సామాజిక అసమానతలను-ప్రజా పోరాటాలను చిత్రించిన కథలు

ఈనాడు వెలువడుతున్న సాహిత్యంలో కవిత్వంతో పాటుగా కథలు కూడా రాశిలోనూ, వాసిలోనూ ఎన్నదగిన రీతిలో వస్తున్నాయి. ఎంత నిలకడగా రాసినప్పటికీ కవిత్వంలో ఎక్కువగా ఉద్వేగాలే ప్రతిఫలిస్తాయి. కథలో పాత్రోచితమైన ఉద్వేగాలుంటే ఉండవచ్చు. కానీ, అది రేకెత్తించేది ఆలోచనలను మాత్రమే, ఉద్వేగాలను కాదు. కథలో చూపించినంత స్పష్టంగా, సూటిగా జీవితాన్ని కవిత్వంలో చూపించలేం. దీర్ఘకవితల్లాంటి వాటికి వాటి నిర్మాణం దృష్ట్యా కొంతవరకు ఆ అవకాశం ఉండవచ్చు. జీవితం ఇట్లా ఉందని చూపించడానికి మన చుట్టూ మెదిలే మనుషులే కథల్లోని పాత్రలవుతారు. సజీవమైన ఆ పాత్రల ద్వారా జీవితాన్ని నిర్వచించే ప్రయత్నం చేస్తాయి కథలు.అచ్చంగా చక్రవర్తుల శ్రీమన్నారాయణ రాసిన’కారున్’అనే కథా సంకలనంలోని కథలు అదే పని చేస్తాయి. మన చుట్టూవున్న ప్రపంచాన్ని, జీవితాలనూ ఏ ముసుగులూ లేకుండా చూపిస్తాయి.

కారున్ అనే పేరుగల ఈ చిన్న కథాసంకలనంలో ఐదు కథలున్నాయి. ఈ ఐదు కథలు వాటికవే ప్రత్యేకమైనవి. కారున్, త్యాగం, మధ్యాహ్న భోజనం, కొత్తబడి, ఎర్రగుంటపల్లె అనేవి ఆ కథలు. కథల పేర్లతోనే కథా నేపథ్యాన్ని కొంతవరకు ఊహించుకునేవిధంగా సింప్లిసిటీతో పెట్టిన పేర్లివి. కవితాత్మకమైన శీర్షికలో, తాత్వికమైన అర్థంతో కూడిన పేర్లో పెట్టకుండా సూటిగా, కథ లోపలికి లాక్కెళ్లేవిధంగా పేర్లు పెట్టాడు రచయిత. కథలకు పేర్లు పెట్టటం దగ్గర చూపించిన సింప్లిసిటీ కథాకథనంలో కూడా కనిపిస్తుంది. ఎక్కడా అనవసరమైన వర్ణనల జోలికి పోకపోవటం, పాత్రల చేత తనకు తెలిసిన,తాను నమ్మే సిద్ధాంతాలను వల్లెవేయించకపోవటం అనే మంచి లక్షణాలవల్ల ఈ కథలకు చదివించే గుణం అబ్బింది. అందుకే ఇందులోని కథలు చదవటం మొదలుపెడితే ఆగకుండా చదివించేస్తాయి.

ఈ ఐదు కథల్లో నాలుగు రకాల విభిన్నమైన జీవితాలను, అందులోని సంఘర్షణను చూపించాడు రచయిత. మొదటి కథ కారున్. కారున్ అంటే ఆదివాసీలు తమవాళ్ళు చనిపోయిన చోట గానీ సమాధి దగ్గర గానీ వారి స్మృతిని తల్చుకుంటూ వారి సాంప్రదాయంలో చేసే పూజాకార్యక్రమం.తెలంగాణ గడ్డ మీద మాయని మచ్చలాంటిది ఇంద్రవెల్లి ఘటన. దీని నేపథ్యంలో రూపుదిద్దుకున్న కథే కారున్. ఇందులోని ప్రధానమైన పాత్ర సోంబాయి.32 ఏళ్ల కింద జరిగిన ఇంద్రవెల్లి దుర్ఘటనలో సోంబాయి గాయాలతో బయటపడుతుంది. తన భర్తతో పాటు కొడుకును కూడా కోల్పోతుంది. ఇన్ని సంవత్సరాలు కుదరక ఈ సంవత్సరమైనా వాళ్లను యాది చేసుకుంటూ కారున్ చేద్దామనుకుంటుంది. కానీ అమరవీరుల స్థూపం దగ్గర ఎప్పటిలాగే పోలీసుల పహారా ఉంటుంది. మొదట వాళ్ళు వెళ్ళనివ్వలేదు. కొంత వాగ్వాదం జరిగాక ముసల్దేకదా అని పోలీసులు వెళ్ళనిస్తారు.”దూరం నుంచి దీన్నంతటినీ ఊరోళ్లు కొందరు చూస్తున్నారు. ఒక్కొరొక్కరే స్థూపం దగ్గరికి కదిలిండ్లు”అన్న వాక్యంతో ముగుస్తుంది కథ. ప్రజల్లో చైతన్యం ఎలా అంకురిస్తుందో ఈ కథలో సూచనప్రాయంగా చెప్పాడు రచయిత.”గిన్ని ఏండ్లయినంక కూడా స్థూపాన్ని జూసి భయపడే పోలీసోళ్లకు నేనెందుకు భయపడాలే?”అన్న సోంబాయి ధైర్యమే కారున్ ఫలవంతం కావటానికి కారణమైంది.

త్యాగం, మధ్యాహ్న భోజనం-రెండు కథలూ దళిత సమస్యను రెండు విభిన్నమైన కోణాల్లో చర్చించాయి. త్యాగం కథ-బహుశా!ముప్పై నలభై ఏళ్ల కిందట తెలంగాణ పల్లెల్లోని భూస్వాములు కిందికులాలకు చెందిన పాలేర్ల బతుకులను తమ గుప్పిట్లో పెట్టుకున్న తీరును చిత్రించింది.ఊళ్ళో ఎవరూ చదువుకోకూడదనే దొర ఆదేశాలు ధిక్కరించి చాటుమాటుగా చదువుకొని వస్తాడు పాలేరు నర్సయ్య కొడుకు సారయ్య.ఫలితంగా ఆ కుటుంబాన్ని వెలేస్తాడు దొర. అయినప్పటికీ వర్షానికి ఊరి చెరువు తెగి వరదలో దొర, దొరసాని కొట్టుకుపోతుంటే తన భార్యా బిడ్డలను వదిలి దొరను దొరసానిని కాపాడతాడు నర్సయ్య. ఇదే త్యాగం.”త్యాగానికైనా నా దళిత కులమే ముందుంటుందని తెగేసి చెప్పిండు నర్సయ్య”అని అంటాడు రచయిత. ముందుమాటలో అల్లం రాజయ్య గారన్నట్లు’ఇది చాలా పురాతనమైన బానిస స్వభావం గల పాతతరం కథ’. ఇది 1990 లలో వచ్చిన కథ. భూస్వామ్య పునాదులు మెల్లగా పగిలిపోతున్న సందర్భంలో దొరల కింద దళితుల జీవితాలు ఇలా ఉండేవని చూపించటమే రచయిత ఉద్దేశ్యంగా అర్థం చేసుకోవాలి.ఇదే ఇతివృత్తంతో ఇప్పుడెవరైనా కథ రాస్తే ఈ కథ తారుమారవుతుంది. దానిక్కారణం దళితుల్లో వచ్చిన చైతన్యం. అయితే దళితుల పట్ల ప్రధానమైన వివక్ష అంటరానితనం రూపంలో ఉంటుంది.ఈ అంటరానితనం ఇప్పటికీ ఎలా కొనసాగుతుందో చూపెట్టటమే ‘మధ్యాహ్నభోజనం’లోని కథాంశం.చాలా వరకు బయటకు రావడం లేదు కానీ పాఠశాలల్లో ‘మధ్యాహ్న భోజనం’అమలవుతున్న దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ ఈ సమస్య ఉంది.ఈ సమస్యతో పాటే భోజనం నాసిరకంగా ఉండటమన్న మరో సమస్యను ఎత్తుకున్నాడు రచయిత.అయితే ఈ రెండు సమస్యల మధ్య కథ ముగిసిన తీరును బట్టి చూస్తే భోజనం నాసిరకంగా ఉండటమన్న సమస్య ప్రధానమైపోయి-భోనం వండేవాళ్ళు దళితులు కావటం వల్ల సమాజం ముందుకు తెచ్చిన అంటరాని తనమనే సమస్య చిన్నగా మారిపోయింది. ఇందులో రెండో సమస్య ప్రస్తావనకు రాకపోయి ఉంటే అంటరానితమమనే సమస్యను మరింత బలంగా చర్చించే అవకాశం లభించేది. ఆయితే ఈ రెండు సమస్యలను ప్రధానం చేస్తూ రెండు వేరు వేరు కథలు రాస్తే బాగుండేది.

‘కొత్తబడి’అనే కథ ఉద్యోగవిరమణ పొందిన ఉపాధ్యాయుడు విందు ఏర్పాటు చేసి దుబారా చేయకుండా ఆ డబ్బుతో పాఠశాలకు కావాల్సిన డెస్క్ బెంచీలు కొనివ్వటం అనే పాయింటు మీద నడుస్తుంది. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన శ్రీమన్నారాయణ ‘మధ్యాహ్న భోజనం’,’కొత్త బడి’అన్న కథలను వాస్తవికంగా చిత్రించాడు. ఈ రెండు కథల్లోనూ వివిధ వర్గాలకు ప్రతినిధులైన మనుషుల మనస్తత్వాలను-వాటి అంతర్ బహిర్ స్వరూపాలను ఆయా సంఘటనల నేపథ్యంలో ఏ ముసుగులూ లేకుండా చూపెట్టాడు. పాత్రల స్వభావాలు వెల్లడి కావటంలో రచయిత చొరవ తీసుకుంటే శిల్పం దెబ్బతింటుంది. ఇలా శిల్పానికి కళంకం తెచ్చే ప్రయత్నాలేవీ ఏ కథలో కూడా చేయలేదు రచయిత.

ఈ సంకలనంలోని ఐదవ కథ ‘ఎర్రగుంటపల్లి’.ఇది కల్పన మీద కాక యదార్థ సంఘటను ఆధారం చేసుకొని రాసిన కథ.ఇందులోని కథలను పూర్తిగా చదివిన వారికి ఇందులో ఏ కథ కూడా కల్పనల నుంచి పుట్టిన కథలు కావని అనిపిస్తుంది.మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ప్రాంతమైన మందమర్రి పక్కనే ఉంటుంది ఎర్రగుంటపల్లి. దానిని ఓపెన్ కాస్టుగా మార్చకూడదని ప్రజలు-ప్రజా సంఘాలు చేసే పోరాటం ఒకవైపు-సింగరేణి యాజమాన్యం మరోవైపుగా సాగే యుద్ధం లాంటి ఒక స్థితిని చిత్రించిన కథ ఎర్రగుంటపల్లి. ప్రభుత్వం వైపునుంచీ-సింగరేణి యాజమాన్యం వైపు నుంచీ ఎన్నిరకాల నిర్బంధాలు ఎదురైనా ప్రజలు పోరాటానికే మొగ్గు చూపడం ఈ కథలోని సారాంశం. అయితే ఈ ఐదు కథల్లోనూ మనకు ప్రధానంగా కనిపించే లక్షణం పోరాడే గుణంగల పాత్రలుండటం.ఈ పోరాటం కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా ఉంటుంది, మరికొన్ని సందర్భాల్లో వ్యవస్థాగతంగా ఉంటుంది. ఈ రెండు రకాల పోరాటాలు ఇందులో కనిపిస్తాయి.పోరాటాలే ప్రధానంగా కథావస్తవులు ఎందుకయ్యాయి?.శ్రీమన్నారాయణ తన కళ్ళముందు జరుగుతున్న అన్నిరకాల ప్రజా ఉద్యమాలతో మమేకమై ఉండటమే దీనికి కారణమై ఉంటుంది. అందుకే ఈ కథలన్నింటిలోనూ ప్రజానుకూల దృక్పథం గలవాళ్లదే పై చేయిగా కనిపిస్తుంది.’కారున్’కథలో సోంబాయి, ‘త్యాగం’ కథలో సారయ్య, ‘మధ్యాహ్న భోజనం’ కథలోని బడిపిల్లలు,’కొత్త బడి’ కథలో మణిక్రాంత్-శంకరయ్య సార్,’ఎర్రగుంటపల్లి’లో నగేష్ లాంటి పాత్రల్లో పురోగమన దృష్టితో కూడిన చైతన్యం కనిపిస్తుంది. జీవితంలోని చలన సూత్రాల పట్ల అవగాహన కనిపిస్తుంది. ముఖ్యంగా న్యాయాన్యాయాల విషయంలో ఒక స్పష్టత కనిపిస్తుంది.ఈ పాత్రలకు గల చైతన్యం వాళ్ళ వాళ్ళ జీవితాలలోనుంచి వచ్చింది. రచయిత నుంచి రాలేదు.మంచి కథకునికి ఉండవలసిన నిగ్రహం శ్రీమన్నారాయణలో పుష్కలంగా ఉంది.

కథను నడిపించటంలో ఇవేగాక ఇతరేతర శిల్ప సంబంధమైన విషయాలు కూడా ప్రధానమైన పాత్రను పోషిస్తాయి.మధ్యాహ్న భోజనం, కొత్త బడి అనే కథలను ఉత్తమ పురుషలో నడిపించాడు రచయిత. వీటిని ప్రథమ పురుషలో చెప్పి వుంటే కథాకథనంలోని బిగి,సంభాషణల్లోని తీవ్రత తగ్గిపోయేది.ఏ కథలు ఉత్తమ పురుషలో చెప్తే అవి ఉత్తమ కథలవుతాయో రచయితకు తెలిసి ఉండాలి. ఆ ఎరుక ఈ రచయితలో ఉంది. అలాగే కథల్లోని సన్నివేశార్ధాన్ని ధ్వనింపజేసే పదాలు వాడుతూ ఒక రకమైన గాఢతను తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఉదాహరణకు ఎర్రగుంటపల్లి కథలో ఓపెన్ కాస్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమ నాయకుడు నగేష్ ను అరెస్టు చేసి పోలీసులు తమవెంట తీసుకెళ్తున్న సందర్భంలో-“జీబు లేపిన దుమ్ముకు కోళ్లు గుయ్ మని ఎగిరాయి. అందరి కళ్ళల్లో మన్నువడ్డది”అని అంటాడు రచయిత.తెలంగాణలో”కళ్ళల్లో మన్నువడటం”ఒక సామెత. ఒక మనిషి చెడిపోవటానికి లేదా పతనానికి సంకేతంగా ఈ సామెతను వాడుతారు. ఉద్యమ నాయకుణ్ణి అరెస్టు చేయడం ద్వారా జరగబోయే నష్టాన్ని ధ్వని పూర్వకంగా చెప్పాడు రచయిత.

అయితే రచయిత తన భావజాలాన్ని కథలో ప్రత్యక్షంగా చెప్పుకోవడానికి అవకాశం లేదు. తన భావజాలంతో ఏకీభవించే పాత్రల ద్వారా తాను బయటపడకుండా కొంతవరకు చెప్పుకునే అవకాశం ఉంది. కానీ అటువంటి ప్రయత్నాలు కూడా రచయిత ఈ కథల్లో ఎక్కడా చేయకపోవటం విశేషం.అయితే శిల్పం దెబ్బతినకుండా పరిసరాల పరికల్పనలో ఆ ప్రయత్నం చేయటం కనిపిస్తుంది. ‘మధ్యాహ్న భోజనం’ కథా ప్రారంభంలో-“ఏడవ తరగతికి అంబేద్కర్ జీవిత చరిత్ర పాఠం చెప్పుతున్నాను”అంటాడు కథకుడు. “బడిలో వంట చేసే అవకాశం ఈసారి సావిత్రీభాయి ఫూలే గ్రూపుకు వచ్చిన విషయం” చెప్తాడు హెడ్ మాస్టర్. ఈ ప్రతీకల వల్ల తాను ఏ భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ప్రకటించుకున్నాడు రచయిత.శ్రీమన్నారాయణ తనమాటలో-“సామాజిక అసమానతలు, ప్రజా పోరాటాలే కథలను రాయటానికి ప్రేరణ కలిగించాయి. ప్రజల దుర్భరమైన జీవితాలు, పాలకుల విధానాలను గురించి నలుగురికీ వివరించాలనే తపతోనే నేను కథలను రాశాను”అని చెప్పాడు. ఆయన ఈ మాటలు చెప్పకపోయినా ఈ కథలే ఆ విషయాన్ని రుజువు చేస్తున్నాయి.

కవి, రచయిత.

Leave a Reply