స్నేహ హస్తం

సెల్ ఫోన్ రింగవుతోంది.

గాఢ నిద్రలో ఉన్న వర్షిణి ఉలిక్కిపడి లేచింది. పక్కన నిద్రపోతున్న హర్ష అప్పటికే లేచి ఫోన్ అందుకున్నాడు. “హలో”, అన్నాడు మత్తుగా…

అవతలి పక్క ఎవరో గబగబా మాట్లాడుతున్నారు.

“ఇప్పుడా…?” అంటూ విసుగ్గా వర్షిణికి ఫోన్ అందించాడు హర్ష.

వర్షిణికి అర్దం కాలేదు… ఎవరూ అంటూ చూసింది భర్త వైపు.

“కిరణ్…”విసుగ్గా జవాబిచ్చాడతను.

ఈ టైం లోనా. పక్కనున్న క్లాక్ చూసింది వర్షిణి.  రెండున్నర. అర్ధరాత్రి ఈ టైంలో కిరణ్ ఫోన్.

“హలో ఏంటి కిరణ్?” అడిగింది విసుగు దాచుకుంటూ.

“వర్షిణి, మన ప్రాజెక్ట్‌లో ఉన్న మేజర్ ప్రాబ్లం నాకు తెలిసింది. మనం అందరం అసలు బేసిక్ గానే తప్పటడుగు వేసాం. చిన్న డైవర్షనే మనల్ని ఇంతగా ఇబ్బంది పెట్టింది. వారం నుండి మనం ఎంత టెన్షన్ పడ్డామో కదా…? ఐ గాట్ ఇట్. సిస్టం ఓపెన్ చేయి. నాకు ఆక్సిస్ ఇవ్వు. రెండు నిముషాలలో చూపిస్తాను. మనం ఎంత ఫూల్స్‌గా సైడ్ లైన్ అయ్యామో. కమాన్ ఓపెన్ చెయ్.” అంటున్నాడు.

“కిరణ్, ఇప్పుడు టైం రెండున్నర. ఇప్పుడు కరెక్షన్స్ అవసరమా? రేపు లీడర్స్ మీటింగ్ కూడా ఉంది. దానికి నేను ఐదుకే లేచి ప్రిపేర్ అవ్వాలి.” విసుగ్గా అంది వర్షిణి.

“బట్, నువ్వే కదా ఇది ఫైనలైజ్ అయితే తప్ప పని ముందుకు సాగదన్నావు? ఇప్పుడేమిటిలా…? లెట్ మీ ఎక్స్ ప్లేన్. జస్ట్ అరగంట. లే వర్షిణి, ఇది సాల్వ్ చేసేద్దాం. అసలు ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకుంటే నువ్వు ఆశ్ఛర్యపోతావు…,” చెప్పుకుంటూనే పోతున్నాడు కిరణ్.

పక్కన హర్ష, వర్షిణినే చూస్తున్నాడు.

ఒక ఐదు నిముషాలు వర్షిణికి అవకాశమే ఇవ్వకుండా ప్రాజెక్ట్‌లోని తప్పులు వినిపిస్తున్నాడు కిరణ్.  అగని ఆ వాక్ప్రవాహం నడుమ అతను చెప్తున్నదేదీ వర్షిణి బుర్రకు ఎక్కట్లేదు. ఐదు నిముషాల తర్వాత

“టు హెల్ విత్ యు. లెట్ మీ స్లీప్, డామిట్ !” అంటూ ఫోన్ కట్ చేసింది వర్షిణి. భర్త మరేం అడగకూడదని అటు పక్కకు తిరిగి పడుకుంది.

                                                            ———–

తెల్లారగానే లేచి మీటింగ్ కోసం ప్రిపేర్ చేసిన పి.పి.టి ఒక్కసారి సరి చూసుకుంది వర్షిణి. ఇంకో రెండు స్లైడ్లను ఆడ్ చేసుకుని ఒకసారి అంతా సరిగ్గా ఉందో లేదో సరి చూసుకుంది.  ఫైనల్ పి. పి. టి. తనకే మెయిల్ చేసుకుంది. బాక్‌అప్ లేకపోతే కూడా ఇబ్బందే. రెండు నెలల కష్టం అది. అన్ని జాగ్రత్తగా సరిచూసుకుని భర్తకు, తనకు లంచ్ పాక్ చేయాలని వంటగదిలోకి వెళ్లింది.

అప్పటికే హర్ష వంట గదిలో ఉన్నాడు. వర్షిణి రావడం చూసి ఆమెకు కాఫీ అందించాడు.

“సో మీటింగ్‌కు అంతా రెడీనా?” అడీగాడు హర్ష.

“యెస్,. ఫైనల్లీ.” అంటూ భర్త అందించిన కాఫీ తాగుతూనే లంచ్ కోసం బియ్యం కడిగి రైస్ కుక్కర్లో పెట్టింది.

బ్రేక్‌ఫాస్ట్ పని హర్ష చూస్తుంటే కూర కోసం బెండకాయలు తరుగుతోంది వర్షిణి.

“ఏమయింది? అర్ధరాత్రి కిరణ్ కాల్ ఏంటి?”అడిగాడు హర్ష.

బెండకాయలు తరుగుతున్న వర్షిణి చేయి ఆగింది. రెండు నిముషాలు ఆలోచించి.

“ఈ మధ్య వియర్డ్‌గా బిహేవ్ చేస్తున్నాడు కిరణ్.” అంది

“అంటే…?” అడిగాడు హర్ష.

“సరిగ్గా అర్ధం కావట్లేదు. ఎప్పుడూ ఏదో హై లో ఉంటున్నాడు. మాట్లాడుతూనే ఉంటాడు. పిచ్చగా పని చేస్తాడు. అసలు అలుపన్నదే లేనట్లు బిహేవ్ చేస్తున్నాడు. తిండి దగ్గర కూచుంటే ఎంత తింటున్నాడో కూడా తెలియనట్లు తినేస్తున్నాడు. ఒకోసారి అతన్ని ప్రవర్తన విసుగనిపిస్తుంది.” అంది వర్షిణి.

“ఈ మధ్యే డైవోర్స్ తీసుకున్నాడు కదా. గతాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో? పనిలో మునిగిపోతున్నాడేమో?” అన్నాడు హర్ష.

“నేనూ అదే అనుకుంటున్నాను. కాని సంథింగ్ ఈజ్ రాంగ్ అనిపిస్తుంది హర్షా. ఏదో తేడా అయితే ఉంది. ఫర్మార్మెన్స్ పరంగా మా అందరికన్నా బాగా పని చేస్తున్నాడు. అది మంచిదే కాని తెలియని ఇబ్బంది కలుగుతున్నది. ఏదో నార్మల్‌గా లేదనిపిస్తోంది.” చెప్పింది వర్షిణి.

“కొంత టైం ఇవ్వాలేమో వర్షిణి. మూడేళ్ల వివాహ బంధం విఛ్చిన్నం అవడం మామూలు విషయం కాదు. మూవ్ ఆన్ అవడానికి ఒకొకరు ఒకోవిధంగా ప్రయత్నిస్తారు. అతని ప్రయత్నం అతను చేస్తున్నట్లున్నాడు. ఇలాంటి సమయంలో స్నేహితులం సహాయం చేయాలి కదా?” అన్నాడు హర్ష.

                                                    ——

ఆఫీసులోకి రాగానే తన టేబుల్ పైన ఒక బొకే దానికి ‘సారి’ అనే కార్డ్ ఉండడం చూసింది వర్షిణి. ఆ చేతి వ్రాత కిరణ్‌ది. నవ్వుకుంది. నిన్న రాత్రి చేసిన ఫోన్‌కాల్‌కి వచ్చిన కానుక అని అర్ధం చేసుకుంది. కిరణ్ టేబుల్ వైపు చూసింది. ఇటే చూస్తున్నాడు పరీక్ష రిజల్ట్ కోసం వేచి ఉన్న వ్యక్తిలా. నవ్వుతూ చేయి ఊపింది. తన బాగ్ తీసుకుని మీటింగ్ రూంలోకి నడిచింది.

పనంతా ముగించుకుని బైటకు వచ్చేసరికి లంచ్ టైం దాటిపోయింది. మీటింగ్ చాలా బాగా జరిగింది. వర్షిణి ప్రెజెంటేషన్‌కు ప్రశంసల జల్లు కురిసింది. తృప్తిగా తన కాబిన్‌లోకి వచ్చి కూర్చుంది. ఇంచు మించు అందరూ లంచ్‌కు వెళ్లినట్లున్నారు. కిరణ్ కూడా కనిపించట్లేదు. మౌనంగా తన లంచ్ అక్కడే కానిచ్చి ప్రాజెక్ట్ పని చెక్ చేయాలని సిస్టం ఓపెన్ చేసింది.

ఇంతలో ఆమె దగ్గరకు వచ్చింది, ఆఫీసు స్వీపర్ సుకన్య.

“అమ్మా ఆ కిరణ్ బాబుని భరించలేకపోతున్నాను. నువ్వే ఏదో ఒకటి చేయాలి.” అంది వస్తూనే.

“ఏమయింది సుకన్యా..?” ఆశ్చర్యంగా అడిగింది వర్షిణి. కిరణ్ బైట ఆడవాళ్లతో ఎంత మర్యదగా మసలుకుంటాడో తెలిసిన వర్షిణి.

“అమ్మా రోజుకు వంద సిగిరెట్లు ఊదేస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ కూర్చుని అక్కడే నుసి రాలుస్తాడు. ఏందమ్మా ఇది. మీరందరూ వెళ్లిపోయాక రెండు గంటలిక్కడే ఉంటాడు. ఏదో చేస్తానే ఉంటడు. అడిగిందే అడుగుతాడు, ఎన్ని కప్పులు టీలు పెట్టమంటాడో లెక్క లేదు. నాకు యాష్ట కొస్తుంది. నువ్వే ఏదో ఒకటి చేయాలే.” అంది

“స్మోకింగ్ జోన్ లోకెల్లి తాగమని చెప్పు నువ్వే. అది పెద్ద విషయమా?” అడిగింది.

“ఎన్ని సార్లు చెప్పినా యాదికుండదమ్మా… ఏందో ఏందో చేస్తడు. ఎట్లెట్లనో మాట్లాడతాడు. అడిగితే వంద సార్లు సారి సారి అంటడు. నాకైతే ఎట్లనో ఉంటుంది. ఆ కంప్యూటర్ దగ్గరకు నన్ను తీసుకొచ్చి ఏందేందో చూపిస్తడు. నాకు మీ పనులేం తెలుస్తాయి? మళ్లీ నా సీటు కాడికి ఎవరన్నా వచ్చిన్రా అని గుచ్చి గుచ్చి అడుగుతడు. ఏందమ్మా ఈ పరేషాని? నువ్వే కాస్త ఆయనకు సమ్జాయించొచ్చు కదా?” అడిగింది సుకన్య.

వర్షిణి ఆమె చెప్పింది విని ఆలోచనల్లో పడింది.

ఒక గంట తర్వాత తల ఎత్తి చూస్తే కిరణ్ పని చేసుకుంటూ కనిపించాడు. ఎంత త్వర త్వరగా పని చేస్తున్నాడంటే, అతనక్కడ మీటుతున్న కీ బోర్డ్ శబ్దం ఇక్కడికి వినిపిస్తున్నది.

ఇంతలో సాధన వచ్చింది కాబిన్ దగ్గరకు.

“హే వర్షిణి, ఈ కిరణ్ కేమయింది. ఆల్ ఓకే?” అడిగింది.

“ఏమయింది సాధన ఎనీ ప్రాబ్లం?” అడిగింది వర్షిణి

”నిన్నఒంటిగంటకు ఇంటికి పోన్ చేసాడు. చేసి ప్రాజెక్ట్ సినారియో డిస్కస్ చేయాలని నా సిస్టం ఆక్సిస్ ఇవ్వమంటాడు. అది ఫోన్ చేసే టైమా…? ఇంట్లో మా ఆయన క్లాస్ పీకాడు. ఇది మూడో సారో నాలుగో సారో అతనలా చేయటం. కాస్త నువ్వు అతనికి చెప్పవచ్చుగా. మన ఇళ్లల్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయన్నది కూడా అతనికి తెలియదా…? నాకు చాలా ఇబ్బందిగా ఉందే బాబు.” అంది.

“సాధనా, కిరణ్ తన పర్సనల్ లైఫ్ లోని డిస్టర్బెంస్ నుండి బైట పడాలని పనిలో మునిగిపోతున్నాడు. అది కాస్త శృతి మించుతున్నది. నేను మాట్లాడుతున్నాను. ప్లీజ్, సారి ఫర్ ఎవ్రీతింగ్ అంది.”

“ఐనో కాని చాలా వియర్డ్‌గా బిహేవ్ చేస్తున్నాడు వర్షిణి. నువ్వు అతనితో మాట్లాడు” అంది

“తప్పకుండా ఈ వీకెండ్ నేను తనతో మాట్లాడతాను.” చెప్పింది వర్షిణి.

                                                   —–

కిరణ్, వర్షిణి ఇద్దరూ ఇంజనీరింగ్ నుండి క్లాస్‌మేట్స్. వర్షిణికి తోబుట్టులెవరూ లేకపోవడంతో ప్రతి  సంవత్సరం కిరణ్‌కు రాఖీ కడుతూ వస్తోంది. కిరణ్ చిన్నప్పటినుండి బ్రైట్ స్టూడెంట్. అతని పర్యవేక్షణలోనే వర్షిణి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. వర్షిణి విమెన్ కొటాలో, కిరణ్ పూర్తి మెరిట్‌తో టాప్ ఇంజనీరింగ్ కాలేజీలోనే చదువుకున్నారు. ఆ నాలుగు సంవత్సరాలు కిరణ్, వర్షిణి గార్డియన్. కాంపస్ ప్లేస్మెంట్‌లో  మంచి కంపెనీలోనే ఉద్యోగం సంపాదించిన కిరణ్ తన ప్రతిభతో ఆ కంపెనీ ఇంచార్జ్‌గా స్థిరపడి, అప్పటి దాకా ఓ చిన్న కంపెనీలో పని చేస్తున్న వర్షిణిని తన కంపెనీకి రెకమెండ్ చేసి, ఉద్యోగం ఇప్పించాడు.  

వర్షిణి, హర్షలు ప్రేమించుకుంటుంటే వారికి అండగా నిలబడి, వర్షిణి తల్లి తండ్రులను ఒప్పించి వారి వివాహం జరిపించాడు కిరణ్. అతనూ ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

కాని ఆ తర్వాత కిరణ్‌లో మార్పు రావడం మొదలయింది. పూర్తిగా పని మీద శ్రద్ద తగ్గడం. టైంకు ఉద్యోగానికి రాకుండా ఇంట్లోనే ఉండిపోవడం మొదలయింది. మరో బ్రాంచ్‌కు వెళ్లిన వర్షిణికి ఇవేవీ తెలియవు. కిరణ్ పెళ్లయ్యాక, ప్రియ కూడా వర్షిణికి దూరంగానే ఉంటుండేది. ఎప్పుడన్నాఫోన్‌లో తప్ప సంభాషణలు జరిగేవి కావు. సడన్‌గా కిరణ్‌ను యాజమాన్యం తొలగిస్తున్నారని వర్షిణికి తెలిసాక ఆశ్చర్యపొయింది. అప్పటికే కంపెనీలో మేనేజర్ హోదాలో ఉన్న వర్షిణి పైవాళ్లతో మాట్లాడి అతని ఉద్యోగం పోకుండా ఆపగలిగింది. కాని డిమోట్ కాకుండా ఆపలేకపోయింది. అప్పుడు పూర్తిగా కృంగిపోయాడు కిరణ్. అదే సమయంలో ప్రియతో విడాకులు తీసుకున్నాడు.

వర్షిణి ఎంత ప్రయత్నించినా వారిద్దరి మధ్య సమస్యేమిటో తెలుసుకోలేకపోయింది. కిరణ్ పూర్తిగా మౌనంలోకి వెళ్లిపోయాడు. అతని నుండి ఏ విషయమూ రాబట్టలేకపోయింది. కిరణ్ తల్లితండ్రులు ఊరి నుండి వచ్చి, నెత్తి నోరు కొట్టుకుని బ్రతిమిలాడినా ఆ విడాకులను ఆపలేకపోయారు. వాళ్లిద్దరూ నిరాశగా తిరిగి ఊరెళ్లిపోయారు. కిరణ్ ఒక్కడే తన ప్లాట్‌లో ఉంటున్నాడు.

అప్పటి నుండి వర్షిణి అతన్ని తన బ్రాంచ్‌కే మార్పించుకుని కనిపెట్టుకుని ఉంటుంది. ఒకప్పటి కిరణ్ కాదతను. ఏదో ఆలోచిస్తూ, కొన్నిసార్లు అదే పనిగా గంటలు గంటలు నిద్రపోతూ, లేదంటే రెండు మూడు రోజులు నిద్రపోకుండానూ గడిపేవాడు. డైవోర్స్ తర్వాతి ఒంటరితనం అతన్ని బాధిస్తుందని, కొంత కాలానికి సర్దుకుంటాడని వర్షిణి నమ్మకం.

ఒక మూడు నెలల నుండి అతనిలో మళ్లీ పాత ఉత్సాహం చూస్తోంది వర్షిణి. పని పట్ల శ్రద్ద. అందరికన్నా ఎక్కువ పని చేయడం. టార్గెట్‌కు ముందుగానే పని పూర్తి చేయడం చేస్తున్నాడు. అందరి పని తన నెత్తినే వేసుకుంటున్నాడు. కొందరికి ఇది హాయిగానూ, కొందరికి ఇది తలనొప్పిగానూ ఉంది. అందుకే ఆ ప్రాజెక్ట్ లో తానూ ఇన్వాల్వ్ అయింది వర్షిణి. పని చాలా త్వరగా సాగుతుంది. ఎవరికీ అర్ధం కాని సమస్యలను కూడా నిముషాలలో పరిష్కరిస్తున్న కిరణ్ తమ కాలేజి రోజులను గుర్తుచేస్తున్నాడు. అయినా ఏదో సరిలేనట్టుగానే ఆమెకు అనిపిస్తున్నది. కాని లోపం ఇదని ఆమె చెప్పలేకపోతోంది.

ఇప్పుడు ఆఫీస్‌లో సుకన్య, సాధనల మాటలు విన్నాక కిరణ్‌లో ఏదో తేడా ఉందని, ఇది నార్మల్ బిహేవియర్ కాదనే అనుమానం బలపడింది.

పని ముగించుకుని ఇంటికి వెళ్లబోతూ కిరణ్ దగ్గరకు వచ్చింది వర్షిణి. ఆమె అలికిడి కూడా తెలియనంత దీక్షగా పని చేసుకుంటున్నాడు కిరణ్. వర్షిణి అతని సీట్ దగ్గరకు వచ్చి అతని భుజంపై చేయి వేసింది. వెనక్కు తిరిగి ఆమెను చూసి నవ్వాడు కిరణ్.

“కంగ్రాట్స్ ఫర్ ది సక్సెస్” అన్నాడు.,

“ఐడియా నీదే కదా… థాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్.” అంది.

“ఈ వీకెండ్ ఏం చేస్తున్నావు?”  అడిగింది మళ్లీ.

“నేనా ఇదిగో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను.” అన్నాడు అతను సిస్టం వైపు చూపిస్తూ.

కిరణ్ ముఖాన్ని పరీక్షగా చూసింది వర్షిణి. లోతుకు పోయిన కళ్లు అతను నిద్రపోయి చాలా రోజులయినట్లుగా చెప్తున్నాయి.

“కిరణ్ నీకు విశ్రాంతి కావాలి. నా మాట విను. ఈ వీకెండ్ ఇంటికి రా. ఎన్నాళ్లయింది నువ్వు మా ఇంటికి వచ్చి. ముగ్గురం సరదాగా గడుపుదాం. ఎటైనా వెళ్దాం. నువ్వు సరిగ్గా తిని, పడుకుని ఎన్ని రోజులయి ఉంటుంది చెప్పు?” అడిగింది.

పని చేస్తున్న కిరణ్ ఆగాడు. వర్షిణి ముఖం వైపు చూడకుండా సిస్టం వైపు చూస్తూ, “అయాం గుడ్ వర్షిణి. ఇప్పుడే చాలా ఫోకస్డ్‌గా పని చేసుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ ఇలా వదిలేయలేను.  ఇది కంప్లీట్ చేసాక వచ్చే వారం వస్తాను. ఇప్పుడు నేను డిస్టర్బ్ కాదల్చుకోలేదు” అన్నాడు.

వర్షిణి అతని శ్రద్దను చూసి ఏమీ అనలేకపోయింది. “సరే నెక్స్ట్ వీక్ వస్తావు కదా? కలిసి కొంత సమయం గడిపి ఎన్నాళ్లయిందో కిరణ్. ప్లీజ్ కాదనకు,” అంది.

“తప్పకుండా నెక్స్ట్ వీకెండ్ కలుద్దాం వర్షిణి. అసలు ఈ క్లాజ్ చూసావా?” అంటూ అక్కడే ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విషయాన్ని వివరించడం మొదలెట్టాడు కిరణ్.

అలసిపోయి ఉన్న వర్షిణి, కిరణ్ బాధపడకూడదని ఓపిగ్గా అరగంట పాటు అతను చెప్పేది వింటూనే ఉంది. కిరణ్ దగ్గర పాఠాలు చెప్పించుకోవడం తనకు అలవాటే కాని ఇప్పుడు అతను వివరిస్తుంటే ఇది అని సరిగ్గా చెప్పలేని ఏదో తేడా ఆమెను ఇబ్బంది పెడుతోంది. అతను స్పష్టంగా అంతా వివరిస్తున్నాడు. ఎక్కడా తడబాటు లేదు. కాని తనవైపు నేరుగా చూడకపోవడం, ఉండుండి కళ్లు మూసుకుంటూ మాటలు లోన కూడదీసుకుంటూ మాట్లాడడం అతనెంతో స్ట్రెస్‌కు గురవుతున్నట్లు అనిపిస్తోంది. ఆ ప్రాజెక్ట్ మొత్తం వివరించగలిగిన కిరణ్ తెలివి, విశ్లేషణల కన్నా ఏదో తెలియని చెప్పలేని భావం ఆమెను  కలవరపెడుతోంది. అక్కడ తాను చూస్తున్న కిరణ్ మొహం, ఆమెలో అలా నిలబడిపోయింది.

                                                  —————-

తరువాతి వారం హర్ష తండ్రి ఆరోగ్యం బావోలేదంటే అర్జంటుగా ఊరెళ్లాల్సి వచ్చింది ఇద్దరికీ. అక్కడ ఆ పెద్దాయనను హాస్పిటల్‌లో అడ్మిట్ చేయడం, ఆ తర్వాత ఆపరేషన్, హఠాత్తుగా వచ్చి పడిన ఈ ఆపద చుట్టూ ఉన్న గొడవలతో కిరణ్ విషయం మర్చిపోయింది వర్షిణి. పదిహేను రోజుల దాకా ఆఫీసుకు రాలేకపోయింది. మధ్యలో ఇంటి నుండి పని చేస్తున్నా, ద్యాస అంతా ఇంటి సమస్యల మీదే ఉండడంతో కిరణ్ గురించి ఆలోచించలేకపోయింది.

ఇరవై రోజుల తర్వాత ఆఫీసుకు వచ్చిన వర్షిణికి కిరణ్ సీట్ ఖాళీగా కనిపించింది. తన తోటి మేనేజర్ సురేష్‌ను అతని గురించి అడిగింది. పదిహేను రోజుల నుండి అతను ఆఫీసుకు రావట్లేదని, ఫోన్ చేస్తే రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదని, విషయం అర్ధం కాక వర్షిణి కోసం ఎదురు చూస్తున్నామని చెప్పాడు.

అతనింటికి వెళ్లి చూడలేకపోయారా అడిగింది ఆదుర్దాగా వర్షిణి. ఆఫీసులో ఎంప్లాయి ఇంటి అడ్రస్సు ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్ శంకర్‌ను ఇంటికి పంపిస్తే, ఇల్లు తాళం వేసుందని చెప్పాడు సురేష్.

వర్షిణికి భయం వేసింది. తనకూ కిరణ్ నుండి ఈ మధ్యలో కాల్స్ ఏవీ రాలేదు. ఆదుర్దాగా కాల్ చేసింది. ఫోన్ రింగ్ కూడా అవ్వట్లేదు. హర్ష ఇవాళే కాస్త రిలాక్స్డ్ గా ఉన్నాడు. అతన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని, శంకర్‌నే తీసుకుని కిరణ్ ప్లాట్‌కు వెళ్లింది వర్షిణి.

ప్లాట్ కాలింగ్ బెల్ నొక్కుతుంటే పక్కింట్లోని పెద్దావిడ బైటికి వచ్చింది.

“కిరణ్ ఇంట్లో లేరా అండి” ఆమెనడిగింది వర్షిణి.

“ఏమోనమ్మా అతని వైఖరి మాకేమీ అర్ధం కావట్లేదు. ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు వెళతాడో ఆ తాళం మాత్రం ఉంటుంది.” అంది ఆవిడ నిరసనగా.

శంకర్‌ను ఆ తాళం గట్టిగా పట్టుకుని చూడమంది వర్షిణి. శంకర్ దాన్ని లాగాడు. చేతికి వచ్చింది తాళం. అది నిజంగా వేసి లేదు. వేసినట్లు కనిపిస్తుంది అంతే. ఇద్దరూ ఆశ్చర్యపోయారు.

వర్షిణి తలుపు గట్టిగా కొట్టింది. “కిరణ్… కిరణ్” అంటూ బిగ్గరగా పిలిచింది.

పక్కింటి వాళ్లు వచ్చి తొంగి చూసారు.

తలుపుకు అవతలి పక్క ఎవరో కదిలినట్లు చప్పుడయింది. ఒక్క క్షణం ఆగింది వర్షిణి. లోపల ఎవరో కదులుతున్నారు. తలుపు క్రింద నీడ కనిపిస్తుంది. ఇంక ఒక్క క్షణం ఆగలేకపోయింది. గబగబా తలుపు బాదింది. లోపల కదలికలు ఆగిపోయాయి.

ఇక ఆలోచించకుండా హర్షకు ఫోన్ చేసింది వర్షిణి. అరగంటలో అక్కడకు హర్ష వచ్చాడు. అతనూ కిరణ్‌ని పిలిచాడు. మళ్లీ లోపల ఏదో కదలిక, తలుపు మాత్రం తెరుచుకోలేదు.

హర్ష ఇక ఆలస్యం చేయలేదు. పోలీసులకు ఫోన్ చేసాడు. ఆ తర్వాత రెండు గంటలు అంతా గందరగోళంగానే గడిచిపోయాయి.

పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. వర్షిణి లోపలికి వెళ్లడానికి భయపడింది. ఏం చూడవలసి వస్తుందో అని. లోన ఇల్లంతా బూజు పట్టి ఉంది. తిన్నప్లేట్లు, ప్లేట్లల్లో మిగిలి ఉన్న అన్నం, హాలులో ఈగల మధ్య దర్శనమిచ్చాయి. పక్క గదిలో తలుపులు ఎవరో బిగిస్తున్నట్లు అనిపించింది. చప్పున తలుపులు తోసారు పోలీసులు. అక్కడ గదిలో అర్ధ నగ్నంగా పెరిగిన గడ్డంతో దీనంగా మణికట్టు నుండి కారుతున్న రక్తంతో పడి ఉన్నాడు ఒకప్పటి కాలేజీ టాపర్, బ్రిలియంట్ ప్రోగ్రామ్మర్, హాండ్సం ఎంగ్ మాన్ కిరణ్.

వర్షిణి కిరణ్ దగ్గరకు వెళ్లి అతని చేతిని పట్టుకుంది. అప్పుడే చేయి కోసుకున్నట్లున్నాడు. రక్తం కారిపోతుంది. పోలీసులు వెంటనే ఆంబులెన్స్‌కు ఫోన్ చేసారు.

                                                   ———

పది రోజుల తర్వాత ఆశా హాస్పిటల్‌లో డాక్టర్ ఎదురుగా కూర్చుని ఉన్నారు వర్షిణి, హర్షలు. బై పోలార్ డిజార్డర్. తేల్చి చెప్పాడు డాక్టర్. తన సమస్య కిరణ్‌కు తెలుసని లిథియం కార్బొనేట్ ఇంజనీరింగ్ రోజుల్లోనే వాడేవాడని వర్షిణికి డాక్టర్ చెబుతుంటే ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయింది. ఇన్నేళ్ల స్నేహంలో అతనికి ఈ జబ్బు ఉందన్న సంగతే తనకు తెలియదు.

“నిజానికి ఇది ట్రీట్ చేయలేని జబ్బు కాదు. జీవితాంతం వీళ్లు మందులు తీసుకుంటూ ఉండాలి. కొన్నాళ్లు హై గానూ కొన్నాళ్లు పూర్తి డిప్రెషన్‌లోకి వెళ్లిపోతూ ఉంటారు. అత్యుత్సాహం, ఎవరూ ఊహించని ఎనర్జీ హై గా ఉన్నప్పుడు వాళ్లలో కనిపిస్తాయి. తీవ్రమైన ఒంటరితనం, ఏ పని చేయలేకపోవడం, అభద్రతా  భావం, దుఖం, అనాసక్తత డిప్రెషన్ సమయంలో వీళ్లను ముంచేస్తాయి. ఆ సమయంలో పక్కన కుటుంబం, వారి ప్రేమ, వీళ్లకు అవసరం.  కాని కిరణ్ తల్లి తండ్రులకు ఈ జబ్బు గురించి తెలియదు. కాలేజీ రోజుల్లో తన మూడ్స్‌లో త్వరత్వరగా వచ్చే మార్పులను గమనించుకుని కిరణ్ డాక్టర్లను సంప్రదించాడు. మందులూ వాడాడు.

ఉద్యోగంలోకి వచ్చాక ఆ ప్రెషర్, పెళ్లి తర్వాత రహస్యంగా ట్రీట్మెంట్ తీసుకోవడం అనే స్ట్రెస్, పెళ్లితో ఏర్పడ్డ కొత్త సంబంధాలు, వాటిని నిలుపుకోలేనేమో అన్న భయం ఇతన్నితీవ్ర ఒత్తిడికి గురి చేసాయి. దాని పర్యవసానమే వివాహం విఫలం అవడం. ఇది అతన్ని మరింతగా కృంగదీసింది. అప్పటి దాకా వాడే మందులను వేసుకోవడం మానేసాడు. దానితో పరిస్థితి మరీ దిగజారింది. త్వరత్వరగా ఈ హై అండ్ లో ఎపిసోడ్శ్ వచ్చీ పోతూ అతన్ని నిర్వీర్యం చేసేసాయి. ఇప్పుడున్న మానిక్ స్టేజ్‌లో ఎవరినీ కలవకుండా, మనుష్యుల సాంగత్యమే లేకుండా తనను తాను ఐసొలేట్ చేసుకున్నాడు.

మీరు అతని ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేస్తుంటే, మిమ్మల్ని ఎదుర్కోలేక ఆత్మహత్యా యత్నం చేసాడు. సమయానికి అతన్ని కాపాడగలిగాం. కాని ప్రస్తుతం ఇతను కొన్ని నెలలు మా పర్యవేక్షణలో ఉండాలి. తీవ్రమైన హాలుసినేషన్స్‌తో అతను ఇబ్బంది పడుతున్నాడు. ఈ స్థితిలో అతను ఒంటరిగా ఉండడం ప్రమాదం.”

డాక్టర్ చెప్పింది విన్న వర్షిణి కళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. తన అభివృద్దికి నిరంతరం తోడుగా నిలిచిన తన స్నేహితుడు ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఉండడం ఆమె భరించలేకపోతున్నది.

“కాని డాక్టర్! కిరణ్ చాలా బ్రిలియంట్. ఒక రకంగా జీనియస్. ఇలా మానసిక రోగిగా ఎలా మారాడు?” ఏడుస్తున్న ఆమెను పట్టుకున్నాడు హర్ష.

ఆమె కాస్త తెప్పరిల్లేదాకా ఆగాడు డాక్టర్

“బై పోలార్‌తో ఇబ్బంది పడే చాలా మంది, స్వతహాగా విపరీతమైన తెలివి తేటలు గల వాళ్లే. అందుకే తమలో చేరే ఆ డిప్రెషన్, నిస్సత్తువతో యుద్దం చేయలేక తీవ్రమైన గిల్ట్ మోడ్‌లోకి వెళ్లిపోతూ ఉంటారు. ఈ మూడ్ స్వింగ్స్‌ని కనిపెట్టుకుని ఉంటూ వాళ్లకు తోడుగా నిలిచే వ్యక్తుల అవసరం వారికి ఎంతో ఉంది. వీళ్లకు సోషల్ స్కిల్స్ కూడా కొన్నిసార్లు ఎక్స్‌ట్రీంగా, కొన్ని సార్లు అస్సలు లేకుండా పోతాయి. తమకు దగ్గరయిన వాళ్లని కోల్పోతామనే భయం వీరిని నిరంతరం వేధిస్తూ ఉంటుంది. అదే వీరిని మరింత డిప్రెషన్ లోకి నెట్టేస్తుంది. బాలెన్స్ తప్పేలా చేస్తుంది.

కిరణ్ చాలా కాలం తనను తాను గమనించుకుంటూ బాలెన్స్డ్‌గా ఉండగలిగాడు. కాని పెళ్లి తర్వాత త్వర త్వరగా మారే తన మూడ్ ఎపిసోడ్స్ వల్ల భార్య తనకు దూరం అవుతుందేమో అన్న భయం అతన్ని విపరీతమైన ఒత్తిడికి గురి చేసింది. భార్యతో నిజం చెప్పలేక ఆమె ముందు తనను తాను కంట్రోల్ చేసుకోలేని మూడ్ స్వింగ్స్‌తో బాధపడుతూ చివరకు ఆమెతో విడిపోవాలని నిశ్ఛయించుకున్నాడు. అది అతని పరిస్థితిని ఇంకా దారుణం చేసింది. గత సంవత్సరం నుంచి వేసుకునే మందులూ మానేసాడు. సూసైడల్ టెండెన్సీ  పెరిగింది.  తన చివరి లింక్ మీరు కూడా దూరమవుతారని భయపడి సూసైడ్ అటెంప్ట్ చేసాడు.”

“అతన్ని నేను చూడవచ్చా?” అడిగింది వర్షిణి.

“అతను చాలా భరిస్తున్నాడు వర్షిణి. అతననుభవిస్తున్న నరకం అర్ధం చేసుకోవడం కూడా మనకు కష్టం. మీరంటే అతనికి చాలా ఇష్టం. అందుకే మిమ్మల్ని ఫేస్ చేయలేనంటున్నాడు. అతని పేరెంట్స్ నిన్ననే వచ్చి వెళ్లారు. అతనికి కొంత టైం ఇవ్వండి. హి ఈజ్ నాట్ రెడీ టూ సీ యు.” చెప్పాడు డాక్టర్.

ఆ రోజు ఆఫీసులో తన ముఖంలోకి చూడలేక, తన చూపులను తప్పించుకుంటూ స్క్రీన్ వైపుకు తిరిగి కళ్లు మూసుకుంటూ, తెరుస్తూ మాటలు కూడబలుక్కుంటూ ప్రాజెక్ట్‌లోని లోపాలను వివరిస్తున్న కిరణ్ కనిపిస్తున్నాడు వర్షిణికి. ఆమె కళ్ల నుండి ధారాపాతంగా కన్నీరు కారుతొంది. హర్ష ముఖంలోనూ విషాదం. తన స్నేహితుడిని మునుపటిలా చూడడానికి ఎంత సమయం పడుతుందో? అసలు అది సాధ్యమవుతుందా? అనుమానం ఆమెలో….

                                                     ——-

కిరణ్ ఇంటిని శుభ్రం చేయించుకుని, అక్కడే కొన్నాళ్లు ఉండాలని కిరణ్ తల్లి తండ్రులు నిశ్చయించుకున్నారు. కిరణ్‌ను వారంలో ఒక సారి కలవడానికి డాక్టర్లు వాళ్లకి అనుమతిచ్చారు. కొడుకు అనారోగ్యం సంగతి తాము ఇన్నాళ్లు తెలుసుకోకుండా ఉండటం వాళ్లకు చాలా గిల్టీగా ఉంది. అసలు ఇన్నాళ్లు ఈ విషయం తమకు తెలియకుండా కిరణ్ దాచిపెట్టగలగడమే వారికి ఆశ్ఛర్యంగా ఉంది.  ఇల్లు శుభ్రం చేయడంలో వారికి సహాయపడాలని కిరణ్ తల్లి తండ్రులతో పాటు వర్షిణి అతని ప్లాట్‌కు వెళ్లింది.

ఫ్లాట్ అంతా అస్త్యవ్యస్తంగా ఉంది. పగలగొట్టిన తలుపుల వరకు హర్ష బాగు చేయించి తాళం వేయించాడు. ఇద్దరు మనుష్యులను పెట్టి దగ్గర ఉండి అంతా శుభ్రం చేయించింది వర్షిణి. ప్రతి వస్తువును జాగ్రత్తగా ఉండాల్సిన చోట ఉంచింది. కిరణ్ బట్టలు, ఆఫీస్ కాయితాలు అన్నీ ఒక అరలో సర్దుతున్నప్పుడు అతని సర్టిఫికేట్ ఫైల్ పక్కన ‘వర్షిణికి’ అని ఎర్ర స్కెచ్‌తో రాసిన కాగితం, దాన్నిక్రింద ఓ ఫైల్  కనిపించాయి. అవి చూడగానే గుండె దడదడా కొట్టుకుంది. దాన్నితీసుకుని తన బాగ్‌లో పెట్టుకుంది.

కొత్త తాళం చెవి కిరణ్ తల్లి తండ్రులకిచ్చి, బైటకు వస్తున్న వర్షిణిని పక్కింటావిడ పలకరించింది.

“అతనికి పిచ్చి తగ్గిందన్నాక మళ్లీ ఈ ప్లాట్‌కే వస్తాడేమిటమ్మా.. అంతా సర్దుతున్నారు. మాది పిల్లలుండే కాలనీ. అతనిక్కడే ఉంటాడా ఏంటీ?” అడిగిందామె.

ఆ ప్రశ్నకు అదిరిపోయింది వర్షిణి. తన జబ్బు గురించి ఎవరికీ ఎందుకు కిరణ్ చెప్పుకోలేకపోయాడో, అది తెలుస్తుందని ఎంత మధనపడి ఉంటాడో ఆమెకు ఇప్పుడు స్పష్టంగా అర్ధం అయింది.

“ఇది అతని ఇల్లు. అతను ఇక్కడే ఉంటాడు. అలా ఉండే హక్కు అతనికి ఉంది. పిచ్చి అంటూ ఏం మాట్లాడుతున్నారు మీరు. మీకిష్టమయితే ఉండండి. లేదంటే మరో చోటకు వెళ్లండి. అయినా నాలుగేళ్ల క్రితం మీ అబ్బాయికి మేథ్స్ ట్యూషన్ కిరణ్‌తో ప్రీగా చెప్పించుకుని అతని వల్లే మీ వాడు ఎమ్సెట్‌లో మంచి రాంక్ తెచ్చుకున్నాడని మీరేగా చెప్పారు. మర్చిపోయారా? ఇప్పుడు అదేదీ గుర్తు రావట్లేదా? కోపంతో పై పెదవి అదురుతుండగా, కళ్ల నుండి కారుతున్న కన్నీరు ఆమెకు కనిపించకుండా అక్కడి నుండి బైట పడింది వర్షిణి.

                                                         ——

ఆ రాత్రి వర్షిణి, హర్ష లిద్దరూ కిరణ్ రాసిన ఉత్తరాన్ని తెరిచి చూసారు.

“వర్షా! నా వల్ల కావట్లేదు రా. భయం వేస్తుంది. నాకు దగ్గరగా ఎవరు వచ్చినా వాళ్లని నేను నిలుపుకోలేను. నాకు నా జబ్బు గురించి మొదటిసారి తెలిసినప్పుడు భయం వేసింది. కాని నేను కంట్రోల్ లో ఉండగలనని, నన్ను నేను కాపాడుకోగలనని అనుకున్నాను. ప్రయత్నించాను కూడా. శ్రద్దగా మందులు వాడాను. కాని ప్రియతో మొదలయిన గొడవలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి.

నిజానికి అది ప్రియ తప్పు కాదు. నేను ఎందుకు కొన్నిసార్లు అత్యుత్సాహంగా, కొన్ని సార్లు ఏమీ చేతకానట్లు ఉండిపోతానో తనకు అర్ధం కావట్లేదు. ప్రియ చాల మంచిది వర్షా. నా వల్ల చాలా ఇబ్బంది పడింది. నాతో ఉండలేకపోయింది. అందుకే డైవర్స్‌కి నేనే సిద్దమయ్యాను. చాలా హర్ట్ అయింది. నీతో నాకేదో అనుబంధం ఉందని అందుకే తనతో అడ్జెస్ట్ కాలేకపోతున్నానని అనుకునేది. అందుకే నీకు దూరంగా ఉండేది. నేనూ ఇది మంచిదే అనుకుంటున్నాను.  నీకు దగ్గరగా ఉంటే ఏదో రోజు నా జబ్బు సంగతి నువ్వు గ్రహిస్తావు. నాకు తెలుసు. అందుకే నీకు పెళ్లి జరిగాక నీకు దూరంగానే మసలుకున్నాను. ప్రియ అనుమానం ఒకరకంగా నాకు మంచే చేసింది. లేదంటే ప్రియ లాగా నువ్వూ నాతో ఇబ్బంది పడేదానివి.

వచ్చే వీకెండ్‌కి ఇంటికి రమ్మన్నావు. నేను రాలేనని నాకు తెలుసు. ఇప్పుడు నేను మళ్లీ లో లోకి వెళ్లిపోతాను. ఇక పైకి రాలేను. ఈ స్థితిలో నువ్వు నన్ను చూడడం నా కిష్టం లేదు. చనిపోవాలనిపిస్తుంది రా. కాని నువ్వు లేకుండా నేను చచ్చిపోతే నాది అనాధ చావు అవుతుంది. నువ్వు ఆఫీసుకు రావట్లేదు. నా సంగతి తెలిసిపోయిందేమో అని భయం వేస్తుంది. నీకు ఫోన్ చేయాలనుకున్నా గుండె అదురుతుంది. ఒక్క సారి రా వర్షా… అయినా నువ్వు వచ్చాక ఇదంతా చెప్పడానికి నేను ఉంటానో లేదో. నా జబ్బు నన్ను ప్రతి నిముషం తినేస్తున్నది. నాకు ఈ గదిలో ఎవరెవరో కనిపిస్తుంటారు. భయం వేస్తోంది. నేనిలాగే అంతం అవుతానా? రాత్రంతా చుట్టూ ఎలుకలు పాకుతూ ఉంటాయి. అది కలో నిజమో అర్ధం కాదు. ఏవో నవ్వులు విపినిస్తూ ఉంటాయి. ఒంటరిగా పడుకోలేకపోతున్నాను. భయం వేస్తుంది వర్షా.”

“కాలేజీలో నిన్ను రాగింగ్ చేస్తున్నారని రాజ్ గాడిని చితక్కొట్టింది గుర్తుకు తెచ్చుకుని నవ్వుకుంటాను. మళ్లీ ఆ రాజ్ బ్యాట్ పట్టుకుని పక్కనే ఉన్నట్లు అనిపించి భయంతో వణికిపోతాను. భరించలేకుండా ఉన్నాను వర్షా. నువ్వు రాకముందు నేను పోతే ఒక్క సాయం చేయి. ప్రియకు ఈ  ఇల్లు, చెందేలా చూడు. తనకు డైవర్స్ పేరున ఇవ్వాల్సింది ఇచ్చినా తన పట్ల నా బాధ్యత అది.  అమ్మా నాన్నలకు కొన్ని బాండ్లు జాగ్రత్త చేసి పెట్టాను. నా మ్యూచువల్ ఫండ్స్‌కు వాళ్లే నామినీలు. ఆ వివరాలన్నీ ఈ ఫైల్‌లో ఉన్నాయి. నా స్నేహితురాలిగా ఇవి అమ్మ, నాన్నల దగ్గరకు చేర్చు.

నాకు చనిపోవాలని లేదు. కాని ఈ నరకం భరించలేకపోతున్నాను. నా తలలో ఈ హోరు ఇంకెంతకాలం ఉంటుందో తెలియదు. మందులు వాడాలనిపించట్లేదు. నేనేదన్నా చేసుకుని చనిపోతే దానికి అందరూ  ప్రియని భాద్యురాలిని చేయడం నాకిష్టం లేదు. అలా కాకూడదనే ప్రతి క్షణం నన్ను నేను నియంత్రించుకునే ప్రయత్నం చేస్తున్నాను. కాని ఈ నరకం భరించలేకపోతున్నాను. ప్రియపై ఏ అపవాదు రాకుండా చూడాల్సింది నువ్వే. ఈ ఒక్క పని చేస్తావు కదూ?” … కిరణ్.

హర్ష తల విదిలించాడు. “మై గాడ్. ఎంత నరకం అనుభవించాడు.”

వర్షిణి తల ఊపింది. రెండు నెలలు లేదా, పది నెలలు కిరణ్ హాస్పిటల్ నుండి బైటకు రావడానికి ఎంత సమయం పట్టినా తాను అతనికి అండగా నిలవాలని నిర్ణయించుకుంది.

“హర్షా రేపు ప్రియ గురించి వాకబు చేయాలి.  ఆమెకు ఈ విషయం పూర్తిగా చెప్పాలి. ప్రియ జీవితంలో ముందడుగు వేసి ఉండవచ్చు. కాని కిరణ్ అనారోగ్యం విషయం గురించి తెలుసుకోవల్సిన హక్కు ఆమెకుంది. కిరణ్ పై ఆమెకున్న అనుమానాలు వీడిపోతే కిరణ్‌కూ న్యాయం చేసినట్లే.

ఇది కిరణ్ కడదాకా పోరాడాల్సిన అనారోగ్యమే. కాని అతని తల్లి తండ్రులు, కుదిరితే ప్రియ, స్నేహితులుగా తాము అందించే స్నేహ హస్తం అతనిలో జీవితేచ్చను రగిలించగలదేమో… ప్రయత్నించాలి”

కిరణ్ తనకు అప్పగించిన ఫైల్‌ను జాగ్రత్త చేయడానికి లోపలికెళ్లింది వర్షిణి.

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

Leave a Reply