సమాజానికే కాదు, రచయితలకి కూడా ‘ఎరుక’ కలిగించిన కథలు

శతాబ్దాలుగా తెలుగు సాహిత్యం సమాజంలోని అనేక వర్గాల, భిన్నకులాల, భిన్న అస్తిత్వాలను తెలుగు ప్రజల ముందుకు తీసుకుని వచ్చింది. అయితే చరిత్రలో ఎక్కువ కాలం అట్టడుగు అంచుల్లోనే మిగిలిపోయిన సంచార జాతుల జీవితాలు మాత్రం చాలా అరుదుగా సాహిత్యంలో చోటు సంపాదించుకున్నాయి. అలాంటి అట్టడుగు వర్గాల కులాల ఆదిమ సంచార తెగల జీవితాలలోని సంక్షోభ పోరాట ఆరాటాలను, అవమానాలను ఎదుర్కొంటున్నఎరుకల జీవితాలను ప్రపంచానికి చెప్పే ప్రయత్నమే ఈ ఎరుక తెగ కథలు. ఈ కథలు కేవలం కథలు మాత్రమే కావు. ఒక అట్టడుగు వర్గ సమాజపు జీవన చరిత్ర వాళ్ళ సంస్కృతి, సంప్రదాయాలు, నిస్సహాయ ఒంటరి పోరాటాలు, ఆత్మగౌరవం, కన్నీళ్లు, ఆశలు, ఆకాంక్షలకు సాహిత్య రూపం ఈ కథలు.
**
గత కొన్ని సంవస్తరాలుగా తెలుగు సాహిత్యంలో వస్తున్న కథల వస్తు వైవిధ్య పరిణామాలని పరిశీలిస్తే ముఖ్యంగా మార్క్సిస్ట్ దృక్పథంతో అధ్యయనం చేస్తే సాహిత్య సౌందర్యం, శిల్ప శైలి, భాషలకి మాత్రమే కాకుండా సమాజంలో అట్టడుగు వర్గాలు, తమ అస్తిత్వాన్ని ప్రాముఖ్యతని సాధించుకునే, నిరూపించుకునే ఒక సామాజికి పోరాటాల చరిత్రగా అర్థం అవుతుంది. సాహిత్య రంగంలో ముఖ్యంగా బిసీ సాహిత్యం, దళిత సాహిత్యం, అట్టడుగు వర్గాలైన ఆదిమ అర్ధ సంచార జాతుల సాహిత్యం ఆధిపత్య వర్గ సాహిత్య లోకం నుంచి చిన్న చూపుకి, నిర్లక్ష్యానికి, అణిచివేతకి గురవుతూ వస్తున్నది. ముఖ్యంగా చెంచు, యానాది, ఎరుక, లంబాడా, గొల్ల లాంటి ఆదిమ, అర్థ సంచార తెగల సాహిత్యం అసలు తీవ్రమైన నిర్లక్ష్యానికి లొనవుతూ వస్తున్నది. ఈ ఆధిపత్య వర్గాల పెత్తనాన్ని బద్దలు కొడుతూ, ధిక్కరిస్తూ సబాల్టర్న్ సాహిత్యం వెలుగులోకి వస్తున్నది. సాహిత్య వస్తు విస్తృతిని ఆధిపత్య కులాల రచయితలకి, పాఠకులకి దివిటీ వేసి మరీ చూపిస్తున్నది. సంపన్న వర్గాల, మధ్య, ఎగువ మధ్య తరగతి దిగువ మధ్యతరగతి, ఆధిపత్య కులాల నుంచి సాహిత్యం, దళిత, ముస్లిం మైనారిటీల, స్త్రీవాదం లాంటి భిన్న అస్త్తిత్వ సమూహాలని దాటి, అట్టడుగు వర్గాలలో మరీ అట్టడుగు వర్గమైన ఆదిమ అర్ద సంచార తెగల ప్రజా సాహిత్యం ఆయా సామాజిక వర్గాల రచయతల నుంచే రావడం ఒక గొప్ప ప్రగతిశీల పరిణామం. చెంచు, యాదవ కులాల నుంచి జానపద, మౌఖిక సాహిత్య మాత్రమే వచ్చినా, లంబాడా తెగల నుంచి విద్యని, రిజర్వేషన్లని అందుకున్న రచయితలు వచన సాహిత్యాన్ని కథలు, కవిత్వ రూపంలో బాగానే సృజించారు. ఎరుకల సామాజిక వర్గం నుంచి అతి తక్కువ సంఖ్యలో రచయతలు ఉన్నారు.

ఎరుకల సాహిత్య సృజన కారులు :
ఎరుకల సామాజిక వర్గం నుంచి తెలుగు సాహిత్యంలో తమ ప్రత్యేక ముద్ర వేసి, ఆ జాతి జీవన పోరాటాలను సంస్కృతిని సమాజానికి పరిచయం చేసిన ముఖ్యమైన సాహిత్య కారులు, రచయితలు కొద్దిమంది మాత్రమే ఉన్నారు.
పలమనేరు బాలాజీ : వీరు రాసిన ఏకలవ్య కాలనీ ఎరుకల జీవన గాధలు అనే కథల సంపుటి తెలుగు సాహిత్యంలో ఎరుకల ప్రజల సజీవ చిత్రణకి, రాయలసీమ మాండలిక, భాషకి అద్దం పట్టింది. వీరు చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతవాసులు. అక్కడే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నతాధికారిగా పని చేస్తూ తన ఎరుకల సామాజిక వర్గ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు.
ప్రొ. సత్యనారాయణ : వీరు ఎరుకల చరిత్ర వారి జీవన విధానం, అణిచివేతల పైన విస్తృతంగా పరిశోధనా వ్యాసాలూ, సాహిత్య విమర్శలు రాసారు.
కే. రమణయ్య : గ్రామీణ ప్రాంతాల్లోని ఎరుక ప్రజల సమకాలీన సమస్యలు, వ్యవసాయ అనుబంధ జీవితాలపై కథలు, వ్యాసాలూ రాస్తున్నారు.
వి.ఆర్. రాసాని : వీరు చిత్తూరు ప్రాంతానికి చెందిన సుప్రసిద్ధ రచయిత. ఎరుకల తెగ మీదనే కాదు, ఇతర సంచార తెగల జీవితాలమీద కథా సంకలనం తీసుకు వచ్చారు. ఎరుకల తెగలో పితృస్వామ్యం పీడన, దురాచారాల ప్రభావం గురించి వీరు రాసిన నల్ల పూసలు అనే కథలో గొప్పగా రాసారు.
లింగయ్య : తెలంగాణా ప్రాంత వాసులు. ఎరుకల సంస్కృతిని, సాంప్రదాయ వృత్తి అయిన సోదిని పాటల రూపంలో, జానపద సాహిత్యంలో విస్త్రుతంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు.
ఇంద్రాణి: జగిత్యాలకి చెందిప పరిశోధక విద్యార్థిని. ఇంద్రాణి తాను ఎరుకల తెగకి చెందినవారు కాకపోయినా, ఎరుకల తెగ కి చెందిన తన స్నేహితురాలితో ఎరుకల భాషకి లిపి లేదని తెలుసుకొని లిపిని సృష్టించి ఆ భాషా సాహిత్య అభివృద్ధికి కృషి చేస్తున్నారు. వీరే కాక ఇతర సామాజిక వర్గానికి చెందిన ఎంతో మంది రచయితలు ఎరుకల సమస్యలని సాహితీకరిస్తున్నారు. ఆ కథలన్నీ కొలిమి వెబ్ సైట్ వాళ్ళు ప్రచురించిన ‘ఎరుక’ కథా సంకలనంలో ఉన్నాయి. ఈ కథా సంకలనంలో పలమనేరు బాలాజీ గారు మాత్రమే ఎరుక సామాజిక వర్గానికి చెందిన వారు. వీరి రచనల్లో సమాజం, రాజ్యం వారిపైన చూపించే వివక్ష, అణిచివేత ప్రధానంగా కనిపిస్తాయి. బ్రిటిష్ కాలం నాటి నేరస్త తెగల చట్టం-criminal tribal act వల్ల, స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఎరుకలు భారత ప్రభుత్వ విధానాల ద్వారా అనుభవించిన రాజ్య హింసని, ఆధిపత్య కులాల ద్వారా గ్రామాల్లో అనుభవించిన కుల పీడనని, దారిద్య్రాన్ని రాసారు. వీటితో పాటు వారి సంస్కృతిలో భాగమైన సోది/గద్దె/భవిష్యవాణిని, సాహిత్య రూపాలైన జానపద కళల ద్వారా, తమ మూల పురుషుడైన ఏకలవ్యుని చరిత్రని సాహిత్యం ద్వారా వీళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు.
**
ఈ ఎరుక కథలు శతాబ్దాలుగా బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వర్తమాన ఆధునిక భారత దేశ సమకాలీన కాలం వరకు చరిత్ర పోడుగుతా సామాజిక నిర్లక్ష్యానికి, ఆర్ధిక రాజకీయ దోపిడీకి, కుల వివక్ష, అంటరానితనాలకి, స్వంత తెగలోని సాంస్కృతిక అనాచారాలకి, మూఢ నమ్మకాలకు గురైన నిలువ నీడ, తిండీ, గుడ్డా లేని సంచార జాతులకు సంబంధించిన శ్రామిక జనం అనుభవించే బాధలను, మనసుని అల్లకల్లోల పరిచే పచ్చి వాస్తవాలను విప్పి చూపిస్తాయి. అందుకే ఈఎరుక కథల పుస్తకం సాహిత్య విలువల పరంగా మాత్రమే కాదు, గతితార్కికంగా చూసినప్పుడు సామాజిక, సాంస్కృతిక, చారిత్రక దృష్టితోటి కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ పుస్తకంలోని కథల వైవిధ్యం, రచయితల దృక్పథం, ఎరుకల కౌటుంబిక, సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక జీవన చిత్రణ చాలా సూక్ష్మంగా, వివరణాత్మకంగా చిత్రించబడింది.

సంచార జాతికి చెందిన ఎరుకల లేదా కుర్రు తెగ సాహిత్యాన్ని విశ్లేషించేటప్పుడు కేవలం సాహిత్య సౌందర్యం, సాహిత్య నిర్మాణం శైలీ శిల్పాలు మాత్రమే కాదు, ఎరుకల తెగ ప్రజల జీవన విధానం, సంస్కృతి, చరిత్ర, భాష సామాజిక అనుభవాలు, అవమానాలు వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం, తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

ఎరుక కథా సంకలనం రచయితలు ఎరుకల తెగ ప్రజల జీవితాన్ని విశ్లేషించడానికి, కథలుగా మలచడానికి కావలసిన పద్ధతులు ఏమైనా అనుసరించారా? అనుసరిస్తే అవి ఎక్కడనుంచి వారికి అందాయి? ఈ కథల్లో ఎరుకల తెగకి, వారి జీవన విధానానికి, చరిత్ర, సంస్కృతికి, వారి సామాజిక అస్తిత్వానికి సంబంధించి, కనీస హక్కుల కోసం వారు రాజ్యంతో, ఆధిపత్య కులాలతో, ప్రపంచీకరణతో, రాజ్యం కార్పొరేటే సంస్థలతో కలిసి చేస్తున్న దోపిడీ కి వ్యతిరేకంగా చేస్తున్న సంఘర్షణ, పోరాటాల పట్ల ఎరుక, స్పృహ కథా రచయతలకి ఉన్న స్పష్టత వారికున్న రాజకీయావగాహన, దృక్పథం అడుగడుగునా కనిపిస్తాయి.

ఈ కథలని ఒక్కొటిగా చదువుతూ పోతుంటే ఈ విషయాలు స్పష్టంగా అర్థం అవుతాయి. కథకులు గొప్ప సామాజిక బాధ్యతతో ఈ కథా రచనలకి పూనుకున్నారు. కథలు రాసే క్రమంలో రచయితలు కొన్ని కథా వస్తువు విశ్లేషణకు సంబంధించిన సాహిత్య ముడి సరుకులను ఖచ్చితంగా వాడారనిపిస్తుంది. లేదా వాటి పట్ల ఒక స్పష్టమైన దృక్పధాన్ని కలిగి ఉన్నారని అనిపిస్తుంది. ఎరుకల జీవితాల్లో ఉండే అనేక అంశాలని ఉదాహరణకి భారతదేశాన్నికమ్ముకున్న నయా సామ్రాజ్యవాద దోపిడీ రూపాలు, సాంస్కృతిక విధ్వంసం దగ్గరి నుంచి ఎరుకల స్త్రీల జీవితాల్లోని పితృస్వామ్య పీడన వరకూ కథకులు కథా వస్తువులుగా ఎన్నుకున్నారు. కథల్లో సాంస్కృతిక, జానపద, సామాజిక, మానవ శాస్త్ర (ఆంథ్రోపాలజీ), స్త్రీవాద/పితృస్వామ్య , భాషా పరిణామం, చరిత్ర, ఇక ఈ కథలలో చేరి, చేరని ఇతర అట్టడుగు సంచార తెగల జీవన సంక్షోభం, కథకులు కథనాన్ని చెప్పే పద్ధతులు ఇవన్నీ పాఠకుల, విమర్శకుల పరిశీలనలోకి వస్తాయి.
**

మొదటగా ఎరుక కథల్లోని సాంస్కృతిక విశ్లేషణని తీసుకుంటే కథకులు ఎరుకల జీవన విధానాన్ని, ఆచారాల్ని, వృత్తులు, పండగలు, విశ్వాసాలు, జానపద సంప్రదాయాలని ఈ కథలలో ఎలా ప్రతిబింబింపచేశారో తెలుస్తుంది. రెండోది ఎరుకల జీవితాల్లో భాష వ్యక్తీకరణల్లో అంతర్భాగంగా ఉంటూ వచ్చిన జానపద గేయాలు, కథలు, పొడుపు కథలు పురాణ కథలు, సామెతలు, వీటి నిర్మాణం, వీటి ప్రయోజనం, కథల్లోని సామాజిక పాత్రలని జానపదాలని ఉపయోగించి విశ్లేషించడం కూడా కనిపిస్తుంది. మూడోది వచ్చేటప్పటికి కథల్లో కనిపించే సామాజిక విశ్లేషణ సోషియోలాజికల్ ఎనాలిసిస్. దీంట్లో ఎరుకల జీవిక కోసం అస్థిరమైన సంచార జీవితం, కులవివక్ష, పేదరికం, కోల్పోతున్న విద్యావకాశాలు, శ్రామిక ప్రజా వ్యతిరేక, ప్రభుత్వ విధానాల ప్రభావం లాంటి సామాజిక అంశాలని సాహిత్యంలో ఎలా తీసుకురావాలో అంతగా ఈ రచయితలు తీసుకొచ్చారు. నాలుగో అంశం వచ్చేటప్పటికి మానవ శాస్త్ర విశ్లేషణ కూడా ఈ కథలలో కనిపిస్తుంది. అంటే ఆంత్రపొలాజికల్ ఎనాలిసిస్ అన్నమాట. ఎరుకల కుటుంబ వ్యవస్థ, బంధుత్వాలు, జెండర్ లేదా లింగ పాత్రలు, ఆచారాలు, వలస జీవనం సృష్టించే విధ్వంసం. పితృస్వామ్య పీడనలో నలిగిన ఎరుకల స్త్రీల జీవితాల సంక్షోభం ఈ కథలలో స్పష్టంగా, ఎంతో ఆర్తితో రాయడం కనిపిస్తుంది. వీరిపైన బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ ట్రైబల్ చట్టాలు ఇప్పటికీ రూపాలు మార్చుకొని ఎలా అమలవుతూ వారి జీవితాల్ని అగ్నిగుండాల్లో దహించి పడేస్తున్నాయో, పాలక వర్గాలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నిషేధించిన తరువాత కూడా ఈ క్రిమినల్ ట్రైబల్ ఆక్ట్ చట్టాలని ఇప్పటికీ ఎలా ఉపయోగించుకుంటున్నారో కనిపిస్తుంది. ఇక కథల్లో రచయితలెన్నుకున్న నాలుగో అంశం భాషా విశ్లేషణ. లింగ్విస్టిక్ అనాలసిస్. ఎరుకలకి ప్రత్యేకంగా ఒక భాష లేదు. వీరు మాట్లాడే భాషను కుర్రు భాష లేదా ద్రావిడ భాష అంటారు. కుర్రు భాష తమిళ కన్నడ తెలుగు కలయికలా ఉంటుంది. ఎరుకల భాషల్లో సంచార జీవితంలో ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి తిరిగే క్రమంలో ఆయా ప్రాంతాల రాష్ట్రాల మండలిక భాషలో, ఉదాహరణకి తెలంగాణా, ఆంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఎరుకల వారి భాషలో స్థానిక భాష మాండలిక పదాలు, జానపదాలు, సామెతలు నుడికారాలు కనిపిస్తాయి. వీరిది ద్రావిడ భాష అని కూడా అంటారు. కుర్రు భాషని వాళ్ళు అలా అభివృద్ధి చేసుకున్నారు అని కూడా అనిపిస్తుంది. ఇందులోని కథల్లో కథకులు ఎరుకల భాషలో సామెతలు, మాండలిక పదాలు, మౌఖిక శైలి స్థానిక పద ప్రయోగాలు ఇవన్నీ కూడా ఉపయోగించారు. ఇక ఎరుక కథల్లో రచయతలు ఎన్నుకున్న ఆరవ అంశానికి వస్తే, చారిత్రిక విశ్లేషణ కూడా ఈ కథలలో కనిపిస్తుంది. హిస్టారికల్ ఎనాలిసిస్! ఎరుకల తెగ చరిత్ర, వలసలు, క్రూరమైన బ్రిటిష్ వలస పాలన ప్రభావం, స్వాతంత్రం వచ్చాక వాళ్ళ జీవితాల్లో వచ్చి చేరిన మార్పులు, ఈ ఎరుక కథా సంకలనంలో వచ్చాయన్నది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే బ్రిటిష్ కాలం తర్వాతా, ముందూ అంటే బ్రిటిష్ కాలంలో ఎరుకల చరిత్ర, వాళ్ళనుభవించిన సామాజిక సంక్షోభం వాళ్ళనుభవించిన భయంకరమైన క్రిమినల్ చట్టాలకు సంబంధించిన శిక్షలు, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత దేశంలో వాళ్లనుభవించిన కష్టాలు బాధలు నిస్సహాయ జీవితాలు ఇవన్నీ కూడా ఈ కథలలో మనకు కనిపిస్తాయి. కథల్లో అమెరికన్ సామ్రాజ్యవాద ప్రభావం వల్ల నూతన ఆర్ధిక విధానాల అమలు, ఉత్పత్తి కులాల వృత్తుల విధ్వంసం, ప్రపంచీకరణ అనంతర ప్రభావం, సంక్షోభం కనిపిస్తుంది. ప్రపంచీకరణ ప్రభావంలో వృత్తులు కోల్పోయి దేశ దేశాలు వలసలు వెళ్లిపోవడం కనిపిస్తుంది. చరిత్ర పొడుగుతా ఎరుకలు చాలా దారుణమైన దుర్మార్గమైన జీవితాలు అనుభవించడం ఈ కథల లో మనం చూస్తాం. అటు అడవికీ, ఇటు నాగరిక ప్రపంచానికీ, ఆధిపత్య కులాల పీడన, వివక్ష దోపిడీలకి మధ్య ఎరుకలు భయంకరంగా నలిగిపోవడం కథల్లోకనిపిస్తుంది. ఇక ఎరుకల కథల్లో పితృస్వామ్య విశ్లేషణకు వస్తే మహిళల జీవితం ఇతర మతాల, కులాల, ప్రాంతాలలో, దేశాలలో బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాల ప్రభావం అణిచివేత, మనువాద పితృస్వామ్యం ఎలా ఉందో ఎరుకల మహిళల మీద కూడా పితృస్వామ్యం అంతే ప్రభావాన్నికలిగించడం కనిపిస్తుంది. పిత్రుస్వామ్యపు అణిచివేత, అదే దోపిడి పీడనలను ఎరుకల స్త్రీలు తమ స్వంత ఎరుకల కమ్యూనిటీలో, ఆ తర్వాత గ్రామాల్లోని ఆధిపత్య, పీడక కుల సమాజం నుంచి కూడా ఎదుర్కోవడం ఈ కథలలో మనం చూస్తాము. ఎరుకల స్త్రీల జీవితం ఆద్యంతమూ కుటుంబ బాధ్యతలు వివక్ష, పితృస్వామ్య పీడన మూఢాచారాల వల్ల బలైపోవడం ఇవన్నీ కూడా ఈ కథలలో కథకులు హృదయం కదిలించేలా రాసారు. ఓలి అనే మూఢాచారానికి స్త్రీలు బలైపోవడం, అట్లాగే ఎవరైనా దొంగతనం చేస్తే, అనుమానం నిర్ధారణ కోసం వేడి నీళ్లలో చేతులు పెట్టించడం ఈ కథల్లో మనము చూస్తాం. అట్లనే ఇక ఈ ఎరుక కథల్లో నిర్లక్ష్యానికి గురి కాబడ్డ అట్టడుగు సంచార వర్గాల సమస్యలు, ప్రధాన స్రవంతి సాహిత్యంలో కనిపించని ఎరుకల సమస్యలు, వాళ్ళ అనుభవాలు, అణిచివేత, ప్రతిఘటన ఈ కథల లో అద్భుతంగా వ్యక్తం అయినట్టు తెలుస్తుంది. ఇక కథనం దగ్గరికి వచ్చేటప్పటికి విశ్లేషణ చేస్తున్నప్పుడు అంటే కథా వస్తువు నెరేట్ చేస్తున్నప్పుడు కథకులు చాలా సహజమైన పద్ధతిని ఎన్నుకున్నారు .కథ చెప్పే విధానం కానీ, పాత్రను రూపొందించడం కానీ, ప్రతీకలు, సంఘర్షణ, ముగింపు కథకులు ఎంతో బాధ్యతగా ముగించారు అనిపిస్తుంది. ఈ కథలు చదువుతూ ఉన్నపుడు, చదివాక, ఇతర సంచార తెగల కథలకి , ఎరుకల సాహిత్యానికి సంబంధించి ఒక తులనాత్మక విశ్లేషణ, సమీక్షించేటప్పుడు విమర్శించేటప్పుడు మాట్లాడేటప్పుడు చేయొచ్చని అనిపించింది.
**
మొత్తానికి ఈ ఎరుక కథల్లో పరిశీలించాల్సిన అంశాలు, ఎరుకల జీవితాల్లో సంచార జీవితం ఎలా ప్రతిబింబించింది? వారి గుర్తింపు ఎలా నిర్మితమవుతూ వచ్చింది? అంటే బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వర్తమాన భారతదేశ ఆధునిక కాలం వరకు ఎరుకల జీవితంలో ఎలాంటి గుణాత్మక పరిణామాలు చేరాయి లేదా మరింత దిగజారిపోయేలాగా లేదా దుర్మార్గంగా వాళ్ళ జీవితం మారిపోయిందా ఏ రకంగా నిర్మితమవుతుంది లేదా విధ్వంసం అవుతోంది? ఆధునికత వల్ల, ప్రపంచీకరణ వల్ల, అమెరికన్ సామ్రాజ్యవాదం వల్ల, మల్టీ నేషనల్ కంపెనీలు దోపిడి వల్ల వీళ్ళు ఎలా తమ అడవికి తమ ప్రాంతాలకి తమ వృత్తు లకు తమ సంస్కృతికి వాళ్ళు దూరమయ్యారు అన్నది రచయితలు చెప్పగలిగారా లేదా అన్నది మనకి బాగా అర్థమవుతుంది. బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ ట్రైబల్ చట్టానికి వీరిల బలవుతూ వస్తున్నారు. అలాగే ఎరుకలకి ప్రకృతి తోటి జంతువులు తోటి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ కథల్లో ఎరుకల జీవితంలో, సంస్కృతి, జంతువులు వృత్తులు ఏ పాత్ర పోషించాయి? ఎలా జంతువులు ప్రకృతి, అడవి, చెరువులు, వాగులు కుంటలు లాంటి నీటి వనరులు ఎరుకల జీవితాల్నిపెనవేసుకొని వాళ్ళ జీవితానికి సంబంధించిన ఆటుపోట్లతో కలిసి, విడిపోయి ఉన్నాయి. తోడుగా నిలబడ్డాయి అన్నది ఈ కథలలో అర్థం అవుతుంది. ఇక ఎరుకల మహిళల అనుభవాలు పోరాటాలు,దుఖాలు,అణిచివేత,లైంగిక దోపిడీ ఎలా ఎరుక కథలలో చిత్రించ బడ్డాయి అనేది కూడా ఈ కథలలో కనిపిస్తుంది. ఆధునికీకరణ వల్ల ఎరుకల జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చిందో కూడా ఈ కథలలో తెలుసుకుంటాం. ఇక మౌఖిక సంప్రదాయం నుంచి లిఖిత సంప్రదాయానికి వచ్చిన పరిణామాలు ఏంటి? నిజానికి ఎరుకలకి లిపి లేదు కదా! మౌఖిక సంప్రదాయంలోనే వాళ్ళు కథలు చెప్పుకునేవారు. మౌఖిక సాహిత్యం అంటే జానపద కథలు, గేయాలు, పురాణ కథలు, జ్ఞాపకా కథనాలు ఈ పద్ధతిలో విశ్లేషిస్తే ఎరుకల జీవనతత్వం సంస్కృతి సామాజిక అనుభవాలు స్పష్టంగా మనకి తెలుస్తాయి. కానీ ఎరుకల, ఇతర సంచార తెగల మౌఖిక సాహిత్యం రికార్డు కావడంలో, లిఖిత సాహిత్యంలోకి మార్చడంలో వైఫల్యం కనిపిస్తుంది. అలా సబాల్టర్న్ సాహిత్యం అడుగడుగునా ఆధిపత్య సాహిత్యకారుల, పత్రికాధిపతుల, సాహిత్య పరిశోధకుల, నిఘంటుకారుల వామనపాదం కింద అణిచివేయబడింది.

సబాల్టర్న్ సాహిత్యం మీద రచయితలు ఎందుకు దృష్టి పెట్టట్లేదు?
ప్రధాన స్రవంతి రచయతలు సబాల్టర్న్ సాహిత్యానికి దూరంగా ఎందుకున్నారు. లేదా ఎందుకు గుర్తించట్లేదు? నిజానికి ఎరుక కధా సంకలనంలో ఎరుకల జీవితాలకు సంబంధించిన సమస్తమైన సంవేదనలు, ఘర్షణలు, దోపిడీ, కుట్రలు, అవమానాలు, బాధలు, పోరాటాలు, జయాపజయాలు, మరణాలు ఇవన్నీటిని చూస్తాము. అలాగే ఇతర సంచార తెగలైన లంబాడ, యానాది, యాదవ, గొల్ల, చెంచుల సాహిత్యంలో కూడా ఎరుకల జీవితాల్లోని సమస్థమైన వేదనా కనిపిస్తుంది. సమాజంలోని ఒక అట్టడుగువర్గ ప్రజల బాధలపై రావాల్సినంత సాహిత్యం ఎందుకు రావట్లేదు? వచ్చినా ఎందుకు చర్చ జరగడం లేదు? ఎందుకు ఇంత వివక్ష? ఈ lierary isolationsm ఎందుకు? చాలా ప్రశ్నలు, సందేహాలు.

ఈ ఎరుక కథలు చదవడం అయిపోయాక రచయితలకి తమ బాధ్యత ఏంటో స్పష్టంగా ఎరుకలోకి వస్తుంది. సమాజంలోని అట్టడుగు వర్గాల, గుర్తింపుకి కూడా నోచుకోని ఆదిమ, అర్థ సంచార తెగల జీవన విధ్వంసాల పైన దృష్టి సారించవలసిన అవసరాన్ని, ఆ ఖాళీలని పూరించాల్సిన అవసరాన్ని రచయతలు తప్పకుండా గుర్తిస్తారు. ఈ ఎరుక కథా సంకలనం కథకులలో ఆ సోయిని కలిగిస్తుంది.

ఎరుక కథలు చదివాక కాఫ్కా గుర్తుకు వస్తాడు.“ఏదైనా పుస్తకం, చదివాక మనలో గడ్డకట్టుకు పోయిన సముద్రాన్ని పగలగొట్టే గొడ్డలిలా ఉండాలి” అంటాడు ఫ్రాన్స్ కాఫ్కా. అంతే కాదు, సాహిత్యం మన ఆలోచనలను కదిలించి మనుషులలో విప్లవాత్మక మార్పుకు నాంది పలకాలి” అని కూడా అంటాడు కాఫ్కా. ఈ సంచార తెగ ఎరుకల కథలు చదువుతూ ఉన్నప్పుడు ఒక్కో కథ పూర్తయ్యాక చదవడం ఆపేసి ఎరుకల జీవితాలలో ఆ సంఘర్షణ, బాధ, ఆవేదన, అనుభవాలు, కన్నీళ్లు, నిస్సహాయత, దుఃఖం ఇవన్నీ నన్ను చాలా డిస్టర్బ్ చేసాయి. ఆలోచిస్తూ ఆగిపోయాను. ఆగి, ఆగి చదివాను. ఎరుకల సామాజిక వర్గానికి సంబంధించి నా దృష్టి, నా కథా సృజన ఒక్క “రేణుకెటుపోయిందీ ఇసుక తుఫానులో’ అన్న ఒక్క కథతో మాత్రమే ఎందుకు ముగిసిపోయింది? ఇంత భయానకమైన సంక్షోభాన్ని ఎరుకల జీవితాల్లో అతి దగ్గరగా చూసిన తరువాత కూడా నేను ఎరుకల జీవితాల మీద, ఇతర సంచార జాతుల జీవితాల మీద ఎందుకు కథలు రాయడం కొన సాగించలేదు? రాయాలని ఉన్నా ఆ ఒక్క కథ దగ్గర మాత్రమే ఎందుకు ఆగిపోయాను? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నా నిర్లక్ష్యానికి, అలసత్వానికి కోపగించుకున్నాను. ఒక రకంగా సిగ్గు పడ్డాను. ఆత్మ విమర్శలో కూరుకుపోయాను. చాలామంది రచయితలకు తెలియని కొత్త జీవితం ఈ ఎరుకల జీవితం. సంచార తెగల జీవితాలు అనాదికాలం నాటివే కానీ రచయితలు చాలా తక్కువగా దృష్టి సారించిన జీవితాలు ఇవి. రచయిత సమాజాన్ని అంతటా కూడా సమాన దృష్టితో పరిశీలించాలి. కానీ రచయితలు తమ తమ వస్తువులకు పరిమితులు విధించుకున్నారనిపిస్తుంది. సాహిత్యం కుల మత ప్రాంతాల వారిగా చీలికలు చీలికలుగా, శకలాలుగా విడిపోయింది. ఒకరి ప్రాంతపు, కులపు, మతపు, జెండర్ సాహిత్యం మరొకరికి అంటరానిదై పోయింది. రచనలను, రచయితను వొంటరిగా చూసే సాహిత్య విచ్చిన్నత లేదా literary isolationism ఎక్కువైపోయింది. మా గురించి మీరు రాయొద్దు, మీ గురించి మేము రాయము, చదవము, గుర్తించము అన్నcompartmentalization లోకి, సాహిత్య సంకుచితత్వంలోకి (parochialism,tokenism)పడిపోయింది తెలుగు సాహిత్య రంగం. ఈ ధోరణులు దళిత, స్త్రీవాద, ప్రాంతీయ అస్తిత్వాలని ముందుకు తెచ్చేవి అయినప్పటికీ వీటిలోని అతివాదం వలన సాహిత్యం విశ్వజనీనతని కొల్పొయి శకలాలుగా విడిపోతుందని కొందరి వాదన. Subaltern సాహిత్యాన్ని పక్కన పెట్టేయడం, పట్టించుకోకపోవడంలో పైన చెప్పిన ధోరణి కనిపిస్తుంది. మనకు సంబంధించని జీవితాన్ని మనం ఎందుకు రాయాలి, చదవాలి, పరిశీలించాలి, ప్రచారం కలిపించాలి? అన్న సంకుచిత ధోరణి కూడా ఉంది. అయితే సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఈ ఎరుక కథా సంకలనంలో ఒక్క పలమ నేరు బాలాజీ గారు తప్ప మిగతా అందరూ ఎరుక సామాజిక వర్గానికి చెందినవారు కారు. ఎరుకల మీద వచ్చిన సాహిత్యంలో చాలామంది ఎరుకల సామజిక వర్గానికి చెందిన రచయతలు కాకుండా వేరే కులానికి సంబంధించిన రచయితలు. సానుభూతితోనో, సహానుభూతితో, బాధ్యతతో రాసిన రచయితలు ఉన్నారు. ఇది చాల మంచి విషయం. నిజానికి రచయతలు అంతా పూనుకుని కుల, మత, ప్రాంత పరిమితుల్ని దాటుకుని ఈ సబాల్టర్న్ సాహిత్యాన్ని ఎంత ఎక్కువ గా అయితే అంత ఎక్కువగా సృజించాల్సిన అవసరం ఉంది.

ఎరుక’ కథా సంకలనం : సబాల్టర్న్ సాహిత్యం :
సమాజంలో అణిచివేయబడిన అట్టడుగు స్థితిలో ఉన్న అధికారం, ప్రాతినిధ్యం ఏమాత్రం లేని వర్గాలకు చెందిన కథలు ఇవి. అడవంచు, నాగరిక సమాజం నుంచి వెలివేతకు గురైన మనుషుల గురించిన కథలు ఈ ఎరుకల కథలు. సమాజంలో అత్యంత వెనకబడిన అణచివేతకు గురైన సమాజం గుర్తించని వర్గాల జీవితాలను, వారి బాధలను సంఘర్షణలను ప్రతిబింబించే సాహిత్యమే సబాల్టర్న్ సాహిత్యం లేదా అట్టడుగు వర్గాలకి చెందిన సాహిత్యం. నిజానికి సబాల్టర్న్ అనే పదానికి మిలిటరీ మూలాలు ఉన్నాయి. సబాల్టర్న్ అనేది మొదట బ్రిటిష్ సైన్యంలో తక్కువ హోదా కలిగిన ఉద్యోగులను సూచించడానికి వాడే పదం ఇటాలియన్ మార్క్సిస్టు మేధావి ఆంటోనియో గ్రాంసి ఈ సబాల్టర్న్ పదాన్ని రాజకీయ సామాజిక చర్చల్లోకి తెచ్చారు. ఏ అధికారం లేని గారిన వర్గాలను సూచించడానికి ఆంటోనియో గ్రాంసీ ఈ పదాన్ని వాడారు. సబాల్టర్న్ ప్రజలు అంటే సమాజంలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఏమాత్రం స్వరంలేని కిందిస్థాయి ప్రజలు అని అర్థం.

సబాల్టర్న్ సాహిత్యం ఎవరి గురించి చెప్తుంది?
ఎవరి గురుంచి చెబుతుంది అంటే, శతాబ్దాలుగా సామాజిక వివక్షను ఎదుర్కొంటున్న అణచివేతకు గురవుతున్న దళితులు గిరిజనులు పితృస్వామ్య వ్యవస్థలను పీడనకు అణచివేతకు గురవుతున్న స్త్రీలు పెట్టుబడి దారి భూస్వామ్య వ్యవస్థల్లో శ్రమ దోపిడీకి గురవుతున్నకార్మికులు, రైతులు సమాజంలో ప్రధాన స్రవంతికి దూరంగా ఉంచబడిన ముస్లిం మైనారిటీలు, భిన్న లైంగిక ధోరణులతో ఉండే ఎల్జీబీటీ క్యు ప్లస్ లు వీరంతా అణగారినవర్గాల అట్టడుగు పీడిత ప్రజలు, ఆధిపత్యానికి లోనైన వర్గాలు, సమాజపు అంచులకు నెట్టివేయబడ్డ ప్రజల గురుంచి చెబుతుంది. సమాల్టర్న్ సాహిత్యం పదాన్ని గాయత్రి చక్రవర్తి సేవాక్ వంటి మేధావులు సాహిత్య విమర్శ సాంస్కృతిక అధ్యయనాల్లో మరింత అభివృద్ధి చేశారు. రణజిత్ గుహ భారతీయ సందర్భంలో సబాల్టన్ స్టడీస్ ద్వారా ఈ భావనను మరింత విస్తరించారు. సబాల్టర్న్ సాహిత్యం అన్న పదం ఎటువంటి అర్థాన్ని ఇస్తుంది అంటే సమాజంలో ప్రధాన చరిత్ర, సాహిత్యం రాజకీయాల్లో స్వరం లేకుండా మిగిలిపోయిన ప్రజల జీవితాలు అనుభవాలు పోరాటాలను ప్రతిబిపించే సాహిత్యాన్ని సబాల్టర్ లిటరేచర్ అని అంటారు

సబాల్టర్న్ సాహిత్యం ముఖ్య లక్షణాలు :
సబాల్టర్న్ సాహిత్యం లేదా అట్టడుగు వర్గ ప్రజల సాహిత్యం ముఖ్య లక్షణాలు ఎలా ఉంటాయంటే…

  1. చరిత్రను తిరగ రాయడం : ఇప్పటిదాకా చరిత్రను రాజులు పాలకుల ఉన్నత వర్గాల కోణంలోనే రాశారు. కానీ అట్టడుగు వర్గ సాహిత్యం సామాన్య ప్రజల, అట్టడుగు వర్గాల అణిచివేతలకు గురైన కులాల ప్రజల కోణంలో చరిత్రని చూపిస్తుంది. రాజులూ పాలనాధికారాల అధికార వర్గాల దృక్కోణంలోంచి చూపించదు, రాయదు. 2. అధికార వ్యవస్థ పై తిరుగుబాటు చేస్తుంది : కులం వర్గం లింగం ఆధారంగా జరిగే అణచివేతను ఈ సబాల్టర్న్ సాహిత్యం తీవ్రంగా ప్రశ్నిస్తుంది.
  2. సొంత స్వరం కలిగి ఉంటుంది : అణగారిన ప్రజలు ఇతరుల జాలికోసం చూడకుండా తమ బాధలను పోరాటాలను హక్కుల అధికారాల డిమాండ్లను స్వయంగా వ్యక్తపరచడం సబాల్టర్న్ సాహిత్యం ప్రత్యేకత.
  3. వాస్తవికత : సబాల్ట ర్న్ సాహిత్యంలో కల్పనల కంటే చేదు నిజాలు, కఠినమైన జీవన వాస్తవాలు ఉంటాయి.
  4. సబాల్టర్న్ సాహిత్యం సామాజిక న్యాయం సమానత్వాన్ని ఆకాంక్షిస్తుంది.

మొత్తానికి తెలుగు సాహిత్యంలో, సమాజంలోని అణగారిన అట్టడుగు వర్గాల జీవితాలను, వారి అనుభవాలను పోరాటాలను దళిత, ఆదివాసీ, బహుజన శ్రామిక వర్గాల అనుభవాలను, భారతదేశంలో ముస్లిం మైనారిటీల అస్తిత్వ పోరాటాలను, స్త్రీలపై జరిగే దౌష్ట్యాలను, సామాజిక అన్యాయాన్ని కేంద్రంగా చేసుకొని రచించబడిన సాహిత్యాన్ని సబాల్టర్న్ సాహిత్యం అంటారు.


సబాల్టర్న్ లేదా ఆదిమ సంచార తెగలు అంటే ఏమిటి? వీళ్ళు ఎవరు?
మానవ జాతి చరిత్రలో ఆదిమ సంచార తెగలు (primitive nomadic tribes )అంత్యంత కీలకమైన భాగం. ఒకే చోట స్థిరనివాసం లేకుండా ఆహారం, పశుగ్రాసం, జీవనోపాధి కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నిరంతరం వలస వెళ్లే మానవ సమూహాలను ఆదిమ అర్థ సంచార తెగలు అంటారు. నాగరికతకు దూరంగా ప్రకృతితో ముడిపడి జీవించే జీవన విధానం వీరిది.

ఆదిమ సంచార తెగల లక్షణాలు :
నిత్యం కాలమార్పులు, రుతువులను బట్టి, నీటిలభ్యతను బట్టి మీరు తమ నివాసాలను మారుస్తూ ఉంటారు. గుడిసెలు, గుడారాలు, వెదురుతో తాత్కాలికంగా నిర్మించుకునే గుడిసెల్లో, గుహలలో, చెట్ల నీడలలో ఉంటారు. అటవీ ఉత్పత్తుల సేకరణ పశువుల పెంపకం, హస్తకళలు, వెదురుతో చాపలు బుట్టలు తడికలు తయారు చేయడం పందులు, పశువుల పెంపకం వీరి ప్రధాన వృత్తులు. జంతువులని వేటాడడానికి రాళ్లు, ఎముకలు, కర్రలతో చేసిన ఆయుధాలు వాడేవారు. అగ్ని ఆవిష్కరణ తరువాత ఆహారం వండుకోవడం, చలి కాచుకోవడం నేర్చుకున్నారు. పాత రాతి యుగం నుండి ( paleolithic),సూక్ష్మ రాతి యుగం (Mesolithic) వరకు వీరి జీవనం సాగింది. మెల్లిగా పసువులను మచ్చిక చేసుకోవడం ద్వారా సంచార పశుపోషలుగా మారారు. నవీన రాతియుగం లో (neolithic) వ్యవసాయం కనుక్కోవడం ద్వారా వీరి జీవితాలు మారాయి. నీటి లభ్యత ఉన్న నదీ తీరాలలో స్థిరపడడం ప్రారంభించారు. ఈ స్థిర నివాసాలే తరువాతి కాలంలో సింధు లోయ వంటి గొప్ప నాగరికతకి పునాది వేసాయి. ప్రకృతిని, చెట్లను, జంతువులను దైవంగా భావించి పూజిస్తూ ఉంటారు
**
సంచార తెగలలో మూడు రకాలు ఉంటాయి. పశుపాలన చేసే సంచార తెగలు : వీళ్ళల్లో గొర్రెలు, మేకలు, వొంటెలు, ఆవుల మందలతో గడ్డి మైదానాల వెంబడి తిరిగేవాళ్లు. ఉదాహరణ హిమాలయాల్లోని గుజ్జర్లు, రాజస్థాన్లోనే ఆచార్యులు. రెండు : వేట సేకరణ తెగలు. అడవులలో జంతువులను వేటాడుతూ దుంపలు పండ్లను సేకరిస్తూ జీవించేవాళ్ళు. మూడు : వృత్తిపరమైన సంచార తెగలు. గ్రామ గ్రామాన తిరుగుతూ ఇంద్రజాలం, మాయలు, మ్యాజిక్ విద్యలు, బుట్టల అల్లకం, నటన లేదా ఇనుప వస్తువులు తయారు చేసే వాళ్ళు, గారడీలు చేస్తూ జీవిస్తారు.

తెలంగాణ, ఆంధ్రా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ప్రముఖ ఆదిమ సంచార తెగలు :
చెంచులు : వీళ్లు నల్లమల అడవుల్లో నివసించే అత్యంత ప్రాచీన ఆదివాసీ తెగ ప్రజలు. అటవీ ఉత్పత్తులు వీరి ప్రధాన వనరు. అక్కడి ఖనిజాల కోసం, అటవీ భూములు, కలప, మూలికల కోసం ప్రభుత్వం డీ-బీర్ లాంటి అనేక మల్టినేషనల్ కంపెనేనీలతో కుమ్మక్కై వీరిని కుహనా అభివృద్ది పేరుతో బలవంతంగా నాగరిక ప్రపంచంలోకి తీసుకెళ్లింది. కానీ నాగరికత, నగర జీవనం సరిపడని ఆదివాసీలు, జీవన భృతి దొరకని చాలామంది మళ్ళీ అడవుల్లోకే వెళ్ళే ప్రయత్నం చేసారు. చాలామంది వలసలు వెళ్ళిపోయారు. రెండు: లంబాడాలు లేదా సుగాలీలు అని కూడా అంటారు. ఒకప్పుడు సంచార జీవనం గడిపి ప్రస్తుతం స్థిరపడుతున్న తెగ. వీరిని ప్రభుత్వం ఎస్.టి లలో చేర్చింది. మిగతా తెగల కంటే కూడా వీరు ప్రభుత్వం సమకూర్చిన విద్యా, ఉద్యోగ సౌకర్యాలను, రిజర్వేషన్లను ఉపయోగించుకుని అభివృద్దిలోకి వస్తున్నారు. సాహిత్య రంగంలో కూడా లంబాడా రచయితలు మిగతా సంచార తెగల సాహిత్యకారుల కంటే చాలా ముందుఉన్నారు. తమ సంస్కృతిని, ఆచార వ్యవహారాలని, జీవన పోరాటాలని సాహిత్య రు రూపంలో రికార్డు చేస్తున్నారు.
మూడు: ఎరుకల తెగ. వీరు సోది, భవిష్య వాణి చెప్పడం, జ్ఞానం పంచడం లేదా ఎరుక చెప్పడంచేస్తూ ఉరూరుతిరుగుతూ ఉంటారు. ఈత బుట్టలు, చాపలు చీపుర్లు పందుల పెంపకం, ఉడుములు, కౌజు పిట్టల వేట, బిక్షాటన, మంచాలకు నవార్లు అల్లడం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఎక్కడ పని దొరికితే అక్కడికి వీళ్ళు వెళ్లిపోతూ ఉంటారు. ఒకచోట స్థిర నివాసం ఉండదు. నాలుగు : యాదవులు గొల్లలు : వీళ్ళు పశువుల మందతో వలసలు వెళ్లే తెగ. ఆవులు, బర్రెలు పెంచుతూ పాడి పెరుగు అమ్ముతారు. వీరితో పాటు కోయలు,గోండులు కూడా సంచార తెగకి చెందిన వాళ్ళు.

ఆదిమ సంచార తెగ ప్రజలు ప్రస్తుతం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు.పాలక వర్గాల ఆదివాసీ వ్యతిరేక అభివృద్ది నమూనాల అమలు వల్ల అడవులు క్షీణించిపోతూ వచ్చాయి. అటవీ చట్టాలలో మల్టీ నేషనల్ కంపెనీ అనుకూల మార్పుల వల్ల, పారిశ్రామికీకరణ వల్ల వీరి సంప్రదాయ జీవన స్థావరాలు తగ్గిపోతున్నాయి. అడవులను ప్రభుత్వం ఆక్రమించుకుంటుంది. అందువల్ల వీళ్ళు బలవంతంగా అడవి నుంచి తరమబడుతూ వలసలు వెళ్ళిపోతున్నారు. మారుతున్న కాలంతో పాటు వీరి సంప్రదాయ వృత్తులు ఆదరణ తగ్గింది ప్రపంచీకరణ నేపథ్యంలో ప్లాస్టిక్ వచ్చి వీళ్ళు తయారు చేసే వెదురు వస్తువులకి బుట్టలకి ఈత చాపలకి డిమాండ్ తగ్గింది. దాంతో ఆ వృత్తులు మానేసి నగరాలకు వలస బాటపట్టారు.రాజ్యం కుట్ర పూరితంగా.హింసని,నక్సల్స్ తో సంబంధాల్ని అంటగడుతూ వీరిని అడవినుంచి విస్తాపితుల్ని చేస్తూ వచ్చింది. అలా నిరంతరం వలసలు వీళ్ళని ఆధునిక విద్యకి, కనీస ఆరోగ్య సౌకర్యాలకి దూరం చేస్తున్నాయి. తూ తూ మంత్రంగా ప్రభుత్వాలు వీరిని డి-నోటిఫికేషన్ గా గుర్తించి, ఆ వర్గంలో చేర్చి సంక్షేమ పథకాలను అందిస్తున్నాయి.

ఎరుకలు లేదా కుర్రు తెగ – పరిశీలన :
ఎరుక తెగ ప్రజల జీవితం అత్యంత ప్రాచీనమైంది. సంక్లిష్టమైన సంప్రదాయాలతో కూడుకున్నది. అత్యంత వెనకబడిన అట్టడుగు వర్గ ప్రజలు వీళ్ళు. దక్షిణ భారత దేశంలో ఎక్కువగా ఉంటారు. దాదాపు 519,337/ 2011 జనాభా ఉన్నారు. ఎరుక అంటే తెలియడం లేదా జ్ఞానం అని అర్థం. ఈ తెగ మహిళలు సోది లేదా భవిష్యత్తు చెప్పడంలో నిపుణులు కావడం వల్ల వీరికి ఎరుకల అనే పేరు వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న ఎరుకల జాతి ప్రజల సాంఘిక ఆర్థిక సంస్కృతిక జీవన విధానం చాలా భిన్నమైంది.

ఎరుకల్లో ఉప తెగలు వృత్తులు :
దబ్బు ఎరుకలు : వీళ్లు వెదురు పుల్లలతో బుట్టలు చాపలు అల్లుతారు.
ఈత పుల్లల ఎరుకలు : ఈతాకుల పుల్లలతో చీపుర్లు లాంటి నిత్య జీవన వస్తువులు తయారుచేస్తారు.
సోది పెరిక ఎరుకలు : ముగ్గు పిండి, ఎర్ర మన్ను అమ్ముతుంటారు. ముఖ్యంగా ఎరుకల స్త్రీలు సోది చెప్తారు. లేదా గద్దే, భవిష్యవాణి చెప్తూ జీవిస్తారు.
ఉప్పు కరివేపాకు ఎరుకలు : వీళ్ళు గ్రామ గ్రామాలు తిరుగుతూ ఉప్పు రకరకాల ఆకు కూరలు అమ్ముతూ బతుకుతారు. వీరు కాక ఎరుకల్లో ఇతర వృత్తుల వాళ్ళు పందులు, బాతులు, ఆవులు మేకలు పెంచుతూ బతుకుతారు. తాళ్లు పేనడం కూడా చేస్తారు.

ఎరుకల సామాజిక కుటుంబ వ్యవస్థ :
ఎరుకలలో పితృ స్వామ్య వ్యవస్థ బాగా వేళ్ళూనుకొని ఉంది. తండ్రే నిర్ణయాధికారి. వంశం తండ్రి పేరుతో కొనసాగుతుంది. ఓలి అనే దురాచారంతో ఇష్టపడ్డ స్త్రీలని వాళ్ళ వైవావిహక స్థితితో, ఇష్టాయిష్టాలతో సంబంధంలేకుండా డబ్బులు చెల్లించి, భర్త పిల్లల నుంచి విడదీసి బలవంతంగా తీసుకు పోతారు. అలాగే దొంగతనం అనుమానం వస్తే ఆడవిక పద్ధతిలో వేడి నూనెలో చేతులు ముంచి పరీక్ష చేస్తారు. ఈ ఆచారాలను తెగ నాయకులు, ఇష్టమైన స్త్రీ మీద కన్నేసిన ఇతర తెగ పెద్దలు, వాళ్ళు లొంగకపోతే తమ స్వార్థ ప్రయోజనాల కోసం కూడా అమాయకుల మీద అమలు చేస్తారు. ఎరుకల స్త్రీలు గొప్ప ఆర్ధిక సాధికారతతో ఉంటారు. పశువుల పెంపకం, ఈత బుట్టలు, తాళ్లు అల్లడం, తడికలు అల్లడం, భయమనేది లేకుండా అడవిలోకి వెళ్లి వెదురు తీసుకురావడం, ఊరూరు తిరుగుతూ సోది చెప్పడం , రకరకాల పూసలు దువ్వెనలు పిన్నీసులు లాంటి సామాగ్రి అమ్ముతూ, ఊరంతా తిరుగుతూ ఉత్పత్తిలో భాగమవుతూ ఉన్నప్పటికీ స్త్రీల పైన ఎనలేని దోపిడీ పీడనని తమ సొంత కమ్యూనిటీ నుంచి అలాగే గ్రామాల్లోని ఆధిపత్య కులాల భూస్వాముల, పెత్తందారుల నుంచి ఎరుకల స్రీలు ఎదుర్కొంటూ ఉంటారు.
ఎరుకల కుటుంబాలు చిన్నచిన్న వ్యష్ట కుటుంబాలుగా ఉంటాయి వీళ్ళు తాత్కాలికంగా వెదురు,ఈతాకు గుడిసెల్లో నివసిస్తూ ఉంటారు. వివాహాల దగ్గరికి వస్తే,రక్త సంబంధీకుల్లో, మేనరిక వివాహాలే ఎక్కువ వీళ్ళల్లో. ఇక ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కుల పంచాయతీలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కోర్ట్ కు వెళ్లకుండా ఊరు లేదా వాడ కుల పెద్దల పంచాయతీలో సమస్యలను పరిష్కరించుకుంటారు.

ఎరుకల భాషా సంస్కృతి విషయానికి వస్తే, వీరికి తమదంటూ సొంత వాష ఉంది దీన్ని కుర్రు లేదా కులవత భాష అంటారు.ఇది స్వతంత్ర ద్రవిడ భాష.ఇది రావుల, ఇరుల, కోట, తోడ, కొరవ, కైకడి (తమిళం), మలయాళం వంటి దక్షిణ ద్రావిడ భాషలకి దగ్గరగా ఉంటుంది. అయితే దీనికి లిపి లేదు. ఇది తెలుగు, తమిళం, కన్నడ భాషల ప్రభావంతో కూడిన ప్రత్యేక పదజాలంతో ఉంటుండి. ఈ ద్రావిడ ఎరుకల భాషని మాట్లాడే వారు ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణా, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ఉంటారు. కానీ చాలామంది ఇప్పుడు తెలుగు భాష ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈ భాష ఎక్కువగా మౌఖిక రూపంలోనే ఒక తరం నుంచి మరో తరానికి మారుతూ వస్తోంది. ఆవా – తండ్రి , తల్లి – టాటా/అమ్మ, కొడుకు – మోము, కూతురు – మాగా, మనవరాలు-పెథి ,వదిన-నంగ , మేర్చెంచి, తమ్ముడు-తేన్భి, అత్త-అట్టా, ఇవి కొన్ని కుర్రు భాష పదాలు.

ఎరుకల భక్తి సంస్కృతి విషయానికి వస్తే, ప్రకృతిలోని చెట్లు పుట్టలు రాళ్లు, జంతువులకు పూజ చేయడంతో పాటుగా పోలేరమ్మ, అంకమ్మ, కొల్లాపూర్ అమ్మ, వంటి గ్రామ దేవతలను వీళ్ళు పూజిస్తారు. ఎరుకలు జంతు బలులను ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఎరుకల గత, వర్తమాన పరిస్థితులు అత్యంత దారుణం. క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ బ్రిటిష్ పాలనా కాలంలో వీరి సంచార జీవనం వల్ల పుట్టుకతోనే నేరస్తులుగా ముద్ర వేసి తీవ్రంగా వేధించేవారు. కాలం మారుతున్నప్పటికీ శతాబ్దాలుగా ఎరుకల జాతి ప్రజలు అడవికి పరిమితమై అటవీ ఉత్పత్తులు, వేటాడడం ద్వారా జీవనం సాగించేవారు. బ్రిటిష్ వారి పాలనలో 1878లో అటవీ ఉత్పత్తులను ఉపయోగించడం, వేటాడడం నిషేధించడం వాళ్ళ ఎరుకల్ని మైదాన ప్రాంతాలకి తరలించడం, లేదా వాళ్ళే జీవిక కోసం గ్రామాలకి వలసలు వెళ్ళడం జరిగింది. ఆ రకంగా అటవీ సంపద పైన వీరు హక్కులు కోల్పోయారు.1911 వ సంవస్తరం,బ్రిటిష్ పాలకులు ఎరుకల జాతిని నేరస్తుల జాబితాలో చేర్చి ఎక్కడ దొంగతనం జరిగినా ఎరుకలనే ముంది=ఉ అర్రేస్తూ శిక్షలు వేసేవారు. బ్రిటిష్ కాలంలో ఎరుకలు నానా బాధలు పడ్డారు.ఎరుకలని గ్రామాల నుంచి వెళ్ళగొట్టి గ్రామాల చివరలో ఒక ప్రత్యేకమైన సెటిల్మెంట్ స్థావరాల్లో ఉంచి హాజరు తీసుకునేవారు. అక్కడి నుంచి ఎరుకలు వెళ్ళే ప్రయత్నం చేస్తేవెంటాడి పట్టుకొని మళ్ళీ శిక్షించేవారు. వీళ్ళని స్టువర్టుపురం దొంగలుగా ముద్ర వేసారు. 1950లో స్వాతంత్రం వచ్చాక భారత ప్రభుత్వం ఈ నల్ల చట్టాన్ని రద్దు చేసి వీరిని డి నోటిఫికేషన్ విభాగంగా గుర్తించింది. అయినా వీరిపై బ్రిటిష్ కాలం నాటి అణిచివేత,వివక్ష కొనసాగుతూనే ఉంది.

ఇప్పుడు ఎరుకలు మెల్లగా ఆధునిక జీవనాన్ని అనుసరిస్తున్నారు. ప్రపంచీకరణ ప్రభావం వల్ల అడవులు తగ్గడం, వృత్తులు నాశనం అవ్వడం, వల్ల ప్లాస్టిక్ వస్తువుల వాడకం పెరగడం వల్ల వీళ్ళు సంప్రదాయబద్ధంగా కులవృత్తులుగా చేసే బుట్టలు, చాపలు తయారీ అమ్మకం బాగా తగ్గిపోయింది. నగరానికి వలసలు వచ్చి రోజువారి కూలీలుగా మారిపోతున్నారు. అదే సమయంలో ప్రస్తుతం యువత చదువుపై దృష్టి పెడుతూ ప్రభుత్వ ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రాణిస్తూ సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటూ ఉన్నారు. రిజర్వేషన్లు ఉపయోగించుకుంటున్నారు. అయినా కుల వివక్ష అన్ని రంగాల్లో ఎదుర్కుంటున్నప్పటికీ, సామాజిక గౌరవం కోసం నిత్య పోరాటం చేస్తూ తట్టుకొని నిలబడుతూ ముందుకు వెళుతున్నారు.
**
ఈ సందర్భంలో కొలిమి ప్రచరణలు ప్రచురించిన ఆదిమ సంచార తెగ ఎరుకలకి సంబంధించిన కథలు గురించి మాట్లాడుకుందాం. ఎరుకలు భారతదేశపు మూలవాసులు. ఆదివాసీలు నాగరికత సమాజం రాజ్యం ఈ ఆదివాసీలను మనుషులుగానే గుర్తించని స్థితి భారత దేశంలో ఉంది.ఎరుక కథా సంకలనంలో సమాజంలో అత్యంత అణగారిన విస్మరణకు గురైన ఎరుకల సామాజిక వర్గ జీవన వాస్తవికతను ప్రతిబింబించే కథలు చూస్తాం. ఎరుకల జీవితంపై తెలుగు సాహిత్యంలో ‘ఎల్లి’ నవల రాసిన అరుణ తర్వాత పలమనేరు బాలాజీ గారి అద్భుతమైన ‘ఏకలవ్య కాలనీ కథలు’ ఆ తర్వాత ఎరుకల జీవన విధానం, సంస్కృతి భాష పై వచ్చిన కథా సంకలనం ఈ ఆదిమ ఎరుకల సంచార తెగ కథలు అయిన ‘ఎరుక’

భారతదేశంలోని అమానవీరమైన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో సమాజంలోని అంచుల్లోకి నెట్టబడిన అణగారిన ఎరుకల సామాజికవర్గ వేదనాభరిత సంఘర్షణల కథనాలే ఈ ఎరుక కథలు. వర్గ, కుల ఆధిపత్య సమాజంలో విస్మరణకు గురయిన ఎరుకల సామాజిక వర్గపు ప్రజల వాస్తవిక జీవితంలో ఏం జరుగుతుందో, ఏమి దాచిపెట్టబడుతున్నాయో అన్న విషయాలు బయటకు రావట్లేదు.సినిమాల్లో,నాటకాల్లో వాళ్ళని జానపద సంస్కృతీ సంప్రదాయాల్లో భాగంగా రొమాంటిక్ గా చూపిస్తారు. బయటికి కనిపించని చీకటిలో మగ్గిపోయే ఎరుకల జీవితాల్లో నిండిన అంధకారాన్ని, అమానవీయమైన దోపిడీల గురించి ఈ కథలు వెలుగు బావుటాల్లాగా నిలబడి చూపిస్తాయి, మాట్లాడతాయి. ఎరుకల జీవితాల్లోని చీకటి వెలుతురు మధ్య పెనుగులాటని స్పష్టంగా దృశ్యమానం చేస్తాయి. ఎరుక కథలలో ఎక్కడ కల్పన గాని, ఊహాత్మకతగాని లేదు. ఎరుకల సమాజంలో ఉన్న అత్యంత దయనీయమైన వాస్తవాలను ఉన్నది ఉన్నట్లుగా చెబుతాయి ఈ కథలు. ఎరుకల తెగ స్త్రీల జీవితాల్లోని పితృస్వామ్యాన్ని ఎండగట్టిన కథలు ఇవి. పురుషులలో సమానంగా వెదురు సమకూర్చుకోవడానికి అడవికి నిర్భయంగా వెళ్లడం, అడవి పందుల పెంపకం అడవికి వెళ్లి కట్టలు తెచ్చి వెదురు తట్టలు, బుట్టలు, చాపలు, ఈత తడికలు తయారు చేస్తూ అమ్ముతూ, డబ్బులు సంపాదిస్తూ ఉత్పత్తిలో పాలుపంచుకునే ఎరుకల స్త్రీలు తమ సొంత తెగ పితృ స్వామ్యానికి, ఆచారాలు సంప్రదాయాలకు పురుషాధిపత్యానికి ఎలా బలవుతూ, సంఘర్శిస్తూ, కొన్నిసార్లు మరణిస్తూ ఉంటారో కథకులు అత్యంత శక్తివంతంగా ఈ కథల్లో ప్రస్తావించారు. ఉపాధి కోసం వలస వెళ్లే ఎరుకల స్త్రీల మీద గ్రామ దొరలు, ఓలి అనే దురాచారానికి బలైపోయే స్త్రీలని, సంప్రదాయం పేరుతో నచ్చిన స్త్రీ వివాహిత అయినప్పటికీ పిల్లలు ఉన్నప్పటికీ ఆమె ఆమె భర్త ఇష్టానికి వ్యతిరేకంగా ఓలి పేరు తోటి డబ్బులు చెల్లించి ఆ స్త్రీని ఎత్తుకుపోయే భూస్వాముల దౌర్జన్యాలకి బలై పోయి ధ్వంసం అయిన కుటుంబాలు గురించి చర్చిస్తాయి ఎరుక కథలు. అలాగే ఈ దురాచారాన్ని తెలివిగా తప్పించుకునే పోషవ్వ లాంటి స్త్రీలు కూడా ఈ కథలో ఉంటారు. గొప్ప సాహసం, మానవీయత, కరుణా ప్రేమ అణువణువునా నింపుకున్న కాంతమ్మ, జయమ్మలు కూడా ఈ కథల నిండా మనకీ కనిపిస్తారు
**
సమాజంలో ఎవరూ పట్టించుకోని ఎరుకల జీవితాల మీద రాసిన ఎరుక కథలు, ఎరుకల జీవితాల్లోని విధ్వంసాన్ని, పాలక వర్గం, ఆధిపత్య కులాల వాళ్ళు ఎరుకల మీద చేసే దౌర్జన్యాలను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాయి. ఈ కథలు చదువుతుంటే సంచార జీవులు అయిన ఎరుకల జీవితాల్లోని విషాదం, బీభత్సం, సామాజిక గౌరవం కోసం వాళ్ళు చేస్తున్న సంఘర్షణ మనసుని కలిచి వేస్తాయి. మనకు ఏమాత్రం తెలియని వాళ్ళ జీవితం మన కళ్ళముందు సూర్యకాంతి లాగా, మెరిసి చీకటిలా కూడా భయ పెడుతుంది. ఎరుకల్లో వృత్తికి సంబంధించి ఎంతో కళాత్మకత,నైపుణ్యాలు ఉంటాయి. వెదురు తో విస్తృతంగా చేసే రకరకాల వస్తువులు వీళ్ళు అవకాసం ఇస్తే ఎంత పెద్ద వ్యాపార, వాణిజ్యాలని (industry) చేయగలరో తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. వీరి అద్భుతమైన వృత్తి నైపుణ్యాన్ని, సమాజ ఉత్పత్తిలో వీరి భాగస్వామ్యాన్ని, శ్రమని గ్రహించక కులాన్ని బట్టి వీరిని అసహ్యించు కొంటూ, ఊరవతలకి గెంటేసే నీచ ఆధిపత్య వ్యవస్థ ఇది.

అటు అడవికి ఇటు గ్రామాలకి చెందిన ఎరుకలు అడవిలోని వెదురు కర్రలు తాటాకులతో బుట్టలు గంపలు, చాపలు చీపురు కట్టలు తడికలు తయారు చేసి ఊర్లలో జరుగుతూ వారాంతపు సంతల్లో అమ్ముకొని జీవిస్తారు అలాగే అటవీ ఉత్పత్తులైనా ఇవ్వ పువ్వులు లాంటి ఇతర ఔషధ మొక్కలు మూలికలు లాంటి అటవీ ఉత్పత్తులు తేనె లాంటివి సేకరించుకొని బజార్లలో అనుకుంటూ ఉంటారు గాడిదలు పందులు బాతులు పెంపకమే కాదు ఉడుముల వేట కౌజు పిట్టల వేట పశువులు అమ్మకాలు కూడా చేస్తారు ఇళ్లల్లో పనులు కూలి పనులకు వెళ్తారు సంచార దొంగల అన్న ముద్ర వలన వీరికి ఇళ్లల్లో పనులు ఎవరు ఇవ్వరు శ్రీలు ఊర్లో తిరుగుతూ భవిష్యత్తు వానిని తెలిపే సోది చెబుతారు ముగ్గు పిండి అమ్ముతారు పూసలు గొలుసులు పిన్నులు. అమ్ముతారు. సంచార జీవులైన వీరి మీద ప్రభుత్వం పోలీసు వ్యవస్థ సమాజం దొంగలను ముద్ర వేస్తుంది.ఎప్పుడో నిషేధించ బడ్డ బ్రిటిష్ కాలం నాటి దుర్మార్గమైన క్రిమినల్ ట్రైబల్ ఆక్ట్ 871 అమలు చేసి జైలు పాలు చేస్తారు చేయని దొంగతనాలు నేరాలు చేసినట్లుగా ఒప్పుకోమని చిత్రహింసలు పెట్టి వెంటాడి వేధిస్తారు నేరాన్ని ఒప్పించి అన్యాయంగా జైలు పాలు చేస్తారు. దొంగ అనే ముద్ర నుంచి బయటపడేందుకు ఎరుకలు నానా తిప్పలు పడాలి. ఎక్కడ దొంగతనం జరిగినా ఎరుకలు కాలనీలోకి వెళ్లి ఎరుకలలోని జైల్లో వేసేస్తారు ఈ అభద్రత లోనే మీరు జీవితాలు గడిచిపోతాయి బీదరికం ఆకలి నిలువ నీడ లేక అల్లాడిపోతూ ఉంటారు

ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ఇందిరా ఆవాస్ యోజనలు గ్రామీణలు నీ వీళ్ళకు అందనే లేదు ఎరుకలు రాజకీయ నాయకులకు ఓటు బ్యాంకులు మాత్రమే ఒకపక్క రాజ్యం మరోపక్క గ్రామాల్లోని ఆధిపత్య కులాల పెత్తనం మరోపక్క సొంత కమ్యూనిటీలో కూడా స్త్రీల మీద పితృస్వామ్యం తరుముతుంటే వలసలు తిరిగే నిత్య విస్తాపితులు ఈ ఎరుకలు!

ఎరుకలు అడవుల్లోంచి పంచార జీవితాల్లో నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వచ్చి చదువుకుంటూ ఎస్సై ఎస్సైలుగా ఫారెస్ట్ ఆఫీసర్లుగా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ పని స్థలాల్లో ఊర్లలో ఆధిపత్య కులాల ఆఫీసర్లు సర్పంచులకు సర్పంచ్ల వివక్షకు అత్యాచారాలకు బలి అవుతూనే ఉన్నారు హేళనలకు కుల వివక్షలకు గురి అవుతూనే ఉన్నారు తమవృత్తులు ప్రపంచీకరణలో ధ్వంసం అయ్యాక వీరు బయటకు వచ్చి ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరుతున్నారు అయినా కానీ ఇప్పటికీ వీరికి జననం మరణ ధ్రువీకరణ పత్రాలు లేవు చాలామంది ఎరుకలకు ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు రేషన్ కార్డులు లేవంటే నమ్మగలమా? ఎన్నికల సమయంలో అవసరాలకు మాత్రమే వీళ్ళని గణాంకాల్లోకి తీసుకుంటారు రాజకీయ రంగంలో రిజర్వేషన్స్ కారణంగా ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నంత మాత్రాన వారి కులం మూలంగా వారి సామాజిక జీవితాల్లో గౌరవాల్లో ఏ మార్పు లేదు అదే వివక్ష హేళనల మధ్య వీళ్ళు నిస్సహాయంగా ఏ అధికారాలు లేకుండా బతుకుతున్నారు విద్యారంగంలో కూడా వీరి పట్ల దారుణమైన వివక్ష కనిపిస్తుంది బడిలో అంటరానితనం మధ్యాహ్న భోజనాల్లో అంటరానితనం వీళ్ళని చదువుకి దుఉరం చేస్తుంది. విద్యార్తులది ఎరుకల కులం అని తెలిసిన తర్వాత మరింత ఎక్కువగా శిక్షలు వేయడంలాంటివన్నీ కూడా బళ్ళలో ఇంకా నిత్యం జరుగుతూనే ఉన్నాయి

ఎరుకల జీవితం – సాహిత్యం :
ఎరుకల జీవితాల మీద తెలుగు సాహిత్యంలో చాలా తక్కువ సాహిత్యం వచ్చిందని చెప్పొచ్చు 1992లో ఎల్లి నవల వచ్చింది. నీలి నవల 1993లో వచ్చింది ఈ రెండు అరుణ గారు రాసినవే ఈ నవలలు ఎరుకల జీవితాల్లోని సంక్షోభం గురించి, సాంస్కృతిక నేపథ్యం గురించి స్త్రీ పురుష సంబంధాల గురించి, స్త్రీలపై స్వంత కమ్యూనిటీలోనే కాకుండా గ్రామాల్లోని ఆధిపత్య,పీడక కుల పురుషులు చేసే లైంగిక దౌర్జన్యం గురించి,వారి చేతుల్లో,రాజ్యం చేసే కుట్రల్లో ప్రాణాలు పోగొట్టుకునే ఎరుకల వారి గురించి అత్యంత ప్రతిభావంతంగా రాశారు అరుణ. ఆ తర్వాత వచ్చిన భూషణం గారు రాసిన కొండగాలి నవల ఎరుకల జీవితాన్ని చర్చించింది. ఈ దశ తరువాతే రచయితలు కవిత్వం కథలు నవలలు ఎరుకల జీవితాల్లో ఎరుకల జీవితాలని కి సంబంధించి మెల్లగా రాయడం మొదలుపెట్టారు.అందుకే చరిత్రలో ఆదివాసీలు మూలవాసుల మీద జరుగుతున్న దోపిడీ పీడనల మీద వచ్చిన సాహిత్యం చాలా తక్కువ .స్వాతంత్రానంతరం దశలోనే చాలా కాలం తర్వాత మూలవాసులైన ఆదివాసీల నుంచి,ఆయా సామాజిక వర్గాలకి చెందినా రచయతల నుంచి సాహిత్యం వచ్చింది. కోయ తెగ నుంచి ఖమ్మంకు చెందినా కుంజ కల్యాణి, ఖమ్మంనుంచే జాలి మగమాంగ్ రవి, తోకల గురవయ్యగారు చెంచు తెగ నుంచి, సూర్య ధనుంజయ్, బంజారా గూగులోతు.ఫూల్ సింగ్,గోపిని భూక్యా నాయకేవరంగల్ నుంచి, రమేష్ కార్తీక్ నాయక్, తిమ్మక రామ ప్రసాద్ జాతాపూర్ తెగ, ఆత్రం మోతీరాం కోలం తెగ,చిత్తూరునుంచి పలమనేరు బాలాజీ ఎరుకల తెగ నుంచి అత్యంత ప్రతిభావంతంగా రాస్తున్నారు. వీరి కంటే ముందు తెలుగు సాహిత్య రంగంలో గిరిజన ఆదివాసి సాహిత్యం చాలా తక్కువగా,అదీ జానపదాల,పద్యాల రూపాల్లొ వచ్చిందని చెప్పవచ్చు

1993 భద్రాచలం మండలం అంగలకుర్తి విద్యాసాగర్ తోని గిరిజన కథా సంపుటి 2009 ఇప్పపూలు తెలుగులో తొలి గిరిజన కథా సంకలనం జీవన్, ప్రొఫ్.జయధీర్ తిరుమలరావు గార్ల సంపాదకత్వంలో వచ్చింది. తర్వాత 2023లో ఈ కథా సంకలనానికి మరో పదకొండు కథలను చేర్చి 41 గిరిజన సంచార కథల సంకలనం జీవన్ సంపాదకత్వంలో వచ్చింది. తర్వాత పలమనేరు బాలాజీ గారు 2024 లో “ఏకలవ్య కాలనీ ఎరుకల జీవన గాథలు” అత్యంత ప్రతిభావంతంగా తీసుకువచ్చారు. ఏకలవ్య కథలు తెలుగు సాహిత్యంలో తొలి ఎరుకల కథా సంపుటిగా చెప్పచ్చు. అలాగే వివిధ రచయితలు, ఎరుకల సామాజిక వర్గానికి చెందని వారైనా, రాసిన ఎరుకల కథలు సంకలనంగా రావడం మాత్రం కొలిమి వాళ్ళు ప్రచురించిన “ఎరుక” ద్వారా మాత్రమే జరిగింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. కొలిమి ప్రచురణల ద్వారా సంపాదకుడిగా వ్యవహరించిన రచయిత, కవి, పరిశోధకుడు, ప్రొఫెసర్ శివరాత్రి సుధాకర్ కి, పల్లపు స్వాతికి, గుగులోత్ ఫూల్ సింగ్ ముగ్గురికీ శుభాకాంక్షలు. ఆ విధంగా ఈ ఎరుకల సంచార తెగల కథల పుస్తకం తెలుగు సాహిత్య ప్రపంచంలో “తొలి ఎరుకల కథా సంకలనం”గా నిలిచిపోతుంది . అట్టడుగు వర్గీయులైన ఎరుకల జీవితాల్లోని సంఘర్షణను, పోరాటాలను, జయాప జయాలను, దుఃఖాలను, ప్రేమానుబంధాలను గొప్పగా చెప్పిన కథలు ఈ ఎరుక కథలు.

ఆధిపత్య,పీడక కుల సమాజానికి ఎరుకల జాతి జీవితాలను గురించిన స్పృహని ఎరుకని కలిగించిన కథలు ఇవి. ఎరుకలు తమ జీవితాల్లో నిత్యం పొంచి ఉన్న ప్రమాదాలను కాచుకుంటూ,సామాజిక గౌరవం కోసం చేస్తున్న ఆత్మగౌరవ అస్తిత్వ పోరాటాల్లో, ఆధునిక సమాజంతో కలబడుతూ గెలిచి వోడుతూ తమ జీవితాల్లో తెచ్చుకుంటున్న మార్పులను ఈ కథలు మనకి చెబుతాయి
**
ఈ కథలలో ఎరుకలపై కొనసాగుతున్న అన్యాయాలు, దోపిడీ దౌర్జన్యాలు, హింస, బానిసత్వం, ఆ తర్వాత కొత్త తరమైన ఎరుకల కులంలో యువత తమ జీవితాల్లో మార్పులు తెచ్చే విధంగా ప్రభుత్వ పాలనలో,విధానాల్లో జరగాల్సిన మార్పుల కోసం చేస్తున్న పోరాటాలు ఆశలు ఆకాంక్షలు కనిపిస్తాయి. ఇలాంటి ఎరుకల కన్నీటి కథలని ఒక్క చోట కుప్ప పోసిన దుఃఖంగా చదివాక రచయితలుగా, సామాజిక కార్యకర్తలుగా, లౌకికవాదులుగా, ప్రజాస్వామ్యవాదులుగా ఈ సంచార జాతుల బాధలను పట్టించుకోనందుకు మన దృష్టి వారిపై పడనందుకు ,వాళ్లని ఎడం పెట్టినందుకు బహుశా సిగ్గుపడతాం కూడా.

రాసినంతమటుకు అయితే, ఈ కథా సంకలనంలో తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన రచయితలు అయా ప్రాంతాల్లోని ఎరుకల వారి జీవన సంఘర్షణలు సామాజిక సాంస్కృతిక అంశాలను కథలుగా ఆయా ప్రాంతాల భాష మాండాలికాల్లో గొప్ప భాష శైలీల్లో బాధ్యతగా రాశారు. ప్రతి కథలో వైవిధ్యం ఉంది. వస్తు శిల్పాలు కథకులకు కథకులకు మధ్య మారుతూ వచ్చాయి. ప్రతి కథలో ఎరుకల జీవితాల మీద రాజ్యం, ఆధిపత్య కులాలు, పోలీసు వ్యవస్థ, విఫలమైన ప్రభుత్వ విధాన వ్యవస్థ, సామ్రాజ్యవాదంలో భాగమైన కార్పొరేట్ వ్యవస్థ, పితృస్వామ్య వ్యవస్థ, మత దురాచారాలు కలిపి చేసే దోపిడీ దౌర్జన్యంతో పాటు నేరుగా ప్రముఖంగా చర్చిస్తారు రచయితలు.

ఎరుక పెంచిన ‘ఎరుక’ కథలు :
ఉదాహరణకు నల్లపూసల కథ సీనియర్ రైటరు వి.ఆర్. రాసాని రాసారు. వీరు రాయలసీమకు చెందిన కథకులు. ఎరుకల సమాజంలో మహిళలకి సంబంధించిన అద్భుతమైన కథా వస్తువుని ఎంచుకుని, గొప్ప శైలితో పాత్రలు, సంభాషణలు, సంవేదన, ముగింపు అన్నీ ఏకపాత్ర ముఖంగా ఒక స్త్రీ తో ధారాళంగా చెప్పిస్తారు రచయిత.

కథ ఆశాంతము ఎరుకల స్త్రీలో ఉన్న ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం కనిపిస్తుంది. అదే కథకి గొప్ప శైలిని , సౌందర్యాన్ని ఇచ్చింది. కథా నాయిక తన జీవితానికి సంబంధించి తను తీసుకున్న నిర్ణయాల పట్ల తనకు తానే ఆత్మ విశ్వాసంతో జస్టిఫై చేసుకోవడాన్నిచాలా గొప్పగా చూపిస్తారు రాసాని గారు. ముగ్గురితో మనువై, మూడు తావుల్లో సంసారమై, ముగ్గురు మగవాళ్ళతో కాపురం చేసిన తనను తాను ఏ తప్పు చేయని నిప్పులాంటి మనిషిగా ప్రకటించుకుంటుంది కథానాయిక. ఈ అమ్మాయి మొదటి భర్త యాదన్న 2000 రూపాయలు, ఒక పంది పిల్లను ఆమె నాయనకు ఓలిగా అంటే వరకట్నంగా ఇచ్చి పెళ్లి చేసుకుంటాడు. పిల్లలు ఎంతకీ పుట్టరు. ఊరు గేలు చేస్తుంది. ఎవరితోనైనా శారీరక సంబంధం పెట్టుకొని పిల్లల్ని కని తన పరువు కాపాడమని భార్యని అడుగుతాడు భర్త. చీ కొడుతుంది. కానీ, భర్త ఎక్కడ వదిలేస్తాడో అని భయపడి తన కాపురం నిలబెట్టుకోవడానికి తనకి ఇష్టమైన అజ్జప్పతో ఇష్టంగానే వెళ్లి, హాయిగా తిరిగి, అతనితో సంతోషంగా గడిపి వారం రోజుల తరువాత వూరికి తిరిగి వస్తుంది. ఊరంతా నవ్వుతుంది. వెక్కిరిస్తుంది. అవమానం భరించలేని ఆమె భర్త ఆమెను అదే కారణం చెప్పి వదిలేస్తాడు. ఊరి వాళ్ళ హేళనలు, గొడవ భరించలేక పోతాడు. ఆమె మీద ఎప్పటినుంచో కన్నేసిన గంగిరాయుడు ఓలితో ఆమెను సొంతం చేసుకుందామని అనుకుంటాడు. కానీ ఆమె ఒప్పుకోదు. తాను తిరిగిన అజ్జప్పనే పెళ్లి చేసుకుంటుంది. అజప్పతో రెండేళ్లు కాపురం చేసినా కానీ పిల్లలు పుట్టరు. గొడ్రాలు అంటారు. గంగిరాయుడు చెప్పుడు మాటలు విని అజ్జప్ప భార్యను కొట్టి తరిమేస్తే మళ్ళీ ఆమె తండ్రి ఇంటికి తిరిగి వస్తుంది. పౌడర్ డబ్బాలు అద్దాలు పిన్నిసులు అన్ని బుట్టలో పెట్టుకొని ఊరు ఊరు తిరిగి అమ్మి డబ్బులు సంపాదించేది. తండ్రికి భారం కాకూడదు అనుకుంటుంది. ఆమె మీద గంగిరాయుడికి మోహం పోదు. తన మీద లైంగిక అత్యాచారం చేయబోయిన వాడిని తన్ని వెళ్ళగొడుతుంది. ఇక వాళ్ళ నాన్న ఈ బాధలు చూడలేక వయసులో ఉన్న ఒక పిల్లవాడితో మూడో పెళ్లి చేస్తాడు. అప్పుడు ఆమెకు ఒక కొడుకు పుడతాడు. కసి పెంచుకున్న గంగిరాయుడు పెద్ద కులస్తులైన రైతుల ఇళ్ళ మధ్యలో ఎరుకలోళ్ళ ఇల్లు ఉండడానికి వీలులేదని పంచాయతీ పెట్టి గొడవ చేస్తాడు. గుడిసె పీకంచి ఊరవతలకి తరుముతాడు. ఈ బాధలు పడలేక అప్పటికే కరువుతో అల్లాడుతున్న ఊరిని వదిలి నెల్లూరు సీమకి వలసలు పోయి బుట్టలు పూసలు అమ్ముకుంటూ బతుకుతూ ఉంటారు. అక్కడ గువ్వలోళ్ళ పిల్ల మోజులో పడ్డ భర్త ఆమెను వదిలేస్తాడు. తండ్రి చనిపోతాడు. ఆమె ఒంటరి అయిపోతుంది. తరువాత చాలామంది పెళ్లి చేసుకోవడానికి వస్తారు. కానీ ఆమె ఎవరిని కూడా ఒప్పుకోదు. అందరిని వెళ్ళగొడుతుంది. అప్పుడు ఆమె జీవితంలోకి మొదటి భర్త యాదన్న వచ్చి మళ్లీ ఏలుకుంటానంటాడు. తన్ని తరిమేస్తుంది. రెండవ భర్త కూడా వస్తాడు. వాడిని తరిమే స్తుంది. మూడో భర్త కూడా తచ్చాడుతుంటే వాడిని కూడా తిరస్కరిస్తుంది. వాళ్లు కట్టిన నల్లపూసలు తెంపి నేలమీద వేసి పిల్లాడికి ఆడుకోమని ఇస్తుంది. నిర్దాక్షిణ్యంగా వదిలేసిన ఆ భర్తలు బాధ్యతగా లేనప్పుడు వాళ్లు మెడలో కట్టిన నల్లపూసలు కూడా ఎందుకు అని చెప్పి ఆమె అన్న పూసలు తీసేసి పడేస్తుంది. ఎప్పుడైనా, ఏమైనా చేసే అధికారాన్ని పురుషుడికి ఇచ్చిన పితృస్వామ్య వ్యవస్థ మీద దిక్ఖారాన్ని నల్ల పూసలు తెంపి పడేసి ప్రకటిస్తుంది. కథంత ఒకే స్త్రీ పాత్రతో monodrama లేదా singlecharacterstory గా నడిపించడం వాళ్ళ కథకి గొప్ప శైలి వచ్చింది. కథ చాలా గొప్పగా రాశారు. ఒక దశలో రావిశాస్త్రి గారి కథలు చదువుతున్నామా అనిపించేంత గొప్ప శైలితోటి పోయింది కథ. ఎరుకల స్త్రీల జీవితాలని ఆ తెగలోని సాంస్కృతిక దురాచారమైన ఓలి ఎలా విధ్వంసం చేస్తుందో , స్త్రీనెలా ఊరుమ్మడి ఆస్తిగా తయారు చేస్తుందో ఈ కథలో రచయిత వివరిస్తారు.

అలాగే ‘పది శేర్ల జొన్నలు’ కథ కూడా చాలా ఆర్థమైన కథ. కరువు కాలంలో ముగ్గురు పిల్లల్ని పోషించుకోలేక పిల్లలు లేని దంపతులకు అందులో ఒక బాబుని 10 షేర్ల జొన్నలకు అమ్మేసిన ఎరుకల తెగ దంపతులకు చెందిన దుఃఖ కథ ఇది. చదువుతున్నంత సేపు హృదయం కదిలిపోతుంది, ఎరుకల సంతానాన్ని పెంచుకోవడానికి వీలులేదని ఊరు నుంచి వెలివేస్తే కుల సంఘం తీర్పుని ధిక్కరించి తామే ఊరిని వదిలేసి ఊరు మారి పిల్లవాడిని పెంచి చదువు చెప్పించి ప్రయోజకున్ని చేసిన దంపతుల కథ ఈ పది శేర్ల జొన్నల కథ. ఆఖరికి జొన్నల అనేదే వాళ్ళ ఇంటి పేరుగా మారుతుంది పిల్లవాడు పెరిగే క్రమంలో ఎరుకల పిల్లవాడు అని చెప్పి బడిలో తెలిసిపోతుంది గుడిలో తెలిసిపోతుంది. ఊర్లో కూడా తెలిసిపోతుంది. వివక్ష ,అవహేలనల మధ్యనే పిల్లవాడు బాధపడుతూ పెరుగుతాడు. అప్పుడు ఆ దంపతులు చేసేది లేక ఒకసారి మధ్యలో ఊరు కూడా మారతారు.వాళ్ళు పెంచిన ఎరుకల పిల్లవాడు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన శాస్త్రవేత్తగా ఎదుగుతాడు.కథ కొంచెం సినిమాటిక్ ముగింపు అనిపించినా బాగా రాసారు అనంతపురం కడప జిల్లాకి చెందినా రచయిత జి.ఆర్.మహర్షి.

ఇక ‘పోషవ్వ’ అనే కథ మహబూబ్ నగర్ కి చెందిన డాక్టర్ తంగెళ్ల శ్రీదేవిరెడ్డి గారు రాసిన కథ ఇది. సంచార తెగల లోపల దురాచారాల సాకుతో ఇటు కుటుంబంలోని పురుషులు, బయటి సమాజంలోని ఆధిపత్య పీడక కులాల పురుషులు ఎలా కుట్ర పూరితంగా సంఘాల ఆమోదంతో లైంగిక అత్యాచారాలు చేస్తారో ఈ కథలో రచయిత్రి చర్చిస్తారు.

ఎరుకల సమాజంలో ఓలి అనే దుర్మార్గమైన దురాచారం ఉంది. అమ్మాయికే కట్నం ఇచ్చి డబ్బుల రూపంలో, పశువుల రూపంలో, బియ్యం రూపంలో, ఏదో ఒక రూపంలో ఇచ్చి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే,పెళ్లి అయిన అమ్మైనైనా సరే బలవంతంగా తీసుకుపోయే దుర్మార్గమైన ఆచారం ఉంది. అయితే అది పెళ్లిగా మారి కుటుంబం గా మారడం పక్కన పెడితే, పెళ్లయి పిల్లలు ఉన్న ఆడవాళ్లు నచ్చితే కూడా ఊరికి సర్పంచ్ దగ్గర నుంచి భూస్వాముల వరకు ఎవరికైనా సరే, ఆ భర్తకి భార్యకి వాళ్ళ ఇష్టానికి వాళ్ళ అనుభూతులకి, సంబంధం బాంధవ్యాలకి, ప్రేమలకి సంబంధం లేకుండా ఓలి చెల్లించి కుల పంచాయితీలో సంప్రదాయబద్ధంగా భార్యాభర్తలని విడదీసి ఆ స్త్రీని కామించిన పురుషుడికి అప్పచెప్పే భయంకరమైన దురాచారం ఎరుకల సమాజంలో ఉంది. ఈ కథలో ఓలి ఇచ్చి పెద్ద పోషవ్వను సంసారం నుంచి విడదీసి ఒకడు ఎత్తుకుపోతే, ఆమె కూతురు చిన్నపోశవ్వ మాత్రం తెలివిగా ఆ దురాచారాన్ని ఎదిరించి ఎల్లమ్మ దేవత పూనినట్లుగా నాటకం ఆడి తనను పరాయి మగవాడు కొనకుండా రక్షించుకొని మళ్ళీ తన భర్త దగ్గరికి వెళ్లి పోయిన కథ ఇది. దేవత పూనిన ఆమెను ఊరి పురుషులు ముట్టుకోకూడదు.పెద్ద పోషవ్వేమారు వేషంలో వచ్చి కూతురుకి దేవత పూనినట్లు నాటకం ఆడమని ఇచ్చిన సలహా తొలి తరం పెద్ద పోశవ్వకి,ఇప్పటి తరపు చిన్నపోషవ్వకి,చిన్న పోషవ్వభర్తకి మధ్యలో ఉంటుంది. ప్రొఫెసర్ శ్రీదేవి తెలంగాణ, మహబూబ్ నగర్ మాండలికంలో రాసి కథకి స్థానికతా పరిమళాన్ని అద్దారు. కథ ఎంత సులభంగా మనసు పడ్డ స్త్రీని బజారులో వస్తువుని కొన్నట్లు డబ్బిచ్చి కొనుక్కుంటారో, ప్రేమించిన భర్తా పిల్లలకి దూరమై ఇష్టం లేని ఓలి ఇచ్చి కొనుక్కున్న మగాడితో బ్రతకలేక ఆ స్త్రీలు పడే నరకం దారుణం. ఇదంతా పెద్ద పోషవ్వ పాత్రతో రచయిత్రి చెప్పిస్తారు. ఇంత దుర్మార్గమైన దురాచారం ఇంకా ఎరుకల కులంలోఉంది అని తెలుసుకుంటే ఆశ్చర్యం, బాధ కలుగుతాయి. కానీ చిన్న పోషవ్వ ఈ దురాచారాన్ని ఎదిరించడం చాలా గొప్పగా అద్భుతంగా అనిపిస్తుంది.
**

విరసం సభ్యుడు, కవి, రచయిత, తెలంగాణా జడ్చర్ల వాసి ఉదయమిత్ర గారు రాసిన “కాదేదీ పోరుకనర్హం” అనే కథలో మెదడువాపు వ్యాధి పందుల మూలంగా వస్తుందని ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ కలిసి ,ప్రత్యామ్నాయ వృత్తి, జీవనోపాధి ఏమీ చూ పకుండా, సరైన నష్ట పరిహారం ఇవ్వకుండా ఎరుకలు పెంచుకుంటున్న పందుల్ని క్రూరంగా చంపుతూ ఉంటే పందుల మీద ఆధారపడి జీవించే ఎరుకల వాళ్ళ జీవితాలు అల్లకల్లోలం అవుతూ ఉంటాయి. తమ కళ్ళముందే పందుల్ని చంపడం భరించలేక పోతుంటారు “పందుల వల్ల కాలుష్యం పెరిగిపోతుంది, మురికి పెరిగిపోతుంది, మెదడువాపు వ్యాధి వస్తుంది” అంటూ ఎన్నో కారణాలు చెప్తారు మున్సిపాలిటీ వాళ్ళు. కానీ కాలుష్యం వచ్చే ఇతర వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో డ్రైనేజీ వ్యవస్థ దగ్గర నుంచి సినిమా హాల్ తో ఫంక్షన్ హాల్స్,కెమికల్ ఫ్యాక్టరీలు వీటి నుంచి వచ్చే కాలుష్యాన్ని శుద్ధి చేయకుండా పందుల మీద పడ్డమేంటి అని ఎరుకల సేవా సమితి కూడగట్టుకుని ఉద్యమం మొదలుపెట్టి కోర్టు నోటీస్ తెచ్చుకొని తీవ్రంగా ఉద్యమించి కలెక్టరేట్ ఆఫీస్ ముందు పందులని హత్యలు చేయడాన్ని ఆపిస్తారు. స్థానిక కోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఊరవతల పందుల నివాసాలని సాధిస్తారు. కేవలం ఎరుకల సేవా సమితి వాళ్లు మాత్రమే కాదు ఇతర దళిత సంఘాలు ఇతర కుల సంఘాలు కూడా ఈ ఉద్యమంలో కలుస్తాయి.జంతువులతో కాదు జంతు ప్రవృత్తి కంటే కూడా,కల్మషం,కుట్రలు,స్వార్థం నిండిన మనుషులతోనే పర్యావరణంలో కాలుష్యం నిండుతున్నది, ముంది దాన్ని సంస్కరించాలి అన్న వాస్తవాన్ని మనుషులతో పాటు పందులు కూడా కలిసి ఉద్యమించడంలో భాగంగా మార్మికంగా చెప్తారు రచయిత. కాలుష్యం అనేది కేవలం పందుల వల్ల కాదు సమాజంలో ఉండే ఇతర వ్యవస్థలతో పాటుగా ఆధిపత్య ,పీడక కుల వ్యవస్థల లో ఉండే కుల కంపు వల్ల అని కూడా మార్ముకంగా చెప్తారు రచయిత.

**

గీతాంజలి రాసిన ‘రేణుకెటు పోయిందీ ఇసుక తూఫనులో?’ కథ తెలంగాణలో ఇసుక మాఫియాకి వ్యతిరేకంగా, సిరిసిల్ల నుంచి సింగపూర్ దాకా రవాణా అవుతున్న ఇసుక లారీల కిందపడి చనిపోతున్న నేరెళ్ల గ్రామం యువత చేసిన ఉదృతమైన ఉద్యమం గురించిన కథ. ఇసుక మాఫియా వెనక రాజ్యం ఉంటుంది మంత్రులు ఉంటారు స్థానిక సర్పంచులు ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారు పోలీసు వ్యవస్థ ఉంటుంది. అందరూ కలిసి సింగపూర్ దాకాఇసుకని రవాణా చేస్తారు. ఆ రవాణా చేసే క్రమంలో స్థానికంగా ఉండే ప్రజలు ఎదుర్కొనే సమస్యలు వాళ్ళకి పట్టవువేగంగా తిరిగే లారీల కిందపడి జనం చచ్చిపోతూ ఉంటారు. దానికి వ్యతిరేకంగా నేరెళ్ల ప్రజలు పోరాడుతూ ఉంటారు. ఈ కథలో మంత్రి కొడుకు వస్తున్న సందర్భంగా జరిగిన మీటింగ్లో డబ్బు పోయిందని ఒక ఆమె కంప్లైంట్ చేస్తే అమాయకంగా నవారు మంచాలు అమ్ముకు వద్దామని పాటలు పాడుకుంటూ ఆ సభ పక్కనుంచే వెళ్తున్నఎరుకల తెగకి చెందిన వెంకటేషంను పట్టుకొని మూతికి గుడ్డ కట్టి రెండు బైకుల మధ్యలో కూర్చోబెట్టి బైకు డబ్బులతోటి దొంగ దొరికాడు అని చెప్పేసి పేపర్లో ప్రకటన ఇప్పిస్తారు. వెంకటేశం ఎంత చెప్పినా పోలీసులు వినరు. “నేను దొంగతనం చేయలేదు. వూర్లు తిరుగుతూ మంచాలకి నవార్లు అల్లుతాను. మంచాలు అమ్ముకోవడానికి వెళ్తున్నాను, నవారు లేయడానికి వెళుతున్నాను. నేను ఎరుకలోన్ని. నేను దొంగతనం చేయలేదు. నన్ను వదిలిపెట్టండి,పెండ్లాం పిల్లలున్నోన్ని” అని కాళ్ళా వెళ్ళా పడుతూ ఏడుస్తూ బ్రతిమిలాడుతాడు. కానీ అతన్ని తీసుకొని పోలిస్ స్టేషన్ లో చేయని నేరం వోప్పుకోమని దారుణంగా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు. హత్యలు చేసిన వాడికి వేసినట్లు కాళ్ళకి, చేతులకి సంకెళ్ళు వేస్తారు. అతని మల ద్వారంలో బీరు సీసాలు ఎక్కించి కింది పేగులు కొసుకుపోయి తీవ్ర రక్తస్రావంతో పోలీస్ స్టేషన్లోనే చచ్చిపోయేటట్టు చేస్తారు. రేణుక ఎన్ని సార్లు తన భర్తని చూపియ్యమన్నా రక రకాల పోలిస్ స్టేషన్లకి తిప్పుతారు తప్పితే చూపియ్యరు. తీవ్ర రక్త స్రావంతో చనిపోయాక నీ భర్తని చూసుకో పో అని లోపలకి పంపిస్తారు. దొంగ కేసులో ఇరికించి కస్టడీ హత్య చేసిన ఎరుకల వెంకటేశం భార్య రేణుక న్యాయం కోసం చేసిన పోరాటం ఇది. చేయని దొంగతనానికి బలైన ఎరుకల వెంకటేశం న్యాయ పోరాటంలో బిడ్డను కూడా పోగొట్టుకున్న రేణుకను అడుగడుగునా పోలీసులతో తరుముతూ ఉంటుంది. ఇసుక మాఫియాలో హస్తం ఉన్న పాలకవర్గ ప్రభుత్వం. బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ని స్వాతంత్ర్యం వచ్చాక నిషేధించిన తరువాత కూడా, ఎక్కడ దొంగతనం జరిగిన ఎరుకల వాళ్ళనే ముందుగ అరెస్ట్ చేసి చేయని నేరం వోప్పుకునే దాకా చిత్రహింసల పాలు చేయడాన్ని,కస్టడి లో హత్యలు చేయడమనే క్రూరత్వాన్ని ఈ కథలో రేణుక ద్వారా చెప్పిస్తారు రచయిత్రి. రేణుక స్వయంగా తన కథ రచయిత్రికి చెబుతుంది. ఇదొక monodrama ఏక పాత్ర పద్ధతిలో సాగుతుంది.

న్యాయ పోరాటం చేసే క్రమంలో కూడు, ఇల్లు పోయి, తాను చేసుకోమన్న వాడిని పెళ్లి చేసుకోమని లేకపోతే వ్యభిచారం చేసి పోషించమని ఒత్తిడి చేసిన అత్తగారు, నిరాకరించిన రేనుకకి బుద్ధి చెప్పడానికి రేణుక బిడ్డను గుంజుకొని భిక్షాటనకు పంపిస్తుంది. ‘‘నీ వల్లనే నా కొడుకు పోయాడు’’ అంటుంది. అత్తవైపు నుంచి దుర్మార్గమైన పితృస్వామిక హింసని, ఇటు ప్రభుత్వం నుంచి రాజ్య హింసని, మరోపక్క కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకి బలైపోయిన రేణుక న్యాయ పోరాటం చేయడం మాత్రం మానదు. సంచార జీవులైన రేణుక చేట్టుకింది గుడిశె కూడా పోలీసులు పీకేస్తారు.ఆమెని ఊర్లోంచి వెళ్లిపొమ్మంటారు. రేణుక ఉనికి వాళ్ళ ఇసుక మాఫియా దోపిడీని, దాన్ని అడ్డుకుంటున్న స్థానిక ఉద్యమకారుల పోరాటాన్ని, మరీ ముఖ్యంగా చేయని నేరానికి దొంగతనం కేసులో అన్యాయంగా ఇరికించి జైల్లో హత్య చేసిన ఎరుకల తెగకి చెందిన వెంకటేశాన్ని, ఎరుకల సంఘం ఆగ్రహాన్ని గుర్తుచేస్తూ ఉంటుంది. అందుకే రేణుకని గ్రామంలో ఉండనీయకుండా నగరానికి పారిపోయేలా చేస్తారు.

అమాయకమైన ఎరుకల వెంకటేశంనే కాదు. ఎరుకల కులానికి చెందిన నేరెళ్ల ఈశ్వర్ కూడా పోలీసుల హింసకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఆ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇసుక మాఫియా కి వ్యతిరేకంగా నేరెళ్ల గ్రామంలో ఒక బి.ఎడ్ కాలేజీ మీద నుంచి పోలీసులకు అందకుండా వాళ్ల హింసను తప్పించుకోవడానికి కాలేజీ బిల్డింగ్ మీద నుంచి కింద పడి కాలు విరగోట్టుకున్న కాబోయే ఎస్ఐ దాని మూలంగా ఉద్యోగం పోగొట్టుకుని కుమిలిపోతాడు. పోలీసుల హింసలో కిడ్నీ పాడు చేసుకున్న మరొక ఎరుకల కుటుంబానికి చెందిన యువకుడు, చనిపోయిన కొంత మందిఎరుకల తెగ ప్రజలు కథ నిండా ఇలాంటి మరణాలే కనిపిస్తాయి. ఇలాంటి దుఃఖాలు కనిపిస్తాయి. నేరెళ్ల గ్రామంలో అప్పటి ఇసుక రేపిన తుఫానుకి బలైపోయిన ఎరుకల కులస్తులు ఎంతోమంది ఉన్నారు. రాజ్యం మారినా, పాలకవర్గం మారిన ఇంకా అక్కడ ఇసుక మాఫియా నడుస్తూనే ఉంది. ఈ కథనాన్ని తెలంగాణ మాండలికంలో రేణుక తోటి మాట్లాడించి ఆమె చెప్పిన వాస్తవిక స్వీయ కథని ఆమె చెప్పినట్టుగానే రాశారు రచయిత్రి. ఈ కథలో వాళ్ళ తాత్కాలిక గుడిసె కూడా పీకేస్తారు. ఆమె బిడ్డ కోసం పోరాడుతూ అత్తమామల తోటి పోరాడుతూ బుట్టలు వెదురు తడికలు నవారు మంచాలు అల్లుకుంటూ బతుకుతూ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఆమెకు స్థానిక దళిత సంఘాలు, ఎరుకల సంఘాల వాళ్ళు సహాయం చేస్తూనే ఉంటారు. కానీ ఆమెకి ఇప్పటిదాకా న్యాయం దక్కలేదు. పోలీసులు, రాజ్య హింస తప్పించుకోవడానికి ఆమె హైదరాబాదు కూడా వచ్చి ఇక్కడ ఒక ఆశ్రమంలో ఆశ్రయం పొందింది కూడా. కానీ ఇప్పటికీ రేణుక ఎటు పోయిందో, ఎవరికి తెలియదు. ఇసుక తుఫాన్ లో ఎంతో మంది ఎరుకల వాళ్ళు నేరెళ్లల్లో కొట్టుకుపోయినట్టే రేణుక కూడా ఎక్కడో కొట్టుకుపోయిందో ఏమో ?

**

నస్రీన్ ఖాన్ రాసిన ఎరుకల ఎస్.ఐ కథలో ఎరుకల కుటుంబంలో నుంచి వచ్చి కష్టపడి ఎస్సై అయ్యి, ఏ రకమైన లంచాలకి లొంగకుండా ఊర్లో నాటు సారాకి వ్యతిరేకంగా స్థానిక సర్పంచ్ ఇతర సారా వ్యాపారులకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడుతాడు ఎస్.ఐ. సారా బట్టీలు బంద్ చేయించే వ్యాపారస్తులు గుండెల్లో దడ పుట్టించిన ఎరుకల ఎస్.ఐ.ని దారుణంగా హత్య చేయిస్తారు స్థానిక సారా వ్యాపారస్తులు, సర్పంచు కలిసి. ఆ రకంగా అట్టడుగువర్గమైన ఎరుకల కులంలోంచి ఉన్నత విద్య ని అందుకొని ఉన్నతాధికారిగా ఎదిగిన నిజాయితీపరుడైన ఎస్.ఐ.ని బలి చేస్తారు. ఎరుకల కులం వాడా మిమ్మల్ని కట్టడి చేసేది అన్న దుగ్ధతో. ఈ కథని ముస్లిం సమాజ కోణం నుంచి రాస్తారు కథకురాలు నస్రీన్. ఒక ముస్లిం కుటుంబం దొంగసారా తయారీని వ్యతిరేకిస్తే, మరొక ముస్లిం కుటుంబం ఈ దొంగసారా ఇంట్లోనే తయారు చేయించి అమ్మడం చూపిస్తారు. మొత్తానికి కథలో ఎరుకల కులంలోంచి కష్టపడి చదువుకొని పైకొచ్చి ఎస్ఐ స్థాయికి చేరి అన్ని ఆధిపత్య కులాల నుంచి పీడిత కులాల వరకు దొంగ సారా వ్యాపారం చేసే వాళ్ళని గడగడలాడించి ఆఖరికి అన్యాయంగా వాళ్ళకి బలైపోయిన ఎరుకల ఎస్సై కథని చాలా ఆర్ద్రంగా రాస్తారు రచయిత్రి.
**

‘ఎదురీత’ అనే మరొక కథలో ముందే గృహహింస అనే అనుభవిస్తూ భర్త ద్వారా అత్త ద్వారా కడగండ్ల పాలవుతున్న ఒక బాలింత, పుట్టిన బిడ్డ కోసం బతుకుతున్నఒక ఎరుకల తల్లి పని మీద బయటకు వెళ్లినప్పుడు ఆమె పాలిండ్లను స్పర్శిస్తే ఒక ఎకరం భూమి ఇస్తానని పందెం కాసిన భూస్వాముల వికృతమైన మనస్తత్వాన్ని రచయిత రాస్తారు. కళ్ళల్లో ఏదో నలకబడింది ఆ పడిన నలకని బాలింత పాల తోటి నేరుగా కళ్ళల్లో చిమ్మితే కళ్ళు కాపాడినట్టు అవుతుంది పుణ్యం వస్తుంది అని చెప్పి ఆమె అమాయకత్వాన్ని వాడుకొని, దయ జాలి సంపాదించి ఆ అమాయకమైన ఎరుకల స్త్రీ రొమ్ములను స్పర్శించి, గెలిచి ఎకరం భూమి రాసి ఇవ్వాలి అని మాట్లాడుకోవడాన్ని చూసిన ఆ ఎరుకల తల్లి అవమానంతో తల్లి డిల్లిపోతుంది. ఆమెకి ఇంట్లో భర్త ద్వారా గృహ హింస తప్పదు. బయట కామందుల నుంచి కామపు వేటా తప్పదు. సమాజంలో ఏ రక్షణా లేని ఎరుకల స్త్రీల నిస్సహాయ స్థితిని తెలుపుతుంది ఈ కథ. ఇదే కథలో పని మీద బయటకి, అడవికి వెళ్ళే తమ మీద జరిగే లైంగిక దాడుల నుంచి తప్పించుకోవడానికి ఎరుకల స్త్రీలు నడుముకి కొడవలి దోపుకుని మరీ బయటకి వెళ్ళాలి అని కథలోని ఒక పాత్రతో రచయిత చెప్పిస్తారు. దీన్ని బట్టి ఎరుకల స్త్రీల జీవితాల్లో ఎంత అబధ్రత ఉందొ , పితృస్వామ్యం, కులం, అట్టడుగు వర్గం ఇవన్నీ అడుగడుగునా ఎరుకల స్త్రీల జీవితాలతో ఎలా ఆడుకుంటాయో రచయిత ప్రతిభావంతంగా రాసారు. ఈ కథని ఎరుక కథా సంకలం సంపాదకులలో ఒకరైన గుగులోతు ఫూల్ సింగ్ రాసారు.
**

ఈ సంకలనానికి ముగ్గురు ఎడిటర్లు ఉన్నారు. అందులో పల్లపు స్వాతి ఒకరు. స్వాతి రాసిన ‘అడవి మల్లె’ కథలో చదువుతో పాటు తన ఎరుకల జాతికి చెందిన సాహిత్యాన్ని అంబేద్కర్ సాహిత్యాన్ని చదువుతూ ఫస్ట్ క్లాస్లో పది పాసై డాక్టర్ తన ఎరుకల జాతి ప్రజలకి వైద్య సేవ చేయాలన్న ఆశయ సాధన తో ఉంటుంది. ఆమెని కార్పోరేట్ కాల్లెజి ఉచిత విద్య అందిస్తామని తమ కాల్లెజికి మంచి పేరు తేవాలని మంగని కోరుతుంది. కార్పొరేట్ కాలేజీలో చేరిన మంగ అకస్మాత్తుగా కార్పొరేట్ చదువులో ఒత్తిడికి అక్కడి కులవివక్ష భరించలేక ఆత్మహత్య చేసుకోవడం హృదయాన్ని కదిలించేస్తుంది. ఎంతమంది ఇలా అట్టడుగు సామాజిక వర్గాల నుంచి అతి కష్టపడి రిజర్వేషన్లు ఉపయోగించుకుంటూ పైకి వస్తున్న క్రమంలో ఆధిపత్య కులాలకు సంబంధించిన వ్యవస్థలోని మనుషులు ఎలా కులం పేరుతోటి వెంటాడి వేధించి మానసిక వేదనకు గురిచేసి ఆత్మహత్యల వైపు తరుముతారు కదా అనే పచ్చి వాస్తవాన్ని చదువుతున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నస్రీన్ రాసిన ఎరుకల ఎస్.ఐ. కథలో కూడా ఇదే జరుగుతుంది. తమ ఎరుకల బస్తీకి వైద్యానికి కూడా రాని డాక్టర్లను చూస్తూ పెరుగుతుంది మంగ. తన తల్లి చనిపోతే తల్లితో పాటు ఎంతోమంది వైద్యం అందక తల్లడిల్లుతుంటే చూసి తాను డాక్టర్ అయ్యి ఎరుకల జాతికి సేవ చేయాలన్న మంగ ఆకాంక్షను చిదిమేసింది ఈ ఆధిపత్య కుల వ్యవస్థనే కదా? అయితే కథలో మంగ మరణం వెనక కారణాలను స్పష్టంగా చెప్పకుండా పాఠకులకే వదిలేస్తారు రచయిత్రి.
**

కథకుడు నరేష్ కుమార్ సూఫి రాసిన ‘దుఃఖ దీపావళి’ మరొక ఆర్త్రమైన కథ. ఎరుకల తెగలోని పండగని కూడా చేసుకోలేని దారిద్ర్య ఫలితాన్ని అనుభవించి సర్వ నాశనం అయ్యి ఉఉరు వదిలి వెళ్ళిపోవాల్సిన స్థితిని అత్యంత సహజంగా రాసారు సూఫీ.దీపావళికి ఎరుకల కులానికి చెందని బీద కుటుంబం లోని కథా నాయకుడి దగ్గర డబ్బులు ఉండవు.బాంబులకి నాన్నని డబ్బులు అడిగితే ఆయన దగ్గరెక్కడివి?ఇనుప రాడ్లు దొంగతనం చేసే ఎరుకల స్నేహితుడు దొరుకుతాడు.ధైర్యం చెబుతాడు.ఇద్దరం కలిసి దొంగతనం చేసి దీపావళికి బాంబులు కొందామంటాడు.కానీ ఎరుకల అబ్బైకి ఉన్న ధైర్యం ఉండదు.భయంతో మధ్యలోనే పారిపోతాడు. ఎరుకల స్నేహితుడు దొంగతనం చేసి బాంబులకు డబ్బులు సంపాదించి, బాంబులు కొని ఇస్తాడు. కానీ అదే సమయంలో ఎరుకల స్నేహితుడి తండ్రి మరణంతో దీపావళి దుఃఖాన్ని ఎలా మిగిల్చిందో చెబుతాడు కథకుడు. ఆ ఎరుకల స్నేహితుడి అన్న కూడా, అంటే చనిపోయిన పెద్దమనిషి పెద్ద కొడుకు కూడా దీపావళి బాంబులకు కావలసిన డబ్బులు కోసమే తండ్రి తోటి తాగి గొడవ పడి తండ్రి తల పగలగొడతాడు. ఆ తర్వాత ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఎరుకల కుటుంబం ఊరు నుంచి మాయమైపోతుంది.

స్నేహితుడితో కలిసి దొంగతనం చేయబోయి చేయలేక పరిగెత్తి పారిపోయిన కథా నాయకుడికి ఆ ఎరుకల స్నేహితుడు అతడికి దొంగతనం చేసిన ఇనుప రాడ్లు అమ్మి సమానంగా డబ్బులు పంచి ఆ సగం డబ్బుతోటి సూఫీకి బాంబులు కొనిస్తాడు. ఎంతో ఔదార్యంతో న్యాయబద్ధంగా వ్యవహరిస్తాడు. ఆ దొంగతనంలో తన తోటి కలిసి రాకపోయినా కానీ నిజాయితీగా స్నేహ ధర్మంతో వ్యవహరించి స్నేహితుడికి బాంబులు కొనిస్తాడు. అలాంటి స్నేహితుడి తండ్రి చనిపోతే స్నేహితుడిగా చూడ్డానికి వెళ్ళకపోవడం ఆ తర్వాత జీవితంలో ఆ స్నేహితుడు ఆ ఊరు నుంచి, సమాజాన్నించి ఎక్కడికి వెళ్లిపోయాడో కూడా తెలియదు అనడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే ఒక సంబంధం అంత అనుకోకుండా ఎలా ముగుస్తుంది. దీపావళికి దుఃఖాన్ని మిగిల్చిన ఆ బాంబుల్ని అతడు కాల్చలేకపోతాడు. ఎక్కడో తవ్వి దాచిపెడతాడు, ఆ ఎరుకల స్నేహితుడి జ్ఞాపకంగా. దీపావళికి అందరిలాగా బాంబులు కాల్చాలన్న చిన్న చిన్న ఆశలు తీర్చలేని దారిద్ర్యపు దుఖాన్ని అనుభవించిన కౌమార దశలోని యువకుడి మానసిక స్థితిని, దానికోసం దొంగతనం నేర్వలేక పోవడాన్ని, దొంగతనం చేసేటప్పటి ముందరి భయవిహ్వాలమైన మానసిక స్థితిని సూఫీ చాలా చక్కగా రాసారు.
**

ఎరుక సంకలనానికి ప్రధాన సంపాదకుడైన డాక్టర్ శివరాత్రి సుధాకర్ ‘ఏటి పాట’ కథ కవితాత్మకంగా సాగిన అద్భుతమైన విషాద ప్రేమ కథ. పాటలు పాడే ఎరుకల అబ్బాయిని మొదటి పెళ్లి చెడిన ఆధిపత్య కులానికి చెందిన పద్మావతి ప్రేమిస్తుంది. వీరన్న కూడా ప్రేమిస్తాడు. వెన్నెల రాత్రుల్ళల్లో పద్మావతికి వీరన్న పాటలు పాడి వినిపిస్తుంటాడు. ఆ ప్రేమని సహించని పద్మావతి తండ్రి వీరన్న చంపిస్తాడు. పద్మావతి పిచ్చిది అవుతుంది. వీరన్న తమ్ముడు ఊరి నుంచి మాయమైపోతాడు. తర్వాత జరిగిన పీర్ల జాతరలో వీరన్న తమ్ముడు వేషం మార్చుకుని మార్చుకొని వీరోచితంగా అలవా దూల ఆటలాడుతాడు. ఆ పీర్ల పండగకి సంబంధించిన పాటలను, వీరన్న పద్మావతి కోసం పాడిన పాటలను సుధాకర్ చాలా పొయెటిక్ గ్గా రాసారు. పీర్ల పండుగకి సంబంధించిన అద్భుతమైన పండుగ అలంకారిక వాతావరణాన్ని,సాంస్స్క్రుతిక అంశాలని అద్భుతంగా, ఉద్వేగం కలిగించే విధంగా రాసారు. ఆ మరుసటి రోజే పద్మావతి తండ్రి చచ్చిపోయి ఏటి ఒడ్డున కనిపిస్తాడు. ఏళ్ల క్రితం వీరన్న హత్య తరువాత మాయమైన వీరన్న తమ్ముడేవరో, అప్పుడు మాయమై ఏమయ్యాడో, ఏ అడవిలో కలిసాడో , పద్మావతి తండ్రి ఎందుకు చనిపోయాడో కథకుడు మార్మికంగా చెప్పాడు. కులాంతర వివాహాలను, ప్రేమలని సహించని తరానికి బుద్ధి చెప్పిన కొత్తతరం కథ ఇది.
**

ఆకలేసి వలస వచ్చిన సుంకడి కుటుంబాన్ని తన పొలంలో కొంగల్ని ఉచ్చు వేసి పట్టుకోవడాన్ని ఆపిన సర్పంచ్ ఓట్ల లెక్కల్లోకి మాత్రం సుకన్య ఆయన భార్యని బలవంతంగా పేర్లు రాసి జనాభా లెక్కల్లోకి ఎక్కిస్తాడు తనకి ఓట్లు రావడం కోసం ఒకప్పుడు నీళ్ల కరువులేని ఊర్లో ఈతలు ఆకులు కోసుకొని మెదులు కర్రలు కోసుకొని ఊర్లో కరువుని ఎదురుకోలేక వలస పోతున్న ఎరుకల సుంకడి కథ ఉచ్చు. ఒకప్పుడు తన గ్రామంలో బుట్టలు తయారు చేసి పల్లెల్లో అమ్ముకుంటే వడ్లు పైసలు దొరికేవి సుంకరికి. తాటి ఆకుల గిలకలు పీకలు అమ్మిన డబ్బులు వచ్చేవి కొంతమంది డబ్బులు ఇస్తే కొంతమంది సంగటి ముద్దలు పెట్టే వాళ్ళు. ఊరులోపు ఉధృతంగా ప్రవహించే వాగులో చేపలు పట్టి, ఉచ్చువేస్తే పడే కొంగలతో హాయిగా బతికేసే వాళ్ళు సునకడితో పాటు ఇతర ఎరుకల కులస్తులు వలసొచ్చిన వూర్లోకి వచ్చిన సుంకరి కుటుంబానికి పెద్దరెడ్డి చేనులో వాలిన కొంగలనిచూసి ఆకలి,ఆశా రెండూ వేసి ఉచ్చు వేయబోతుంటే ప్ద్ధరేద్ది తరిమి వేస్తాడు. రాయలసీమలో నీళ్ల డ్యాములను నిండిపోయి నీళ్లన్నీ సముద్రంలో విడిస్తే ఊర్లో నీటి కరువు బావులు ఎండిపోవడంతో నిండా కరువులో మునిగిపోతుంది ఊరు. కానీ పెద్ద మనుషులు పొలాల్లో పారే నీళ్ళని ట్యాంకర్లకు నీటి వ్యాపారస్తులకి అమ్ముకుంటూ వూర్లో తోటలు బావులు ఎండ కొడతారు.బోర్లు కూడా ఎండిపోతాయి. అన్నంతో పాటు నీళ్లని అడుక్కునే దారుణమైన మనిషి సృష్టించిన కరువును చెప్పిన కథ ఇది. తన పొలంలో కొంగలు పట్టటానికి పనికి రాణి సుంకడికుటుంబం మాత్రం తన వోట్ల కోసం వూరి పంచాయితీ లెక్కల లోకి ఎక్కిస్తాడు. అదీ ఒక ఉచ్చుగా చెబుతారు రచయిత. ఉచ్చు అనే అనే ఈ కథను కడప జిల్లాకి చెందినా తవ్వా ఓబుల్ రెడ్డి రాశారు.
**

అడవిలో దొంగతనంగా దాక్కొని భయంతో తుపాకీతో సింహాన్ని జింకలను చంపడానికి వచ్చే దొరలు, రాజులు మిలటరీ వాళ్ళు కంటే సింహాలను మించిన శారీరిక ధైర్యం ఉన్న అడవి పందుల్ని ధైర్యంగా వేటాడి వెంటాడి వాటి గోళ్ళతో దెబ్బలు, రక్కులు తిని ప్రాణాలకు తెగించి పట్టుకొని చంపి కూరను పది మందికీ పంచె, కూరను అమ్ముకొని తినే ఎరుకల అడవి పందుల వేటకి మధ్య ఉన్న తారతమ్యాన్ని చాలా గొప్పగా ‘అడవిపందుల్ని కొట్టే మొనగాళ్లు’ కథలో చెప్తారు తిరుపతికి చెందిన రచయిత విజయకుమార్ సంక్రాంతి. రాజుల వేట ఆకలిని తీర్చదు. మాంసం ఉత్పత్తి తో, మనుషుల ఆకలి తీర్చడంతో సంబంధం లేకుండా కేవలం దర్పాన్ని చూపించడం తప్పిస్తే అదే ఎరుకల వేట ఆకలిని తీరుస్తుంది అనే రెండు వేటల మధ్య తారతమ్యాన్ని చాలా చక్కగా చూపించారు. అలాగే భీకరంగా సాగిన అడవి పందుల వేటని చాలా ఆశక్తికరంగా చిత్రించారు. వేటతోపాటు,పాటకుడు కూడా అంతే వేగంగా వేటగాళ్ళ వెనకా, పారిపోయే అడవి పందుల వెనుక పరుగెడతారు. ఎరుకలు చేసే ఈ అడవి పందుల వేటని ఎరుకల కులపు చిన్న పనిగా కాకుండా సాహసోపేతమైన, వీరోచితమైన పనిగా చిత్రీకరిస్తారు రచయిత.
**

‘పచ్చ కళ్ళ కుందేళ్ల’ కథని లిఖిత్ కుమార్ గోదా రాసారు. అడవి పంది మాంసం ఉడుము మాంసం ఉడత మాంసం, కౌజు పిట్ట మాంసం దాదాపుగా గ్రామ ప్రజల్లో అందరూ తింటారు. అన్ని కులాల్లో తింటారు. ఆ తినడంలో రహస్యం ఉంది. చాటు, మాటు ఉంది. కుట్ర ఉంది. అది ఆధిపత్య కులం వాళ్లలో ఉంటుంది. మళ్ళీ ఎరుకలతో సాంస్కృతికంగా, సామాజికంగా ఈ ఆధిపత్య కులం వాళ్ళు కలవరు. వాళ్ళు వేటాడి తెచ్చిన ఉడుం, మాంసము, అడవి పంది మాంసము కౌజు పిట్టల మాంసము అన్ని వాళ్ళూ తింటారు. ఇళ్లల్లో తినకుండా తోటల్లో పొలాల్లో దొంగతనంగా తెప్పించుకొని తింటూ ఉంటారు. కానీ ఎరుకల వాళ్ళతోటి కలవడానికి నామోషీ. కులాహంకారం అడ్డు వస్తుంది. ఎరుకల ఆహారపు అలవాట్ల ఎరుకలతో స్నేహం మంచిది కాదని కథానాయకుడిని తల్లి హెచ్చరిస్తుంది. కొడుకు ఆశ్చర్యపోతాడు. ఏది మంచి? ఏది చెడు? కులాన్ని బట్టి తినే ఆహారాన్ని బట్టి అయితే ఉడుము మాంసం తినని వాళ్ళు మాత్రమే మంచి వాళ్ళా? ఉడుము మాంసం తినే వాళ్ళు చెడ్డ వాళ్ళు ఎట్లా అవుతారు? దొంగతనంగా ఉడుము మాంసం తిని, తాగి వూరి మీద పెత్తనాలు చేసే పెత్తందారీ కులాల వాళ్ళు మంచోళ్ళు ఎలా అవుతారు? వోళ్ళేరగకుండా తాగి కన్నతండ్రి తల పగలగొట్టే పై కులాల వాళ్ళు మంచి వాళ్ళు ఎలా అవుతారు ? తినే తిండి మనిషి మంచి చెడ్డలని ఎలా నిర్ణయిస్తాయి? ఆరోగ్యానికి మంచిదని తల్లి చేత ఉడుం కూర వండించుకుని తింటున్న తండ్రిని చూసి ఆశ్చర్య పోతాడు. అమ్మ బయటకు వెళ్ళాక తానూ ఉడుము కూర తింటాడు. ఉడుము మాంసం తినే ఎరుకల స్నేహితుల ఇళ్ళల్లో తిరిగినా,స్నేహం చేసినా వాళ్ళూ, తానూ ఏమీ తిక్క పనులు చేయట్లేడు కదా? అయినా అమ్మ ఎందుకు తను వాళ్ళ ఇళ్ళకి వెళ్లడాన్ని ఆపుతుందో అర్థం కాదు. ఆహారం కారణం కాదు. కులమని మెల్లిగా అర్థం అవుతుంది. ఎరుకలు ఉడుములు పట్టుకోడం, వెదురు పనులు చేయకూడదు కానీ, మామ్మైతే తాల్లల్లో, కల్లు, సారాయి అమ్ముకోవచ్చు. ఇదెక్కడి నీతి? అని తల్లిని విసుక్కుంటాడు కొడుకు. తాటి కల్లమ్మే బీసీ లకంటే, ఎరుకల వృత్తి నీచమైందిగా చూసే తల్లి మీద కోపం వస్తుంది. ఇలాంటి మౌలికమైన ప్రశ్నలు వేధిస్తాయి కొడుకుని.
**

ఎరుక కథా సంకలనాలలో తలమానికం లాంటి కథలు సీనియర్ రచయిత పలమనేరు బాలాజీ గారి కథలు. తన బంధువులు తన స్వంత అనుభవాలను కథలుగా రాశారు. ‘ఆమె ఒక మదర్ థెరీససా’ ఎంతో అందమైన కథ. రాత్రి లేదు, పగలు లేదు, తనకు ఉందా లేదా లేదు సాయం అడిగారా లేదా చూడదు, తానే వెళ్లిపోయి అందరికీ సాయం చేసేస్తుంది. ఇల్లు వాకిలి వదిలిపెట్టి వెళ్ళిపోయి, భర్త కష్టపడి కొన్న ముక్కుపుల్ల, చెవికమ్మలు లాంటి సొమ్ములు కూడా దానం చేసి కుదువ పెట్టి ఎరుకల కుటుంబ బంధువుల్ని ఆడుకుంటుంది. డబ్బులు సమకూర్చి తమ్ముడి ఇంటి పండగ కార్యం కానివ్వమని చెబుతుంది. అలాంటి జయమ్మను భర్త ఎంతో గౌరవంగా చూసుకుంటాడు. ఆమెను మదర్ దేరిసా అని పోలుస్తూ మురిసిపోతూ ఉంటాడు. ఎరుకల కుటుంబాల్లో ప్రేమానుబంధాలు మమకారాలు బాధ్యతలు చెప్పే కథ ఇది. జయమ్మ ఎవరో కాదు, బాలాజీ గారి తల్లి గారే. ఆమె పాత్రని మలిచిన తీరు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ కథలో జయమ్మకి జయమ్మ భర్తకి మధ్య జరిగే ఒక మౌన సంభాషణ అద్భుతమైన ప్రేమ కథలాగా అనిపిస్తుంది. ఆమె అంతరంగంలో ఏముందో ఒక్క కంటిచూపుతో కనిపెట్టేసే భర్త, భర్త తనని అర్థం చేసుకొని తిట్టడనే నమ్మకం, ఒక సాధికారమైన ఆత్మవిశ్వాసం ఆమెలో ఒకటేసారి ప్రతిఫలించడం,ఇద్దరిలో ఒక యుగళ సంగీతంలా సాగడం, ఇద్దరూ గొడవలు పడ్డా భావజాలపరంగా ఒక్కరిగా కనిపించడం పిల్లలకి భార్య చేసే మంచి పనులకు భర్త మౌనంగా మద్దతు చెబుతూ మనసులోనే మురిసిపోవడం లాంటి సంఘటనలు, హావభావాలు కథలో అంతర్లీనంగా ఉంటూ కథని చాలా సౌందర్యాత్మకంగా తీర్చిదిద్దింది. చాలా సామాన్యమైన కుటుంబం అయినా గాని ఉన్నంతలో సాటి మనిషికి సాయం చేసే జయమ్మలాంటి మానవతా మూర్తిని కథలో అద్భుతంగా తీర్చిదిద్దారు బాలాజీ.

‘11 నెలల జీతగాడు’ కథలో అటవీ వనరులైన కట్టెలు లాంటిలంచాలకి లొంగిపోని ఫారెస్ట్ గార్డుగా పనిచేసిన తన తండ్రి నిజాయితీ గురించి రాస్తారు బాలాజీ. 12 నెలల జీతంలో ఒక నెల జీతం తను పట్టుకోలేని అక్రమ కేసులకి ఫైన్ గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి కట్టాలి, వాళ్ళ దగ్గర వసూలు చేసి. కానీ చేయలేక తన 12వ నెల జీతం సర్కార్ కి కట్టేస్తాడు. ఆ నెల జీతం ఇంటికి రాదు. ఇంటిలోని సమస్తమైన అవసరాలని భార్యని చూసుకోమని చెప్తాడు. ‘‘ఈనెల నువ్వే చూసుకోవాల సంసారం’’ అంటాడు భార్యతో. మీ నాయన 11 నెలల జీతగాడు అమ్మ అని మురిసిపోతూ చెప్పుకుంటుంది. 12 డవ నేలని కుటుంబాన్ని ఆదుకునే జయమ్మ.

‘అమర జీవి కాంతమ్మత్త’ ఔదార్యాన్ని ఆమెలోని ఆత్మవిశ్వాసాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తారు బాలాజీ. తన కాంతం అత్త చనిపోతే కుప్పల కొద్దీ పూలతో మూడు నాలుగు ట్రాక్టర్లతో జనం ఆమె కోసం కదల బారడం, ఒక ఎరుకలామె చనిపోతే ఇతర కులాల వాళ్ళు కూడా ఆమె అంత్యక్రియల్లో పాల్గొని దుఃఖించడం సాధారణంగా ఎక్కడా జరగదు. కాంతమ్మత బతికినంత కాలం తన మంచితనంతో ప్రజల్ని బంధువుల్ని ఆదుకోవడమే కారణం. చనిపోయాక కూడా ఆమెకు అంత మంచి పేరు తెచ్చింది. మంచిని పంచిన ఆమె తన కుటుంబంలో తన చుట్టూ సమాజంలో మంచిని పెంచి పోయింది. జయమ్మ లాగా గొప్ప సౌజన్య మూర్తి అయిన కాంతమ్మత్త కూడా తన మానవీయ పరిమళాలని తన చుట్టూ ఉండే సమూహంలోకి మనుషుల్లోకి విస్తరించి మనిషిగా అమరజీవి అవుతుంది. ఒకపక్క ఎరుకల జీవితాల్లోని ధైర్యాన్ని దోపిడీ, పీడనలను ఎత్తి చూపిస్తూనే ఎరుకల వాళ్ళ ఆత్మ గౌరవాన్ని వ్యక్తీకరించే మాటలు కూడా కాంతమ్మతో పలికిస్తారు బాలాజీ. ధైర్యంగా పంచాయతీల్లో మాట్లాడలేని తన ఎరుకల కులం వాళ్లకి కాంతమ్మత్తే గొంతు, ధైర్యం కూడా. ‘‘నమ్మినోళ్ళకి ప్రాణమైనా ఇస్తారు కానీ ఎరుకలు ఎవరిని నమ్మకద్రోహం చేయరు’’ అంటూ ఎరుకలోళ్ళ స్వాభిమానాన్ని, వాళ్లు పాటించే విలువలని గర్వంగా చెబుతుంది కాంతమ్మత్త. అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏంటంటే, స్త్రీల సాధికారత గురించి కాంతం అత్త ఎరుకల స్త్రీలకి గొప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఇస్తుంది. ఇళ్ళల్లో ఖాళీగా కూర్చొనే ఆడవాళ్లంటే కాంతమ్మత్తకు చిరాకు.

‘‘ఆడది ఊరికే బోకులు తోముతా, గుడ్డల్ని ఉతకతా ఇంట్లోనే ఉంటాననే కాలం కాదు ఇది. ఆడది కూడా ఏదో పని చెయ్యాల. కోళ్లు, పందులు, ఆవులు, మేకలు, మేపుతారో. గంపలు బుట్టలు అల్లుతారో, కూలీ చేస్తారో ఏం చేస్తారో అది మీ ఇష్టం. మీ కష్టానికో విలువ ఉండాలా మీ సంపాదన కో లెక్క ఉండల్లా అంతే” అంటూ స్త్రీలు ఉత్పత్తి సంబంధాలలో పాల్గొనాల్సిన అవసరం గురించి, స్త్రీల ఆర్థిక స్వావలంబన, సాధికారత గురించి తన అనుభవాల్లోంచే చెబుతుంది. స్వయంగా కొట్టు పెట్టుకుని తన సంపాదన మీద గర్వంగా బతికే కాంతమత్త. ఎందరినో ఆదుకునే కాంతమ్మత్త దీపాల వేళ అందరూ ఆ ఎస్టీ కాలనీలో దండం పెట్టుకునే దేవత ఎలా అయిందో ‘అమరజీవి మాకాంతమ్మత్త’ కథలో అపురూపంగా రాశారు బాలాజీ.

మొత్తానికి ఎరుక కథా సంకలనంలో కథలు చదివాక మనిషన్నవారికి ఎవరికైనా సరే ఎరుకలవాళ్ళ మీదనే కాదు, సమస్త ఆదిమ సంచార తెగల మనుషుల మీద చిన్నచూపు పోవాలి. నాగరిక సమాజం, మనుషులు అనుకుంటున్న వాళ్ళ ముందు ఎరుకల కులపు బాధలు, కష్టాలు, పోరాటాలు వెల్ల బోసుకున్న ఈ కథల లోని పాత్రలని అర్థం చేసుకోవాలి, చేయూత నివ్వాలి. వారికి ఎరుక తెలుసు! వాళ్ళ పట్ల మన ఎరుక ఏంటో, ఇకముందు రచయతలుగా ఏ ఎరుకతో, కనీసం వాళ్ళిచ్చిన జ్ఞానంతో నైనా మనం మసలుకోవాలి. వీలైనంత ఎక్కువగా సబాల్తర్న్ సాహిత్యాన్ని వివిధ సాహిత్య రూపాల్లో సృష్టించి వారి సంఘర్షణకి తోడుగా నిలవాలి. ఎరుకల జీవితాల్లోని కటిక చీకట్లను లోకానికి చూపించాలి. ముఖ్యంగా పలమనేరు బాలాజీ గారిలాగా యునివర్సిటీలలో పీజీలు, పీహెచ్ డీలు చేస్తున్న పరిశోధక విద్యార్థుల నుంచి, ఎరుకల సామాజిక వర్గంలోని విద్యావంతుల నుంచి, ఎరుకల సామాజిక వర్గానికి చెందని ఇతర సమస్త కులాల రచయతల నుంచి, ఎరుకల సాహిత్యం విస్తృతంగా రావాలి. ఈ ‘ఎరుక’ కథా సంకలనం, సంపాదకులు, ప్రచురణ కర్తలు ఆ బాధ్యతను నిర్వహిస్తారని ఆశిస్తూ, మరిన్ని సంచార తెగల సాహిత్యాన్ని తేవాలని కోరుకుంటున్నాను.

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 1. ఆమె అడవిని జయించింది, 2. పాదముద్రలు, 3. లక్ష్మి (నవలిక), 4. బచ్ఛేదాని (కథలు), 5. ప‌హెచాన్‌ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 6. పాలమూరు వలస బతుకు చిత్రాలు (కథా సంకలనం), 7. హస్బెండ్ స్టిచ్ (స్త్రీల విషాద లైంగిక గాథలు), 8. అరణ్య స్వప్నం (కవిత్వం), 9. ఇల్లొక రాజకీయం (రాజకీయ కవిత్వం).

Leave a Reply