ప్రస్తుతం కొనసాగుతున్న గాజా యుద్ధం; మారణహోమం సమయంలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడిఎఫ్) ఉపయోగించిన సైనిక లక్ష్య నిర్ధారణ వ్యవస్థలలో కృత్రిమ మేధస్సు, స్వయంచాలక నిఘాల ఏకీకరణను పరిశోధించే, 2026లో నిర్మితమైన నాజా అనే బ్రిటిష్ డాక్యుమెంటరీ చిత్రానికి యువల్ అబ్రహం, రాచెల్ స్జోర్ లు రచన, దర్శకత్వం వహించారు. ది గార్డియన్, జెడబ్ల్యు ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం పేరును ‘నెజెక్ అగావి’ అనే “ఊహించిన అనుకోని ప్రాణనష్టం”ను సూచించే ఇజ్రాయెల్ సైనిక పదం నుండి తీసుకున్నారు. యుద్ధంలో పాల్గొన్న గూఢచార అధికారులు, సైనికులతో జరిపిన అనామక ఇంటర్వ్యూల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఈ చిత్రాన్ని 2026 సెప్టెంబర్ 10 న 83వ వెనిస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రధాన పోటీ విభాగంలో ప్రదర్శించినప్పుడు , ప్రత్యేక జ్యూరీ బహుమతిని గెలుచుకుని విమర్శకుల ప్రశంసలు పొందింది.
“ఒక నేరాన్ని అంగీకరించకపోవడమే అది కొనసాగడానికి దోహదపడుతుందని మేము నమ్ముతున్నాము, అందుకే ఇజ్రాయెలీయులు ఈ చిత్రాన్ని చూడటం మాకు చాలా ముఖ్యం; ఈ నేరాలకు పాల్పడుతున్నది మన దేశమే,” అని శనివారం వెనిస్ ఫెస్టివల్లో తన బహుమతిని స్వీకరణ ప్రసంగంలో అబ్రహం అన్నారు.
ఇజ్రాయెల్ సాగిస్తున్న వినాశకరమైన యుద్ధంలో 73,700 మందికి పైగా పాలస్తీనియన్లు, వారిలో అధికశాతం పౌరులు, మరణించారని గాజా ఆరోగ్య అధికారులు నివేదిస్తున్నారు. ముట్టడికి గురైన ఆ ప్రాంతంలోని చాలా భాగాన్ని ఈ యుద్ధం శిథిలావస్థకు చేర్చింది.
ఆ సమయానికి విస్తృతంగా పంపిణీ అవనప్పటికీ, గాజాలో ఇజ్రాయెల్ చర్యల గురించిన దాని కథనాల కారణంగా ఈ చిత్రం ఇజ్రాయెల్‌లో రాజకీయ వివాదాన్ని రేకెత్తించింది. ఇజ్రాయెల్ పౌరులైన అబ్రహం, స్జోర్ల బెదిరింపులకు దారితీసింది. ఇజ్రాయెల్ ప్రభుత్వమూ, ఐడిఎఫ్ ఈ చిత్రంలో చూపిన ఆరోపణలను తిరస్కరించాయి.
కథా సారాంశం
2023- 2025 మధ్య కాలంలో, యువల్ అబ్రహం, రాచెల్ స్జోర్ టెల్ అవీవ్‌లోని ఒక ఇంటి పైకప్పుపైన 24 మంది ఇజ్రాయెల్ సైనికులు, ఇంటెలిజెన్స్ అధికారులతో రాత్రిపూట ఇంటర్వ్యూలు చేసారు . ఆ అధికారులను చీకటి నీడలుగా మాత్రమే చూపించారు; వారి గుర్తింపును కాపాడటానికి వారి స్వరాలను మార్చారు. గాజాలో లక్ష్యాలను గుర్తించడానికి ఉపయోగించే ఏఐ వ్యవస్థ, మొబైల్ ఫోన్ నిఘా గురించి వారు వివరించారు. ఈ ఇంటర్వ్యూల ప్రకారం, ఇది అక్కడ పాలస్తీనా పౌరుల సామూహిక హత్యకు దారితీసింది . ఇంటర్వ్యూల మధ్యలో టెల్ అవీవ్ రాత్రిపూట దృశ్యాలు చూపిస్తారు. ఒక సైనికుడు “నాజా” అనే సంక్షిప్త పదాన్ని వివరించాడు. ప్రతి సంభావ్య లక్ష్యానికి – ఉదాహరణకు, ఒక హమాస్ సభ్యునికి – ఏఐ సాఫ్ట్‌వేర్‌లో ఒక నాజా విలువ కేటాయించబడుతుంది. ఈ విలువ, ఆ లక్ష్యంపైన వైమానిక దాడి జరిగినప్పుడు సంభవించే పౌర మరణాల అంచనా సంఖ్యను సూచిస్తుంది. 20 కంటే తక్కువ విలువలు ఉన్న లక్ష్యాలకు ప్రత్యేక అనుమతి అవసరం లేదని; 500 వరకు ఉన్న విలువలకు ఆమోదాలు మంజూరు అయ్యాయని అతను చెప్పాడు. అతని అంచనా ప్రకారం, సంభావ్య హమాస్ యోధులందరి సంయుక్త నాజా విలువలు గాజా మొత్తం జనాభాను మించిపోయాయి.
తీరప్రాంతంలోని ఉత్తర భాగం నుండి పాలస్తీనియన్లను తరిమివేయవలసి వచ్చినప్పుడు, ఇంకా జనావాసాలు ఉన్న ప్రాంతాలను (ఊదా రంగు), ధ్వంసమైన ప్రాంతాలను (తెలుపు రంగు) వేరు చేయడానికి పటాలలో రంగులతో కూడిన చతుర్భుజాలు ఉండేవి. “ఒక వీడియో గేమ్ లాగా”, ఊదా రంగు చతురస్రాలను తెలుపు రంగువిగా మార్చడమే దీని లక్ష్యం అని ఒకరు వివరించారు. సైనిక చర్యల చట్టబద్ధతపైన ఎలాంటి సందేహాలు తలెత్తక ముందే, వీలైనంత ఎక్కువ భాగాన్ని నాశనం చేయమని ఆదేశాలు జారీ అయ్యాయి.
గాజాలోని “మరణ మండలాల”ను టెల్ అవీవ్ నుండి నిర్దేశించారు; పాలస్తీనియన్లు ఆ మండలాల్లోకి ప్రవేశించినప్పుడల్లా వారిపై కాల్పులు జరపడంతో, అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నారు. ఆహార పంపిణీ కేంద్రం వద్ద ఆకలితో ఉన్న ప్రజలపైన ఇజ్రాయెల్ స్నైపర్లు ఎలా కాల్పులు జరిపారో ఒకతను వివరించాడు. అతను ఈ సంఘటనను స్టిక్-ఫిగర్ డ్రాయింగ్ ఉపయోగించి వివరిస్తాడు.( తల కోసం ఒక చిన్న వృత్తాన్ని, శరీరం కోసం నిలువుగా ఒకే సరళ రేఖను, మరియు చేతులు, కాళ్ళ కోసం సరళ రేఖలను గీయడం) ఇంటర్వ్యూలో మాట్లాడినవారిలో చాలామంది, చాలా దూరం నుండి హత్యలు చేయడాన్ని ఒక నిత్యం జరిగే ఆఫీసు పనిలా అభివర్ణించారు. అత్యంత నమ్మదగిన లక్ష్యాలు హమాస్ యోధులు కాదు, వారి ఇళ్లే. ఎందుకంటే, ఆ ఇళ్లలోనే వారి కుటుంబాలు కూడా నిద్రపోతున్నాయి. గాజాలోని అన్ని మొబైల్ ఫోన్లపై ఏఐ సహాయంతో జరిపిన నిఘా ద్వారా ఆ ఇళ్లను గుర్తించారు. పిల్లల ఫోన్లతో సహా, అన్ని మొబైల్ ఫోన్ల కెమెరాలు, మైక్రోఫోన్లను నిఘా సంస్థ అందుబాటులోకి తెచ్చుకోగలిగింది. వార్‌లో ఒకరు దీనిని “లక్ష్యాల కర్మాగారం” అని అభివర్ణించారు.
హ్యాక్ చేసిన పిల్లల మొబైల్‌ను రహస్యంగా విని, వారి తండ్రి ఎప్పుడు ఇంట్లో ఉంటాడో తెలుసుకుని, తద్వారా ఆ కుటుంబాన్ని వైమానిక దాడిలో చంపేయడాన్ని వర్ణించడానికి “నాన్న ఎక్కడ?” అనే పదాన్ని సృష్టించారు. ఒక వ్యక్తి 12 ఏళ్ల బాలిక గురించి ఇలా అంటాడు, “మీరు ఆమె ఫోన్‌ను హ్యాక్ చేసి, ఆపై ఆమెను చంపేస్తారు.” ఒక పాలస్తీనా తండ్రి మొబైల్ ఫోన్ ద్వారా, ఆ తండ్రి ఫోన్లో ఫోటోలలో కనిపించిన అతని కుమార్తె కాలి బూడిదైపోవడాన్ని తాను ప్రత్యక్షంగా చూసినట్లు మరొకరు వివరించారు. “వారు చెప్పే ప్రతీదీ మీరు వింటారు” కాబట్టి “మిమ్మల్ని మీరు దేవుడు అనుకుంటారు” అని ఒకరు వివరిస్తారు.
“గాజాలో అమాయకులు ఎవరూ లేరు” అనే అక్టోబర్ 7 తరువాతి విస్తృత నమ్మకానికి కట్టుబడి, పౌరుల సామూహిక హత్యను అంగీకరించడమే కాకుండా, దానిని ఒక విధిగా భావించి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని వారిలో చాలామంది అంటున్నారు. ఇంటర్వ్యూ చేసిన వారిలో ఒకరు, పాలస్తీనియన్లను చంపడం; మిషన్‌ను పూర్తి చేయడం “బాగుందనిపించింది” అని చెప్పారు. మానసిక మద్దతు అందుబాటులో ఉన్నప్పటికీ, అతని యూనిట్లో ఎవరికీ దాని అవసరం రాలేదు. మరొకరు, “మేము ఈ పిల్లలను ఉద్దేశపూర్వకంగా చంపుతాము” అని అన్నారు.
జాతి నిర్మూలనలో పాల్గొన్నారా అని అడిగినప్పుడు , వారిలో ఒకరు ఏమాత్రం సంకోచం లేకుండా “అవును” అని సమాధానమిస్తారు. ఒక ఉన్నత దళానికి చెందిన సభ్యుడు, హోలోకాస్ట్ను ప్రస్తావిస్తూ, ఒక భవనం మొత్తాన్ని, అందులోని ప్రజలందరితో సహా నాశనం చేయడం ఎలా సాధ్యమో, అలా చేసినప్పటికీ జీవితం యథావిధిగా కొనసాగడం ఎలా సాధ్యమో, అదే సమయంలో ” క్లినికల్ సైకాలజీలో డిగ్రీని పూర్తి చేస్తూ ముందుకు సాగడం” ఎలా సాధ్యమో ఇప్పుడు తనకు అర్థమైందని వివరిస్తాడు.
చిత్ర నిర్మాణం
ఇజ్రాయెల్ పాత్రికేయులు, చిత్రనిర్మాతలు యువల్ అబ్రహం, రాచెల్ స్జోర్ గతంలో వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనా వర్గా ప్రజలపైన ఇజ్రాయెల్ స్థిరనివాసుల హింసపైన దృష్టి సారించిన ‘నో అదర్ ల్యాండ్ ‘ (2024) చిత్రానికి సహ-దర్శకత్వం వహించారు. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ అకాడమీ అవార్డును గెలుచుకున్నారు. ఆ తర్వాత వారు ‘నాజా’ కోసం కలిసి పనిచేశారు.
ఈ చిత్రాన్ని ఒక బ్రిటిష్ చిత్ర నిర్మాణ సంస్థ ది గార్డియన్; బ్రిటిష్ చిత్ర నిర్మాత జేమ్స్ విల్సన్ కు చెందిన జె డబ్ల్యూ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ప్లేస్‌హోల్డర్ ఫిల్మ్స్, అన్‌సీన్ హ్యాండ్లతో కలిసి జోనాథన్ గ్లేజర్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. వెనిస్లో జరిగిన చిత్ర ప్రీమియర్ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అబ్రహం వివరిస్తూ, గాజాలోని సంఘటనలు హోలోకాస్ట్ తో సమానం కానప్పటికీ, అమానవీకరణ అనే ఒక ఉమ్మడి నమూనా ఉందని, ఈ చిత్రం చూపించాలనుకుంటున్నది ఇదేనని అన్నారు.
ఈ చిత్రం 2026 సెప్టెంబర్ 10న 83వ వెనిస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రధాన పోటీలో ప్రపంచ ప్రీమియర్‌ను ప్రదర్శించింది; అక్కడ అది గోల్డెన్ లయన్ కోసం పోటీపడింది. ఇది ఈ ఉత్సవంలో ప్రధాన పోటీకి ఎంపికైన ఏకైక డాక్యుమెంటరీ. దాని ప్రదర్శన గురించిన భద్రతాపరమైన ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఆగస్టు 24న మాత్రమే చేర్చారు. ఈ చిత్ర ప్రదర్శన ముగిసాక ప్రేక్షకులు లేచి నిలబడి 25 నిమిషాల పాటు చప్పట్లు కొట్టారు. ఇవి వెనిస్ చలనచిత్రోత్సవం చరిత్రలో అత్యంత సుదీర్ఘమైనది.
ఇజ్రాయిల్ ప్రభుత్వ స్పందన
వెనిస్ చలనచిత్రోత్సవంలో “నాజా” అనే గాజా డాక్యుమెంటరీ ప్రత్యేక జ్యూరీ బహుమతి గెలుచుకున్న తర్వాత, ఇజ్రాయెల్ సంస్కృతి శాఖ మంత్రి మికి జోహార్, చిత్ర దర్శకులు యువల్ అబ్రహాం, రాచెల్ స్జోర్ ల పౌరసత్వాన్ని రద్దు చేసే దిశగా తొలి అడుగులు వేశారు.
సోమవారం ఉదయం ఎక్స్ (X) వేదికగా ఆయన ఇలా రాశారు: “యుద్ధకాలంలో ఇజ్రాయెల్ రాష్ట్రానికి వ్యతిరేకంగా వ్యవహరించే ఎవరైనా ఇజ్రాయెల్ పౌరసత్వాన్ని కలిగి ఉండటానికి వీలులేదు. ‘నాజా’ అనే ఇజ్రాయెల్ వ్యతిరేక చిత్ర సృష్టికర్తలు రాజ్యం పట్ల తమ విధ్వంసక వైఖరిని ప్రదర్శిస్తూ, శత్రువుతో సహకరించడం ద్వారా దేశద్రోహానికి పాల్పడ్డారు. కాబట్టి వారి పౌరసత్వాన్ని రద్దు చేసే అంశాన్ని పరిశీలించాలని ఈ ఉద జనాభా, వలసల అధికార సంస్థ; అంతర్గత మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరళ్లను కోరాను. అలాగే ఈ విషయాలు ఎలా సేకరించారు, వాటి వెనుక ఎవరున్నారు, వాటిని సేకరించే లేదా ప్రచురించే ప్రక్రియలో యుద్ధ సమయంలో శత్రువుకు సహాయం చేసే చర్యలకు పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేయాలని ఆదేశించాను. సంస్కృతి శాఖ మంత్రిగా, దేశద్రోహానికి పాల్పడిన ఈ నీచమైన సృష్టికర్తల ఇజ్రాయెల్ పౌరసత్వాన్ని రద్దు చేయడానికి నేను వెంటనే చర్యలు తీసుకుంటాను. భావప్రకటనా స్వేచ్ఛ అనేది దేశద్రోహానికి లైసెన్స్ కాదు యుద్ధ సమయంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పనిచేసే వారెవరైనా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తెలుసుకోవాలి “
ఐడిఎఫ్ ప్రతిస్పందన
అదనంగా, ‘ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ ప్రకారం.. సంభావ్య చట్టపరమైన చర్యలకు ముందుగా, ఆ చిత్రానికి సంబంధించిన “వర్గీకృత (క్లాసిఫైడ్) సామగ్రి”పై దర్యాప్తు చేయాలని ఐడిఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎయాల్ జమీర్ సైన్యంలోని ఉన్నత చట్టపరమైన అధికారులను ఆదేశించారు.
2026 అక్టోబర్ 1న, ఆ సినిమా కాపీని చూసిన తర్వాత ఐడిఎఫ్ ఒక స్పందనను ప్రచురించింది. సినిమాలోని ఆరోపణలను పరిశీలించడానికి సమయం పట్టడం, అలాగే చిత్రనిర్మాతలు ఆ ఆరోపణలను ముందుగా పంపకపోవడం, ప్రకటనకు కొద్దిసేపటి ముందు వరకు ఐడిఎఫ్ కు ఆ సినిమాను చూపించకపోవడం వల్ల ఈ స్పందన ఆలస్యమైందని ఐడిఎఫ్ పేర్కొంది. ఆ స్పందనలో, ఆ సినిమా “వాస్తవికతను వక్రీకరించి, తారుమారు చేసే విధంగా చిత్రీకరించిందని” పేర్కొంది. చిత్రంలో చేసిన ఆరోపణలను ఐడిఎఫ్ తిరస్కరించింది. దాడుల ప్రణాళికను ఆ సినిమా వర్ణించిన తీరును తిరస్కరిస్తూ, ఒక ఉగ్రవాదికి 500 మంది పౌరులు, 200 మంది, లేదా ఒకరికి 20 మంది వంటి నిష్పత్తుల కేటాయింపు అంశంతో సహా, అది పేర్కొన్న పౌర మృతుల సంఖ్యను ఖండించింది. సుమారు 500 మంది పౌరులు మరణిస్తారని అంచనా వేసిన ఏ దాడిని తాము ఎప్పుడూ ప్రణాళిక చేయలేదని లేదా ఆమోదించలేదని కూడా అన్నది. లక్ష్యాలను కేవలం మనుషులు మాత్రమే ఆమోదిస్తారని, ఏఐ కాదని ఇజ్రాయెల్ సైన్యం జోడించింది.
తమ నిబంధనలు మిలిటెంట్లు, పౌరుల మధ్య స్పష్టంగా తేడాను చూపుతాయని, పౌరులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడాన్ని నిషేధిస్తాయని, అదే సమయంలో పౌరులకు జరిగే నష్టాన్ని తగ్గించడానికి కమాండర్లు చర్యలు తీసుకోవాలని నిర్దేశిస్తాయని ఐడిఎఫ్ పదేపదే వాదిస్తున్నది. అయితే, ఈ వాదనలను విమర్శకులు సంవత్సరాలుగా సవాలు చేస్తూనే ఉన్నారు.
గాజాలో సంభావ్య లక్ష్యాలను సిఫార్సు చేయడంలో సహాయపడటానికి ఏఐని ఉపయోగించినట్లు అంగీకరిస్తూనే , దాడులపై తీసుకున్న తుది నిర్ణయాలు, అలాగే పౌర ప్రాణనష్టం ప్రమాదంపై కూడా అధికారులు ఆమోదం తెలిపారని ఐడీఎఫ్ పేర్కొంది. సినిమాలో ఇంటర్వ్యూ ఇచ్చినన సైనికులు వారికి ఆపాదించిన పాత్రలలో పనిచేశారని భావించినప్పటికీ, వారు ఏ విస్తృత నిర్ణయం తీసుకునే ప్రక్రియలోనూ భాగం కాదని సినిమాలో వారి మాటల నుండి స్పష్టమైంది. ఐడిఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఐయాల్ జమీర్, ఈ చిత్రం పరువు నష్టం కలిగించేదని, “ఐడిఎఫ్ సైనికులు, కమాండర్లపైన తీవ్రమైన, తప్పుడు ఆరోపణలు” చేస్తోందని విమర్శిస్తూ, చిత్రనిర్మాతలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అన్నాడు.
ఇజ్రాయెల్ ప్రభుత్వ; సమాజ ప్రతిస్పందన
ఈ చిత్రాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారులు ఖండించారు; అలాగే సాంస్కృతిక శాఖ మంత్రి మికి జోహార్, దర్శకులు దేశద్రోహానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, వారి పౌరసత్వాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చాడు. ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించే ఏ ఇజ్రాయెల్ సినిమాకైనా నిధులను నిలిపివేస్తామని బెదిరించాడు. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రానికి లభించిన సానుకూల స్పందనను “దిగ్భ్రాంతికరం”అని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అభివర్ణించాడు. ఈ చిత్రం “ప్రపంచ యూదు వ్యతిరేక ప్రేరేపణ” లో భాగమని అన్నాడు. చిత్రనిర్మాతల ఇజ్రాయెల్ పౌరసత్వాన్ని రద్దు చేయడానికి, పరువు నష్టం ఆరోపణలు మోపడానికి తాను బిల్లులను ప్రవేశపెడతానన్నాడు. 2026 సెప్టెంబర్ 23న, మికి జోహార్ ప్రతిపాదనకు నెతన్యాహు మద్దతు ఇచ్చారు. ఒకటి విదేశాలలో సైనికులను లేదా రాజ్యాన్ని దూషించే ఇజ్రాయెలీయుల పౌరసత్వాన్ని రద్దు చేయడానికి అనుమతించడం, మరొకటి ఇజ్రాయెల్ లేదా ఐడిఎఫ్ ను దూషించినందుకు ఒక మిలియన్ షెకెల్స్ వరకు జరిమానాలు విధించడం అనే రెండు చట్టాలను ముందుకు తీసుకువెళ్లే ప్రక్రియలో ఉన్నానని ప్రకటించారు.
ఇజ్రాయెల్ గూఢచార సభ్యులతో సహా గుర్తింపులను గోప్యంగా ఉంచిన సైన్యమూ, సమాచారానికి సంబంధించిన మూలాలను వెతికి పట్టుకోవడానికి చట్టపరమైన విచారణను ప్రారంభించాలని ఇజ్రాయెల్ సైనిక అధిపతి ఐయాల్ జమీర్ ఆదేశించారు.
జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్-గ్విర్ , దర్శకులను “అవమానకరం” అని పిలిచారు. వెనిస్లో సినిమా ప్రీమియర్ జరిగిన వారం తర్వాత, బెన్ గ్విర్ కి చెందిన ఓట్జ్మా యెహుదిత్ పార్టీకి అనుబంధంగా ఉన్న మితవాద నిరసనకారులు రాచెల్ స్జోర్ తల్లిదండ్రుల ఇంటిని చుట్టుముట్టారు. నిరసనకారులు “ద్రోహులను ఉరితీయండి” అనే పిలుపులతో సహా హింసా ప్రయోగానికి స్పష్టమైన పిలుపునిచ్చారు. అనేక ఇతర పాత్రికేయులు, రాజకీయ నాయకులు, ప్రభావశీలులు, నిర్వాహకులు కూడా చిత్రనిర్మాతలను బెదిరించారు. అదనంగా, ఛానల్ 14 కు చెందిన తీవ్ర-మితవాద పాత్రికేయుడు యెహుదా స్లెసింగర్, చిత్రనిర్మాతలు ఎక్కడికి వెళ్లినా వారిని “వెంబడించాలి” లేదా “వేటాడాలి” అని చెప్పి, వారు ఇజ్రాయెల్‌కు తిరిగి రాకుండా చేయాలని ప్రజలను ప్రోత్సహించిన తర్వాత, వారికి, వారి సహోద్యోగులకు చెందిన ఇళ్ల దగ్గర వద్ద నిరసనలు జరిగాయి.
ఇజ్రాయెల్ చిత్రనిర్మాతలు; మానవ హక్కుల సంస్థల నుండి ప్రతిస్పందన
అబ్రహాం, స్జోర్లతో కలిసి “నో అదర్ ల్యాండ్” చిత్రానికి సహ-దర్శకులుగా వ్యవహరించిన పాలస్తీనా చిత్రనిర్మాతలు బాసెల్ అద్రా, హందాన్ బల్లాల్, తాము అవార్డు గెలుచుకున్న తర్వాత ఐడిఎఫ్ బలగాలు తమ పైన దాడి చేసినట్లు తెలిపారు. 2025 మార్చిలో బల్లాల్పైన ఇజ్రాయెలీ సెట్లర్లు దాడి చేసి, ఒక ఐడిఎఫ్ బేస్‌లో నిర్బంధించారు. ఆ నిర్బంధ సమయంలో సైనికులు తనను కొట్టారని ఆయన చెప్పారు. 2025 సెప్టెంబర్‌లో, ఒక గుంపు ఇజ్రాయెలీ సెట్లర్లు తనపై దాడి చేసిన తర్వాత అద్రా నివాసంలో ఇజ్రాయెలీ అధికారులు సోదాలు చేసినట్లు వార్తలు వచ్చాయి.
“నాజా” చిత్రం విడుదలైన తర్వాతి వారంలో, చిత్రనిర్మాతలకు వ్యతిరేకంగా జరుగుతున్న “అపూర్వమైన రెచ్చగొట్టే, ప్రేరేపించే ప్రచారానికి” ప్రతిస్పందనగా, అబ్రహం, స్జోర్లకు మద్దతుగా వెయ్యికి పైగా ఇజ్రాయెల్ చిత్రనిర్మాతలు ఒక వినతిపత్రంపైన సంతకం చేశారు. “కళ, జర్నలిస్టుల ప్రధాన పాత్ర, అవి అస్థిత్వంలో ఉన్న సమాజానికి అద్దంలా నిలవడమే” అని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. సంతకం చేసిన వారిలో ఇజ్రాయెల్‌కు చెందిన పలువురు ప్రముఖ దర్శకులలో రిలో అరి ఫోల్మాన్, ష్లోమి ఎల్కాబెట్జ్ , రాన్ తాల్, మిచల్ అవియాద్ మొదలైనవారు ఉన్నారు.
అదే వారంలో, 40కి పైగా ఇజ్రాయెల్ మానవ హక్కులు, సమానత్వం, శాంతి సంస్థలు కూడా చిత్ర దర్శకులకు మద్దతుగా ఒక ఉమ్మడి ప్రకటనను ప్రచురించాయి. అబ్రహం, స్జోర్లకు వ్యతిరేకంగా “ప్రేరేపణ, హింసా బెదిరింపుల పరంపరను అంతం చేయాలని” ఆ ప్రకటన అధికారులను డిమాండ్ చేసింది. ఈ ప్రకటనపై సంతకాలు చేసిన వారిలో కంబాటెంట్స్ ఫర్ పీస్, బి’ట్సెలెం, పీస్ నౌ, బ్రేకింగ్ ది సైలెన్స్, అదాలా ఉన్నాయి.