సిరిపన్న మానోగటి

“ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సలుపేమున్నది. మనద్దిరమూ ఒకటై చేయికలిపితే ఎదురేమున్నది” అనే పాట పుట్నికాన్నుండి పల్లెలోని పెద్దలు చిన్నలు పనులు కాడ పాడుకుంటాము. ఈ పాట మా ఒల్లమిరింది. అందుకే మా ఊర్లో ముక్కాలవాసి జనం ఈ పొద్దు గడిస్తే చాల్లే అనే జనాలే ఉన్నారు. ఈ తీరుగానే ఈ పొద్దు పదిమంది ఆడ్లోల్లం చామంతులు కోయడానికి మా ఊరి మద్దిరెడ్డికి కూలి పనికి పొయినాము. ఆ పూలతోట కండ్లార బోసినట్లుంది. ఈ పొద్దు సూరీడు మా మింద దయతో మేగం సాటున మగము వారసేసినాడు. గాలి దేవుడు చల్లగా మా తనువును ముద్దాడతా ఉండాడు.

మా మనసుకు, నోటికి హద్దు పొద్దు లేకుండా ఆడ మగ పెనుగులాట గురించి ఇగటకొయి మాటలు మాట్లాడుకుంటా ఉన్నాము. పూలు కోసి మాకొప్పుల నిండా ముడుసుకున్నాము. అబుడనంగానే మద్దిరెడ్డి గెనుంమింద అటుఇటు తిరగతా ఉన్నాడు. ఈ మద్దిరెడ్డికి అరువైన ఆడది కంట్లో పడితే దాన్ని నైస్గా నగిస్తా మాటలతోనే వాని వశము చేసుకున్నంతవరకు చిత్రశమపడతాడు. ఈడుండే పదిమంది ఆడోల్లలోన మా రాదక్క మేటిగా కనపడుతుంది. ఈ రెడ్డి గెనింమీద నుండి మా కాడికొచ్చి మా రాదక్కకల్ల నిలజుస్తా రాద మొగుడు దేవుని దగ్గర ఒక పువ్వు ఎగేసొచ్చినాడు. బలంగా ఉండే పెళ్ళాం సిక్కింది. బాగా కష్టపడుతుంది. పొస్తులుండే పనుండదు, కడుపునిండా తినొచ్చు అనే నగతా.

ఆ మాట మా అందరికీ ఎరుకాయ, ఈడు కావల్లనే రాదను దుగతా ఉండాడు అని. మా శారదొదిన ఉండి “కాదే రాదా కొందురుంటారు ఇంట్లో వస్తువులు ఎక్కువ వాడితే అరిగిపోతాయి అని వాడకుండా ఊరోల్ల సామాన్లు అరగ్గొడతా ఉంటారే” అనే నగతా. ఆ మాటకు మా నాగత్త “కాదండే పాపల్లారా ఈ పొద్దు నేను ఒక మాట చెప్తా ఇనండి. మనిషి అంటేనే తురిపితి లేని జీవితాలు. ఆడది గాని, మగోడుగాని పంచి వన్నెల పదార్థం తిన్నా ఇంకా ఏదో తక్కువ ఉందనిపిస్తుంది. ఈ బూమ్మింద పుట్టిన పతి మనిసి ఏరేరుగానే పుడతారు. సూచములో మోచ్చము అన్నట్లు పోవల్ల. నేను మీకు వొగ ఊగట కత చెప్తా, నీకు తోడుమైన కతే రాదా, ఊ కొట్టు అనే నాగవ్వ.

“వొగూర్లో ఒగ రాజున్నాడంట. ఆ రాజు కింద మంతిరి తనం చేస్తా ఉన్నాడంట సామిరెడ్డి. ఆ సామిరెడ్డికి ముగ్గురు కొడుకులు. ఆ ముగ్గురు కొడుకులుకి పెండ్లయింది. చిన్న కొడుకు పెండ్లాము అంటే చిన్న కోడలు బలే రూపవతట. ఆయమ్మ ఎంటికే ఎయ్యిబారంట. వాల్లింట్లోవాల్లు ఆ యమ్మను బయట పనికి పంపించేది లేదు. మిగిలిన వాళ్ళందరూ పనికి బోదురు. ఆయమ్మ ఇంట్లోపనులు చేసుకొని ఇంట్లోనే ఉండేది. అట్లుంటే ఒగనాడు రాజు ఆయమ్మను చూసినాడంట. ఆ రాజుకు ఆ పిల్ద మింద బెమ అయ్యిందట, ఒగ నాడైనా ఈ చిన్నదాన్ని ఏలల్ల అని. రాజు తన మంత్రులను పిలిపించి రాజినగిరిలో పాల్దాపి కట్టేసిఉంటారే ఆ చిన్న దూల్లన్నిట్నీ తాల్లిప్పేసి సామిరెడ్డోల్ల రాగిసేన్లో తోలేయండి అని చెప్పినాడు.

తర్వాత చిన్నకోడలుకు ఎవరో చెప్పినారు. దూల్లన్నీ సామిరెడ్డి సేన్లోకి పొయినాయి. ఆ ఇంట్లోవాళ్ళు ఎవరన్నా ఉంటే పోయి తోలుకోబొండి అని. ఆ రాగిసేన్లో మొరుగ్గా రాజు కుసోని చూసుకోనుండాడంట ఈ యమ్మ కోసం. ఈయమ్మ సేన్లోకి పోయి ఆయమ్మ తల ఎంటుకలతో అన్ని దూల్లను ముడేసుకొనొచ్చి ఇంటికాడ అన్నిటికీ చిలకల్లు ఏసి కట్టేసిందంట. ఈ రాజు చూసి చూసి వొచ్చేసినాడు. ఏమే తమ్మ అని అడిగినోడు కాదు. ఆ యమ్మ కూడా ఈన తో ఏం పనుందిలే అనుకునింది. ఇట్లా ఆపొద్దు గడిసె.

ఇంగొగనాడు ఏం చేసినాడు రాజు, ఈ పొద్దు మన ఇంటికాడ సమారాజన పెట్టల్ల, ఒరేయ్ తోటి, తలారి ఊర్లోకి పోయి సాటింపేయండి. చీర కట్టిన సిరియా(స్త్రీ ), మొల్తాడు కట్టిన మొగోడు, అందరూ వొచ్చి మన నగిరిలో బోంచేసి ఎల్లల్ల అన్నాడు. అందరూ వొచ్చి బోంచేసుకుని పోతాఉండారు. సామిరెడ్డి చిన్నకోడాలు రాలేదంట. ఈ రాజు చూసినంచేడి చూసి సామిరెడ్డిని అంచుకు పిలిచాడు. సామిరెడ్డి రాజుకాటి కొచ్చి ఏమి సామి అన్నాడు. ఏమీ లేదు నేను ఏమని దండోరేపిచ్చిన, మొల్తాడు కట్న మొగోడు, చీర కట్టిన సిరియ ఎవురూ వాల్లిండ్లలో బోంచేయకూడదు. మన నగిరిలోనే వొచ్చి బోంచేయల్ల అంటే నీ చిన్న కోడలువొచ్చిండ్ల అని అడిగినాడు, ఏమన్నా పని మీదుండి రాలేకపోయింటుంది. నేను పోయి పంపిస్తాను అని సామిరెడ్డి ఇంటికి పోయి చిన్న కోడలుకు చెప్పి పంపించినాడు. ఆయమ్మ వొచ్చి తింటా ఉందంట, ఈ రాజు పడశాలలో (ఇంటిముందర ) కురిజీ ఏసుకొని కూసోని ఉండాడంట. ఆ యమ్మను ఏమేతమ్మ అనలేదంట, ఆయమ్మ తినేసి వొచ్చేసింది.

అట్లా మల్ల నాలుగు దినాలు బొయినంక మల్ల ఈ రాజుకి పులుగు తొలిసింది. సామిరెడ్డిని పిలిసి నేను తీర్థయాతరలకు పాతా ఉండాను. మా యమ్మ దగ్గర ఎవరూ మనిసి లేరు. మాయమ్మ మహారాని కదా ఈ రేయిరేతిరి ఆయమ్మ దగ్గర నీ చిన్నకోడల్ని పనుకోమను. నేను ఈ పొద్దు, రేపు రాను అని చెప్పినాడు. ఇంగ రాజు చెప్పినట్లు ఇనల్ల కదా అని సామిరెడ్డి కోడల్ని అంపించినాడు. ఈ రాజు వాల్ల అమ్మకు ఏమని చెప్పినాడు అమ్మా నీ ఒళ్ళు మింద ఎండి, బంగారు ఉంది కదా, యా టయానికి యట్లనో ఏమో ఆ పిల్లదాన్ని పక్క రూములో పొనుకోమను అని చెప్పినాడు. ఆ రాత్రి చిన్నకోడలు వచ్చింది. వాళ్ళమ్మ ఆయమ్మను పక్క రూములో పొనుకోమని చెప్పింది. ఈయమ్మబొయి పక్క రూములో పొనుకునింది. రాజేమి చేసినాడు, బంగారు సిరిమల్లెలు చేపించుకున్నాడు.

గెరికిపాసలు పెరుక్కోని వచ్చి, ఆటితో ఆ బంగారు సిరిమల్లెలు కుట్టి ఆయమ్మ సిగలో పెట్టి, ఆయమ్మంచుకు పావల్ల అనేది ఆయన అలోసన. ఆయమ్మ పనుకోనుండే రూముకొచ్చినాడు, ఆ రాజు ఆ సిరిమల్లి కుట్టి సిగలో పెట్టబోతావుంటే ఒకటి పడిపోయేదంట, మల్ల ఆ ఒకటి కుటి పెట్టబోతే ఇంకొకటి పడిపోయేదంట అట్లా ఒకొక్కటి జారిపోతానే ఉంటే వాడు రేయంత కుట్టుకుంటానే తెల్లారిపోయిందంట. ఆయమ్మ లేసి ఇంటికొచ్చేసింది. ఆ పొద్దు కూడా అట్లా గడిసిపోయింది.

ఈ యమ్మ ఇంగెట్ల నాచేతిలో చిక్కేది అని ఆ రాజు ఆలోసన చేసి సామిరెడ్డిని పిలిపించినాడు. ఏమయ్యా సామిరెడ్డి నేనుగా కతేస్తా నువ్వు ఇప్పల్ల అన్నాడు. సామిరెడ్డి ఉండి ఇది పల్లి కాదు, పట్నంకాదు, నువ్వు కతేస్తే నేను ఏమని ఇప్పేది అన్నాడు. ఏమన్నా గాని నువ్వు ఇప్పల లేదంటే నీ తల ఊరికి ఉత్తరిస్తా అని రాజు చెప్పే. సామి రెడ్డ్డి చేసేదేమీ లేక సరే అనే రాజు కత యేసే. “సామిరెడ్డి ఇంటి ఎనక సిరిపన్నమానొగటి, ఆ సిరిపన్నమాండ్లో చిన్నారి చిలక. దాని ముక్కులో కాసింత గోరు. దాని అర్థం ఏందో ఇప్పు” అన్నాడు రాజు. సామిరెడ్డి ఉండుకొని నేను చెప్తికదా సామీ నాకు దాని అర్థం తెలియదని అనే. అదంతా నాకు తెలియదు నీకు ఐద్దినాలు గెడివిస్తా వుండా. ఈలోగా ఇప్పకపోతే నీ తల ఊరు మగసాలకు ఉత్తరిస్తా అన్నాడు. ఈ సామిరెడ్డి ఇంటికొచ్చి నట్టింట కుసోని నెత్తిన చేతులు పెట్టుకొని అంగలారస్తా ఉండే. కూడు తినేది లేదు, నీళ్లు తాగేది లేదు, పీనిగైపోతా ఉండాడు. అబుడు చిన్న కోడలు ఆ యప్పను చూసి “యాల మామ ఇట్లుండేది ఏంజరిగింది, తలంటి నీళ్లు పోసుకోలే, ఉతికిన వస్త్రాలు కట్టుకోలే బోంచేయలే ఏం జరిగింది చెప్పు” అని అడిగింది. “ఏం చెప్పేది లేమ్మా నువ్వు ఆడదానివి ఆరిసేవా తీరిసేవా” అన్నాడు మామ. “ఆడదైతే ఏమి మామ పరాక్రముండల్ల గాని నువ్వు చెప్పు” అనడిగింది. “ఏమీ లేదమ్మా రాజు కతే సినాడు ఇట్లా “సామిరెడ్డి ఇంటెనుక సిరిపన్నమాను, ఆ సిరిపన్నమాండ్లో చిన్నారి చిలక, దాని ముక్కులో కాసింత గోరు అని” అది ఇప్పకపోతే నా తల ఊరు మగసాలకి ఉత్తరిస్తాడంట అదిప్పే దానికి నానింటి కాలేదు” ఆనే. ” ఒసి ఇంతేనా లే మామ లేసి ఊరూరుకి, పల్లిపల్లికి దండోరేపిచ్చు ఎక్కడెక్కడ ఉండే రాజులందర్నీ రమ్మను. నేనిప్పతా కతని అనింది. వాళ్ల మామకు సంబరం అయిపోయింది. రాజు కాడికి పోయి “రాజా నువ్వు నాకేసిన కత నా చిన్న కోడలిప్పుతుందంట అందర్నీ సబకూర్చమనింది” అని చెబితే ఆ రాజుకు ఎక్కడ లేని ఆనందమైపోయింది. అందరూ సబజేర్నారు.

ఈ అమ్మ ఒక అద్దము ఎత్తుకొని పోయింది. సబకంతా నమస్కారం చేసి ఈ రాజును కతని మల్లా ఎయ్య మనింది. ఆ రాజు మల్ల కతేసి నాడు. సామిరెడ్డింటెనుక సిరిపన్నమాను, ఆ సిరిపన్నమాండ్లో చిన్నారి చిలక, దాని ముక్కులో కాసింత గోరు దాని అర్థమేమి అని అడిగే. ఈ యమ్మ “కాదు రాజా సామిరెడ్డిది మడి, రాజుది పడ్డపేనుగు (పట్టపు ఏనుగు). మడిలో నిక్కి తక్కి బొక్కడు మేసింటే వొద్దనిందురా అనే.

రాజామాటకు తెల్ల మగమేసుకోని పైకి చూసినాడు. పైనేమి కనపడుతుంది ఇందసామీ అని అద్దమిచ్చింది. నీ ఎర్రిమగం అద్దంలో చూసుకో అని. అబుడు ఆ రాజు తనదే చేతగానితనం అని తెలుసుకుని ఆ యమ్మను, వాళ్ళ మామను అంతటితో ఇడిచేసినాడు.

అట్లా ఎవరి కన్నా ఎవరి మిందన్న సూపుంటే చెప్పల్ల కదా పై చూపులు చూస్తే ఏమొస్తుంది చెప్తేనే కదా కాయ పండ అనేది తెలిసేది అనే మా నాగత్త కత ముగిస్తా. ఈ మద్దిరెడ్డి మేము చెప్పుకునే కతంతా సాటుగా ఇంటనే ఉన్నాడు. మా కతకు పొద్దుకు సరిపాయ. ఆకీరుకు వొగనాడు ఈ మద్దిరెడ్డి రాద చేయి పట్టుకుని వాడి మనసులో మాట చెప్పినాడు. కానీ రాద నాకొద్దయ్య నాకు ఇంట్లో కోరినాతిండుంది అని ఒప్పుకోనుండ్ల.

**

పుట్టింది చిత్తూరు జిల్లా మదనపల్లె దగ్గర  బురుజు మాదిగపల్లె. కథా రచయిత్రి. వ్యవసాయ కూలీ కుటుంబం. ప్రధాన వృత్తి వ్యవసాయం. రచనలు వీరి వ్యావృత్తి. ముప్పై కథలతో 'ఎదారి బతుకులు' కథా సంపుటి ప్రచురించారు. ఇప్పటివరకు అరవై కథలు రాశారు. గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 'నవోదయం' మాస పత్రిక నిర్వహిస్తున్నారు.

Leave a Reply