స్త్రీల జీవిత చరిత్రలు- 3

2.3.

కుటుంబ జీవిత సంబంధ స్వీయ చరిత్ర వలె అనిపిస్తూనే బసవరాజు రాజ్యలక్షమ్మ స్వీయ చరిత్రవలెనే జాతీయోద్యమ చరిత్రఘట్టాలను తనదైన అనుభవకోణం నుండి నమోదుచేసిన స్వీయ చరిత్ర వల్లభనేని శ్రీరంగ నాయకమ్మ రచన ‘నేను’. ఆమె మరణానంతరం (1918 – 1968 జూన్ 20 ) ప్రధమ వర్ధంతి సందర్భంగా 1969 జూన్ 20 న ప్రచురించబడింది. గొట్టిపాటి బ్రహ్మయ్య, కొడాలి ఆంజనేయులు, కుందుర్తి, పెనుమత్స సత్యనారాయణ రాజు, శ్రీ ముత్తేవి లక్ష్మణ దాసు, పండితారాధ్యుల నాగేశ్వరరావు ముందుమాటలు వ్రాసారు. 1975 లో వచ్చిన రెండవ ముద్రణలో దాశరధి, సి. నారాయణరెడ్డి, వడ్డీ రంగారావు అభిప్రాయాలూ , శ్రీమంతులు పత్రికలో వచ్చిన సమీక్ష ( జులై 1969), ఇండియన్ ఎక్ప్రెస్ లో ( అక్టోబర్ 18, 1969) వచ్చిన రివ్యూ ప్రచురించబడ్డాయి.

వల్లభనేని రంగనాయకమ్మ గుండె జబ్బుతో బాధపడుతూ మానసికంగా, శారీరకంగా కృంగిపోతూ, చికిత్సలతో ధైర్యం కూడగట్టుకొంటూ ఉన్న స్థితిలో మనుమలను, మనుమరాండ్రను దగ్గరకు తీసుకొంటూ కబుర్లు చెబుతూ ‘కథలు చెప్పవూ’ అని అడిగే మనుమరాలికి చెప్తున్నట్లుగా స్వీయ జీవిత కథ ను వివరించటంగా మొదలవుతుంది ‘నేను’ అనే ఈ స్వీయ చరిత్ర. వేదుల, శ్రీశ్రీ మొదలైన కవుల కవితా పంక్తులను సందర్భానుసారం ప్రస్తావిస్తూ, కవితాసాంద్రతతో భావోద్వే గాలను వ్యక్తీకరిస్తూ సాగిన రచన ఇది. ‘ఆత్మకథను చెప్పటం అసిధారావ్రతం !స్వీయచరిత్రను వివరించడం లక్ష్య శుద్ధికి పరీక్ష ‘ అని తెలిసి చేసిన రచన ఇది. జాతిరత్నాలు , త్యాగజీవులు , దివ్యభావనా విలసితులు, విశ్వ విశాల విజ్ఞానాభిలాషులు కాగల భావి పౌరులు ఆత్మకథలు అర్ధం చేసుకొని అడుగుజాడలకు మెరుగులు దిద్దుకోగలరనే విశ్వాసంతో ‘నేను సైతం’ అంటూ స్వీయచరిత్ర రచనకు ఉపక్రమించింది వల్లభనేని రంగనాయకమ్మ. స్త్రీలకు స్వీయ జీవితమంటే సాధారణంగా కుటుంబ జీవితమే అవుతుంది. అయితే స్వీయ చరిత్ర రచన వరకు వచ్చారంటే ఆ స్త్రీలు కుటుంబంలోనే కాక బయట సమాజంలో కూడా తమ స్థానం ఏమిటో, ఎక్కడో నిర్ధారించుకొనే తెలివిడికి వచ్చారన్న మాటే. ‘నేను’ అనే ఉత్తమ పురుష సర్వనామం అస్థిత్వచైతన్య ప్రతీక. రంగనాయకమ్మ స్వీయ చరిత్ర పేరే ‘నేను’.
1918 నుండి 1968 వరకు యాభై సంవత్సరాల జీవితం రంగనాయకమ్మది. చిత్రజాతక చరిత్ర అంటుందామె తనజీవితం గురించి. గుంటూరు జిల్లా లో నందమూరి వారి ఇంటపుట్టింది. తల్లి పుట్టిల్లు కృష్ణా జిల్లా. రామినేని వారు తల్లి మాతామహులు. ఆరేళ్ళ వయసులోనే తల్లి మరణించటంతో అమ్మమ్మ గారింట పెరుగుతుండేది. సవతి తల్లి చెప్పుచేతల్లో ఉన్న తండ్రికీ తనకూ మధ్య తన బాధలు, ఆశలూ, అభిప్రాయాలూ నోరువిప్పి చెప్పుకోలేని దూరం. ఆయన తన మేనల్లుళ్ళలో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసి కూతురి పట్ల బాధ్యత దించుకోవాలనుకొన్నాడు. ఇష్టం లేదని చెప్పలేని పిరికితనం. ఆమె మనసు గ్రహించిన పినతండ్రి లక్ష్మయ్య – ఎన్ టి రామారావు కన్నతండ్రి – మేనత్తకొడుకును పెళ్లాడటం ఇష్టం లేదని భయపడకుండా తండ్రికి చెప్పమని ధైర్యం చెప్పాడు. ఆయనే వల్లభనేని కాశీ విశ్వనాథం ను ఆమెకు తగినభర్తగా ఎంపిక చేసాడు. 1932 లో 14 వ యేట అతనితో ఆమె పెళ్లి జరిగింది.

వల్లభనేని కాశీవిశ్వనాథం కృష్ణాజిల్లా పెద్దముత్తేవి వాస్తవ్యుడు. స్వతంత్ర ఉద్యమం, సంస్కరణ ఉద్యమం, సహకారోద్యమ ప్రభావాలు బలంగా ఉన్న వూరు అది. వల్లభనేని వంశం ఆ ఉద్యమాల ప్రభావంలో జీవించింది అంటుంది రంగనాయకమ్మ. పెళ్ళికి ముందు మిత్రులు, బంధువుల ద్వారా రంగనాయకమ్మ, కాశీ విశ్వనాధం ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఇష్టపడ్డారు. తండ్రి ఆదరణ లేని ఆడబిడ్డ గా తనకు పెట్టుపోతలు సరిగా జరగవని తెలిసీ, కట్నాలూ లాంఛనాలు ఏమీ ఆశించకుండా కాశీ విశ్వనాథం పెళ్లాడటానికి సిద్ధపడటం ఆమెకు ఆనందాన్ని కలిగించిన విషయం. పెళ్లిమాటలు మాట్లాడివచ్చిన పినతండ్రి అత్తోట సుబ్బయ్య వరుడు అందగాడనో, బుద్ధిమంతుడనో, బాగా చదువుకొన్నాడనో గాక “లోకాలాన్నీ ఈ కాలంలోనే / శ్రీశ్రీ లు పూసి వర్ధిల్లాలని / ప్రణాళికల ప్రాకారాలు కట్టే /ప్రయోగాశాలి; ప్రజ్ఞానిధి / శ్రీవల్లభనేని కాశీవిశ్వనాథం గారు” అని పద్యమల్లినట్లు చెప్పిన మాటలు తనలో ఏవేవో ఊహలను , కలలను మేల్కొల్పాయని అంటుందామె. బంధువులు, మిత్రులే కాక ఆదర్శవాదులు, అభ్యుదయ వాదులు అనేకమంది తమ పెళ్ళికి వచ్చి ఆశీస్సులు అందించటాన్ని గురించి చెప్పుకొచ్చింది. పెళ్లితో తనకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం వచ్చాయని మురిసిపోయింది. తల్లి ప్రేమ, తండ్రి ఆదరణ దక్కని ఒక ప్రేమరాహిత్యంలో వేదన పడుతున్న ఒంటరి స్నిగ్ధ బాలిక లో అసలైన అస్థిత్వ స్పృహ మేల్కొనటం అక్కడే మొదలైంది.

పెళ్లినాటికే విశ్వనాథం జాతీయోద్యమ ఆశయాల ప్రభావంలో వున్నాడు. పెళ్లి తో ఆ ఆశయాలు రంగనాయకమ్మ తనవిగా చేసుకొన్నది. అయితే ఈ ఆచరణలో ఆయనను కేంద్రంగా తనది అనుబంధ పాత్రగా ఆమె అనుకోలేదు.“ఆ రోజుల్లో అభ్యుదయ వాదం పేరు భౌతిక వాదం. మేమంతా ప్రజల దృష్టిలో భౌతిక వాదులం” అని ఉభయార్ద బోధక సంబోధనతో ఆమె తమ కార్యాచరణ కథనాన్ని ప్రారంభించటం దానినే సూచిస్తుంది. స్వాతంత్ర్యోద్యమానికి మొదటి షరతు సాంఘిక విప్లవం అని అందుకు అంటరానితనాన్ని నిర్మూలించటం అనివార్యమైన అవసరమని గుర్తించి అందుకు గాంధీ ఇచ్చిన కార్యక్రమాన్ని అమలుచేయటంలో భాగంగా రంగనాయకమ్మ దంపతులు ఇంట్లో మాలపిల్ల ను పెట్టుకొని గ్రామవెలికి, కుల కుటుంబ వెలికి గురై పడిన ఇక్కట్లను చెప్పుకొచ్చింది. తమ సంస్కరణ దృక్పథం, ఆచరణల పరిణామాన్ని “పూలమాలిక నల్లినందుకు/కరుకు కత్తులె కానుకాయెను /తేనే సుధలను చల్లినందుకు/ తేటిపోటుల కాటు లాయెను” అన్న విశ్వసుందరమ్మ పద్యభాగాన్ని ఉటంకిస్తూ సూచించింది.

సాహిత్య మననం జీవితానికి అన్వయించుకొంటూ అర్ధం చేసుకొనటం రంగనాయకమ్మ జీవితంలో విడదీయరాని భాగం. గాంధీ ఆశించిన సాంఘిక విప్లవం కథ, నవల, నాటకం, సినిమా బుర్రకథ – ఇలా అనేక రూపాలలో అస్పృశ్యత గురించి గుండెలు కరిగించే సాహిత్యం వచ్చిందని చెబుతూ ‘మాలపిల్ల’ సినిమాను ప్రస్తావించింది. అది 1938 లో వచ్చిన సినిమా. మాలపిల్ల తమఇంట్లోకి రావటం వల్ల మాత్రం తాము ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వచ్చిందో చెప్పటంలో సాహిత్యకళారంగాలు పలవరిస్తున్న ఆదర్శాలకు వాస్తవ సామాజిక చైతన్య స్థాయికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని గురించిన రంగనాయకమ్మ అవగాహన కనబడుతుంది. అయినా “ఈ స్వప్నం నిజమవుతుంది !/ ఈ స్వర్గం రుజువవుతుంది!” అన్న కవి వాక్కును ప్రస్తావిస్తూ ఆత్మవిశ్వాసం ప్రకటిస్తుంది.

అందులో భాగంగానే గ్రంథాలయాల నిర్మాణం,అస్పృశ్యతా నివారణోపన్యాసాలు, మద్యపాన నిషేధ ప్రచారం, ఖద్దరుధారణ మొదలైన నిర్మాణకార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పింది. ఈ ప్రయత్నంలో నిమ్నోన్నతాలు తప్పక సర్దుబాటు అవుతాయన్న నమ్మకం తమది అని కూడా చెప్తుంది. అప్పటి తమ ఆలోచన, మాట, నడత, బోధన “సర్వం అభ్యుదయ ప్రబోధం! సనాతన భావధిక్కారం” అని చెప్పగల స్పష్టత ఆమెది. ‘పతితులకోసం, భ్రష్టుల కోసం మోయిల్దారిని బయల్దేరిన జగన్నాధరధచక్రాల్’ గురించి శ్రీశ్రీ కవితాత్మక ప్రకటనను ప్రస్తావిస్తూ జనాన్ని ఉత్తేజ పరచటం, కులమత జాతి వ్యవస్థలగురించిన శాస్త్రీయ అవగాహన కలిగించటం, భౌగోళిక వైద్య వైజ్ఞానిక విషయాలను బోధపరచటం వంటి కార్యక్రమాలలో నిమగ్నమైన తాము సంఘద్రోహుల దౌర్జన్యాలను ఎదుర్కొనటానికి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండవలసి వచ్చిందని చెప్పింది. వచ్చిపోయే సాంఘిక కార్యకర్తలతో ,సామ్యవాదప్రచారకులతో తమ ఇల్లు కోలాహలంగా ఉండేదని, ఇంట్లో జరిగే చర్చలు, విమర్శలు,ఆత్మవిమర్శలతో సందడిగా ఉండేదని,తమ ఇంటి నుండే ధర్మసాధనకోసం వివిధరంగాలలోకి కార్యకర్తలు తరలి పోతుంటే ఆనందంగా ఉండేదని చెప్పింది.

భారతప్రజల అభిమతంతో నిమిత్తం లేకుండా రెండవ ప్రపంచయుద్ధంలోకి భారతదేశాన్ని దింపటంపట్ల నిరసనగా గాంధీ వ్యవస్థాగత సత్యాగ్రహోద్యమాలకు అనుకూలంకాని పరిస్థితు లలలో వ్యక్తిసత్యాగ్రహోద్యమానికి పిలుపు ఇచ్చాడు. వినోబాభావేతో వ్యక్తి సత్యాగ్రహం ప్రారంభం అయింది. ఉప్పు సత్యాగ్రహం,విదేశీ వస్త్రబహిష్కరణ వంటి కార్యక్రమాల ముందు వ్యక్తి సత్యాగ్రహం నిరుపయోగమని తేలిపోయింది అనటంలో రంగనాయకమ్మ నిశిత పరిశీలన కనిపిస్తుంది. మేజిస్ట్రీట్ లతో ముందుగానే చెప్పటం, లాఠీ దెబ్బలు తప్పించుకొనటం, జైలు లో ఎ, బి క్లాసులు కోరుకోవటం వంటి బూర్జువా పోకడలతో వ్యక్తి సత్యాగ్రహం నీళ్లు కలిపిన పాలుగా అయిందని అందుకనేసాకల్య సమీక్ష తరువాత వ్యక్తిసత్యాగ్రహం చేయగూడదని తాము నిర్ణయించుకున్నామని చెప్పింది.

1942లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలైతే ఆ కార్యక్రమ నిర్వహణకు రంగనాయకమ్మ దంపతుల మకాం విజయవాడకు మారింది. భర్త కాశీ విశ్వనాథం రాష్ట్ర యువజన కాంగ్రెస్ కు కోశాధికారిగా నిర్వహించిన బరువు బాధ్యతలను గురించి చెప్తూ అటువంటి సమయంలో ఆంధ్రరాష్ట్ర యువజన కాంగ్రెస్ వట్టి కల్పన అని ఆగస్టు ఉద్యమం కాంగ్రెస్ కు సంబంధించింది కాదని జపాన్ ఏజంట్ల కల్పన అని జరుగుతున్న ప్రచారాన్ని నిలవరించటానికి రాష్ట్ర యువజన విద్యార్థి కాంగ్రెస్ ప్రతినిధులు కాశీ విశ్వనాథం నాయకత్వంలో తమ కార్యకలాపాలు కాంగ్రెస్ ఆశయాలకు ఎలా అనుగుణమో వివరిస్తూ 18 పేజీల మెమోరాండం గాంధీకి సమర్పించటానికి వెళ్లిన విషయం చెప్పింది. దానికి గాంధీ సానుకూలంగా స్పందించిన విషయాన్ని కూడా రంగనాయకమ్మ పేర్కొన్నది.

గాంధీని చూసిరావాలని వార్ధా మహిళా శ్రమం వెళ్లి కొన్ని రోజులు ఉండి వచ్చింది రంగ నాయకమ్మ.ఆశ్రమంలో ప్రభాతసేవ, ప్రార్ధనా సభ, దీక్షాధారణ , సూత్రయజ్ఞం , ప్రపంచ విషయాల పర్యాలోకనం వంటి కార్యక్రమాలతో కూడిన గాంధీ దినచర్యలోని నిబద్ధతను, సమయపాలనను గొప్ప ఆరాధనా భావంతో పేర్కొన్నది. బుద్ధుడు, క్రీస్తూ, మార్క్స్, లింకన్ మొదలైన యుగపురుషుల భావసంపదనంతా పుణికి పుచ్చుకొని సత్యాహింసలతో సమన్వయం చేసిన మానవతామూర్తిగా గాంధీని భావించింది. విప్లవ వాది కాదుగానీ సత్య అహింసలతోనే విప్లవాన్ని రగల్చగలిగాడని అభిప్రాయపడింది. మహిళలకు మహాత్ముడు చేసిన ఉపదేశాలు సకలశాస్త్ర సంకలనాలు అంటుంది. గాంధీజీ సారధ్యంలో స్వాతంత్య్రం వచ్చినందుకు ఒక వైపు సంతోషిస్తూనే పాకిస్థాన్ ప్రత్యేకదేశంగా ఏర్పడటాన్ని భరించలేకపోయింది.జాతిమత వర్గరాహిత్య సమాజానికి మూలంలోనే పురుగుకొట్టింది అని బాధపడింది.

దేశానికి స్వతంత్రమైతే వచ్చింది కానీ ఫలాలలో భాగస్వామ్యం అందరికీ సమంగా అందలేదన్నది ఆమె తక్షణమే గుర్తించింది. స్వాతంత్ర్య రధం లాగి చేతులు కాయలు కాసిన తమలాంటి నిస్వార్ధ దేశసేవకులు అడుగున పడిపోయారని వేదన పడింది. ఆ రథంలో ఉత్సవ విగ్రహాల్లా ఊరేగినవారికి ఊపిరి వచ్చిందని, ఉద్యమ ద్రోహులు సన్మానించబడుతున్నారని నిష్ఠుర వాస్తవాన్ని గుర్తించింది.

రంగనాయకమ్మ జీవించింది యాభై సంవత్సరాలే.14 ఏడు పెళ్లి అయ్యేవరకు తల్లిలాలన , తండ్రి పాలనా ఎరుగని జీవితం. 1932 నుండి 1947 వరకు పదిహేనేళ్ల కాలం జాతీయోద్యమ కార్యకలాపాలలో భగస్వామ్యం. ఆ కాలంలోనే ఆమె ఇద్దరు బిడ్డల తల్లి అయింది. 1933లో తొలికాన్పులో కొడుకు పుట్టాడు. పురిటి నొప్పులు పడీపడీ సొమ్మసిల్లినా ‘బాధను మరిపించే ఆనందం’ శిశూదయం అంటుందామె. ఆ బాధలో తీపి, ఆ అవస్థలో మాధుర్యం, ఆ కష్టంలో రుచి అనుభవించటం స్త్రీ జన్మకు సార్ధకత అంటుంది. ఎన్ని బాధలైనా అందరూ పడవచ్చు గానీ ప్రసవ బాధ స్త్రీ మినహా ఎవరూ పడలేరు అని, అందులోనే మాతృత్వం తో పాటు మానవత్వం కూడా చిగిర్చి వికసిస్తాయని అందువల్లనే స్త్రీ పురుష హృదయాల్లో మానవతా పాళ్ళలో హెచ్చు తగ్గులుంటాయని ఆమె భావించింది.ఆ తరువాత ఏడేళ్లకు 1940 రెండవ సంతానం మళ్ళీ మొగపిల్లవాడే. మాతృత్వం మళ్ళీ సరికొత్త అనుభవమై మురిసే వేళలలో స్వీయ సంతానాన్ని సాకే సరికొత్త బాధ్యతలలో సేవారంగ కృషికి కొన్ని పరిమితులు ఏర్పడ్డాయని ఆమె గుర్తించింది.

బిడ్డల తల్లి అయినా తండ్రిప్రేమ ను ఆమె ఆంతర్యం కోరుతూనే ఉంది. పెళ్లి చేసాక తన కోసం తిరిగి చూడని తండ్రి బెజవాడలో ఇల్లు కాలిపోయి పినతండ్రి లక్షయ్య తమఇంట్లో ఉంటే తమ్ముడిని పరామర్శించటానికి వచ్చాడు.వచ్చింది కన్న బిడ్డ ఇంటికి. అయినా ఆత్మీయమైన ఒక పలకరింపైనా లేకపోవటం ఆమెకు అవమానకరంగా , దుఃఖంగా అనిపించింది. దక్షయజ్ఞం నాటి సతీదేవి గుర్తుకు వచ్చి కుళ్ళి కుళ్ళి ఏడ్చిందట.

1948 నుండి 1968 వరకు ఇరవయ్యేళ్లపాటు ఆర్ధిక కౌటుంబిక ఒడుదుడుకులు తట్టుకొని నిలబడటానికి చేసిన ప్రయత్నాలలో లాల్ పబ్లికేషన్ స్థాపన. ప్రవృత్తికి తగిన సామ్యవాద సాహిత్య ప్రచురణ వృత్తిగా మలచుకొంటే కొద్దికాలానికే అది మూతపడే పరిస్థితి వచ్చింది. ‘రాష్ట్ర యువజన సంఘం పక్షాన ‘సర్వోదయ’ అనే వారపత్రికను స్థాపించినా ఆర్ధికవనరులు సమకూర్చలేక దానిని కూడా మూసివేయవలసి వచ్చింది. చవకగా వచ్చే మెరకభూములు కొనుక్కొని స్థిరపడాలని ఏలూరుకు మకాం మర్చి భూములు కొనకుండా మళ్ళీ సామాజిక రాజకీయ సాహిత్య వ్యావృత్తులలోకి ఇమిడిపోయారు. ‘ప్రజాప్రచురణలు’ ప్రారంభించారు.

కొడుకుల పెళ్లిళ్లు, స్పర్ధలు, సర్దుబాట్లు అనారోగ్యం ఆమె జీవితంలో అశాంతిని నింపాయి. సామాజిక నిర్మాణాలలోకి తన ఇంటి నుండి సుశిక్షితులైన యువకులు కదలివెళుతుంటే బ్రహ్మానందాన్ని అనుభవించిన రంగనాయకమ్మ చరమదశలో మనుమలు మనుమరాళ్ళ ఆటపాటల మధ్య ఆనందాన్ని వెతుక్కోవలసి రావటం గమనించదగినది. కుటుంబ జీవితం కన్నా జాతీయోద్యమంలో స్త్రీలు మమేకమైన తీరును చిత్రించటంవలన రంగనాయకమ్మ స్వీయ చరిత్ర ప్రత్యేకమైనది. జాతీయోద్యమ మహా కథనానికి సమగ్రతను ఇయ్యగల ప్రాంతీయ ఉపకథన ప్రాధాన్యత వల్ల కూడా ఇది చెప్పుకోదగినది.

2.4.

1978 లో వచ్చిన స్వీయ చరిత్ర ‘ఒక్క క్షణం కాలాన్ని వెనక్కు తిప్పితే’ రచనాకాలం 1977 డిసెంబర్ నుండి 1878 మే వరకు.(‘నామాట’అనేశీర్షికతో రచయిత్రి వ్రాసిన ముందు మాట) రచయిత్రి అడవికొలను పార్వతి. అప్పటికి కొన్నేళ్లుగా గుండెజబ్బుతో బాధపడుతూ పిల్లలకు ఖాళీ ఉన్నప్పుడు అప్పడప్పుడు చెబుతూ వ్రాయించిన స్వీయ చరిత్ర కనుక మౌలికంగా ఇది మౌఖికం. ‘ఆత్మకథన్నది నిజంగా మనం చూసుకొని వ్రాసుకోకపోతే బాగా సౌందర్యంగా కుదరదు’ అని ఆమె కు తెలుసు. అందువల్లనే తన స్వీయ చరిత్రలో విషయాలన్నీ వరసక్రమంలో రాకపోవచ్చుఅని కూడా చెప్పింది. కానీ చెప్పదలచుకొన్న విషయాలన్నీ చెప్పాననే అంటుంది. “ఈ శతాబ్ది ప్రధమ దశ కాలంలో కూడా మహిళలు బహిరంగ సభలకు, సమావేశాలకు రావడానికి సాంఘిక సంకోచాలు వ్యక్తమయ్యేవి. అటువంటి కాలమంతా గడిచిపోయి రచయిత్రిగా ఈ నాటి ప్రతినిధిగా శ్రీమతి పార్వతిగారు తన ఆత్మకథను వినిపించటం ఎంతగా స్వాగతించవలసిన విషయం.” అం టారు అక్కిరాజు రామాపతిరావు గారు ఈ స్వీయ చరిత్రకు వ్రాసిన ముందుమాట ‘అభినందన’ లో.

తమ్ముడు పుట్టినప్పుడు 11 వ రోజు పురిటి స్నానం నాటి తొలి జ్ఞాపకం దగ్గర ప్రారంభించి జ్ఞాపకాలను తవ్విపోసుకొంటూ అడవికొలను పార్వతి అప్పుడప్పుడు చెప్పిన 89 శీర్షికలతో కూడిన కథనాల కదంబం ఈ స్వీయ చరిత్ర.ఇందులో పార్వతి కుటుంబ జీవితం 20వ శతాబ్ది సామాజిక జాతీయోద్యమాలతో ముడిపడి కనిపిస్తుంది. పార్వతి సాహిత్యజీవితం ఆమె అధ్యయన సృజన ప్రత్యేకతలకు సంబంధించింది.

పార్వతి పుట్టుక – బాల్యం

పార్వతి తాత రెబ్బాప్రగడ రామయ్య నాలుగువందల ఎకరాల భూస్వామి. రాజమండ్రి లో ఉంటూ ధర్మవరంలో కంచుమర్తి వారిదగ్గర ఎస్టేట్ లో మేనేజర్ గా పనిచేశాడు. ఆయన తమ్ముడు పాపయ్య కందుకూరి వీరేశలింగం పంతులు శిష్యుడు, ఆయన కార్యక్రమాలలో సహాయకారి.ఒకేఒక్క చెల్లెలు కావమ్మ ను అప్పట్లో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో పనిచేస్తున్న మహామహోపాధ్యాయ కస్తూరి శివశంకరశాస్త్రి గారి కొడుకు తహసీల్దార్ మాణిక్యాలరావు కి ఇచ్చి పెళ్ళిచేసారట.

ఆయనకు కోరుమామిడిలో పొలాలు, అక్కడ, ధర్మవరంలో పెద్ద పెంకుటిళ్లు, రాజమండ్రిలో రెండు మేడలు, అద్దెలకిచ్చే కొట్లూ ఉన్నాయి. పార్వతి బామ్మ సీతమ్మ.ఆ దంపతులు పేదవాళ్ళను ఇంట్లో పెట్టుకొని చదివించటం,వడుగులు,పెళ్లిళ్లు చేయియించటం వంటి ధర్మకార్య మగ్నులు.రాజమండ్రిలో పిల్లలు పుట్టి పోతుంటే అక్కడ ఉండలేక కొవ్వూరుకు మకాం మార్చారు. అక్కడ రెండిళ్ళు, ఇళ్ల స్థలాలు, తోటలు, భూములు సమకూర్చుకున్నారు.వాళ్ళ ఒకే ఒక్క కొడుకు రెబ్బాప్రగడ మందేశ్వరశర్మ. కూతురు అమ్మాయమ్మ. చిన్న తాత రెబ్బాప్రగడ పార్వతికి ఏకైక మేనత్త అమ్మాయమ్మ. ఆమె భర్త వేమూరి రామకృష్ణారావు. ఆయన కూడా తండ్రి వలెనె స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాడు. జైలుకు వెళ్ళాడు. గాంధీ సిద్ధాంతం ప్రకారం జీవితం గడిపాడు ఏలూరు జాతీయ కళాశాలలో చాలాకాలం హెడ్ మాస్టర్ గా ఉన్నాడు. మొత్తంగా పార్వతిపుట్టింటి కుటుంబం సామాజిక రాజకీయ ఉద్యమాలతోనూ సాహిత్య రచనా వ్యాసంగంతోనూ సంబంధం ఉన్న కుటుంబం.

పార్వతి 1931 మార్చి 22 న అనకాపల్లిలో రెండవ మేనమామ బోడపాటి నారాయణమూర్తి ఇంట్లో పుట్టింది.పార్వతి అమ్మమ్మ పార్వతి. తాత బోడపాటి రాజన్న.ఆయన తుని, బొబ్బిలి, దారా కోట, సాలూరు మొదలైన సంస్థానాల దివాన్. వాళ్ళకు ఆరుగురు మగపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు. రెండవ కూతురు లక్ష్మీ నరసమ్మ. పార్వతి తల్లి ఆమే. రెబ్బాప్రగడ మందేశ్వర శర్మ పార్వతి తండ్రి. ఆయనకు 14 ఏళ్ళ వయసులో లక్ష్మీ నరసమ్మతో పెళ్లి అయింది.పార్వతి కాక మరి ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు వాళ్ళ సంతానం.

తండ్రి రెబ్బాప్రగడ మందేశ్వరరావు బడి చదువు ఫోర్త్ ఫోరమ్ వరకే. ఇంట్లోనే తెలుగు ఇంగ్లిష్ సంస్కృత భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. కాంగ్రెస్ రాజకీయాలలో చురుకైన భా గస్వామి. పార్వతి పుట్టేనాటికి ఆయన కడలూరు జైలులో ఉన్నాడు. అందువల్ల ఆమెకు బాలసారె చేసి పేరుపెట్టలేదు. జైలు నుండి వచ్చాక బిడ్డను షేక్స్పియర్ నాటకంలోని ఒక పాత్ర ‘ఎడ్ల’ పేరుతో పిలుస్తుండేవాడట. అది అందరి నోటా నలిగి ‘డడ్డీ’ గా మారి స్థిరపడిందట. తల్లి మాత్రం తనతల్లి పార్వతి పేరుతో పిలుచుకొన్నది.

కొవ్వూరులో పార్వతి బాల్యం సంపన్న స్వగృహంలో పాడిపంటలమధ్య, ఆవు దూడల మధ్య,బహువర్ణాల పెరటి పూలతోటలమధ్య గడిచింది. బాలింతల పత్యానికి పాతబియ్యం వాళ్ళింటి నుండే. రోజు ఎంతోమందికి మజ్జిగ పోయగల పాడి, బస్తాలకొద్దీ కూరలు, నిమ్మ మామిడి వంటి పండ్లు – అన్నీ ఎంతోమందికి పంపకం అయ్యేవి. ప్రతిమనిషికీ ఆలాంటి శుభ్రమైన తిండి , పది పంటలు అతి చౌకగా లభ్యం కావాలన్నది ఆమె ఆకాంక్ష.

గుంటూరు నుండి ఉన్నవలక్ష్మీనారాయణ పంతులు శారదానికేతనం సంస్థ నిర్వహణకు వూళ్ళో పెద్దలను కలిసి చందాలు వసూలు చేయటానికి కొంతమంది విద్యార్థులతో వచ్చి రెండు మూడురోజులు ఉండి వెళ్ళేవాళ్ళని వాళ్ళతో పాటు తాను కూడా గుర్రబ్బండిలో వెళ్లిన బాల్యానుభవాలను గుర్తుచేసుకొన్నది. సంక్రాంతినెల ముగ్గులు, గొబ్బిళ్ళు, బొమ్మలు పెట్టి పేరంటాలు చేయటం, అట్లతద్దె, ఉండ్రాళ్ళ తద్దె గోరింటాకు వేడుకలు , తెల్లవారుఝాము భోజనాలు, అందరు కలిసి పాడేపాటలు, ఆడేఆటలు అన్నీ తలచుకొని మురిసిపోయింది పార్వతి. తండ్రితో కలిసి అప్పుడప్పుడు భూములున్న కోరుమామిడి వెళ్ళటం, విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఆయన బీచ్ ఒడ్డున సభజరపటం, తాను ఇసుకలో పిచ్చుకగూళ్ళు కట్టుకోవటం ఆమె బాల్య జ్ఞాపకాలు.

పార్వతి చదువు – పెళ్లి

పార్వతి కొవ్వూరు బోర్డు హైస్కూలు లో థర్డ్ ఫార్మ్ పూర్తి చేసింది. అయిదవతరగతిలో 11 మంది ఆడపిల్లలు ఉంటె థర్డ్ ఫారం వచ్చేసరికి 5 గురు మిగిలారని ఎస్ ఎల్సీ కివచ్చేసరికి ఒకళ్ళో ఇద్దరో మిగిలేవారని బడి చదువులలో ఆనాటి డ్రాప్ అవుట్ రేట్ ను చెప్పింది. ఎస్ ఎల్ సి పాసయిన అమ్మాయిలను చదువుకొన్నవాళ్ళు .. కాపురాలు చేస్తారా అనే ఒక వ్యతిరేక భావం తో పెళ్లి సంబంధాలు రాకపోవటం గురించి కూడా ప్రస్తావించింది. స్త్రీవిద్యకోసం పాటుపడిన కందుకూరివీరేశలింగం సంస్కరణ సంస్కారం రాజమండ్రి పరిసరాలలో వేరూనుకోకపోవటాన్ని ఇది సూచిస్తుంది. జాతీయోద్యమ రాజకీయాలలో ఉన్న తండ్రి థర్డ్ ఫారం పూర్తవుతూనే పెద్దమనిషి అయిందని పార్వతిని బడిమాన్పించి ఇంట్లోనే తెలుగు సంస్కృతం నేర్పించాడు. తాను చదివిన తొలిపుస్తకం బోయిభీమన్న గారి పాలేరు నాటకం. నెల్లూరు నుండి వచ్చే జమీన్ రైతు పేపర్లో అది సీరియల్ గా వచ్చేదని, తమ ఇంటికి వచ్చే ఆ పేపర్ లో తాను ఎనిమిదేళ్ల వయసులో ఆ నాటకం చదివినట్లు చెప్పింది.

14 సంవత్సరాలు నిండగానే పెళ్ళిచేసారు.అంటే 1945 లో పెళ్లి అయివుంటుంది. ఆరువేల కట్నం ఇయ్యకతప్పలేదు. జిల్లా జడ్జి రావుసాహెబ్ అడవికొలను వేణుగోపాలరావు గారి మూడో అబ్బాయి బికాం చదివి ఇన్ కం టాక్స్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న సాంబశివరావు వరుడు.అత్తగారి వూరు విశాఖపట్నం. చిన్నతనంలోనే పెళ్లి , కాపురం , ఆ తరువాత పిల్లలు … నలుగురు ఆడపిల్లలు. ఇద్దరు మగపిల్లలు. పెద్దమ్మాయి రుక్మిణి డాక్టర్.,ఆమె భర్త అత్తిలి వెంకటరత్నం కూడా డాక్టరు. కథలు నవలలు వ్రాస్తాడు. రెండవ అమ్మాయి లక్ష్మి.మూడవ అమ్మాయి అరుణ, ఆఖరు అమ్మాయి ఇందిర. పెద్దబ్బాయి గోపాలరావు. రెండవ అబ్బాయి వెంకటేశ్వర్లు. పెద్దకోడలు లలిత , అరుణ , ఇందిర స్వీయ చరిత్ర రచనలో సహాయపడ్డారు. చిత్రకారిణి ప్రెస్సు పని, పోస్టాఫీస్ పని చిన్నబ్బాయి చేసిపెట్టాడు.

కుటుంబం పెద్దది కావటం వలన అత్తవారింట్లో ఆడవాళ్లకు ఎప్పుడూ పనిపాటలతోనే సరిపోయేదని కొవ్వూరులో పుట్టింటికి వచ్చినప్పుడే తనకు చదువుకోటానికి వీలయ్యేది అని చెప్పుకొన్నది. కొవ్వూరులో తమ ఇంటికి వారాలకు భోజనానికి వచ్చే సంస్కృత కళాశాల విద్యార్థుల వద్ద పుస్తకాలు తీసుకొని చదువుకొని ఛందస్సులో పద్యాలు కట్టటం అభ్యాసం చేసింది.

ఇంత ప్రతికూల పరిస్థితులలో కాకినాడలో (బహుశా పెళ్లాయ్యాక ?) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు, పండితులు కవులు అయిన సోమంచి సూర్యనారాయణ శర్మగారిదగ్గర కొన్నేళ్లు ప్రబంధాలు, కావ్యాలు చదువుకొన్నది. ఆయన రోజు సాయంత్రం ఇంటికివచ్చి చదివి వినిపించి అర్ధం చెబుతుండేవారని తారా శశాంక విజయం, విజయవిలాసం, క్రీడాభిరామం, కాళహస్తీశ్వర, మహత్యం, శృంగారనైషధం, మనుచరిత్ర, దశకుమార చరిత్ర, పారిజాతాపహరణం,కాళిదాసు మేఘసందేశం సాకల్యం గా చదివానని పాండురంగ మహత్యం, ఆముక్తమాల్యద, శృంగార నైషధం, భారతభాగవతాలు కొంతవరకు చదువుకొన్నట్లు చెప్పింది.

తద్వారా ప్రాచీన విజ్ఞానం, కళలు, సాహిత్యం, పురాణాలు ఉపనిషత్తులు, స్మృతులే కాక అయన్ స్టీన్ పరమాణు వాదం వంటి ఆధునిక విజ్ఞాన విషయాలు కూడా నేర్చుకున్నానని రాజకీయవేత్తల మాహానాయకుల పుస్తకాలు శ్రద్ధగా చదివానని చెపుకొన్నది. మార్క్స్, ఏంగెల్స్, లెనిన్ పుస్తకాలు ప్రతివారూ చదవదగినవి అని సిఫారసు చేసింది. చరిత్ర సమాజపరిణామ క్రమం తెలిపి హేతుదృష్టిని పెంపొందిస్తాయని వాటిని మెచ్చుకొన్నది. పార్వతి అక్కాచెల్లెళ్లు, మేనత్తపిల్లలు కూడా అదే బడిలో ఆమెతో పాటు చదువుకున్న వారే. వాళ్ళ చదువులు కూడా పార్వతి చదువుల్లా అర్ధాంతరంగా ఆగిపోయే ఉంటాయి. అయితే పార్వతికి లాగా వాళ్లకు ఇళ్లల్లో ఇంత చదువులు చదివే అవకాశం వచ్చిందో రాలేదో చెప్పలేదు పార్వతి.

పార్వతి తాను చదివిన శాకుంతలం లోని విశేషాలను చెప్తూ శ్రీశ్రీ ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు’ అనే పాటను చెప్పి అందులో ఆయన కాళిదాసు ప్రతిభను ప్రస్తుతించిన తీరును చెప్పటం ప్రాచీన ఆధునిక కవిత్వాలపై ఆమెకు ఉన్న పట్టును సూచిస్తుంది. తనకు పాటలంటే ఇష్టమని చెప్తూ బసవరాజు అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు , జంధ్యాల పాపయ్య శాస్త్రి మొదలైన వాళ్ళ రచనలను ప్రస్తావించింది. అడవి బాపిరాజు వ్రాసిన నారాయణరావు నవల చదువుతుంటే కలిగే అలౌకికానందాన్ని తలచుకొని ఇవేమీ లేకుండా నిద్ర, తిండి,పని , ఉద్యోగాలు, ధనార్జన వీటితో ఎలా బ్రతుకుతున్నారుఅందరూ అనిపిస్తుంది అంటుంది ఆమె. సందర్భవశాత్తు తనకు ఇష్టమైన కవులను, కావ్యభాగాలను ప్రస్తావిస్తూ విశేషాలను వివరించటంలో మైమరచిపోతుంది. గోదావరి అందాన్ని సాహిత్య అనుభవాలతో కలిపి ఆస్వాదించేభావుకురాలు. మంచి పుస్తకాల పఠనం అందరూ అలవాటుచేసుకోవాలని భావిస్తుంది. ఉత్తమ గ్రంధాలే నిజమైన మిత్రులు అన్నది ఆమె విశ్వాసం.

పార్వతి సాహిత్య కృషి

గోగల్ వ్రాసిన ఓవర్ కోట్ కథ చాలాఇష్టమని ఒక పేపర్లో దానిని సమీక్షించానని … టాల్ స్టాయ్, హోవార్డ్ ఫాస్ట్ ,వంటి రచయితలు ఇష్టమని… గోర్కీ వ్రాసిన ‘ A Very much afraid in foama gardio నవల చాలాసార్లు చదివానని గోర్కీ శతజయంతి సందర్భంగా కళాకేళి పత్రికకు వ్యాసం వ్రాసానని చెప్పింది. ( ఆ నవల పేరు Foma Gordeyev- అనువాదం The man who was afraid ) చదివిన మంచి పుస్తకాలమీద తనకు వ్యాసం వ్రాయాలనిపిస్తుంటుందని రాహుల్ సాంకృత్యాయన్ వ్రాసిన’ 22 వ శతాబ్దం’ అనే పుస్తకం తనకు చాలా ఇష్టం అని, దాని మీద వ్రాసిన వ్యాసం అరుణరేఖ అనే పత్రికలో వచ్చిందని చెప్పింది.

16 ఏళ్ళ వయసులో గులాబీ పువ్వుని స్త్రీజీవితాన్ని పోలుస్తూ వచనకవిత వ్రాయటంతో ప్రారంభమైంది పార్వతి సృజన సాహిత్యం. ‘మా నాన్నగారి నుండి సాహిత్యం నాకు వారసత్వంగా సంక్రమించింది’ అని చెప్పుకొన్నది. ప్పుడూ ఏదో ఒకటి చదువుతూ, వ్రాస్తూ తాను ఆలోచించే శ్రామిక ధర్మ రాజ్య భావనల వరకు అన్నిటినీ తనతో పంచుకొనే తండ్రి ప్రభావం అది. అచ్చయిన ఆమె మొదటి రచన వ్యాసం. హాస్పిటల్ లో నర్సులు రోగులకు సేవచేయవలసిన విధానాన్ని గురించి వ్రాసిన ‘చల్లని చూపు- చల్లని మాట’ 18-5-1957 ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురించబడింది. స్త్రీలకి జరిగిన అన్యాయాలు,సమస్యలు తన కవిత్వానికి కథలకు, నవలలకు, వ్యాసాలకు వస్తువు అయ్యాయని చెప్పుకొన్నది. స్త్రీల గురించి స్త్రీల సమస్యలగురించి వందకు పైగా వ్యాసాలు వ్రాసినట్లు పేర్కొంది. తండ్రి క్రమ శిక్షణలో ప్రశాంత వాతావరణంలో పెరిగిన తనకు కాపురానికి వెళ్లాకే ఉమ్మడి కుటుంబాలలో ఆడవాళ్లు యెట్లా పోట్లాడుకొంటారో, ఇంట్లో ఎక్కువ సంపాదించే మగవాడి భార్యకు, తక్కువ సంపాదించే మగవాడి భార్యకు మధ్య తారతమ్యాలు ఎంతలా ఉంటాయో తెలిసివచ్చాయని అంటుంది. అవి తన కొన్ని కథలకు ఇతివృత్తాలు అయ్యాయని కూడా చెప్పింది. తొలికథ ‘అబల’ జయశ్రీ మాసపత్రికలో వచ్చింది. ‘వారిజ’ అనే కలంపేరుతో ప్రచురించబడింది.

ఆమె కవిత్వంలోఉదయాపవనాలు(1973), అరుణకిరణాలు, ‘కాంతివర్షం’ వచనకవితా సంపుటాలు. కాంతివర్షం అనకాపల్లి కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డా. జి. శ్రీరామమూర్తి చేసిన ఆంగ్లానువాదంతో సహా ముద్రించబడింది. నీలంబరాలు పద్యకవిత్వం కథలు వలయంలో బానిస, పద్మాలు-పారిజాతాలు (1975, మందారమాల అన్న మూడు సంపుటాలుగా వచ్చాయి. ఇక ఆమె వ్రాసిన నవలలు రెండుతరాల స్త్రీలు 2. తిరగబడ్డ నవతరం (జయశ్రీ పత్రికలో సీరియల్ గా వచ్చింది) వ్యాస సంపుటి ‘వ్యాసపద్మం’.

ఆచార్య రంగా నుండి, జి. కృష్ణమూర్తి వంటి తెలుగు ఆచార్యులవరకు, సంజీవదేవ్ నుండి నవీన్ వంటి రచయితలవరకు,చందూర్ దుర్గాబాయ్ దేశముఖ్ , మాలతీ చందూర్ మొదలైన అనేకులు తన రచనలను అభినందించి ప్రోత్సహించటాన్ని ప్రత్యేకంగా చెప్పుకొంది. పరివర్తన, కల్పసుందరి వంటి కథలు రాంషా వంటివారి మెప్పు పొందినట్లు చెప్పింది. కాకినాడ మొదలైన చోట్ల సభలలో కవిత్వం చదవటం, సాహిత్య ప్రసంగాలు చేయటం తరచు జరిగేది. తండ్రి ప్రకృతి చికిత్సావిధానం గురించి బాగా తెలిసిన వ్యక్తిగా పార్వతి చేసిన తొలి ఉపన్యాసం ప్రకృతి చికిత్స గురించే కావటం విశేషం. కాకినాడలో 12 సంవత్సరాల క్రితం ప్రకృతి ఆశ్రమం వాళ్ళు పెట్టిన సభకు వెళితే హైదరాబాద్ నుండి వచ్చిన ప్రసిద్ధ ప్రకృతి శాస్త్ర వైద్యులు డా. బి. వెంకట్రావు మాట్లాడమంటే ప్రకృతి వైద్యం గురించి మాట్లాడానని, అంతవరకు వ్రాయటమే తప్ప మాట్లాడని తాను చేసిన మొదటి ఉపన్యాసం అదేనని, వెంకట్రావుగారు నడిపిన ‘ప్రకృతి’ మాసపత్రికలో కూడా తాను వ్యాసాలు, పద్యాలు, గేయాలు వ్రాసినట్లు చెప్పుకొన్నది.

కాకినాడ బ్రహ్మసమాజమందిరంలో తాను ఇటీవల (స్వీయచరిత్ర రచనాకాలనికి కాస్తముందు) కందుకూరి వీరేశలింగం గురించి ప్రసంగించినప్పుడు తనతో పాటు వేదుల మీనాక్షి దేవి కూడా మరొక వక్త అని, ఆమె వీరేశలింగం శిష్యుడైన చిలకమర్తి లక్ష్మీనరసింహంగారికి మేనకోడలు కావటం, తాను వీరేశలింగం శిష్యుడే అయిన రెబ్బాప్రగడ పాపయ్య మనుమరాలుకావటం గురించి నిర్వాహకులు సంతోషపడ్డారని చెప్పింది. తన ఉపన్యాసం దుర్గాబాయ్ దేశముఖ్ గారి ఉపన్యాసాన్ని జ్ఞాపకం తెచ్చిందని మాచిరాజు సీతాపతి రావుగారు మెచ్చుకొనటాన్ని గురించి కూడా ప్రస్తావించింది.

అయితే ఆడవాళ్ళూ ఇంటిని, భర్తని పిల్లల్ని చూసుకొంటూ రచనలు చెయ్యడం కష్టమైనపనే అంటుంది పార్వతి. మగవాళ్ళు అయితే రాసుకోవాలనుకొన్నప్పుడు ఏ ఆటంకం లేకుండా గదిలో కూర్చుని వ్రాసుకోగలరని , ఆడవారికి అలా సాగదని ఆమె అనుభవం.ఏ రోజు వంట పాడైనా , ఆఫీసునుండి వచ్చేసరికి కాఫీ కలిపివ్వటం ఆలస్యమైనా ఇలు సంసారం పట్టదు, ఎప్పుడూ కథలూ కాకరకాయలే నంటూ భర్త సాధింపులు భరించాల్సి వస్తుంది. అన్ని పనులు అయ్యాక అర్ధరాత్రి కూర్చుని వ్రాసుకొందామన్న అందుకు అవకాశం ఉన్న ఆడవాళ్లు ఎంతమంది అన్నది ఆమె ప్రశ్న. రచయితకి లోకానుశీలన ఉండాలని చుట్టూ ఉన్న సమాజంతో సంబంధాలలో అది అభివృద్ధి చెందుతుందని, అప్పుడే సహజమైన రచనలు వస్తాయని. తోటి రచయితలతో సంబంధాలు, చర్చలు, ఉత్తర ప్రత్యుత్తరాలు ఇవన్నీ కూడా అందుకు తోడ్పడతాయని ఆమెకు తెలుసు, కానీ అందుకు ఆడవాళ్లకు అవకాశాలు లేవన్నదే ఆమె వాస్తవ జీవిత అవగాహన. మగవాళ్ళకి ఇంటిపని, కాన్పులు, పిల్లల్ని పెంచటం ఇవేవీ ఉండవు కనుక హాయిగా ఏకాగ్రంగా వాళ్ళ రచనా వ్యాసంగం కొనసాగుతుందని రచనా రంగంలో జెండర్ వివక్ష అమలవుతున్న తీరును వ్యాఖ్యానించింది. ఈ సందర్భంలో ఆడవాళ్ళ సాహిత్య వస్తువు మీద సెన్సారింగ్ గురించి కూడా ప్రస్తావించింది.

పార్వతి కాకినాడ మహిళాసమాఖ్యకి చాలాకాలం అధ్యక్షురాలు. స్థానిక సాహిత్య సంస్థలలో సభ్యురాలిగా, కార్యవర్గ సభ్యురాలిగా కూడా ఉంది. అరసం కాకినాడ శాఖకు కొంతకాలం ఉపాధ్యక్ష్యులుగా పనిచేయటం విశేషం. తన అనుభవాలు, ఆయననడాలు, ఆలోచనలు తాను వ్రాసిన రచనలలో ఎలా భాగం చేసిందీ కూడా సందర్భవశాత్తు ప్రస్తావించింది.

స్త్రీల గురించి

పార్వతి తన కుటుంబంలోనూ తాను చూసిన సమాజంలోనూ ఎరిగిన స్త్రీల గురించి చెప్పిన విషయాలు ఆసక్తికరమైనవి. బామ్మ సీతమ్మకు కందుకూరి వీరేశలింగం పంతులు గారి భార్య రాజ్యలక్ష్మమ్మతో స్నేహమని ఆవిడ సీతమ్మగారికోసం గుఱ్ఱం బండి మీద ఇంటికి వచ్చేదని చెప్పింది. అమ్మమ్మ పార్వతమ్మ శుచిశుభ్రతల గురించి బంగాళాదుంపల వేపుడు బూరెల్లా చేయటం గురించి, కుట్ల నైపుణ్యం గురించి చెప్పింది. చిన్నబామ్మ కామేశ్వరమ్మ, రెబ్బాప్రెగడ పాపయ్య గారి భార్య అయిన కామేశ్వరమ్మ బామ్మ చొరవ గురించి చెప్పింది. తాను 11 నెలల పిల్లగా ఉన్నప్పుడు ఆమె తమయింటికి వచ్చిందని తన అన్నప్రాశన విషయం ప్రస్తావిస్తే ఆయన జైలులో ఉన్నారు అని తల్లి నిరాసక్తంగా మాట్లాడితే వాడికేం , నిక్షేపారాయుళ్ళా బయటకు వస్తాడు, పిల్లకు అన్నప్రాశన చేసెయ్యి అని ధైర్యం చెప్పి చేయించిందట.

పార్వతి తల్లి వచ్చిపోయే కాంగ్రెస్ వారికీ, కొండజాతులవారికి, వారాల విద్యార్థులకు వండిపెట్టించటంలో అలయని అన్నపూర్ణ అని, గొప్పబీదా తేడా, కూతుళ్ళని కోడళ్ళని తేడాలు చూపని వ్యక్తి అని, కొవ్వూరులో స్త్రీసమాజానికి అధ్యక్షురాలిగా కొంతకాలం ఉన్నదని సుప్రసిద్ధ సంఘసేవిక, దేశభక్తురాలు ద్రోణం రాజ్యలక్ష్మీ బాయమ్మ తల్లికి మేనత్తకూతురని తెలిపింది. మేనత్త అమ్మాయమ్మ కొవ్వూరు స్త్రీ సమాజానికి చాలారోజులు కార్యదర్శిగా పనిచేసిందట.ఆమె చందాలకోసం అందరి ఇళ్లకు వెళ్ళేటప్పుడు తాను కూడా వెళ్లేదాన్నని చెప్పింది పార్వతి.

కొవ్వూరు స్త్రీ సమాజ స్థాపకురాలు ఆ వూళ్ళో ని ప్లీడర్ చదలవాడ గోపీనాథ్ గారి పెద్దమ్మాయి తాయారమ్మ అని, అందులో ఆడపిల్లలకి సంస్కృతం, హిందీ, తెలుగు , సంగీతం, కుట్టుపని నేర్పేవారని చెప్పింది. తాయారమ్మ ను వేదవల్లి తాయారమ్మ అని అత్తవారింటి పేరుతో పేర్కొని ఆవిడ ఉభయభషా ప్రవీణ , రచయిత్రి కూడా అని పేర్కొన్నది. వేదవల్లి తాయారమ్మ రచయిత్రి కూడా. ఆమె చెల్లెళ్ళు చెన్నగంటమ్మ, సంగీతమ్మ సంగీతం నేర్పేవారని చెప్పింది. చెన్నగంటమ్మ పేరుతో ఒక రచయిత్రి ఉంది. ఆమె యీమేనేమో!? వీళ్ళతో పాటు వీరవెంకట సుబ్బమ్మ అనే మరొక అధ్యాపకురాలు కూడా ఉభయభాషాప్రవీణ అని అని, ఆమె రాజమండ్రి సదనంలో చదువుకున్నది చెప్తూ బత్తుల కామాక్షమ్మ దానిని స్థాపించినట్లు సమాచారం ఇచ్చింది ఇదంతా చారిత్రకంగా స్త్రీల విద్యా సామాజిక స్థాయిని, అందులో స్త్రీల సృజనాత్మక భాగస్వామ్యాన్ని అంచనావేయటానికి పనికివచ్చే ముడిసరుకు. పార్వతి చెన్నగంటమ్మ దగ్గర సంగీతం వీరవెంకట సుబ్బమ్మ వద్ద కాళిదాసు కుమారసంభవం చదువుకున్నది.

పార్వతి దొడ్డమ్మ అంటే తల్లికి అక్కగారు నిడమర్తి నరసమ్మ గురించి చెప్తూ ఆవిడ పెళ్ళయాక భర్తదగ్గరే చదువుకొన్నదని చెప్పింది. ఆమె మంచి వ్యవహర్త అని, బంధువులకి ఏ సహాయం కావలసివచ్చినా చేస్తుండేదని చెప్పింది.

తన అక్కయ్య దుర్గాంబ ఉభయభాషాప్రవీణ చదువుకున్నది. చిన్నప్పుడు తండ్రి ఆమెను కాకినాడ కాంగ్రెస్ కి తీసుకువెళ్లారని కస్తూరిబాయ్ ‘అచ్చా లడకీ’ అని ముద్దుచేసిందని, భగత్సింగ్ ను ఉరితీసినప్పుడు తండ్రితో పాటు రైలు ప్రయాణం చేస్తున్న ఆ అక్క నాన్నా భగత్సింగ్ అని ఏడ్చిందని చెప్పింది. అర్జరపు రమణారావు తో ఆమె పెళ్లి అయింది. చెల్లెలు సుబ్బలక్ష్మి హిందీ విశారద చదివింది. తెలుగు స్వతంత్రకు చాలా రోజులు రచనలు చేసింది. మేనత్త కొడుకు ఆదర్శ యువకుడు,కొవ్వూరు హైస్కూల్ లో తనతో కలిసి చదువుకొన్న వేమూరి విజయ దత్త్రేయతో చెల్లి వివాహం జరిగినట్లు చెప్పింది.

తండ్రి రెబ్బాప్రగడ మందేశ్వర రావు గురించి పార్వతి ఇందులో గాంధీ అనుయాయిగా తండ్రి కార్యాచరణ గురించి చాలానే చెప్పింది. రాజమండ్రిలో బిపించంద్రపాల్ ఉపన్యాసం విని ఉత్తేజితులై జాతీయోద్యమం వైపు నడిచారని తిలక్ స్వరాజ్య నిధికి 6 వేళా రూపాయలు విరాళం ఇచ్చారని, స్వరాజ్య ఉద్యమం కోసం ఊరూరా తిరిగి ఉపన్యాసాలు ఇచ్చారని, సహాయనిరాకరణోద్యమంలోఆస్తులు జప్తుచేసినా పన్నులు కట్టకపోవటం, ఇంట్లో అందరూ ఖద్దరు బట్టలే కట్టటం, మగపిల్లలకు కట్నకానుకలు లేని పెళ్లిళ్లు, పెళ్ళిళ్ళప్పుడు గాంధీ పటం ముందు పెట్టటం వంటివి ఆయన ఆచరణ కార్యక్రమాలు. ఎవరిపనులు వాళ్ళే చేసుకోవాలన్న గాంధీ సూత్రం ప్రకారం తండ్రి తనగది తానే చిమ్ముకొనటం, పిల్లలను కూడా ఇంట్లో పనులు చేయటానికి ప్రోత్సహించటం వంటి వాటిని గుర్తుచేసుకొన్నది. ప్రకృతి వైద్యం, ఆ ప్రకారం ఆహారం అలవాట్లు, హోమియో వైద్యం ఇంట్లో పాటించేవారని చెప్పింది.

ఆంధ్ర రాష్ట్ర జమీను రైతు సంఘం పెట్టి తన తండ్రి కార్యదర్శి గా, టంగుటూరి ప్రకాశం పంతులు అధ్యక్షులుగా పనిచేశారని, భోగరాజు పట్టాభి సీతారామయ్య మొదలైన వాళ్లతో స్నేహ సంబంధాలు ఉన్నాయని ఈ స్వీయ చరిత్రవల్ల తెలుస్తున్నది.ఆయన కొంతకాలం యుగధర్మ అనే పత్రికను తెలుగులోనూ, ఇంగ్లీష్ లోనూ నడిపాడని కూడా చెప్పింది. తండ్రి తన శక్తిని దేశసేవకు, రాజకీయాలకు ధారపోయకుండా ఉంటే గొప్పకవి, కథానవలా రచయిత అయివుండేవారని ఉప్పలలక్షణారావు తనకు వ్రాసిన ఒక ఉత్తరంలో పేర్కొన్న విషయం చెప్పింది. తండ్రి మంచి చిత్రకారుడు కూడా అని, దేవులపల్లి కృష్ణశాస్త్రీ, పురిపండ అప్పలస్వామి, తల్లావఝల శివశంకరశాస్త్రి, గొర్రెపాటి వెంకట సుబ్బయ్య వంటి వాళ్లకు ఆయన పట్ల గౌరవం అని తండ్రి గురించి చెప్పింది.

కొవ్వూరు లో శనివారపు సుబ్బారావు, బొడ్డుపల్లి నరసింహం కాంగ్రెస్ లో పనిచేసిన ప్రముఖులు అని, తల్లాప్రగడ సూర్య నారాయణరావు సంస్కృతపాఠశాల స్థాపించారని, విద్యార్థులకు ఉచితంగా భోజనాలు పెట్టేవారని హేతువాద రచయిత వల్లూరి సూర్యనారాయణ రావు ఆస్తి పాస్తులన్నీ తండ్రివలెనే ప్రజా ప్రయోజనాలకె వెచ్చించారని చెప్పింది. ఆయనకూతురు పాపాయమ్మను కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారి బావమరిదికి ఇచ్చి చేశారని చెప్పింది.

పార్వతి పుట్టుకలప్పుడు జైలులో ఉన్న తండ్రి తన తండ్రి చావుబతుకులప్పుడు రెండవసారి జైల్లో ఉన్నాడు. అయితే ఆయన జైలునుండి వచ్చిన రోజో మర్నాడో తండ్రి కళ్లుమూసాడు. దహన కర్మకాండలు పూర్తి చేసి కొడుకుగా తన ధర్మం నిర్వర్తించాడాయన అని అంతా ఊపిరి తీసుకొన్నారని అంటుంది పార్వతి.

జైలు జీవితంలో శేఠ్ జామునాలాల్ బాజాజి, గొల్లపూడి సీతారామశాస్త్రి ఆయన సహచరులు. తన తండ్రి తద్దినం రోజు జమున్నాలాల్ మందేశ్వరరావు గారికి బ్రాహ్మణార్ధంగా భగవద్గీత ఇచ్చాడని చెప్పింది. గొల్లపూడి సీతారామశాస్త్రి, తన తండ్రి నానబెట్టిన పెసలు, వేరుశనగకాయలు వంటి అపక్వాహారమే తినేవాళ్ళని శర్మాస్ డైట్, శాస్త్రీస్ డైట్ అని దానిని వ్యవహరించేవారని పేర్కొన్నది. రెండుసార్లు జైలుకు వెళ్ళటం, మాడుగుల కొండజాతివారికోసం అక్కడకు వెళ్లి పనిచేయటం వీటన్నిటితో 1942 నాటికి ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నదని ప్రకృతివైద్యం, ప్రాణాయామము వంటి చికిత్సలలో ఉపశమనం పొందేవాళ్ళని చెప్పింది.

1959 లో ఆయన చనిపోయాడు. ఆప్త మిత్రులు కేశరాజు అప్పారావు ఆయన జీవిత విశేషాల్ని, సంక్షిప్త కార్యకలాపాల్ని తెలియపరుస్తూ ఆంధ్ర పత్రిక డైలీకి వ్యాసంగా వ్రాసాడని అదే తరువాత ఆయన సంక్షిప్త జీవితచరిత్ర అని పుస్తకంగా వేశారని చెప్పింది. ధర్మ వీరం, దయావీరం, దానవీరం, రణవీరం మూర్తీభవించిన వ్యక్తిగా ఆయన తండ్రిగురించి చెప్పాడని పేర్కొంది. త్రిపుర రామధర్ కాంగ్రెస్ ను సినీ నిర్మాత బియన్ రెడ్డి డాక్యుమెంటరీగా తీసాడని అందులో తన తండ్రి కనిపిస్తాడని కూడా ఆమె చెప్పింది.

కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుతో తనకున్న స్నేహాన్ని గురించి చెప్తూ తండ్రి సైమన్ కమీషన్ వచ్చినప్పుడు ఒక బోర్డర్ దాటి వెళ్ళితే అరెస్ట్, కాల్చివేతల ఉత్తుర్వులు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరించి చావుకు తెగించి వెళ్లిన నాటి అనుభవం వ్యాసంగా వ్రాసి ఆంధ్ర పత్రికలో ప్రచురించిన విషయాన్ని చెప్పాడని పేర్కొన్నది.రాజమండ్రిలోని గౌతమీ గ్రంధాలయానికి, కొవ్వూరు గ్రంథాలయానికి కార్యదర్శిగా ఉన్నారని చెప్పింది.


కాంగ్రెస్ పనుల మీద ఎక్కువగా బయట తిరిగే తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో అందరికీ వార్తాపత్రిక చదివి వినిపించటం, గాంధీ తత్వం నుండి శంకరాచార్యుల అద్వైత తత్వాన్ని, మార్కిజాన్ని సమాన అభినివేశంతో చదవటం, చర్చించటం, వాటిని సమన్వయించి నూతన సిద్ధాంత పరికల్పనతో శ్రామిక ధర్మ రాజ్యసిద్దాంతాన్ని ప్రతిపాదించటం, మద్రాసు, ఢిల్లీ లలో సెంటర్లు పెట్టి సెక్రటరీలను నియమించి ప్రచారం చేయటం, మోడరన్ రివ్యూ పత్రికలో అది సమీక్షించబడటం, ఆ పత్రిక ఎడిటర్ నళినీకాంత్ భద్రా ఆ సిద్ధాంతం పట్ల గౌరవంతో కలకత్తానుండి కొవ్వూరు రావటం మొదలైనవాటిని వివరించి చెప్పింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన ఆంధ్రాయూనివర్శిటీలో తన తండ్రి శ్రామిక ధర్మ రాజ్య సిద్దాంతాన్ని గురించి ఉపన్యసించాడని చెప్పింది. ఆయన శ్రామిక ధర్మ రాజ్య సభను ఏర్పరచి ఒక జెండా రూపొందించాడని, దాని గురించి ఒక వచన కవిత కూడా వ్రాసాడని పేర్కొన్నది.

భారతవస్త్రపరిశ్రమ గురించి ఆయన ఒక పుస్తకం వ్రాసాడని, ఆయన వ్రాసిన ఆర్ధిక రాజకీయ గ్రంధం ‘రాజ్యాంగ వివేకం’ నాగపూర్ యూనివర్సిటీలో బిఎ విద్యార్థులకు పాఠ్యగ్రంధంగా ఉండేదని చెప్పింది. కాంగ్రెస్ లో మృతవీరుల సంస్మరణార్ధం 1942 లో కొవ్వూరు లో గోదావరి ఒడ్డున వీర సంస్మరణ మందిరం కట్టించాడని .కొండావెంకటప్పయ్య పంతులు ప్రారంభోత్సవం చేసాదాని ఆ ఉత్సవానికి ఏలూరు నుండి సుప్రసిద్ధ దేశ సేవిక రత్తమ్మ వచ్చినట్లు పార్వతి పేర్కొన్నది.తండ్రి కాంగ్రెస్ మృతవీరుల జీవిత చరిత్రలు సేకరించి ఆంధ్ర వీర సంస్మరణ కుసుమాంజలి అనే పుస్తకం ప్రచురించిన విషయం, కాంగ్రెస్ లో పనిచేసిన కలగ సత్యన్నారాయణ అందుకోసం ఊరూరా తిరిగి వెళ్లి సమాచారం సేకరించుకు రావటం గురించి కూడా చెప్పింది.

అల్లూరి సీతారామరాజు సహచరులు గంటం దొరో, మల్లుదొరో గానీ కొవ్వూరు వచ్చి తండ్రిని కలిసాడని చెప్పింది. గంటం దొర 1924 లోనే బ్రిటిషువారితో పోరాటంలో చనిపోయాడు కనుక వచ్చింది మల్లుదొరే కావాలి. పార్వతి తండ్రి రెబ్బాప్రగడ మందేశ్వరరావు శ్రామిక ధర్మ రాజ్య సభా పక్షాన విశాఖజిల్లా కృష్ణదేవిపేటలో గంటం దొర దహన పవిత్ర క్షేత్రంలో ఒకవేదికను, శిలాశాసనాన్ని నిర్మించి రామరాజ శ్రామిక ధర్మరాజ్య కేంద్రం ఏర్పరచారని చెప్పింది. ఇదంతా 1950 నాటికి జరిగింది. అట్లాగే ఆయన మాడుగుల కొండజాతి ప్రజల అభివృద్ధికి కూడా శ్రమించినట్లు ఆ సేవా కార్యక్రమాల కోసం ఆస్థిలో కొంతభాగం కేటాయించినట్లు తెలిపింది.బ్రిటిష్ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి వాళ్ళ మీద బరువై కూర్చున్న గుత్తి, ముఠాదారి విధానాలను రద్దుచేయించాడని, ఈ కృషిని మెచ్చుకొంటూ గాంధీ ఆయనను యంగ్ ఇండియా, హరిజన్ పత్రికలలో వ్రాసాడని కూడా పేర్కొన్నది. కొంతమంది కొండవారిని కొవ్వూరుకు పిలిపించి చదువులు చెప్పించారని, కొంతమందికి ఉపాధ్యాయులుగా తర్ఫీదు ఇప్పించారని చెప్పింది. ఆదిమజాతి సంఘ సేవకులు థక్కరు బాబు తమ ఇంటికి తరచు వస్తుండేవాడని కూడా చెప్పింది.

ఈ సందర్భంలో శ్రీకాకుళం జిల్లా స్త్రీ సమాజం ఉషస్సు అనే సావనీర్ వేసినప్పుడు మహీధర జగన్మోహనరావు గారి ఆదేశం మేరకు సీతారామరాజు గురించి, తండ్రి కొండజాతివారికి చేసిన సేవల గురించి సమాచారం సేకరించి ‘ఆదివాసికి అరుణోదయం’ అనే వ్యాసం వ్రాయటం చెప్పుకోవలసిన విషయం.

ఉత్తమ దేశభక్తులు, మేధావి, స్వాతంత్ర్య సమరయోధులు, అయిన రెబ్బాప్రగడ గారి కూతురుకావటమే కాక ఆయన నిర్మాణదీక్షాదక్షతను గురించి చాలా సంగతులు వ్రాయటం వలన కూడా పార్వతి ఆత్మకథను ఎంతో విలువవుంది అంటారు ఈ ఆత్మకథను ముందుమాట వ్రాసిన అక్కిరాజు రామాపతిరావు.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply