కమురు వాసన

రక్తంతో గీసిన సరిహద్దు గీతతో
రెండు వీధులూ రెండు తలలుగా గల
ఒక శరీరమే ఊరు.

ఒక వైపు తోక తొక్కితే
రెండవ వైపు పడగవిప్పి ఆడుతూనే ఉంది

గాలి నల్లగా వీయడం మానలేదు
నీరు శిలలా గడ్డకట్టటం ఆగలేదు

కాకుల ఆత్మహత్యతో
చెట్లు ఏకాకిలయ్యాయి.

శబ్దం సన్యాసాన్ని స్వీకరించి
శూన్యాన్ని పరిచింది

కులం కమురువాసన కప్పేసిన
ఊరు ముఖంలో మసకబారిపోయింది
మనిషి ఉనికి.

స్మశానానికి విడిదిగా మారిన నిశ్శబ్దంలో
ఊరి నడిబొడ్డున వేలాడే కులం కత్తి
మనసులను చంపి
మనుషులను శవాలుగా బ్రతికించాలని
అలాగే గురిపెట్టే ఉంది .

పుట్టింది ప్రకాశం జిల్లా జె. పంగులూరు. కవి, అధ్యాపకుడు. ఎంఏ (ఇంగ్లిష్)- అన్నామలై యూనివర్సిటీ, ఎంఏ(హిస్టరీ)- నాగార్జున యూనివర్సిటీ, ఎంఈడీ -(అన్నామలై యూనివర్సటీ) చదివారు. రచనలు: మనం కాసేపు మాట్లాడుకుందాం...(2018), అద్దంకి సాహితీ స్రవంతి బాధ్యుడిగా ఉన్నారు. మేదరమెట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వివిధ పత్రికల్లో కవితలు అచ్చయ్యాయి.

Leave a Reply