలీ పెకలించలేదు
ఏలినవారి చావిడి గుంజకి కట్టేసిన మూగ పశువులా పడి వున్న దేశం
దుఃఖపు శైధిల్యాన్ని బద్దలుగొట్టిన ఆనవాళ్ళదగ్గరకి రండి

షాహీన్ బాగ్ ఖాళీ చేసిన ఆట స్థలం కాదు ; దమ్ము కొట్టిన పంట చేను
షాహీన్ బాగ్ ఫిరాయించడం నేర్పే చట్టసభ కాదు; మోసగాడి ముఖాన ఊసిన ఉమ్ము.
ఈ ఖాళీ రోడ్డు వీపు మీద లాఠీ చేతులు చరుస్తున్న చప్పట్లు వింటున్నారా?
కర్ఫ్యూ, నియంత కల లాంటిది; ఊక కుంపటిలో అది నిప్పారిపోయిందనుకోవచ్చు
షాహీన్ బాగ్, రేగిన అల్లర్ల దుమ్ము పీల్చుకున్న ముసలి అవ్వ ఊపిరితిత్తి;
దేశభక్తి చలి గాల్లో నాల్గు నెలల జహాన్ ని పోగొట్టుకున్న నాజియా నిరుపేద కడుపు

మీ అక్కా, చెల్లి కావొచ్చు, నను గన్న తల్లీ, సహచరి కూడా ఉండొచ్చు.
చెప్పి వచ్చి ఉండొచ్చు ; లేదా జామియా గుండెల మీద పొగ్గొట్టాలతో నొప్పి బొమ్మలనూది
ఊహకందనట్టు ఇక్కణ్ణుంచి అదృశ్యమయ్యెక్కడో ప్రత్యక్షమవ్వవచ్చు
ఎక్కడైతేనేం; అసలు వాళ్ళుండటంలోనే చైతన్య రహస్యమంతా దాగి లేదా?

దొడ్లో కుబుసం విడుస్తున్న
నల్ల త్రాచు పామునెప్పుడైనా దగ్గరగా చూశావా?
వేదనాగ్నిలోంచి విచ్చుకుంటున్న
స్వేచ్ఛా పుష్పపరిమళాన్నసలు పసిగట్టావా?

పుట్టింది తెనాలిలో, పెరిగింది విజయవాడలో. వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో బ్యాంకుజ్జోగం చేసుకుంటున్నారు. కవిత్వమూ, కవిత్వ విశ్లేషణ, సమీక్షా వ్యాసాలు రాస్తున్నారు. కవిసంగమం లో 'కవితా ఓ కవితా' శీర్షిక నిర్వహిస్తున్నారు. 'అద్వంద్వం' తనకి గుర్తింపు తెచ్చిపెట్టిన తొలి కవితా సంపుటి. +91 9963482597 మొబైల్ నంబర్లో అతన్ని పలకరించవచ్చు.

9 thoughts on “ఖాళీ షాహీన్ బాగ్

  1. చాలా పరవర్ఫుల్ గా ఉంది. కొత్త వర్షన్ షాహిన్ బాగ్ గురించి…

  2. చాలాబాగుంది. మంచి అంశాన్ని స్పృశించారు శ్రీరాం గారు.

  3. కొత్తవిషయాల్ని పొందుపరుచారు.బాగుందన్న!!

  4. కుబుసం విడుస్తున్న నల్లత్రాచు ని దగ్గర్నుంచి చూపించారు.. షాహీన్ బాగ్ ను, వివక్షా పర్వాలను దృశ్యమానం చేశారు.. కుడొస్..👍👍👌👌💐💐

  5. పడగవిప్పినట్టున్నది సార్….

  6. విన్న మొదటి సారే నచ్చింది మిత్రమా, మీ కలం పదునెక్కిన ఆయుధం. మీరు మాత్రమే రాయగల్గిన కవిత

  7. చాలా బాగుంది.జీవం నింపారు.

Leave a Reply