సామ్రాజ్యవాద యుద్ధాలను వ్యతిరేకిద్దాం

వెలగట్టలేని కుటుంబ శ్రమతోను, సమాన పనికి సమాన వేతనం పొందలేని వేతన బానిసత్వంలోనూ యావత్ మహిళా ప్రపంచం రోజూ యుద్ధ వాతావరణంలోనే జీవిస్తున్నారు. అమెరికా- ఇజ్రాయిల్ సామ్రాజ్యవాద, జియోనిస్టు శక్తులు ఇరాన్ పై దాడి చేసి పచ్చిమాసియాలో సృష్టించిన యుద్ధ బీభత్సం మూడవ ప్రపంచ యుద్ధ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. ప్రతి సామ్రాజ్యవాద అధర్మ యుద్దాల్లో ముందుగా బలయ్యేది పసిపిల్లలు, స్త్రీలు మాత్రమే. ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించి ఆ దేశ అధ్యక్షుడు ఆయతుల్లా ఖమేనిని దారుణంగా హతమార్చడమే కాకుండా ఒక పాఠశాలపై కురిపించిన బాంబుల వర్షంతో 165 మంది బాలికలు హతమయ్యారు. ఇక 2023 అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడికి ప్రతీకారం పేరిట గాజాపై ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 23 నెలల్లోనే 28 వేల మంది మహిళలు మరణించారని యుఎన్ ఉమెన్ నివేదిక స్పష్టం చేసింది. ఇక యూనిసెఫ్ గాజాను పిల్లల పాలిట మృత్యు కేంద్రంగా (నరక కూపంగా) అభివర్ణించింది. ‘మిడిల్ ఈస్ట్ ఐ’ అనే ఇంగ్లాండు బేస్డ్ పత్రిక “పితృస్వామ్య సమాజంలో యుద్ధానికి బలయ్యేది స్త్రీలే” ఎక్కువ అని అభివర్ణించింది. ఇందులో స్త్రీలపై అత్యాచారాలు సర్వసాధారణంగా జరుగుతాయని, ఒక్క గాజాలోనే పది లక్షల మంది ప్రజలు ఆకలి బారిన పడ్డారని స్పష్టం చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 67% ఉక్రెయిన్ పిల్లలు నిర్వాసితులయ్యారని, గాజాలో ఈ దుర్మార్గం నిత్య కృత్యమైందని స్పష్టం చేసింది. ఒక్క 1986-1996 మధ్య 20 లక్షల మంది పిల్లలు మరణించడం, 60 లక్షల మంది క్షతగాత్రులు గావడం చూస్తే మనం ఏ భవిష్యత్తును నిర్మిస్తున్నామో తెలుస్తోంది.

అందుకే 116వ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి 8 సందర్భంగా సామ్రాజ్యవాద ఆధర్మ యుద్ధానికి నిరసనగా ప్రత్యేకంగా పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయిల్ సృష్టిస్తున్న దారుణ మారణకాండను, విధ్వంసాన్ని నిలిపివేయాలని కోరుతూ ఎక్కడికక్కడే నిరసన ప్రదర్శనలు, సభలు-సమావేశాలు జరుపుకుందాం. స్త్రీలు-పిల్లల పై దాదులు ఆపడమే కాకుండా మొత్తం సామ్రాజ్యవాద అధర్మ యుద్ధాలనే నిలిపివేయాలని నినదిద్దాం.

ప్రపంచంలో స్వేచ్ఛాయుత పెట్టుబడిదారీ విధానం అంతమై గుత్తా పెట్టుబడిదారీ విధానం సామ్రాజ్యవాదంగా రూపుదిద్దుకుంటున్న దశలోనే దాదాపు 120 సంవత్సరాల క్రితమే అమెరికన్ మహిళా కార్మికులు సమాన హక్కుల కోసం, పని గంటల తగ్గింపు కోసం క్రమంగా ఓటు హక్కు కోసం పోరాట బాట పట్టారు. 1910లో డెన్మార్క్ రాజధాని కోపెన్ హాగ్ అంతర్జాతీయ సోషలిస్టు మహాసభ నాటికే భారత్ లోని మహారాష్ట్రలో ‘భారత స్త్రీ మండలి’ ఏర్పడ్డది. 1920లో ట్రావెన్ కోర్ సంస్థానంలో స్త్రీలకు ఓటు హక్కు కల్పించబడ్డది. ప్రపంచ కార్మిక వర్గానికి ఆశాదీపంగా 1948 లోనే కమ్యూనిస్టు ప్రణాళిక వెలువడ్డ కాలంలోనే సావిత్రిబాయి పూలే ఆధ్వర్యంలో పూణేలో బడుగు వర్గాల బాలికలకు పాఠశాల ఏర్పడడం, మహిళా విద్యకు పునాదులేర్పరిచిందని చెప్పడం అతిశయోక్తి కాదు. వేద కాలంలోనే మైత్రి, గార్గేయ లాంటి మహిళలు విద్యను అభ్యసించినారని గొప్పగా చెప్పుకుంటున్నా, పితృస్వామ్య భారతీయ కుల-వర్గ సమాజం స్త్రీలను అధమ స్థాయిలోనికి నెడుతున్నది. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ‘ఒక సమాజపు అభివృద్ధిని కొలవాలంటే ఆ సమాజంలోని మహిళాభివృద్దితో సరి పోల్చాలని’ చెప్పడం ఎంతో నరయింది. అందరికీ ఒకే బడి అంతమైన ప్రపంచీకరణ కాలం తర్వాత మగ పిల్లలకు ప్రైవేటు బడి ఆడపిల్లలకు ప్రభుత్వ బడి అనే వివక్ష కొనసాగుతూనే ఉంది. స్త్రీలు, బాల బాలికలను తక్కువ వేతనాలతో దోచుకునే సాంప్రదాయం మనం నిత్యం చూస్తున్నదే. భారత రాజ్యాంగం ద్వారా ఎన్ని హక్కులు సంక్రమించినా సమాన పనికి సమాన వేతనం అనేది నేటికీ అందని ద్రాక్ష గానే ఉన్నది. పైగా పని స్థలాల్లో లైంగిక వేధింపులు, స్త్రీల శరీరాల రవాణా, పోర్న్ సైట్స్ స్త్రీల పాలిట శాపంగా పరిణమించాయి. అభివృద్ధి చెందిన నాగరిక దేశంగా చెప్పబడుతున్న అమెరికాలో వెలుగు చూస్తున్న ఎప్పీన్ ఫైల్స్ ఒళ్ళు గగుర్పొడుస్తున్నాయి. ఈ ఫైల్స్ లో ట్రంప్ బాగోతాలు కూడా బయటపడుతుందడంతో దాన్ని ప్రక్కదారి పట్టించడానికి శాంతి చర్చల మధ్యనే ఇరాన్ పై దాడికి దిగాడనే వాదనలు కూడా ఉన్నాయి.

ఏదయినా స్వామి కార్యం, స్వకార్యం నెరవేర్చుకుంటూ ట్రంపు పూరించిన ఈ అధర్మ యుద్ధ శంఖారావం ఒక్క పశ్చిమాసియాకే కాదు, భారత్ తో పాటు ప్రపంచానికి అంతటికి పెనుచారంగా పరిణమిస్తుంది. ప్రభుత్వాలు స్త్రీలకు ఉచిత బస్సు, ఉచిత గ్యాస్, ఉచిత కరెంటు అంటున్నాయి. కానీ అధిక సుంకాలు, అధర్మ యుద్ధాలు సామాన్యుల నెత్తిమీద పిడుగు లాగా పడుతూ అధిక ధరల రూపంలో మరింతగా విరుచుకు పడడం ఖాయం. లాభాల వేటలో ప్రపంచాధిపత్యం కోసం చేస్తున్న యుద్ధాలలో ప్రజల ప్రాణాలు ప్రశ్నార్ధకమవుతున్నాయి.

అంతర్జాతీయంగా శ్రామిక మహిళల పోరాటాలను 1917 రష్యాలో జరిగిన సోషలిస్టు విప్లవం, 1949లో చైనా నూతన ప్రజాస్వామిక విప్లవాలు మార్చి 8ని విశ్వవ్యాప్తం చేశాయి. కానీ దీనిని 1975లో ఆలస్యంగా గుర్తించిన ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా ఏదో ఒక పిలుపునిస్తోంది. 30 ఏళ్ల కింద 189 దేశాలతో జరిగిన బీజింగ్ డిక్లరేషన్ విశ్వ వ్యాప్తంగా స్త్రీ-పురుష సమానత్వ కార్యక్రమానికి నాంది పలికినా మౌలిక మార్పులు నేటికీ సాధించలేకపోయాయి. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా కీర్తించబడుతున్న భారత పార్లమెంటు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఆమోదించినా అది ఎప్పుడూ ఆచరణలోనికి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.

ఐక్యరాజ్యసమితి 2026 మార్చి 8 కోసం “రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ అల్ ఉమెన్ అండ్ గర్ల్” అంటూ పిలుపునిచ్చింది. ఈ సమాన హక్కుల విలువులు వింటూ 1975 నుండి నేటికీ 50 సంవత్సరాలు గడిచిపోయాయి. అది ఎన్ని సార్లు “Give to gain” అని పిలుపులిచ్చినా సంపూర్ణ ఆచరణ రూపం ధరించడం లేదు. ఐక్యరాజ్యసమితి ఈ ఏడును “అంతర్జాతీయ మహిళా రైతు దినంగా” పాటించాలని కూడా పిలుపునిచ్చింది. భారతదేశం స్థూల జాతీయోత్పత్తిలో క్రమంగా వ్యవసాయ రంగ వాటా 50 శాతం నుండి 15 శాతానికి పడిపోయింది. అయితే    మన వ్యవసాయాదాయంలో ప్రధాన వనరుగా దాదాపు 80% శ్రామిక రైతు స్త్రీలే ఉన్నారు. వీరిని ఎండ పట్టున పనిచేస్తున్న రైతు కూలీ అక్కలుగా, బహుజన స్త్రీలుగా మనం గుర్తిస్తున్నాం. అయితే మన రైతాంగ మహిళలకు భూములపై హక్కులు లేవు. ఆడ కూలి-మగ కూలి అనే తేడాలున్నాయి. ఉత్పత్తి, పునరుత్పత్తి, ఇంటి చాకిరి, పిల్లల పెంపకం లాంటి బహుముఖ సామర్థ్యం గల స్త్రీలకు మహిళ సాధికారత అనేది ప్రధానాంశం కావాలి. ఆర్ధిక-రాజకీయ రంగాల్లో మహిళసాధికార తన గుర్తించే దున్నే వాడికి బదులు దున్నే వారికే భూమి అనే నినాదం రూపుదిద్దుకుంటుంది. అయితే సామ్రాజ్యవాదుల విధ్వంసక విధానాల వల్ల ధ్వంసమవుతున్న పర్యావరణం గ్లోబల్ వార్మింగ్ను సృష్టిస్తున్నాయి. అలాగే సామ్రాజవాదుల అధర్మ యుద్ధాలు పేట్రేగి మన వ్యవసాయోత్పత్తులకు కూడా ప్రధాన ఆటంకంగా మారుతున్నాయి. ఈ సమయంలో ఆహార సార్వభౌమాధికారం, స్వావలంబణ వ్యవసాయం అనేవి మన ప్రధాన నినాదం కావాలి. వ్యవసాయిక విధానంగా రావాలి. మన వ్యవసాయాన్ని పరాధీనం చేసే కుట్రల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉంటూనే దేశీయ ఎరువులు, ఉత్పత్తి వ్యవసాయం, సహకారోత్పత్తుల్లో మహిళలకు పెద్దపీట వేయాలి. పెంట-పంట-వంట అనే అంశాలన్నీ స్త్రీలతో ముడి వద్దవే, కృత్రిమ మేధ (AI) తో ఉద్యోగాలు, అతి నగరీకరణలో గ్రామీణ ఉపాధి కోల్పోబోతున్న విషయాలను గుర్తెరిగి దేశవ్యాప్తంగా పంటలను స్థిరీకరించే భూములను గుర్తించాలి. ఇందులో మహిళల పాత్రను, వాటాను బలోపేతం చేసే విధానాలు మరింత విస్తరించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. వాస్తవమే స్త్రీలకు ఏ రంగంలో అవకాశాలిచ్చినా తమ ప్రతిభను చాటుతూ సమాజానికి వెలగట్టలేని శక్తినందిస్తున్నారు. స్త్రీ శక్తిని గుర్తించి సంక్షేమ పథకాలన్నీ స్త్రీల పేరు. మీదనే ఉన్నాయి. అయితే స్థానిక సంస్థల్లో స్త్రీల రిజర్వుడ్ అధికారాలు దాదాపుగా పురుషుల అధికారాలుగానే అమలవుతున్నాయి. ఈ స్థితిలో ఎక్కడో ఒకచోట స్త్రీలు ముందడుగు వేస్తే అక్కడ భార్యల కొంగు పట్టుకుని తిరుగుతున్నారని విమర్శించే పితృస్వామ్య అహంభావం ప్రగతిశీల శిబిరాలను కూడా వెంటాడుతూనే ఉంది, భావజాల రంగంలో, సాంస్కృతిక రంగంలో వర్గపోరాటాల ఆవశ్యకత భారతదేశంలో మరింతగా ఉంటుందనేది గుర్తిద్దాం.

అందుకే స్త్రీలు సమాజ విముక్తిలో పురుషులతో భుజం కలిపి పోరాటడమే కాకుండా, పితృస్వామ్యానికి వ్యతిరేకంగానూ పోరాట జెండా ఎగరేస్తుండాలని మార్చి 8 మనకు గుర్తుచేస్తుంది. ఈ దఫా యావత్ ప్రపంచాన్ని ప్రత్యేకించి స్త్రీలు- పిల్లల జీవితాలను నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్న అమెరికా-ఇజ్రాయిల్ దుష్ట కూటమికి వ్యతిరేకంగా పోరాటంగా కదులుతాము, మూడో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే అణ్వాయుధాలతో ప్రపంచమంతా బూడిదయ్యే ప్రమాదాన్ని పసిగట్టి హెచ్చరించిన ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం. “I know not with what weapons the third world war will be fought with, but the fourth world war will be fought with the stones and spears”

వ్యంగ్యంగా నైనా ఒక ఆధునిక నాగరిక సమాజంలో జరిపే మూడో ప్రపంచ యుద్ధంలో అంతా ధ్వంసమై, రాయి రవ్వలతో, బరిసెలతో కొట్లాడే అనాగరిక స్థాయికి దిగజారుతామనే చురక సామ్రాజ్యవాద దురహంకారాలను కదిలించకపోవచ్చు. కానీ విధ్వంసకర యుద్ధాలకు వ్యతిరేకంగా మహిళలమైన మనం పిడికిళ్ళు బిగిద్దాం రండి. మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని ఎత్తిపడుతూ మార్చి 10న సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలేని స్మరించుకుందాం.

అరుణ (POW స్త్రీ విముక్తి)

ప్రొఫెసర్ కె.లక్ష్మి (బహుజన బతుకమ్మ)

సజయ (సామాజిక కార్యకర్త)

అంభిక (సామాజిక కార్యకర్త)

లక్ష్మీదేవి (న్యాయవాది)

లావణ్య (POW స్త్రీ విముక్తి)

ఎ. రాజేశ్వరి (రంగపల్లి విజ్ఞాన కేంద్రం)

సుజ్ఞానమ్మ (POW స్త్రీ విముక్తి, ఎ.పి.)

ప్రొ. మనోజ్జ (ఆదివాసి జీవిత పరిశోధకురాలు)

ప్రొ. కొల్లాపురం విమల (ఉమెన్స్ కలెక్టివ్)

తాయమ్మ కరుణ (రచయిత్రి)

డా. సి. అనిత (అరుణోదయ)

ప్రియ (డిజీబుల్ ఆక్టివిస్ట్)

భూలక్ష్మి (నవయుగ బీడీ కార్మిక సంఘం)

విమలక్క (అరుణోదయ ACF)

అనసూయ (శ్రామిక శక్తి బీడి వర్కర్స్ యూనియన్)

వై. జ్యోతి (కులనిర్మూలన సంఘం)

తుర్లపాటి లక్ష్మి (రచయిత్ర)

వెంకలక్ష్మీ (AIFTU)

పూజ (అరుణోదయ)

పలస నిర్మల (ప్రజా గాయని)

గాయని. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు.

Leave a Reply