స్త్రీల స్వీయ చరిత్రలు

“చాలా సందర్భాలలో స్వీయచరిత్ర కథనం కాలక్రమంలో రూపుదిద్దుకున్న జీవితానికీ అది జీవితాన్ని ఒక ప్రక్రియగా చూసే దృక్కోణానికీ ప్రాతినిధ్యం వహిస్తుంది.” వకుళాభరణం రాజగోపాల్ (స్వీయచరిత్రలు, వలసకాలపు ఆంధ్రసమాజం 2022, అను వాదం దుర్గెoపూడి చంద్రశేఖర రెడ్డి ఎమెస్కో)
“స్వతంత్రత నుండి స్వాతంత్ర్యానికి”(2021) అనే 1900-1947 మధ్యకాలపు స్త్రీల సాహిత్య పరిశోధన గ్రంధం(పు;463)లో జంధ్యాల కనకదుర్గ ‘అనసూయ’ పత్రిక 1919 జులై ఆగస్టు సంచికలలో ‘ప్రేమలత’ అనే స్వీయ చరిత్ర ప్రచురించబడినట్లు పేర్కొన్నది. అది కనుపర్తి వరలక్ష్మమ్మ రచనే. సెప్టెంబర్ అక్టోబర్ సంచికలో కూడా కొనసాగింది కానీ అది స్వీయ చరిత్ర కాదు. “స్వీయ చరిత్రము- ప్రేమ లత” అనే శీర్షిక ఉండటం, “ నేనొక గొప్ప యాదర్శ నారీ రత్నమునని గానీ ఘనకార్యములాచరించితినని గానీ నా జీవితమును వ్రాయబూనలేదు” అనే ప్రారంభం ఆమె అలా భ్రమపడటానికి వీలిచ్చిఉంటుంది. ఇంతకూ అది ప్రేమలత అనే యువతి సాంసారిక సమస్యల ఉత్తమ పురుష కథన రూపమైన నవల. అంతే తప్ప కనుపర్తి వరలక్ష్మమ్మ స్వీయ చరిత్ర మాత్రం కాదు. ప్రేమలత పేరు చాటున కనుపర్తి వరలక్ష్మమ్మ జీవితానుభవాలు కొన్ని దాగి ఉన్నా ఉండవచ్చు. అది వేరేవిషయం.

అలాగే అదే పుస్తకంలో కనకదుర్గ 1930 ఫిబ్రవరి గృహాలక్ష్మి పత్రికను అనుసరించి ‘నా జీవనావ యాత్ర’ అనే స్త్రీ స్వీయ చరిత్రను డి. రాజేశ్వరి రచనగా పేర్కొన్నది. నాజీవనావ యాత్ర 4 పేజీల రచన. స్వీయచరిత్ర అనదగిన లక్షణాలేవీ దానికి లేవు. వరకట్న సమస్యవల్ల స్నేహితుడిని పెళ్ళాడలేక మూడవపెళ్లి వరుడి ఇల్లాలై ఏ సాంసారిక సౌఖ్యాలు అనుభవించకుండానే వితంతువైన స్త్రీ విషాదజీవిత ఉత్తమ పురుష కథనం ఈ రచన. నిజానికి అది ఒక కథ .

స్త్రీల స్వీయ చరిత్రలను నిర్మాణ రూప పద్ధతులను బట్టి లిఖిత స్వీయ చరిత్రలు , మౌఖిక కథనాల లిఖిత రూపాలు అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. కేంద్ర విషయ వైవిధ్యాన్ని బట్టి మళ్ళీ వీటిని కుటుంబ జీవిత సంబంధ స్వీయచరిత్రలు,సామాజిక ఉద్యమ సంబంధ స్వీయచరిత్రలు, వృత్తి సంబంధ స్వీయ చరిత్రలు, ప్రత్యేక అనుభవ కథన రచనలు అని నాలుగు రకాలుగా విభజించవచ్చు. ఈ వర్గీకరణ అధ్యయన సౌలభ్యం కోసమే. కుటుంబం , సామాజిక ఉద్యమ రంగం, వృత్తి జీవిత రంగం అనుకొనటానికి వేరువేరు కార్యక్షేత్రాలే అయినా మనుషులు ఏకకాలంలో కుటుంబంలో సమాజంలో , వృత్తి ఉద్యోగాలలో భాగమై ప్రవర్తిస్తుంటారు కనుక ఆ కార్యక్షేత్రాల మధ్య సరిహద్దులు తరచు చెదిరిపోతుంటాయి. ప్రాధాన్యం దేనికి అన్నదాన్నిబట్టి ఈ విభజన. ఒకటి ప్రధానంగా ఉండి మిగిలినవి అనుబంధవిషయాలుగా జీవితంలో విడదీయరాని భాగమై అల్లుకుపోవటాన్ని నిరూపించటంలోనే స్వీయచరిత్ర రచనా సౌందర్యం నిక్షిప్తమై ఉంది. ఆయావిభాగాలలో స్వీయ చరిత్రలను కాలక్రమ వరుసలో సమీక్షించటం వలన చరిత్ర గమనాన్ని, పరిణామ పంధాను అర్ధంచేసుకొనటం సులభం అవుతుంది.

  1. స్త్రీల స్వీయ చరిత్రలు – కుటుంబ జీవిత సంబంధ రచనలు

2.1. ఇప్ప్పటికి లభిస్తున్నంతవరకు ఏడిదము సత్యవతి వ్రాసిన ఆత్మచరితము మొదటి లిఖిత స్వీయ చరిత్ర.1934 లో ప్రచురించబడింది. భర్త అకాల మరణంతో అపార దుఃఖంతో పుట్టిల్లు చేరిన సత్యవతి ఆ దుఃఖ వ్యక్తీకరణగా చేసిన రచన ఇది. ఆరకంగా ఇది కుటుంబజీవిత సంబంధ స్వీయ చరిత్ర. పుట్టిన సంవత్సరం, వూరు మొదలైనవి చెప్పకుండానే అయిదేళ్ల వయసులో అక్షరాభ్యాసం అయి బాలికా పాఠశాలకు వెళ్లి చదువుకున్న విషయం చెప్పింది. పదేళ్ల వయసులో ఒక పెళ్ళిలో తనకు కాబోయే భర్తతో జరిగిన పరిచయాన్ని చెప్పింది. అతని పట్ల కలిగిన అభిమానం, పెళ్లయిన విషయం, ప్రేమ , అతని ఉద్యోగ కారణంగా పుట్టింట ఉన్నకాలపు వియోగ వ్యధ, అది గడిచి కష్టతరమైన ప్రయాణం చేసి అటవీ బరంపురం దాటి మన్యం ప్రాంతాలలో ఉన్న భర్తను చేరటం, కొద్దికాలానికే తీవ్రమైన జ్వరంతో అతను మరణించటం , ఒంటరి కాపురంలో ఒంటరిగా ఆ విషాదాన్ని ఎదుర్కొనటం ఆమె జీవిత వాస్తవం.

భర్త మరణించటం స్త్రీకి వ్యక్తిగత బాధ. అయినా ఆ సందర్భం నుండే సత్యవతి భర్త మరణించిన స్త్రీల పట్ల సమాజ వైఖరిని అర్ధం చేసుకొని అందులోని అన్యాయాన్ని ప్రశ్నించటానికి ఈ ఆత్మచరితము వ్రాసింది. వ్యక్తిగత సుఖదుఃఖస్థాయినుండి స్త్రీలు సామాజిక వ్యాఖ్యాతలు కావటం కూడా ఒక వాస్తవం. “పతివ్రతననిగానీ,కవయిత్రిని అనిగానీ లోకానికి వెల్లడి చేయటానికి కాక స్త్రీలోకమున జరుగుచున్న దురాచారాలను నిర్మూలించటానికే తానా రచన చేసినట్లు రచయిత్రి తొలిపలుకులలలో చెప్పుకొన్నమాటలు దానినే సూచిస్తాయి. . అనాధలకు జరుగుతున్న శిరోముండనాది పరాభవాలను తగ్గించాలన్నది తన ముఖ్యోద్దేశము అని చెప్పుకొన్నది. భర్త ఉండగానే భార్య మరణించటం సరైందని, భర్త మరణిస్తే సహగమనమే ధర్మమని, ఆచారాలపేరిట పరాభవాలు పొందటంకన్నా చావటమే మేలని ఒక వైపు అనుకొంటూనే బాల వితంతువుల విలాపములు వినలేకనే కందుకూరి వీరేశలింగం పునర్విహాల గురించి ఉద్యమించాడని తలచుకొంటుంది. వీరేశలింగం కార్య శక్తి గురించే కాదు, జాతీయోద్యమ నాయకుడైన గాంధీ గురించి కూడా ఆమెకు తెలుసు. సమానత్వం , స్వాతంత్య్రం వంటి ఆధునిక ప్రజాస్వామిక భావనల ప్రభావం వల్లనే ఆమె స్వీయ జీవితానుభవం నుండి మొత్తంగా స్త్రీపురుష వివక్షను విశ్లేషించుకోగల , ప్రశ్నించగల వివేకాన్ని పొంది ఉంటుంది.

హరికథలు చెప్పే వారు కలియుగంలో పతివ్రతలైన స్త్రీలు లేరని నిందవేస్తూ మధ్యమధ్య చెప్పే పిట్టకథలను నిరసిస్తూ స్త్రీలు మాత్రమే పతివ్రతలుగా ఉంటె సరిపోతుందా అని సవాల్ చేస్తుంది. స్త్రీలను ఎన్నైనా అనవచ్చు , వాళ్ళు ప్రతిక్రియ చెయ్యలేరు అన్నది వాళ్ళ ఉద్దేశమా అని నిలదీస్తుంది.బ్రాహ్మణ కుటుంబాలలో భర్త చనిపోగానే స్త్రీలకు శిరోముండనం చేయటం, సైనుగుడ్డ కట్టించి ముసుగు వేసి మూలకూర్చో పెట్టటం, రాత్రుళ్లు అన్నం మాన్పించి పిండి తినమనటం వంటి విపరీతాచారాలు స్త్రీల జీవితాన్ని దుర్భరం చేస్తున్నాయని బాధపడుతుంది. సంప్రదాయ నమూనాలో ఒదిగి ఉన్నట్లు కనబడు తూనే పురుషుడికి ఒకన్యాయం, స్త్రీకి ఒక న్యాయం అమలవుతుండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయటం సత్యవతి ఆత్మచరిత్రలోని ప్రత్యేకత. భార్యకు పతివ్రతాత్వం ఎంత ఆవశ్యకమో భర్తకు పత్నివ్రతమునూ అంత ఆవశ్యకమే. ఈ సంగతి పురుషులు మరువగూడదు అని హెచ్చరించటంలో అదే కనబడుతుంది. వలసపాలనలో రూపొందుతున్న నూతన మహిళ స్వరం వినిపించేయటానికి సామాజిక సానుభూతిని , ఆమోదాన్ని సంపాదించటానికి పాతివ్రత్యం అనే సంప్రదాయ నమూనాను ఒక వ్యూహంగా ఆమె స్వీకరించింది అనుకోవచ్చు.

2.2. మళ్ళీ ముప్ఫయి ఏళ్లకు బసవరాజు రాజ్యలక్ష్మమ్మ స్వీయ చరిత్ర ‘బసవరాజు అప్పారావు – నేను’ (1965) వచ్చింది. బసవరాజు అప్పారావు రాజ్యలక్ష్మమ్మగారి భర్త. 1894 లో పుట్టి 1933 లో మరణించాడు, పత్రికా రంగంలో పనిమంతుడు. న్యాయవాదిగా కొంతకాలం పనిచేశాడు.సమకాలపు సాహిత్య ప్రపంచ పరిణామాలతో, జాతీయోద్యమ రాజకీయాలతో నిత్యసంబంధాలలో ఉన్నాడు. భావకవిత్వ జాతీయోద్యమ కవిగా గీతరచయితగా ప్రసిద్ధుడు.ఆయనకు మేనమామ కూతురు రాజ్యలక్ష్మమ్మ. పన్నెండు ఏళ్ళ వయసులో 1916 లో బసవరాజు అప్పారావుతో పెళ్లయింది.ఆమె కూడా స్వయంగా కవి.కథారచయిత. సౌదామినిఆమె కలం పేరు. జాతీయోద్యమ రాజకీయాలలో క్రియాశీలక భాగస్వామి. సహాయనిరాకరణోద్యమంలో పాల్గొని రెండు నెలలు కారాగారవాసం కూడా చేసింది.

‘బసవరాజు అప్పారావు – నేను’ “అప్పారావుగారి జీవితచరిత్రయే గానీ నా జీవితచరిత్ర మాత్రం కాదు. వారితో ఉన్నాను కాబట్టి నాది కూడా వారితో పాటుది అయింది.” అని ‘అప్పారావుగారితో కలిసి సాగించిన జీవితయాత్ర, దేశాటన, జాతీయోద్యమం మొదలైన విషయాలగురించి వ్రాయాలని సంకల్పించి’ ఈ రచన చేశానని ప్రస్తావన శీర్షికతో వ్రాసిన తొలిపలుకులలో చెప్పుకొన్నది రచయిత్రి. అంటే ఆమె దృష్టిలో భర్త జీవిత చరిత్ర రచన ప్రధానం. ఆయనతో ముడిపడి ఉన్న తన జీవితం దానికి అనివార్యమైన అనుబంధం. ఈ పుస్తకానికి ముందుమాట వ్రాసిన దిగవల్లి వెంకట శివరావు బసవరాజు అప్పారావు జీవిత చరిత్ర( అంటే స్వీయ చరిత్ర అని ఉద్దేశం) వ్రాసుకోకుండానే మరణించిన లోటును ఆయన ధర్మపత్ని రాజ్యలక్ష్మమ్మ చేసిన ఈ రచన తీరుస్తుందని అభిప్రాయపడ్డాడు. అంటే ఆయన దీనిని బసవరాజు అప్పారావు జీవితచరిత్రగా భావించాడన్నమాట. భార్యాభర్తల జీవనయానం ముఖ్యం కనుక ఇది కుటుంబజీవిత సంబంధ స్వీయచరిత్రల విభాగంలో భాగం అవుతుంది.

నలభై మూడు శీర్షికలకింద ఈ స్వీయ చరిత్రను రచించింది రాజ్యలక్ష్మమ్మ. కథన విషయాలకు తగిన బసవరాజు అప్పారావు గీతాలను ప్రస్తావిస్తూ రచన చేయటం ఇందులోని ప్రత్యేక శిల్పం. అలాగని ఇది అప్పారావు కవిత్వపరామర్శ కాదంటుంది ఆమె.ఈ స్వీయ చరిత్రను అప్పారావు జీవితం , జాతీయోద్యమ చరిత్ర, యాత్రాచరిత్ర, రాజ్యలక్ష్మమ్మ జీవితం అని నాలుగు కోణాలనుండి పరిశీలించవచ్చు.

2.2.1. బసవరాజు అప్పారావు జీవితం
విజయవాడకు పాతిక మైళ్ళ దూరంలో ఉన్న బసవరాజు అప్పారావు గారి స్వగ్రామం నూజివీడును, నూజివీడు సంస్థానంలో దివానులుగా పనిచేసిన వారి తాతముత్తాతలను పరిచయం చేయటంతో ఈ స్వీయ చరిత్రను ప్రారంభించింది రాజ్యలక్ష్మమ్మ. ఆమె మూడవ మేనత్త వెంకమ్మకు బసవరాజు పిచ్చయ్యతో పెళ్లి అయింది. వాళ్ళ రెండవ సంతానం అప్పారావు. అప్పారావుకన్నా రెండేళ్లు పెద్ద కూతురు వాళ్లకు ఉంది.విజయవాడకు మూడు మైళ్ళ దూరంలో ఉన్న మాతామహుల వూరు పటమటలో బసవరాజు అప్పారావు 1894 డిసెంబర్ 13న జన్మించాడు.అప్పారావుకు మూడేళ్ళ వయసులో తల్లి మూడవ కాన్పులో మగపిల్లవాడిని కని మరణించింది. పుట్టిన పిల్లవాడు కూడా కొద్దికాలంలోనే చనిపోయాడు. అప్పారావు , అతని అక్క పటమటలోనే పెరిగారు. బసవరాజు అప్పారావు పద్యపఠనాసక్తులు,సాహిత్యాభిలాషల వికాసానికి పాదులు తీసింది ఆ వూళ్ళో ని వీధిబడి చదువే అంటుంది రాజ్యలక్ష్మమ్మ.

అలాగే ఆనాటి గ్రామీణ వినోద కార్యక్రమాలైన వీధి భాగోతం, కూచిపూడి భారతనాట్యాలు, వూళ్ళో చెప్పించే కాంభోజరాజుకథ , బొబ్బిలి కథ, పల్నాటి వీరుల కథ మొదలైనవి, తోలుబొమ్మలాట మొదలైనవాటి గురించి చెప్తూ అప్పారావుకు వాటిపట్ల ఉన్న ఆసక్తిని, గ్రహింపు జ్ఞానాన్ని, నైపుణ్యాలను ప్రస్తావిస్తుంది.
పటమట వీధిబడిలో అయిదవతరగతి పూర్తిచేసి అప్పారావు విజయవాడలో హైస్కూల్ లో చేరటం, పద్యాలు పాటలు కూనిరాగాలుతీస్తూనో , గొంతెత్తిపాడుతూనో ఉండే అతని కళాహృదయాన్ని, కథలు , కబుర్లు చెప్పే అతని నైపుణ్యాన్ని , శనిఆదివారాలలో అతను పటమట కు వచ్చినప్పుడు అందరూ కలిసి తోటలూ దొడ్లూ తిరుగుతూ గడిపిన జ్ఞాపకాలను పేర్కొన్నది.రచయిత్రి . అప్పారావు ఎఫ్ ఏ చదవటానికి మిత్రులతో కలిసి అలహాబాద్ వెళ్లి అక్కడ ఇమడలేక వెనకకు వచ్చి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో చేరి చదువు కొనసాగించటాన్ని ,తరగతిపుస్తకాల అధ్యయనం మీద కన్నా ఇతరగ్రంధాల పఠనం మీద ఆయనకు ఉన్న శ్రద్ధాసక్తులను గురించి చెప్తూ రాజ్యాలక్షమ్మ అయినా ఎప్పుడూ తరగతి పరీక్షలలో ఆయనే ప్రథముడిగా వచ్చేవాడిని చెప్పింది. అధికార్ల సూర్యనారాయణ, నండూరిసుబ్బారావు, కురుగంటి సీతారామయ్య రాయప్రోలు సుబ్బారావు మొదలైన వారితో స్నేహాలు బలపడి సాహిత్య సంగోష్టులు సాగటమే కాదు ఆయన కవిత్వం వ్రాయటం పత్రికలలో ప్రచురించట కూడా మొదలైంది అప్పుడే. తొలిదశలో గురజాడప్రభావం ఉన్నా క్రమంగా తనదైన స్వంత మార్గాన్నీ నిర్మించుకొన్నాడని అంటుంది రాజ్యలక్ష్మమ్మ .

అప్పారావు ఎఫ్ ఎ చదువు ముగిసేనాటికి అతని అక్క కూడా తల్లివలె మూడవ కానుపు లో మరణించింది. అప్పటికి అప్పారావు జాతీయోద్యమ ప్రభావంలోకి వచ్చాడు. ఆ రోజుల్లో ఆయన వ్రాసిన “ “చేతిలో బాకాడ / శివుడు తాండవమాడ ?భయమేలా “ కవిత నిషేధానికి కూడా గురైందని చెప్పారు ఆమె.. ఆయన తొలి కావ్యఖండికలు ‘సెలయేటి గానం’ పేరుతో పుస్తకంగా అప్పారావు రాజ్యలక్షమ్మల పెళ్లినాటికే వచ్చింది. వాళ్ళ పెళ్లి అప్పారావు బిఎ చదువు పూర్తికాగానే 1916 వేసవిలో జరిగింది. అప్పారావు లా చదువుకోసం మళ్ళీ మద్రాస్ కు వెళ్ళటం వలన వాళ్ళ కొత్తకాపురం 1917 జూన్ లో మద్రాసు లో మొదలైంది.

ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాల కృష్ణయ్య అప్పారావుకు ఆప్తమిత్రుడు. జాతీయోద్యమ భావోద్వేగాలు ఇద్దరికీ సమానధర్మం. బ్రిటిష్ వారి కొలువులో ఉద్యోగం విషయంలో అందుకే అప్పారావుకు ఆసక్తి లేకుండాపోయింది. స్వాతంత్ర్య ఉద్యమం, సాహిత్యజీవితం ఆయనను నడిపించాయి. 1921 మార్చ్ లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సభ కు హాజరుఅయ్యాడు. ఆ సభ ఇచ్చిన కార్యక్రమాన్ని తమప్రాంతాలలో ప్రచారం చేయటంలో అమలు చేయటంలో బావమరిది వెంకటేశ్వరరావు తో కలిసి పనిచేశాడు. అప్పటి నుండి ఉప్పుసత్యాగ్రహం వరకు కాంగ్రెస్ రాజకీయాలతో కలిసి నడిచాడు. గాంధీ నాయకత్వాన్ని అభిమానించాడు. ఆరాధించాడు. గాంధీ ఆదర్శాలను, ఆచరణను సమకాలంలోనే కవిత్వంలో పాటలలో నమోదు చేసాడు.

వృత్తిగా పత్రికా రచన ఆయనకు ఇష్టమైన రంగం. భారతి , ఆంద్ర పత్రికల కోసం పనిచేశాడు. కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుకు ఆత్మీయుడైనాడు. అయన అప్పారావు ని అరబ్బీ నైట్స్ కథలు తెలుగులోకి చేయమని చెప్పాడు. అదే సమయంలో వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి కావ్యమీమాంస వ్రాయమని కోరాడు. అవిరాయటానికి, తాను అంతకుముందే ప్రారంభించిన వాయుసందేశం కావ్యం పూర్తిచేయటానికి, ఆంధ్ర రత్న ద్యుతులు వ్రాయటానికి సమయం దొరుకుతుంది కాదా అని, అలాగే తండ్రి గారి ఉద్దేశం మేరకు స్వగ్రామంలో పొలాలు చూసుకోవచ్చనుకొని మద్రాసు నుండి పటమట కు మకాం మార్చాడు బసవరాజు అప్పారావు. అక్కడ ఆయన సాహిత్య వ్యాసంగం అనుకొన్న ప్రకారం సాగింది. ఆంధ్రకవిత్వ రచనకు కూడా అక్కడే ప్రణాళిక సిద్ధమైంది.

1921 డిసెంబర్ లో బసవరాజు దంపతులకు ఆడపిల్ల పుట్టింది. మంగళప్రద ఆ బిడ్డ పేరు. పసిపిల్లగానే మంగళప్రద మరణం ఆ దంపతులను దుఃఖంలో ముంచివేసింది. ఇక పటమట లో ఉండలేక మద్రాస్ కు మకాం మార్చారు. మళ్ళీ అప్పారావు భారతి పత్రిక సహ సంపాదక బాధ్యతలు స్వీకరించాడు. కోలవెన్ను రామకోటేశ్వరరావు, అడవి బాపిరాజు మొదలైనవాళ్ల స్నేహ సాహిత్య సాంగత్యాలు కొనసాగినకాలం ఇది. ఐదారేళ్లకు వాళ్లకు మగశిశువు జన్మించాడు. వేదాద్రి నరసింహమూర్తి అని పేరుపెట్టారు. కానీ ఆ పిల్లవాడు కూడా దక్కలేదు. తండ్రిగారి ఆశయం దృష్టిలో పెట్టుకొని ఎప్పుడో వదిలేసిన లా విద్యను పూర్తిచేసి 1925 లో బెజవాడలో లాయరుగా ప్రాక్టీస్ ప్రారంభించాడు అప్పారావు. న్యాయవాదవృత్తి చేపట్టినా ఆయన ప్రవృత్తి మాత్రం కవితా గోష్ఠులు, సాహిత్య చర్చలు ,రచనా వ్యాసంగమే.

1921 లోనే అప్పారావు ఆంధ్రకవుల చరిత్ర పూర్తిచేసి ప్రచురణకై వావిళ్లవారికి ఇచ్చాడని, కానీ వాళ్ళు దానిని 1931 లో గానీ అచ్చువేయలేదని నొచ్చుకొన్నది రాజ్యలక్ష్మమ్మ. అరబ్బీ నైట్స్ ఆంధ్రపత్రికలో వచ్చాయి కానీ పుస్తకరూపంలో రాలేదని ,ఆంధ్రరత్నద్యుతులు 1963 లో అచ్చయిందని వాయుసందేశం వ్రాత ప్రతి దొరకక పోవటంవల్ల కొన్ని ఖండికలు మాత్రమే అచ్చు అయ్యాయి అని ఈ స్వీయ చరిత్ర వల్ల తెలుస్తుంది.
1932 లో అక్టోబర్ లో ఢిల్లీ లో ‘నేషనల్ కాల్’ అనే ఇంగ్లిష్ పత్రిక పెట్ట దలచి సహ సంపాదకులుగా పనిచేయటానికి యోగ్యులైన వారు కావాలని సహానీ అనే ఆయన ఇచ్చిన ప్రకటన చూసి అప్పారావుకు మళ్ళీ పత్రికా సంపాదకవృత్తిలోకి వెళ్లాలనిపించింది. కాశీనాధుని నాగేశ్వరరావు, సర్వేపల్లి రాధాకృష్ణన్ సలహా కోరాడు. వాళ్ళు ప్రోత్సహించి సిఫారసు ఉత్తరాలు కూడా వ్రాసి పంపారు. ఆ పదవికి దరఖాస్తు పెట్టటమే కాక సహానీ ని కలిసి మాట్లాడాలని ఢిల్లీ కూడా వెళ్ళాడు. అయితే మానసిక అనారోగ్యానికి గురై 1933 జూన్ 10 వతేదీన మరణించాడు.

కవిగా, గీతరచయితగా , గాయకుడిగా, అలంకార శాస్త్ర అధ్యయన శీలిగా ,సాహిత్య విమర్శకుడిగా, నాటకాభిమానిగా సాహిత్యకళాసాంస్కృతిక రంగాలలో ప్రతిభచూపి ప్రభావం వేసిన వాడుగా, పత్రికా సంపాదకుడుగా . న్యాయవాదిగా, . జాతీయోద్యమ రాజకీయాలలో భాగస్వామిగా బసవరాజుఅప్పారావు బహుముఖ ప్రజ్ఞను అభిమానంతో ఒకింత ఆరాధనతో ఈ స్వీయచరిత్రలో భాగం చేసింది రాజ్యలక్ష్మమ్మ. అధికార్ల సూర్యనారాయణరావు, నండూరి సుబ్బారావు, కురుగంటి సీతారామయ్య , రాయప్రోలు సుబ్బారావు, వింజమూరి రంగాచార్యులు, పాటిబండ అప్పారావు, పొన్నలూరి సూర్యనారాయణశర్మ, గంటి సూర్యనారాయణ శాస్త్రి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి ,చెన్నాప్రగడభానుమూర్తి, కట్టమనచిరామలింగారెడ్డి, అబ్బూరి రామకృష్ణారావు, గిడుగు రామ్మూర్తి , బ్యాంకుమిల్లి మల్లయ్య శాస్త్రి, వేలూరి శివరామశాస్త్రి, ఆచంట లక్ష్మీపతి రుక్మిణి దంపతులు, ఆచంట జానకిరామ్,దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నుండి సర్వేపల్లి రాధాకృష్ణన్ , షణ్ముగం శెట్టి, సి రంగయ్యర్ వంటి ఆర్ధిక రాజకీయవేత్తలతో ఆయనకు ఉన్న సన్నిహిత స్నేహ సంబంధాలు నిరూపించింది ఈ స్వీయ చరిత్ర.

2.2.2.జాతీయోద్యమ చరిత్ర
బసవరాజు అప్పారావు, రాజ్యలక్ష్మమ్మ ఇద్దరూ జాతీయోద్యమ చరిత్రతో కలిసి ప్రయాణం చేసినవాళ్లు. అందువల్ల రాజ్యలక్ష్మమ్మ స్వీయ చరిత్రలో జాతీయోద్యమ చరిత్ర విడదీయరాని భాగమైంది.” అప్పారావుగారు ఎఫ్ ఏ చదువుతున్న రోజుల్లోనే అంటే 1913 లో పూనా లో రాష్ట్రీయ సభ జరిగింది.అప్పుడే హోమురూల్ అనే మాట ఆ సభలోనే పుట్టింది. తిలక్ మొదలైన నాయకులంతా కలిసి స్వరాజ్యం కోసం ఏకగ్రీవంగా అలజడి చేశారు. చెన్నపురిలో అనిబిసెంట్ కూడా ప్రజల్లో చాలా చలనం గలిగించింది” అని జాతీయోద్యమ తొలిదశ సంచలనాల ప్రస్తావనతో ప్రారంభించి రచయిత్రి ఈ స్వీయచరిత్రలో జాతీయోద్యమ ఘట్టాలను అనేకం స్పృశించింది. 1916లో కర్ణాటక లోని బెల్గామ్ లో జరిగిన బాంబే స్టేట్ పొలిటికల్ కాన్ఫరెన్స్ లో తిలక్ ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని ప్రకటించాడు. కాంగ్రెస్ లో ఉంటూనే గాంధీ తదితరుల మితవాద వైఖరిని నిరసించాడు. స్వపరిపాలన లక్ష్యంగా హోంరూల్ ఉద్యమ నిర్మాణంలో ముందున్నాడు. మద్రాస్ లో అనిబిసెంట్ హోంరూల్ ఉద్యమ నాయకురాలు. మద్రాస్ లో చదువుకొంటున్న అప్పారావు ఆ రకంగా స్వరాజ్యఉద్యమ ప్రభావంలోకి వచ్చాడు.

ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అప్పారావుకు మిత్రుడు.మద్రాసులో ఉండగా ఆయన తరచు తమాయింటికి వచ్చినప్పటి సందడిని గుర్తుచేసుకొంటూ దేశభక్తి, జాతీయభావాలు కారణంగా రాజ మహేం ద్రవరం ప్రభుత్వ కళాశాలలోకానీ బండారు జాతీయ కళాశాలలోగానీ ఆయన స్థిరంగా ఉండ లేకపోయాడని అంటుంది రచయిత్రి. తిలక్ స్వరాజ్య ఉద్యమప్రభావం ఆయన మీద చాలా ఉందని, ఆయన ప్రభావం బసవరాజు జాతీయభావాలను రెచ్చగొట్టిందని పరిశీలనలో ఆమె గ్రహించింది.

‘బెజవాడ ఎ ఐ సి సి సమావేశం’ అనే శీర్షికలో తామంతా జాతీయోద్యమంలో భాగమైన తీరును వివరించింది రాజ్యలక్ష్మమ్మ. అది అఖిలభారత కాంగ్రెస్ సంఘ సమావేశం 1921 మార్చ్ 31 న జరిగింది. గాంధీ, మహమ్మదాలీ, షౌకతాలి లాలాలజపతిరాయ్ , మొథిలాల నెహ్రు,చింతరంజన్ దాస్ కేలాకర్ మొదలైన జాతీయనాయకులంతా అక్కడ సమావేశం కావటం గొప్ప ఉత్ప్రేరక ఘటన అంటుంది ఆమె. అప్పటికి చీరాల పేరాల పన్ను నిరసన ఉద్యమాన్ని ప్రారంభించి 15000 మంది స్థానిక ఆవాసులతో రామదండు అనే స్వచ్ఛంద సేవా దళాన్ని నిర్మించిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఐదారువేల రామ దండును తీసుకొని ఆ సభకు రావటాన్ని , లక్షలకొద్దీ జనం రావటాన్ని ప్రత్యక్షంగా చూసి చెప్పింది. ఆనాటి ఆంధ్రరత్న ద్యుతులే అప్పారావు భావనా ప్రపంచంలో ప్రతిఫలించి కావ్యంగా అవతరించిన విషయం పేర్కొన్నది.

బెజవాడ సమావేశం 1920 డిసెంబర్ లో జరిగిన నాగపూర్ కాంగ్రెస్ సమావేశాల తీర్మానాలను అనుసరించి జరిగినసహాయనిరాకరణోద్యమం అవలంబించి కోర్టులు, స్కూళ్ళు, కాలేజీలు, శాసనసభలు బహిష్కరించ వలసిందిగా , నిరాకరణ కార్యక్రమాన్ని దేశమంతా సాగించ వలసిందిగా పిలుపునిచ్చింది. ఈ పిలుపు తరువాత తమజీవితాలలో వచ్చిన పరిణామాలను వివరించింది రచయిత్రి. అప్పారావు గారికి తన అన్న వెంకటేశ్వర రావు కు గాంధీ మాట అంటే శిలాక్షరమేననని అందువల్లనే వాళ్ళు ఆచరణకు దిగారని చెప్తుంది. తానూ అప్పారావు, అన్న అందరూ ఆరోజు నుండీ ఖద్దరు వస్త్రాలనే ధరించటం మొదలు పెట్టినట్లు , ఇంట్లో అయిదు రాట్నాలు పెట్టి నూలువడకటం మొదలైందని, పటమట లో రాట్నం లేని ఇల్లే లేదని, ఇంట్లోవాళ్ల బట్టలకు సరిపడ నూలువడకటమే కాక హరిజననిధికి విరాళంగా శంకరలాల్ బ్యాంకర్ కు నెలకు రెండువేల గజాల నూలు వడికి పంపించేవాళ్ళమని చెప్పింది. అప్పారావు తన అన్న మద్య పానంవల్ల , విదేశీ వస్త్రాలమీద వ్యామోహం దేశానికి ఎంత హానికరమో ఉపన్యాసాలిస్తూ కల్లుముంతలు పగలగొట్టించటం, కళ్ళు పాకలు తగలబెట్టించటం వంటి పనులు చేయిస్తూ ఉండేవాళ్ళని, తన అన్న కాంగ్రెస్ సెక్రటరీ గా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ లో గాంధీ పర్యటన సందర్భాలలో ఆయన వెంట తిరుగుతుండేవాడని ఆమె చెప్పింది.
హరిజనులను అంటరానివాళ్లుగా చూస్తూ బావులలో నీళ్లు తోడుకోనీయక, గౌరవం గా జీవించే అవకాశాలను నిరాకరించే సమయంలో గాంధీ ఆదర్శాన్ని అందిపుచ్చుకొని అప్పారావు తన అన్న వూళ్ళో అందరినీ ఒప్పించి ఆ అనాచారాలను తగ్గించి హరిజనులు సమానమూ గౌరకారమూ అయినా జీవితాన్ని పొందటానికి , కలిసిమెలిసి బతకటానికి చేసిన కృషిగురించి చెప్పుకొచ్చింది రాజ్యలక్ష్మమ్మ. ఇంటి పురోహితుడు రావటం మానేసిన లక్ష్యపెట్టకుండా తన అన్న వేంకటేశ్వరరావు జాతీయోద్యమ ఆదర్శం కోసం నిలబడటాన్ని గురించి పేర్కొన్నది. సహాయనిరాకరణోద్యమంలో భాగంగా భూమి శిస్తుకట్టరాదని, కట్టకపోతే ప్రభుత్వం భూములను వేలానికి పెడితే ఎవరూ కొనకూడదని ఊరి వారందరినీ ఒప్పించి వాళ్ళు తీర్మానం చేయించిన సంగతి కూడా ఆమె చెప్పింది. పంజాబులో లాలాలజపతిరాయ్, గుంటూరులో కొండావెంకటప్పయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ , చీరాలలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య , రాజమండ్రిలో బులుసు సాంబమూర్తి , బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం, పాలకోడేటి గురుమూర్తి మొదలైనవాళ్లు నిర్వహించిన పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని తలచుకొన్నది.

గోపాలకృష్ణయ్య పన్నులు చెల్లించకుండా జీవించే ప్రత్యామ్నాయంగా ఇళ్ళు వదిలి ఊరి బయట పొలాల్లో పాకలు వేసుకొని జీవించే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూపించాడు. రాజ్యలక్ష్మమ్మ భర్తతో సహా వెళ్లి ఇసకపఱ్ఱలలో జీడిమామిడి చెట్ల నీడన పాకలతో కూడిన ఆ ఊరిని చూసి ఆనందించి వచ్చింది కూడా.గోపాల కృష్ణయ్య నాయకత్వం కింద అది ఒక చిన్న స్వతంత్ర రాజ్యంగా ఉందంటుంటుంది రచయిత్రి.
1922 సెప్టెంబర్ లో బరంపురంలో జరిగిన కాంగ్రెస్ సభకు రాజ్యలక్షమ్మ అప్పారావుతో కలిసి వెళ్ళింది. అప్పారావు బాల్యమిత్రుడు బరంపురంలో పెద్ద వకీలు అయిన గురజాడకృష్ణమూర్తిగారింట్లో బసచేశారు. వీళ్ళు అక్కడ ఉండటాన్ని బట్టి కాళేశ్వరరావు దంపతులు, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య , మాగంటి అన్నపూర్ణ, దువ్వూరి సుబ్బమ్మ మొదలైన వాళ్ళంతా అక్కడే దిగారని , కృష్ణమూర్తిగారు అక్క వెంకాయమ్మ గారు అందరిని ఆదరించి కావలసినవి అమర్చి పెట్టిందని రాజ్యలక్ష్మమ్మ చెప్పారు. ఆంధ్ర మహాజనసభకు గంపలగూడెం కుమారరాజా, కోటగిరివెంకట కృష్ణారావు, ఆంధ్రరాష్ట్రీయ సభకు పట్టాభి సీతారామయ్య అధ్యక్షత వహించారని పేర్కొన్నది. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఉపన్యాసాన్ని జనం హోరువానలో తడుస్తూ కూడా కదలకుండా కూర్చొని వినటాన్ని గురించి సంతోషంగా చెప్పింది. ఆ వానలో తడిసి ముద్దైన జనం కోసం , దిగుమర్తి వారు , వరాహగిరివారూ కొత్తబట్టల మూటలు తెప్పించి యిచ్చిన ఘటనను కూడా ఆమె ప్రస్తావించింది. అయితే అవి మిల్లు వస్త్రాలు కావటం వలన తామిద్దరూ, కాళేశ్వర రావు దంపతులు, గోపాలకృష్ణయ్య, ఉన్నవలక్ష్మీ బాయమ్మ, అన్నపూర్ణాదేవి వాటిని తీసుకోలేదని చెప్పింది. ఆ సభల సందర్భంలో గోపాలకృష్ణయ్యకు బరంపురంలో రెండు నెలలవరకు ఉపన్యాసం ఇయ్యరాదని నిషేధిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ప్రకాశం పంతులు, పట్టాభి సీతారామయ్య కొండా వెంకటప్పయ్య గాంధీ మాటగా దేశం సిద్ధంగా లేదు , కొన్నాళ్ళు శాసనోల్లంఘనం వద్దని వారించినా కలెక్టర్ నోరుమూసుకోమంటే మూసుకుంటానా అని శాసనోల్లంఘనకే సిద్ధపడి ఉపన్యాసాలు చేసిన విషయం రాజ్యాలక్షమ్మ నమోదుచేసింది. అందుకాయనను పోలీసులు అరెస్టు చేయటం శ్రీకాకుళం కోర్టు ఆయనకు ఏడాదిపాటు ఖైదు విధించటం, బరంపురం, తిరుచినాపల్లి జైళ్లలో ఆయనను ఉంచటం కూడా ఈ ఉపాఖ్యానంలో భాగమయ్యాయి.ఈ సందర్భంలోనే భట్టిప్రోలు సూర్యప్రకాశరావు కూడా ఇటువంటి ఉత్తర్వులను తీసుకొనటానికే నిరాకరించిన విషయం కూడా పేర్కొన్నది రచయిత్రి.

1923 డిసెంబర్ లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ సభకు రాజ్యాలక్షమ్మ భర్తతో , మామగారితో కలిసి వెళ్ళింది. గుమ్మిడిదల దుర్గాబాయమ్మ తో తొలి పరిచయం అక్కడే ఆమెకు. దుర్గాబాయమ్మతో పాటు పొణకా కనకమ్మ స్త్రీ స్వయంసేవా దళాలకు నాయకత్వం వహించి నడిపినతీరు చూసింది. దుర్గాబాయమ్మ ఉపన్యాసానికి ఆశ్చర్యపోయింది. అప్పటి నుండి దుర్గాబాయమ్మ, ఉన్నావా లక్ష్మీబాయమ్మ, ద్రోణంరాజు లక్ష్మీ బాయమ్మ ,రాయసం రత్నమ్మ ,కనుపర్తి వరలక్ష్మమ్మ మొదలైనవాళ్లతో కలిసి ప్త్రాతి కాంగ్రెసులో పాల్గొనటం,అనేక మహిళా సభలలో పనిచేయటం జరిగిందని చెప్పుకొన్నారు రాజ్యలక్ష్మమ్మ. వాళ్ళ స్నేహాలు, సంభాషణలు,కార్యకలాపాలు గురించి వివరించి ఉంటే జాతీయోద్యమంలో మహిళల పాత్రగురించి , మహిళాభ్యుదయానికి వాళ్ళు చేసిన దోహదం గురించి ప్రాధమిక వాస్తవ సమాచారం అందివచ్చేది.
మామగారు పక్షవాతం వచ్చి కోలుకొంటున్న తరుణంలో 1924 లో బెల్గామ్ లో జరిగిన కాంగ్రెస్ సభలకు వెళ్లటమెట్లాగా అనుకొంటున్నప్పుడు ఆయన సేవలకు ప్రత్యేకించి క్యాంబెల్ ఉన్నాడు, పైనుండి చూసుకోనటనానికి పెద్దవాళ్ళు తాము ఉన్నామని తనతల్లి, పినతండ్రి ఇచ్చిన భరోసాతో అప్పరావు, అన్నయ్య, తాను సభలకు వెళ్లిన విషయం ఇందులో చూస్తాం. తెల్లవారుఝామున దేశసేవికలు, సేవకులు ప్రభాతగీతికలు పాడుతూ కాంపుల చుట్టూ తిరిగటం ఇచ్చిన ఆనందాన్ని గురించి ప్రస్తావించింది రాజ్యలక్ష్మమ్మ.

ఉప్పుసత్యాగ్రహ ఘట్టం గురించి స్వీయచరిత్రలో వ్రాసింది రాజ్యలక్ష్మమ్మ. 1930 లో ఉప్పుసత్యాగ్రహ యాత్రను తలపెట్టిన గాంధీ చావో జయమో తేల్చుకొనిగానీ సబర్మతీ ఆశ్రమంలో తిరిగి అడుగుపెట్టనని దండియాత్ర కు నడక ప్రారంభించాడు. బెజవాడలో గంపలగూడెం కుమారా రాజా సత్యాగ్రహదళానికి నాయకత్వం వహించి బందరు సముద్ర తీరప్రాంతం వరకు నడిపించటం, మద్రాసులో దుర్గాబాయమ్మ సముద్రపు ఒడ్డున కుండలలో ఉప్పు వండించటం, గుంటూరులో ఉన్నవలక్ష్మీనారాయణ, కొండా వెంకటప్పయ్య ఇళ్లల్లోనే ఉప్పు వండటం మొదలైన విషయాలను పేర్కొని పోలీసులు విరుచుకుపడి కార్యకర్తలను లాఠీలతో మోది , వాళ్ళ ప్రయత్నాలను భంగపరచటం గురించి కూడా పేర్కొంది. బసవరాజు అప్పారావు, తన అన్నయ వెంకటేశ్వరరావు ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొనటం గురించి చెప్పింది. ఆ సందర్భంలో అప్పారావు వ్రాసిన అనేక గేయాలను ఆమె ఉటంకించింది.

రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గురించి కూడా రాజ్యలక్ష్మమ్మ ఈ స్వీయ చరిత్రలో ప్రస్తావించింది. మహాత్మాగాంధీ మదనమోహన్ మాలవ్యా వంటి మరికొందరు నాయకులు వెళ్లిన ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1931 లో సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు జరిగింది. మహాత్ముడు మీరాబెన్ ను వెంటతీసుకుపోవటాన్ని కూడా పేర్కొన్నది. ఆంతరంగిక కార్యదర్శిగా ఆమెకు ఉన్న ప్రాధాన్యతను వివరించింది. మాలవ్యా కోసం తాగటానికి బిందెలకొద్దీ గంగాజలం, గాంధీ తాగే పాలకోసం మేకను వెంట తీసుకువెళ్లటం గురించి పేర్కొన్నది.
బ్రిటిష్ ఇండియాలో రాజ్యాంగ సంస్కరణల గురించి , ప్రత్యేకించి మైనారిటీ హక్కుల గురించి, రాజ్యాంగ సభలో తగిన ప్రాతినిధ్యం గురించి ,దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల గురించి చర్చించిన ఈ సమావేశం లో అంబేద్కర్ దళితుల రాజకీయహక్కుల రక్షణకు దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలు కావాలని పట్టుబట్టాడు. దళితులు హిందూసమాజంలో భాగం అని భావించే గాంధీ దానితో విభేదించాడు. చర్చలలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ వైఫల్యాన్ని ఉత్తుత్తి పెళ్లి హడావుడిగా రాజ్యలక్ష్మమ్మ భర్త కవితను ప్రస్తావిస్తూ చెప్పింది.

ఉప్పుసత్యగ్రహం స్వరాజ్య సాధకం కాకపోవటం వల్ల గాంధీ శపథం ప్రకారం సబర్మతికి తిరిగి వెళ్ళ లేకపోయాడు. వార్ధా వర్తక ప్రముఖుడు సెట్ జమునాలాల్ బజాజ్ ఆయనను ఆహ్వానించాడు. వార్దకి ఆరుమైళ్ళదూరంలో గ్రామాన్ని సేవాగ్రామ్ అని పేరుపెట్టి ఆశ్రమాన్ని ఏర్పరచుకున్నాడు. సేవాశ్రమం చూసి గాంధీతో గడపటానికి అప్పారావు దంపతులు వెళ్లారు. ఆశ్రమ కుటీరాలు, ఆఫీసులు మొదలైన వాటితో పెద్ద వ్యవస్థగా అభివృద్ధి చెందిన ఆశ్రమాన్ని పాఠకులకు పరిచయం చేసింది రాజ్యలక్ష్మమ్మ. భర్త మరణాంతరం మనశ్శాంతికి కొన్ని సంవత్సరాలు వార్ధాలో మహాత్ముని దగ్గర ఉండి జీవితం గడిపింది. గాంధీ హత్యవరకూ ఆమె అక్కడే గడిపినట్లు భావించవచ్చు.

2.2.3. యాత్రాచరిత్ర
ఈ స్వీయ చరిత్రలో భర్త బసవరాజు అప్పారావు తో కలిసి రాజ్యలక్ష్మమ్మ చేసిన దేశాటన ఒక భాగం. ప్రయాణవివరాలు, ఆయా ప్రాంత పౌరాణిక చారిత్రక ప్రాధాన్యతలు, విశేషాలు, ప్రకృతి సౌందర్యం మొదలైన వాటిని వివరిస్తూ చేసిన రచన దీనిని ఒక యాత్రాచరిత్రగా కూడా బాసింపచేస్తుంది. యాత్రాచరిత్ర స్వీయచరిత్రలో ఎంత సహజ మైన భాగమో నిరూపిస్తుంది.

1924 లో బెల్గామ్ కాంగ్రెస్ సభలకు వెళ్ళినప్పుడు అటునుండి హంపీ, విజయనగరం చూసుకొని వచ్చారు. హాస్ పేట నుండి కమలాపురం వరకు బళ్ల మీద అక్కడినుండి కాలినడక ప్రయాణం. హంపీ లో ఒకేరాతిలో చెక్కిన రథం, నరసింహమూర్తి విగ్రహం, సప్తస్వరాలు పలికే స్తంభాల మంటపం మొదలైనవి చూస్తూ అప్పారావు ఎంత పరవశించిపోయాడో చెప్తారామె. తుంగబద్ర దాటి ఆనెగొంది వెళ్ళటం, పంపా సరోవరం చూడటం ,తుంగభద్ర స్నానాలు, విరూపాక్షస్వామి దేవాలయ దర్శనం మొదలైన వాటిని చెప్తూ ఒకప్పుడు మహానగరంగా వెలిగిన హంపీ చుట్టూ రేగుచెట్లు, అత్తిచెట్లూ ఎక్కువగా ఉన్న దట్టమైన అడవి పొదలు వ్యాపించిఉండటాన్ని పేర్కొన్నది. మళ్ళీ హాస్ పేటకు వెళ్లి అక్కడి నుండి బళ్ళారి, హుబ్లీ , ధార్వార్ చూసి ఇల్లుచేరినట్లు చెప్పింది.

ఆ తరువాత ఐదునెలలకు అంటే 1925 మే లో అప్పారావు తండ్రి మరణించాడు. కర్మకాండలు ముగిశాక అస్థికలు గంగలో కలపటానికి కాశీయాత్ర చేశారు. ఆ యాత్రా విశేషాలను వివరించే సందర్భంలో ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రా చరిత్ర ను ఆమె ప్రస్తావించింది. బెజవాడనుండి కలకత్తాకు అక్కడినుండి కాశీకి వాళ్ళ ప్రయాణం. బెజవాడ నుండి కలకత్తా రైలు మార్గంలో చీపురుపల్లి స్టేషన్ లో పెసరట్ల ప్రత్యేకత , ఖుర్దా రోడ్ బరంపురం రైల్ స్టేషన్ల మధ్య రంభా స్టేషన్ దగ్గరకు రాగానే మధ్య చిలకా సరస్సు సౌందర్యాన్ని తలచుకొంటూ రంభ మొదలైన అప్సరస స్త్రీలు వచ్చి ఆ సరస్సులో స్నానమాడతారన్న జనశ్రుతిని ప్రస్తావిస్తుంది.

ఆ రైలు ప్రయాణంలో పరిచయమైన బెంగాలీ దంపతుల గురించిచెప్తూ ఆయన బెంగాలీభాషలో గొప్ప రచయిత అని చెప్పింది. ఆయనను బెంగాలిబాబు అని వ్యవహరించింది కానీ పేరు ఎక్కడా పేర్కొనలేదు. ఆయనభార్య చారులత అని మాత్రం చెప్పింది. అప్పారావుకు ఆయనకు స్నేహం కుదిరి దారిపొడుగునా సాహిత్య సంభషణలతో గడిచిందని ఆ స్నేహంతో కలకత్తాలో తమ ఇంట్లోనే దిగాలి అన్న వాళ్ళ మాటను తీసెయ్య లేకపోయామని చెప్పింది. అయితే బెంగాలీ బ్రాహ్మణులు చేపలు వండుకు తింటారుగనుక వాళ్ళింట్లో భోజనం చేయటానికి సందేహించామని, అక్కడ ఉన్నన్నాళ్ళు బయట అయ్యరు హోటల్లో భోజనం చేసి వచ్చామని చెప్పిన విషయం ఆహారసంస్క్రుతి ఎంత బలమైనదో సూచిస్తుంది.

నానాదేశాల మనుషులతో నిండిన కలకత్తా నగర ప్రత్యేకతను చెప్పి మ్యూజియం, నేషనల్ లైబ్రరీ , బొటనికల్ గార్డెన్స్, జూ , సరస్సులు, కాళీ దేవాలయం, దక్షిణేశ్వర్, బేలూరు =రామకృష్ణ మఠం అన్నీ అప్పారావు గారు చూపించారని చెప్పింది. ఆ సమయంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ కలకత్తా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా ఉన్నాడని , మద్రాసు చదువుల రోజుల్లో అప్పారావు కు ఆయన కు ప్రియా శిష్యుడని అందువల్లనే తాము ఆయనను చూడటానికి వెళ్లామని ఆయన ఎంతో సంతోషించి ఆతిధ్యం ఇచ్చిన విషయం కూడా చెప్పింది.
కలకత్తా నుండి కాశీకి పాట్నా మీదుగా ఒక దారి గయమీదుగా మరొకదారి ఉన్నాయని ఇవి అసొం సోల్ ( అది ఖనిజ వనరుల ప్రాంతం అని కూడా పేర్కొన్నది) దగ్గర చీలి మొఘల్ షరాయి దగ్గర కలుస్తాయని తాము పాట్నామీదుగా కాశీ వెళ్ళమని చెప్తూ పాట్నానగర ప్రాచీనతను , సమీపంలోని నలందా విశ్వవిద్యాలయ ఔన్నత్యాన్ని ప్రశంశించింది. గంగానదిపొడుగునా ఎత్తైన మేడలా వరుసలతో, దేవాలయాల గోపురాలతో వీటన్నిటిమధ్య ఔరంగజేబు కట్టించిన మసీదు మినార్లు ( స్తంభాలు) ఎత్తుగా ఉన్నతంగా కనిపిస్తూ , గంగానది స్నానఘట్టాలతో మెట్ల వరుసలతో వారణాశి నగరాన్ని వర్ణించింది. బ్రహ్మనాళంలో మామగారి అస్థికలు కలిపి పంచక్రోశయాత్ర చేశామని చెప్పి ఆ యాత్ర ప్రత్యేకతను వివరించింది. కాశీకి ఉత్తరాన వరుణ నది దక్షిణాన అస్సీ నది మధ్య ఏర్పడిన నగరం ఆ రెండు నదుల పేరుమీద వారణాసి అయిందని చెప్పి అస్సీనది ఘట్టం నుండి వరుణ నది ఘట్టం వరకు గంగానదిలో పడవ ప్రయాణం చేస్తూ హర్షచంద్ర,దశాశ్వమేధ,మణికర్ణిక మొదలైన ఘట్టాల్లో ఆగుతూ స్నానాలు చేయటం కాశీ ప్రదక్షిణ అవుతుందని పేర్కొన్నది.

కాశీలో లింగం పానవట్టం మీద కాకుండా కింద పాలరాతికుండలో గర్భగుడిలో ఒక మూలగా ఉంటుందని చెప్పి గొప్ప విద్యా సాంస్కృతిక కేంద్రంగా కాశీకి ఉన్న ప్రాశస్త్యాన్ని వివరించింది. వేదవేదాంగ పండితులకు, సాహిత్య చర్చలకు నిలయం అని, గయలో బోధివృక్షం కింద జ్ఞానోదయం అయ్యాక బుద్ధుడి మొదటి బోధ కాశీ దగ్గర మృగదావంలో జరిగిందని కాశీ పండితులు బుద్ధుడిని ఆహ్వానించారని అదే సారనాధ్ గా బౌద్ధుల యాత్రాస్థలం అయిందని, దక్షిణాది నుండి వచ్చి అద్వైతమతప్రచారం చేసిన శంకారాచార్యుడిని కాశీ ఆదరించిందని రామ్ రహీములు ఒక్కరే అన్న కబీర్ అక్కడ గౌరవాదరాలు పొందాడని చెప్పి భిన్న మతోద్వేగాల కూడలిగా కాశీకి ఉన్న లౌకిక స్వభావాన్ని రాజ్యాలక్షమ్మ గుర్తించి చెప్పటం విశేషం.
త్రివేణి సంగమ స్నానాలు, దైవ దర్శనాలు, కర్మకాండలు ఎంత శ్రద్ధగా చేస్తారో అంతకన్నా ఎక్కువగా లౌకిక జీవన సమస్యలకు, మానవ సంబంధాలకు ప్రాధాన్యంఇయ్యటం రాజ్యలక్ష్మమ్మ దంపతులలో విశేషం. వెళ్లిన చోటల్లా మిత్రులు ఎవరున్నారా అని వెతికి కలవటం , వాళ్ళతో గడపటం వాళ్లకు చాలా ఇష్టం విజయనగరానికి చెందిన సర్ చిర్రావూరి యజ్ఞేశ్వర చింతామణి ( సి వై చింతామణి ) ప్రముఖ పత్రికా సంపాదకుడు. ఆయన అప్పుడు అలాహాబాదులో ఉన్నాడు. అప్పారావు దంపతులు వాళ్లింట్లోనే బస చేశారు. ఆయన వీళ్ళను ఆనందభవన్ కు తీసుకువెళ్లి నెహ్రు ను పరిచయం చేసాడు. కమలానేహ్రూ , స్వరూపరాణి తమకు ఫలహారాలు పెట్టి చక్కని అతిధి మర్యాద చేశారని రాజ్యాలక్షమ్మ చెప్పుకొచ్చింది. అట్లాగే మహిళా విద్యాపీఠానికి వెళ్లి కవయిత్రి మహాదేవి వర్మనూ కలిసి ఆమె కవితలు విన్నారు. గయలో పితృ శ్రాద్ధం పెట్టి వటవృక్షం కింద తినే ఇష్టమైన కాయగూరలు, పండు వదిలి అయోధ్యకూడా చూసి కలకత్తాకు చేరుకున్నామని, బెంగాల్ బాబు ఇంట్లోనే ఆతిధ్యం తీసుకున్నామని చెప్పింది.

బెంగాలీబాబు వాళ్ళను శాంతినికేతన్ కు తీసుకువెళ్లాడు. వీళ్ళు వెళ్లేసరికి అక్కడ వర్షమంగళ ఉత్సవం జరుగుతున్నది. వర్షాకాలానికి ఆహ్వానం పలకటం ఆ ఉత్సవ పరమార్ధం. విచిత్ర అనే నాట్యశాలలో వర్షఋతువుకు సంబంధించి రవీంద్రుని రచనలు పాడుతూ శాంతినికేతన్ బాలబాలికలు హావభావాలతో నాట్యం చేస్తుంటే బెంగాలీభాష రానివాళ్లకు కూడా చక్కగా అర్ధమై చిటపట చినుకులు పడుతున్నట్లు ఇంపుగా ఉంటుందని ఆనాటి అనుభవాన్ని వర్ణించింది రచయిత్రి. అక్కడ ఉన్న మూడురోజులు సభలూ సమావేశాలూ, స్నాతకోత్సవాలూ నిర్వహించే ఆమ్రకుంజం వేదిక మీద అప్పారావు తనగేయాలు ఆంగ్లంలోకి అనువదించి ఠాకూర్ కి వినిపిస్తూ సంతోషంగా గడిపాడని చెప్పింది. అయితే ఆయనకు బెంగాలీ భోజనం నచ్చలేదని కూడా చెప్పింది. దేశబంధు చింతరంజన్ దాస్ ( బెంగాలీ స్వాతంత్ర్య పోరాట యోధుడు) అనారోగ్యంతో డార్జిలింగ్ లో ఉన్నాడని తెలిసి చూడటానికి కలకత్తానుండి సిలిగురి ఘాట్ మీదుగా రైలు మార్గంలో డార్జిలింగ్ కు వెళ్లారు. డార్జిలింగ్ ప్రకృతి సౌందర్యం ఆమెను బాగా ఆకర్షించింది. వాళ్ళు వెళ్లి చూసిన రెండురోజులకే (1925 జూన్ 16) ఆయన మరణించాడు. చివరికర్మలు కలకత్తాలో జరుగుతుంటే వాటికి హాజరై బెజవాడకు తిరుగుప్రయాణం అయ్యారు.

రాజ్యలక్ష్మమ్మ దంపతులు చేసిన శ్రీశైల యాత్ర కాలం ఏమిటో చెప్పలేదు కానీ శివరాత్రి కి అక్కడ ఉండాలనుకొని వెళ్ళాము అని చెప్పింది శ్రీశైల యాత్ర వర్ణన ఒక చరిత్రను తెలుసుకొంటున్నట్లుగా ఆసక్తికరంగా ఉంటుంది. బెజవాడ నుండి మార్కాపురం వెళ్లి అక్కడినుండి రెండెడ్ల బండిలో ప్రయాణిస్తూ మూడురోజులు మూడుచోట్ల (తోకపల్లి – దోరణాల -ఫారెస్ట్ బంగాళా- ) బస చేస్తూ పెద్ద చింతలకు చేరటం ఒక మజిలీ. అక్కడినుండి కాలినడక ప్రయాణం. కూలివాళ్ళ నెత్తిన సామానుపెట్టి కొండవాగుల సౌందర్యం , అడవి సౌందర్యం అనుభవిస్తూ చేసే ప్రయాణంలో భయం లేకుండా దారిపొడుగునా కాపాడుతూనే ఉన్నదుకు మజిలీ మజిలీలో చెంచులకు రుసుము చెల్లించాలని దానిని ‘మెట్టులు’ అంటారని రాజ్యలక్ష్మమ్మ చెప్పిన విషయం ఆడవి ఆదివాసీలదేనని, అడవిదారులపై హక్కు వాళ్లకు ఆలా సహజంగా సంక్రమించిందని అడవికే కాదు అడవిదారులలో ప్రయాణించేవాళ్లకు కూడా రక్షకులుగా వాళ్ళు గొప్ప బాధ్యతను నిర్వహిస్తున్నారని ఎరుక పరుస్తుంది.

శిఖరేశ్వరం దర్శించి శ్రీశైలం చేరుకునేసరికి అప్పటికే అక్కడికి భార్యతో సహా వచ్చిన అప్పారావు స్నేహితుడూ హైదరాబాద్ జాగీర్దారు , కాంగ్రెస్ కార్యకర్త అయిన ధర్మవీర్ రామచంద్ర వామన్ నాయక్ కలిసాడు. ఎత్తయిన కొండమీద తమకోసం ఏర్పాటుచేసుకున్న కుటీరం పక్కనే వీళ్లకు ఆకులతో మరొక కుటీరం ఏర్పాటుచేయించాడట. శ్రీశైలం మల్లిఖార్జునుడు జనసామాన్యానికి మల్లయ్య. నానా యాతనపడుతూ అడవులు దాటుతూ కొండలెక్కివచ్చే భక్తులు “ చెడుకో మల్లయ్య చెవిటి మల్లయ్య” అని ఎలుగెత్తి అరుస్తూ నడుస్తుంటారు. చెవిటిమల్లయ్యకు వినబడేట్లు పాడాలి అంటూ అప్పారావును కోరి మరీ ఇష్టం గా పాటలు పాడించుకొని విన్నాడట వామన్ నాయక్ . శివరాత్రి రోజు పాతాళగంగలో స్నానం చేసి దైవదర్శనాలు, అభిషేకాలతో అప్పారావు ఆ రోజంతా పారవశ్యంలో ఉన్నాడని రాజ్యలక్ష్మమ్మ చెప్పింది. భీముడి కొలను మీదుగా శ్రీశైలం కొండా దిగామని చెప్తూ ఆమె అరణ్యవాసకాలంలో ధర్మరాజు దాహం అవుతున్నదంటే భీముడు గదతో కొడితే ఆ కొలను ఏర్పడిందన్న జనశ్రుతిని పేర్కొన్నది. ఓంకారం, మహానంది చూసుకొని ఇంటికి తిరిగివచ్చినట్లు చెప్పింది.

ప్రతి వేసవిలో రాజ్యలక్ష్మమ్మ దంపతులకు ఊటీ వెళ్లి ఉండటం అలవాటు. కాశీ నుండి తిరిగివచ్చిన కొత్తల్లోనే అప్పారావుకు ముఖ్యస్నేహితుడు, ఇంగ్లాండ్ వెళ్లి ICS పాసై దేశానికి తిరిగివచ్చి కలెక్టర్ అయిన సెంగోడియన్ పెళ్ళికి కోయంబత్తూరు వెళ్ళవలసి వచ్చింది. వేసవి కాలపు ఊటి వర్షాకాలంలో ఎలా ఉంటుందో చూడాలనిపించి అటునుండి ఊటీకి వెళ్లారు వారం రోజులు అక్కడఉన్నారు. మేఘాలు ఇల్లాల్లోకి చొరబడుతున్నట్లుగా ఉండే దృశ్యం చాలా బాగుంటుందని, చలిబాధ తట్టుకోనటం మాత్రం కష్టమేనని అంటుంది రాజ్యలక్ష్మమ్మ. మరొకసారి వేసవిలో వూటీవెళ్లి నెలవున్న తరువాత వర్షాలు కురుస్తుంటే ఆ చలి భరించలేక బెంగుళూరు వెళ్లిన సంగతి కూడా చెప్పింది. బెంగుళూరు సమీపంలో నందికొండల మీద గాంధీ మహాత్ముడు విడిది చేసి ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్లారు. మహాత్ముడి సన్నిధిని, సంభాషణలను, నందికొండ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ గడిపిన రోజుల సంతోషాన్ని గురించి రాజ్యలక్ష్మమ్మ చెప్పింది. గాంధీ తో ప్రత్యక్ష పరిచయం అప్పుడేనని కూడా చెప్పింది. కస్తూరిబాతో , మీరాబెన్ తో పరిచయాలను గుర్తుచేసుకొన్నది.

నందికొండ నుంచి బెంగుళూరు వచ్చి అక్కడనుండి వాళ్ళు కోలారు వెళ్లారు. కోలారు బొగ్గుగనులపై అధికారి చెరుకుపల్లి సూర్యనారాయణరావు అప్పారావుకు మనచిస్నేహితుడు. ఆయన ఆహ్వానం మేరకు బనగారు గనులు చూసిరావటానికి వెళ్లారు. సూర్యనారాయణ లిఫ్ట్ ద్వారా రెండువేల అడుగులకిందికి భూమిలోకి తీసుకువెళ్లి బనగారం తవ్వేచోటు , మట్టి పైకి పంపేవిధానం,ఆ మట్టిని కడిగి అందునుండి బంగారం తీసే పద్ధతిని, దానిని పాదరసం మొదలైనవాటితో శుద్ధిచేసి కరిగించి అచ్చులుపోయటాన్ని గురించి, మేలిమి బంగారానికి రాగి కలిపి కాసులుగా పోయటం గురించి ఆయన వాళ్లకు వివరించాడని ఆమె చెప్పింది. గాఢాంధకారంగా ఉండే భూమి లోతుల్లోకి గాలి పంపిస్తారని , అది చాలా వేడిగా ఉంటుందని డాక్టరు గుండెపరీక్షచేసి సర్టిఫికెట్ ఇస్తే తప్ప గని లోకి దిగటానికి అనుమతి ఉండదని రాజ్యలక్ష్మమ్మ చెప్పిన విషయం బంగారు గనికార్మికుల పని ప్రదేశాలు, పరిస్థితుల గురించి మనలను ఆలోచింప చేస్తాయి.
సేవాశ్రమం చూడాలని వార్ధా వెళ్లిన రాజ్యలక్ష్మమ్మ దంపతులు అటునుండి ఉత్తరదిశ యాత్ర చేశారు.ఈ యాత్రాకాలం ఏమిటో ఎక్కడా సూచించలేదు రచయిత్రి. వార్ధా నుండి నాగపూర్ మీదుగా ఇటార్సీ వెళ్లారు . నాగపూర్ ఇటార్సీ లమధ్య రైలుమార్గంలో ని పర్వతాలను , మహారణ్యాలను, పెద్దపెద్ద సొరంగాలను, లోయలను, లోయలోని టేకుచెట్ల చివర్లను ,లోయలో అటూఇటూ పరిగెత్తే లేళ్ళగుంపులను వాళ్ళు బాగా ఆనందించారు. ఇటార్సీ నుండి జబల్పూర్ వెళ్లి అక్కడ హిందీకవయిత్రి సుభద్రకుమారి చౌహాన్ ఇంట్లో బస చేశారు. చౌహాన్ దంపతులు గాంధీ అనుయాయులు. ఆయన పిలుపుకు జాతీయోద్యమంలో పాల్గొని అనేకసార్లు జైలుకువెళ్లారు. అది వాళ్ళ మధ్య స్నేహ సూత్రం.చౌహాన్ దంపతుల ఇల్లు నర్మదా నది ఒడ్డు న ఉంటుంది ప్రవాహ ఉదృతి ఎక్కువ కావటం వల్ల స్నానాలకు అనుకూలం కాదు అంటుంది రాజ్యలక్ష్మమ్మ. జబల్పూర్ కు కొన్నిమైళ్ళ దూరంలో జలపాతాలు అనేకం ఉన్నాయని వాటిలో ధూంపాధార పెద్దదని , నర్మదానదిలో పడవప్రయాణంలో రెండువైపులా ఎత్తైన తెల్లని బలపపు రాతి కొండలు చూడముచ్చటగానూ అదే సమయంలో భయంకరంగానూ కూడా ఉంటాయని అంటుంది రాజ్యలక్ష్మమ్మ. జబల్పూర్ నుండి మధురా బృందావనం వెళ్లారు. అక్కడి నుండి ఆగ్రా వచ్చి తాజ్ మహల్ చూశామని , షాజహాన్ ముంతాజ్ లప్రేమ చిహ్నాన్ని చూచి పరవశించిన ఆ సందర్భం నుండే “ మామిడిచెట్టును అల్లుకొన్నదీ/ మాధవీలతొ/ ఏమారెండింటి ప్రేమ సంపద” అనే అప్పారావు గారి ప్రసిద్ధ లలితగీతం పుట్టిందని వ్రాసింది రచయిత్రి. ఆగ్రా ఫోర్ట్ స్టేషన్ నుండి బాంబే బరోడా మరియు సెంట్రల్ ఇండియా రైలు మార్గంలో ( బి బి & సి ఐ ) ప్రయాణించి రాజస్థాన్, జయపూర్ , ఉదయపూర్ , బీజాపూర్, బాందీకు, ఈసాబాద్ ,రేవడి, పువేరా మొదలైన ప్రాంతాలు తిరిగివచ్చామని చెప్పింది.

రాజ్యలక్ష్మమ్మ బసవరాజు అప్పారావు తో కలిసి చేసిన ఆఖరి ప్రయాణం ఢిల్లీకి. 1932 లో ఒక ఆంగ్ల దినపత్రికలో సంపాదకులుగా చేరాలన్న ప్రయత్నంలో పత్రికాధిపతి సహానీ ని కలవటానికి వెళ్లిన అప్పారావుతో పాటు రాజ్యాలక్షమ్మ ఆమె తమ్ముడు రామారావు ఉన్నారు. పత్రిక పనిలోకి తీసుకొంటానని కానీ అది ప్రారంభం కావటానికి కొంత సమయం పడుతుంది అని సహానీ చెప్పిన మీదట ఢిల్లీలోనే ఉండిపోవటానికి నిర్ణయించుకొని జంతర్ మంతర్ దగ్గర ఒక ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. ఆ సందర్భంలో రాజ్యలక్ష్మమ్మ ఢిల్లీ కి ఉన్న సుదీర్ఘచరిత్రను, హిందూ ముస్లిములు ఇరుగుపొరుగు వాళ్ళుగా ఉండటం, ఇరుమతాల వారి కళాఖండాలూ, సంస్కృతులు పక్కపక్కనే వెలసి మనుగడలో ఉండటం గురించి చెబుతూ ‘కుతుబ్మినార్, లాల్ ఖిల్లా, తాజమహల్ మొదలైన స్మృతి చిహ్నాలు ఎన్నో హిందూ ముస్లిం అనే భేదం లేకుండా భారతీయుల కళావశేషాలుగా మిగిలి ఉండిపోయినయ్’ అనటంలో మతప్రసక్తిలేని లౌకిక జీవిత విలువను భారతదేశ ఆత్మగా ఆమె భావించటంకనబడుతుంది. “ఆ తర్వాత హిందూ సామ్రాజ్యమూ లేదు. మొగల్ సామ్రాజ్యమూ లేదు. ఈ రెండు సామ్రాజ్యాలనీ కూడా బ్రిటిష్ సామ్రాజ్యం మ్రింగివేసింది.” అన్న రాజ్యలక్ష్మమ్మ మాటల్లోని విషాదజీరలో ఆర్ధిక ప్రయోజనాలు, రాజకీయ అధికార కాంక్ష పెనవేసుకున్న సామ్రాజ్యవాద శక్తులపట్ల నిరసన ధ్వనిస్తుంది.

2.2.4 రాజ్యలక్ష్మమ్మ జీవితం

“పూర్వజీవితము యొక్క స్మృతులే నా ప్రస్తుత జీవిత యాత్ర” రాజ్యలక్ష్మమ్మ ముందుమాట ముగింపులో చెప్పిన మాటలివి.పూర్వ జీవితం అంటే భర్తతో కలిసి జీవించిన కాలం. అది 1933 జూన్ లో భర్త మరణం వరకు. ఆ తరువాత మూడుదశాబ్దాలకు (1965 -1933 = 32) వ్రాసిన రచన ఇది. ఈ మూడు దశాబ్దాలుగా బసవరాజు అప్పారావుతోటి జీవిత స్మృతులే జీవితంగా ఆమె జీవిస్తున్న దన్నమాట.అలాంటప్పుడు ఈ స్వీయచరిత్రలో రాజ్యలక్ష్మమ్మ జీవితం మౌలికంగా ఏమిటి అన్నది ఎంతవరకు ప్రతిఫలించింది అన్నది పరిశీలించవలసిన ప్రశ్నలు.

ఇందులో ఆమె తాను పుట్టిన సంవత్సరం , నెల తేదీ ఏవీ చెప్పలేదు. 1904 లో పుట్టినట్లు ఇతరత్రా దొరుకుతున్న సమాచారం. రాజ్యలక్షమ్మగారి తాతయ్య గోవిందరాజు వెంకట్రామయ్య. నాయనమ్మ వరలక్ష్మమ్మ. ఆయనకు అయిదుగురు కొడుకులు. నలుగురు కూతుళ్లు. రాజ్యలక్ష్మమ్మ తండ్రి బాలాజీరావు తాతా నాయనమ్మల అయిదుగురు మగసంతానంలో నాలుగవవాడు. రాజ్యలక్ష్మమ్మ తల్లి రంగమ్మ. రాజ్యాలక్షమ్మకు అన్న వెంకటేశ్వర రావు, తమ్ముడు రామారావు , చెల్లెలు ఉన్నట్లు ఈ స్వీయచరిత్రను బట్టి తెలుస్తున్నది. అన్న వేంకటేశ్వరరావు బసవరాజు అప్పారావు మంచి స్నేహితులని, జాతీయోద్యమ కార్యక్రమాలలో వాళ్లిద్దరూ కలిసి పనిచేశారని చాలా సందర్భాలలో చెప్పింది. రామారావు గురించి వివరాలేమీ లేవు. చెల్లెలి పేరు ప్రస్తావనకు రాలేదు.

విజయవాడకు మూడుమైళ్ళ దూరంలో వున్న పటమట వారి స్వగ్రామం. ఆంజనేయస్వామిగుడి, దానిని ఆనుకొని ఉన్న జమ్మిచెట్టు, కాస్తదూరంలో ఉన్న మంచినీళ్ళ బావి ఆ ఊరి ప్రత్యేక గుర్తులని చెప్తుంది రచయిత్రి. మంచినీళ్లకోసం బావిదగ్గరకు వచ్చే స్త్రీలకు జమ్మిచెట్టు నీడ కూర్చొని కష్టసుఖాలు వెళ్లబోసుకొనే వేదిక అవుతుంటుందని కూడా చెప్పింది. లంకంత మండువాయిల్లు, చుట్టూ ఖాళీ స్థలం ,యెడ్ల సావిళ్ళు, వడ్ల దంపుళ్ళ సావిళ్ళు, దొట్లో వేపచెట్లు , దబ్బా, నారింజ, నిమ్మ మొదలైన చెట్ల మధ్య గడిపిన బాల్యం ఆమెకు ఇష్టమైనది. అతిథి అభ్యాగతుల సందళ్ళతో నిత్యోత్సవంగా ఉండే తమ ఇంటితో పెనవేసుకున్న ప్రేమబంధం ఆమె వర్ణనలలో వ్యక్తమవుతుంది.

మేనత్త పిల్లలు బసవరాజు అప్పారావు, అతని అక్క, తమ పెత్తండ్రి పినతండ్రి సంతానమంతా కలిసి పెరగటాన్ని గురించి రాజ్యలక్ష్మమ్మ చెప్పిన విశేషాలు 1900 తొలిదశకపు గ్రామీణ బ్రాహ్మణకుటుంబ జీవన సంస్కృతిని ప్రతిఫలిస్తాయి. మేనత్త మేనమామ పిల్లలు అందరూ కలిసి పాతిక మందివరకు ఉదయం పూట ఆవకాయ, పెరుగుతో చద్దన్నాలు తినటం, అందరినీ కూర్చోపెట్టుకొని తాతయ్య కథలుచెప్పటం,అందరూ కలిసి అప్పుడప్పుడు ఇంటికి దక్షిణాన బందరు కాలువకు ఆవల ఉన్న ఎనమలకుదురు రామలింగేశ్వర స్వామి కొండఎక్కి ఆడుకొనటం, కొండమీద నుండి చూస్తే కనబడే కృష్ణానది కలిగించే ఆనందం మొదలైనవాటిని చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంలో నాయనమ్మ గురించిన ఆమె కథనం ఆసక్తికరమైనది. పేదసాదలను కనిపెట్టుకొని ఉండే నాయనమ్మ తత్వాన్ని గురించి చెప్తూ తల్లిలేని హరిజనబాలిక పోషణకు ఆమె చొరవతీసుకుని చేసిన ఏర్పాట్లు, పెళ్లిచేసి ఇంటి ఆడబిడ్డకు పెట్టినట్లుగా పాపడిబొట్టు, సూర్యుడు, చంద్రుడు , చేతికి గోట్లు, చెవులకు బావిలీలు, ముక్కుకు బులాకీ మొదలైన నగలు, సారె పెట్టి పంపిన సంగతిని పేర్కొన్నది. ఆమె చేసే వంటల రుచి, మధ్యాహ్నం పూట కుచ్చల కథ, లంకాయాగం, పాముపాట పాడే ఆమె అభిరుచి ఎంతోమంది మన్ననలను అందుకొన్న విషయం గర్వం గా వివరించింది.

గ్రామస్థులు పండించిన పంట, పోషణచేసి సాధించిన పాడి నుండి తనవంతు జీవనభృతికి వేతనంగా పొందుతూ వూళ్ళోనే నివాసం ఏర్పరచుకొన్న పంతులు రామచంద్రయ్య నడుపుతున్న ఆనాటి వీధిబడి వ్యవస్ధగురించి, బోధనాంశాలగురించి, బోధించే పద్ధతి గురించి,ఈ రచనలో ఇయ్యబడిన పూర్తి వివరాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.” యిప్పటిలాగే చదువుకున్నవాళ్లంతా ఒక తరగతిగా ఏర్పడి కేవలం ఉద్యోగాలకు మాత్రమే అర్హులుగానూ ఇంకెందుకూ కొఱగానివాళ్ళ లాగా తయారుచేసేటట్టుగ వుండేవి గావు ఆ నాటి చదువులు” అని ఆమె చేసిన వ్యాఖ్య ఆలోచింప దగినది. వీధిబడులు మగపిల్లలకోసమే .. ఆడ పిల్లలకు చదువులెందుకు అనుకొంటున్న కాలంలో అప్పారావుతో, అన్నగారితో పాటు తాను, తనచెల్లెలు, అప్పారావు అక్క కూడా వీధిబడికి వెళ్లి చదువుకున్నామని రాజ్యలక్ష్మమ్మ సగర్వంగా పేర్కొన్నది. హరిజన బాలికను పెంచిపోషించి జీవితంలో గౌరవకరంగా స్థిరపడటానికి బాధ్యతవహించిన నాయనమ్మ ప్రభావ ప్రసరణ ఫలితం ఆ విధమైన కుటుంబ సంస్కారం అనుకోవచ్చు.

వీధిబడి చదువు తరువాత బసవరాజు అప్పారావు హైస్కూల్ చదువుకు వెళితే రాజ్యలక్ష్మమ్మ మాత్రం అక్కడితో ఆగిపోయింది.బాలశిక్ష పూర్తిచేసి చదవటం వ్రాయటం నేర్చి, సుమతీ శతకం, భాస్కరశతకం, వేమన శతకం, ప్రహ్లాదచరిత్ర,గజేంద్రమోక్షం,రుక్మిణీ కళ్యాణం, మొల్ల రామాయణం పద్యాలు కంఠస్థం చేసి, ప్రతిపదర్ధాలు చెప్పగలిగిన స్థాయికి తెచ్చిన వీధిబడి విద్య, ఇంట్లో తాతయ్య శిక్షణ రాజ్యలక్ష్మమ్మకు ఇంటిదగ్గర పుస్తకాలు చదివే అభిరుచిని కలిగించింది. వేసవి సెలవులకు ఇంటికి వచ్చే బసవరాజు అప్పారావు చెప్పే కబుర్లూ , బడి ముచ్చట్లు, పాడే పద్యాలు పాటలు హుషారుగా ఎండనకా వాననకా చెట్లూ ఛామల కింద కూర్చుని వినటం ఇంట్లో పిల్లలందరికీ విజ్ఞానం, వినోదం. పిల్లలంతా కలిసి సొంత బండిలో తోటల్లోకి చేలల్లోకి షికారుకువెళ్లి పొలాల్లో ఊచబియ్యం, వేరుశనక్కాయలూ కోసి తంపట వేసి తినటం , వేసవిలో తాటిగెలలు కొట్టించుకొని ముంజలు ఫలహారం చేయటం ఆమె మధురమైన బాల్య జ్ఞాపకాలు. కాలేజీ చదువులకు మద్రాసు వెళ్లిన అప్పారావు వేసవిసెలవలకు ఇంటికివస్తూ తనకోసం తీసుకువచ్చిన ఆర్యకథానిధి పుస్తకం చదువుకోటం, తాను వ్రాసిన సెలయేటిగానం లోని ఖండికలు చదువుతూంటే వినటం తన బాల్య హృదయాన్ని ఆర్ద్రం చేసేవని వ్రాసుకొన్నది రాజ్యలక్ష్మమ్మ.

రాజ్యలక్ష్మమ్మ పుట్టగానే అప్పారావు భార్య అని పేరుపడింది. అప్పారావుతండ్రి కొడుకుకి బయటనుండి వస్తున్న సంబంధాలపై శ్రద్ధ చూపటం కుటుంబంలో కొంత కలవరానికి కారణమైంది. అప్పారావు బయటి సంబంధం చేసుకోనని చెప్పటంతో అది సమసిపోయింది. అప్పారావు బిఎ చదువు పూర్తికాగానే 1916 వేసవిలో వాళ్ళ పెళ్లి జరిగింది. అప్పారావు సాహిత్య బంధువులు, మిత్రులు చాలామంది ఆ పెళ్ళికి వచ్చారు. అప్పారావు భార్యను తీసుకువెళ్లి మిత్రులకు పరిచయ చేయటం పెద్దవాళ్లకు కాస్త వింతగా అనిపించిందట. పెళ్ళిలో మేజువాణీ సందర్భంలో మిత్రులు కోరారని అప్పారావు తనను పాట పాడమని అడిగితే భయం చేత సిగ్గుచేత తాను పాడలేకపోవటం , అది అప్పారావుకు కోపకారణం అయిన విషయాన్ని ఆమె ప్రస్తావించింది. అతను ఒక్కడే అయితే తాను పాడేదాన్నని, వాళ్లందరిముందు పాడలేక పోయానని ఆమె ఇచ్చిన వివరణను ఆ తరువాత ఆయన కవితగా వ్రాసిన విషయాన్ని కూడా చెప్పింది.

1917 లో మద్రాసు కాపురానికి వెళ్తున్నప్పుడు తన పెదతండ్రి ,పినతండ్రి , తండ్రి చిన్న పిల్ల జాగ్రత్తగా చూసుకో అని అల్లుడికి అప్పచెప్పటాన్ని, అత్తగారు లేదు , అన్నీ నువ్వే చక్కదిద్దుకోవాలి .. బావేకదా అని అప్పారావును, మామయ్యేకదా అనిన్ మామగారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని తనకు బుద్దులు చెప్పటాన్ని, రెండు వంశాలకు పేరుప్రతిష్టలు పెంచేట్లు మసలుకోమని హితవుచెప్పటాన్ని, తమను సాగనంపుతున్న తండ్రుల కళ్ళు చెమర్చటాన్ని గురించి రాజ్యలక్ష్మమ్మ వ్రాసినది చదువుతుంటే సాధారణంగా మొదటి సారి కాపురానికి వెళ్తున్న ఆడపిల్లలకి అత్తింట మసలుకోవలసిన పద్ధతిని చేయవలసినవి, చేయకూడనివి యేవో వివరించి చెప్తూ వియోగాన్ని, బిడ్డ భవిష్యత్తును స్వానుభవం నుండి ఊహిస్తూ కన్నీళ్లు పెట్టుకొనే తల్లుల గురించే తరచు వింటాం. .కానీ రాజ్యలక్షమ్మను కాపురానికి పంపేటప్పుడు తల్లుల ప్రసక్తే లేకపోవువటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

సాంసారిక జీవితంలో తన సాహిత్య వ్యక్తిత్వ వికాసం పట్ల అప్పారావు చూపిన శ్రద్ధను గౌరవంతో ప్రస్తావించింది రాజ్యలక్ష్మమ్మ. అప్పారావు తాను అనుభవించే సాహిత్యానందం రాజ్యలక్ష్మమ్మ అనుభవా నికి కూడా రావాలనుకొనే వాడని, తాను చదివే అన్ని పుస్తకాలను ఆమెకు సులభంగా అర్ధమయ్యేట్లు వివరించేవాడని, కాళిదాసు శకుంతల భవభూతి ఉత్తర రామచరిత్ర ఎన్నోసార్లు చదివి చెప్పిన విషయాలు విని కాళిదాసు శృంగారానికి ప్రాధాన్యతనిస్తే భవభూతి కరుణరసానికి ప్రాధాన్యతను ఇచ్చాడని తెలుసుకొ న్నది అప్పారావుకు ఇష్టమైనది కరుణమే ని కూడా గ్రహించింది. అలాగే గ్రీకుదేశపు కవయిత్రి శాఫో గీతాలను కూడా బసవరాజు తనకు చదివి వినిపించాడని , అవి వింటుంటే తనకు శాఫో ఒక పవిత్రమైన ప్రేమోపాసకురాలు అనిపించిందని శ్రీకృష్ణుడిని పతిగా వరించి విరహానాయిక గా గీతాలాపన చేసిన మీరాబాయి వలేనే ఆమె సత్యము, శివమూ, సుందరమూ అయిన భగవత్ స్వరూపాన్ని ప్రియుడిగా ఎంచుకొని విరహ కవిత్వం వ్రాసింది అని అభిప్రాయపడింది. ఇంట్లో జరిగే సాహిత్య సమావేశాలకు వచ్చే అతిధులకు తగిన ఏర్పాట్లు చేస్తూ ఇంటిపని, వంటపని వంటి వాటిల్లో మునిగి ఉన్నప్పటికీ వాళ్ళ సాహిత్య చర్చలు, కవిత్వపఠనాలు వాదోపవాదాలు శ్రద్ధగా వింటూనే వుండే దానినని, ఆ వాతావరణంలో తనకు కవిత్వం పట్ల, కథల పట్ల ఆసక్తి పెరిగిందని అంటుంది ఆమె.

ఎప్పుడూ ఏదో పుస్తకాన్ని చదువుతూ ఆ పుస్తకాన్ని గురించి అప్పారావుగారితో చర్చించటమంటే తనకు మహా సరదాగా ఉండేదని, అప్పటికి వెలువడుతున్న నవ్య కావ్యాలు కూడా చదువుతూ ఉండే దానినని అప్పారావుగారు సాంగత్యం తనకు సంగీత సాహిత్యాలంటే చెప్పలేనంత ఆసక్తి కలిగించిందని చెప్పుకొన్నది. ఆమెకు మరొక సాహిత్య గురువు ఆమె మామగారు. ఆయన భారత భాగవతాలు బాగా చదవుకొన్నవాడు.ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు చక్కగా పాడతాడు. ఆయన వల్ల వాటి పరిజ్ఞానం అబ్బింది ఆమెకు.ఆయన ఉర్దూలో పండితుడు కూడా కావటంవలన ఉర్దూ నేర్చుకొనే అవకాశమూ కలిగింది.

బసవరాజు అప్పారావు తాను వెళ్లే అన్ని సంగీత సాహిత్యసభలకు వెంటతీసుకువెళ్లేవాడని రాజ్యలక్ష్మమ్మ చెప్పుకొచ్చింది. తానులేకుండా అప్పారావు గారికి ఒంటరిగా వెళ్ళటం ఇష్టం ఉండదు అని ఒకింత తృప్తస్వరంతో చెప్తుంది. ఈ సందర్భంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పింది. మద్రాసులో ప్యారాసాహెబ్ సంగీత కచేరి జరిగింది. అప్పారావు సంగీత ప్రియుడు కనుక పోదాం అన్నాడు. ఇంట్లో మామగారికి చెప్పివెళ్ళాలి అని రాజ్యలక్ష్మమ్మ. నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పు అని ఇద్దరూ ఎదుటివాళ్ళ మీద బాధ్యత పెట్టారు. ఎవ్వరూ చెప్పలేకపోయారు. అప్పారావు ఒక్కడే ఆ కచేరీకి వెళ్లి వచ్చి రాజ్యలక్షమ్మ లేకుండా వెళ్ళానే అనే బాధ, కోపం కలిసి అన్నానికి రాకుండా మేడ ఎక్కి కూర్చున్నాడట . మామగారు కొడుకు పంక్తిని లేకుండా తినడు కనుక పిలుచుకురమ్మని పురమాయిస్తే రాజ్యలక్షమ్మ మేడ ఎక్కి ఆయనను బతిమిలాడి తీసుకురావాల్సి వచ్చిందట. ఆయనకు ఇష్టమైన గుత్తివంకాయ కూర వండానని ఆశ పెట్టి అన్నిటికీ అలా అలగ కూడదు అని బోధపరచి తీసుకువచ్చింది. ఆ సందర్భంలోనే ఆయన “గుత్తివంకాయ కూరోయ్ బావ / కోరివండినానోయ్ బావ “ అనే పాట వ్రాసాడని చెప్పింది.

సంగీత సాహిత్య సభలకే కాదు బసవరాజు అప్పారావుతో ఆమె జాతీయోద్యమ రాజకీయ సభలకు కూడా ఎంతదూరమైనా వెళ్ళేది. 1921 మార్చిలో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సభల తరువాత అదే సంవత్సరం డిసెంబర్ లో అహమ్మదాబాద్ లో కాంగ్రెస్ సభ జరిగింది. సహాయనిరాకరణోద్యమానికి పూర్తి మద్దతును ప్రకటించి గాంధీ నాయకత్వాన్ని స్థిరపరచిన చారిత్రాత్మక సభ ఇది. దానికి మాత్రం రాజ్యలక్ష్మమ్మ వెళ్లలేకపోయింది. కారణం 1921 డిసెంబర్ లోనే ఆమె ఆడపిల్లను ప్రసవించింది. పిల్ల పుట్టిన అయిదారు రోజులకు బావమరిది వెంకటేశ్వరరావు తో కలిసి ఆ సభలకు వెళ్లిన అప్పారావు అటునుండి ఉత్తరదిశ యాత్ర చేసి పిల్లకు రెండునెలలు వెళ్లబోతుండగా ఇంటికి తిరిగివచ్చాడు. మూడవనేల బారసాల చేసి పిల్లకు మంగళప్రద అని పేరుపెట్టారు. వేసవి కాలం ఎండల్లో పిల్ల నలిగిపోతుందని వాల్తేరు కొండల మీద వుండి వచ్చారు. శ్రావణ మాసంలో రెండు రోజుల కొద్దిపాటి జ్వరంతో మంగళ ప్రద మరణించింది. ఆ పిల్ల మరణానికి తండ్రి ఎంత తల్లడిల్లి దుఃఖాన్ని కవిత్వంగా ఎలా మలిచాడో చెప్పుకొచ్చింది. కానీ రాజ్యలక్షమ్మ తల్లిగా తన గర్భశోకాన్ని గురించి ఒక్క మాటైనా చెప్పలేదు. అది ఏ సంవత్సరమో సూచనలేదుకానీ ఒక ధనుర్మాసంలో (అంటే డిసెంబర్ – జనవరి నెలలలో) వేదాద్రి వెళ్లి నరసింహమూర్తి దర్శనం చేసుకువచ్చామని,ఆ వెంటనే కడుపున పడి దీపావళికి ముందు (అంటే మళ్ళీ అక్టోబర్ నవంబర్ నెలలలో) మగపిల్లవాడు పుడితే వేదాద్రి నరసింహమూర్తి అని పేరు పెట్టుకున్నామని జీవితంలోకి ఆ పిల్లవాడిరాక కలిగించిన ఆనందాన్ని, తండ్రి కవితా ప్రతిస్పందనను చెప్పుకొచ్చింది రాజ్యలక్ష్మమ్మ. అయితే ఆ ఆనందం కూడా ఎక్కువకాలం దక్కలేదు. వేసవి లో పిల్లవాడిని తీసుకొని బెంగుళూరు వెళ్లి తిరిగి వచ్చేముందు న్యుమోనియా వచ్చి నరసింహమూర్తి చనిపోయాడు. 1925 తరువాతనే కావాలి.

రాజకీయ సభలకు వచ్చినవాళ్ళను గురించి తెలిసిన విషయాలు, విశేషాలు ప్రత్యేకించి ఆ సభలకు వచ్చిన మహిళా నాయకులను, కార్యకర్తలను గురించి స్వీయ చరిత్ర లో కొంత సమాచారం దొరుకుతుంది. మద్రాస్ లో ఉన్న కాలంలో ఆచంట లక్ష్మీపతి ,ఆయన భార్య రుక్మిణమ్మ తో రాజ్యలక్ష్మమ్మకు బాగా పరిచయం. వాళ్ళింటికి వెళ్లివస్తుండేవారు కూడా. 1923 నుండి ఆమె కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్త. కానీ ఆమె రాజకీయాల గురించిన ప్రస్తావన ఇందులో లేదు. 1922 సెప్టెంబర్ లో బరంపురంలో జరిగిన కాంగ్రెస్ సభకు వెళ్ళి నప్పుడు కాళేశ్వరరావు దంపతులతో, ఉన్నవ దంపతులతో , మాగంటి అన్నపూర్ణ, దువ్వూరి సుబ్బమ్మ లతో ఏర్పడిన పరిచయాన్ని చెప్పింది. 1923 డిసెంబర్ లో కాకినాడ లో జరిగిన కాంగ్రెస్ సభకు వెళ్ళినప్పుడు రాజ్యలక్షమ్మ గుమ్మిడిదల దుర్గాబాయమ్మ , పొణకా కనకమ్మ స్త్రీ స్వయంసేవా దళాలకు నాయకత్వం వహించి నడిపినతీరు చూసింది. దుర్గాబాయమ్మ ఉపన్యాసానికి ఆశ్చర్యపోయింది. అప్పటి నుండి దుర్గాబాయమ్మ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ, ద్రోణంరాజు లక్ష్మీ బాయమ్మ,రాయసం రత్నమ్మ,కనుపర్తి వరలక్ష్మమ్మ మొదలైనవాళ్లతో కలిసి ప్రతి కాంగ్రెసులో పాల్గొనటం, అనేక మహిళా సభలలో పనిచేయటం జరిగిందని చెప్పుకొన్నది. వాళ్ళ స్నేహాలు, సంభాషణలు,కార్యాచరణ సందర్భాలు, సంఘటనలు ఈ స్వీయ చరిత్రలో భాగం అయివుంటే జాతీయోద్య మంలో మహిళల పాత్రగురించి,మహిళాభ్యుదయానికి వాళ్ళు చేసిన దోహదం గురించి ప్రాధమిక వాస్తవ సమాచారం మరింత అందివచ్చేది. అది చరిత్రలో ఖాళీలను పూరించటానికి ఉపయోగపడేది.

1925 విజయవాడ కాపురం రోజుల గురించి చెప్తూ ఆ వూళ్ళో బారిష్టర్ తుర్లపాటి వెంకటేశ్వరరావు, ఆయన భార్య రాజేశ్వరమ్మ గొప్ప సాంఘిక సేవ చేశారని, రాజేశ్వరమ్మ గొప్ప కార్యనిర్వాహకురాలని, ఆమె కృషివల్లనే బెజవాడలో చక్కని భవనంలో మహిళా సమాజం ఏర్పడి స్త్రీల ఉన్నతవిద్యకు అవకాశం లభించిందని చెప్పింది. ఇటువంటి స్త్రీల సామాజిక రాజకీయ సాహిత్య కృషిగురించి న తవ్వకాల పని ఎంతవుందో గుర్తుచేస్తుంది రాజ్యలక్ష్మమ్మ గారి స్వీయ చరిత్ర.

“ఏమాత్రం సహృదయమున్న మనిషికైనా అనుభూతులు ఉంటాయని” నమ్మే రాజ్యలక్ష్మమ్మ వాటి వ్యక్తీకరణకు భాషా ఛందో నియమాలు అవరోధం కాకూడదని భావించింది. నవ్యకావ్యం సహృదయులకు స్వేచ్ఛా మార్గం చూపిందని,మనస్సులో రేకెత్తే భావాలను వ్యావహారిక భాషలోకి యథాతథంగా తీసుకు రావచ్చని, అందుకు గీత రచన తగిన మాధ్యమం అని ఆమె గ్రహించగలిగింది. వాడుక భాష తెచ్చుకొన్న భాషలాగా కాకుండా జీవకళ ఉట్టిపడుతుంటుందని , కావ్యంలోని గొప్పతనం చెప్పేతీరులో ఉంటుందని , రసం ప్రధానం కనుక రచన ఏ వృత్తంలో ఉన్నదన్నది ముఖ్యం కాదని, కవిత్వం సరళంగా భావపూర్ణంగా ఉండటం ముఖ్యంఅన్న అభిప్రాయానికి వచ్చింది. గిడుగు భాషోద్యమం, గురజాడ సరళ రచనా సంవిధానం యువతను కవిత్వ రచనకు ఉత్సాహ పరిచయాన్నది ఆమె అవగాహన. అలా ఆలోచిస్తూ , అభిప్రాయలు ఏర్పరచుకొంటూ నవ్యకావ్యాలు చదువుతూ చదువుతూ రాజ్యలక్ష్మమ్మ స్వయంగా కవిత్వం వ్రాయటం మొదలుపెట్టింది. ఈ స్వీయ చరిత్ర లో 15 వ శీర్షిక ‘నా రచనలు’. అందులో ఆమె ఆ క్రమాన్ని వివరించింది.
మద్రాసులో రాజ్యలక్ష్మమ్మ గారి ఇంటిచుట్టూ పెద్ద తోట ఉండగా వాళ్ళుకూడా పెరట్లో పూలమొక్కలు, కాయగూరల పాదులు వేసి పెంచిపోషించే వాళ్ళట. పెరటి తోటలో తిరుగుతుండగా సాయంకాలానికి విచ్చుకొనే ఎర్రటి చంద్రకాంతలు, పచ్చని బీరపూలు ఆహ్లదకరంగా కనబడుతూవుండేవి. వాటిని చూస్తూ పరవశించే ఆమెకు ఒక రోజు అవి విచ్చేవేళకే అక్కడ భర్త పత్రికాఫీసు నుండి బయలుదేరుతాడు కదా అన్న వూహ మనసులో సుడితిరిగి కవిత్వమై ఉప్పొంగింది. అలా ఆమె వ్రాసిన తొలి కవిత “ సూర్యు0డు పడమట క్రుంగెటి వేళా
నా నాధుడింటికీ వచ్చేటి వేళా
చంద్రకాంత పూవుల్లు పూసేటివేళా
నా నాధుడింటికీ వచ్చేటి వేళా
ఆవులంబా యనుచు అరచేటివేళా
నా నాధుడింటికీ వచ్చేటి వేళా
బీరల్లు పూవుల్లు పూసేటివేళా
నా నాధుడింటికీ వచ్చేటి వేళా “

మాంబళం లో ఇంటిదగ్గర కోదండరామస్వామి కోవెల, కొలను, ప్రతి సాయంత్రం గుడి నుండి వినబడే చెవులకు ఇంపైన సన్నాయి, సాయంకాలపు సూర్యాస్తమయ సౌందర్యం వీటన్నిటి నేపథ్యంలో ఆహ్లదకర వాతావరణంలో దీపాలు పెట్టినా భర్త ఇంకా ఇంటికిరాలేదన్న విషయం గుర్తుకువచ్చి కలిగిన ఆవేదన మరొక కవిత అయింది. “సందెజారే చుట్టుపక్క /మినుకు మినుకు దీపమ్ములు /వెలుగుచుండె దూరమ్మున / కోవెలలో హాయిగాను” / “మేళము వినవచ్చుచుండె/ చల్లగా వెన్నెలలు కన్న / తల్లివోలె కాయుగాని / మనసేమొ మాటుమణిగే”అప్పుడప్పుడు అలా వ్రాసిన కవితలు భర్తకు చూపే ధైర్యం చేయలేకపోయానని చెప్పుకొన్నది. . ఒకసారి అవి నండూరి సుబ్బారావు కంట పడ్డాయి. ఎంకిపాటల ఆ సుబ్బారావు అప్పారావుకి తమ్ముడివరుస చుట్టం.ఇంటికి వస్తూ సాహిత్య గోష్ఠులలలో పాల్గొనేవాళ్లలో అతను కూడా ఒకడు.కంట పడటం తరువాయి వదిన కవిత్వం వ్రాస్తున్నది అంటూ అప్పారావుకి చూపించాడు. ఆయన ప్రోత్సాహంతో గృహలక్ష్మి, భారతి మొదలైన పత్రికలకు సౌదామిని అనే కలం పేరుతో రచనలు పంపటం అవి ప్రచురణ కావటం మొదలైంది. మామగారి దగ్గర ఉర్దూ నేర్చుకొనటం వలన అనలహక్,తేరే జాబాన్, తేరెముబారక్ వంటి కథలను తెలుగులోకి అనువదించింది.అంతకుమించి స్వీయ సాహిత్య కృషిగురించి ఆమె చెప్పినది లేదు.

నిజానికి 1931 నాటికే భారతిలో ప్రచురించబడిన ‘ఎవరిదదృష్టం! ‘ కథను, అదే సంవత్సరం గృహాలక్ష్మిలో ప్రచురించబడిన ‘ నూనెగుడ్డలవాడు’ కథను ఆమె ప్రస్తావించని లేదు. తెలుగులోకి అనువదించినట్లు పేర్కొన్న తేరె ముబారక్ 1932 అక్టోబర్ గృగలక్ష్మి పత్రికలో వచ్చింది.అలాగే 1934 గృహాలక్ష్మిలో ప్రచురితమైన ‘కాకా కాకా దోనో నయన్ మత్ ఖావో’ కథను కూడా ఆమె ప్రస్తావించలేదు. అలాగే జాతీయోద్యమ రాజకీయాలలో క్రియాశీలురుగా పాల్గొన్నారని రాజ్యలక్ష్మమ్మ పేర్కొన్న మాగంటి అన్నపూర్ణ, గుమ్మిడిదల దుర్గాబాయమ్మ, పొణకా కనకమ్మ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ, ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ కనుపర్తి వరలక్ష్మమ్మ అందరూ రచనావ్యాసంగంలో ఉన్నవాళ్లే. రచయితలుగా వాళ్ళ గురించిన ప్రస్తావనలు ఈ స్వీయ చరిత్రలో కనబడవు. అంతేకాదు దేశాలను చుట్టివస్తూ మహాదేవివర్మ, సుభద్ర చౌహాన్ వంటి కవయిత్రులను కలసి వచ్చిన రాజ్యలక్ష్మమ్మ వాళ్ళ నుండి పొందిన స్ఫూర్తి సంగతి కూడా తెలియదు.

“నేను మొదలు రచయిత్రిని కాదు. ఇప్పుడూ కాదు. అప్పారావు గారితోనే నా రచనలు ప్రారంభమయినయ్. వారితోనే అవి సమాప్తం కూడా అయిపోయినయ్” అని రాజ్యలక్ష్మమ్మ స్వీయచరిత్ర ముందుమాటలో చెప్పిన మాటలు గమనించదగినవి. అప్పారావు తో 1916 లో పెళ్ళయితే 1933 లో ఆయన మరణించే నాటికి వాళ్ళ వైవాహిక జీవితం వయసు పద్దెనిమిది సంవత్సరాలు. ఆ తరువాత మరొక నలభై రెండేళ్లు జీవించి 1975 లో మరణించింది. పద్ధెనిమిదేళ్ళలలో పెంచిపోషించబడిన సాహిత్యాభిరుచి దానినుండి మొగ్గతొడిగిన రచనాసక్తి సమాప్తం అయిపోయినయ్ అనుకొనటం ఆయన అకాలమరణం కలిగించిన షాక్ వల్లనా!? అంటే ఈ మాటలు 1965 లో స్వీయ చరిత్ర వ్రాసిన సందర్భంలో అన్నవి కనుక ఆయన మరణానంతరం ముప్ఫయి రెండేళ్లకు కూడా షొక్ లోనే ఉందనుకోలేము. భర్తను కోల్పోవటం అంటే స్త్రీ తనను తాను కోల్పోవటం అన్న సంప్రదాయ భావజాల ప్రభావం వల్లనే కావాలి.

నూతనంగా అభివృద్ధిచెందుతున్న ప్రజాస్వామిక సాహిత్య సంస్కారాల పట్ల ఇష్టంతో గౌరవంతో తనదైన మార్గంలో నడక ప్రారంభించి, దేశ స్వాతంత్య్రం సాధించవలసిన ఆశయంగా ఉమ్మడి ఆచరణలో భాగమై, ప్రకృతిని ప్రపంచాన్ని శోధించే దేశాటన జీవితంలో భాగంగా చేసుకొని చైతన్యవంతంగా బతికిన రాజ్యలక్ష్మమ్మ తన జీవితం అప్పారావుతోనే మొదలై అప్పారావు తోనే ముగిసిందనుకొనటం కన్నా పెద్ద విషాదం ఏముంది. ? రాజ్యలక్ష్మమ్మే అలా అనుకొంటే ఇక సాధారణ స్త్రీల మాట చెప్పేదేముంది.?
1933 లో భర్త మరణించేనాటికి రాజ్యలక్ష్మమ్మ వయసు 29 ఏళ్ళు . ఆ తరువాత ఆమె జీవించిన కాలం 42 ఏళ్ళు ఈకాలంలొ ఆమె ఏమి చేసింది? అప్పారావు మరణం మిగిల్చిన శూన్యంలో తన జీవితం లేనట్లే భావించింది. స్వీయ చరిత్ర ముగింపులో కాశీ బదరీనాధ్ మొదలైన చోట్లకు వెళ్లినా, ఏ ప్రకృతి దృశ్యాన్ని చూసినా పూర్వంలా ఆనందాన్ని అనుభవించలేకపోతున్నానని అన్నది.
“ పశ్చిమమున బర్వె నరుణ /కాంతులు కొండవాగుల
నుండియు జీవ జలమ్ముల / నలల నురగ లతో నాడు

గూళ్ళకేగు గువ్వలజంట / గుసగుసలాడు
నేనిటులే గడుపుచుంటి / న, వులేని జీవయాత్ర “ – అని ప్రకృతి , ప్రపంచం ఏమీ జరగనట్లే యధాప్రకారం చలన చైతన్యాలతోనే వున్నాయి కానీ అప్పారావు లేని జీవయాత్ర తనలో ఆ చలన చైతన్యాలతో నిమిత్తంలేని స్థితికి తెచ్చిందని చెప్పుకొన్నది. ఒంటరితనం నుండి శాంతికోసం మహాత్ముని చరణ సన్నిధికి చేరినట్లు చెప్పుకొన్నది. ఆ మహాత్ముడు ఢిల్లీ లో ఒక మతోన్మాది పిస్తోలు గుండుకు బలైన విషయం చెప్పి దానితో తన స్వీయ చరిత్రను ముగించింది.

ఈ స్వీయ చరిత్రకు దివల్లి వెంకట శివరావు వ్రాసిన ముందుమాటను బట్టి రాజ్యాలక్షమ్మ కొంతకాలం గుంటూరులో ఉన్నవా దంపతులు నిర్వహిస్తున్న శారదానికేతన్ లో ఉండి చదువుకొనటమే కాక బోధనా నైపుణ్యాన్ని కూడా పెంచుకొన్నట్లు, బొంబాయి దగ్గర బోరవిల్లి శిక్షణ కేంద్రంలో ఉండి విద్యాబోధన, హిందీ ప్రచారం చేసినట్లు తెలుస్తున్నది. క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంలో వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని రెండునెలలు జైలు జీవితం కూడా గడిపింది.

1965 లో ఈ స్వీయ చరిత్ర ప్రచురించటానికి ముందే 1963 లో బసవరాజు రాజ్యలక్ష్మమ్మ వ్యాసాల సంకలనం ఒకటి ‘ఆకాశ కుసుమావళి’ అనే శీర్షికతో అచ్చయింది. దానికి గ్రంధపరిచయము శీర్షికతో శ్రీవాత్సవ వ్రాసిన ముందుమాట భర్త మరణానంతరం ఆమె తెలుగు సంస్కృత భాషలలో ప్రావీణ్యం సంపాదించినట్లు, హిందీలో ఉన్నత పరీక్షలు ఇచ్చినట్లు, గుజరాతీభాషా పరిజ్ణానం కూడా పొందినట్లు, గాంధీ ఆశ్రమం నుండి వచ్చాక మద్రాస్ లో గుజరాతీ మండలి స్కూల్ లో హిందీ అధ్యాపకురాలిగా పనిచేసింది. ఆ కాలం 1951 నుండి 19656. ఆ కాలంలో ఆమె మద్రాస్ రేడియోలో చేసిన ప్రసంగాల వ్యాసాలే ఆకాశకుసుమావళి అనే పేరుతో పుస్తకరూపంలో వచ్చాయి. ఆతరువాతికాలపు ఆమె జీవితం ప్రస్తుతానికి మనకు తెలియనిదే. ఆమె సాహిత్య సమీక్ష ముందెప్పుడో జరగవలసినదే.

( ఇంకా వుంది )

\

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply