ప్రజాపక్షపాతమే నా సృజనాత్మకతకు భూమిక: అనిశెట్టి రజిత

అనిశెట్టి రజిత చూస్తే సాదాసీదాగా కనిపించే వ్యక్తి, రచయిత్రి, సామాజిక కార్యకర్త. సమాజం పట్ల, తోటి మనుషుల బాధల్లో తాను బాధాసారుప్యాన్ని నింపుకునే మట్టిబంధం ఆమెది. తలవంచని ధిక్కార స్వభావం జీవితంలోనే కాదు సాహిత్యాక్షరంలో ప్రతిబింబిస్తుంది. విశ్వవిద్యాలయంలో బోధనేతర ఉద్యోగాన్ని నిర్వహించినప్పటికీ సామాజిక ఉద్యమాల్లో, సాహితీ క్షేత్రంలో మేధోజీవిగా నిలిచింది. ఆదివాసీలు,దళితులు, నిర్వాసితులు, అట్టడుగు వర్గాల ప్రజల సమస్యలను, పోరాటాలను అవాహనం చేసుకుని అక్షరీకరించింది. ఆకాశంలోనే కాదు అవకాశాల్లో మహిళలకు అన్నిరంగాల్లో సమభాగస్వామ్యం హక్కని నినదిస్తుంది. సత్యానికి, అసత్యానికి మధ్య నిత్యం జరుగుతున్న ఘర్షణలో తనను తాను యుద్ధపు పనిముట్టుగా మార్చుకుంది. తోటి మనుషుల పట్ల ప్రేమ ఆప్యాయతలకు ప్రతీక రజిత. ఆమె అక్షరాలన్ని పీడిత, బడుగు, బలహీనవర్గాల మహిళల కష్టాలతో కలిసి సహజీవనం చేస్తాయి. రచనల్లో కొత్తదనం కోసం తపించాలి కానీ అవార్డులు, భుజకీర్తుల కోసం కాదని చెప్పే అనిశెట్టి రజితతో ‘‘కొలిమి’’ ముచ్చట్లు…

  • మీ బాల్యం గురించి చెప్పండి.

మాది హన్మకొండలోని కుమార్పల్లి. మా బాపు అనిశెట్టి బాలరాజు, అమ్మ జయలక్ష్మి. మేమిద్దరం. నాకన్నా రెండేళ్ళు చిన్నది మా చెల్లెలు రేణుక. నేను 14, ఏప్రిల్, 1958 రోజున పుట్టాను. మా బాపు కాంగ్రెస్ రాజకీయాలతో సంబంధం కలిగి వుండేది. ఇంట్లో అటు వ్యవసాయపు వాతావరణం, రాజకీయ వాతావరణమూ ఉండేది. నేను మా వాడలోని పిల్లల్ని పోగేసి తీరొక్క ఆటలు ఆడేది. డ్రామాలు కూడా వేయించేది. అప్పటి నుంచే కొన్ని లక్షణాలు ఉండేవి. అందర్నీ కూడగట్టడం ఒక ఆటో, పాటో నేర్పించే ప్రయత్నం చేయడం. పెద్దవాళ్ళు చేసే ప్రతి పనినీ అంటే అనుకరించడం చేసేది. తిండికి లోటు లేదు. ఆటోరిక్షాలు లేని ఆ రోజుల్లో పది మైళ్ళ దూరంలో ఉన్న ఆంగ్ల భాష స్కూళ్లో చేర్పించారు. పొద్దున రిక్షాలో బయలుదేరి పోతే చీకట్లో ఇంటికొచ్చేది. పసితనం కాబట్టి ఆ అర్థంకాని ఆంగ్ల భాషల్లో చదువూ, బడి వాతావరణం, సుదీర్ఘమైన సమయం అంతా బడిలో ఉండాల్సిరావడం భరించరానిదిగా ఉండేది. రోజూ ఏడుపు, లొల్లి. రోజూ రిక్షా ఆగయ్య తాత అంగీలు చించడం, మా బాపు కమీజులు ఇయ్యడం… అంతా ఒక ప్రహసనంగా జరిగేది. చిన్నప్పటి నుండే పిల్లలు ఎవరైనా సతాయిస్తే నన్నూ, చిన్న పిల్లలనూ సతాయిస్తే చూసి చూసి గట్టి చెంపదెబ్బ కొట్టేది. కొట్టిన తరవాత ఏం జరగనుందో అని భయపడేది. రోజూ మా మేనత్త తన వెంట రిక్షాలో నన్ను తీసుకపోయి నన్ను బడిలో దించి తన బడికి వెళ్ళిపోయేది. చిన్నప్పటినుండీ నాకు మా చెల్లెలికి తల్లితో అటాచ్మెంట్‍ లేదు. మా మేనత్త విమలాదేవి పెత్తనంలో ఇల్లు నడిచేది. చదువుకున్నది, హిందీ టీచర్గా ఉద్యోగం చేసేది. మా ఇండ్లలో అది చాలా గొప్పే. ఆమె చాలా స్ట్రిక్ట్, చూస్తేనే అందరూ భయపడేది. నాలుగో తరగతికి వచ్చిన తర్వాత కూడా రోజూ నన్ను చావగొట్టేది. బహుశా చదువు విషయంలో నేను తిన్నన్ని చావు దెబ్బలు ఎవ్వరూ తినలేదేమో. అంతా పద్ధతి ప్రకారం జరగాలి ఆమెకు. ఆమె పెట్టిందే క్రమశిక్షణ అనుకోవాలె. ఇంట్లో మాకో కుట్టుమిషన్‍ ఉండేది. నాకూ మా చెల్లెలుకు మంచి డిజైన్లతో డ్రెస్సులు కుట్టి తొడిగేది. అయినా అవన్నీ నేను చదివే కాన్వెంట్ స్కూళ్లలోని పెద్ద ఉద్యోగస్తుల, పెద్ద హోదాలున్న వాళ్ళ పిల్లల డ్రెస్‍ల ముందు వెలవెలబోయేవి. మంచి బట్టలు లేవని ప్రతి శనివారం నేను కుంచించుకపోయేదాన్ని. ఆ రోజు బడిలో సిగ్గు సిగ్గుగా గడిపేది.

రకరకాల అనుభవాలలో బాల్యం గడిచింది. తల్లితో అటాచ్మెంట్‍ లేకపోవడం. తండ్రి ఎక్కువ కాలం హైదరాబాద్‍లో ఉండటం. ఇంట్లో మేనత్త పెత్తనం కింద తన్నులు తింటూ గడిపిన బాల్యం నాది. తల్లితో లేని ఆ అనుబంధం బహుశా ఇప్పటివరకూ ఒక వెలితిగా నన్ను వెంటాడుతూనే ఉందేమో. రోజూ తన్నులూ, ఆ ఇంగ్లీష్‍ చదువుల పట్ల అనాసక్తీ, ఆ వాతావరణం ఏదైతేనేమి, భవిష్యత్‍ చదువుకు ఒక గట్టి పునాది పడిందనుకోవాలి. తెలుగు భాష, పుస్తకాలు, సబ్జెక్ట్ పట్ల మమకారం, ఇష్టం ఉండేది. మాతృప్రేమ లాంటిది కావచ్చు.

  • మీ కళాశాల జీవితంలో ప్రత్యేకంగా విశేషాలు?

కళాశాలలోకి వచ్చిన తరవాత ఒక్క తెలుగు క్లాస్‍ తప్ప అన్ని క్లాస్‍ల పట్ల అనాసక్తి ఉండేది. నాకు ఇంటర్‍లో ఆర్ట్స్ చదవాలని ఉండేది. కానీ మా మేనత్త ప్రెజర్‍ తెచ్చి సైన్స్లో చేర్పించింది. ఆ కాలేజీ రోజుల్లో చదువు తక్కువ ఆటా పాటలే ఎక్కువ, సీరియస్‌నెస్ లేదు. ఫలితంగా ఇంటర్‍లో ఫెయిల్‍ అయ్యాను. తరవాత మరో కళాశాల, హైదరాబాద్‍ పాలిటెక్నిక్‍లో ఫార్మసీ డిప్లొమాలో చేర్చారు. దాన్ని బహు సమర్థవంతంగా నిర్వహించుకుంటూనే ఇంటర్‍లో తప్పిన సబ్జెక్టస్ రాసి పాస య్యాను. మొదటి సంవత్సరం ఫార్మసీలో డిస్టింక్షన్‍లో పాసయ్యాను. ఫైనల్‍ ఇయర్‍ చివరన పరీక్షల కు నెలరోజుల ముందుగా 9 మార్చ్, 1979 రోజున మా బాపు హార్ట్ స్ట్రోక్‍తో చనిపోయాడు. నేను పరీక్షలు రాయలేకపోయాను. వరంగల్‍ కొచ్చి నాకిష్టమైన బి.ఏ.లో చేరాను. వెంటాడే పుట్టెడు సమస్యలున్నా బి.ఏ.లో ర్యాంక్‍తో ప్రభుత్వపాలనలో బంగారు పతకంతో బయటపడ్డాను. వెంటనే యం.ఏ.లో చేరడం, అక్కడా యూనివర్సిటీ ర్యాంక్‍, గోల్డ్ మెడల్‍తో వచ్చి యం.ఫిల్‍.లో చేరాను. తరవాత సాగిన చదువంతా అర్ధాంతరమే. ప్రీ పిహెచ్‍.డి.లో 70 శాతం సాధించినా డాక్టరేట్‍ పూర్తి చేయలేదు. కారణం ఇంటా బయిటా రకరకాల వ్యక్తులూ, వాళ్ళు సృష్టించిన సమస్యలతో ఘర్షణా, తలెత్తిన సంక్షోభాలూ, బాధ్యతలు మీదబడిన ఒత్తిళ్ళు. వీటితో నిరంతరం ఎదురీతతో సరిపోయేది. నేను బోల్డ్గా మారడానికి ఇవన్నీ దోహదం చేసాయనుకుంటా. అప్పటికే వామపక్ష రాజకీయాలతో ప్రభావితమై సామాజికంగా యాక్టివ్‍గా ఉన్నాను. నన్ను నేను ఒక యుద్ధపు పనిముట్టుగా మార్చుకున్నాను. పనిముట్టనే అంటాను. ఆయుధం, అస్త్రం అనాలేమో! బాపు చనిపోయిన నాటినుండీ నాపై అంటే నా మెడలపై ఇంటి బాధ్యతల కాడిని అనివార్యంగా మోయాల్సివచ్చింది. ఆనాటినుండీ సమాజమంతా నా పట్ల శత్రుత్వం వహించింది అనుకుంటాను. నా మొరాలిటీని దెబ్బదీయడానికి, ఉన్నది లాక్కోవడానికీ వీరూ వారిని తేడా లేకుండా నన్ను కుంగదీసారు, హింసించారు. మోసాల ఎత్తుగడలతో వంచించారు.

అటు కళాశాల చదువు ఇటు సమస్యలతో పెనుగులాట అంతా సమాంతరంగా సాగిపోయింది. మరోవైపు ఉద్యమ సంస్కృతి బలపడుతూపోయింది. నా నీడే నాకు శత్రువైన సందర్భాలు, లోకం తెలుసుకోడానికి నెత్తురు అర్పించిన సందర్భాలు అన్నీ అనుభవమయ్యింది ఈ ఆరేడేళ్ళ కాలంలోనే. మనుషుల్లో ఉన్న మృగత్వం, వేటాడే తత్వం, అబద్ధాలతో అంటకాగే తత్వం అన్నీ తెలిసివచ్చాయి. నిజాల కన్నా అబద్ధాలకే ఇప్పుడు పవర్‍, చెలామణి అయ్యే అవకాశం ఎక్కువ. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగలించుకునేవాళ్ళే ఎక్కువ. అసూయలు జీవితాలతో చెలగాటమాడి దెబ్బతీస్తాయి. అబద్దానికీ నిజానికీ నిరంతర ఘర్షణ! మంచికీ చెడుకూ మధ్య నిత్య పోరాటం! జీవితమంటే విరామమెరుగని విచిత్ర యుద్ధం!

  • మీ ఉద్యోగ ప్రస్థానం గురించి?

ఉపాధి అంటూ ఏమీ లేనప్పుడు కనాకష్టంగా కాలేజీ స్కాలర్‍షిప్‍లతో గడుపుతూ వచ్చాము. 1992లో కాకతీయ విశ్వవిద్యాలయంలో బోధనేతర ఉద్యోగిగా చేరాను. తిండికి బట్టకూ సరిపెట్టుకున్నాము. ఇక్కడొక విషయాన్ని తప్పక ప్రస్తావించాలి. 1969-71 తెలంగాణ ఉద్యమంలో 13 ఏళ్ళ వయసులో పాల్గొన్నాను. ఆ ఉద్యమ నేపథ్యమే నాకు ఉద్యోగం ఇప్పించింది అనుకుంటాను. ఒక విధంగా ఆ ఉద్యమమే నాకు నిన్నా మొన్నటి దాకా బువ్వ పెట్టింది. ఉద్యోగ ప్రస్థానంలో ఒక ఆడపిల్లగా, వెనుక ధనరాశులు లేవు, కులం బలం లేదు, తండ్రి నీడా లేదు. ఎక్కువగా మగ ఉద్యోగులతో కొలువైన ఉద్యోగ ప్రాంగణాల్లో సాటి తోటి ఉద్యోగులతో వేధింపులు ఎదుర్కోవడంలో వింతేమీ లేదు. అయితే ఇతర ఉద్యోగినీ మిత్రులు ఎదుర్కొన్న దానికీ నాకూ తేడా ఉండేది. ప్రధానంగా వారు అసూయనూ లైంగిక వేధింపులనూ ఎదుర్కొంటే నేను అసూయనూ స్త్రీ అయినందుకు ఓర్వలేనితనానికి సంబంధించిన వేధింపులు ఉండేవి. నా సామాజిక ఉద్యమ నేపధ్యం వాళ్ళకి తెలుసు కాబట్టి వేధింపుల నుండి చాలావరకు తప్పించుకోగలిగాను. ఇక క్లాస్‍-4, ఇతర ఉద్యోగినులు, భర్త చనిపోతేనో, తండ్రి చనిపోతేనో హ్యుమానిటేరియన్‍ గ్రౌండ్స్లో ఉద్యోగాలకు వచ్చిన ఆడవాళ్ళపై విపరీతమైన ఒత్తిళ్ళు, వేధింపులు ఉండేవి. వారిలో చాలా వరకు నా సపోర్టు, సహాయం కోసం వచ్చేవాళ్ళు. నేను వాళ్ళ పక్షాన నిలబడినందుకు నాపై కక్ష కట్టేవాళ్ళు. అదంతా ఒక అధ్యాయం. నేను దేనికి లొంగను, ఎక్కడా రాజీపడను. భయం, లాలూచీ, లొంగుబాటు నా డిక్షనరీలోనే లేవు. అప్పటికి నా వయసు 31-33 సంవత్సరాలు నా జీవితానుభవాలు నన్ను స్టబర్న్ గా తయారుచేసాయి. యధాతథ సమాజంపై నిరసన, కసి, ధిక్కారం నాలో జ్వలనాలుగా మారాయి. నేను సూటిగా మాట్లాడుతాను కాబట్టి కోతికి కొబ్బరికాయ దొరికినట్లు నన్ను ఏదోవంకతో నిందించాలని కాచుకుని ఉన్నవాళ్లకు మంచి అవకాశంగా వుంటుంది.

  • సాహిత్య సృజన వైపు ఏ విధంగా వచ్చారు?

చాలా చిన్నప్పటి నుండి పత్రికలు చదవడం, నవలలూ, పురాణేతిహాసాలు చదవడం.. సాహిత్యం పట్ల ఇష్టం ఏర్పడింది. రేడియో కార్యక్రమాలు తప్పనిసరిగా వినడం.. సందర్భాలననుసరించి ప్రసారమయ్యే ‘కవి సమ్మేళనాలు’ రేడియో ద్వారా చాలా ప్రభావితం చేసాయి. జిల్లా గ్రంథాలయంలో పుస్తకాలు తెచ్చుకొని చదవటం ఒక అలవాటుగా మారిపోయింది. 1977లో వరంగల్‍లో ‘చైతన్య సాహితి’ లో వ్యవస్థాపన నుండీ ఎన్నో సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఆనాటి సుప్రసిద్ధ కవులు, రచయితలు పరిచయం, వారి ప్రసంగాలు వినడం, తరవాత సాంస్కృతిక సమాఖ్య, శ్రీలేఖ సాహితి.. ఉమ్మడి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సాహిత్య సదస్సులూ, ఉత్సవాల్లో పాల్గొనడం ఈ విధంగా సాహిత్యాభిరుచి పెరుగుతూపోయింది. ఒకవైపు చైనా, రష్యా, లాటిన్‍ అమెరికాల అనువాద సాహిత్యం, అభ్యుదయ, హేతువాద, విప్లవ సాహిత్యం చదవడం, మన తెలుగు కవుల కవితా సంపుటాలు చదవడం నాలో కవిత్వ, సాహిత్య పిపాస ఎక్కువవుతూపోయింది. నిజానికి పుస్తకాలే నాకు మంచి నేస్తాలుగా మారాయి. సాహిత్యంలోని సృజనశక్తి విలువ తెలుసొచ్చింది. సామాజిక ఉద్యమ సాంగత్యం సాహిత్యానికి మరింత చేరువ చేసింది. నా కలం పాళి ‘అగ్నిపాళి’గా మారిపోయింది. అప్పట్లోనే మా కుటుంబంలో ఒక పాపకు ‘సృజన’ అని పేరు పెట్టుకున్నాము. మన సమాజంలో ఆస్తులకు ఉన్నట్లే కళలకూ, వ్యాపారాలకూ, జ్ఞానానికీ వారసులుంటారు, వారసత్వ సమాజం కదా. నిజానికి శ్రామిక కులం, వర్గంలో పుట్టిన నాకు సాహిత్యానికి సంబంధించి ఎలాంటి శిక్షణ, మార్గదర్శకత్వం గానీ, వారసత్వం గానీ లేదు. మా ఇంట్లో ఎవ్వరూ ఎప్పుడూ ఏం తిరుగుడు? ఏం రాతలు? అని నియంత్రించనూలేదు. అది బాగా కలిసొచ్చింది. మా ఇంట్లో మా బాపు, మా మేనత్త ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఉండటం వల్ల చదువుల విలువ తెలిసొచ్చింది. ప్రధానంగా మాది వ్యవసాయ కుటుంబం. చేను, చెల్క, పొలం ఉండేది. మా నాయినమ్మ సద్ది గంప నెత్తికెత్తుకొని పొలం కాడికి, చేనుకాడికి పోయేది. నేను ఆమెతోటి చేనుకాడికి పోయేదాన్ని. ఉత్పత్తి! మనం తినే తిండి ఎంతమంది శ్రమో తెలుసుకునే అవకాశం ఏర్పడింది.

నా బాల్యమంతా ముందు ముందు కష్టాలూ, ఆకలి, శ్రమ, శ్రమజీవుల శ్రమశక్తి, ఉత్పత్తీ అన్నీ కలిసి నా రచనలకు పీడితుల జీవన పోరాట ఆరాటాలు, చోదక శక్తులుగా కావడానికి దోహదం చేసింది. రాత్రంటే ఎంత భయపెట్టినా దాన్ని అధికమించి భయంలేని స్థాయికి వచ్చాను. ఎదురీత, ఎదురుపోరాటం తత్వంలోకి వచ్చేసింది. నేను నిలబడిన దానిపట్ల మొండితనం, నేను అనుకున్న లక్ష్యం, ఎనుకున్న మార్గం, చేపట్టిన పనిపట్ల నిబద్ధత ఏర్పడే నైజం అలవడింది. 1979 దశకం చివర్లో నుండి 1980, 1990వ దశకం వరకూ గోడలకున్న నోళ్ళు చాలా విషయాలు నేర్పాయి, కొత్త జ్ఞానాన్నిచ్చాయి. నేను ఆత్మార్పణం చేసుకున్నాను సమాజానికి. నాటి వామపక్ష పార్టీలన్నింటి నుండీ, ప్రజాతంత్ర వేదికలూ, ఉద్యమాలన్నింటి నుండీ పిలుపులందుకున్నాను వారితో చేరి పని చేయమనీ, కొన్నింటికి నాయకత్వం వహించమనీ.

  • తొలి రచన ఎప్పుడు చేశారు? రచన గురించి కొంచెం…

నా 13వ ఏట 9వ తరగతి చదుతున్నప్పుడు కొన్ని కవితలు రాశాను. అయితే అవి భావ కవితలు. ఇంకా అభ్యదయ సాహిత్య సంపర్కం రాని రోజులు. నిజమైన కవిత రాసింది 15, 16 ఏళ్ల వయసప్పుడు ఇంటర్‍ మీడియట్‍ చదువుతున్నా.. ‘చైతన్యం పడగెత్తింది’ కవిత తరవాత భావ కవితలెప్పుడూ రాయలేదు. ‘‘చైతన్యం పడగెత్తింది’’ కవిత తెలుగు టీచర్ల.. సాహితీ వ్యక్తుల ప్రశంసలు అందుకుంది.

  • తొలి పుస్తక ప్రచురణ ఎప్పుడు, నేపథ్యం ఏమిటి?

1984లో నాకున్న సామాజిక చేతన ఉద్యమానుభవాల స్ఫూర్తితో ‘గులాబీలు జ్వలిస్తున్నాయి’ అనే చిన్న పొత్తాన్ని ప్రచురించాను. అయితే అన్ని విధాలా గ్రంథం స్థాయిలో కాకుండా ఒక బుక్‍లెట్‍ స్థాయిలో వచ్చిందా పుస్తకం. 1997లో మాత్రమే ‘నేనొక నల్లమబ్బునవుతా’ అనే కవితా సంపుటిని ప్రచురించగలిగాను. మధ్యలో రచనా వ్యాసంగం కొనసాగింది కానీ ప్రచురణ జోలికి పోలేదు. ప్రజాకవి కాళోజీ ఇచ్చిన సూచనలు, సలహాల మేరకు ఇరవై ఏళ్లు పుస్తక ప్రచురణ చేయకుండా ఉన్నాను.1996లో కాకతీయ విశ్వవిద్యాలయంలో నేను బోధనేతర ఉద్యోగిగా పనిచేస్తున్నప్పుడు. మా గురువు గారు ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు గారు.. నన్ను ఉద్దేశించి కొన్ని మాటలు కఠినంగా మాట్లాడారు. ఆ మాటల అర్థం నీవు ఎందుకూ కొరగాకుండా పోయావని. నాపట్ల సదుద్దేశంతోనే అయినా నాకా మాటలు సూటిగా తాకాయి. ఒక పౌరుషం పట్టుదల వచ్చింది. కొన్ని నెలల్లోనే 1997లో ‘నేనొక నల్లమబ్బనవుతా’ కవిత్వం ప్రచురించి పెద్ద సభ పెట్టాను. ఇంక అక్కడి నుండి ప్రచురణాసక్తి పెరిగింది.

  • సాహిత్యంలో మీ సృజనాత్మక దృక్పథం?

సృజనకు ప్రాధాన్యత నిచ్చే ధృక్పథం నాది. మన(నా) రచన ఏదైనా ప్రతిసారీ కొత్తదనాన్ని ప్రతిబింబించాలని అనుకుంటాను. మూస రచనలు, మూస భావజాలం నాకు నచ్చదు. ‘సృజన’ వ్యక్తి ప్రధానమైనదీ, సమిష్టి ధృక్పథానికి చెందిందీ. నేను సమిష్టి విషయానికే ప్రాధాన్యతనిస్తాను. ప్రజాపక్షపాత దృష్టే నా సృజనాత్మక ధృక్పథానికి భూమిక. సామాన్యులు, పీడితులు, ఉద్యమకారులు, కార్యకర్తలు ప్రతినిత్యం అనేక త్యాగాలూ, యుద్ధాలూ చేస్తుంటారు. వాటి పట్ల మమేకతే నా సృజనాత్మకతకు మాతృక. ప్రజాకోణంలో నుంచి చేసిన రచనలకు జీవ లక్షణం వుటుంది.

  • మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన రచయితలు ఎవరు?

ప్రభావితం చేసిన రచయితలు అనడం కన్నా రచనలు అంటే సరిపోతుందేమో. అక్టోబర్‍ విప్లవం ముందూ అనంతరం వచ్చిన రష్యన్‍ సాహిత్యం, చైనా, లాటిన్‍అమెరికన్ సాహిత్యం – మార్క్స్, ఏంగిల్స్, లెనిన్‍, మావో రచనలూ,ఇంకా అభ్యుదయ రచనలెన్నో. మన దేశంలో అయితే అమృతా ప్రీతమ్‍, ఇస్మత్‍ చుగ్తాయి, ఇందిరాగోస్వామి, మహాశ్వేతాదేవి, నీలకంఠన్‍, పెరుమాళ్‍ మురుగన్‍, బెంగాళీ సాహిత్యం మొదలగునవి. తెలుగులో అయితే రావిశాస్త్రి, రంగనాయకమ్మ, ఓల్గా ఇంకెందరో.. చెప్తూపోతే పేజీలు నిండిపోతాయి. ఒక్కొక్క కవీ, రచయితవి ఒక్కో కథో, నవలో, కవితో అయి ఉండవచ్చు లేదా సంపుటాలు, సంకలనాలూ కావచ్చు. ఇక ఒక రచయితకు సంబంధించి మొత్తం రచనలన్నీ ప్రభావితం చేయలేకపోవచ్చు. ఒక రచనో, కొన్ని రచనలో, చాలా రచనలో ప్రభావితం చేస్తుండవచ్చు. రావిశాస్త్రి రచనలన్నీ, దాశరథి రంగాచార్య రచనలన్నీ ప్రభావితం చేస్తాయి. కొన్ని నచ్చుతాయి. కొన్ని ప్రభావితం చేస్తాయి.

  • వరంగల్‍ సామాజిక, విప్లవోద్యమాలు మీపై ఎట్లా ప్రభావితం చూపాయి?

విప్లవాల కోట అయిన చరిత్రాత్మకమైన వరంగల్‍ నగరం నడిబొడ్డున జన్మించడం వల్ల పరోక్షంగా విప్లవోద్యమాల భావజాలం, కదనం అన్నీ ప్రభావితం చేసాయి కూడా. దానికి తోడు చదువుతున్న విప్లవ సాహిత్యం ఉద్యమాలకు ఆకర్షితం చేస్తుంది, చేసింది. సమాజ అవకతవకలపై, అసమానత్వాల పట్లా, దోపిడీ పీడనల పట్ల నిరసన, ఆధిపత్యాలు, పెత్తనాల పట్ల ధిక్కార స్వభావం ఉన్నవాళ్ళు తప్పకుండా విప్లవోద్యమాలకూ, ప్రజాతంత్ర ఉద్యమాలకూ ఆకర్షితమవుతారు. నేనూ అంతే. నేనూ మానసికంగా మమేకమై, ప్రత్యక్షంగానూ పాల్గొన్నాను.

  • సాహితీవేత్తగా మీరు వివక్ష, అవమానాలు ఏమైనా ఎదుర్కొన్నారా?

జండర్‍ వివక్షత అంతటా ఉంది. స్త్రీగా పుట్టడంతోనే వివక్షతలూ, అవమానాలూ మొదలవుతాయి. మన పుణ్య భారతదేశంలో ఆడపిల్లగా పుట్టడం పెద్ద దౌర్భాగ్యం. ఉద్యమరంగమైనా, సాహితీ కళారంగమైనా మొదట స్త్రీగా అయినందుకు తాను ఎన్నో రెట్లు తన అర్హతలనూ ప్రూవ్‍ చేసుకోవాలి. కులం రీత్యా వెనకకు నెట్టివేయబడటం, కులం వల్ల ఏర్పడిన వర్గం రీత్యా నిర్లక్ష్యానికీ గురికాబడటం. సాంఘిక ఆర్థిక హోదాల స్థాయిననుసరించి నిరాదరణకూ గురికావడం. ముఖ్యంగా ఒక స్త్రీ స్వేచ్ఛా భావాలనూ, కదలికలనూ నిరంతర నిర్భందాలు అడ్డకుంటాయి, అసూయ ద్వేషాలు కబళిస్తాయి. అన్నింటికన్నా స్త్రీ ఎదుగుదలను ఆపేది డిమోరలైజేషన్‍ చేయడం అనేది వాస్తవం. ఇదంతా ఒక్క మగవాళ్ళ వల్లనే అన్నిసార్లూ జరగకపోవచ్చు. దేనికీ తీసిపోని మహిళలూ ఉంటారు. వాళ్ళు కులస్వామ్య, పితృస్వామ్య భావజాలంలో నిండా మునిగి అచ్చం పితృస్వామ్య, కులస్వామ్య దురహంకారుల్లా ప్రవర్తిస్తుంటారు. నేను ఉద్యమాల్లో ఒక స్త్రీగా, సాహితీరంగంలో ఒక స్త్రీగా, వెనుకబడిన తరగతుల కులాల స్త్రీగా కొంత ఎదుర్కొన్నాను. ఇంతెందుకు ఈర్షా అసూయలతో ఇప్పటికీ సాటి రచయిత్రులు, రచయితలు కొందరు బట్టకాల్చి మీదేస్తుంటారు. వెనకనుండి వీపులో వెన్నుపోటు పొడిచి పోతుంటారు. మన భారతీయులది, తెలుగువాళ్ళది సంకుచిత స్వభావం కదా! ఓర్వలేనితనంతో ఎంతటి అరాచకానికైనా తెగిస్తారు. క్రూర జంతువుల్లా కూడా ప్రవర్తిస్తారు. ‘‘వెనక దగా ముందు దగా కుడిఎడమల దగా’’ శ్రీశ్రీ అన్నట్లుగానే ఉంది నేటి పరిస్థితి. ‘యూ టూ బ్రూటస్‍’లకు తక్కువేమీ లేదు. అలాంటి ఏ అనుభవమూ నాకు కలగలేదంటే అది అబద్ధపు అతిశయోక్తి అవుతుంది. బాధ్యతలను బరువు అని తప్పించుకునేవాళ్ళూ, ఇన్‍స్టాంట్‍ గా వేదికలూ, పేరూ, గుర్తింపుల కోసం వెంపర్లాడేవాళ్ళు, పునాదుల్లేకుండా గాలిలో మేడలు కట్టేయాలనుకునేవాళ్ళు సాహిత్య కళారంగాల్లో ఉంటారు. చాలా ప్రమాదకర సంస్కృతిని విషరోగంలా వ్యాపింపజేస్తుంటారు. ప్రతిభ ఎవరు సొత్తూ కాదుగానీ నిజంగా ప్రతిభ ఉండి కృషి చేసేవాళ్ళను పడగొట్టాలనే చూస్తారు. నేను దానికి మినహాయింపేమీ కాదు. వెనక నుండి చేసే కుట్రలకు భయపడతాను. ముందునుండి చేస్తే ఎదుర్కొని తలపడతాను భావజాలంతో. నిజాయితీ, నిబద్ధత ఉన్నవాళ్ళంటే ఒక రంగంలో కానీ సమాజంలో కానీ విపరీతమైన అసహనం ఉంటుంది జనానికి. పేదవాళ్లు, ఉన్నత వర్గం కాని వాళ్లు బహుజనులకు ఆత్మవిశ్వాసం వుంటే, అది అహంకారంలా కనిపిస్తుంది మన ‘పేద్దోళ్ళ‘కు. వెనక కూతలూ, కుట్రలూ లేదా తోకముడుచుకొని పోవడాలు. లేదా అబద్ధాలు, అభూత కల్పనలు, అర్థ సత్యాలంటారే.. అర్థసత్యాలతో మనమీద నల్లగుడ్డ కప్పుతారు. అందుకే నేను ముందన్నాను చూడండి ‘‘లోకం తెలుసుకోవడానికి ఇంత నెత్తురు అర్పించాల్సి’’ వచ్చిందీ అని. నిన్న్నా మొన్నటి దాకా, ఇకముందు కూడా ఉంటాయేమో బట్ట కాల్చి మీదేసి నిందించడాలు. ఏళ్ళపాటు ఆ కాలిన గాయాలతో చిత్రహింసను అనుభవించాను. కొన్ని ఊరుకుంటే ఉసురే తాకుతుందనీ అనుకున్నాను. కొన్ని చిక్కుముళ్ళు విప్పి చూసాను. నేరం రుజువు కాకముందే నేరస్తులు ఎట్లా అవుతారో అర్థం కాదు నాకు కోర్టు భాషలోనే అనుకున్నా.

  • రచయితలు ప్రభుత్వ అవార్డులు తీసుకోవడమంటే పాలకులకు లొంగడమేనా?

సాధారణంగా అదే అంటారు, అనుకుంటారు. అయితే ఇప్పటి వరకూ వివిధ ప్రభుత్వ పురస్కారాలు తీసుకున్న వాళ్ళందరూ లొంగిపోయారా? ఎవరో ఒకరిద్దరు లొంగిపోయి ఉండవచ్చు. పురస్కారం ఒక గుర్తింపు, ఒక ప్రోత్సాహం. అంతకు మించి ఏమీ లేదు. అయితే అంతా న్యాయంగానే సవ్యంగానే జరుగుతున్నదా అంటే అందరికీ తెలిసిన బహిరంగ విషయమే. ఇంకొక మాటున్నది. ప్రభుత్వ సన్మానాలూ, పురస్కారాల వల్లనే ఒక రచయితకు గౌరవం, గుర్తింపూ, ప్రోత్సాహం లభిస్తుందా అంటే అదే ప్రామాణికం అని అనుకోలేము. లొంగుబాటనేది స్వభావికమైనది. లొంగుబాటు మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎక్కడికక్కడ లాలూచీ పడుతూ లొంగిపోయి బతుకుంటారు. ప్రభుత్వ అవార్డా, ప్రైవేటు వేదికలూ, సంస్థలూ ఇచ్చే అవార్డా ఏదైనా ఆ రచయిత సామాజిక ధృక్పధం, నిబద్ధత మీద ఆధారపడి ఉంటుంది. రచయితగా ఎప్పుడు ఎవరి పక్షం వహిస్తారనేదే ముఖ్యం.

  • తెలంగాణ ఉద్యమంలో మీ సాంస్కృతిక, సాహిత్యం పాత్ర ఏమిటి?

మెజారిటీ కవులు, రచయితలు, కళాకారులు ఉద్యమకారులుగా మారారు. 1969-71 నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తపిస్తున్న నేను 1990వ దశకంలో మళ్ళీ ఉధృతంగా తలెత్తిన తెలంగాణ సోయితో తెలంగాణ రచనలు, సభలు, సదస్సుల్లో పాల్గొన్నాను. నా కవితా సంపుటి ‘ఉసురు’ ఆ సమయంలో వచ్చిందే. తెలంగాణ సోయి ప్రధానంగా తెలంగాణ భాషా సంస్కృతుల మీద జరిగిన దాడికి వ్యతిరేకంగా మొదలయ్యిందే. నా తల్లి భాషలోనే నేను ఎక్కువ రచనలు చేసాను. వివిధ సాహిత్య వేదికల ఏర్పాటుల్లో పాల్గొన్నాను. ‘తెలంగాణ రచయితల వేదిక’ వ్యవస్థాపనలో ఉండి అన్ని తెలంగాణ జిల్లాలలో మహాసభలూ, సదస్సులూ జరుగుతున్న క్రమంలో పాల్గొన్నాను.‘వరంగల్‍ రచయితల వేదిక’ను నిర్మించిన కవులు, రచయితలతో కలిసి నిత్యం ఉద్యమంలో పాల్గొన్నాను. వివిధ సాహిత్య సంకలనాల ప్రచురణ చేయడం వరకూ అన్నిట్లో నేను వ్యక్తిగతంగా పూర్తిస్థాయిలో పనిచేసాను.

  • ‘ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’ ఏర్పాటులో మీ పాత్ర?

అదో చరిత్ర. తెలుగు రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడు సాహిత్య, సాంస్కృతిక రంగాలు అగ్రకుల ఆంధ్రా ప్రాంతం వారి ఆధిపత్యంలో ఉండేవి. సాహిత్య కూటములు, పీఠాలు, పీఠాధిపత్యాలు అన్నీ వీళ్ళ పలుకుబడిలో విలసిల్లుతూ ఉండేవి. తెలంగాణ సాహిత్యకారులు అనామకులుగా వాయిస్‍ లేకుండా ఉండేవాళ్ళు. కవుల్లో ర్యాంకులుండేవి. అన్ని ర్యాంకులూ ఆంధ్రా వాళ్ళవే. అన్ని వేదికలూ, పురస్కారాలూ వాళ్ళవిగా ఉండేవి. (ఇప్పుడు మారిందా అంటే సందేహమే). గాయపడిన మనిషిని చితకబాదినట్లు ఈ క్రూరమైన బానిసత్వంతో పాటు ఇందులో అగ్రకులాలకు (పాలకవర్గ కులాలు) తప్ప ఇతర వెనుకబడిన, బహుజన కులాల రచయితలు, కళాకారుల పట్ల చిన్నచూపు ఉండేది. కులం చెప్పుకోవడానికి భయపడేవాళ్లు. ఎక్కడా వీరికి ఒక స్థానం, స్థాయి ఉండేది కాదు. కొంచెం ప్రవేశం ఉన్నచోట అంచులకు నెట్టబడి ఉండేవాళ్ళు.

దామాషా పద్ధతిన అన్ని కులాల మహిళా రచయితలకు వేదిక నిర్మాణంలో స్థానం కల్పించి వారి గొంతుక వినిపించేలా చేయడం. పెద్ద చిన్నా, ఎక్కువ తక్కువ కులం, స్థాయి అని లేకుండా అందరు కలిసి వేదిక ‘మ్యానిఫెస్టో’ను అనుసరించి ప్రజాస్వామికంగా పని చేయాలన్నదే లక్ష్యం. ఒక విధంగా రిజర్వేషన్స్ పెట్టుకున్నాము అని చెప్పాలి. ప్రధానంగా ఇది మహిళల అంశాలు, విషయాలు, సమస్యలపై పనిచేసే రచయిత్రుల వేదిక.

ప్రజాస్వామికత అనేది అలంకారంలా వాడుకునే ఆభరణంలాంటి పదం కాదు. ప్రజాస్వామికంగా ఉండటం అంత సులభమైన పనీ కాదు. ఏదైనా ఆచరణలో, ఆత్మపరిశీలన, సమీక్ష, విశ్లేషణ ద్వారా సాధ్యమవుతుంది. దశాబ్దం దాటిన ‘ప్రరవే’ ప్రయాణంలో ఆ దిశలోనే ఉన్నాము అనుకుంటున్నాను. భావజాల పరంగా కలిసివచ్చే సోదర సంఘాలు, వేదికలతో కలిసి పనిచేయడం, ప్రజా సమస్యలపై గళమెత్తడం, కార్యాచరణల్లో పాల్గొనడం, రచనలు చేయడం గత పదేళ్ళుగా మా ఆచరణాత్మక కార్యక్రమం. సమస్యాత్మకంగా ఉన్న క్షేత్ర పర్యటనలు, రిపోర్టులు, ప్రచురణలు మా ముఖ్య కార్యక్రమాల్లోని కొన్ని అంశాలు.

  • సమ సమాజ నిర్మాణానికి ఎలాంటి సాహిత్యం కావాలంటారు?

ఈ అసమ సమాజం సమసమాజం కావాలనేది ప్రగతిశీలుర చిరకాల ఆకాంక్ష. ఒక విధంగా మనందరి ప్రగాఢ ఆశయం. ప్రగతిశీల సాహిత్యం ఈ సామాజిక మార్పుకు పునాదులేస్తుందని భావిస్తాను. అభివృద్ధీ, ప్రగతీ పాలకుల దృష్టినుండి కాకుండా ప్రజల దృష్టినుండి విధానాలు రూపొందాలి. సుస్థిర అభివృద్ధి ఇంకా మొదలు కానేలేదు. సామాజక అంతరాలను, తేడాలను, విభజనలను చర్చిస్తూ, విశ్లేషిస్తూ విశదీకరించే ప్రజా సాహిత్యం మన తక్షణావసరం. ఇప్పుడూ గతంలోనూ ప్రజాసాహిత్యం, ప్రజా కళలు లేవా అంటే ఉన్నాయి. మరింత మంది కవులు, రచయితలు సామాజిక బాధ్యతను గుర్తెరిగి రచనలు చేయాలి. మూస రచనలు, కమర్షియల్‍ రచనలు, వ్యక్తిగత కీర్తుల కోసం చేసే రచనల స్థానే సంఘాభ్యుదయం కోసం రాసే రచయితలు మరెందరో రూపొందాల్సి ఉంది.

  • నేటి బహుళ స్త్రీ వాదాల్లో మహిళా విముక్తి మార్గం ఏదంటారు?

వాదాలూ, ఇజాలూ అన్ని బహుళంగానే ఉంటాయి. మహిళా విముక్తి ఏ ఒక్క వాదంతోనో జరిగేది కాదు. యావత్‍ సమాజ విముక్తితోనే స్త్రీ విముక్తీ ముడిపడి ఉంటుంది. ఈ అసమ వ్యవస్థ సమూల మార్పుతో, నవ నిర్మాణం జరిగే క్రమంలో ‘శ్రమ విభజన’ అనే చోటు నుండి స్త్రీ విముక్తి మొదలవుతుంది.

  • ఇప్పటి వరకూ వచ్చిన మీ రచనల వివరాలు.

నా రచనల్లో కవిత్వం, వ్యాసాలు ఎక్కువ. 1980ల నాటి ఉద్యమాల అనుభవంతో ‘‘గులాబీలు జ్వలిస్తున్నాయి’’ చిన్న కవితా సంపుటి. స్త్రీవాద ఉద్యమ ప్రభావంతో ‘‘నేనొక నల్లమబ్బునవుతా’’(1997) కవితా సంపుటి, ‘‘చెమట చెట్టు’’(1999), ‘‘ఓ లచ్చవ్వ’’ దీర్ఘకవిత(2005) (దళిత బహుజన స్త్రీ, రాజ్యాధికారం) ‘‘ఉసురు’’(2002) తెలంగాణ కవిత్వం, ‘‘గోరంత దీపాలు’’(2005) నానీల కవిత్వం, హైకూల సంపుటి, ‘‘దస్తఖత్‍’’, వచన కవిత ‘‘అనగనగా కాలం‘‘ , ‘‘మట్టిబంధం’’(2006) కవితా సంపుటి, ‘‘నన్హే ఓ నన్హే’’(2007) నానీల కవిత్వం, ‘‘మార్కెట్‍ స్మార్ట్ శ్రీమతి’’ దీర్ఘ కవిత(2010), ‘‘నిర్భయాకాశం కింద’’ (2016), ఆచార్య పాకాల యశోదారెడ్డి(2017)పై మోనోగ్రాఫ్‍. సాహిత్య, సామాజిక వ్యాసాల సంపుటాలు రావాల్సి ఉంది.

  • మీరు సంపాదకత్వం వహించిన గ్రంథాలూ వాటి ప్రత్యేకతలు.

కాకతీయ విశ్వవిద్యాలయంలో మొదటిదైన బి.సి. ఉద్యోగుల సావనీర్‍ ‘బి.సి. సంకల్పం’ (2010) ప్రచురించాం. తెలంగాణ ఉద్యమ కవిత ‘తెలంగాణ ఉరుములు-మెరుపులు, ‘వెతలే కతలై’ (2011) రచయిత్రుల కథా సంకలనం ముద్రించాం. ‘ఊపిరి’(2012) తెలంగాణలో ఆత్మహత్యలపై నిరసన కవితా సంకలనం వచ్చింది. ‘జిగర్‍’(2013) తెలంగాణ విశిష్టతలపై కవిత్వ వచ్చింది. అపూర్వ త్యాగాలకు నీరాజనం పడ్తూ శరీర అవయవదానంపై ‘ఆకాశ పుష్పం’ (2014) కవిత్వం, ‘ముజఫర్‍నగర్‍ మారణకాండపై నిషిద్ధ మేఘాల్లోకి మా యాత్ర’. ‘అగ్నిశిఖ’ అత్యాచారాల వ్యతిరేక సంకలనం. ‘పోలవరం ప్రాణాంతక ప్రయోగం – ముంపు గ్రామాల గోడు’ అచ్చేశాం. ‘అక్షర శరధి దాశరధి’(2016) దాశరధి రంగాచార్య రచనలపై వ్యాస సంకలనం. ‘తీరొక్క పువ్వులు’(2016) భిన్న అస్తిత్వాల సాహిత్యం, పరిచయ వ్యాసాలు. ‘తెలంగాణ రచయిత్రుల శతాధిక కథల సంకలనం’(2017), మహాశ్వేతాదేవి రచనలపై వ్యాసాల సంకలనం(2018), ‘బోల్షివిక్‍ విప్లవం’ స్ఫూర్తి వ్యాసాల సంకలనం(2019), ‘ఏడాది ప్రయాణం’ క్షేత్ర పర్యటనల రిపోర్టులు. ప్రస్తుతం ‘కరోనా కాలం కథలు’ (2020) ముద్రణలో వుంది. ఈ సంకలనాలు సంపాదక, సహ-సంపాదకత్వంలో ప్రరవే, రుద్రమ ప్రచురణలు, రజనీ పబ్లికేషన్స్ ,నవచేతన పబ్లిషింగ్‍ హౌస్‍, కె.యు. బి.సి. సంఘం, తెలంగాణ రచయితల ఐక్యవేదిక వారు ప్రచురించారు. దేనికదే ప్రత్యేకత కలిగి ఉన్నవీ సంకలనాలు.

  • తెలంగాణ ఉద్యమానంతరం కవులు, రచయితల్లో స్తబ్దత ఉందనిపిస్తుందా?

అరవై ఏళ్ళ స్వప్నం, దశాబ్దాల ఉద్యమం అనంతరం కొంత నిస్తబ్దత ఏర్పడటం సహజమే. తమ కలాలూ, గళాలూ ఉద్యమ అంశాలకే పరిమితమైన వాళ్ళు వెంటనే మరో అంశం ఆలోచించలేరు. కానీ కొద్ది రోజుల్లోనే దానిలోంచి బయిటపడి విభిన్న రచనలు చేస్తున్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నతమైన రచనలు తప్పకుండా వస్తాయి. కాలమే రచయితలకు ఏమి రాయాలో నిర్దేశిస్తుందనేది చరిత్ర చెబుతున్న సత్యం.

  • పేద విద్యార్ధునులు, మహిళలకు మీరందిస్తున్న సామాజిక చేయూత గురించి.

సామాజిక సేవ అనే కన్నా నేను సామాజిక బాధ్యత అంటాను. నేను భూస్వామ్య కుటుంబంలో గానీ, వ్యపారవేత్తల, పెద్ద ఉద్యోగ హోదాలో వున్న కుటుంబంలో పుట్టలేదు. నా నేపథ్యం మామూలు మధ్యతరగతి కుటుంబం. సాహిత్య భావజాలం సామాజికంగా మార్చుకోవడంతోపాటు మన బాధిత సమాజానికి ఏమైనా చేయాలనేది బాధ్యతగా ఎంచుకొని అనేక మహిళా సదస్సుల్లో పీడిత మహిళా లోకాన్ని చైతన్యపరచడానికి మాట్లాడాను.

ఈ స్వార్థ సమాజం అభాగ్యులుగా, తిరస్కృతులుగా మార్చిన నిస్సహాయులుండే ఆశ్రమాలకు నా మిత్రులు, నేను పిల్లలకు ఫీజులు కట్టి చదివించాలనుకొని ప్రస్తుతం అది కొనసాగిస్తున్నాము. కవులైనా, సామాన్యులైనా వారి అవసరార్థం నాకు చేతనైన ఆర్థిక సాయం చేస్తుంటాను, చిన్న సహాయమే. అయితే ఆ అవకాశం వాళ్లు మనకివ్వడం వల్ల మనమే వారికి కృతజ్ఞత చెప్పుకోవాలంటాను. ఇలాంటివే నాస్థాయి శక్తిననుసరించి చిన్నచిన్న సామాజిక బాధ్యతలు వ్యక్తిగతంగాను, మిత్రులతో కలిసి తీసుకుంటాను.

  • నవతరం రచయితలకు మీరిచ్చే సందేశం?

సందేశం ఇచ్చేంత పెద్దదాన్ని కాదు కానీ నేను రచయితలకు, కవులకు, కళాకారులకు చెప్పాలనుకున్నది వేదికలకూ, శాలువాలకూ ఎగబడకండి. అన్నీ ఇన్‍స్టాంట్‍గా రావాలని దిగజారిపోకండి. పురస్కారాల పైరవీలు మానుకొమ్మనీ, కవిత్వ సాధన చేస్తూ సాహిత్య అధ్యయనం కొనసాగిస్తూ రచనలు చేయాలని, కవులు తమ ఆత్మను అమ్ముకుంటే ఆ సమాజం ఆత్మను కోల్పోతుంది. సామాజిక బాధ్యతనెరిగి రచనలు చేయాలి. నూతన సమాజ ఆవిష్కరణకు రచనలు చేయాలి. ప్రతి రచనలో కొత్తదనం కోసం తపించాలి. పేరుకీర్తులూ, పొగడ్తలూ, సన్మానాలూ, పురస్కారాలూ అన్నీ తాత్కాలికమైనవి. కేవలం బాధ్యతాయుతంగా మనం చేసే రచనలే వీటన్నింటినీ మించినవి అయ్యుండాలి. కవులు, రచయితలు, కళాకారులు తమ సృజన కళల ద్వారానే మ్రుత్యుంజయులు అవుతారు.

పుట్టింది వడ్డిచర్ల, జనగామ జిల్లా. నెల్లుట్లలో పెరిగాడు. జనగామలో సదివిన మట్టి పెడ్డ. వరంగల్లు నగరంలో వలస బతుకు మనుగడ. ఉపాధ్యాయ బోధన విద్యలో నల్లబల్ల మీద అక్షరాలకు అభద్ర కూలీ గొంతుకవుతాడు. చాయ్ నీళ్లు లేకున్నా సాహిత్య సాన్నిహిత్యాన్ని కోరుకుంటాడు. కవి, రచయిత, జర్నలిస్ట్, పరిశోధకుడు, అధ్యాపకుడు. ప్రముఖ తెలుగు పత్రికల్లో పాత్రికేయుడిగా పని చేశాడు. ప్రస్తుతం ఉస్మానియా యునివర్సిటీలో 'తెలుగు సాహిత్యంలో చేనేత వృత్తి జీవనచిత్రణ'పై పరిశోధన చేస్తున్నాడు.

5 thoughts on “ప్రజాపక్షపాతమే నా సృజనాత్మకతకు భూమిక: అనిశెట్టి రజిత

  1. రజితక్క ఇంటర్వ్యూ 1969-2014ఉద్యమం,బహుజన సాహిత్యం-ఉద్యమం గురించి ళొత్త సమాచారాన్ని అంద్ ఇన్ హింది.. ఇద్దరికీ ధన్యవాదాలు

  2. రజిత గారి కృషీవలత, సాహిత్య ప్రత్యేకత ఎన్న దగింది.
    విలువైన ఇంటర్వ్యూ

  3. రజితక్క మీ ఇంటర్వ్యూ స్ఫూర్తిదాయకమైనదిగా ఉంది.

Leave a Reply