అసలెందుకు వచ్చానో గుర్తులేదు కానీ
పక్క గదిలో దూపతో వున్న అస్థిపంజారానికి
దుప్పటిలో దాచుకున్న కొన్ని శ్వాసల్ని అప్పుగా ఇవ్వడం
మా కంచంలో దాచిపెట్టుకున్న గుండెను
ఆకలితో వున్న లాఠీల పంటికి అందడం
దుఃఖంతో ఎవరి పిడికిలిని వారే నమిలిన జ్ఞాపకాలు
పాటను పుక్కిలించి నల్లటి గోడను ఎరుపు చేసిన గుర్తులు
పాత కన్నీటి చుక్కలను వెతికి సంచీలో దాచిపెట్టుకోవడాలు
ఎవరికైనా కొన్ని కన్నీళ్లను ఉచితంగా ఇవ్వడాలు
ఎవరిదగ్గరైన వొక ఏకాంత నవ్వును అప్పుగా తీసుకోవడాలు
అసలెంత బాగుండేదో జైలు బతుకంటే
గాలి చాలా రుచిగా వుండేది
ఆకలి వేసినప్పుడల్లా కొద్దికొద్దిగా తింటూ
మూగసైగలతో ముగ్గులు వేసుకునేవాళ్ళం
ఏది పగలో ఏది రాత్రో తెలియక
గోడల నీడ కిందే కాస్త నిద్రపోయేవాళ్ళం
లాఠీలకు వున్నట్టే గోడలకూ నిద్ర నిషిద్ధం !
వెలుతురు కోసం గది నిండా కవిత రాసుకునే వాళ్ళం
మిలమిల మెరుస్తూ పెనుమంటలై రగుల్తూ
అక్షరాలు రెప్పలు తెరిచి ముచ్చట్లు పెట్టేవి
ఆ పెనుమంటలోనే మాకు పగలు
బూట్ల చప్పుడుకు చాలీచాలని నిద్రలో వున్నపుడే మాకు రాత్రి!
ఇప్పుడెవరిది ఏకాంత హృదయం కాదు
ఇక్కడ జోకొట్టడానికి అమ్మ లేకపోయినా
తోడుండటానికి తోడుగా ఎగరటానికి
జైలు గోడలపై నెత్తుటి నినాదాలే ప్రియురాళ్ళు పావురాళ్ళు !
జైలు గోడల పై నెత్తుటి నినాదాలే ప్రియురాళ్ళు