కష్టాల బాల్యమే నా అక్షరాలకు దారులేసింది : ఉదయమిత్ర (పార్ట్ – 4)

 1. మీ అనువాదాల గురించి చెప్పండి. ఒక కవిత, వ్యాసం, ఉపన్యాసాన్ని అనువాదం చేస్తున్నప్పుడు మీకు ఎదురైన సమస్యలు, మీరు పొందిన అనుభూతి గురించి చెప్పండి.

అనువాదాలు చాలానే చేశాను. కవితలు, వ్యాసాలతో పాటు మంటో రాసిన ఒక కథ కూడా అనువాదం చేశాను. అయితే నేను చేసినవన్నీ స్వేచ్ఛానువాదాలే. ఏ కవితను కూడా మక్కికి మక్కి అనువాదం చేయలేదు. నా వల్ల కాదు కూడా. పక్షిని ఎగరనిస్తేనే గదా, అది ఎంత ఎత్తుకు ఎగిరేది తెలిసిపోయేది.
అన్నీ ఇంగ్లిష్ నుండి తెలుగుకు అనువాదం చేశానే గాని, హిందీ జోలికి ఎప్పుడు పోలేదు. అది నా తప్పు కూడా. ఇప్పుడు అందరూ గుల్జార్ హిందీ కవితలను అనువాదం చేస్తుంటే, ఆయన మీద ప్రేమకొద్దీ హిందీ నేర్చుకోవాలనిపిస్తుంది.
*
అనువాదం అంటే ఒక కొత్త ప్రపంచాన్ని మనసారా కౌగిలించుకోవడం అన్నమాట. రచయిత, మూల రచయితతో పాటు తిరగాలి. వాళ్ళ అనుభూతులు, బాధలు మనవి కావాలి. వాళ్లు పరిచయం చేసిన నింగీ నేలా, చెట్టూ-పుట్టా, అవమానాలూ – సంఘర్షణలూ మనం సొంతం చేసుకోవాలి. సరిగ్గా చెప్పాలంటే మూల రచయిత మనలోకి పరకాయ ప్రవేశం చేయాలి.

భిన్నమైన రచనలను తాకుతున్నప్పుడు “వీళ్ళు ఇంత ఘర్షణ పడుతున్నారా” అనిపిస్తది. ఆఫ్గాన్ మహిళల కవితల్ని అనువాదం చేస్తున్నప్పుడు చిన్నచిన్న స్వేచ్ఛల కోసం వాళ్లు పడే ఆరాటం చూస్తే హృదయం కరిగిపోతుంది. వాళ్లు తాలిబాన్ పాలనను ఎంతటి దుర్మార్గంగా ఫీల్ అవుతారో, ఇంటిదగ్గర భర్తల చిత్రహింసల్ని అదే విధంగా ఫీల్ అవుతారు. వాళ్లు ఇండ్ల నుంచి పారిపోయి విదేశాలలో తలదాచుకున్నాక, తమ స్వేచ్ఛ కోసం గొంతు విప్పడం మొదలుపెట్టారు.
“వాళ్ళు విషాల్ని నింపారు.
కత్తుల్ని పంపారు
మంటలనెగదోశారు.
నరకం సృష్టించారు.
వాళ్ళు
అమ్మాయిల చితాభస్మం నుండి
స్వర్గాన్ని సృష్టిస్తారు”
*
పాలస్తీనా కవితలు ఎక్కువగా పరాయీకరణ మీద ఉంటాయి. రోజు రోజుకి తమ కాళ్ళ కింద భూమి కరిగిపోతుంటే మాతృభూమి కోసం వాళ్లు పడే ఆరాటం మనకు కనపడుతుంది.
“నేను అన్ని పదాలను తుడిచేసి
ఒకే ఒక్క పదం భద్రపర్చుకుంటా
దాని పేరు
పాలస్తీనా”
– దర్వేష్
*
అన్నింటికన్నా సాయిబాబా కవిత్వం అనువాదం చేయడం చాలా సులభంగా అనిపించింది. ఆయన చిన్నచిన్న పదాలు ఉపయోగిస్తూ, సులభంగా, పారదర్శకంగా కవితల్ని రాస్తాడు. ఆయన ఇంగ్లీషు కవితల్ని చదువుతుంటే తెలుగు కవితనే డైరెక్ట్ గా చదివినంత అనుభూతి కలుగుతుంది. సాయిబాబా కవిత అనుభవిస్తున్నప్పుడు పెద్దగా డిక్షనరీ చూడవలసిన అవసరం ఉండదు. అట్లాగే పెరుమాళ్, ఉన్నికృష్ణన్, కవితా లంకేష్, జెసింతా కెర్కెట్టా… వీళ్ళ కవితలు ఒక్క సిట్టింగ్ లో అనువదించగలిగాను. అంత సులభంగా ఉంటాయి.
*
కారల్ మార్క్స్ కవితల అనువాదం చాలా కష్ట తరమైంది. ఆ భావాలు చాలా చిక్కగా ఉంటాయి. వర్ణనలు కూడా ఒక పట్టాన అర్థం కావు. 21 సంవత్సరాల వయసులో, కవితల్లో ఆ సాంద్రత అనితర సాధ్యమేమో. ఓ రకంగా అవి ఇనుప గుగ్గిళ్ళలా ఉంటాయి. ఆయన కవితను అనువదించడానికి, నేను ఎన్నిసార్లు డిక్షనరీ రెఫర్ చేశానో నాకే తెలువదు.

అరుణతార ప్రతికకు ప్రతినెల మార్క్స్ కవిత అనువాదం ఒకటి పంపుతానని మాటిచ్చాను. కానీ ఆ కవితల్లోని కాఠిన్యత నన్ను ముందుకు సాగనివ్వలేదు.
“నాకు బలమైన రెక్కలు ఇయ్యి
సముద్రాన్ని ప్రతిధ్వనిస్తా”
ఇట్లాంటి వాక్యాల్ని అతనే రాయగలడేమో. ఆయన కవితకు నేను చేసిన అనువాదం “హృదయమే వీణ”కు బాగా పేరొచ్చింది. విజయవాడ మిత్రులు ప్రతిఏటా తెచ్చే కవితా సంకలనంలో దాన్ని చేర్చుకొని, అట్ట వెనుక కవితను ప్రచురించి కవితకు సముచిత స్థానం ఇచ్చారు.
*
ఆ తర్వాత నేను కొన్ని హరగోపాల్ సార్ వి కూడా అనువాదం చేశాను. కానీ సార్ కూడా చాలా గొట్టుకొట్టు పదాలే వాడుతాడు. సారు ఉపన్యాసాలు అయితే చాలా సులభంగా అర్థమవుతాయి. గాని ఆయన ఇంగ్లీషు వ్యాసాలు తెలుగులోకి అనువాదం చేయడం కాస్త కష్టం
*
జార్జిరెడ్డి రాసిన ప్రేమ కవిత ను చూడడం తటస్తించింది. జార్జి రెడ్డిలో ప్రేమ కోణం నాకు కొత్తగా అనిపించింది. దాన్ని వెంటనే “ఆమె రాక” పేరుతో అనువదించాను. ఎంత బాగా రాశాడో.
*
జిగ్నేష్ మేవాని మీద, హిందూ పేపర్లో వ్యాసం ఒకటి వచ్చింది. దాన్ని వెంటనే అనువాదం చేశాను. ఒక మీటింగ్ లో ఆయన కలిస్తే బిడియపడుతూ, ఆ విషయాన్ని తెలియజేశాను. ఆయన చిరునవ్వుతో థాంక్స్ చెప్పడం బాగా గుర్తుంది. ఆ వ్యాసం అనువాదం చేస్తున్నప్పుడు ఆయనతో పాటు నేను దళిత ఉద్యమంలో పయనించినట్టు అయింది.
*
కొన్ని విషయాలు బాగా గుర్తుండిపోతాయి. చైతన్య కూతురు రేలా (9 th class ) వలస బతుకుల మీద ఇంగ్లీషులో కవిత రాసింది. అంత చిన్న వయసులో వలస బతుకుల మీద ఒక అవగాహన ఉండడం ఆశ్చర్యం అనిపించింది.
“పెన్సిల్ ముక్కు విరిగిపోయినట్టు
వలస బతుకులు ఛిద్రమవుతున్నాయి”
ఇటువంటిఆలోచన ఆ పిల్లకు రావడం నమ్మశక్యం కానిది. వెంటనే అనువాదం చేస్తే అది ‘కొలిమి’లో వేసుకున్నారు. ఆ అమ్మాయి నాతో మాట్లాడింది కూడా. భలే అనిపించింది.
*
అనువాదాలు వారధులలాంటివి. మనకు బయటి ప్రపంచంతో లింకును కలుపుతాయి. పాలమూరు నుంచి ప్రపంచంతో సంభాషణ దీనివల్లనే జరిగిందేమో.

మూల రచయితలు ఎవరో తెలవదు. వాళ్ళ ముఖాలు ఎట్లా ఉంటాయో తెలియదు. వాళ్లు బతికున్నారో, చనిపోయారోకూడా తెలవదు. వాళ్ళ కవితల్ని గుండెకు హత్తుకుంటే చాలు, ఒక ప్రపంచం మన ముందు నిలబడుతుంది. ఒక ప్రపంచం మనదైపోతుంది. మనదైన ప్రపంచం విస్తరిస్తుంది.
*
ఇక్కడ బెంగాల్ రచయిత్రి “మౌమితాఆలం” గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె బెంగాల్ నుండి దూసుకొస్తున్న కొత్త కెరటం. 2017 నుండి ఉద్ధృతంగా రాస్తున్నది. చాలా మటుకు outlook, counter currents, the wire లాంటి పత్రికల్లో ఆమె కవితలు విరివిగా వస్తుంటాయి.

మౌ మితను మొదట డిస్కవర్ చేసింది రమాసుందరి (మాతృక) గారే. ఆమె ఇంగ్లీష్ రచనల్ని అనువాదం చేయమని నాకు పంపేది. నేను వాటిని అనువదించడమూ, అవి మాతృకలో అచ్చు కావడం వెంట వెంట జరిగిపోయేవి.

ఆ క్రమంలో మోమితా ఆలం గారు, నా అడ్రసు తీసుకొని డైరెక్ట్ గా నాకే పంపడం మొదలుపెట్టింది. ఏవో కొన్ని తప్పు తక్కిన వాటిని చాలా మటుకు అనువాదం చేశాను.
ఇంగ్లీషులో దిట్ట ఆమె. చాలాసార్లు నాకు నెట్లో అర్థం దొరక్కపోతే ఆ వాక్యాలు డైరెక్టుగా ఆమెకే పంపి, అర్థం అడిగి తెలుసుకుని అనువాదం మొదలు పెడతాను. ఈ సౌకర్యం అందరి విషయంలో కుదరదు.
నడుస్తున్న రక్త చరిత్ర మీద నిరంతర వ్యాఖ్యానాలే ఆమె కవితలు. కొన్నిసార్లు రిప్యుటేషన్లు అవుతున్నా, అవేం పెద్దగా బాధించవు. కానీ ఆ sponteinity ఆశ్చర్యమనిపిస్తది.
కాలం వెంబడి నడుస్తుంది. మల్లయోధుల నిరసనలు, పార్లమెంటు భావన ప్రారంభోత్సవాలు, ఒకదాని వెంట ఒకటి జరిగితే, వెంట వెంట కవితలు పడతాయి. అంతే వేగంగా నా అనువాదమూ ఉంటుంది. ఒక రకంగా నన్ను ఊపిరి తీసుకొనివ్వదు.
నా అనువాద కవితలలో ఆమెది సింహభాగం అనుకోవాలి. ఓ ఇరవై ఐదు కవితలు అనువాదమయ్యాక తన కవితలని చిన్న పుస్తకంగా తెద్దామన్నది. “చూద్దాంలే ” అన్నాను. ఇపుడు యాభై దాకా అయ్యాయి. పుస్తకం ఎప్పుడొస్తుందో చూడాలి.
“ఒక గొప్ప బెంగాలీ రచయితని మీరు తెలుగు వాళ్ళకి పరిచయం చేశారు “ఆని రివేరా అంటుంటే నా కళ్ళు మెరిసిపోతాయి. ఇంతా చేసి నేను ఆమెతో ఒక్కసారే మాట్లాడాను. బెంగాల్ యాసలో ఆమె ఇంగ్లీష్ వినడానికి కష్టంగా ఉంటుంది. అరుణ తారలో వేసిన ఆమె ఇంటర్వ్యూ చదివితే, ఆమె జీవితంలోకి కొంతైనా తొంగి చూడ వచ్చు. పోతే అనువాద వ్యాసాలు చాలానే ఉన్నాయి. వెతకడం, ఒకచోట చేర్చడం పెద్ద శ్రమతో కూడిన పని లాగా ఉంది. వాటికి సంబంధించిన అనుభూతులైతే పచ్చగానే ఉన్నాయి.
*
మంటో మీద EPW లో వచ్చిన వ్యాసాన్ని వివి సారు పాలమూరుకు పట్టుకొచ్చి, నా చేతికిచ్చి,”దీన్ని అనువాదం చేయి” అనే చెప్పేశాడు. ఆయనకు నా మీద ఉన్న నమ్మకం చూసి నాకే ఆశ్చర్యవేసింది.

మంటో మీద అభిమానం కొద్దీ చేతిలోకి వ్యాసం తీసుకున్నాను. కానీ మొదటి పేజీ చూసేవరకులా డీలా పడిపోయాను. అది చాలా గొట్టు గా ఉంది. ఇది మన వల్ల కాదు. అని పక్కన పడేసాను. ఆరు నెలలు గడిచాక మళ్ళీ ఒకసారి ప్రయత్నిద్దామని మొండికేసి కూర్చున్న. ఇనుప గుగ్గిళ్ల లాంటి మొదటి పేజీ దారికి వచ్చింది. తక్కిన పేజీలన్నీ లైన్ లోకి వచ్చాయి. సులభంగా అనువాదం జరిగిపోయింది. లెక్కేసి చూసుకుంటే అది రాతలో 18 పేజీలు అయింది. శ్రమ అనిపించలేదు. మంటోఅంటే ప్రేమ కదా.
*
ఆదివాసీల మీద ఏదో పేపర్లో వచ్చిన వ్యాసం చూసి ఎంతో ఉద్విగ్నత కులోనయ్యాను. అంటే ఇంటికొచ్చి ఒక్క సిట్టింగ్ లో అనువాదం చేశాను. ఆ వ్యాసాన్ని షేరింగ్ ఆటోలో కూర్చొని చదివాను. చదువుతున్నప్పుడే “దీన్ని అనువదించాలి”అనుకున్నాను. దండకారణ్య ప్రాంతంలో మీడియా పాత్ర మీద వచ్చిన విలువైన వ్యాసం అది. EPW లో వచ్చినట్టు గుర్తు.
*
కొన్నిసార్లు ఇంగ్లీషులో ఒక వ్యాసం వస్తే మంచిగ నిపిస్తే వెంటనే అనువాదం చేసేస్తాను. అయితే అది అప్పటికే ఎవరో ఒకరు అనువాదం చేసి ఉంటారు. దానితో నిరాశపడి ఆ అనువాదాన్ని పక్కన పడేసిన సందర్భాలు ఉన్నాయి.
ఇదే విషయాన్ని రివేరాతో చెబితే ఆయన నిరాశ పడవలసిన అవసరం లేదన్నాడు. “ఒక రచన (గీతాంజలి )ని ఏడు మంది అనువదించిన సందర్భాలు ఉన్నాయి. ఎవరి ధోరణి వాళ్లది. కాబట్టి మనం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. పక్కన పెట్టాల్సిన అవసరం లేదు” అనడం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. చాలా అనువాద వ్యాసాలు ఉన్నాయి. ఇవన్నీ పుస్తకంగా ఎప్పుడొస్తాయో, ఏమో.
*
అప్పటికప్పుడు ఇంగ్లీషు ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించడం చాలెంజింగ్ గా, కొంత తికమకగా కూడా ఉంటుంది. but I like it.
ఓ సారి మహబూబ్ నగర్లోని టౌన్ హాల్లో పౌర హక్కుల సంఘం వాళ్ళ సభ జరుగుతోంది. నేను అక్కడికి కాస్త ఆలస్యంగానే వెళ్లాను. అప్పటికే లోపల ఎవరో మాట్లాడుతున్నారు. హాల్ లో అంతా నిశ్శబ్దంగా వింటున్నారు.

హడావిడిగా హాల్లోకి పోతుంటే మెట్ల మీద పురుషోత్తం కలిశాడు. “సార్ నెక్స్ట్ ఉపన్యాసం ఇంగ్లీషులో ఉంటది. దాన్ని మీరు తెలుగులోకి అనువాదం చేయాలి” అన్నాడు. నేను ఏదో అడగబోతుంటే “ఇప్పటికిప్పుడు మాకు అనువాదం జేసేవా ళ్లు ఎవరూ లేరు. మీరే చేయాలి” అంటూ ఒక ఆర్డర్ లాంటిది వేసి ఒక పేపరు, పెన్ను చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు.
*
నేను నిరుత్తరుడినై హాల్లోకి చేరుకున్నాను. హాలు నిండా జనం. కుదుట పడడానికి కొంత సమయం పట్టింది. అదృష్టం కొద్ది తెలుగులో మాట్లాడుతున్న వక్త, బాగానే టైం తీసుకోవడంతో, నాకు ఊపిరిబీల్చుకునే సమయం దొరికింది. వాతావరణానికి మెల్లమెల్లగా అలవాటు పడ్డాను.
తర్వాత ఇంగ్లీషు వక్త రానే వచ్చాడు. ఆయన మహారాష్ట్ర వాడు. వచ్చి రావడంతోటే ధారాళంగా ఇంగ్లీషులో మాట్లాడడం మొదలుపెట్టాడు. బిత్తర పోయాను. ప్రవాహాన్ని పట్టుకోలేకపోయాను. కానీ అవతల నా అనువాదం కోసం చూస్తున్నట్టున్నారు. వెంటనే తేరుకొని, తలవంచుకొని ఎవరిదిక్కు చూడకుండా ఆయన ఉపన్యాసాన్ని వినడం మొదలుపెట్టాను. అంటే ఆయనకు నేను కనెక్ట్ అయ్యాను అన్నమాట. కాగితం మీద పెన్ను రాపాడింది. మెల్లమెల్లగా ఆయన వేగాన్ని అందుకున్నాను. అనువాదం పుంజుకుంది. ఎంతసేపు సాగిందో కానీ ఆయన ఉపన్యాసం అయ్యే సరికి నా చేతిలో రెండు మూడు పేజీల అనువాదం (కచ్చాపక్క) ఉంది. వెంటనే పురుషోత్తం వచ్చేసి ఆ కాగితాలను తీసుకొని పోయి బాలగోపాల్ సార్ కి ఇచ్చేశాడు. ఆయన నా తెలుగు అనువాదం సాంతం సభకు వినిపించి, “ఈ అనువాదం ఎవరు చేశారో గానీ ఉపన్యాసానికి న్యాయం చేకూర్చాడు” అనడం ఎప్పటికీ మర్చిపోలేను.

అట్లాంటిదే O.U లోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన ఘటన. భగత్ సింగ్ మనుమడు (పేరు గుర్తులేదు)ఇంగ్లీషులో ప్రారంభ ఉపన్యాసం ఇస్తున్నాడు. “దీన్ని ఎవరైనా అనువాదం చేస్తున్నరా” అని అడిగిన పాపానికి ఆ బాధ్యత నాకే అప్పచెప్పారు. నాకు ఇట్లాంటి పని అప్పజెప్పుతారని అనుకోలేదు. ఆయనతో కనెక్ట్ కావడానికి కొంత సమయం పట్టింది. ఆ తర్వాత చక చక అనువాదం జరిగిపోయింది. విచిత్రం ఏమంటే నా తెలుగు అనువాదాన్ని నేనే సభలో చదవాల్సిన స్థితి వచ్చింది. ఏం చదివానో, ఏం స్పందన వచ్చిందో గుర్తులేదు కానీ, భగత్ సింగ్ కుటుంబంతో ఆ రకంగా నేను ఓ చిన్న అనుబంధం కలిగి ఉండడం ఆనందాన్ని ఇచ్చింది.
అప్పటికప్పుడు అనువదించాల్సిన సందర్భాలు తక్కువనే. అయినా అవి కూడా నాకు తృప్తిని ఇచ్చాయి. ఒక రకంగా నాకు పరీక్ష పెట్టాయి
*
ఇప్పటికీ ఎవరైనా “ఇది ట్రాన్స్ లేట్ చేయండి” అంటే నాకు గర్వంగా ఉంటది. ఒకింత బాధ్యతను పెంచుతుంది. మొన్ననే జైలు మిత్రులవి రెండు చిన్న కవితలు అనువదించాను. ఈ విధంగానైనా వాళ్లతో కనెక్ట్ అయి ఉండడం గొప్పగా అనిపిస్తుంది. ఇంగ్లీష్ నుండి తెలుగు అనువాదం సులభమే గాని, తెలుగు నుండి ఇంగ్లీష్ అనువాదం అంటే గొంతులో అడ్డం పడుతు న్నట్టుగా ఉంటది. ఒక బాధేమిటంటే, నన్ను అందరూ కవీ, రచయితా అంటారే గానీ, ఎందుకో అనువాదాల పేరెత్తరు. “నేను అనువాద రచయితను కూడా” అని ఇల్లెక్కి అరవాలనిపిస్తది.
ఒకప్పుడు అనువాదం చేయాలను కున్న పప్పుడు. “ఇవి ఎక్కడ దొర్కుతాయబ్బా” అని అనుకునేవాడిని. ఇపుడు నెట్ పుణ్యమా అని ప్రపంచమే నా ముందు ఉన్నది.
*

 1. ”చివరి వాక్యం” కథ వెనుక కథ ఏమిటి ? ఆ కథ ఎందుకు రాయాలని అనిపించింది? అది రాసేటప్పుడు మీలో ఎలాంటి సంఘర్షణ జరిగింది?

APCLC మిత్రులు శివాజీ, ఆంజనేయులు గౌడ్ గార్ల తో నేను కలిసి జీపులో పోతున్నప్పుడు, నాకు ఆ ఊర్లో ఒక కథ దొరుకుతుందని అనుకోలేదు. ఆ ఊరు, బాలానగర్ మండలానికి ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ తొమ్మిదవ తరగతి చదివే, ఒక లంబాడా పిల్లపై నలభై ఐదు సంవత్సరాలు గల ఒక ముస్లిం వ్యక్తి అత్యాచారం చేశాడని పేపర్లో చదివి, నిజ నిర్ధారణకు పోయాం.
*
చాలా దారుణంగా ఉంది వాళ్ళ ఇల్లు. బయట దండెంమీద కొన్ని బొంతలు ఆరేసి ఉన్నాయి. ఇంట్లో మట్టి పొయ్యి మీద ఉడికేసిన అన్నం( నిన్నటిది ) అట్లాగే ఉంది. గుడిసెకు సగం కప్పు తొలగిపోయిఉంది. ఇంటి ముందు ఎప్పటిదో ముస్లిం వేపచెట్టు. దాపులేని ఇల్లు. దాపు లేని బతుకు.
ఆ ఇంట్లో ముసలి దంపతులు, వాళ్ళ చివరి కూతురు లంబాడా లక్ష్మి ఉంటున్నారన్నమాట. అదే ఊర్లో వాళ్ళ అన్న వేరుపడిపోయి ఉంటున్నాడు గాని, వీళ్ళ బాగోగులు ఏమి పట్టించుకోడు. ముసలాయన చింతకాయలు తెంపుతుంటే చెట్టు మీద నుండి పడిపోయి కాలిరిగింది. ఆయన బీదతనానికి చెట్లమందే గతి.
ఇదీ… అక్కడి పరిస్థితి.
*
దిక్కులేని ఆ ఇంట్లోకి వరద నీరు వచ్చినట్టు, ఏవైనా చొచ్చుకు వస్తాయి. ఆకలి, అవమానం, అనారోగ్యం అన్ని చొచ్చుకు వస్తాయి. అట్లే ఆ దిక్కులేని ఆ పిల్ల మీద దారుణమైన అత్యాచారం జరగింది. (ఆ పిల్ల కాళ్ళ వెంబడి కారుతున్న రక్తాన్ని బట్టి వాళ్ళ వదిన గుర్తుపట్టిందట)
“అత్యాచారం జరిగినప్పుడు దాని తాలూకు భౌతిక గాయాలు మానిపోవచ్చు గానీ, ఆ తర్వాత జరిగే మానసిక సంఘర్షణ జీవిత కాలం ఉంటుంది” అని అభిప్రాయపడుతుంది దమయంతి గారు.
ఆరోజు అత్యాచారపు మహా సంఘర్షణను ఆ పిల్ల కళ్ళలో స్పష్టంగా చదవగలిగాను. సంఘటన జరిగి ఇరవై ఏళ్లయినా, ఆ కళ్ళు నన్ను ఇప్పటికీ వెంటాడుతుంటాయి.
*
మాకందరికీ వాకిట్లో ఒక చినిగిపోయిన చాప వేశారు. మేమందరం కూర్చొని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నేను మాత్రం ఆ పిల్లనే గమనిస్తూ ఉన్నాను. నా పక్కనే కూర్చొని ఉన్నా, నాకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్ట నిపించింది. ఇప్పుడే పులి బోను నుంచి వచ్చిన కుందేలు కూనలా ఉందా పిల్ల. నోట్లో మాట రావడం ఘనమైంది. ఆమెను ప్రశ్నలు అడుగుతుంటే అవును, కాదు… ఇవే మాటలు చెప్పగలిగింది.

అత్యాచారపు పీడకల ఆ పిల్లను ఇంకా వెంటాడుతోంది. భయంతో ఆ పిల్ల గడ్డకట్టుకు పోయింది. నేను తన చేతిని నా చేతిలోకి తీసుకొని ఓదార్చబోతే, ఆ పిల్ల తన చేతిని సర్రున గుంజే సుకున్నది. సమస్త వ్యవస్థ మీద ఉన్న అపనమ్మకానికి తార్కాణం అది.
కొంచెం ఆలోచిస్తే, ఆ పిల్ల ముఖం, “ఆక్రోష్” సినిమాలో ఓంపురి ముఖం ఒకలాగే అనిపిస్తాయి. ఆక్రోష్ సినిమాలో ఓంపురి ఒక ఆదివాసి. తమ ఆదివాసీలకు సమాజం న్యాయం చేయదని నమ్మకంతోటే, లాయరు (నసీరుద్దీన్ షా) అడిగిన ఒక్క ప్రశ్నకు జవాబు ఇవ్వడు. ఈ పిల్ల అంతే. ఏమడిగినా దిక్కులు చూస్తుంది. అవును, కాదు అని జవాబుచెప్తుంది తప్ప వాక్యంగా విచ్చుకోలేదు. ఆ పిల్ల మనసులో చెలరేగే సంఘర్షణను ఎవరు రాయగలరు.

అత్యాచారం గురించి వాళ్ళ తల్లి, వదిన చెబుతూ పోతుంటే మా వాళ్ళు రాసుకుంటున్నారు. నేనొక సంఘర్షణకు లోనవుతున్నాను. అత్యాచారానికి గురైన ఆ పిల్ల పెండ్లి ఎట్లా? చదువు కొనసాగుతుందా? క్లాస్మేట్లు ఆమె పట్ల ఎట్లా ఉంటారు? బంధువులు ఏమంటారు? నడుస్తూ ఉంటే చుట్టుపక్కల పోరలు ఎంతగా వెక్కిరిస్తారో? ఈ ప్రశ్నలన్ని తొల్చివేస్తున్నాయి. అప్పటికి నేను ఒక కథ రాయగలను అనే నమ్మకం కుదరలేదు. అన్నీ నిర్ఘాంతపడి వింటున్న.


 • అత్యాచారం జరిగిన చోటుకు మమ్మల్ని తీసుకువెళ్లారు. అక్కడ నలిగిపోయిన పుంటి కూర చెట్లు మూగసాక్షులుగా కనిపించాయి. అక్కడ చెట్లను, గడ్డిని చూస్తే పెద్ద పెనుగులాటనే జరిగిందని పిస్తుంది. ఆ గుట్టల మధ్య, పొలాల మధ్య, నిర్జన ప్రాంతంలో ఆమె కేకలు ఎవరు విని ఉంటారు. ఆ పొలాలలో, ఆ బాటలలో ఏదో దిక్కులేనితనం కనిపిస్తది. పచ్చని పల్లెలో పాములు మాత్రం హాయిగా సంచరిస్తున్నాయి.

నిందితుడు బలవంతుడు. వాళ్ల చుట్టాలలో ఒకడు పోలీసు నౌకరి ఏదో చేస్తున్నాడట. ఆ పేరు చెప్పి వీళ్లను బెదిరిస్తున్నారు. పేపర్ వాళ్ళను కొనేశారు. పోలీసుల సంగతి సరే సరి. ఎవరో పెద్ద ఆఫీసర్ ఠాణాను విజిట్ చేసినట్టు చెప్పారు కానీ, అత్యాచారం జరిగిన చోటును ఎవరు సందర్శించినట్లు లేదు.
లంబాడా యువకులు చాలా నిరాశలో ఉన్నారు. పేదరికం, దిక్కులేనితనం. ఒక యువకుడు మాతో మాట్లాడుతూ “సార్… మాకు ఎవరు దిక్కులేరు ” అనడం నన్ను వెంటాడింది.
*
ఆ ఒక్క వాక్యాన్ని భారంగా భుజం మీద మోసుకొని జడ్చర్ల బాట పట్టాను. వెంటాడే ఆ పిల్ల కళ్ళు నన్ను ప్రశాంతంగా ఉండనీయలేదు. ఈ బదులు లేని పల్లెటూర్లలో ఇట్లాంటివి ఇంకెన్ని జరుగుతున్నాయో చరిత్రకందని చీకటి కోణాలు ఎన్నో.
మొదట “ఆమెకి ఎవరూ లేరు” అనే చివరి వాక్యంతో కథ ముగించాలని కథ మొదలుపెట్టాను. పోలీసులు, పత్రికల వాళ్ళు, ఆసుపత్రి వాళ్ళు, నాయకులు అందరూ నిందితుడిని కాపాడే ప్రయత్నంలో ఉన్నారు. జరిగిందాన్ని చిన్నది చేసి రాజీ చేసేయత్నంలో ఉన్నారు. ఒక టీవీ ఛానల్ వ్యక్తి రాజీ కుదురుస్తానని డబ్బులు ఇప్పిస్తానని బాహాటంగానే చెప్తున్నాడు. అక్కడున్న డాక్టరైతే ఆయనకు మతిస్థిమితం లేదనే సర్టిఫికెట్ కూడా ఇచ్చేసింది. ఇవన్నీ చూస్తే మాకు మతిస్థిమితం తప్పేటట్టు ఉంది. దున్నపోతులాంటి నిందితుడికి గ్లూకోజ్ లెక్కిస్తున్నారు. ఒక నాటకం పకడ్బందీగా సాగిపోతుంది. ఆయన రక్షణగా దాదాలు కనపడుతున్నారు.
మరి లంబాడ లక్ష్మికి దిక్కెవరు…?
ఏమో గాని ఈ ముగింపు నిరాశగా ఉంది. ఈ ముగింపు స్ఫోరకంగా ఉండాలనుకున్నాను. దినాల తరబడి ఆలోచించాను. కథ నోట్ బుక్ లో (లంబాడా లక్ష్మీలాగే )మూలుగుతోంది. కథ కూడా దిక్కులేనిది అయిపోయింది.
ఓ రోజు ఎక్కడో, ఏదో పుస్తకంలో స్త్రీల ఊరేగింపు గురించి చదివినసంగతి, నా మైండ్ లో మెరుపులా మెరిసింది. “కథకు ముగింపు వచ్చేసింది” అనుకున్నాను. లంబాడ లక్ష్మిని ఊరేగింపు ముందు నిలబెట్టాను. కథకు ప్రాణం వచ్చింది. దీనంగా మూలుగుతున్న లంబాడాలక్ష్మి ఊరేగింపులో ముందు బాగాన నిలబడి, నినాదాలిస్తూ ఊహించని ఎత్తులకు ఎదిగిపోయింది. ఉద్యమంలో తారాజువ్వలా ఎగిసింది. “ఆమెకు ఎవరూ లేరు “అన్న వాక్యాన్ని కొట్టేసి రచయిత హాయిగా నిద్రపోతాడు
*
చివరి పేరా రచయితకొచ్చిన కల. అది బాలు మహేందర్ గారి సినిమా “నిరీక్షణ” నుంచి ప్రేరణ పొంది రాసింది. దీపాల మధ్యన “అర్చన ” తన ప్రియుడి కోసం ఎదురు చూస్తున్నట్టుగా ముగింపు గొప్పగా చూపెట్టారు. ఈ కథలో దీపాల మధ్యన అర్చన బదులు లంబాడా లక్ష్మి కూర్చోబెట్టాను.
*
ఒక సిట్టింగ్ లో కథ రాయడం కుదరలేదు. ఆ పిల్ల నా రూంలో తిరుగాడినట్టే అనిపించింది. వేలాది ప్రశ్నలు. పల్లెటూర్లలో, అడవుల్లో ఇట్లాంటి అత్యాచార సంఘటనలు జరిగితే ఎవరూ ఉండరా? దిక్కులేని బతుకులేనా ఇవి ? ఒంటరి బాటలు, ఒంటరి పొలాలు, ఒంటరిగుట్టలు, ఒంటరి బతుకులు, గడ్డివాము మీద ఆరేసిన దుప్పటి, చిరిగిపోయి రక్తమంటిన దుస్తులు, నిస్సహాయంగా చూస్తున్న పొలం గట్లు, నన్నునిలువ నీయలేదు.
రాయడం, కొట్టేయడం, ఏడవడం, మానడం… ఇలా జరిగి కొంతకాలానికి పూర్తయింది. లంబాడా లక్ష్మి ఎట్లున్నదో… పెళ్లయిందో లేదో… పెళ్ళి అయితే గతం తాలూకు పీడకలు ఏమైనా వెంటాడుతున్నాయేమో. భర్త ఎట్లాంటి వాడో…
కథ అయితే ముగిసిందిగాని
ముగింపు లేని కథలు ఎన్నో
*

 1. “ఎవరమ్మా మీరు” పాటల సంకలనం నేపథ్యం ఏమిటి? పాటలకు బాణీలు మీరే రూపొందిస్తారా?
  చెట్టుకు
  బట్ట ఊయల గట్టి
  బంగరు ఊయల చేసి
  మా అమ్మ పొలం కాడ
  చెమట తీస్తుంటే
  ఏ పక్షిగానం
  ఏ చెట్ల గాలి
  నా చెవిలో గానామృతం నింపాయో
  అప్పటి నుంచే పాట
  నా రక్తంలో కలగలిసి పోయింది
  సప్తవర్ణాల సంశోభితమై
  సప్త సముద్రాన్ని తనలోకి వంపుకొని
  పాట నాలోకి విస్తరించింది
  సరిహద్దుల్ని వేసింది.
  పాటకు నేపథ్యం ఏముంటది? కాళ్ళ కింద నేల కరిగిపోతుంటే, ఇంత నీడ కోసం, కాసింత నిద్ర కోసం ఇక్కడి మనుషులు పడ్డ ఆరాటాలే, చేసిన పోరాటాలే నా పాటలకు నాంది.
  కరువు వెంట పాట నడిచింది. కన్నీళ్ల వెంట పాట నడిచింది. ఊరేగింపుల వెంట పాట నడిచింది. గాయాల వెంట పాట నడిచింది. పిడికిళ్ళ వెంట పాట నడిచింది. ప్రోత్సాహం లేకనో, నాకు చొరవ లేకనో, పాటలు తక్కువ రాయడం జరిగింది గాని పాటంటే ప్రాణం.
  ఘంటసాల గారు చనిపోయినప్పుడు రైల్లో కూర్చొని, ఒక్కడిని పసిపిల్లవాడిలా రైలుడబ్బామెట్ల కాడ కూర్చుని ఎంతగా ఏడ్చానో… నా ఏడుపు శబ్ధాలు, రైలు శతాబ్దాలలో కలిసిపోయాయి. మనసార ఏడ్చి ఏడ్చి కుదుట పడ్డాక, సీట్లో వొచ్చి కూచున్నా
  *
  పాట ఎట్లా పుట్టిందో తెలియదు గానీ, పాడుతుంటే పాటకుఒక ఊపు వస్తుందని, గుడి కాడ చిడుతల రామాయణంలో పాటలు విన్నప్పుడే అర్థమైంది. పాటకు రగిలించే గుణం ఉందని “వీడే… వీడే”పాట రాసినప్పుడు నాకు అర్థమైంది.
  “అన్న వీడే వీడే… దొంగ జూడే జూడే
  వీడ్ని మించిన దొంగ లేడు… జూడే సూడే
  అరే… దొంగ మాటలాను చెప్పి
  పంతులయ్యలాను ముంచి
  పంది వోలే బలిసినాడు… సూడే సూడే”
  (రామం భజే… రఘు రామం భజే… అనే స్టైల్లో పాడుకోవాలి)
  భూత్పూర్ లో ఓ లంచగొండి క్లర్కు మీద రాసిన పాట అది. భూత్పూర్ రోడ్లమీద మండుటెండలో ఉదయ్ సారు ఆ పాట పాడుతూ ఉంటే, మేమందరం దానికి కోరస్ ఇస్తుంటే, ఆ ఊపే వేరు. ఆ జోష్ చెప్పరానిది. అంతా ఒక ఉద్విగ్న వాతావరణంలో జరిగింది. అదే పాటను బూత్పూరు మండలాఫీసు ముందు నిలబడి అదే జోష్లో పాడాము (అప్పటికే ఆ లంచగొండి క్లర్కు పారిపోయాడనుకోండి. అది వేరే విషయం ). ఆ రోజుకు ఆ పాట పెద్ద హైలైట్.
  *
  “జిందాబాద్ డిటిఎఫ్” పాట ఒక రాగం లోంచి పుట్టింది. నేను ఆ రాగం వినకుండా ఉండి ఉంటే ఆ పాట రాసేవాణ్ణి కాదేమో. నెల్సన్ మండేలా జైలు నుండి విడుదలయ్యాక, మొదటిసారి భారతదేశానికి వచ్చినప్పుడు అతని గౌరవార్థం కలకత్తాలో ఓ పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంలో ఆయనను స్వాగతిస్తూ, ఓ పెద్ద గాన సభ ఏర్పాటు చేశారు.
  “జిందబాద్… మండేలా
  మండేలా… జిందాబాద్
  జిందబాద్… మండేలా
  మండేలా… ఆ… జిందాబాద్”
  లక్షలాది జనం, పైరగాలికి పంటచేనులా ఊగుతూ, పాటకు కోరస్ అందిస్తుంటే ఆకాశం మెరిసిపోయింది. భూమి పులకించింది. ఆ రాగం నన్నాకట్టుకుంది. అప్పటికి ఏపీటీఎఫ్ ఉద్యమం మహోధృతంగా సాగుతోంది. ఆ పాట పల్లవిని బేస్ చేసుకుని ఏపీటీఎఫ్ మీద పాట రాశాను. “మండేలా ” అన్నచోట “ఏపీటీఎఫ్ “పెట్టాను. జిందాబాద్ ఏపీటీఎఫ్… అని మొదలు పెట్టాను. పాట ఒక రాత్రిలో పూర్తయింది.
  బాలానగర్ ఏపీటీఎఫ్ సభలలో, ఆ రాత్రి కనకాచారికి వినిపిస్తే. ఆయన అది విని చిన్నపిల్లాడైపోయాడు. ఆరోజు సభలో ఆ పాట అందర్నీ ఒక ఊపు ఊపేసింది జంగన్న సారు, కృష్ణ , ఉదయ్ సారు గొంతులు కలిపి దాన్ని శిఖరాలకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఏపిటిఎఫ్ కాస్త డిటిఎఫ్ గా మారినాక ” జిందాబాద్ డిటిఎఫ్” పాటగా మారింది. బాగా పేరొచ్చింది. ఈ పాటను పతాక గేయంగా పెడతారని తెలిసింది. కానీ ఎందువలనోఅది జరగలేదు.
  *
  ఏమని చెప్పేది… ఎన్నని చెప్పేది. పాలమూరులో కరువు విలయ తాండవం చేస్తున్నప్పుడు, మేమందరం కరువు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో హరగోపాల్ సార్ తో కలిసి రంగసముద్రం పోయాం. అక్కడ ఊరు ఊరంతా వలస పోయిఉంది. ఉన్న కొడుకులు వలస పోతే, ఇంటిదగ్గర ముసలోళ్ళు బతుకులీడుస్తూ ఉంటారు.
  “గుడిసె ముందరే… దిష్టిబొమ్మలా
  ఎవరమ్మా మీరు… తెగి ఎండిన కొమ్మలా
  ఎవరమ్మా మీరు… చెరువు డిని చేపలా”
  తొలుత తొలుత కొడుకులు డబ్బులు పంపిస్తారు. కానీ ఆ తర్వాత వాళ్లకే సర్దుబాటు గాక డబ్బు పంపడం మానేస్తుంటారు. ఇంక ముసలోళ్ళు ఏం చేస్తారు. ఆడాఈడా అడుక్కొని ఆడుకొని, తిండికి మాడి మాడి చచ్చిపోతారు. అదొక దారుణం విషాదం. కళ్ళ ముందు వెంటిలేష న్ లో మనిషి చచ్చిపోతుంటే చూస్తూ ఉండే నిస్సహాయ స్థితి లాంటిది.

ఒకచోట ఒక చావును చూసి బయటికి వస్తుంటే, మరో ఇంట్ల చావుకు సిద్ధంగా ఉన్న వృద్ధులు కనపడుతూ ఉంటారు. ఒక విధంగా ఊరంతా చావు వాసన వేస్తుంటది. నీళ్లు లేవు, తిండి లేదు. ఆదుకునే మనుషులు ఉండరు. మనుషులంతా భూమ్మీద తిరగాడుతున్న ప్రేతాత్మల్లా ఉన్నారు. గుండె బరువెక్కి వాపసొస్తుంటే అక్కడ మసీద్ దగ్గర ఒక ఇరవైమంది ముసలోళ్ళు అడుక్కుంటూ కనపడ్డరు. “సార్ వీళ్లు కూడా ఒక్కొక్కరుగా ఇరవై ముప్పయి రోజుల్లో చచ్చిపోతారు” అని నిర్వేదంతో హరగోపాల్ సార్ కు చెప్పాను. ఆ దిక్కులేని మనుషుల చూసి రాసిందే “ఎవరమ్మా మీరు” అనే పాట. ఆపాట రాఘవాచారి కి వినిపిస్తే మెచ్చుకొని (ఆయన ఓ పట్టాన మెచ్చుకోడు) రాత్రి ఇంటికి పోయి మళ్ళీ అడిగి పాడించుకున్నాడు. మల్లీశ్వరి దాన్ని ఇపుడు భుజాన వేసుకొని తిరుగుతోంది.
*
“ఎల్లి పోతున్నాది… ” అనే పాటకు మరొక నేపథ్యం ఉంది. కరువు కాలంలో పైసలు లేక గొడ్డు గోదా అమ్ముకోవడం రివాజు. ఒక తాండాలో నేను చూసిన దృశ్యం హృదయ విదారకంగా ఉంది. ఆ కాలంలో కబేళాలకు (పిల్లలను పట్టుకు పోవడానికి పోలీసు వ్యాన్లు తిరిగినట్టు) పశువులను తీసుకపోవడానికి వ్యాన్లు విరివిగా తిరిగేవి. ఆ రోజు తండావాసులు కలిసి, ఒక ఆవును వ్యాను ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అదెంతకూ పైకి ఎక్కడం లేదు. మొరాయిస్తున్నది. దాన్ని కొడుతున్నారు. తోకను మెలిపెడుతున్నారు. తనను కబేళాకు తీసుకుపోతున్నారని దానికేమన్నా తెలుసేమో. ఎంతకు కదలదు. కొందరు పిల్లలయితే ఏడుస్తున్నారు. బిడ్డను తల్లి బలవంతంగా అత్తారింటికి పంపుతున్నట్టుగా ఉందా దృశ్యం. గొడ్డు కూడా కుటుంబంలో భాగమే కదా. ఆ దృశ్యం లోనుంచే పుట్టింది పాట.
“ఎల్లి పోతున్నాది… ఎల్లి పోతున్నాది
మా ఇంటి పుల్లావు… ఎల్లి పోతున్నాది
మా ఇంటి మహాలచ్మి… ఎల్లి పోతున్నాది
డొక్కా లెండి పోయి… అంబా అంబా అంట
బేల బేలగ చూస్తూ వెళ్ళిపోతున్నాది”
*
అనేక సంఘటనలు కలగలిసి ఒక కథగా రూపుదిద్దుకున్నట్లే అనేక సంఘటనలు కలగల్సి పాటలుగా రూపుదిద్దుకుంటాయి.

నేను వెల్జర్ల గ్రామం (షాద్ నగర్ )మండలంలో టీచరుగా పనిచేస్తున్నప్పుడు, అక్కడ హోటళ్లలో రెండు గ్లాసుల పద్ధతి అమలులో ఉండేది. మేము చాయ్ తాగడానికి పోతే, మాకు మామూలు గ్లాసులో ఇచ్చేవాళ్ళు. దళితులు వస్తే మాత్రం, వేరే గ్లాసు లలో ఇచ్చే వాళ్లు. చాయ్ తాగినాక తమ గ్లాసును కడిగి, అక్కడున్న గూటిలో పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. చూడడానికి కలుక్కుమన్నా ఏం చేయలేని స్థితి.
అప్పట్లో నాకు పాట రాసే అలవాటు లేదు గాని, “ఎన్నడో సమానమయ్యేది” అనే పాటకు అది నాంది అని చెప్పగలను. బహుశా ఒక పది సంవత్సరాల తర్వాత ఆ పాట పుట్టి ఉంటుంది. కొన్ని సంఘటనలు జ్ఞాపకాల మడతల్లో రగులుతుంటాయి. సమయం వచ్చినప్పుడు బయటికి వస్తాయి.
*
“కనులు తెరిచిన కాలమందున తమ్ముడా” అనే పాట మతం గురించి రాసింది. కర్నూలుకు బస్సులో పోతుంటే ఒక ఐడియా తోసుకొచ్చింది. వెంటనే రాయాలనిపించింది. చేతిలో కాగితాలు లేవు. పుస్తకం ఒకటి ఉంది. ఆ పుస్తకం వెనక పేజీలో ఉన్న ఖాళీలలో, బస్సు కుదుపులో, వంకర టింకరగా పాట రాసుకున్నాను. ఇంటికొచ్చి ఫేర్ చేశాను. ఇప్పటికీ అది ఏదో పుస్తకంలో ఎక్కడో చోట భద్రంగా ఉంది.
“కనులు తెరిచిన కాలమందున తమ్ముడా
మతము మత్తు వదలకున్నది తమ్ముడా “
దీనికొక విషాద కథ ఉంది. ఈ పాటను నా శిష్యురాలు సుభాషిణి కి ఇచ్చి పాడమన్నాను. ఆమె చక్కగా పాడి, కొన్ని విజువల్స్ ని జోడించి, యూట్యూబ్లో పెట్టింది. స్పందనలైతే బాగానే వచ్చాయి గాని పాట పెట్టిన ఇరవై నాలుగు గంటలలోపే అది అభ్యంతరకరంగా ఉందని యూట్యూబ్ వాళ్ళు దాన్ని తీసేశారు. ఆమె కారణాలు అడిగితే వాళ్ళు ఏమీ స్పందించలేదట. ఆ విధంగా నేను సైతం నిషేధించిన వాళ్ళ లిస్టులోకి వెళ్ళిపోయాను అన్నమాట.
*
బెల్లి లలితను క్రూరంగా హత్య చేసినప్పుడు, నేను ఆ ఊరికి పోయి వచ్చాను. ఆమెనుమాయం చేసి ముక్కలుగా నరికి చంపారు. ఎంతగొప్ప గాయని ఆమె. నదీ గాంభీర్యాన్ని పోలిన ఆ గొంతును విన్నాక గద్దర్ ఖాళీని ఈమె పూడ్చగలదని అనుకున్న. ఆమె గొంతు మొదటిసారి తెలంగాణ డిక్లరేషన్ (వరంగల్) లో విన్నా. ఆరోజు పట్టణమంతా ఊరేగింపుగా తిరిగాక, పార్కులో సాయంకాలం సభ ఏర్పాటు చేశారు. అప్పటికి బెల్లిలలిత శవం ఎక్కడుందో , ఏం చేశారోతెలువదు. వాతావరణం అంటిస్తే అంటుకు పోయేటట్టుగా ఉంది. “మాకు మా బెల్లి లలితను చూపించండి” అని గద్దర్ పాట అందుకోవడంతో, సభ మొత్తం ఉద్విగ్నమైపోయింది. ఒక ఎర్రటి దస్తిని ఆయన పైకి ఎగరేసి, దాన్ని ప్రేమగా గుండెలకు హత్తుకొని “మా బిడ్డను మాకు చూయించండి” అంటూ పాడుతుంటే సబికులు ఉగ్గపట్టుకోలేక ఏడ్చారు. ఆ తర్వాత రాసిందే “డోల్ దెబ్బ” పాట. (ఢింకి శబ్దాన్ని పోలి ఉంటుంది)
“డోల్ దెబ్బ గొట్టినావు… గుండెలదుర గొట్టినావు (2)
…………………………….
……………………………
నువ్వు భువనగిరి ముద్దు బిడ్డవే… మా లలితక్క
నువ్వు అచ్చమైన పాటవైతివే… మా లలితక్క”
*
సాధారణంగా నా పాటలకు నేనే రాగాలు కట్టుకుంటాను. ఒక్కొక్కసారి సబ్జెక్టుకు రాగం దొరకక, పాట రాయకుండా వదిలిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. రాగం కుదిరితే పాట దానంతకదే వస్తుందనిపిస్తుంది. ముందు గున్ గునాయించుకుని, రాగంతో తృప్తిపడ్డాక, చరణాలు పడతాయి. కొన్నిపాటల బాణీలు సుప్రసిద్ధమైన పాటల నుండి తీసుకొన్నవి. “రూపం – సారం” ఏమి జేతూ… ఏమి జేతుల్లో గీ నీల్లు కోసం” సడక్ బందు వెడదమా” వంటివి గద్దర్ పాటల బాణీలను అనుసరించి రాసినవి.
“నందామయా గురుడ… నందామయా”, “నిజమేనా”య వంటి పాటలు భజన పాటల బాణీలను అనుసరించి రాసినవి. పురుషోత్తం మీద రాసిన రెండు పాటలు సొంతంగా బాణీలు కట్టుకున్నవే. ఆయన మీద తీసిన క్యాసెట్లో నా సొంత గొంతుతో ఉన్న పాట కూడా ఉంది. ఎవరి పాటను వాళ్లే పాడాలని గద్దర్ బలవంతం చేయడంతో నేను స్టూడియోలో బెదురుతూ బెదురుతూ పాడిన పాట అది. అప్పటిలో నాకది కొత్త.
*
నలభై సంవత్సరాల కాలంలో నలభై పాటలే రాసి పాటలకు అన్యాయమే చేశాను. సరైన ఆదరణ దొరకక, నాలో చొరవ కూడా లేక (వివి సార్ ఇదే అంటూ ఉంటాడు) పాటలకు సరైన ఆదరణ రాలేదు. నా బిడియమే నా పాట కు అడ్డుగా నిలిచింది. పాటలన్నీ ఒకక్యాసెట్ గా తేవాలని అనుకున్నా. ఎప్పుడయితదో తెలువదు. నా పాటలు ఎవరైనాపాడుతుంటే వినాలని ఉంది.
*

 1. అందరిని కంటతడి పెట్టించే “డోలి” కథ చెప్పండి.
  దండకారణ్యంలో ఆదివాసి మహిళలకు కాన్పు సమస్యలు ఎట్లా ఉంటాయి… ప్రసవ సమయంలో బిడ్డ అడ్డం పడితే, ఎవరాదు కుంటారు.
  చుట్టుపక్కల నిర్బంధ వాతావరణం. పోలీసులు సల్వాజుడుం వాల్లు కలిసి, ముకుమ్మడిగా దాడి చేస్తున్నారు. అసలే శిశు మరణాలు అధికంగా ఉన్న దండకారణ్యంలో, ఎంతమంది తల్లులు సుఖంగా పురుడు పోసుకుంటున్నారో తెలియదు. వాళ్లకు గర్భం ధరించడం, దాని మధుర జ్ఞాపకాలని నెమరు వేసుకోవడం. ఇటువంటివి ఏమి తెలియదు. ఉన్నదల్లా రెండు చేతులు అడ్డంపెట్టి, దీపాన్ని కాపాడుకున్నట్టు, గర్భాన్ని కాపాడుకోవడమే. దీనికి తోడు రక్తహీనత ఒకటి. కనీసం 11 గ్రాములు ఉండాల్సిన చోట ఐదు లేదా ఆరు గ్రాములు ఉండడం, భీతి గొలిపే విషయం. దీనికి తోడు వాళ్ళు చాలాసార్లు, పోలీసుల జుడువాళ్ళ అత్యాచారా లకు గురవుతుంటారు. పిల్లలు కడుపులోనే చనిపోవడం, నెలలు నిండకుండా పుట్టడం, పుట్టిన తర్వాత చనిపోవడం జరుగుతుంటాయి. ఇంతటి బీభత్సంలో గర్భధారణ సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పినా అర్థం కాదు. ఈ దారుణంలోంచి వచ్చిందే ఈ చిన్న కథ “డోలి”.
  *
  డోలి… అన్న పేరు మొట్టమొదటగా నేను దమయంతి గారి పుస్తకంలో చూశాను. ఆమె ఆదివాసీల మీద రాసిన పుస్తకం చదువుతుంటే ఒక పేరా నన్ను ఆకర్షించింది. జర్నలిస్టులు ఒకచోట దళాన్ని కలిసి మాట్లాడుతుంటే అక్కడ గుడిసెలోంచి ఒక మహిళ రోదన వినిపిస్తది. ఆమె ప్రసవ వేదన పడుతుంటది ఏం చేస్తారని జర్నలిస్టులు అడిగితే ఆమెను డోలి కట్టుకొని అక్కడి నుంచి ఐదుకిలోమీటర్ల దూరంలో గల సిరొంచ పట్టణానికి తీసుకుపోతారని (అదేదో సాధారణ విషయంలాగ ) దళ నాయకుడు చెబుతాడు. నేను ఆ పేరా దగ్గర ఆగిపోయాను. తొమ్మిది నెలల నిండు గర్భిణిని డోలి గట్టుకొని… కొండలు , గుట్టలు, వాగులు దాటి ఎట్లా తీసుకుపోతారు… అనేది నాకు అంతుపట్టలేదు.
  “డోలి” అంటే రెండు పొడవాటి కట్టెలకు ఓ దుప్పటి కట్టి, ఆ దుప్పటిలో మనిషిని తీసుకుపోతారని అచ్చంపేట మిత్రుడు వివరించారు.
  *
  ఇక కథ రాయాలని నిర్ణయానికి వచ్చాను. అడవికి సంబంధించిన జంతుజాలం, పక్షులు వాటి వివరాలు తెలుసుకున్నాను. ముఖ్యంగా వర్షాకాలంలో అడవి ఎట్లా ఉంటుంది… అనేది వివరంగా ఒక నోట్ బుక్ లో రాసుకున్నాను.
  నా సహచరి గతంలో బెజ్జూర్( ఆదిలాబాద్ ) ప్రాంతంలో పనిచేయడం వల్ల, నాకు అడవి గురించి బాగా తెలుసుకొనే అవకాశం కలిగింది. ఆ తర్వాత అడివిని గురించి వర్ణించేటప్పుడు నా కథలో ఆ అనుభవం బాగా ఒదిగిపోయింది.
  *
  కన్నె మర్క (ఛత్తీస్ ఘడ్ )గ్రామంలో ఆదివాసి మహిళ మోతికి పురిటి నొప్పులు మొదలవుతాయి. అక్కడ వాళ్లకి ఎవరు లేరు. అప్పుడప్పుడు వచ్చిపోయే నర్సు పండుగకు సెలవు పెట్టి వెళ్ళిపోతుంది. అక్కడ ఆటో వంటివి ఊహించడం కష్టం. సిరొంచ పోవాలంటే డోలి మాత్రమే దిక్కు. ఆమె భర్త (బండు), తండ్రి (కజ్జుం) కలిసి ఓ డోలీ తయారుచేసుకుని, ప్రయాణం మొదలు పెడతారు. దట్టమైన అడవి, కొండలు, గుట్టలు మార్గంలో సన్నటి తుంపర మొదలవుతుంది.
  వాళ్లకు డోలి బరువు కన్నా, మోతీకి ఏమవుతుందో, అనే భయం ఎక్కువ వెంటాడుతుంది. వర్షంలో తడిసిన మోతీ డోలీలో బాధతో మెలి తిరిగి పోతుంటది. చిక్కబట్టుకున్న ధైర్యంతో కజ్జుం ఆమెకు ధైర్యం చెబుతుంటాడు. చెట్లు, పొదలు, గుట్టలు దాటినంక వర్షంలో తడుస్తుంటే చివర్లో వాగు ఒకటి అడ్డం వస్తుంది. అప్పటికే వరద నీరు వచ్చి చేరడంతో వాగు కొంత ఉధృతిగానే ఉంటుంది. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ మధ్య మధ్యన మూలుగుతున్న మోతిని ఓదారుస్తూ, మొత్తం మీద వాగు దాటుతారు. అల్లంత దూరాన కనబడేది సిరొంచ. “హమ్మయ్య ఇక వచ్చేసాం” అనుకునే లోపు మోతికి నొప్పులు తీవ్రమవుతాయి. చుట్టుపక్కల స్త్రీల సహకారంతో, ఆమెను ఒక బండమీదికి చేరుస్తారు. మోతి ఓ బిడ్డకు జన్మనిస్తుంది కానీ తాను చనిపోతుంది.
  “ఓమరణం… ఓ జననం
  ఓ అస్తమయం… ఓ ఉదయం”
  ఇదేనేమో అడివంటే. ఇదేనేమో జీవితం అంటే… అన్న వాక్యాలతో కథ ముగుస్తుంది.
  *
  కథలో మోతి తండ్రి కజ్జుంపాత్రను హేమింగ్వే నవల “Oldman and the sea”లో ప్రధాన పాత్ర ధారి “శాంటియాగో”ను దృష్టిలో ఉంచుకొని రాశాను. నన్ను ఆపాత్ర చాలా కాలం వరకు ప్రభావితం చేసిందిఎనభై. ఏళ్ల వృద్ధుడు అయినా, ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోడు. సముద్రంలో తాను పట్టిన పెద్ద చేపపై షార్క్ చాపలు ఎంతగా దాడి చేసినా, వాటితో పోరాడుతాడే గాని, భయపడి వెనుకడుగు వేయడు. ఆఖరికి రెండు పక్కటెముకలు కూడా విరుగుతాయి కానీ, వాటితో చేసే యుద్ధం మాత్రం ఆపడు. ఆ నవలలో హేమింగ్వే రాసిన వాక్యం “A man can be destroyed, but he cannot be defeated.. ” చిరస్థాయిగా నిలబడిపోయింది.
  నేనుకజ్జుం పాత్రను రాస్తున్నప్పుడు, శాంటియాగో నా చేతిలోనుంచి పెన్ను గుంజుకొని, అతనే ఆ పాత్రని రాసినట్టు అనిపించింది. అంతటి విపత్కర పరిస్థితులలో అతను ధైర్యాన్ని నిలబెట్టుకోవడం కాకుండా తన బిడ్డకు అల్లునికి ధైర్యం ఇస్తూ ఉంటాడు. ఆదివాసులకు ఇదంతా సహజంగా అబ్బుతుందేమో ఏమో.
  *
  డోలి మోసుకుంటూ అడవిలో ప్రయాణం చేస్తున్నప్పుడు, తన అల్లునితో అనేక అనుభవాలు పంచుకుంటాడు. రెండు వైపులా ఉన్న గూడేలలో, నిర్బంధాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పుకొస్తాడు. నడుస్తూ నడుస్తూ చుట్టుపక్కల వాతావరణాన్ని ఎత్తిపట్టడం నేను చదివిన ఒక పుస్తకం నుండి నేర్చుకున్న.
  నేను జడ్చర్ల డిగ్రీ కాలేజీలో చదువుతున్నప్పుడు, ఏదో విషయంలో నాకు ఒక నవల”The Pilgrim’s Progress ” అనేది బహుమతిగా ఇచ్చారు. అందులో కథానాయకుడు కాలినడకన తీర్థయాత్రకు బయలుదేరుతాడు. అతడు ప్రయాణిస్తూ రాత్రిపూట ఒక్కో ఊర్లో సేద తీరుతూ ఉంటాడు. రచయిత ఆ విధంగా చుట్టుపక్కల ఊళ్ళలో మనుషుల ఆచార వ్యవహారాల గురించి, అలవాట్ల గురించి చెబుతూ, అప్పటి చరిత్రను మనకు చూపెట్టే ప్రయత్నం చేస్తాడు.
  ఆ టెక్నిక్ ను నేను ఈ కథలో వాడాను. వాళ్లు డోలి మోసుకు నడుస్తున్నప్పుడు చుట్టుపక్కల జరిగిన నిర్బంధ వాతావరణాన్ని మాటల ద్వారా, దృశ్యాల ద్వారా, చెప్పే ప్రయత్నం చేశాను. ఇదొక విధంగా “యాత్ర కథనం” లాంటిది అన్నమాట. వాళ్లు వాగు దాటేటప్పుడు, నేను స్వయంగా వాగు దాటిన అనుభవం నాకు పనికి వచ్చింది. ప్రకృతిని వర్ణించేటప్పుడు బాగా లీనమై రాయడం నాకు ఇష్టం.
  *
  కథ చివరలో తల్లి బిడ్డలు ఇద్దరు చనిపోతారని ముగింపుని ఇచ్చాను. ఆ విషయాన్ని మిత్రుడు రాఘవాచారితో పంచుకున్నాను. “తల్లి బిడ్డ మరణించినట్టు చూపిస్తే, అది నిరాశ జనకంగా ఉంటుందని తల్లి మరణించినట్టు, బిడ్డ బతికినట్టు ముగింపు నిస్తే ఒక భరోసా ఇచ్చినట్టుఅవుతుంది” అని చెప్పాడు. అతను చెప్పిన విషయం నాకు నచ్చింది. ముగింపు కుదిరింది. దీన్ని ఆంధ్రజ్యోతికి పంపాను. వాళ్లు ఎందుకో వేసుకోలేదు. గొరుసు జగదీశ్వర్ రెడ్డి ద్వారా ఏదో చెప్పించారు గానినాకు అది నచ్చలేదు. పిండితార్థం ఏమంటే “కథ వేసుకోరు” అన్నది. దండకారణ్యంలో కథల గురించిన వ్యాసం రాస్తూ కాత్యాయని విద్మహే గారు ఈ డోలి కథ ప్రస్తావించారు
  “ఒక మరణం… ఒక జననం
  ఒక అస్తమయం… ఒక ఉదయం”
  ఇదేనేమో అడివి అంటే… ఇదేనేమో జీవితమంటే… అన్న వాక్యాల్ని ఉటంకించడం భలే నచ్చింది. ఏది ఏమైనా కొన్ని కథలు చెప్పడం కన్నా ఫీల్ కావడం మంచిది.
  *
  ఆదివాసీల్ని డోలీలో తీసుకుపోవడం సాధారణంగా వింటూనే ఉంటాం. తన భార్య చనిపోతే చాపలు తిట్టుకొని భుజం మీద పెట్టుకొని నడిచిన ఆదివాసీని చూసి ప్రపంచమంతా కదిలిపోయింది. కవితలు కూడావచ్చాయి. కానీ పోలీసు కాల్పులలో చనిపోయిన ఉద్యమ మహిళను ఒంటి కట్టెకు గొడ్డులా కట్టుకొని అడవి గుండా తీసుకొనిపోవడం… ఆ దృశ్యం ఎప్పటికీ వెంటాడుతుంది. ఆదివాసి బతుకూ, చావూ ఒక వెటకారమే… రాజ్యానికి.
 2. రచయితగా మీరు ఎదుర్కొన్న వివక్షలు, అవమానాలు మీరు పొందిన ఆనందాల గురించి చెప్తారా?

ఏం చెప్పేది…? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందంటారు. నేను నమ్ముకున్న సంస్థలే నన్ను వెలివేశాయి. అదీ, కొన్ని సంవత్సరాలదాకా. కారణాలు తెలియవు. ఏ మీటింగుకు పిలిచేవాళ్ళు కారు. ఎందుకు దూరం పెడుతున్నారో తెలిసేది కాదు. ఉరివేస్తున్న వాడికైనా కారణాలు చెప్పి ఉరేస్తారు. నాకేమో ఏ కారణమూ చెప్పకుండా వెలేశారు. ఒక ప్రజా సంఘం వాళ్లయితే మా ఊర్లోనే మూడు రోజులు మహాసభలు జరుపుకున్నారు. నాకు మాటమాత్రంగా నైనా చెప్పాలనిపించలేదు. కారణం కూడా చెప్పలేదు.
పోలేపల్లి లో సెజ్ లు ఏర్పడక ముందు ప్రజా సంఘాలు అక్కడికి నిజ నిర్ధారణకు వచ్చి వెళ్ళేవి. ఏదైనా రాయాలన్న ఉద్దేశంతో వాళ్ళ వెంబడి పోవాలి అనుకునేవాడిని. కానీ వాళ్ళెవరు నన్ను లెక్క చేసిన పాపాన పోలేదు. చిత్రమేమంటే నన్ను పాలమూరు కవులు కూడా వెలేశారు. అక్కడికి పాలమూరు కవుల బృందం ఒకటి పోలేపల్లికి పోయి వచ్చిందని తెలిసింది. ఎందుకో వాళ్ళకి నన్నుపిలవాలని పించలేదు!

నేను కవిత్వం రాస్తున్న కొత్తలో కవులకు “COWS “అని ఉద్యమ కార్యకర్తలు జోకుగా పిలిచేవారు. “వీళ్లను ఒక్కసారైనా జైలుకు పంపాలి. అప్పుడే గాని వీళ్లు భూమి మీదకు రారు. వాస్తవాలు అర్థం కావు” అని కామెంట్లు చేసేవారట. కవులంటే కార్యకర్తలకు అంత కోపం ఎందుకో అర్థమయ్యేది కాదు.
*
ఓ కవిత్వపు వర్క్ షాప్ లో దారుణమైన అవమానమే జరిగింది. వర్క్ షాపు ఉందన్న ఆనందంలో నేను ఒక కవితను సెలెక్ట్ చేసుకుని, దానిమీద బాగా ప్రిపేర్ అయిపోయాను. తీరా అక్కడికి వెళ్లాక, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఒక పెద్ద మనిషి మూడు భాషల్లో (ఇంగ్లీషు, హిందీ, తెలుగు) లో కవితలు రాసుకొస్తే ఆయనకు మూడు కవితలకు ఛాన్సులు ఇవ్వడం గాకుండా, వాటి మీద చర్చ కూడా జరిగింది. మాకు కనీసం రెండు రోజుల వర్క్ షాప్ లో ఒక్క కవిత చదవడానికి ఛాన్స్ ఇవ్వలేదు. అస్మదీయులం కానందుకేమో. ఇంకొక పెద్ద మనిషి వస్తూ వస్తూ బస్సులోనో, రైల్లోనూ ఏదో కవిత రాసుకొస్తే ఆయనకు ఛాన్స్ ఇచ్చారు. పోనీ, కవులు ఎక్కువమంది ఉన్నారా… అంటే ఓ పదిహేను దాకా ఉండి ఉంటారు. తక్కిన మరొక ఇరవై మంది పరిశీలకులు వచ్చి ఉంటారు. నిర్వాహకులు మమ్ములను ఉద్దేశపూర్వకంగా పక్కకు పెట్టారని అర్థమైంది. వర్క్ షాప్ ని బాయ్ కాట్ చేసి వచ్చేసాము.
*
మరొకసారి ఓ కథ ల వర్క్ షాప్ కు పోతే అక్కడ ఇట్లాంటి వివక్షనే ఎదురైంది. ఆ మీటింగుకు పేరు గల కథకులే వచ్చారు. వాళ్లకు నన్ను నేను పరిచయం చేసుకొని నా పుస్తకాలని ఇచ్చాను. థాంక్స్ అని కూడా చెప్పకపోవడం వాల్ల సంస్కారానికి నిదర్శనం. తెలంగాణ నుంచి ఒక మేధావి వస్తే అందరూ ఆయన చుట్టూ బెల్లం చుట్టూ ఈగల్లామూగారు (ఇందులో ఆయన తప్పు ఏమీ లేదు). వాళ్ళు తమ తమ పుస్తకాలను ఆయనకు ఇవ్వడానికి పోటీపడ్డారు. కానీ ఏ ఒక్కడికి నాకూ ఓపుస్తకం ఇవ్వాలని అనిపించలేదు (బహుశా నేను సుప్రసిద్ధున్ని కాకపోవడం వల్లనేమో). చిత్రమేమంటే, వీళ్లంతా ప్రాంతీయ, జెండర్ తదితర వివక్షల గురించి తీవ్రంగా విరుచుకుపడతారు. సాహిత్య వివక్షల గురించి మాత్రం మాట్లాడరు. వాపసు వస్తున్నప్పుడు ఎందుకో నా ఖాళీ బ్యాగు నన్ను వెక్కిరించినట్టు అయింది.
*
పక్క జిల్లాలో కథల మీద సెమినార్ పెడుతున్నారంటే కథల మీద ప్రేమ కొద్ది, మా స్నేహితుడి పుస్తక సమీక్ష ఉందన్న ప్రేమ కొద్ది నన్ను పిలువకపోయినా, అక్కడికి వెళ్లాను. తీరా అక్కడికి పోయాక ఎవరు మమ్మల్ని దేకనన్నా దేకలేదు. వేదిక మీద ఉన్న వాళ్ళు, ఒకరినొకరు విసుగు పుట్టేంతగా పొగుడుకోవడంతో సరిపోయింది. నిర్వాహకులు అందరూ హైదరాబాద్ నుంచి వచ్చిన పెద్దమనిషి చుట్టూ మూగడం, ఆయన్ని ఆకాశానికి ఎత్తడం, జుగుప్సగా మారిపోయింది. ఎవరికైనా సెమినార్ అంటే రోత పుట్టేలా చేశారు.

మధ్యాహ్నం పూట, మేమందరం సీదాసాదా భోజనం చేస్తే, అస్మదీయులకు హోటల్లో ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేశారు. మేము నిర్వాహకులకు పరిచయమున్నా, అసలు గుర్తుపట్టనట్టే నటించారు. మధ్యాహ్నం సెషన్కు ఎనిమిది మందే మిగిలారు. పెద్దమనిషి వెళ్లిపోవడంతో ఈ పొగడ్తల సంత మాయమైపోయింది. ఆ విధంగా కథ భాస ముగిసింది.
*
అప్పట్లో ఉపాధ్యాయ పత్రికలో నా కవితలు విరివిగా వచ్చేవి. ఎందుకో గాని నా పేరు కింద సంపాదకుల వారు తమ పేరు కూడా వేసుకునేవారు. నేను కవిత రాస్తే తన పేరు ఎందుకు జోడిస్తున్నాడో అర్థమయ్యే చచ్చేదికాదు. అంటే ఒక కవితను మేమిద్దరం జంట కవులం, రాసేమని అర్థం అన్నమాట. నా మడ్డి బుర్రకు రహస్యం అర్థమయ్యేది కాదు.

ఓసారి గుంటూరు సభల్లో హోటల్ కాడ సంపాదకుల వారిని అడిగాను “ఏం సార్… నా పేరు కింద మీ పేరు ఎందుకు వేసుకుంటున్నారు” అని. దానికాయన తడుముకోకుండా “ఏం లేదండి మీ కవితలో అక్కడక్కడ కరెక్షన్స్ చేస్తున్నాను. అంటే అందులో నా శ్రమ కూడా ఉంది కదా. అందుకని నా పేరు కూడా కింద రాస్తున్నాను” అన్నాడు ఆయన. నేను ఏం జవాబు చెప్పాలో తెలువక నెత్తి గోక్కుంటుంటే, వెంటనే మా రాఘవాచారి అందుకున్నాడు. “ఐడియా బాగుంది సార్. ఆయన కవిత అచ్చు కావడంలో ప్రెస్ కార్మికుల శ్రమ కూడా ఉంటది కదా. వాళ్లందరి పేర్లు కూడా సార్ పేరు కింద వేసుకుంటే సరిపోతుంది కదా…” అంటూ దిమ్మతిరిగే జవాబు ఇచ్చాడు. దాంతో ఆయనకు నోట మాట రాలేదు. తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ, నా కవితలు అచ్చేయడం మెల్లమెల్లగా తగ్గిపోయింది. కొంత కాలం తర్వాత మొత్తంగా బంద్ అయింది.
*
“నేను కవితాసంకలనం” తేవాలనుకుంటున్న. ఒక్క పూట కూర్చుని మొత్తం కవితల మీద చర్చ జరిపితే బావుంటది” అని అడిగితే” అమ్మో నావల్ల కాదు. నేను రెండు మూడు గంటలు మాత్రమే టైం ఇవ్వగలను” అని ముఖం మీద అనగలిగిన వాళ్ళు ఉన్నారు. అప్పట్లో నేను “కప్పల తక్కెడ”కవిత రాస్తే, ఏకంగా నన్ను”కప్ప” అని చాటుమాటుగా పిల్చిన వాళ్ళు ఉన్నారు.
*
నన్ను ఆకాశవాణి వాళ్ళు కవితలు చదవడానికి ఎన్నుకున్నారు. ఒకసారి పుస్తకాలు ఇచ్చి వెళ్ళమన్నారు. నేను ఆ సంతోషంలో అందరికీ ఆ సంగతి చాటింపు వేశాను. హడావిడిగా ఓ మూడు పుస్తకాలు తీసుకుపోయి ఇచ్చి వచ్చాను. ఏం జరిగిందో కానీ నన్ను పిలువలేదు. పిలిచింది వాళ్లే, తిరస్కరించిందీ వాళ్లే. కార్పొరేట్ కంపెనీల లాగా కారణాలు చెప్పరు.

కొన్ని సంఘటనలకు ఏడవాలో నవ్వాలో తెల్వదు. బాల్యం మీద రాసిన నా కవిత (ఏ బాల్యం… ఏ స్వప్నం… ఏ గాంధర్వం) అనేది ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్య ( ప్రొఫెసర్ జి. రామిరెడ్డి కాలేజ్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్) External exams కు సంబంధించిన M.A. 2nd Year( telugu)
కు పాఠ్యాంశంలో చేర్చారని సంవత్సరం తర్వాత తెలిసింది. ఆ విషయమే ఒక బాధ్యుడిని అడిగాను. “కనీసం అన్న చెప్పలేదు ఏంటి సార్”అంటే. “మాకు ఇదే పనా… ఎంతమందికి చెబుతామండి” అంటూ కసురుకున్నాడాయన. నా కవిత సెలెక్ట్ అయినందుకు సంతోషించాలో, ఆయన చెప్పనందుకు, కసురు కున్నందుకు ఏడవాలో తెలియదు.

నా దగ్గరకు Ph.D. చేస్తామని వస్తారు. బుక్స్ తీసుకుపోతారు. నా దగ్గర అన్ని రకాల సహాయాలు తీసుకుంటారు. చివరికి Synopsis రాయడానికి కూడా నా సహాయం తీసుకుంటారు. తీరా Ph.D.లో సీటు వచ్చాక మాయమైపోతారు. కారణం కూడా చెప్పరు. ఇటీవల ఒక పెద్ద మనిషి నా రచనల మీద Ph.D. చేశాడని తెలిసింది (అది ఒక సంవత్సరం అయినాక). ఆ పెద్దమనిషి నా పుస్తకాలు తీసుకుపోవడానికి, ఒక్కసారి మాత్రమే కలిసిపోయాడు. తర్వాత ఎప్పుడు ఫోన్ చేయడం గాని, కలవడం గానీ చేయలేదు. నేను ఆ కాపీ కూడా చూడలేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు.
*
సాధారణంగా సృజనాత్మక రచయిత/కవికి, కొంత అమాయకత్వం ఉంటుందని విజ్ఞులు చెప్తారు. ఇది నాకు కూడా వర్తిస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాల్సింది పోయి, అనేక సందర్భాలలో వెక్కిరింతకు గురిచేసిన స్నేహితులు ఉన్నారు.

మీడియా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి నేను సభకు అధ్యక్షత వహించి రెండు గంటల పైనే వేదిక మీద ఉన్నాను. మరుసటిరోజు పేపర్లో కనీస ప్రస్తావన ఉండదు సరి కదా సభలో కూర్చున్న వ్యక్తుల పేర్లు ప్రముఖంగా రాసేస్తారు. ఇదేం సైకాలజో నాకు అర్థం కాదు. ఒకసారి జిల్లా పరిషత్ ఆఫీసులో జరిగిన కవి సభ సందర్భంగా అక్కడ వసతులు బాగా లేవని, మేం బాయ్ కాట్ చేస్తే, మరుసటి రోజు ఓ పత్రికలో మా గురించి నెగిటివ్ గా రాసి పడేశారు. చాలా ఉన్నాయి.
“అనుభవాలకు ఏం తక్కువ
జీవితమంతా అవమానాల వెల్లువ”
చివరగా B.D. శర్మ గారి మాటలతో ముగిస్తాను. ఒకసారి ఆయన సుందరయ్య విజ్ఞాన్ భవన్ లో మీటింగ్ కు వచ్చినప్పుడు కలిశాను (అదే మొదటిది , అదే ఆఖరిది). భోజన విరామ సమయంలో ఆయనతో మాట్లాడుతూ “సార్… మీరు ఆదివాసీలకు మద్దతు ఇచ్చినందుకు బిజెపి వాళ్లు చాలా అవమానించారు గదా (నగ్నంగా, చెప్పుల దండతో ఉపయోగిస్తూ). ఇంత జరిగినా ఈ ఉద్యమాల్లో పనిచేస్తున్నప్పుడు ఎక్కడ సంకోచం అనిపించదా?” అన్నాను. ఆయన నవ్వుతూ “మనం వీటికి అలవాటు పడాలి” అన్నాడు సీదా సాదాగా.
బహుశా నేను అయనంత ఎత్తుకు ఎదగలేదేమో. కానీ ఆ మాటలు నా మీద చాలా ప్రభావం చూపాయి. చిన్న చిన్న మాటలకే గాయపడే నేను… ఇవన్నీ మామూలే కదా. భరించాలి కదా అనే sense వచ్చాక సంకోచాలు పోయి, ధైర్యం పెరిగింది.
*
రచయితగా ఎదుర్కొన్న అవమానాలు, ఆనందాలు :
ఆ రోజులు ఉన్నాయి. సంతోషపడ్డ రోజులు ఉన్నాయి. కవిగా, రచయితగా నాకు కొంత పేరు వచ్చినప్పుడు నన్ను మరింతగా గుర్తించడం మొదలుపెట్టారు. “మీ పాలమూరు వాళ్ళు బాగా రాస్తారండి” అన్న కృష్ణాబాయి గారి మాటలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. అది నాకు లభించిన మొదటి సర్టిఫికెట్.

డిగ్రీ చదివే రోజుల్లో నా మొదటి కవిత “ఆమె పాట” కాలేజీ మేగజైన్లో అచ్చయింది. దాన్ని చదివిన మా తెలుగు లెక్చరర్ విద్యాసాగర్ సారు నన్ను స్టాఫ్ రూముకు పిలిచి “బాగా రాశావో య్… అది చదువుతుంటే వర్డ్స్ వర్త్ జ్ఞాపకం వచ్చాడు” అన్నాడు, మెచ్చుకోలుగా. నేను గాల్లో రెండు అడుగులు పైకి లేచాను. ఎవరితోనో చెప్పుకోలేదు గాని నాలో నేను చాలా కాలం మురిసిపోయాను.
కవిత్వం మొదలుపెట్టిన చాలా కాలానికి కథలు మొదలు పెట్టాను. రెండు కథలు( ఇన్కమ్ టాక్స్, ఆకాశమే హద్దుగా) వార్త పేపర్లో అయితే అచ్చయినై గాని, నామీద నాకే నమ్మకం లేదు.
*
ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఓ రాత్రి నాకు వచ్చిన ఓకలను కథ (భయం) రాసి భయం భయంగా అరుణ తారకు పంపాను. అది వెంటనే అచ్చయింది. ఏకకాలంలో ఆనందమూ, ఆశ్చర్యమూ కలిగాయి. నా కథ రావడం రావడమే ఒక సుప్రసిద్ధ మేగజైన్లో రావడం గర్వకారణం అనిపించింది. అడుగు ముందుకు పడింది.
ఆ కాలంలో “భారతి” మాసపత్రిక వచ్చేది. విలువల రీత్యా దాన్ని గొప్ప పత్రిక గా పరిగణించేవారు. చూద్దామని రెండు కవితలు పంపాను. వాళ్లు వరుసగా రెండు కవితల్ని అచ్చేసుకున్నారు. నాకు చాలా గర్వకారణం అనిపించింది. ఒక మెట్టు పైకెక్కినట్టు అనిపించింది.
అప్పట్లో ఆంధ్రప్రభలో “తరుణ కవిత” అనే శీర్షిక కింద కొత్త గొంతులను ఆహ్వానించేవాళ్లు. ఆ శీర్షిక కింద నా కవితలు బాగానే అచ్చయ్యాయి. ప్రతి మంగళవారం జడ్చర్ల బస్టాండ్ కి పోయి ఆంధ్రప్రభ పేపర్ కొని, అచ్చులో నా పేరు చూసుకొని తెగ మురిసిపోయేవాడిని. ఆ సంతోషంలో బస్టాండ్ నాకు నందనవనంలా అనిపించేది.
జడ్చర్లలో “సృజన” అచ్చయినప్పుడు, దాన్ని ప్రభావం మా మీద చాలా ఉండేది. సరే, అది పక్కన పెడితే, అట్ట మీద కొన్ని కవిత వాక్యాలు వేసేవారు. అవి చాలా అద్భుతంగా ఉండేవి.
“నా నెత్తురు వాడి కత్తి
నా బతుకు కన్నీటివొత్తి
కరువులో అధికమాసం నా జీవితం ”
– చంద్రం
అబ్బా… ఏం రాశాడు రా… అని నోరెళ్ళ పెట్టేవాళ్ళం. అట్టమీద వాక్యాలు పడాలంటే, పెట్టి పుట్టాలి అని అప్పట్లో అనుకునేవాళ్ళం. అరుణ తార, మాతృకలలో నా కవిత్వంలోని కొన్ని చరణాలను అట్టమీద వేసి, నా అక్షరాలకు కవితా గౌరవాన్ని ఇచ్చారు.
*
అప్పట్లో సృజనలో కవితలు పడాలంటే మామూలు విషయం కాదు… అనుకునేవాళ్ళం. తర్వాతి కాలంలో సృజనలో నావి రెండు కవితలు అచ్చైనట్లు గుర్తుంది. అప్పట్లో నాకది గొప్ప. నేను కాస్త పుంజుకున్ననాటికి సృజన బంద్ అయిపోయింది.

పొద్దుటూరులో జరిగిన విరసం సభల్లో ఓ ముస్లిం అమ్మాయి పరిచయమైంది. ఆమె మతాంతర వివాహం చేసుకుంది. సభలో ఆమెను చూసి ముచ్చటపడి , “ఆ పిల్ల” అని ఓ కవిత రాశాను. అది ఏదో పత్రికలో అచ్చయింది. ఇంగ్లీషులో కూడా అచ్చయింది. తెలుగు కవితను ఆమెకు పంపాను. ఆమె దాన్ని ప్రేమగా ఫ్రేమ్ కట్టుకొని, గోడకు వేలాడదీసింది. దాని దగ్గరకు పోతే తనతో గొడవ పెట్టుకునేదని ఆమె సహచరుడు స్వయంగా నాతో చెప్పడం విశేషం.

ఉద్యమకారుల మీద “ప్రేమికులు” అనే కవిత రాసి ఫేస్బుక్లో పెట్టాను. అది బాగా వైరల్ అయింది. అది చూసిన “సాక్షి “పేపర్ సంపాదకులు రామతీర్థ గారు దాన్ని ఇంగ్లీషులోకి (the lovers) అనువాదం చేసి నాకు పంపడం మరువలేని అనుభూతి.
*
షాద్ నగర్ లో ఒకమిత్రుడు మాట్లాడుతూ… “సార్… మీ కవితను నేను ( హాస్టల్ లో) పెట్టెకు అతికించుకొని, రోజు ఒకసారి చదువుకుంటాను సార్ ” అంటే ఏమని థాంక్స్ చెప్పాలో అర్థం కాలేదు.
పౌర హక్కుల సంఘం బాధ్యుడు తిరుమల్ ఒక సంఘటన చెప్పాడు. షాద్ నగర్ ప్రాంతంలో నర్సులు అందరూ కలిసి, వాళ్ళ పై అధికారి వేధింపులకు వ్యతిరేకంగా స్ట్రైక్ చేశారు. దానికి పౌర హక్కుల సంఘం తోడ్పాటు కూడా ఉంది. సంతకాల సేకరణ మొదలయింది. కొందరు నర్సులు భయం వల్లనో భద్రత వల్లనో, ఇంకా మరే కారణం వల్లనో సంతకం పెట్టడానికి నిరాకరించారట. ఎంత చెప్పినా వాళ్లు వినలేదట. చివరికి తిర్మల్ నా కవితలోని కొన్ని చరణాలు వాళ్లకు వినిపించాక ఎట్టకేలకు కన్విన్స్ అయి సంతకం పెట్టారట. ఇది నమ్మడానికి ఇబ్బందే కానీ చెప్పింది తిరుమల్. కవిత్వానికి అంతా బలముంటుందని ఆయన చెబితేనే తెలిసింది
*
కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. “మన అమ్మను మనమే రక్షించుకుందాం” అని అమరుల తల్లుల గురించి నేను ఒక కవిత రాశాను. దానిని ఒక మిత్రుడు కరపత్రంగా వేసి గుంటూరు సభలలో పంచిపెట్టాడట. వొస్తూ వొస్తూ ఉదయ్ సారు నాకు ఓ కరపత్రం తెచ్చాడు. పసుపు పచ్చ రంగులో కరపత్రం చూసి మురిసి పోయాను. కవులు అల్పసంతోషులు కదా.
*
కథల గురించి కథలు ఉన్నాయి. “సార్ మీ కథలు చదివినాకనే నేను కథలు రాయడం మొదలు పెట్టాను” అన్న మిత్రులు ఉన్నారు. “చివరి వాక్యం కథ చదివి, నేను బాగా ఏడ్చాను” అన్న శివరాత్రి సుధాకర్ మాటలు విని నా కథ సక్సెస్ అయినందుకు గర్వపడ్డాను. “అయ్యా… నీకథలు చదువుతున్నాను. పుస్తకం కింద పడితే శబ్దంతో డిస్టర్బ్ అయిపోతానేమోననే ఏకాగ్రతతో చదువుతున్నాను” అన్న మిత్రులు ఉన్నారు.

నా కథ “క్లీన్ అండ్ గ్రీన్” అనే దాన్ని శాంతసుందరి గారు హిందీలోకి అనువదించి, ఒక సుప్రసిద్ధ పత్రికకు పంపడంతో వాళ్లు దాన్ని అచ్చే సుకున్నారు. ఆమె అచ్చయిన ఆ హిందీ కాపీని నాకు పంపింది. అది ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది. నేను ఆ ఎడిటర్ తో మాట్లాడడం కూడా ఒక అనుభూతి.
*
తెలంగాణ రాకముందు “నమస్తే తెలంగాణ” పత్రిక పట్ల విపరీతమైన క్రేజ్ ఉండేది. అప్పట్లో నావి కొన్ని కవితలు, పాటలు దానిలోవచ్చాయి. ఆ పత్రిక ఆదివారం అనుబంధంలో నా కథ “తెలంగాణ సీత”వచ్చింది. అప్పటికి ఇంకా తెలంగాణ రాలేదు. ఉద్యమం జోరుగా సాగుతున్నది. అప్పట్లో విద్యార్థులు , తెలంగాణ రాదేమో, అన్ననిరాశలో విపరీతంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీని మీద ఒక కథ రాయాలని అనుకున్నాను.

తెలంగాణను సీతగా చిత్రీకరించి, ఆంధ్ర పెత్తందారులను రావణాసురులుగా చిత్రీకరించి, వాళ్ళ కబ్జాలో తెలంగాణ చిక్కుకుపోయినట్టు కథ నడిపించాను. హనుమంతుడు భూమ్మీద ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆశతో మారు వేషంతో వచ్చి రచయితను కలుస్తాడు. అప్పుడు ఆ రచయిత మారు వేషంలో ఉన్న హనుమంతుడిని తెలంగాణ అంతట తిప్పి పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు. అక్కడి కరువును, కష్టాలను చూపుతాడు. చివరికి హనుమంతుడు విద్యార్థుల ఆత్మహత్య చూసి విపరీతంగా చలించిపోతాడు. అందర్నీ తన గదతో దునుమాడాలని నిశ్చయించుకుంటాడు. అది టెర్రరిస్ట్ చర్య అని రచయిత చెప్పడంతో విరమించుకుంటాడు. చివరకు విద్యార్థులను ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి, త్వరలోనే తెలంగాణ వస్తుందని చెప్పి, ఆకాశ మార్గంలో వెళ్ళిపోతాడు. స్థూలంగా కథ ఇది. “నమస్తే తెలంగాణ”కు పంపాను. మూడు రోజుల వ్యవధిలో కథ అచ్చ యింది.

ఆ రోజు పొద్దున ఐదు గంటలకే, ఆరవ తరగతి చదివే పిల్లగాడి నుంచి ఫోన్ వచ్చింది. “అంకుల్ మీ కథ చాలా బాగుంది” అని. ఇక అక్కడి నుంచి మొదలుపెడితే, ఫోన్ల పరంపర రాత్రి వరకు ఆగలేదు. సరిగ్గా చెప్పాలంటే ప్రశంసల వర్షంలో తడిసి ముద్దయ్యాను. అటువంటి అనుభూతి నాకెప్పుడూ జరగలేదు. విద్యార్థులు, గృహిణులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, లారీ డ్రైవర్లు, పాస్టర్లు, ఆంధ్ర విద్యార్థులు ఇలా ఒకరేమిటి. ఊపిరి పీల్చుకోనీయలేదు . వాళ్లలో తెలంగాణ ఆకాంక్ష ఎంత బలంగా ఉందో నాకు ఆ కథ ద్వారా తెలిసింది.

“అన్నా… ఆఖరికి హనుమంతుడిని కూడా భూమ్మీదికి రప్పిస్తివి గదనే” అని ఒక లారీ డ్రైవర్ మెచ్చుకున్నాడు.
“నాది ఆంధ్ర ప్రాంతమండి. కానీ తెలంగాణ రావాలని కోరుకుంటున్నాను. ఎంత అన్యాయం జరుగుతోందండి ఇక్కడ. రావాలి. తెలంగాణ రావాలి” అంటూ ఒక పాస్టర్ చెప్పుకొస్తాడు. పాస్టర్లు రాజకీయాలు మాట్లాడడం నేను వినడం ఇది మొదటిసారి. చిత్రమేమంటే ఆంధ్ర విద్యార్థులు కూడా ఫోన్ చేసి తెలంగాణకు మద్దతు ఇవ్వడం ఆశ్చర్యమనిపించింది.

మరొక ప్రత్యేక వ్యక్తి గురించి చెప్పాలి. సిటీనుంచి ఓ కోమటామె ఫోన్ జేసి, “మాది జడ్చర్ల నే సార్. బిజినెస్ కోసం సిటీ కొచ్చినం. మీ కథ చాలా బాగుంది. మా జడ్చర్లలో ఇంత మంచిగా కథలు రాసేవాళ్ళు ఉన్నారంటే నాకు నమ్మబుద్ధి అయితలేదు. ఈ కథను నా పెట్టెలో భద్రంగా దాచుకొని, మనశ్శాంతి లేనప్పుడు చదువుకుంటాను సార్ అన్నది”. ఇంతకన్నా రచయితకు ఏం కావాలి?
ఏ అర్ధరాత్రి కో ఫోన్ల పరంపర ఆగిపోయింది. కథను ఏకబిగిన రాయటం, అది సమకాలీనతను ప్రతిబింబించడం, అన్నిటికన్నా ముఖ్యంగా రామాయణ పాత్రలు (సీత, హనుమంతుడు)లను కథలోకి తీసుకోవడంతో కథ ఎక్కడికో వెళ్లిపోయింది. నాకు ఆ రోజు మరుపురాని రోజు.
*
“బాసగూడ” నాటకంది మరో అనుభవం. అది ఇంతకుముందే చెప్పేసి ఉన్న. కాకపోతే హైదరాబాదులోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో దాన్ని వేసినప్పుడు, సుధాకర్ శర్మ సార్ వచ్చి, మా నాటక సంస్థకు ఐదువేల రూపాయలు బహుమతిగా ఇవ్వడం మరపురానిది. రాండి ఎంత మౌనంగా వచ్చాడో అంతే మౌనంగా వెళ్ళిపోయాడు.

బొబ్బిలి విరసం సభలో, పుస్తక పరిచయం జరుగుతోంది. నేను ఒక పుస్తకాన్ని బాసిత్ (ఇంగ్లీష్ నాటకం) పరిచయం చేయవలసి ఉంది. నాతో పాటు పరిచయ కర్తలు స్టేజి మీద కూర్చున్నారు. కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు. నా పక్కన ఉన్న మిత్రుడు (పేరు గుర్తులేదు) నాతో మాట్లాడుతూ “సార్, చెరబండరాజు తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో రాస్తున్నది మీరే సార్” అన్నాడు. ఆయన అట్లా అభిమానంతో అన్నాడే గాని, చెరబండరాజుకు నాకు పోలికలు లేవు. ఆయన ఒక శిఖరం. నేను ఒక గులకరాయి. అయినా నన్ను ఆయనతో పోల్చడం, ఎక్కడో చిన్న తృప్తి. కవులం గదా.

హైదరాబాదులో బాసగూడ నాటకం మీద ఒక చర్చ జరిగిందట. కాకరాల గారు ఆ నాటకం మీద మాట్లాడుతూ, అది బెర్టోల్ బ్రెహ్ట్ నాటకంతో పోలి ఉన్నది అన్నాడట. ఎక్కడి బ్రెహ్ట్… ఎక్కడి బాసగూడ. పోలిక నచ్చింది. బాధ్యతను పెంచింది. కోట్లాదిమంది పీడితుల తరఫున రాస్తున్నప్పుడు బాధ్యతాఉండాలి , నమ్రతా ఉండాలి.

వివి గారు, భీమా కోరేగాం కేసులో అరెస్టయి జైల్లో ఉన్నప్పుడు, ములాఖాత్ లో ఆయనను కలవడానికి మిత్రులు పోతుండేవారు. అలా పోయిన మిత్రులతో సారు “ఉదయమిత్రను తప్పకుండా “దర్వేష్” కవితల్ని చదవమని చెప్పండి” అన్నాడట. దారుణమైన జైలు జీవితం, ఉక్కపోత, ఒంటరితనం, అనారోగ్యం, వృద్ధాప్యం… ఇన్నింటి మధ్యన సతమతమవుతూ, ఎక్కడో పాలమూరులో, ఒక మూల రాస్తున్న నన్ను ఆయన గుర్తించుకోవడం, సలహా ఇవ్వడం, నేనే నమ్మలేకపోతున్నాను.
చెప్పడంలో చాలా మిస్సయి ఉంటాను.
ఇదొక మజిలీ. ప్రయాణం పెద్దది.
“The woods are lovely, deep and dark.
But I have to travel thousands of kilometres
Before I sleep”.
– Words worth

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ). 'కొలిమి' వెబ్ మేగజీన్ ఎడిటోరియల్ లో పనిచేస్తున్నాడు.

Leave a Reply