ఈ మధ్యే అమరుడైన పాక హనుమంతు (గణేశ్) స్మరణలో విప్లవోద్యమ సానుభూతిపరులు, మద్దతుదారులు ఆయన అమరత్వాన్ని స్మరిస్తూ, శ్లాఘిస్తూ చాలా దుఃఖంతో రాసిన వ్యాసాలివి. గతంలో కూడా అమరుల గురించి రచనలు వచ్చాయి. ఈ అమరత్వానికి ఒక ప్రత్యేకత ఉంది. విప్లవోద్యమం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న దశలో హనుమంతు అసువులు బాశాడు. రాజ్యాంగాన్ని, చట్టబద్ధ ప్రమాణాలను పూర్తిగా విస్మరించి బాహాటంగా ఒక తిథి నిర్ణయించి, ఆ తిథి లోపల ఉద్యమాన్ని రూపు మాపుతామని రాజ్యం ప్రకటించింది. ఆ నేపథ్యంలోనే సాయుధ బలగాలకు పూర్తి అధికార మిచ్చి వందల సంఖ్యలో విప్లవకారులను హత్య చేసింది. ఆ నేపథ్యంలో పాక హనుమంతు అమరుడయ్యాడు.
రాజ్యం అవలంభించిన వ్యూహాన్ని విప్లవోద్యమం సరిగా అంచనావేయలేక పోవడమో, కగార్ ఆపరేషన్‌తో చుట్టిముట్టి అణచివేత చేపట్టిన రాజ్య దిగ్బంధంలో చిక్కి పార్టీ నేతలు, బాధ్యులు కలిసే పరిస్థితులే మృగ్యమైనప్పుడు ఎక్కడికక్కడ అణచివేయబడుతున్న సందర్భంలో ఏమి చేయాలో, ఎలా ఈ పరిస్థితిని ఎదుర్కోవాలో సమిష్టిగా ఆలోచించలేని పరిస్థితి ఏర్పడి విప్లవోద్యమం సంక్షోభంలో పడిపోయింది. నిర్ణయాల భారం పూర్తిగా స్థానిక నాయకత్వం మీద పడ్డప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నిర్ణయం తీసుకోవటం వల్ల లొంగుబాటు ముందుకు వచ్చింది. ఈ పరిస్థితితో.. ఉద్యమాన్ని ఎంతో కాలంగా దగ్గరగా పరిశీలిస్తున్న వాళ్లు కూడా చాలా గందరగోళానికి గురయ్యారు. ఈ సంక్షోభ పరిస్థితిలో కొందరు సాయుధ పోరాటం నుంచి బయటకు వచ్చి పని చేయాలని నిర్ణయించుకున్నారు. అలా బహిరంగంగా ప్రధాన స్రవంతిలోకి వచ్చిన వాళ్లున్నారు. బయటకు వచ్చిన వాళ్లు కొందరు ఆయుధాలతో లొంగిపోయారు. మరి కొందరు ఆయుధాలు లేకుండా లొంగిపోయారు. కొందరు బయటి సమాజంలో రాజ్యాంగ పరిధిలో ఆయుధం లేకుండా తమ విశ్వాసాల మేరకు పనిచేస్తామని ప్రకటించిన వారున్నారు. ఇదే గాక, కొన్ని దశాబ్దాల తరబడి ఉద్యమ ప్రస్థానంలో ఉండి, కీలక నాయకులుగా ఎదిగిన వారు తాము బయటకి రావడమే గాక మిగతా వాళ్లందరూ ఆయుధాలతో సహా బయటకు రావాలని పిలుపునిచ్చిన వారున్నారు.
విప్లవకారులు ప్రధాన స్రవంతిలోకి రావటం అనేది.. అది పూర్తిగా వాళ్ల వ్యక్తిగత నిర్ణయం. దాని గురించి (తప్పు ఒప్పులుగా) జడ్జిమెంటు చేయటం చాలా కష్టం. ఏళ్ల తరబడి ఎన్నో ఆటు పోటులను ఎదుర్కొని నిలబడ్డ వాళ్లు పరిస్థితులు తమ చేయిదాటి పోయాయని భావించి బయటకు రావాలనే నిర్ణయం తీసుకోవటమే గాక, అందరినీ బయటకు రాండి అని పిలుపునిచ్చారు. ఈ పిలుపు విషయంలో ఉద్యమ సానుభూతి పరులు బాధపడ్డారు. ఆగ్రహం చెందారు. ఆవేదనకు గురయ్యారు. చివరికి ఆ పిలుపు నిచ్చిన వాళ్లను ద్రోహులు అని కూడా అన్నారు. అలా పిలుపునిచ్చిన వారు తమ ఆత్మకథ రాస్తే తప్ప వాస్తవాలు మనకు తెలియవు.
ఉద్యమ నాయకత్వ స్థానంలో ఉన్న వారిని చూస్తే.. స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి- ఉద్యమం నుంచి ప్రాణాలతో బయటకి రావాలని నిర్ణయించుకున్నవారు. రెండు- చివరి వరకు పోరాడి ప్రాణాలిచ్చినవాళ్లు. ఈ రెండవ కోవకు చెందిన వాడు పాక హనుమంతు. ఉద్యమ నేపథ్యంలో.. చాలా కాలంగా అమరత్వాన్ని కవిత్వీకరించిన వాళ్లు, ఆవేశంగా రాసినవాళ్లు, స్ఫూర్తిపొందిన వాళ్లు, బయట ఉన్నా నిరాడంబరంగా జీవిస్తున్నవాళ్లు ఎందరో ఉన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా విలువలకు నిలబడ్డవాళ్లున్నారు. పాక హనుమంతును త్యాగానికి పోరాటానికి ప్రతీకగా భావిస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఆ క్రమంలో ఆయనతో గడిపిన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నవాళ్లు, రాజ్య నిర్బంధాన్ని ఎదుర్కొన్న వాళ్లు , గణేశ్ త్యాగాన్ని స్మరిస్తూ ఆయన నిర్వహించిన పాత్ర గురించి విప్లవోద్యమాన్ని ముందుకు ఎలా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడో, ఆ తీసుకెళ్లడంలో ఆయన నిర్వహించిన చారిత్రక పాత్ర గురించి ఈ వ్యాసాల్లో తమకు తెలిసిన వివరాల మేరకు స్ఫూర్తిదాయకమైన వ్యాసాలను రాశారు.
చరిత్ర త్యాగాలను రికార్డు చేస్తుంది. ముఖ్యంగా వీరుల త్యాగాలను గురించి వాళ్ల అమరత్వానికి శాశ్వతత్వం కలిపిస్తుంది. మీ త్యాగం ఉన్నతమైనదీ అది హిమశిఖరం వంటిది అన్న కవి మాటలు హృదయం నుండే వచ్చినవి. త్యాగం అమరత్వానికి శాశ్వతత్వం కలిగిస్తుంది. దశాబ్దాల తరబడి కత్తిమీద సాముతో జీవించి, ఏ కారణం వల్ల బయటకి వచ్చినా, అంత కాలం వాళ్లు చేసిన త్యాగానికి రావలసిన గుర్తింపు, గౌరవం ఇవ్వడంలో చరిత్ర చాలా కటువుగా ఉంటే దాన్ని సమీక్ష చేయవలసే ఉంది. కేవలం ప్రాణత్యాగమే గీటురాయిగా పరిగణించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాలాంటి వాళ్లకు సంశయాత్మకంగా ఉన్నది.
ప్రాణ త్యాగం అత్యున్నతమైనది. అలాంటి త్యాగం చేసిన గణేశ్‌పై ఈ పుస్తకం తీసుకురావటంలో ఉన్న ఈ కృషిని అభినందించవలసిందే. గణేశ్ అమరత్వాన్ని చరిత్రకి ఎక్కించటం ఒక చారిత్రక బాధ్యత. మహత్తరమైన విప్లవోద్యమంలో ప్రాణత్యాగం అత్యున్నతమైనది. ఆ అమరుల జీవితాచరణే భావి తరాల స్ఫూర్తి.
(ఇటీవల విప్లవోద్యమంలో అమరుడైన కా. హనుమంతు జీవితాచరణపై ఎబిఎంఎస్ ప్రచురించిన ‘ప్రజాయుద్ధ సంకేతం’ పుస్తకానికి రాసిన ముందుమాట)