అంతర్గానం

నా కలలన్నీ కల్లలుగా
సగ సగాలుగా ఆగిపోతుంటాయి
ఒక్కగానొక్క కల పూర్తికాకుండానే
ఆరిపోయి అంతర్థానమవుతుంటుంది…

తపనతో దహించుకుపోతున్నా
సాకారం కాని ఒకే ఒక కలకోసం
కలల వాకిళ్ళలో కువకువల కోసం
కళ్ళు నులుముకుంటూనే ఉన్నా…

ఎప్పుడు మొలిచిందో ఆ కల
దిగ్రమలా నిన్నరాత్రి వచ్చింది
నిలువెల్లా వెచ్చని వెలుగుతో గుచ్చింది
ఉగాదులకు తలుపులు తెరిచింది.

నాలోలోన దశాబ్ధాలుగా విలీనమైన
సామ్యవాద గీతం రాత్రి స్వప్నానంతరం
అంతర్గానమై ఉప్పొంగి పారింది
కదం తొక్కుతూ ప్రవహించింది…

నేనిప్పుడు నా మనోదేహాల బూజుల్ని
దులుపరించుకొని మనిషిని కావాలి
కవినై గాయకినై శిల్పినై కొత్తగా
నవజాత శిశువులా ఆవిష్కృతం కావాలి…

నీవు నేనూ కలలుకంటూనే ఉండాలి
అక్షర తంత్రులకు రాగాలు మీటుతూ
అంతర్నేత్రానికి ఆయువును అందిస్తూ
సంచలన వాక్యాలను రసాత్మకం చేయాలి…

రగ రగమని రగుల్కొంటూ
ఆశయాల చీరికల్ని పూడుస్తూ
కొండంత రాశులుగా పోయాలి
రుతు సేద్యం చేసే రైతుగా మారాలి…

ఆ స్వప్నాలు స్వప్న శిలలై మాసిపోకుండా
వసంతకాల మేఘ గర్జనలతో కలిసి
కాకలీ కాంతి స్వనాల వానగా కురుస్తూ
కోకిలల కోసం చిగురుటుయ్యాలలు కట్టాలి…

పుట్టింది వ‌రంగ‌ల్ జిల్లా హ‌న్మ‌కొండ‌. క‌వి, ర‌చ‌యిత‌. విద్యాభ్యాసం వ‌రంగ‌ల్‌లో. బాల్యం నుంచే సాహిత్య‌- ఉద్య‌మాల ఆస‌క్తితో నాటి 'జై తెలంగాణ' ఉద్య‌మం మొద‌లు, మొన్న‌టి ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం వ‌ర‌కు వివిధ సాహిత్య, ప్ర‌జా సంఘాలు, ప్ర‌జాస్వామిక‌ ఉద్య‌మాల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. 12 స్వీయ ర‌చ‌న‌ల గ్రంథాలు, 18 కు పైగా వివిధ సంక‌ల‌నాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు. 'రుద్రమ ప్రచురణలు' 2012 నుండి నిర్వహిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా 'ప్ర‌జాస్వామిక ర‌చ‌యిత్రుల వేదిక' లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply