(ఉర్దూ మూలం : రజియా సజ్జాద్ జహీర్
తెలుగు : కాత్యాయని)
ఆ సాయంత్రం ఇంటి ముందు రిక్షా దిగుతూ, సర్వెంట్స్ క్వార్టర్స్ ముందు కూచుని ఉన్న శ్యామలిని తొలిసారి చూసింది సుల్తానా. మరోసారి తిరిగి చూడాలనిపించే ఆకర్షణ ఏదో ఉంది ఆ పిల్ల ముఖంలో.
పనివాళ్ళు అందరిలాగా చేతులు జోడించి నమస్కారం చెయ్యకుండా ఓ చిరునవ్వు విసిరి, తలొంచుకుని బియ్యంలో రాళ్లేరుకుంటోంది. ఆమె ధోరణి సుల్తానాకు నచ్చింది. ధనవంతుల ముందు దేబిరిస్తూ ఉండే పేద వాళ్ళంటే ఆమెకు చిరాకు. తనకు పేదలపై ఎంతో అభిమానం ఉందని గట్టి నమ్మకం కూడా.
సుల్తానా చిన్నతనం నుంచీ శ్యామలి వంటి ఆడవాళ్ళ గురించి ఎన్నో మాటలు వింటోంది. ఈ తక్కువ కులాల ఆడవాళ్లకు మానాభిమానాలు, మనుషులపై ప్రేమలు ఉండవని, మగవాళ్ళతో సులభంగా సంబంధాలు పెట్టుకోవడం, అంతే సులభంగా వదిలేసి పోవడం వాళ్లకు అలవాటని నాయనమ్మ అనే మాటలు అప్రయత్నంగా మనసులో మెదిలాయి. ఈ పిల్ల ఎవరో, ఆ గదిలో ఒక్కత్తే ఉందేమిటో అని ఆలోచిస్తూ స్నానానికి వెళ్ళింది. బాత్రూమ్ కుళాయిలో నీళ్లు రావటం లేదు. బయటికి చూస్తే శ్యామలి వీధి పంపు దగ్గర బియ్యం కడుగుతోంది.
“ఏయ్ పిల్లా, ఆ పంపు కట్టేయ్,” అరిచింది చిరాగ్గా.
శ్యామలి వెంటనే ఆపేసి, “ఈ పంపు తిప్పితే మీ ఇంట్లో నీళ్లు ఆగిపోతాయని నాకు తెలీదమ్మా. నిన్ననే వచ్చానిక్కడికి,” అని చిరునవ్వుతో జవాబిచ్చింది. మాట తీరు బావుంది.
“పర్వాలేదులే,” అంది సుల్తానా.
నాలుగు రోజులు గడిచాక, సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికొచ్చిన సుల్తానా, టపా చూసుకుంటూ కూచుంది. బయటినుంచి నవ్వులు. కిటికీ లోంచి చూస్తే, తన చిన్న కూతురు శ్యామలిని వెంట తరుముతోంది.
“ఇంక పరిగెత్తలేను పాపా, అన్నం వండుకోవాలి” అంటూ నవ్వుతోంది శ్యామలి. పాప ఊరుకోవడం లేదు.
“ఇట్టా రా, తల్లీ! ఈ పిండితో పిట్ట బొమ్మ చెయ్యనా, కాల్చి తినేద్దాం,” అంటూ బుజ్జగిస్తూ ఉంది శ్యామలి. నవ్వుతూ చూస్తున్న పనివాళ్ళు అందరూ వెళ్ళిపోయారు.
శ్యామలి నవ్వు హాయిగా, నిష్కపటంగా ఉందని అనిపించింది సుల్తానాకు. అయినా పరాయి మగాళ్ళ ముందు అలా పగలబడి నవ్వటం ఎందుకని కూడా అనిపించింది. అక్కడ సుల్తానాను చూసి సిగ్గు పడింది శ్యామలి.
***
మర్నాడు సాయంత్రం వచ్చింది శ్యామలి. “దుకాణానికి పోదాం అనుకుంటే చీకటి పడిపోయింది. నాలుగు మిరప కాయలు ఇవ్వండి,” అంటూ. ఆమెకు మిరప కాయలు ఇవ్వమని వంటాయనకు చెప్పి, ఆ పిల్లను కూర్చోమంది సుల్తానా.
తన విషయాలు చెబుతోంది శ్యామలి. తన భర్త చచ్చి పోయాడట. ఎదురుగా పచ్చ మేడలో ఉండే మేజరు గారి పిల్ల వాడికి ఆయాగా పని చేస్తూ పొట్ట పోసుకుంటుంది.
మిరపకాయలు తెచ్చిన వంటాయన, శ్యామలిని గుడ్లప్పగించి చూస్తూ నిలబడ్డాడు. ఆ అమ్మాయి వాటిని తీసుకుని తలొంచుకుని వెళ్లిపోయింది.
“ఈ మనిషిని ఇంట్లోకి రానివ్వకండమ్మా,” అన్నాడు వంట మనిషి.
“సర్లే, నీ పని చూసుకో పో,” అని విసుక్కుంది సుల్తానా.
“అది మొగుణ్ణి వదిలేసి లేచి పోయిందమ్మా, ఆ రామావతార్ ను వల్లో వేసుకుంది. మంచి మనిషి కాదు!”
“ఎవరా రామావతార్?”
“వాచ్ మన్, మీకు తెలుసు కదా?”
గుర్తొచ్చింది సుల్తానాకు. ఖాకీ యూనిఫాంతో, బరువైన బూట్లు తొడుక్కొని, కర్ర టక టక లాడిస్తూ, రాత్రంతా కాపలా కాస్తుంటాడు. తనకు ఎప్పుడయినా నిద్ర పట్టక, పలకరిస్తే “మరేం భయం లేదు, పడుకోమ్మా. నేను ఉన్నాగా” అని భరోసా ఇస్తాడు.
“పాపం రామావతార్ ది పెద్ద కులమమ్మా. ఠాకూర్ల వంశం. ఈ కులం తక్కువది వలలో వేసుకుంది.”
“చెత్త వాగుడు వాగకు,” అని మండిపడింది సుల్తానా.
అతడు లోపలికి పోయాడు. కానీ సుల్తానా బుర్రలో కల్లోలం రేగింది.
ఎందుకిలా చేసింది ఈ పిల్ల? భర్తను వదిలేసి వచ్చి, మరో మగాడితో సంబంధం పెట్టుకుంది. పైగా మొగుడు చచ్చి పోయాడని అబద్ధాలు! ఈ కులం ఆడాళ్లకు ప్రేమాభిమానాలు ఉండవేమో. తన ఆలోచనకు తానే భయపడింది. ఛ! తను కులం గురించి ఆలోచించటం ఏమిటి?
మర్నాడు రాత్రి కిటీకీ లోంచి చూస్తుంటే, పొయ్యి వెలుగులో శ్యామలి, రామావతార్ కనబడ్డారు. రొట్టెలు కాలుస్తూ, మాటి మాటికీ కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ ఉంది శ్యామలి. అతడు ఎప్పటిలా యూనిఫాంలో కాకుండా ధోతీ, కుర్తా లో అందంగా వున్నాడు. వీళ్ళిద్దరిదీ చక్కని జంట అనే భావన సుల్తానా మనసులో ఒక్క క్షణం మెదిలింది.
రామావతార్ వెళ్ళాక అక్కడికెళ్లి, “ఏం శ్యామలీ, మీ ఆయన బతికే వున్నాట్టగా, అంత అబద్ధం చెప్పావేం?” అన్నది.
శ్యామలి కాసేపు మౌనంగా ఉండి, “ఉండి ఏం లాభం లేమ్మా, నాకైతే చచ్చినోడి కిందే లెక్క,” అంది ధృఢంగా.
షాక్ కొట్టినట్టు అయింది సుల్తానాకు. దేవుడా… ఏ ఆడదైనా కట్టుకున్న వాడిని ఇంత మాట అంటుందా!
“నాకు ఇంత తిండీ బట్టా ఇచ్చినందుకు పెత్తనం చేస్తాడమ్మా. పైసలు పడేస్తే చాలా! నా కాళ్ళూ చేతులూ గట్టిగా ఉండాలి గానీ వాడిలాంటి మనుషులని పదిమందిని సాకగలను.” చర చరా అక్కడినుండి వెళ్ళి పోయింది సుల్తానా.
తలలో ఆలోచనలు పోటెత్తుతున్నాయి. శ్యామలి చాలా ధైర్యం గల పిల్ల. అయితే మాత్రం భర్త గురించి అలాంటి మాటలా! భర్తను మించిన సంపద భార్యకు ఏముంది లోకంలో! ఈ కులం తక్కువ ఆడాళ్ళు… అని రాబోతున్న ఆలోచనను వదిలించుకోడానికన్నట్టు, బలంగా తల విదిలించింది.
“నాకు నిజంగా పెళ్ళనే వ్యవస్థ మీద అంత నమ్మకం ఉందా, వూరికే మనసును మభ్యపెడుతున్నానా? భర్త అనే వాడు తిండీ బట్టా ఇవ్వడానికేనా? ప్రేమను, గౌరవాన్నీ, భద్రతను ఇవ్వాలి కదా!” పిచ్చెక్కి పోతోంది.
***
మూడు రోజులు గడిచాయి. హోళీ పండుగ ఆ రోజు. ఏదో రాసుకుంటూ ఉన్న సుల్తానా దగ్గరికి వచ్చింది శ్యామలి. ఆమె చేతిలో ఒక పళ్ళెంలో రంగులూ, మిఠాయిలూ వున్నాయి.
చటుక్కున రంగు తీసి, సుల్తానా నుదుటికి రాసి, లడ్డూ తుంచి నోట్లో పెట్టబోయింది.
సుల్తానా కళ్ళలో నీళ్లు తిరిగాయి. “నేను మిఠాయి తినను శ్యామలీ, అయ్యగారు తిరిగి వచ్చేదాకా తిననని మొక్కుకున్నా.”
“బెంగ పెట్టుకోకమ్మా, దేవుడు చల్లగా చూస్తాడు. అయ్యగారు రాగానే మేమందరం మీకు మిఠాయిలు తినిపిస్తాం చూస్తుండండి,” మెత్తగా నవ్వుతున్న ఆ పిల్లను చూస్తూ, ఇంత మంచిదానివి భర్తను ఎందుకు వదిలేశావ్ శ్యామలీ,” అడిగింది.
“మీకు అర్థం కాదులేమ్మా,” అంటూ వెళ్లి పోయింది. మళ్లీ షాక్ కొట్టినట్టు అయింది సుల్తానాకు.
భోజనం తీసుకుని అప్పుడే వచ్చిన వంటాయన, “ఈ పిల్ల మూలాన రామావతార్ ను పన్లోంచి తీసేస్తున్నారమ్మా. ఎదిగిన పిల్లలున్న కుటుంబాల మధ్యన వీళ్ల వ్యవహారం ఇబ్బందిగా ఉందని పెద్దయ్య గారికి ఫిర్యాదులు వెళ్లాయి. రామావతార్ బంధువులు కూడా వచ్చారు. వాళ్ల కులంలో మంచి అమ్మాయిని చూసారట. వీడేమో ఈ కులం తక్కువ దాన్ని వదలనంటాడు.”
ఇది చాలా అన్యాయం అనిపించింది సుల్తానాకు. వాళ్ళిద్దరూ ఇష్టపడుతుంటే, వీళ్ళకేమిటి నష్టం! రేపు యజమానితో గట్టిగా చెప్పాలి. అవసరమైతే వాళ్లకు తనే ఆశ్రయం ఇవ్వాలి అని నిర్ణయించుకుంటే మనసు తేలిక పడింది.
మర్నాడు సుల్తానా వచ్చేసరికి శ్యామలి గది ఖాళీగా ఉంది. స్వీపర్ భార్య వచ్చి, “అది పారిపోయిందమ్మా,” అని చెప్పింది.
“మరి రామావతార్?”
“అతనిక్కడే ఉన్నాడు. బాగా ఏడుస్తున్నాడు పాపం. ఈ కులం తక్కువ ఆడాళ్ళకు నీతి ఉండదులేమ్మా!”
ఆ మాట నిజమే అనిపించింది. శ్యామలి పై విపరీతమైన అసహ్యం వేసింది.
***
కొన్నాళ్ళ తర్వాత బజార్లో వెళ్తున్న సుల్తానాకు పళ్ళ గంపతో ఎదురయింది శ్యామలి. ఒళ్లు మండిపోయింది సుల్తానాకు.
“ఎంత దుర్మార్గురాలివి శ్యామలీ! పాపం రామావతార్ బెంగతో చిక్కి శల్యమయ్యాడు. నలుగురిలో నవ్వుల పాలు చేశావు అతణ్ణి,” అంది ఆగ్రహంతో.
“అతని ఉద్యోగం అయితే పోలేదు కదమ్మా” అంది శ్యామలి.
సుల్తానా కోపం కట్టలు తెంచుకుంది.
“నా కోసం ఉద్యోగం వదులుకుంటానన్నాడు, ఏదో త్యాగం చేస్తున్నట్టు. మళ్లీ, నన్ను పోషించటం ఎట్లాగని బెంగగా ఉందంటాడు! నేను కావాలనుకుంది అతన్నా, అతని ఉద్యోగాన్నా? బతుకుదెరువు కోసం ఇంత దిగులా? అతనితో ఉంటే రోజుకు ఎన్నిసార్లు వినాలో ఆ మాటలు! ఇట్టాంటి మనుషుల్ని పది మందిని పోషించగలను. నేను చేసిన దాంట్లో తప్పేమీ లేదమ్మా,” గంపను తలపైకి ఎత్తుకుంటున్న శ్యామలి కళ్ళనిండా నీళ్లు.
“రామావతార్ ను అడిగానని చెప్పండి,” అంది వణికే గొంతుతో.
సుల్తానాకు మనసులో ఏదో తలుపు తెరుచుకుంది.
“చెప్తానమ్మా శ్యామలీ, తప్పకుండా చెప్తా.”
హాయిగా నవ్వింది శ్యామలి. “ఈసారి నన్ను బాగా అర్థం చేసుకున్నారమ్మా!”
తక్కువ కులాల్లో మహిళల కు ఆత్మగౌరవం గొప్పదని నిరూపించే మంచి కథనం
Thank you
కథ బాగుంది, అనువాదం బాగుంది. కాత్యాయిని గారు పొదుపు తగ్గించి విస్తారంగా చేయి చేసుకుంటే ఉపయోగం. ఆసక్తి, శక్తి ఉన్నవారినుంచి కాలం ఎక్కువ ఆశిస్తుంది.
అలాగే ,ప్రయత్నిస్తాను రామ్మోహన్😊
కార్మిక వ్యవస్థలో బ్రతికే వాళ్ళకి సిద్దాంతాలు, ఆదర్శాలు ఏమి ఉంటాయి, వాళ్ళకి లోతుగా పరిశీలించే స్థాయి ఏమిఉంటుందిలే.. అని, ‘పర్వాలేదు లేక కలిగిన వారు’ అహంతో ఏర్పచుకున్న, విస్తరింప చేసిన ఒక నానుడి. ఈ కథారుపంలో అది ఎంతవరకు సత్యం అనేది తెలియపరచడనికి ప్రయత్నం చేశారు, చాలా మంచిగా అనిపించింది. అలా అనిపించడానికి కారణం అనువాదమేఅని ప్రత్యేకించి చెప్పవలసిన పనిలేదు అనుకుంటా…
Thank you
Chaitanya
I want to republish this story in Bhumika magazine
and some selected articles also.
Good story.