ఇప్పటిదాకా పరిశీలించిన చరిత్రంతా విప్లవ రచయితల సంఘం పూర్వచరిత్ర. గడిచిన చరిత్ర. గతం. ఇక్కడి నుంచి పరిశీలించబోయేది విరసం చరిత్ర. నడుస్తున్న చరిత్ర. వర్తమానం. సాధారణంగా కొత్త వెలుగుతో, కొత్త సమాచారాల, ఆకరాల అన్వేషణతో గత చరిత్ర గురించిన వివరణ, వ్యాఖ్యానం కూడ మారుతుంది గాని, ఎంతైనా గత చరిత్ర రాయడం సులభం. వర్తమాన చరిత్రను, ఇంకా నడుస్తున్న చరిత్రను, ఇంకా గతంగా మారని చరిత్రను రాయడం క్లిష్టమైన పని. ఇక్కడి నుంచి విరసం చరిత్ర ఆ క్లిష్టమైన ప్రక్రియలోకి ప్రవేశిస్తున్నది. కాలంలో చూసినప్పుడు యాబై సంవత్సరాలు గడిచిపోయినట్టు కనిపించవచ్చు గాని, ఈ యాబై ఏళ్లలో ప్రతి సందర్భమూ పునరావృతం కావడం, పునరాలోచనకూ, పునర్వ్యాఖ్యానానికీ, పునర్లేఖనానికీ అవకాశం మిగల్చడం కనబడుతుంది. ఇంతవరకూ చెప్పుకున్న 1964-1970 చరిత్ర లాగ ఇది ముగిసిపోయిన అధ్యాయం కాదు. 1970-2020 ఇంకా కొనసాగుతున్న అధ్యాయం.
ఒక పరిణామానికి దశాబ్దాల పాటు, దశాబ్దాల తరువాత కూడ పర్యవసానాలు ఉంటాయి గనుక ఇక్కడ కాలక్రమం అనుసరించడానికి వీలులేదు, అలా కాలక్రమం అనుసరిస్తే అటు నుంచి ఇటు, ఇటునుంచి అటు కాలంలో గంతులు వేయవలసి వస్తుంది. అది రచనను గజిబిజి చేసి, పాఠకుల సహనాన్ని పరీక్షిస్తుంది. కనుక కాలక్రమాన్ని అనుసరించే బదులు, ఇతివృత్తాల ఆధారంగా అధ్యాయాలను విభజించుకొని పరిశీలించడం కాస్త సులభం. కాని అక్కడ కూడ ఇతివృత్తాల మధ్య స్పష్టమైన విభజన రేఖలు సాధ్యం కావు. ప్రతి ఒక్క ఇతివృత్తానికీ మిగిలిన అన్ని ఇతివృతాలతో పరస్పర, అన్యోన్య చర్య – ప్రతిచర్య సంబంధం ఉంటుంది. అందువల్ల ఏ ఇతివృత్తం గురించి రాసినా దాన్ని వేరు చేసి రాయడం కష్టమవుతుంది. ఆ ఇతివృత్తం వివరణలోకి ఇతర ఇతివృత్తాలు చొచ్చుకువస్తాయి. ఆ భిన్న ఇతివృత్తాల మధ్య సంబంధాలను వివరించడం, విశ్లేషించడం వల్ల రచన క్లిష్టంగా మారి చదువరుల ఆసక్తినీ, సహనాన్నీ పరీక్షిస్తుంది.
ఇప్పటి దాకా రాసిన చరిత్రను కాలక్రమంలో ఒక ఘటన తర్వాత మరొక ఘటనగా, వాటి మధ్య కార్యకారణ సంబంధాలతో అర్థం చేసుకోవడం సాధ్యమయింది గాని ఆ తర్వాత జరిగిన చరిత్రను అలా కాలక్రమంలో వివరించడం కష్టం. అలాగే మొత్తం చరిత్రను కొన్ని అంశాలుగా విభజించి ఆయా అంశాల వారీగా రాయడమూ కష్టమే గాని ఆ పద్ధతిలో చరిత్రను సమగ్రంగా గ్రహించడానికి కొంతవరకు వీలవుతుంది. అందువల్ల ఇక్కడ 1970 – 2020 విరసం చరిత్రను ఏడెనిమిది అంశాల కింద, ఇతివృత్తాల కింద విభజించి వివరించడానికి, విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తున్నాను.
అవి
- సంస్థా నిర్మాణాన్ని, కార్యక్రమాన్ని బైటి సమాజానికి చెప్పే ఘటనలు, సందర్భాలు, సాంకేతిక అంశాలు.
- ఐదు దశాబ్దాలలో వచన కవిత, పాట, కళారూపాలు, కథ, నవల, నాటిక, వ్యాసం, సాహిత్య విమర్శ, రాజకీయ, సామాజిక విమర్శ, ఉపన్యాసం, అనువాదం వంటి విభిన్న సాహిత్య ప్రక్రియలలో సంస్థ సాధించిన జయాపజయాలు.
- ఈ ఐదు దశాబ్దాలలో బైటి సాహిత్య లోకంతో సంస్థ జరిపిన చర్చలు, సంభాషణలు, సంవాదాలు, వివాదాలు.
- ఐదు దశాబ్దాలలో సంస్థ నెరపిన రాజకీయ ప్రభావం, సంస్థకూ సమాజానికీ మధ్య సాగిన సంభాషణ, సమాజంలో సంస్థ జోక్యం, సంస్థలో సమాజ జోక్యం, పరస్పర చర్య – ప్రతిచర్యల చరిత్ర.
- సంస్థ మీద, నాయకత్వం మీద, సభ్యుల మీద, సాహిత్య, సామాజిక కృషి మీద సాగిన నిర్బంధాల చరిత్ర.
- సంస్థా నిర్మాణం లోపలి సమస్యలు, ప్రణాళిక చర్చలు, సంస్థాగత అంశాలు.
- సంస్థ విశిష్టతలు, లోపాలు, చేసి ఉండవలసిన, చేయలేకపోయిన పనులు.
ఈ ఏడెనిమిది అంశాలలో ప్రతి ఒక్కటీ కూడ విస్తారమైన సంక్లిష్టమైన చరిత్ర కలిగినవి, ప్రతి ఒక్కటీ ఒక గ్రంథం కాగలిగినవి. ముందే చెప్పినట్టుగా వీటిలో ప్రతి ఒక్కటీ మరొక దానితో సంబంధంలో మాత్రమే పరిశీలించవలసినవి.
తారీఖులు, దస్తావేజులు ఇవి కావోయ్ చరిత్ర సారం అనే మాట పూర్తిగా నిజమే అయినప్పటికీ, తారీఖులు, దస్తావేజులు, సమాచార శకలాలు, స్థలాలు, పేర్లు లేకుండా చరిత్ర సారాన్ని విశ్లేషించడం సాధ్యం కాదు. చరిత్ర అనే భవనానికి ఆ వివరాలు ఇటుకల్లాంటివి. చరిత్ర అనే వాక్యానికి ఆ వివరాలు అక్షరాలూ పదాలూ వాక్యాలూ. అందువల్ల ఈ ఐదు దశాబ్దాల చరిత్రలో మిగిలిన అన్ని అంశాలకూ పునాదిగా నిలిచే ఆ వివరాల మొదటి అంశంతో ప్రారంభించడం సముచితంగా ఉంటుంది.
విప్లవ రచయితల సంఘం అంటే ఒక సాహిత్య ఉద్యమం, ఒక సామాజిక ప్రభావం, ఒక రాజకీయ భావ ప్రచార వేదిక వంటి సానుకూలమైన వర్ణనలూ, నక్సలైట్ల ముసుగు సంస్థ, రాజకీయాలను సాహిత్యంగా చలామణీ చేసే సంస్థ, హింసనూ నేరాన్నీ ప్రభుత్వ వ్యతిరేకతనూ సమర్థించే, వ్యవస్థను కూలదోయాలని ప్రచారం చేసే సంస్థ వంటి ప్రతికూలమైన వర్ణనలూ ఎన్నైనా చేయవచ్చును గాని మొట్టమొదట అది ఒక బుద్ధిజీవుల స్వచ్ఛంద సమష్టి నిర్మాణం అని, ఒక క్రమబద్ధమైన, క్రమశిక్షణాయుతమైన పటిష్టమైన సామూహిక సంస్థ అని గుర్తించవలసి ఉంటుంది.
తమ సంస్థ పేరులోని మూడు పదాలు అలవోకగా ఉన్నవి కావని, మొదటి పదం తమ ఆశయానికి, రెండో పదం తమ కార్యక్షేత్రానికి, మూడో పదం తమ సమష్టి కార్యాచరణకు చిహ్నాలని కెవిఆర్ అనేకసార్లు చెప్పారు, రాశారు. నిజానికి అదే ఆశయం ఉన్న, అదే కార్యక్షేత్రంలో పని చేస్తున్న ఇతర సంస్థలు ఎన్నో గతంలోనూ వర్తమానంలోనూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడ రావచ్చు. మూడో పదంలో చెప్పుకున్న సమష్టి కార్యాచరణే ఈ సంస్థకు ఒక విశిష్టతను, ఇతర సంస్థలతో భిన్నత్వాన్ని ఇచ్చింది. అందువల్ల కూడ ఈ యాబై సంవత్సరాల చరిత్ర వివరణను ఆ సంస్థాగత నిర్మాణ చరిత్రతో ప్రారంభించడం సముచితంగా ఉంటుంది.
ఏదైనా ఒక సంస్థ నిర్మాణం గురించి చర్చించేటప్పుడు, అందులోనూ ఆ సంస్థ బుద్ధిజీవుల, సృజనాత్మక రచయితల సంస్థ అయినప్పుడు, సభ్యుల వివరాలు, ఆ సభ్యుల సృజన వివరాలు, సంస్థకూ సభ్యులకూ, నాయకత్వానికీ సభ్యులకూ మధ్య సంబంధాలు, సభ్యుల మధ్య సమాచార వినిమయ పద్ధతులు, సంస్థ లోపల సమష్టి నిర్ణయాల ప్రక్రియలు, సభ్యులు ఆంతరంగికంగా తమలో తాము కలుసుకునే పద్ధతులు, బైటి సమాజంతో కలిసే పద్ధతులు, అందులో భాగంగా మహా సభలు, సాహిత్య పాఠశాలలు, సాధారణ సభలు, సదస్సులు, వర్క్ షాపులు, ఇతర సాహిత్య, సాంస్కృతిక నిర్మాణాలలో భాగస్వామ్యం వంటి అనేక అంశాలు పరిశీలించవలసి ఉంటుంది. ఈ క్రమంలో ఈ ఐదు దశాబ్దాల చరిత్రలో విరసం ఆంతరంగికంగాను, బహిరంగంగాను జరిపిన కార్యక్రమాల జాబితా చూడడం ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పటికి ఈ జాబితా సంపూర్ణమైనదీ, సమగ్రమైనదీ కాదు. ఇందులో మరెన్నో కార్యక్రమాలు చేరవలసే ఉన్నాయి. కాని ఈ జాబితా, విరసం రాష్ట్రస్థాయిలోనే ఎన్ని కార్యక్రమాలు నిర్వహించిందో చూపుతుంది. వీటిలో ఆంతరంగిక కార్యక్రమాలలోనైతే కనీసం యాబై మంది, గరిష్టంగా రెండు వందల మంది, బహిరంగ కార్యక్రమాలలోనైతే కనీసం రెండు వందల మంది గరిష్టంగా రెండు వేల మంది పాల్గొన్నారని అంచనా వేయవచ్ఛు. అలాగే ఈ కార్యక్రమాల్లో సభ్యులు మాత్రమే కాక సహ ప్రయాణికులైన కవులు, రచయితలు, విరసం అభిప్రాయాలతో ఏకీభావం లేకపోయినా స్థూల ప్రజాస్వామిక, ప్రగతిశీల వ్యక్తులు కూడ పాల్గొన్నారు. ఒకరకంగా ఈ జాబితా ఒక అస్థిపంజరం వంటిది. ఆయా కార్యక్రమాలు అద్భుతమైన చైతన్యీకరణతో, అపారమైన భాగస్వామ్యంతో తెలుగునాట విప్లవ సాహిత్య శరీరాన్ని సంపద్వంతమూ సజీవమూ చేశాయి. ఇక ముందు మనం చూడబోయే చరిత్రలో ప్రతి సన్నివేశానికీ, ప్రతి రచనకూ, ప్రతి ఉద్వేగానికీ ఈ జాబితాలోని ఏదో ఒక స్థలంతో, సభతో సంబంధం ఉంది.
ఐదు దశాబ్దాల విరసం చరిత్ర స్థల కాల చట్రం
సంవత్సరం/తేదీలు | కార్యక్రమం | స్థలం | |
1 | 1970 జూలై 4 | ఆవిర్భావం | హైదరాబాద్ |
2 | 1970 అక్టోబర్ 8,9 | మొదటి మహాసభ | ఖమ్మం |
3 | 1971 జూన్ 28, 29 | రెండో మహాసభ | హైదరాబాద్ |
4 | 1972 అక్టోబర్ 15, 16 | మూడో మహాసభ | గుంటూరు |
5 | 1973 మే 12 | అసాధారణ సర్వసభ్య సమావేశం | తెనాలి |
6 | 1973 అక్టోబర్ 4-7 | మొదటి సాహిత్య పాఠశాల | వరంగల్ |
7 | 1974 జనవరి 12-14 | నాలుగో మహాసభ | కర్నూలు |
8 | 1974 అక్టోబర్ 23 – 25 | రెండో సాహిత్య పాఠశాల | విశాఖపట్నం |
9 | 1975 జనవరి 13,14 | ఐదో మహాసభ | అనంతపురం |
10 | 1977 జూన్ 4 | సర్వసభ్య సమావేశం | విజయవాడ |
11 | 1978 ఏప్రిల్ 29 – మే 1 | ఆరో మహాసభ | చీరాల |
12 | 1979 జనవరి 13 – 15 | మూడో సాహిత్య పాఠశాల | వరంగల్ |
13 | 1979 సెప్టెంబర్ 29 – అక్టోబర్ 1 | ఏడో మహాసభ | తిరుపతి |
14 | 1980 మే 9 | సర్వసభ్య సమావేశం | విజయవాడ |
15 | 1980 అక్టోబర్ 17 – 19 | ఎనిమిదో మహాసభ/దశాబ్ది ఉత్సవాలు | హైదరాబాద్ |
16 | 1981 అక్టోబర్ | నాలుగో సాహిత్య పాఠశాల | గుడివాడ |
17 | 1982 జూన్ 4 – 6 | తొమ్మిదో మహాసభలు | మాచర్ల |
18 | 1983 జనవరి 13 – 15 | ఐదో సాహిత్య పాఠశాల | విజయవాడ |
19 | 1984 జనవరి 11 – 13 | పదో మహాసభలు | మాకివలస, శ్రీకాకుళం జిల్లా |
20 | 1984 మే 21 – 23 | మార్క్స్ శతవర్ధంతి పాఠశాల | చిత్తూరు |
21 | 1984 ఆగస్ట్ 11 – 14 | కథ వర్క్ షాప్ | విశాఖపట్నం |
22 | 1984 అక్టోబర్ 1 – 6 | ప్రజాకళారూపాల వర్క్ షాప్ | ఆలకూరపాడు, ప్రకాశం జిల్లా |
23 | 1985 జనవరి 12 – 14 | ఆరో సాహిత్య పాఠశాల | గద్వాల, మహబూబ్ నగర్ జిల్లా |
24 | 1985 మే | వేసవి పాఠశాల | పల్లెర్లమూడి, కృష్ణా జిల్లా |
25 | 1985 నవంబర్ | సాహిత్య విమర్శ వర్క్ షాప్ | కావలి |
26 | 1986 ఫిబ్రవరి | సర్వసభ్యసమావేశం | విజయవాడ |
27 | 1986 మే? | వేసవి పాఠశాల | పల్లెర్లమూడి, కృష్ణా జిల్లా |
28 | 1986 అక్టోబర్ 10 – 12 | వచనకవిత-పాట వర్క్ షాప్ | ఉన్నవ, గుంటూరు జిల్లా |
29 | 1987 జనవరి 13 | సర్వసభ్యసమావేశం | విజయవాడ |
30 | 1987 మే | వేసవి పాఠశాల | అల్లూరు, నెల్లూరు జిల్లా |
31 | 1987 అక్టోబర్ | సర్వసభ్య సమావేశం | చీరాల |
32 | 1988 జనవరి 14, 15 | పదకొండో మహాసభలు | ఒంగోలు |
33 | 1988 మే | వేసవి పాఠశాల | కర్నూలు |
34 | 1989 మార్చ్ 22, 23 | ఏడో సాహిత్య పాఠశాల | నెల్లూరు |
35 | 1989 మే | వేసవి పాఠశాల | హైదరాబాద్ |
36 | 1990 జనవరి 11 – 13 | పన్నెండో మహాసభలు/ఇరవై ఏళ్ల మహాసభలు | హైదరాబాద్ |
37 | 1991 జనవరి 13,14 | ఎనిమిదో సాహిత్య పాఠశాల | విశాఖపట్నం |
38 | 1992 జనవరి 11-13 | పదమూడో మహాసభలు | గుంటూరు |
39 | 1992 మే | వేసవి పాఠశాల | రాజమండ్రి |
40 | 1993 జనవరి 9-11 | తొమ్మిదో సాహిత్య పాఠశాల | గుడివాడ |
41 | 1993 మే | వేసవి పాఠశాల | చాగల్లు, పశ్చిమ గోదావరి జిల్లా |
42 | 1994 జనవరి 12, 13 | పద్నాలుగో మహాసభలు | రాజమండ్రి |
43 | 1994 మే | కథ వర్క్ షాప్ | మహానంది, కర్నూలు జిల్లా |
44 | 1995 మే | కథ వర్క్ షాప్ | లోపూడి |
45 | 1996 జనవరి 11-13 | పదిహేనో మహాసభలు | హైదరాబాద్ |
46 | 1996 డిసెంబర్ 14,15 | రాయలసీమ సాహిత్య సదస్సు | కర్నూలు? |
47 | 1997 జనవరి 13,14 | పదో సాహిత్య పాఠశాల | విజయవాడ |
48 | 1998 జనవరి 11,12 | పదహారో మహాసభలు | శ్రీకాకుళం |
49 | 1998 మే 17-22 | వేసవి పాఠశాల | నకిరేకల్, నల్లగొండ జిల్లా |
50 | 1999 జనవరి 14,15 | పదకొండో సాహిత్య పాఠశాల | కావలి |
51 | 2000 మే 1,2 | పదిహేడో మహాసభలు | ఆలకూరపాడు |
52 | 2001 జనవరి 14,15 | పన్నెండో సాహిత్య పాఠశాల | ప్రొద్దటూరు, కడప జిల్లా |
53 | 2003 జనవరి 12,13 | పదమూడో సాహిత్య పాఠశాల | అనంతపురం |
54 | 2004 జనవరి 12,13 | పందొమ్మిదో మహాసభలు | కావలి |
55 | 2005 జనవరి 14,15 | పద్నాలుగో సాహిత్య పాఠశాల | విశాఖపట్నం |
56 | 2006 జూన్ 10,11 | ఇరవయో మహాసభలు | హైదరాబాద్ |
57 | 2007 జనవరి 13,14 | పదిహేనో సాహిత్య పాఠశాల | కర్నూలు |
58 | 2008 జనవరి 5,6 | ఇరవై ఒకటవ మహాసభలు | గుంటూరు |
59 | 2009 జనవరి 3,4 | పదహారో సాహిత్య పాఠశాల (కొకు శతజయంతి) | తెనాలి |
60 | 2010 ఏప్రిల్ 30, మే 1 | ఇరవై రెండో మహాసభలు (శ్రీశ్రీ శతజయంతి) | విశాఖపట్నం |
61 | 2010 సెప్టెంబర్ | కథ వర్క్ షాప్ | ఒంగోలు |
62 | 2011 మే 21,22 | పదిహేడో సాహిత్య పాఠశాల | కావలి |
63 | 2012 జనవరి 20,21 | కథ వర్క్ షాప్ | అనంతపురం |
64 | 2012 మార్చ్ 10,11 | ఇరవై మూడో మహాసభలు | కర్నూలు |
65 | 2013 జనవరి 11,12 | పద్దెనిమిదో సాహిత్య పాఠశాల | హైదరాబాద్ |
66 | 2014 జనవరి 11,12 | ఇరవై నాలుగో మహాసభలు | వరంగల్ |
67 | 2015 ఫిబ్రవరి 7, 8 | పందొమ్మిదో సాహిత్య పాఠశాల | బొబ్బిలి |
68 | 2016 జనవరి 9, 10 | ఇరవై ఐదో మహాసభలు | విజయవాడ |
69 | 2017 ఫిబ్రవరి 11, 12 | ఇరవయో సాహిత్య పాఠశాల | ప్రొద్దటూరు |
70 | 2018 | ఇరవై ఆరో మహాసభలు | మహబూబ్ నగర్ |
71 | 2019 ఫిబ్రవరి 9, 10 | ఇరవై ఒకటో సాహిత్య పాఠశాల | నల్లగొండ |
72 | 2020 జనవరి 11, 12 | ఇరవై ఏడో మహాసభలు | హైదరాబాద్ |
(మిగతా వచ్చే సంచికలో)