Saudade

తేలికగా ఉండటమంటే ఏమిటి?

బహుశా నాకు తెలీదు. అది సాయంకాలపు ఎండ కావొచ్చు. దేహంలోకి
చొచ్చుకుపోయే గాలీ కావొచ్చు. ఒక అద్భుతం. నీరులాగా తుంపరలాగానూ
వుండటం. అది ప్రేమ కూడా. తేలికగా వుండటం అదే కావొచ్చును

ప్రేమించడం, నిర్మలంగా నవ్వడం మృదువుగా మాట్లాడటం- తెలియదు నాకు.
ప్రతిక్షణం ముక్కలుగా రాలిపడటం ఇతరులను గాయపరచటం నాకు తెలిసిన జీవితం. అది ఈ వాచకం కూడా

మరెప్పుడో మొదలయ్యింది. సంఘర్షణతోనే. ఇక్కడే అంతమవుతుంది సంఘర్షణతోనే. కానీ, పాదాల చుట్టూ చుట్టుకునే నీడా దేహంపై కదులాడే ఎండా? ఇవి కూడా వాస్తవాలు

ప్రేమ కూడా వాస్తవం

ఈ శాపగ్రస్త పదాల ముందు ఆమె నిర్లిప్తంగా కదులాడింది.
ఈ శాపవిమోచనం లేని పదాలతో పాటు ఆమె నిరాసక్తతగా నడుస్తూ వుంది.
సగం తెరుచుకున్న పెదవులు. కనులలో రోగగ్రస్థమైన ఎర్రటి జీర.
ఒక స్పర్శ. ప్రాణప్రదమైనదాన్ని ఒడిసి పట్టుకున్నట్లు లేదా తల్లి నుంచి విడిపోతున్న తల్లి చూపూ

ద్రోహం: ఉండకపోవడం. ఉండటమూ నేరం

ఉండటం ఉండకపోవడం మధ్య, హస్తాల మధ్య తడిలా పారిపోయే నీరులా అదృశ్యమైనది ఏమిటి?

ఉండటం. ఉండకపోవడం

భౌతికమైన ప్రేమ. ప్రేమ నుంచి మరింత దీర్ఘంగా, ఎండాకాలంలో
పల్చనయ్యి బలహీనంగా తడిమే సన్నటి నదీ చారికలా ఆవిరవ్వకుండా
మాయమయ్యే ఇంద్రజాలపు రూపం. ఒక సూర్యకిరణం లేదా చిట్లి
సప్త రంగులుగా బయల్పడే సౌందర్యవంతమైన చిరునవ్వు, హింసాత్మకంగా
ఏడు రంగులలో ప్రతిబింబించే వెక్కిళ్ల రోదన. నొప్పి కూడా. అర్ధరాత్రి
ఎండాకాలం తన పాదం ముంగిట మోపే సుదూర సమీప సమయాన,
ఎండాకాలం తన తొలి వేడిమి రెక్కలను అల్లార్చే దిగులు పారిజాత పరిమళ
గాయపు సమయాన

వొక స్వరం. లేదా వొక భాష

సుదూరం నుంచి, మరచిపోయిన లేదా మరచిపోయినదేదో వొదిలి వెళ్లిన
సువాసనలాగా, అప్పుడెప్పుడో వర్షఛాయ వ్యాపించిన మధ్యాహ్నం, మేఘాలు
మృదువుగా కదులుతోన్న నీడల్లా సాగి, గడ్డ కడుతున్న చేతివేళ్లల్లా
అగుతున్నప్పుడు పెదాలపై వొదిలి వెళ్లిన పెదాల ముద్రికలలాగా
గుమికూడుతున్నప్పుడు

సుదూరం నుంచి

మరచిపోవాలనుకున్నదేదో, మరచిపోతే మరణిస్తాననుకున్నదేదో, తిరిగి
వున్మత్త వుద్రేక వృత్తాలుగా దేహాన్నీ, దేహం లోపలి కాలాల నదుల మధ్య
నింపాదిగా కదులుతున్న కలలనీ పిచ్చితనంతో, హింసాత్మక ప్రేమతో
కత్తుల్లా గాయపరుస్తుంది

సుదూరం లేదా దూరం (ప్రశ్న 1: దూరం అంటే ఏమిటి?)
….
సముద్రం నుంచి మేఘాల దాకా మేఘాల నుంచి సముద్రం దాకా భూమిపై
నుంచి భూమి పొరల్లోని సున్నితమైన నదీ ప్రవాహాల్లాగా అచ్చు అమ్మలాగా
గోరింటాకు విచ్చుకున్న నెత్తురు పత్తిపూవులా అరచేతంతా అలుముకున్నట్లు,
ఈ అర్ధరాత్రి చీకటి నొప్పిలో, నాదైన నాది కాని ఈ దేహంలో

నువ్వు!
నిశ్శబ్దంగా యుద్ధ బీభత్స తీవ్రతతో, ఊహించీ ఊహించలేనంతగా,
వర్షపు చుక్కలు మట్టిని గాయపర్చిన తీవ్రతతో, అపస్మారకపు సాయంత్రం
ఆకస్మికంగా నోరు నొక్కి గుండెల్లో దింపిన కత్తి మత్తు వాస్తవంతో,
గోరువెచ్చని నీటిలాంటి రాత్రిపూట దేహం లోపలంతా నలుమూలలా
నింపాదిగా ముళ్ల రక్తపు జ్ఞాపకాలతో దిగబడే, లోతుగా విత్తనాల్లా నాటుకుని మొలుచుకువచ్చే

నువ్వు


(ప్రశ్న 2: నువ్వు అంటే ఎవరు?)

వొట్టి ప్రతీకలు. నగిషీల భాషా ప్రతీకలు. సౌందర్యాత్మకమైన భాష,
సౌందర్యాత్మక హింస. హింసా సౌందర్యం. సౌందర్యపు హింస

ఇప్పుడే ఇక్కడే ఉన్నంత సుదూర సమయాన
నాలుగు చినుకులు చూరు నుంచి జారి అంతదాకా కురిసి వెళ్లిపోయిన
వర్షాన్ని జ్ఞాపకం చేసినట్లు, ఒక వర్షాకాలపు తొలి రోజుల మధ్య నుంచి,
అదే వర్షాకాలపు సజల రాత్రుళ్లలో మేఘాల మధ్య చిక్కుకుపోయిన
చందమామను వెతుక్కుంటున్నట్లు ఒక దేహం గురించీ, దేహంలాంటి
స్వప్నం గురించీ- తనను వొదిలివేసి వెళ్లిన కొడుకుల్ని మృత్యునయనాలతో
ఆ వృద్దుడు హింసాత్మక కరుణతో కంపిస్తూ గుడ్డిగా కనుల వేళ్లంచులతో
గరుకుగా తడుముకుంటూ ఎదురు చూస్తున్నట్లు- నా కోసం నేను
ఎదురు చూస్తున్నప్పుడు చాలా మామూలుగా ఎదురుపడ్డ
నువ్వు
….
I was simple
I was simpler then
It was simplicity
which seemed so sensual* 1
అవి పదాలన్నీ నువ్వే అయిన రోజులు. నువ్వే అయిన పదాలు అస్తిత్వాన్ని
కమ్ముకున్న రోజులు.
అవి గుసగుసల అమాయకత్వపు ధ్వనుల రోజులు. కనిపించనిదేదో కదలి, గడ్డి మృదువుగా రాత్రితో రాత్రిలో సన్నటి నీటి
కోతలా ఊగులాడినట్లు అనేకానేక సుధీర్ఘ వర్షాల
తరువాత వర్షాకాలాల తరువాత తిరిగి ప్రత్యక్షమయ్యే వ్యతిరేకాలు: పునరావృతమయ్యే పురాతన
ప్రశ్నలు: subject and the other. అతడు అన్నాడు

other is the self
అవి కొన్ని సమయాలు. అవి కొన్ని వ్యక్తిగత సమయాలు. దేహం లోపల
నదులు అంచులదాకా ప్రవహించి, ఏమాత్రం కదలినా ఏ మాత్రం
శబ్దించినా దేహం జ్వలిస్తూ వొలికిపోయేంతగా నిండిపోయిన దేహపు అలల
ఇద్దరివీ అయిన- ఇద్దరివీ కాని వ్యక్తిగత పరిమళ కలల సమయాలు

“నేనొక క్రిష్టియన్ ని” ఆమె అన్నది. “మరి నీకు తెలుసా బైబిల్ లోని
ఆమె కథ గురించి? ఆ కథనం గురించీ? పోనీ నా గురించీ?” అతడు
చిర్నవ్వుతో అడిగాడు. ఆరుబయట అశోక చెట్ల గాలులతో పాటు గాలిలా
మారుతూ ఆమె చిర్నవ్వింది

దేహం
రహస్య దేహం
బహిర్గతమయ్యీ రహస్యంగా మిగిలిపోయే దేహం
దేహం మారుతుంది. అలౌకా చెట్ల గుంపుగానూ, మేఘావృత ఉద్యానవనపు
గులాబీల సందడిగానూ, సముద్ర తెరల నిండైన మెత్తటి పాదాల
స్పర్శలగానూ, ఇంకా ప్రేమపూరితమైన పక్షుల కేరింతలగానూ లేదా
సాయంత్రంపూట బేబీకేర్ సెంటర్ల నుంచి వడివడిగా పొర్లే పిల్లల
హృదయాలగానూ విశ్వంగానూ సమయంగానూ సర్వంగానూ
సర్వరహితంగానూ దేహం మారుతుంది
……
body is a universe in itself అతను అన్నాడు –

నక్షత్రాల కింద, అరతెరచిన కిటికీలోంచి సన్నగా పొగలా జొరపడే వెన్నెలలా
వేకువ
జామున నింపాదిగా వ్యాపించే మంచులా దేహంలోకీ దేహంపైనా
నలువైపులా వీడిపోయి మరొక దేహాన్ని చుట్టుకొని మరలా అంతలోనే
కరిగి పోయి- తిరిగి పునర్జన్మించే- తరచూ తడిమే ఒక ప్రశ్న

ఎవరు ఎవరు?

ఆమె దేహం అతడి దేహమయ్యేంతవరకూ అతడి దేహం ఆమె
దేహమయ్యేంత వరకూ కలగలిసిపోయి వ్యతిరేకార్థాలైన ఏక భాషలా మారిన
పలవరింతల మత్తుసమయాలు

“నన్ను హిందువని అంటారు కానీ మగ పందినని నా అనుమానం”

అతను అన్నాడు

ఒక రాత్రిపూట దేహాన్ని పూర్తిగా చూడాలనే వాంఛతో దుస్తులను, పొలాల
మధ్య కలుపు మొక్కలను పెరికి వేసినట్లు, బంగారు రంగు ద్రావకపు
వున్మాద మెరుపుల మధ్య తునాతునకలు చేసినప్పుడు,
ఆ ముస్లిం ప్రియురాలు అంది కదా

“నేను రజస్వలను. మతపరంగా అపవిత్రను. వొద్దిప్పుడు, నిజంగా

వొద్దిప్పుడు.”

అతను చెప్పాడు: “మనం నిజంగా మతాన్ని పునర్ నిర్వచించుకోవాలి.
నిజంగా మనకు తెలియని, తెలిసీ తెలియని అస్పష్ట ఆకారపు రాముడ్నీ,
జీసస్నీ అల్లానూ …”

నీకు గుర్తుందా? అతడిలోని అతను ప్రశ్నించాడు

ఆ తెల్లని గులాబీపూల చందమామని నువ్వేమని పిలిచే వాడివి?
తెరుచుకున్న తెరచాపల రెక్కల సుతిమెత్తని శబ్దాల కలకలమని కదా
ఏదో ఒకటి వుంటూనే వుంటుంది నాకు తెలియని దుఃఖంనుంచి నీకు తెలిసిన భయ దుఃఖపూరితమైన

జీవితందాకా ఏదో ఒకటి వుంటూనే వుంటుంది. వెనక్కు వెడితే, దేహం
లోపల వానపాముల్లా కదలాడే జ్ఞాపకాల వెంట నిశ్శబ్దశబ్దంగా మెలికలు
తిరుగుతూ వెడితే, మొదటి రక్తస్పర్శ అయినా నా ఎర్రగులాబీ పరిమళమా

నీ దేహంలోకి నీ హృదయంలోకీ నన్ను మృదువుగా ఇంకించుకున్న దానా,
ఒకానొక మధ్యాహ్నంపూట నాకేమీ తెలియని, నాకు తెలిసీ తెలియని నీ
దేహం లోపల నన్ను- పిల్లల ఆటలలోని బొమ్మల్లా, మిఠాయి పొట్లంలా
దాచుకున్నదానా

ఒకానొక రాత్రిపూట నువ్వు

జాబిలి మధ్యగా నెత్తుటి చారికలా చిట్లితే, ఎవరూ లేని ఒంటరి వేసవిలో
ఆకు అల్లాడని కరకు రాత్రిలో నేను పగిలిపోయి విలవిలలాడితే, నా మొదటి
అర్థంకాని చందమామా నువ్వు నా ఎదురుగా గాజుగ్లాసులోని
సూర్యజలంలాంటి కాంతిలా తిరిగి వస్తే , నేనేం చేయను? నా చేతి వేలు
నుంచి నింపాదిగా జారిపడుతున్న రక్తంబొట్లల్లా నేనెవరో తెలియని జ్ఞాపకం
మృదువుగా మెత్తగా రాత్రిలా కదులాడుతుంటేనూ, నువ్వూ, పగటి మధ్యాహ్న
సమయాలలోనూ కదులాడిన ఆ క్రైస్తవబిడ్డ కూడా, గుండెలో ఇంకించుకున్న
బాధలా ఎదురుపడితేనూ, ఈ సముద్రమంతానూ, ఈ పొంగి
పోవడమంతానూ
చాలా రోజుల క్రితం, పేరులేని ‘నేను’ లేని రోజుల క్రితం నేను నాదయిన
‘నేను’ లేని వ్యక్తావ్యక్త రోజుల గాఢమైన అలల మధ్య నిశ్శబ్దశబ్దంగా తేలాను.
తేలికగా, మోయలేనంత తేలిక బరువుగా కదులాడాను

గది ఎదురుగా కూర్చుని ఎదురుగా కదిలే మామిడాకుల బాషను
అనువదించటం నైరాశ్యం. అదృశ్యంగా దేహాన్ని పలుకరించే గాలి వేళ్లను
కళ్లతో స్పృశించటం నైరాశ్యం. అస్తిత్వమంతా కరిగిపోయి, ఒక చిన్ని నీటి
చినుకులోకి ఇంకిపోయి వుండటం నైరాశ్యం. వైద్యులు దానిని ఖచ్చితంగా
నైరాశ్యమే అని అన్నారు

మరి, ఒక దాగుడుమూతల మత్తు రాత్రి మధ్య నువ్వేమన్నావు?
“నువ్వెప్పుడూ ఎందుకంత దిగులుగా వుంటావు?”

(Saudade దీర్ఘ కవిత నుంచి …..)

స్వస్థలం హైదరాబాద్. క‌వి, అధ్యాప‌కుడు. వివేక వ‌ర్ధిని క‌ళాశాల‌(హైదరాబాద్)లో అసోసియేట్ ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. 'కొన్ని సమ‌యాలు', 'ఇత‌ర', 'శ్రీకాంత్  (Selected Poems 2013-18, Vol i ), Saudade (Long Poem) అనే క‌వితా సంపుటాలు వ‌చ్చాయి.

Leave a Reply